ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మక్కబీయులు రెండవ గ్రంధము

 1. “యెరూషలేములోను, యూదయాలోను నివసించు యూదులు ఐగుప్తునందలి సోదర యూదులకు శుభము పలికి వ్రాయునది. మీకు శాంతియు, అభ్యుదయము సిద్ధించునుగాక!

2. ప్రభువు తన విశ్వాస దాసులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసికొనిన నిబంధనమును స్మరించుకొని మీకు మేలు చేయునుగాక!

3. ప్రభువు మీకు తనను ఆరాధించు బుద్ది పుట్టించునుగాక! ఆయన మీరు హృదయపూర్వకముగను, ఉత్సాహముగను తన చిత్తమును పాటించునట్లు చేయునుగాక!

4. తన ధర్మశాస్త్రమును, తన ఆజ్ఞలను అర్థము చేసికొను శక్తిని మీకు ప్రసాదించి మీకు శాంతిని దయచేయునుగాక!

5. మీ ప్రార్ధనలు ఆలించి మీ తప్పిదములను మన్నించును గాక! ఆపత్కాలమున మిమ్ము చేయి విడువకుండును గాక!

6. ఇచట మేము మీ కొరకు ప్రార్థనలు అర్పించుచున్నాము.

7. గ్రీకుశకము నూట అరువది తొమ్మిదవ యేట (క్రీపూ 143) దెమేత్రియసు పరిపాలనాకాలమున మేము మీకొక లేఖను వ్రాసి ఇట్లు తెలియజేసితిమి: 'యాసోను అతని అనుచరులు మన పరిశుద్ధ దేవాలయము మీద తిరుగబడిన తరువాత మేము మతహింసలకును, ఉపద్రవములకును గురియైతిమి.

8. వారు దేవాలయ ద్వారములను తగులబెట్టి, నిర్దోషులైన ప్రజలను వధించిరి. అంతట మేము ప్రభువునకు మొరపెట్టగా ఆయన మా వేడికోలును ఆలించెను. మేము పశుబలులు, ధాన్యబలులు అర్పించితిమి. దేవాలయమున దీపములు వెలిగించితిమి. సాన్నిధ్యపు రొట్టెలను అమర్చితిమి.

9. కనుక మీరును కీస్లేవు నెలలో గుడారముల పండుగ జరుపుకొనుడు. ఈ కమ్మ గ్రీ.శ. నూట ఎనుబది ఎని మిదవ (క్రీ.పూ 124) వ యేట వ్రాయబడినది.”

10. “యెరూషలేములోను, యూదయాలోను వసించు యూదులును, యూదుల పరిపాలన సభయు, యూదాసు కలిసి యాజకుల తెగకు చెందినవాడును ప్టోలమీ రాజునకు, గురువునగు అభిషిక్తుడైన అరిష్టోబులసునకును ఐగుప్తులోని యూదులకును నమస్కరించి వ్రాయునది. మీకెల్లరికిని శుభాకాంక్షలు, ఆరోగ్యము సిద్ధించునుగాక!

11. ప్రభువు మమ్ము పెద్ద ఆపదనుండి కాపాడెను గనుక మేము ఆయనకి వందనములు చెల్లించుచున్నాము. మేము రాజు నెదిరించి పోరాడవలసి వచ్చెను.

12. కాని ప్రభువు పరిశుద్ధ నగరమునకు వ్యతిరేకముగ పోరాడిన వారిని పారద్రోలెను.

13. అంతియోకసు రాజు పారశీకమున ప్రవేశించినపుడు అతని సైన్యము అజేయముగానుండెను. కాని నానెయా దేవతను అర్చనచేయు యాజకులు మోసముతో అతని సైన్యమును తమ దేవళములోనే చిత్రవధ చేసిరి.

14. ఆ రాజు తన స్నేహితులతో నానెయా దేవళమునకు వెళ్ళెను. అతడు ఆ దేవతను పెండ్లియాడి ఆమె దేవళము నందలి నానావిధ నిధులను వరకట్నము పేరుతో అపహరింప చూచెను.

15. యాజకులు ఆ నిధులను దేవాలయమున ప్రదర్శింపగా రాజు వానిని స్వాధీనము చేసికొనుటకుగాను కొద్దిమంది మిత్రులతో దేవాలయములోనికి వెళ్ళేను, గాని యాజకులు వెంటనే గుడి తలుపులు మూసిరి.

16. వారు పైకప్పులోని రహస్య తలుపు తెరచి రాజును అతని మిత్రులను రాళ్ళతో కొట్టి చంపిరి. వారి తలలను నరికివేసి దేవాలయము వెలుపల నిలిచియున్న ప్రజల చెంతకు విసరివేసిరి.

17. ఆ దుర్మార్గులను తగిన రీతిగా శిక్షించినందులకు గాను మన దేవుని స్తుతింతముగాక! అన్ని కార్యములకు గాను అతనిని కీర్తింతముగాక!

