1. దేవుని సంకల్పముచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, మన సోదరుడగు తిమోతి, కొరింతులోని దైవసంఘమునకును, అకాయియలోని దేవుని పవిత్ర ప్రజలందరికిని వ్రాయునది:
2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము కలుగునుగాక!
3. మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు స్తుతులను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి. ఆ దేవునినుండియే ఆదరణ సర్వదా మనకు లభించును.
4. మన కష్టములన్నిటిలో ఆయనయే మనలను ఆదుకొనును. అప్పుడు దేవునినుండి మనకు లభించిన ఆదరణతో పలురకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము.
5. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచు కొనిన విధముననే క్రీస్తు ద్వారా మనము ఆయన ఒనర్చు గొప్ప ఆదరణములో భాగము పంచుకొనగలము.
6. మేము కష్టపడుట మీకు ఆదరణను, రక్షణను కలిగించుట కొరకే. ఆదరణ లభించినచో, అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించు కష్టములనే మీరును ఓపికతో భరించుటకు శక్తి ఒసగబడినది.
7. మీరు మా కష్టములలో పాల్గొనినట్లే, మాకు లభించు ఆదరణలో కూడ మీరు పాల్గొందురని మాకు తెలియును. కనుకనే మీయందలి మా నమ్మకము ఎన్నటికిని చలింపదు.
8. సోదరులారా! ఆసియా మండలములో మాకు ఎదురైన కష్టమునుగూర్చి మీకు ఎరిగింపకుండుట మాకు ఇష్టము లేదు. మేము మా శక్తికి మించిన కష్టములకు గురియైతిమి. అందుచేత మేము జీవితముపై ఆశ వదలుకొంటిమి.
9. మాపై మరణశిక్ష విధింపబడినట్లుగ భావించితిమి. మేము మాపై ఆధారపడివుండక, మృతులనుగూడ పునరుత్థాన మొనరించు దేవునిపైన ఆధారపడివుండుటకే అది జరిగినది.
10. మృత్యుసంబంధమైన భయంకర ప్రమాదములెన్నింటినుండియో ఆయన మమ్ము కాపాడెను. ఇక ముందును కాపాడును. ఆయన తిరిగి మమ్ము కాపాడునని మా నమ్మకమును ఆయన యందు నిలుపుకొంటిమి.
11. మా కొరకై మీరును ప్రార్థనను సలిపి సాయపడుచున్నారు గదా! మాకొరకై చేయబడుచున్న పెక్కు ప్రార్థనలు ఫలవంతములగును. దేవుడు మమ్ము దీవించును. మా కొరకై పెక్కుమంది గొంతులెత్తి ఆయనకు కృతజ్ఞతలు అర్పింతురు.
12. మేము ఈ లోకమున విశేషముగా మీ యెడల లౌకికజ్ఞానముతో ప్రవర్తింపక దేవుని దయా నుగ్రహము వలన నిష్కపటహృదయముతో వర్తించితిమని మా అంతఃకరణము దృఢముగా చెప్పుచున్నది. ఇది మాకు గర్వింపదగిన విషయము.
13. ఏలయన, మీరు చదివి అర్థము చేసికొనగలిగినంత మాత్రమే మీకు వ్రాయుదుము.
14. ఇప్పుడు మీరు పాక్షికముగ మాత్రమే అర్థము చేసికొనగల విషయమును ముందు కాలమున సంపూర్ణముగ గ్రహింపగలరని నేను ఆశించుచున్నాను. అప్పుడు యేసుప్రభువు దినమున మమ్ము చూచి మీరు ఎంతగా గర్వింతురో, మిమ్ము చూచి మేమును అంతగానే గర్వింతుము.
15. దీనిని గూర్చి నాకు దృఢనిశ్చయము ఉండుటచే, మీకు రెట్టింపు ఆనందమును కలుగ చేయుటకొరకై నేను మిమ్ము చూచుటకు రావలెనని మొదట అనుకొంటిని.
16. ఏలయన, మాసిడోనియాకు నేను వెళ్ళునప్పుడును, తిరిగి వచ్చునప్పుడును, మిమ్ము చూడవలెనని అనుకొంటిని. నా యూదయా ప్రయాణమునకు మీనుండి సాయము పొందనెంచితిని.
17. ఇట్లు ఆలోచించుటలో నేను చపల చిత్తుడనని మీకు అనిపించుచున్నదా? నేను స్వార్ధ పరుడనై ఆలోచించువాడనా? అవును అవునని చెప్పుచూ, కాదు కాదని చెప్పువాడనా?
18. దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనునట్లుగ ఉండలేదు.
19. ఏలయన సిలాసు ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాడు. కాని ఎల్లపుడు అవుననువాడే.
20. ఏలయన, దేవుని వాగ్దానములన్నిటికి ఆయనయే “అవును” అను సమాధానము. ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసు క్రీస్తు ద్వారా మనము మన “ఆమెన్” పలుకుదుము.
21. మన క్రీస్తునందలి జీవితమును, మీతో కూడ నిశ్చయమొనర్చువాడు దేవుడేకదా! మమ్ము ప్రత్యేకముగ ఉంచినదియు దేవుడే కదా!
22. ఆయనయే తనముద్రను మనపై వేసి మనలను తన వారిగ ప్రకటించెను. ఆయన మనకొనర్చిన వానిని ధ్రువపర్చుటకై మన హృదయములందలి పవిత్రాత్మను అనుగ్రహించెను.
23. దేవుని నా సాక్షిగ పిలిచెదను; ఆయనకు నా హృదయము విదితమేకదా! మిమ్ము బాధ పెట్టుటకు ఇష్టములేకయే నేను కొరింతుకు రాకుండుటకు నిర్ణయించుకొంటిని.
24. మీ విశ్వాసము దృఢమైనదే. కనుక మీరు ఫలానిది విశ్వసింపవలెనని మేము ఆజ్ఞా పించుటలేదు. పైగా మేము మీ సంతోషము కొరకే మీతో సహకరించుచున్నాము.
1. కనుక, మీకు విచారము కలిగించుటకు మరల మీ వద్దకు రాకూడదని నేను నిశ్చయము చేసికొంటిని.
2. ఏలయన, నేను మీకు విచారము కలిగించినచో, ఇక నన్ను సంతోషపెట్టుటకు మిగులునది యెవరు? నేను విచారమున ముంచిన వ్యక్తులే గదా!
3. కనుకనే మీకు ఆ ఉత్తరమును వ్రాసిన పిదప మీ వద్దకు వచ్చు ఉద్దేశమును విడిచితిని. నన్ను సంతోషపెట్టవలసిన వ్యక్తులే నన్ను విచారమున ముంచుట నాకు ఇష్టము లేదు. ఏలయన, నా ఆనందమేమీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకమున్నది.
4. ఎంతయో బాధపడి దుఃఖపూరితమగు హృదయముతోను, కన్నీటితోను, మీకు జాబు వ్రాసితిని. నేను వ్రాసినది మిమ్ము విచారపడునట్లు చేయుటకు కాదు. కాని, నేను మిమ్ము ఎంతగ ప్రేమించుచున్నానో అని మీరు గుర్తించుటకు మాత్రమే.
5. ఎవరైనను కొందరిని విచారగ్రస్తులను చేసినచో అతడు అటుల చేసినది నాకు కాదు, కొంత మట్టుకు మీకందరకు. నేను విశేషభారము వాని మీద మోపగోరక నా మాట చెప్పుచున్నాను.
6. మీలో చాల మందిచే ఆ వ్యక్తి ఈ విధముగ శిక్షింపబడుట చాలును.
7. కాని, ఇప్పుడు అట్టివ్యక్తి ఎక్కువగ దుఃఖింప కుండుటకై అతనిని క్షమించి ఓదార్చవలెను.