18. మేము కీస్లేవు నెల ఇరువది ఐదవ తేదీ గుడారముల పండుగవలె దేవాలయ శుద్ధీకరణ పండుగను గూడ జరుపుకొందుము. మీరును ఈ పండుగను చేసికోవలెనన్న కోర్కెతో, మేము ఈ క్రింది సంఘటనను గూర్చి మీకు వ్రాయుచున్నాము. ఈ పండుగను చేసికొనుటద్వారా, పూర్వము నెహెమ్యాకు దేవాలయమును, బలిపీఠమును పునర్నిర్మాణముచేసి బలులు అర్పించునపుడు అగ్ని ఎట్లు ప్రత్యక్షమైనదో మీరు గుర్తుంచుకొందురు.

19. మన పూర్వులు పారశీకమునకు బందీలుగా వెళ్ళినపుడు భక్తిమంతులైన యాజకులు కొందరు బలిపీఠము మీదినుండి అగ్నిని తీసికొని వచ్చి ఎండిపోయిన ఒక బావిలో రహస్యముగా దాచియుంచిరి. వారు ఆ నిప్పును నేర్పుతో దాచిరి. కనుక అది ఎవరి కంటను పడలేదు.

20. చాల యేండ్లు కడచిన తరువాత దేవునికి అనుగ్రహము కలుగగా పారశీక ప్రభువు నెహెమ్యాను యెరూషలేమునకు పంపెను. నెహెమ్యా పూర్వము నిప్పును దాచిన యాజకుల వంశజులను పిలిచి, మీరు వెళ్ళి ఆ అగ్ని ఎచటనున్నదో కనుగొనుడని చెప్పెను. వారు అగ్ని కాదు గాని ఏదో చిక్కనైన ద్రవపదార్ధము తమ కంట బడినదని మాతో చెప్పిరి. నెహెమ్యా ఆ ద్రవపదార్ధమును కొంత తనయొద్దకు తీసికొనిరండని చెప్పెను.

21. బలికి అవసరమైన వస్తువులన్నిటిని బలిపీఠముపై అమర్చిన పిదప నెహెమ్యా వేదికమీది కొయ్యలమీదను, బలిపశువు మీదను ఆ ద్రవపదార్థమును పోయుడని యాజకులను ఆజ్ఞాపించెను. వారటులనే చేసిరి.

22. కొన్ని క్షణములు కడచిన తరువాత అంతవరకు మబ్బు చాటుననుండిన సూర్యబింబము మరల వెలుపలికి వచ్చి ప్రకాశించెను. వెంటనే బలిపీఠము మీదినుండి పెద్దమంట యెగసెను. ఎల్లరును ఆశ్చర్యచకితులైరి.

23. ఆ అగ్ని బలిపశువును దహించుచుండగా యాజకులు ప్రార్థనలు జపించిరి. యోనాతాను నడిపింపగా, నెహెమ్యా, ఇతర ప్రజలు ఆ ప్రార్థనలకు బదులు పలికిరి.

24. ఆ ప్రార్ధనము ఇట్లుండెను: “ప్రభూ! నీవు సర్వమును సృజించినవాడవు, భయంకరుడవు, శక్తిసంపన్నుడవు. అయినను నీవు కరుణామయుడవు, న్యాయము తప్పనివాడవు. నీవొక్కడవే రాజువు నీవొక్కడవే దయామయుడవు.

25. నీవొక్కడవే ప్రాణి పోషకుడవు, న్యాయవంతుడవు. నీవు సర్వశక్తి మంతుడవు, శాశ్వతుడవు. యిస్రాయేలీయులను సకల ఉపద్రవములనుండి కాపాడువాడవు. నీవు మా పితరులను నీ జనముగా ఎన్నుకొని, వారిని పవిత్రపరచితివి.

26. యిప్రాయేలీయుల తరపున మేము సమర్పించు ఈ బలిని అంగీకరింపుము. నీ ప్రజలమైన మమ్ము రక్షించి పవిత్రుల చేయుము.

27. అన్యదేశములలో బానిసలుగా మ్రగ్గుచున్న నీ ప్రజను దాస్యమునుండి విడిపింపుము. చెల్లాచెదరైపోయిన నీ జనమును మరల ప్రోగుచేయుము. అన్యుల అవమానమునకు గురియైన నీ ప్రజను కరుణింపుము. నీవే మా ప్రభుడవని అన్యజాతులెల్ల గుర్తించునుగాక!

28. మమ్ము పీడించు గర్వాత్ములను శిక్షించుము.

29. మోషే నుడివినట్లే నీ ప్రజ ఈ పవిత్ర దేశమున స్థిరపడునట్లు చేయుము.”

 1. ప్రజలు ప్రవాసమునకు వెళ్ళినపుడు యిర్మీయా వారిని పీఠము మీది అగ్నిని కొంత తమతో తీసికొని వెళ్ళుడని ఆదేశించినట్లుగా దస్తావేజులలో చదువు చున్నాము. ఈ అగ్ని గూర్చి మేమిప్పుడే చెప్పియుంటిమి.

2. అతడు వారికి ధర్మశాస్త్రమును ఉపదేశించెను. వారు ప్రభువు ఆజ్ఞలు పాటింపవలెనని చెప్పెను. వారు ప్రవాసదేశములలో తమ కంటబడు వెండిబంగారు విగ్రహములను, వాని అలంకరణములను చూచి ప్రలోభము చెందకూడదని కూడ హెచ్చరించెను.

3. ధర్మశాస్త్రము వారి హృదయములనుండి విడిపోకూడదని చెప్పెను.

4. పై దస్తావేజులనుండి ఇంకొక విషయము కూడ తెలియుచున్నది. పూర్వము మోషే కొండ ఎక్కి ప్రభువు తన ప్రజకీయనున్న భూమిని పరిశీలించెను గదా! యిర్మీయా కూడ ఈ కొండమీదికి వెళ్ళెను. అటుల వెళ్ళినపుడు అతడు దైవప్రేరితుడై గుడారమును, మందసమును తనవెంట రమ్మని ఆజ్ఞాపించెను.

5. ఆ కొండమీద యిర్మీయాకు పెద్ద గుహ ఒకటి కనిపింపగా అతడు గుడారమును, మందసమును, సాంబ్రాణి పొగవేయు పీఠమును ఆ గుహలో భద్రపరచి దాని ద్వారమును మూసివేసెను.

6. యిర్మీయా అనుచరులు కొందరు ఆ గుహకు పోవు మార్గమును గుర్తుపట్ట జూచిరిగాని, ఆ గుహ వారి కంటబడలేదు.

7. వారి ప్రయత్నము నెరిగి యిర్మీయా వారిని మందలించుచు ఇట్లనెను: “ప్రభువు తన ప్రజను మరల ప్రోగుచేసి వారికి కరుణ జూపినదాక ఈ ప్రదేశమెవరికి తెలియక రహస్యముగా నుండును.

8. ఆ సమయము వచ్చినపుడు ప్రభువు ఈ ప్రదేశమును ఎల్లరికిని తెలియజేయును. అప్పుడు మేఘములో ఆయన తేజస్సు కనిపించును. పూర్వము మోషే కాలమున, సొలోమోను దేవాలయమును ప్రతిష్టించి దానిని వైభవోపేతముగా పవిత్రము చేయుమని ప్రభువునకు మనవిచేసినపుడు కనిపించిన దివ్య తేజస్సే అప్పుడును కనిపించును."

9. పై దస్తావేజులనుండి ఈ అంశముకూడ విదితమగుచున్నది. విజ్ఞానియైన సొలోమోను దేవాలయ నిర్మాణము ముగించి దానికి ప్రతిష్ఠ చేయుచు బలిని అర్పించెను.

10. అప్పుడతడు ప్రార్థనచేయగా ఆకాశము నుండి అగ్ని దిగి బలిపశువును దహించెను. పూర్వము మోషే ప్రార్థించినపుడును అటులనే జరిగినది.

11. ఆ సమయమున బలినర్పించువారు పాపపరిహార బలిని భుజింపలేదు కనుక అగ్నియే దానిని దహించినదని మోషే నుడివెను.

12. అదే విధముగ సొలోమోను దేవాలయమును ప్రతిష్ఠించినపుడు ఎనిమిదినాళ్ళ పాటు ఉత్సవము చేసెను.

13. పై అంశములు రాజుల దస్తావేజులలోనే గాక నెహెమ్యా చరిత్రలోనూ కాననగును. ఈతడొక గ్రంథాలయమును నెలకొల్పియుండెను. మరియు అతడు దావీదురాజు రచనలను, బలులనుగూర్చిన రాజుల లేఖలను, రాజులను ప్రవక్తలను గూర్చిన గ్రంథములను సేకరించియుంచెను.

14. యూదా కూడ గ్రంథములను సేకరించెను. అవి గత యుద్దమున చెల్లాచెదరైపోయినవి. కొన్ని మాత్రమిప్పటికిని మిగిలియున్నవి.

15. మీకు ఈ పుస్తకములలో ఏవైన కావలసివచ్చినచో మాయొద్దకు మనిషిని పంపుడు.

16. మేమిపుడు దేవాలయ శుద్దీకరణోత్సవమును చేసికోబోవుచున్నాము. మీరు కూడ ఆ ఉత్సవము జరుపుకోవలెనని చెప్పుటకే ఈ కమ్మ వ్రాయుచున్నాము.

17. ప్రభువు తన ప్రజలనెల్లరిని రక్షించెను. మన పవిత్రదేశమును, రాచరికమును, యాజకత్వమును, దేవాలయమున ఊడిగముచేయు భాగ్యమును మనకు మరల దయచేసెను.

18. ఇటుల చేయుదు నని ఆయన ధర్మశాస్త్రమునందే వాగ్దానము చేసి యుండెను. ఆయన మనలను మహోపద్రవముల నుండి కాపాడెను. దేవాలయమును శుద్ధిచేసెను. ఆయన మనమీద కరుణకలిగి అనతి కాలముననే మన వారిని సమస్త జాతులనుండియు ప్రోగుజేసి ఈ దేవాలయమునకు తోడ్కొని వచ్చునని మేము ఆశించు చున్నాము.”

19. కురేనియా నివాసియగు యాసోను యూదా మక్కబీయుని గూర్చియు, అతని సోదరులగూర్చియు, మహాదేవాలయమును శుద్ధిచేసి దాని బలిపీఠమును ప్రతిష్ఠించుటను గూర్చియు ఐదు సంపుటముల గ్రంథమును వ్రాసెను.