8. మీరు అతనితో మరల ప్రేమపూర్వకముగ వ్యవహరింపుడని నా మనవి.
9. మిమ్ము పరీక్షించి మీరు అన్నిటను విధేయత చూపుదురో లేదో తెలిసికొనుటకే నేను అటుల వ్రాసితిని.
10. మీరు క్షమించువానిని నేనును క్షమింతును. నేను ఏ దోషమునైనను క్షమించియున్నచో మీ కొరకే క్రీస్తు సమక్షమున అటుల చేసితిని.
11. అదియును సైతాను మనపై ఆధిక్యమును సంపాదింప కుండుటకే. సైతాను ప్రణాళికలు గూర్చి మనము అజ్ఞానులము కాదు కదా!
12. క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటకు నేను త్రోయను చేరినపుడు, ప్రభువు నా పనికి అప్పటికే అచ్చట మార్గము ఏర్పరచి ఉంచెనని కనుగొంటిని.
13. కాని, మన సోదరుడగు తీతును నేను అచ్చట కనుగొనకపోవుటచే చాల విచారించితిని. కనుక అచటి ప్రజలకు వీడ్కోలు పలికి మాసిడోనియాకు వెళ్ళితిని.
14. దేవునకు కృతజ్ఞతలు. ఏలయన, ఆయన మా ద్వారా ప్రతిస్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను వ్యాపింపజేయుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సాహముతో ముందుకు నడుపుచున్నాడు.
15. ఏలయన మేము, రక్షింపబడు వారికిని, నాశనమొందు వారికిని దేవునికర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము.
16. భ్రష్టులకు అది మృత్యుకారకమగు దుర్వాసన, రక్షింపబడువారికి అది జీవదాయకమగు సువాసన. కనుక, అట్టి కార్యమునకు సమర్థుడు ఎవడు?
17. మేము దేవుని సందేశమును అల్పవస్తువులతో సమానముగనెంచు అనేకుల వంటివారముకాదు. కాని, దేవుడు మమ్ము పంపియుండుటచే క్రీస్తు సేవకులుగ ఆయన సమక్షమున మేము హృదయపూర్వకముగ మాటలాడెదము.
1. ఇదియు ఆత్మస్తుతివలెనే మీకు గోచరించు చున్నదా? ఇతరులవలె మేమును, మీకుగాని, మీ నుండిగాని పరిచయ పత్రములను సంపాదింపవలెనా?
2. మీరే మా హృదయములపై వ్రాయబడి అందరును తెలిసికొనదగినదియు, చదువదగినదియు అగు మా పరిచయ పత్రము.
3. క్రీస్తే ఈ పరిచయ పత్రమును వ్రాసి మా ద్వారా పంపెననుట సుస్పష్టము. అది రాతిపలకపై సిరాతో వ్రాయబడలేదు. అది మానవ హృదయములపై సజీవుడగు దేవునిఆత్మతో వ్రాయ బడినది.
4. క్రీస్తు ద్వారా దేవునిపై మాకున్న విశ్వాసము ఇట్టిది. కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము.
5. మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియు మాయందు లేదు. మా సామర్థ్యము దైవ దత్తమే.
6. వ్రాతపూర్వకమగు నియమములను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు ఒసగినది ఆయనయే. వ్రాతపూర్వకమగు నియమములు మృత్యుకారకములు. ఆత్మ జీవప్రదాత.
7. ధర్మశాస్త్రము రాతిపలకలపై చెక్కబడినది. అది అనుగ్రహింపబడిననాడు దేవుని మహిమ గోచరించినది. అది క్రమముగా క్షీణించినను, మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతిమంతమైనదగుట వలన యిస్రాయేలు ప్రజలు తమ నేత్రములను దానిపై నిలుపజాలకపోయిరి. మృత్యు కారకమైన ధర్మశాస్త్రమే అంత వైభవముతో అనుగ్రహింప బడినచో,
8. ఆత్మసంబంధమైన పరిచర్య మరెంత మహిమ కలిగియుండునో!
9. మానవులను శిక్షించిన సేవయే అంత మహిమ కలదైనచో మానవులను నీతిమంతులనుగ చేయుసేవ మరెంత అధిక మహిమ కలదైయుండును?
10. ఇప్పటి వైభవము, గతమున ఉన్నమహిమను అధిగమించినదని చెప్పగలము.
11. ఏలయన, కొలదికాలము మాత్రమే నిలిచిన దాని యందే మహిమ ఉన్నచో, సర్వదా నిలిచియుండు దాని యందు ఎంత అధికమైన మహిమ ఉండవలెను?
12. మాకు ఇట్టి నమ్మకము ఉన్నది కనుకనే మేము ఇంత ధైర్యముతో ఉన్నాము.
13. తన ముఖమునందలి తేజస్సు క్షీణించిపోవుటను యిస్రాయేలు ప్రజలు గమనింపకుండ మోషేవలె ముఖమును ముసుగుతో కప్పుకొనవలసిన అవసరము మాకు లేదు.
14. నిజమునకు వారి మనసులు కఠినములైనవి. పాతనిబంధనము పఠించునపుడు ఈనాటికిని వారి మనసులు ఆ ముసుగుతోనే కప్పబడి ఉన్నవి. ఏ వ్యక్తియైనను క్రీస్తుతో ఐక్యమును పొందినపుడు మాత్రమే ఆ ముసుగు తొలగింపబడును.
15. ఈనాడు కూడ వారు మోషే ధర్మశాస్త్రమును పరించునపుడు, ఆ ముసుగు వారి మనసులను కప్పి వేయును.
16. కాని ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరుగగనే ముసుగు తొలగింపబడును.
17. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఆ ప్రభువు ఆత్మ ఎచ్చట ఉండునో అచట స్వాతంత్ర్యము ఉండును.
18. కనుక మనము అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమనే ప్రతిబింబించుచు న్నాము. అ మహిమయే ఆత్మయగు ప్రభువునుండి ప్రసరించుచు, అధికమగు మహిమతో, మనము అయనను పోలియుండునట్లు మార్చివేయును.
1.తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను. కనుకనే మేము అధైర్యపడము.
2. రహస్యములును సిగ్గుపడదగిన పనులను విసర్జించి తిమి. మోసముతో ప్రవర్తింపము. దేవుని వాక్కును అసత్యము చేయము. దేవుని దృష్టిలో మేము సత్య మార్గమున జీవించుటను ఎవడైనను పరిశీలింప వచ్చును.
3. ఒకవేళ, మేము బోధించు సువార్త ఎవరికైన కనుమరుగైనచో నశించువారికి మాత్రమే అది కనుమరుగైనది.
4. దేవుని స్వరూపియైవున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ లోకసంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డి తనము కలుగజేసెను.
5.ఏలయన, మేముబోధించునది మమ్ము గూర్చి కాదు. యేసుక్రీస్తు ప్రభువు అనియు, ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము.
6. “చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక!” అని పలికిన ఆ దేవుడే, మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవమహిమ యొక్క జ్ఞానమను వెలుతురును కలి గించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపజేసెను. .
7. కాని ఈ ఆధ్యాత్మిక సంపదగల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టిపాత్రలవంటి వారమే. ఏలయన, ఈ మహత్తరశక్తి దేవునిదేకాని మాదికాదు.
8. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము. కాని, అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు.
9. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను, తీవ్రమగు గాయ ములు తగిలినను మేము నశింపలేదు.
10.యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము.
11. మా జీవితకాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడును ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరములయందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది.
12. మృత్యువు మాయందును, జీవము మీయందును కార్యసాధకమగుచున్నదని దాని అర్ధము.
13. “నేను విశ్వసించితిని కనుక మాట్లాడితిని” అని వ్రాసినవానియందున్న విశ్వాసపుటాత్మ మాయందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము.
14. యేసు ప్రభువును మృతులలోనుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి, మీతోసహా ఒక చోట చేర్చి, ఆయన సమక్షమునకు తీసికొనిపోగలడని మాకు తెలియును.
15. ఇది అంతయును మీ కొరకే. దైవసందేశము వ్యాపించిన కొలది, ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు.
16. ఇందువలననే మేము ఎన్నడును నిరుత్సాహపడము. మేము భౌతికముగ క్షీణించుచున్నను ఆధ్యాత్మి కముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము.
17. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము, ఆ కష్టమునకంటె ఎంతయో అధికమైన నిత్యమహిమను మాకు సమకూర్చును.
18. గోచరములగు విషయములపై కాక, అగోచరములగు విషయములపై మాశ్రద్ధను కేంద్రీకరింతుము. గోచర ములు కొలదికాలము మాత్రమే ఉండును. అగోచరములు శాశ్వతములు.
1. మనము భూమిమీద జీవించు ఈ గుడారము, అనగా మన భౌతికదేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు వరలోకమున ఒక గృహమును ఒసగును. అది చేతులతో చేసినది కాదు. అది ఆయనచే నిర్మింపబడినదే. పైగా నిత్యమైనదని మన మెరుగుదుము.
2. ఆ దివ్యగృహమునకై మనము నిరీక్షించుచు నిట్టూర్చుచున్నాము.
3. ఏలయన, దానిని, ధరించుటచే మనము దిగంబరులముగా కనపడము.
4. ఈ భౌతిక గుడారమున నివసించినంత కాలము, ఒక విధమైన భారముచే దుఃఖముతో నిట్టూర్చుచున్నాము. భౌతికశరీరమును విడిచి వేయ వలెనని మన కోరిక కాదు. కాని మర్త్యమైనది జీవ ముచే మ్రింగబడునట్లు దివ్యశరీరమును ధరింప వలెనని మన అభిలాష.
5. ఈ మార్పునకు మనలను సిద్ధమొనర్చినది దేవుడే. ఆయన మనకై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగ ఒసగెను.
6. కనుకనే మనము ఎల్లప్పుడును సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంతకాలమును, ప్రభువునకు మనము దూరముగ ఉన్నాము.
7. ఏలయన, మనము దృష్టివలనగాక, విశ్వాసమువలన నడుచుకొనుచున్నాము.
8. కనుకనే మనము సంపూర్ణధైర్యముతో ఉండి ఈ భౌతికశరీర మును త్యజించి ప్రభుసన్నిధిని చేరుటయే మేలని తలంతుము.
9. అన్నిటికంటె అధికముగ, మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను, ఆయనను సంతోష పెట్టవలయుననియే వాంఛింతుము.
10. ఏలయన, మనము అందరమును న్యాయవిచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెనుగదా! అప్పుడు వారివారి అర్హతలను బట్టి, మంచివిగాని, చెడ్డవిగాని, భౌతిక శరీరమున వారువారు ఒనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును.
11. ప్రభువును గూర్చి భయపడుట అననేమియో మాకు తెలియును. కనుకనే మానవులను ఒప్పించుటకు ప్రయత్నింతుము. మమ్ము గూర్చి దేవునకు సమస్తము విదితమే. మీరు కూడ మీ హృదయములలో నన్ను గూర్చి సంపూర్ణముగ ఎరిగియున్నారని నమ్ముచున్నాను.
12. మేము మరల మమ్ము గూర్చి మీకు గొప్పగా చెప్పుకొనుచున్నాము అనుకొనకుడు. కాని మమ్ము గూర్చి మీరు గర్వింప దగిన ఒక కారణమును మాత్రము చూపుచున్నాము. ఏలయన, కేవలము ఒకవ్యక్తి యొక్క శీలమునుబట్టి కాక, అతని రూపమునుబట్టియే వానిని శ్లాఘించు ప్రజలకు మీరు సమాధానము ఇవ్వవలసి ఉన్నది కదా!
13. మేము పిచ్చివారమా? అది కేవలము దేవుని కొరకు మాత్రమే. మేము వివేకవంతులమా? అది మీ కొరకే.
14. ఏలయన, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమి గదా! అనగా, మానవులు అందరును ఆయన మృత్యువున పాల్గొందురనియే గదా భావము.
15. జీవించుచున్నవారు, ఇక మీదట కేవలము తమ కొరకు కాక, ఆయన కొరకే జీవించుటకుగాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మర ణించి, పునరుత్థానము చెందినది వారి కొరకే గదా!
16. కనుక, ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను, నేడు అటుల చేయము.
17. కావున, ఎవ్వడైనను క్రీస్తునందున్న యెడల అతడు నూతనసృష్టి! పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.
18. ఇది అంతయు దేవునివలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్య పరచుకొని, ఇతరులనుకూడ ఆయనతో సఖ్యపరచు ప్రేషితకార్యమును మాపై పెట్టెను.
19. కనుక, దేవుడు క్రీస్తు ద్వారా మనుష్యులనందరిని తనతో సఖ్యపరచు కొనుచున్నాడు అనునదే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అటుల చేయుచున్నాడు. అంతే గాక, ఆ సఖ్యతను గూర్చిన సందే శమును బోధించు పనిని మాకు అప్పగించి యున్నాడు.
20. కనుక మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచూ ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మాద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బతిమాలుకొనుచున్నాము.
21. క్రీస్తు పాపరహితుడు. కాని, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగ చేసెను. ఏలయన, ఆయనతో ఏకమగుట వలన, మనము దేవుని నీతిగ రూపొందవలెనని అటుల చేసెను.
1. మీరు పొందిన దేవుని కృపను వ్యర్ధము చేయ రాదు అని దేవుని తోటిపనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము.
2. ఏలయన “అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని. రక్షణ దినమున నీకు తోడ్పడితిని” అని దేవుడు చెప్పుచున్నాడుగదా! అయినచో ఆలకింపుడు! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలసమయము, ఇదే రక్షణ దినము!
3. మా పనియందు ఒకరు తప్పుపట్టుట మాకు ఇష్టము లేదు. కనుకనే ఎవ్వరి మార్గమునకును ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నింతుము.
4. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము.
5. మేము కొట్టబడితిమి. చెర యందుంచబడితిమి. అల్లరిమూకల అలజడికి గురియైతిమి. అధికముగ పని చేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి.
6.కాని మాపావిత్య్రముచేతను, విజ్ఞానముచేతను, ఓర్పుచేతను, దయచేతను, పవిత్రాత్మవలనను, నిజమైన ప్రేమవలనను,
7. సత్యసందేశమువలనను, దేవుని శక్తివలనను మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదిరించుటకును, రక్షించుకొనుటకును మాకు నీతియే ఆయుధము.
8. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగ అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము.
9. మేము అనామకులుముగ ఉండియు అందరకు తెలిసినవారమే. మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు.
10. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగ గోచరించుచున్నాము, కాని పెక్కు మందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమియు లేనివారము అనిపించుకొన్నాము. కాని, యథార్థముగ అన్నియు ఉన్నవారము.
11. కొరింతులోని ప్రియమిత్రులారా! మీతో దాపరికము లేకుండ మాట్లాడితిమి. మా హృదయములను మీ ఎదుట విప్పితిమి.
12. మా హృదయములను మీకు మరుగుచేయలేదుకదా! మీరే మీ హృదయములను నాకు చాటుచేసితిరి.
13. మిమ్ము నా బిడ్డలుగ భావించి మీతో ఇట్లనుచున్నాను. మీ హృదయములను కూడ విశాలము చేయుడు.
14. అవిశ్వాసులతో కలిసి ఒంటరిగా పని చేయకుడు. ఏలయన నీతి, అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు? చీకటి వెలుతురు ఎట్లు ఒకచోట కలిసి ఉండగలవు?