20. యూదులు అంటియోకసు ఎపిఫానెసుతో, అతని కుమారుడగు యూపతోరుతోను జరిపిన యుద్ధములను ఆ రచయిత వర్ణించెను.

21. దైవదర్శనములు పొంది ధైర్యముతో పోరాడి యూద మతమును నిలబెట్టిన వీరులనుగూర్చి చెప్పెను. మన సైనికులు కొదిమందియేయైనను దేశమును అంతటిని గెలిచి అన్యజాతి వారిని పారద్రోలిరి.

22. ఇంకను వారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన దేవాలయమును, యెరూషలేము నగరమును శత్రువులనుండి స్వాధీనము చేసికొనిరి. శత్రువులు ధర్మశాస్త్ర నియమములను రద్దుజేయబోవుచుండగా, వారు ఆ నియమములను మరల అమలు జరిపించిరి. ప్రభువు అనుగ్రహము వలననే వారు ఈ కార్యములన్నిటిని సాధింపగల్గిరి.

23. యాసోను వ్రాసిన ఐదుసంపుటముల గ్రంథమును నేను క్లుప్తీకరించి చెప్పితిమి.

24. ఈ చరిత్రను చదువగోరు వారికి ఈ గ్రంథమునందలి వస్తు బాహుళ్య మును, నానావిషయ ప్రస్తావనమును గొప్ప అవరోధములను కలిగించును.

25. కనుక నేను అన్ని తరగతుల పాఠకులను మనసులో పెట్టుకొని ఈ చరిత్రను సులువైన పద్ధతిలో వ్రాసితిని. ఉల్లాసముకొరకు చదువు వారికి ఈ రచన ఆనందమును చేకూర్చును. ఈ చరిత్రలోని సంఘటనలను కంఠతః నేర్చుకోగోరు వారికి ఇది శ్రమను తగ్గించును.

26. ఇట్టి సంక్షేపమును తయారు చేయవలెనన్న మిగుల శ్రమపడవలయును. రాత్రులు నిద్రకూడ మానుకొని కష్టించి పని చేయవలయును.

27. భిన్న రుచులుగల అతిథులను తృప్తిపరచు విందు సిద్ధముచేయుటెంతకష్టమో ఈ పనియు అంత కష్టము. అయినను ఈ గ్రంథమును చదువు పాఠకుల సంతృప్తి నిమిత్తము నేను ఈ శ్రమనంతటినీ సంతోషముతో అనుభవింతును.

28. ఆయా సంఘటనలను సవిస్తరముగా వర్ణించుట అను కార్యమును మూల రచయితకే వదలివేయుదును. నేను మాత్రము ఆ సంఘటనలను సంగ్రహముగానే వివరింతును.

29. క్రొత్తయిల్లు కట్టువాడు గృహ నిర్మాణమున కంతటికి బాధ్యుడు. ఆ ఇంటికి రంగువేయువాడు అలంకరణమునకు మాత్రమే బాధ్యుడు. నా పని ఈ రెండవది మాత్రమే.

30. సంగతులన్నిటిని తెలిసికొని, అయా అంశములను సవిస్తరముగా పరిశీలించి జాగ్ర త్తగా వివరించుట గ్రంథమును వ్రాసిన చరిత్రకారుని పని.

31. కాని ఆ గ్రంథమునకు సంక్షేపమును తయారు చేయు రచయిత, విషయములను సంగ్రహముగా చెప్పినచాలు. విషయ విస్తరణమతని పని కాదు.

32. కనుక ఇక అధికముగా ఏమియు చెప్పక ఈ చరిత్రను ఇంతటితో ప్రారంభింతును. పీఠికను సుదీర్ఘముగా వ్రాసి అసలు చరిత్రను సంగ్రహముగా వ్రాయుట తెలివితక్కువ పని కదా!

 1. ఓనియాసు ప్రధానయాజకుడుగా నుండిన కాలమున పవిత్రనగరమైన యెరూషలేము శాంతి సౌభాగ్యములకు ఆటపట్టుగానుండెను. అతడు దుష్క్రియలను సహింపనివాడు, భక్తుడు. కనుక ఎల్లరును నియమములను పాటించిరి.

2. వివిధ దేశములనేలు రాజులు కూడ దేవాలయమును గౌరవించి దానికి అమూల్యమైన బహుమతులు సమర్పించిరి.

3. ఆసియా రాజగు సెల్యూకసు తాను ప్రోగుచేసిన కప్పముల నుండే దేవాలయ బలులకు అగు వ్యయమును చెల్లించెడి వాడు.

4. అపుడు బిల్గా తెగకు చెందిన సీమోను దేవాలయాధికారిగా నియమింపబడెను. ఇతడు నగరములోని విపణి వీధిని గూర్చి ఓనియాసుతో వివాదము పెట్టుకొని ఓడిపోయెను.

5. ఆ రోజులలో తార్సిసు కుమారుడు అపోల్లోనియసు పెద్దసిరియాకు రాష్ట్రపాలకుడుగా ఉండెడివాడు.