15. క్రీస్తుకు సైతానుతో ఏమి సంబంధము? విశ్వాసికి, అవిశ్వాసికి సామ్యమేమి?
16. దేవుని ఆలయము, అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు? ఏలయన, మనమే సజీవుడగు దేవుని ఆలయము గదా? “నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొందును, వారి మధ్యనే జీవింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు” అని దేవుడే స్వయముగ పలికెను గదా?
17. కనుక “మీరు వారిని విడువవలెను, వారి నుండి వేరుపడవలెను, అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధమును ఉంచుకొనకుడు. అప్పుడే మిమ్ము చేరదీసెదను.
18. మీకు నేను తండ్రిని అగుదును. మీరు నా బిడ్డలగుదురు. అని సర్వశక్తిమంతుడగు ప్రభువు పలుకుచున్నాడు" అని ప్రభువు పలికెను.
1. ప్రియ మిత్రులారా! ఈ వాగ్దానములన్నియు మనకు ఒసగబడినవే. కనుక శరీరమును గాని, ఆత్మను గాని, అపరిశుద్ధ పరచు సమస్తము నుండి మనలను మనము శుద్ధి చేసికొందము. దేవునియందలి భయముతో పవిత్రముగ ఉండుటకు ప్రయత్నించుదము.
2. మీ హృదయములలో మాకు స్థాన మొసగుడు. మేము ఎవరికిని కీడు చేయలేదు. ఎవరిని పాడుచేయలేదు. ఎవరిని మోసగించుటకు ప్రయత్నింపలేదు.
3. మిమ్ము ఖండించు ఉద్దేశముతో నేను ఇట్లు చెప్పుటలేదు. ఏలయన, నేను ముందే చెప్పినట్లు మీరు మాకు ప్రియులు. అందువలననే మేము మరణించినను జీవించినను మనము ఎప్పుడును కలిసియే ఉందుము.
4. మీయందు నాకు అమిత విశ్వాసము. కనుకనే మిమ్ము చూచి గర్వింతుము. నేను సంపూర్ణ ధైర్యముతో ఉన్నాను. ఇన్ని కష్టములలో కూడ నా సంతోషము పొంగి పొరలుచున్నది.
5. మాసిడోనియా చేరిన తరువాత కూడ మాకు ఎట్టి విశ్రాంతియును లేకపోయెను. అన్ని చోటుల ఇబ్బందులు, అన్యులతో కలహములు, మా హృదయములందు భయములు ఉండెను.
6. కాని దుర్బల హృదయులను ఓదార్చు దేవుడే తీతు యొక్క ఆగమనము ద్వారా మమ్ము ఓదార్చెను.
7. అతని ఆగమనమే కాదు, మీరు అతనిని ఓదార్చిన వృత్తాంతము గూడ. నన్ను చూడవలెనను మీ కోరిక, చూడలేనందున మీ విచారము, నన్ను సమర్థించుటకు మీ సంసిద్ధత అతడు మాకు వివరించినాడు. ఇవి అన్నియు నాకు ఎంతయో ఆనందదాయకములైనవి
8. నేను వ్రాసిన లేఖ మీకు విచారమే కలిగించి నను, దానిని వ్రాసినందుకు నేను బాధపడుట లేదు. ఆ లేఖ మీకు క్షణకాలము బాధ కలిగించినదని తెలిసి ఒకవేళ బాధపడి ఉన్నను,
9. ఇప్పుడు మాత్రము నేను ఆనందించుచున్నాను. ఏలయన, మీకు విచారము కలిగించినందులకు మాత్రము కాదు. కాని ఆ విచారము మిమ్ము సన్మార్గమునకు మరల్చెనని మాత్రమే. ఏ విషయములోను మా వలన మీరు నష్టపొందకుండుటకై దైవచిత్తానుసారముగ మీరు దుఃఖించితిరి.
10. దైవ చిత్తానుసారముగా మీరు పొందిన దుఃఖము రక్షణకు దారిచూపు హృదయపరివర్తనమును కలిగించును. కనుక విచారింప పనిలేదు. కాని ప్రాపంచిక దుఃఖమే మృత్యుహేతువగును.
11. మీ ఈ దుఃఖములో దేవుడు ఏమి సాధించెనో గమనింపుడు. అది మీకు ఎంత ఉత్సాహము కలిగించినది! మీ నిర్దోషత్వము నిరూపించుకొనవలెనని మీకు ఎంత ఆతురత! ఎట్టి భయము! ఎట్టి అభిలాష! ఎట్టి ఆసక్తి! దోషములను శిక్షించుటకు ఎట్టి సంసిద్ధత! అన్ని విషయము లందును మీరు దోషరహితులని నిరూపించుకొనినారు.
12. కనుక నేను ఆ ఉత్తరమును అటుల వ్రాసి ఉన్నప్పటికిని దోషమొనర్చినవానిని గూర్చిగాని, దోష మునకు గురియైనవానిని గూర్చిగాని వ్రాయలేదు. మమ్ము గూర్చిన మీశ్రద్ద ఎంతగాఢమైనదో దేవుని దృష్టిలో మీకు స్పష్టము చేయుటకే నేను అది వ్రాసితిని.
13. అందుచేతనే మేమును ధైర్యము వహించితిమి. మేము ధైర్యము వహించుటయే కాదు, మీరు అందరును కలసి అతనిని సంతోషపెట్టిన వృత్తాంతముతో, తీతు మమ్ము చాల ఆనందపరచినాడు.
14. మిమ్ము అతని ఎదుట చాల పొగడియుంటిమి. మీరు నాకు ఆశాభంగము కలుగచేయలేదు. మీకు ఎప్పుడును సత్యమునే చెప్పితిమి కదా! అట్లే తీతు ఎదుట మేము చేసిన పొగడ్తలు ఋజువైనవి.
15. కనుక మీపై అతనికి ప్రేమ అధికమగును. మీరు అందరును విధేయత చూపుటకు ఎట్లు సంసిద్ధులైనది, భయ ముతో వణకుచు అతనికి మీరు ఎట్లు స్వాగత మిచ్చినది అతనికి జ్ఞాపకమున్నది.
16. ప్రతి విషయములోను మీయందు నాకు నమ్మకము కలిగి యున్నందులకు నేను ఆనందించుచున్నాను.
1. సోదరులారా! మాసిడోనియాలోని దైవ సంఘములలో దేవునికృప ఏమియొనర్చినది. మీకు తెలియవలెనని మా అభిలాష,
2. అచ్చట అవి పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురిచేయబడినవి. కాని వారు మహానందమును పొందినవారై, నిరుపేదలైనను గొప్పగ దానములొనర్చిరి.
3. వారు ఈయగలిగినదంతయు, ఈయగలిగిన దానికంటే అధిక ముగను ఇచ్చిరని నేను దృఢముగ చెప్పగలను.
4. (యూదాలోని) పవిత్ర ప్రజలకు సాయమొనర్చు అవకాశము కొరకై వారు మమ్ము బ్రతిమాలుకొనిరి, పట్టుబట్టిరి.
5. మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము కావించుకొనిరి. తదనంతరము దైవసంకల్పముచే మాకుగూడ తమను అర్పించుకొనిరి. వారిని గూర్చి ఇంతగా మేము ఊహింపలేదు.
6. కనుక ఈ పనిని ప్రారంభించిన తీతునే ఈ పని కొనసాగింపుమనియు, ఈ ప్రేమపూర్వకమగు ఈ ప్రత్యేక సేవను మీయందు పూర్తిచేయుమనియు అర్థించితిని.
7.విశ్వాసములోను, వాక్కు లోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే! కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో గూడ మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష.
8. నేను మిమ్ములను ఆజ్ఞాపించుటలేదు. కాని, సాయమొనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి, మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలిసికొనుటకు నేను ప్రయత్నించుచున్నాను.
9. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా! తాను భాగ్యవంతుడై ఉండి కూడ, తన పేదరికమువలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను.
10. మీ కార్యాచరణమునందే కాక మీ సంసిద్ధత చూపుట యందు మొదటి వారైయుండిన మీకు మేలు. క్రిందటి సంవత్సరము మీరు ప్రారంభించిన పని, ఇప్పుడు పూర్తిచేయుట మీకు మంచిది అని నా అభిప్రాయము.
11. ఎంత ఆసక్తితో మీరు పనిని ప్రారంభించితిరో అంత ఆసక్తితో పనిని ముగింపుడు. మీ శక్తి కొలదియే చేయుడు.
12. ఏలయన ఇచ్చుటకు మీకు ఆసక్తి ఉన్నచో, మీకు లేనిదానిని బట్టిగాక, మీకు ఉన్నదానినిబట్టియే దేవుడు మీ కానుకను అంగీకరించును.
13. మీ పైననే భారముంచి, ఇతరులను తేలికగా వదలుటకు నేను ప్రయత్నించుట లేదు.
14. కాని ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే, అవసరములో ఉన్న వారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు, వారి సమృద్ధినిబట్టి వారును మీకు సాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమానముగ న్యాయము జరుగును.
15. లేఖము చెప్పుచున్నట్లుగ: “ఎక్కువ ప్రోగుజేసినవానికి ఎక్కువగ ఏమియును మిగులకుండెను. తక్కువ ప్రోగుజేసినవానికి ఏమియును తక్కువగాకుండెను.”
16. మా వలెనే తీతు కూడ మీకు సాయపడ వలెననెడు ఆసక్తి కలవాడు అయినందులకు దేవునికి ఎంతయో కృతజ్ఞులము.
17. మా మనవిని అతడు అంగీకరించుటయే కాక, మీకు సాయపడవలెనని తనకుగల ఆసక్తిచే తనకు తానుగ మిమ్ము చేర రాదలచెను.
18. ఆయనతోపాటు సువార్త బోధయందు అన్ని దైవసంఘములలోను మంచి గౌరవము గడించిన సోదరుని కూడ పంపుచున్నాను.
19. అంతే కాక, మా ప్రయాణములలో తోడగుటకు దైవసంఘములచే అతడు ఎన్నుకొనబడి నియమింపబడిన వాడు. ప్రభువు మహిమకై ఈ ప్రేమపూర్వక కార్యమును కొనసాగించుటలో అతడు తోడ్పడును. ఈ విధముగ సాయపడవలెననెడు మా భావము విదితమగును.
20. మేము ఉదారమగు ఈ దానమును వినియోగించుటలో ఎట్టి వివాదములకును తావు లేకుండునట్లు జాగ్రత్త పడుచున్నాము.
21. కేవలము ప్రభువు దృష్టిలో మాత్రమేకాక మనుష్యుల దృష్టికి కూడ మంచి అనిపించినదే చేయవలెనని మా ఉద్దే శము.
22. కనుకనే మా సోదరుని వారితో కూడ పంపుచున్నాము. అతనిని పెక్కుమారులు పరీక్షించి, సాయమొనర్చుటయందు ఎల్లప్పుడును అతడు ఆసక్తి కలవాడే అని గ్రహించితిమి. ఇప్పుడు మీయందు అతనికి దృఢవిశ్వాసము కలుగుటవలన మరింత ఆసక్తితో సాయపడనెంచుచున్నాడు.
23. ఇక తీతును గూర్చి చెప్పవలసినచో మీకు సాయమొనర్చుటలో అతడు నా భాగస్వామి. అతని వెంటపోవు ఇతర సోదరులు దైవసంఘములకు ప్రతినిధులు. వారు క్రీస్తునకు మహిమ తెత్తురు.
24. కనుక మీ ప్రేమను వారికి చక్కగా ప్రదర్శింపుడు. అప్పుడు మిమ్ము గూర్చి మేము గర్వించుట యుక్తమేనని దైవసంఘములన్నియు గ్రహించును. మీ ప్రేమను ధ్రువపరచు కొనుడు.
1. పవిత్ర ప్రజలకు పంపబడుచున్న సాయమును గూర్చి వ్రాయవలసిన అవసరము ఏ మాత్రము లేదు.
2. మీరు తోడ్పడుటకు సమ్మతింతురని నాకు తెలిసినదే. కనుకనే మాసిడోనియా ప్రజలకు మిమ్ము గురించి గొప్పగ చెప్పితిని. “అకాయియలోని ప్రజలు క్రిందటి సంవత్సరమునుండి తోడ్పడుటకు సంసిద్ధులే” అని అంటిని. మీ ఆసక్తి వారిలో పెక్కుమందిని చైతన్యపరచినది.
3. కనుకనే ఈ సోదరులను మీ వద్దకు పంపుచున్నాను. మిమ్ము గూర్చి మేము పలికిన పొగడ్తలు వ్యర్థములు కాకుండుగాక! కాని నేను పలికినట్లు మీరు మీ సాయముతో నిధముగా ఉందురుగదా!
4. అట్లుకాక, మాసిడోనియా ప్రజలు నాతోపాటు వచ్చి, మీరు సంసిద్ధులుగ లేరని కను గొన్నచో మీరు సిగ్గుపడుమాట అటుండ మిమ్ము గూర్చి అంత దృఢవిశ్వాసము కలిగిన మేము ఎంత సిగ్గు పడుదుమోకదా!
5. కనుక ఈ సోదరులు నాకంటె ముందే మిమ్ము చేరునట్లు ప్రోత్సహించుట అవసర మని తలచితిని. మీరు వాగ్దానమొనర్చిన దానము వారు ముందుగనే సిద్దమొనర్చెదరు. ఆవల నేను వచ్చినపుడు అది సిద్ధముగా ఉండగలదు. అంతేకాక మీరు ఈయవలసి వచ్చి ఇచ్చుటకాక, ఈయవలెననెడి కోరికచే ఇచ్చితిరని అది స్పష్టము చేయును.
6. విత్తనములు కొలదిగ చల్లినవానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లినవానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు.
7. కావున, చింతతోగాని, ఒత్తిడి వలన గాని కాక ప్రతివ్యక్తియు తనకు తోచినట్లు దాన మొనర్చ వలెను, సంతోషముతో దానమొనర్చువానిని దేవుడు ప్రేమించును.
8. మీ అవసరముకంటె ఎక్కువగా దేవుడు మీకు ఈయగలడు. కనుక, మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయేకాక, ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు.
9. "పేదలకు ఆయన ఉదారముగ ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును" అని లేఖనము పలుకుచున్నది.
10. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చుదేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలయునో అన్నియు సమకూర్చి వానిని వర్ధిల్లజేసి మీ ఉదారగుణమువలన మంచి పంట పండునట్లు చేయును.
11. మీరు సర్వదా ఉదారస్వభావులగునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పింతురు.
12. ఎట్లన, మీరు ఒనర్చు ఈ సేవ, పవిత్ర ప్రజల అవసరములకు సాయపడుటయే కాక, వారిచే దేవునకు అనంతముగా కృతజ్ఞతలను అందింప చేయును.
13. మీరు ఒనర్చిన ఈ సేవల నిదర్శ నమును బట్టి, మీరు బోధించు క్రీస్తు సువార్తయందు మీకు గల విశ్వాసమునకును, అందరితో పాలు పంచుకొను మీ ఉదారస్వభావమునకును అసంఖ్యాకులు దేవునకు మహిమ చెల్లింతురు.
14. దేవుడు మీపై ప్రదర్శించిన అసాధారణమగు కృపకు అను రాగముతో మీకై వారు ప్రార్థనలు సలిపెదరు.