6. సీమోను అతని యొద్దకు వెళ్ళి దేవాలయ కోశాగారము విస్తారమైన సంపదతో మూలుగుచున్నదని, బలులకగు వ్యయమునకు అంత సొమ్ము అక్కరలేదు, కనుక రాజు ఆ సొత్తును స్వాధీనము చేసికోవచ్చునని చెప్పెను.

7. అపోల్లోనియసు రాజును కలిసికొనినపుడు ఆ సంగతి తెలియజేసెను. రాజు ఆ సొత్తును తీసికొనివచ్చుటకు తన ప్రధానమంత్రి అయిన హెలియడారసును నియమించెను.

8. హెలియెడారసు వెంటనే ప్రయాణము కట్టెను. కాని అతడు పెద్ద సిరియా మరియు ఫినీష్యాలోని నగరములను దర్శింపబోవు వానివలె నటించెను.

9. ఆ ప్రధానమంత్రి యెరూషలేమునకు రాగా ప్రధానయాజకుడు, పౌరులు అతనిని హృదయపూర్వకముగా ఆహ్వానించిరి. అంతటతడు తాను వచ్చిన పనిని తెలియజేసి దేవాలయ కోశాగారమున విస్తారమైన నిధులున్న మాట నిజమేనా అని ప్రశ్నించెను.

10-11. ప్రధానయాజకుడు “అయ్యా! ఆ దుర్మార్గుడు సీమోను మీతో చెప్పిన మాటలు నిజము కాదు. దేవాలయ కోశాగారమున కొంతధనమున్న మాట నిజమే. కాని దానిలో కొంతభాగము వితంతువుల కొరకును, అనాథ శిశువుల కొరకును నిర్దేశింపబడినది. మరికొంత భాగము తోబియా కుమారుడు ప్రముఖుడు హిర్కేనసుకు చెందినది. మొత్తము సొమ్ము నాల్గువందల వీసెల వెండియు, రెండువందల వీసెల బంగారము ఉండును.

12. జగద్విఖ్యాతము పవిత్రమునైన ఈ దేవాలయమును నమ్మి ఇతరులిచట తమ సొమ్మును భద్రపరచుకొనిరి. అట్టి సొమ్మును అన్యులు కొనిపోవుట భావ్యము కాదు” అని చెప్పెను.

13. కాని హెలిమెడొరసు, రాజు ఆజ్ఞాపించినట్లుగా ఆ సొమ్మును రాజుకోశాగారమునకు తర లింపవలెనని పట్టుపట్టెను.

14. అతడు ముందుగనే ఒకరోజును నిర్ణయించి ఆ రోజున సొమ్మును లెక్కించుటకుగాను దేవాలయములోనికి వెళ్ళెను. ఆ సంగతి విని నగరమెల్లను గగ్గోలుపడెను.

15. అర్చకులు యాజకవస్త్రములు ధరించి పీఠము ముందు సాష్టాంగ పడిరి. వారెవరైన దేవాలయమున నిధులను భద్రపరచినచో వానిని కాపాడవలెనని నియమము చేసిన భగవంతునకు ఇప్పుడీ సొమ్మును రక్షింపుమని మనవి చేసిరి.

16. అప్పుడు ప్రధానయాజకుని వైపు చూచిన వారి మనసు కరిగిపోయెను. అతని ముఖము వివర్ణమయ్యెను. అతని మనసులోని బాధ ఎల్లరికిని అర్థమయ్యెను.

17. అతని దేహము భయముతో కంపించి పోయెను. ఆ కంపమతని హృదయములోని వ్యధను వ్యక్తము చేయుచుండెను.

18. ప్రజలెల్లరును తమ యిండ్లనుండి పరుగెత్తుకొనివచ్చి దేవాలయమును అమంగళము కానీయవలదని దేవునికి ప్రార్థన చేయ బూనిరి.

19. స్త్రీలు నడుముల మీద గోనెపట్ట కట్టుకొని వీధులలో ప్రోగైరి. తల్లిదండ్రులు ఇల్లు వదలి బయటికి వెళ్ళనీయని కన్యలు కొందరు నగరద్వారముల చెంతకు, కొందరు ప్రాకారముల చెంతకు పరుగెత్తిరి. కొందరు తమ ఇండ్లలోని కిటికీలగుండ వెలుపలికి తొంగిచూచిరి.

20. ఎల్లరును చేతులెత్తి దేవుని ప్రార్థించిరి.

21. ఆ రీతిగా పురజనులెల్లరును గుమిగూడి సాష్టాంగ పడి ప్రార్థన చేయుటను, ప్రధానయాజకుడు తీవ్రమైన మనోవ్యధకు గురియగుటను చూడగా ఎల్లరి హృదయములును ద్రవించిపోయెను.

22-23. ప్రజలెల్లరును దేవాలయమున దాచుకొన్న వారి సొమ్మును సురక్షితముగా కాపాడుమని సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేయుచుండగాహెలియెడొరసు కోశాగారములోని నిధులను తనిఖీ చేయబూనెను.