15. మనము దేవుని అమూల్యమగు వరమునకు కృతజ్ఞత లను అర్పింతము!
1. పౌలునగు నేను మీకు ఒక విన్నపము చేయుచున్నాను. మీతో ఉన్నప్పుడు సాధువుననియు, సాత్వికుడననియు, మీకు దూరముగ ఉన్నపుడు ధైర్యశాలిననియు నన్ను గూర్చి చెప్పుచుందురు గదా! కనుక, క్రీస్తు సాత్వికముతోను, మృదుత్వముతోను మిమ్ము ఇట్లు వేడుకొనుచున్నాను.
2. నేను అచటకు వచ్చినపుడు మీతో కఠినముగ ఉండునటుల చేయకుడు. లౌకికమగు తలంపులతో మేము ప్రవర్తించుచున్నామని సందేహించు వారితో నేను కఠినముగ ప్రవర్తింపగలననునది నాకు నిశ్చయమే.
3. మేమును ఈ ప్రపంచమున నివసించుచున్నామను మాట నిజమే. కాని మేము ప్రాపంచికమగు తలంపులతో పోరాటమును సలుపుట లేదు.
4. మా పోరాటములో మేము ఉపయోగించు సాధనములు ప్రాపంచికములు కావు. అవి దుర్గములను కూడ ధ్వంసమొనర్చగల శక్తిమంతమగు దేవుని ఆయుధములు. అసత్య వాదములను మేము నాశనము చేయుదుము.
5. మేము వితండవాదములను, దైవజ్ఞానమునకు అడ్డు నిలుచు ప్రతి ఆటంకమును త్రోసివేయుదుము. ఆలోచనలను బంధించి క్రీస్తునకు విధేయములుగ చేయుదుము.
6. మీరు మీ సంపూర్ణ విధేయతను నిరూపించిన తరువాత, ఎట్టి అవిధేయతతో కూడిన పనినైనను శిక్షింప సిద్ధమగుదుము.
7. మీ కన్నుల ఎదుట ఉన్నదానిని చూడుడు. ఎవడైనను తాను క్రీస్తునకు చెందినవాడనని చెప్పు కొనినచో, తనవలె మేమును ఆ క్రీస్తునకు చెందిన వారమని ఎరుగవలెను.
8. ప్రభువు మాకు ప్రసాదించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ గొప్పగా చెప్పుకొనినను, దాని కొరకు సిగ్గుపడుటలేదు. ఆ అధికారము మీ ప్రసిద్ది కొరకే కాని, మిమ్ము నాశనము చేయుటకు కాదు.
9. నా లేఖలతో మిమ్ము భయపెట్టుటకు ప్రయత్నించుటలేదు.
10. 'పౌలు జాబులు తీవ్రముగను, కఠినముగను ఉండును. కాని, తానే స్వయముగా మనతో ఉన్నపుడు అతడు బలహీనుడు. అతని మాటలు ఎందులకును కొరగావు!” అని ఎవడైన పలుకవచ్చును.
11. దూరమున ఉన్నప్పుడు మేము ఏమి వ్రాయుదుమో దగ్గర ఉన్నప్పుడు అదియే చేయుదుమని అట్టివాడు గ్రహింపవలెను.
12. నిజమునకు తమను గూర్చి అంత గొప్పగ నెంచుకొను వ్యక్తులతో మమ్ము జతపరచుకొనుటకు గాని, పోల్చుకొనుటకుగాని మేము సాహసింపము. వారు ఎంత అవివేకులు! తమను ఎంచుకొనుటకు వారు స్వకీయ ప్రమాణములను ఏర్పరచుకొందురు. అట్టి ప్రమాణములతోనే తమను పోల్చుకొందురు.
13. మేము మాత్రము పరిమితి మించి పొగడుకొనము. దేవుడు మాకు నిర్ణయించిన పని పరిమితిలోనే అది నిలిచిపోవును. మేము మీ మధ్య చేయుపనియు అందులోనిదే.
14. మీరు ఆ పరిమితిలోనివారే అగుటచే, క్రీస్తును గూర్చిన సువార్తతో మేము అటకు వచ్చినపుడు మేము ఆ పరిమితులను అతిక్రమింపలేదు.
15. దేవుడు మాకు నిర్ణయించిన పరిమితులను దాటి ఇతరులు చేసిన పనులను గూర్చి మేము గొప్పలు చెప్పము. అంతేకాక, మీ విశ్వాసము వర్ధిల్లి, మీ మధ్య మేము పనిచేయవలసిన క్షేత్రము పెరగగలదని ఆశించుచున్నాము. ఎట్లయినను సర్వదా మా కార్యములు అన్నియు దేవుడు విధించిన పరిమితుల లోపలనే ఉండును.
16. అప్పుడే మిమ్ము దాటి దేశాంతరములందు సహితము ఈ సువార్తను బోధింప గలుగుదుము. అందువలన అన్యుల పరిధిలో పూర్వమే సాధింపబడిన పనిని గూర్చి మేము పొగడుకొనవలసిన అవసరము ఉండదు.
17. కాని లేఖనము చెప్పుచున్నట్లు, “గొప్పలు చెప్పుకొనదలచినవాడు ప్రభువునందే గొప్పలు చెప్పుకొనవలెను”
18. దేవుడు అతనిని ఆమోదించిననాడే ఏ వ్యక్తియైనను నిజముగ ఆమోదింపబడినవాడు అగును. కాని, తనను గూర్చి తాను గొప్పగ తలంచినంత మాత్రమున ఆమోదమును పొందడుగదా!
1. నా అవివేకమునుగూడ మీరు కొంతవరకు సహింపగలరనుకొందును. దయచూపి సహింపుడు!
2. మిమ్ము గూర్చి దేవునకు ఆసక్తియున్నది. నాకును ఆసక్తియున్నది. ఏలయన, మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధానమొనర్పబడిన నిష్కళంకయగు కన్య వంటివారు.
3. కనుకనే మీ హృదయములు కలుషితములై, క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్చమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయమగు చున్నది. ఎట్లన, ఏవ సర్పము యొక్క టక్కరి పలుకులకు లోనయ్యెనుగదా!
4. ఎవరైనను మీవద్ద చేరి, మేము బోధించిన యేసునుకాక, వేరొక యేసును బోధించినను మీరు సంతోషముతో సహింతురు. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకును, సందేశమునకును విరుద్ధమైన వేరొక ఆత్మను, సందేశమును కూడ మీరు అంగీకరింతురు!
5. మీరు విశిష్టమైన అపోస్తలులుగ ఎంచువారికి నేను ఏ మాత్రము తీసిపోనని నా నమ్మకము.
6. నేను వక్తగా ప్రౌడను కాకపోవచ్చును. కాని జ్ఞానమందు మాత్రము తీసిపోనివాడను. అన్ని విషయముల యందును అన్ని విధముల మేము దీనిని మీకు స్పష్టము చేసియున్నాము.
7. దేవుని సందేశమును నేను మీకు బోధించి నపుడు ప్రతిఫలము ఏమియును కోరలేదు గదా! అంతేకాక, మిమ్ము గొప్పవారిని చేయుటకు నేను వినమ్రుడనైతిని. అట్లు చేయుట తప్పా?
8. మీ వద్ద నేను పనిచేయుచున్నపుడు ఇతర క్రీస్తు సంఘములు నన్ను పోషించినవికదా! అనగా మీకు సాయమొనర్చుటకు వారి వద్ద దొంగిలించితిని అనుటయే కదా!
9. అంతేగాక నేను మీతో ఉన్న సమయమున నాకు ధనసహాయము అవసరమైనపుడు మిమ్ము బాధింప లేదు. ఏలయన, మాసిడోనియా నుండి వచ్చిన సోదరులే నాకు అవసరమైనవి అన్నియు తెచ్చిరి. పూర్వము ఎట్లో ముందు కూడా అట్లే. నేను మీకు దేనికిని భారముగా ఉండను.
10. నాలో ఉన్న క్రీస్తు సత్యముపై నేను ఇట్లు వాగ్దానము చేయుచున్నాను. ఈ నా ఘనతను అకయా ప్రాంతములలో ఎవరును ఆపలేరు.
11. నేను ఏల ఇట్లు చెప్పుచున్నాను? మీపై ప్రేమ లేకపోవుటచేతనా? కాదు, నా ప్రేమ సత్యమని దేవునకు ఎరుక.
12. మావలెనే తామును కృషి సలుపుచున్నామని ఆత్మస్తుతి చేసికొనుటకు ఆ ఇతర 'అపోస్తలుల'కు ఎట్టి అవకాశము ఒసగకుండుటకై నేను చేయుచున్న పనిని ఇక ముందు కూడ కొనసాగించెదను.
13. ఆ వ్యక్తులు అసత్య అపోస్తలులు. వారు మోసపూరిత అపోస్తలులు. వారు తమ పనిని గూర్చి అసత్యము లాడుదురు. క్రీస్తు యొక్క నిజమైన అపోస్తలులవలె అగుపడుటకు వేషము మార్చుకొందురు.
14. ఇందులో ఆశ్చర్యము ఏమియును లేదు! సైతాను కూడ వెలుగు దేవదూతవలె అగుపడునట్లు తనను తాను మార్చుకొనగలడు!
15. కనుక, వాని సేవకులు కూడ నీతియొక్క సేవకులవలె గోచరించునట్లు తమ్ము తాము మార్పు చేసికొని నటించినచో ఆశ్చర్యము లేదు. వారి కృత్యములను బట్టియే వారి అంతము ఉండును.
16. నన్ను అవివేకిగా ఎవరును తలంపరాదని మరల చెప్పుచున్నాను. ఒకవేళ మీరు అటుల తలచి నను అవివేకిగానైనను సరే నన్ను స్వీకరింపుడు. ఏలయన, అప్పుడు ఆత్మస్తుతి చేసికొనుటకు కొలది అవకాశము నాకు లభించును.
17. నేను ఇప్పుడు చెప్పు చున్నది ప్రభువు చెప్పుమనినందున నేను చెప్పుటలేదు. ఈ ఆత్మస్తుతి విషయమున నిజముగనే నేను అవివేకి వలె మాట్లాడుచున్నాను.
18. కాని కేవలము లౌకిక కారణముల చేతనే తమను తాము పొగడుకొనువారు పెక్కుమంది ఉండుటచే, నేనును అట్లే చేయుదును.
19. మీరు స్వయముగ వివేకము గలవారు కనుకనే అవివేకులను కూడ మీరు సహింతురు.
20. మీపై ఎవరైన అధికారము చలాయించినను, మిమ్ము మోసము చేసినను, మిమ్ము చిక్కులలో ఇరికించినను, మిమ్ము అల్పులుగా చూచినను, చెంపదెబ్బ కొట్టినను, అట్టి వానిని మీరు సహింతురు.
21. దీనిని గూర్చి నాకు సిగ్గగుచున్నది. కాని మేము అటుల చేయ సాహసింపలేదు. నేను మరల అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో! కాని ఎవడైనను దేనిని గూర్చియైనను పొగడుకొను ధైర్యముగలవాడైనచో నేనును అంత ధైర్యము గలవాడనగుదును.
22. వారు హెబ్రీయులా? నేనును అట్టివాడనే. వారు యిస్రాయేలీయులా? నేనును అట్టివాడనే. వారు అబ్రహాము సంతతివారా? నేనును అట్టివాడనే.
23. వారు క్రీస్తు సేవకులా? నేను పిచ్చివానివలె మాట్లాడినను నేను వారికంటె అధికుడనగు సేవకుడను. నేను వారికంటె ఎక్కువగా కష్టపడి పని చేసితిని. వారికంటె ఎక్కువ మారులు నేను చెరయందుంటిని. ఎక్కువ మారులు కొరడాదెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని.
24. ఐదు మారులు యూదుల వలన ముప్పది తొమ్మిది కొరడాదెబ్బలు అనుభవించితిని.
25. మూడు మారులు బెత్తములతో దెబ్బలుతింటిని. ఒకమారు రాళ్ళతో కొట్టబడితిని. మూడుమారులు ఓడ పగిలిన ప్రమాదములలో చిక్కుకొనియుంటిని. ఒకమారు రాత్రియు పగలును నీటిలో గడిపితిని.
26. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకును, దొంగలవలన ఆపదలకును, తోడియూదులును, అన్యులును కలిగించిన అపాయములకును గురియైతిని. నగరములలోని ఆపదలకును, అడవులలోని ఆపదలకును, సముద్రముల మీది ఆపదలకును, ఇంకను కపట స్నేహితులవలన ఆపదలకును లోనైతిని.
27. అంతయు పని, శ్రమ. తరచుగ నాకు నిద్ర ఉండెడిది కాదు. పెక్కు మారులు తిండి, గుడ్డ, తలదాచుకొను చోటు లభింపకుండెడివి.
28. మిగిలినవాని మాట అటుండ, సకల దైవసంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగ ఉన్నది.
29. ఎవడైన బలహీను డైనచో నాకును బలహీనముగ ఉన్నట్లు అనిపించును. ఎవడైన పాపమునకు లోనైనచో, నా హృదయము విచారముతో నిండిపోవును.
30. ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో, నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొందును.
31. యేసుప్రభువునకు తండ్రియగు దేవునకు నేను అసత్యమాడుటలేదని తెలియును. దైవనామము సర్వదా స్తుతి పొందును గాక!
32. నేను దమస్కు నగరమున ఉన్నప్పుడు అరెతరాజు యొక్క మండలాధిపతి నన్ను బంధించుటకు నగరము చుట్టును కాపుంచెను.
33. కాని, నేను గోడలకుగల కిటికీగుండా ఒక గంపలో దింపబడి, వానినుండి తప్పించుకొంటిని.
1. నిరుపయోగమైనను నేను పొగడుకొనవలసి వచ్చుచున్నది. ప్రభువు యొక్క దర్శనములను గూర్చియు, ప్రత్యక్షమగుటను గూర్చియు నేను ఇప్పుడు చెప్పుదును.
2. క్రీస్తునందున్న ఒక వ్యక్తి నాకు తెలియును. అతను పదునాలుగు సంవత్సరముల క్రిందట మహోన్నతమగు దేవలోకమునకు ఎత్తబడెను. అది శరీరముతోనో లేక శరీరరహితముగనో నాకు తెలియదు. దేవునకు తెలియును.
3. ఈతడు దివికి ఎత్తబడెనని నాకు తెలియును అని మరల పలికెదను. మరల, ఇది శరీరముతోనో లేక కాదో నాకు తెలియదు. దేవునకు తెలియును.
4. నరుడు వచింప శక్యము కాని మాటలు అతడు అట వినెను.
5. కనుక ఈ వ్యక్తిని గురించి పొగడెదను. కాని నా బలహీనతలను ప్రదర్శించు విషయములను తప్ప, నన్ను గురించి నేను గొప్పగ చెప్పుకొనను.
6. పొగడుకొనదలచినచో అవివేకిని గాకుందును. ఏలయన, నేను నిజమునే చెప్పుకొందును గదా! కాని నన్ను పొగడుకొనను. ఏల యన, ఏ వ్యక్తియైనను నాకార్యములు చూచి, నా వలన విని ఏర్పరచుకొనిన అభిప్రాయము కంటె, గొప్ప అభిప్రాయమును పొందవలెనని నేను కోరను.
7. కాని నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండ నా శరీరములో ఒక ముల్లు గ్రుచ్చబడినది. అది సైతాను దూతగ పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండచేయును.