24. ఆ మంత్రి తన అంగరక్షకులతో దేవాలయ కోశాగారమునొద్దకు వచ్చెను. వెంటనే సర్వాత్మలకును, సర్వశక్తులకును అధిపతియైన మహాప్రభువు ఒక దివ్యదర్శనము కలిగింపగా మంత్రితో వెళ్ళ సాహసించిన వారందరును గగ్గోలుపడిరి. వారు ప్రభువు శక్తిని జూచి భయభ్రాంతులైరి.

25. ఆ దర్శనములో వారికొక గుఱ్ఱమును రౌతును కనిపించిరి. ఆ గుఱ్ఱమునకు అందముగా అలంకరింపబడిన కళ్ళెము కలదు. రౌతు బంగారు ఆయుధములను ధరించి భీకరముగానుండెను. ఆ గుఱ్ఱము భయంకరముగ హెలియొడోరసు మీదికి దుమికి, అతనిని తన ముందటి కాళ్ళగిట్టలతో తన్నెను.

26. అప్పుడు ఆ మంత్రి బలిష్ఠులును, సుందరాకారులు, మనోహర వస్త్రధారులైన ఇరువురు యువకులనుగూడ చూచెను. వారు మంత్రికి ఇరువైపుల నిలుచుండి చాలసేపు అతడిని కొరడాలతో మోదిరి.

27. వెంటనే హెలియొడొరసు కన్నులకు చీకట్లు క్రమ్మగా అతడు నేలమీదికి ఒరిగెను. అతని అనుచరులు అతనినొక డోలికపై పరుండబెట్టి వెలుపలికి కొనిపోయిరి.

28. అతడొక్క క్షణము ముందు చాలమంది అనుచరులతోను అంగరక్షకులతోను కోశాగారము లోనికి వెళ్ళెను కదా! ఇప్పుడు నిస్సహాయుడై యుండగా అతనిని వెలుపలికి కొనిపోయిరి. అతని అనుచరులెల్లరును దేవుని మహాశక్తిని గుర్తించిరి.

29. ప్రభువు దర్శనమువలన హెలియొడోరసు మాటలు కోల్పోయి, అనారోగ్య స్థితిలో అట్లే పడియుండెను.

30. ప్రభువు అద్భుత రీతిన దేవాలయమును రక్షించెను. ఒక్క నిమిషమునకు ముందు భయము, కలవరపాటు నెలకొనియున్న తావున ప్రభువు ఇప్పుడు మహానందమును కలిగించెను. కనుక యూదులు ప్రభువును స్తుతించి, కీర్తించిరి.

31. హెలియొడొరసు మిత్రులు తమ నాయకునికొరకు ప్రార్థనము చేయుమని ఓనియాసును వేడుకొనిరి. మహోన్నతుడైన ప్రభువు మృత్యువు వాతబడనున్న తమ మంత్రిని కాపాడునట్లు మనవి చేయుమని త్వరత్వరగా బతిమాలిరి.

32. తాను పంపిన ప్రతినిధికి యూదులే ఇట్టి ఆపద తెచ్చి పెట్టిరని రాజు శంకించునేమోయని ఓనియాసు భయపడెను. కనుక అతడు హెలియొడోరసు ఆరోగ్యము కొరకు బలినర్పించెను.

33. అతడు ఆ రీతిగా బలి నర్పించుచుండగా పూర్వపు యువకులిద్దరును అవే దుస్తులతో మరల హెలియొడొరసునకు దర్శనమిచ్చి యిట్లనిరి: “ఓయి! నీవు ప్రధానయాజకుడైన ఓనియాసునకు కృతజ్ఞుడవైయుండుము. అతనిని చూచియే ప్రభువు నిన్ను కాపాడెను.

34. నిన్ను శిక్షించినవాడు పరలోకాధిపతియైన ప్రభువు. కనుక నీవు వెళ్ళి ఎల్లరికిని ఆయన వైభవమును చాటిచెప్పుము.” ఇటుల చెప్పి ఆ యువకులు అదృశ్యులైరి.

35. హెలియొడోరసు ప్రభువునకు బలినర్పించెను. తన ప్రాణమును కాపాడినందులకుగాను దేవునికి మ్రొక్కులు చెల్లించెను. ప్రధాన యాజకునివద్ద సెలవు తీసికొని సైన్యముతో రాజునొద్దకు తిరిగివచ్చెను.

36. అతడు దేవాదిదేవుడగు ప్రభువు చేసిన అద్భుత కార్యమును ఎల్లరికిని విదితము చేసెను.

37. అంతట రాజు యెరూషలేమునకు మరల మన ప్రతినిధినొకనిని పంపవలెనన్నచో ఎట్టివానిని పంపవలయునో చెప్పుమని అడుగగా హెలియొడోరసు ఇట్లనెను:

38. “నీ శత్రువుగాని నీ మీద కుట్రలు పన్నువాడుగాని ఎవడైన ఉన్నచో అతనిని యెరూషలేమునకు పంపుము. అతడు మరల తిరిగిరాడు. ఒకవేళ వచ్చెనేని బాగుగా కొరడా దెబ్బలు తినిగాని రాడు. ఏదో విచిత్రమైన దైవశక్తి అచట నెలకొని ఉన్నది.

39. స్వర్గలోకవాసియైన దేవుడు ఆ దేవాలయమును కాపాడుచున్నాడు. ఆ మందిరమునకు కీడును తలపెట్టినవారిని ఆయన అక్కడికక్కడే కూలద్రోయును.”

40. హెలియొడోరసు ఆగడము నుండి ప్రభువు దేవాలయ కోశాగారమును రక్షించిన తీరిట్టిది.

 


1. దేవాలయ నిధులను గూర్చి అపోల్లోనియసునకు వార్త తెలిపి యూదులకు తిప్పలు తెచ్చిన సీమోను ఓనియాసును నిందింపసాగెను. హెలియొడోరసును రెచ్చగొట్టి అన్ని ఇక్కట్లుపాలు గావించినది ప్రధాన యాజకుడేయని నిందలుమోపెను.

2. ఓనియాసు దేవాలయమునకు దానములు చేసెను. తోడి యూదులను రక్షించెను. ప్రజలు ధర్మశాస్త్ర నియమములనెల్ల నిష్ఠతో పాటింపవలెనని అభిలషించెను. అట్టి వానిని సీమోను ప్రభుత్వమునకు ద్రోహము తలపెట్టిన వానినిగా చిత్రించెను.

3-4. మెనెసైయసు కుమారుడును పెద్దసిరియా రాష్ట్రపాలకుడు అపోల్లోనియసు సీమోను చేయు దుష్కార్యములకు చేయూతనిచ్చు చుండెను. నానాటికి సీమోను ఓనియాసు మీద వైరము పెంచుకోసాగెను. అతని అనుచరులు చాలహత్యలకు గూడ పాల్పడిరి. ఓనియాసు పరిస్థితులు విషమించి నవని గ్రహించెను.

5. కనుక అతడు రాజును చూడ బోయెను. తోడి యూదులమీద నేరము మోపవలెనని కాదుగాని ప్రజలెల్లరి శ్రేయస్సును మనసులో పెట్టుకొని అతడు రాజును దర్శింపబోయెను.

6. రాజు జోక్యము చేసికొననిదే క్రమబద్ధమైన పరిపాలనము కొనసాగ దనియు, సీమోను బుద్ది తెచ్చుకొనడనియు అతడు తలంచెను.

7. తరువాత సెల్యూకసు రాజు చనిపోగా అంటియోకసు ఎపిఫానెసు రాజయ్యెను. ఓనియాసు తమ్ముడైన యాసోను మోసముతో ప్రధానయాజకు డయ్యెను.

8. అతడు రాజును దర్శించి మూడు వందల అరువది వీసెల వెండిని వెంటనే చెల్లింతున నియు, తరువాత ఇంకను ఎనుబది వీసెల వెండిని ముట్టచెప్పుదుననియు బాసచేసెను.

9. యెరూషలేమున వ్యాయామశాలను నిర్మించుటకును, యువకదళమును ఏర్పాటు చేయుటకును, యెరూషలేము పౌరులను అంటియోకసునకు మద్దతునిచ్చువారి బృందమున చేర్చుటకు తనకు అధికారమిచ్చినచో ఇంకను నూట యేబది వీసెల వెండిని చెల్లింతుననికూడ మాట ఇచ్చెను.

10. రాజు ఆ కార్యములనన్నిటికి అనుమతి నిచ్చెను. యాసోను ప్రధానయాజకుడైన వెంటనే గ్రీకుల ఆచార వ్యవహారములను పాటింపుడని యూదులను ప్రోత్సహించెను.

11. యోహాను పూర్వపు రాజులచే యూదులకు ఇప్పించిన రాయితీలనన్నిటిని అతడు రద్దు చేయించెను. ఈ యోహాను యూపోలియసు తండ్రి. యూపోలియసు తరువాత రోమునకు వెళ్ళి అచటి ప్రభుత్వముతో సఖ్య సంబంధములు కుదుర్చు కొనివచ్చెను. యాసోను యూదుల సంప్రదాయము లను కూడ రద్దుచేయించెను. ధర్మశాస్త్రమొల్లని క్రొత్త సంప్రదాయములను ప్రవేశపెట్టించెను.

12. అతడు దేవాలయమున్న కొండచెంతనే క్రీడాగారమును నిర్మించెను. యూదుల యువకులలో ఉత్తములైన వారిని గ్రీకు సంప్రదాయానుసారముగా క్రీడలలో పాల్గొనునట్లు చేసెను.

13. యాసోను పరమ దుర్మార్గుడు, దైవభక్తి లవలేశమును లేనివాడు. అక్రమముగా ప్రధానయాజకుడైనవాడు. అతడి ప్రోద్బలమువలన ప్రజలు మితిమీరి గ్రీకు సంప్రదాయములను పాటించిరి.

14. యాజకులుగూడ ఆరాధనా కార్యక్రమమున ఆసక్తిని కోల్పోయిరి. వారు దేవాలయ సేవయందును, బలులర్పించుటయందును శ్రద్ధచూపరైరి. క్రీడాగారమున కుస్తీ పోటీలను, ఆటలను ప్రారంభింపగనే ధర్మశాస్త్ర నిషేధమునుగూడ లెక్కచేయక అచటికి పరుగెత్తెడివారు.