8. దీనిని గూర్చి మూడు మారులు ప్రభువునకు మనవి చేసితిని. దానిని తొలగింపవలయునని ప్రార్థించితిని.
9. అందుకు “నా కృప నీకు చాలును. బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది” అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే నేను గర్వింతును.
10. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలయన, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. .
11. నేను అవివేకివలె ప్రవర్తించుచున్నాను. కాని నేను అటుల చేయుటకు మీరే కారకులు. నన్ను గూర్చి ఆమోదముద్ర వేయవలసిన వారును మీరే. ఏలయన, నేను వ్యర్ధుడనైనను మీ విశిష్టమైన "అపోస్తలుల" కంటె ఏ విధముగను తీసిపోను.
12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను పూర్ణమైన ఓరిమితో చేయుటవలన అపోస్తలుని చిహ్నములు మీ మధ్య నిజముగా కనుపరపబడెను.
13. మిగిలిన దేవసంఘములకంటె మీరు ఎట్లు హీనముగ చూడ బడితిరి! కాని ఒక్క విషయము. సహాయము కొరకు నేను మిమ్ము బాధింపలేదు. ఇట్లు ప్రవర్తించినందులకు క్షమింతురు గాక!
14. నేను మిమ్ము చూచుటకు రావలెనని సిద్దపడుట ఇది మూడవ మారు. ఇప్పుడైనను మీ నుండి నేను ఏమియును ఆశింపను. నాకు కావలసినది మీరేకాని మీ ధనము కాదు. పిల్లలు తల్లిదండ్రులను పోషించుట సహజము కాదు. కాని తల్లిదండ్రులు పిల్లలను పోషించుట సహజమే కదా!
15. మీకు తోడ్పడుటకై నన్ను, నా సమస్తమును సంతోషముగా వినియోగింతును. మిమ్ము ఇంతగా ప్రేమించుచున్నందున మీరు నన్ను తక్కువగ ప్రేమింతురా?
16. కనుక నేను మీకు భారముగా ఉండలేదని మీరు అంగీకరింతురుగదా? నేను టక్కరితనమున అసత్యములతో మిమ్ము మోసగించితిని అని ఎవడైన అనవచ్చును.
17. ఎట్లు? నేను మీయొద్దకు పంపిన వారిలో ఎవనివలననైనను మిమ్ము మోసపుచ్చుటకు ప్రయత్నించితినా?
18. తీతును పొమ్మని ప్రార్థించి తిని. అతనితో మరియొక సోదరుని కూడ పంపితిని. ఒకవేళ తీతు మిమ్ము ఏమైన మోసము చేసెనా? కాని, అతడును, నేనును ఒకే సంకల్పముతో పని చేయ లేదా? ఒకే విధముగా ప్రవర్తింపలేదా?
19. కాని ఒకవేళ ఇంతవరకు మీ ఎదుట మేము మా పక్షమున వాదించుకొనుచున్నామని అనుకొందు రేమో! కాదు! దేవుని సమక్షమున క్రీస్తు చిత్తానుసారము మాటలాడుచున్నాము. మేము చేయు ప్రతికార్య మును, మిత్రులారా! మీకు సాయపడుటకే.
20. కాని నేను అచ్చటకు చేరిననాడు నా అభిలాషకు విరుద్ధముగ నేను మిమ్ము,మీ అభిలాషకు విరుద్ధముగ మీరు నన్ను చూచుదురేమోనని భయము కలుగుచున్నది. పోట్లా టలు, అసూయ, ఉద్రిక్తత, స్వార్థపరత్వము, అవమానములు, నిష్ప్రయోజనమగు ప్రసంగములు, గర్వము, క్రమరాహిత్యము కాంచవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను.
21. మరల నేను వచ్చినచో మీ సమక్షమున దేవుడు నన్ను చిన్నపుచ్చునేమో అని భయపడుచున్నాను. అంతేకాక గతమున పాపములు చేసి తమ అపవిత్రతకు, అవినీతికరములగు పనులకు, లైంగిక పాపములకు, వ్యామోహ కృత్యములకు, పశ్చాత్తాపపడనివారిని గూర్చి కూడ నాకు దుఃఖము కలుగును.
1. నేను మిమ్ము చూడవచ్చుట ఇది మూడవ మారు. “ఏ దోషారోపణమైనను ఇద్దరు లేక ముగ్గురు సాక్షులచే బలపరుపబడవలెను” అని లేఖనము పలుకుచున్నది.
2. పాపము చేసిన వారిని, ఇతరులను గతములోనే హెచ్చరించియుంటిని. నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవమారు మీ యొద్ద ఉన్నట్టుగానే వారిని తిరిగి హెచ్చరించుచున్నాను. అదేమనగా నేను తిరిగివచ్చినయెడల వారిపై ఎట్టి కనికరమును చూపించను.
3. క్రీస్తు నా ద్వారా మాటలాడుచున్నాడని మీకు కావలసియున్న ఆధారములు లభింపగలవు. మీతో వ్యవహరించినపుడు ఆయన బలహీనుడు కాడు. మీ మధ్య ఆయన శక్తిమంతుడై ఉన్నాడు.
4. ఏలయన, బలహీనస్థితిలో ఆయన సిలువపై చంపబడినను, దైవశక్తిచేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో ఏకమగుటవలన మేమును బలహీనులమే. కాని మీ విషయమున, దైవశక్తిచే మేము ఆయనతో జీవింతుము.
5. మీరు ఆత్మపరీక్ష చేసికొనుడు. మీరు విశ్వాసము కలిగి జీవించుచున్నారా? క్రీస్తుయేసు మీ యందు ఉన్నాడని నిజముగ మీకు తెలియదా? మీరు పూర్తిగ దిగజారిపోయి ఉండిననే తప్ప ఎట్లు తెలియకుండగలదు?
6. కాని మేము విఫలురము కాలేదని మీరు గ్రహింపగలరని ఆశించుచున్నాము.
7. మీరు ఎట్టిదోషములు చేయకుండుటకై దేవుని ప్రార్ధింతుము. కాని మేము జయమును పొందితిమని ప్రదర్శించుటకు కాదు, మేము విఫలురముగ కనిపెట్టినను మీరు మాత్రము సత్కార్యములను చేయుటకై అట్లోనర్తుము.
8. ఏలయన, దేవుని సత్యమునకు విరుద్ధముగ మేము ఒక్క పనియు చేయజాలము. దానికి అనుకూలముగ మాత్రమే చేయగలము.
9. మేము బలహీనులముగ ఉన్నను, మీరు బలవంతులుగ ఉన్నప్పుడే మాకు అనందము. కనుక, మిరు సంపూర్ణులు కాగలుగుటకే మేము ప్రార్ధింతుము.
10. అందువలన దూరముగ ఉన్నప్పుడే మీకు ఈ జాబు వ్రాయుచున్నాను. అప్పుడు నేను అచ్చటకు వచ్చినచో దేవుడు నాకు ఇచ్చిన అధికారమును మీపై ఉపయోగించుటలో నేను కఠినముగా ఉండవలసిన అవసరము కలుగదు. ఆ అధికారము మీ నిర్మాణాత్మక కృషికేగాని, మీ నాశనమునకు కాదు గదా!
11. కనుక సోదరులారా సెలవు! సంపూర్ణు లగుటకు కృషిసలుపుడు. నేను చెప్పిన దానిని ఆల కింపుడు. పరస్పరము ఏకీభావము కలిగియుండుడు. సమాధానముతో జీవింపుడు. ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మీకు తోడగును.
12. పవిత్రమైన ముద్దుతో పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు.
13. దైవప్రజలందరు మీకు శుభాకాంక్షలను పంపుచున్నారు.
14. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకును లభించునుగాక!