15. తమ పూర్వులు విలువతో చూచిన సంప్రదాయములను వారు లెక్కచేయరైరి. వారికి కావలసినది గ్రీకుల మన్నన మాత్రమే.

16. ఈ దుర్బుద్ధియే కడన వారిని నాశనము చేసెను. ఎవరి జీవితవిధానమును తాము మెచ్చుకొనిరో, ఎవరి ఆచారవ్యవహారములను తామనుకరింపచూచిరో, ఆ ప్రజలే వారి శత్రువులై వారిని నాశనము చేసిరి.

17. ప్రభువు విధులను విడనాడుట శ్రేయోదాయకము కాదని ఈ క్రింద వర్ణించిన సంఘటనలనుండి అర్థము చేసికోవచ్చును.

18. ఒక పర్యాయము తూరు పట్టణమున ఐదేండ్లకొక సారి జరుగు క్రీడలకు రాజుకూడ హాజరయ్యెను.

19. దుర్మార్గుడగు యాసోను, యెరూషలేమున రాజునకు మద్దతునిచ్చువారి బృందమునుండి కొందరు సభ్యులను పై క్రీడలకు ప్రతినిధులుగా పంపెను. వారు హెర్కులేసు దేవతకు బలినర్పించుటకు మూడు వందల వెండి నాణెములను తీసికొనిపోయిరి. కాని ఆ సొమ్మును కొనిపోయినవారుకూడ దానిని బలికి వినియోగించుట ఉచితముకాదని ఎంచిరి.

20. కనుక హెర్కులేసునకు బలినర్పించుటకు ఉద్దేశించిన సొమ్మును కడన యుద్ద నావల నిర్మాణమునకు వినియోగించిరి.

21. ఐగుప్తున ఫిలోమేటరు రాజు పట్టాభిషేకము జరుగుచుండగా అంటియోకసు మెనెస్తియసు కుమారుడు అపోల్లోనియసును ఆ ఉత్సవమునకు పంపెను. ఆ సందర్భమున అంటియోకసు, ఫిలోమేటరు తన రాజకీయ సూత్రములపట్ల ఇష్టము చూపుటలేదని గ్రహించెను. కనుక అతడు తన రాజ్యమును సురక్షితము చేసికోగోరి యొప్పాకును, అచటినుండి యెరూషలేమునకు వెళ్ళెను.

22. అచట యాసోను, పురప్రజలు అతనికి బ్రహ్మాండమైన స్వాగతమును ఏర్పాటుచేసిరి. వారు దివిటీలు పట్టుకొని నినాదములు చేయుచు రాజుకు ఎదురేగి అతనిని తోడ్కొనివచ్చిరి. అటుతరువాత అంటియోకసు తన సైన్యముతో యెరూషలేమునుండి ఫినిషియాకు వెడలిపోయెను.

23. మూడేండ్లు కడచిన తరువాత యాసోను రాజునొద్దకు మెనెలాసును పంపెను. ఇతడు పైని పేర్కొనిన సీమోను తమ్ముడు. రాజునొద్దకు ధనమును కొని పోవుటకును, కొన్ని ముఖ్యమైన రాజకీయ వ్యవహారములను గూర్చి రాజు నిర్ణయమును తెలిసికొనుటకును యాసోను అతనిని పంపెను.

24. కాని మెనెలాసు రాజును సందర్శించినపుడు తాను గొప్ప అధికారము కలవానివలె నటనచేసి అతని మన్ననను చూరగొనెను. అతడు పూర్వము ప్రధానయాజక పదవిని సంపాదించుటకు సమర్పించిన సొమ్ముకంటె మూడువందల వీసెల వెండిని అదనముగా రాజుకు చెల్లించి, ప్రదాన యాజకుడయ్యెను.

25. కడన రాజు తనను ప్రధాన యాజకునిగా నియమించిన పత్రమును తీసికొని యెరూషలేమునకు తిరిగివచ్చెను. కాని రాజాజ్ఞ ఒక్కటి తప్ప అతనికి ఆ పదవిని అలంకరించుటకు ఎట్టి అర్హతలేదు. అతడు క్రూరుడైన నియంతవంటివాడు. భీకరమైన వన్యమృగమువంటివాడు.

26. ఆ రీతిగా పూర్వము అన్నను మోసగించి ప్రధానయాజకుడైన యాసోను ఇప్పుడు మరియొకని మోసమునకు గురియై అమ్మోను దేశమునకు పారిపోయెను.

27. ఇచట మెనెలాసు ప్రధానయాజకుడుగా కొనసాగెనుగాని రాజునకు చెల్లింతునన్న సొమ్ము చెల్లింపడయ్యెను.

28. యెరూషలేము దుర్గమునకు అధిపతియైన సోస్ట్రాటసు అతనిని సొమ్ము చెల్లింపుమని పీడించెను. రాజునకు ముట్టవలసిన పైకము వసూలు చేయుట అతని పూచీ. కడన సొమ్ము విషయమై రాజు వారిని ఇద్దరిని తన సమక్షమునకు పిలిపించెను.

29. మెనెలాసు తన తమ్ముడు లూసిమాకసును తనకు బదులుగా ప్రధాన యాజకునిగా నియమించెను. సోస్ట్రాటసు సైప్రసు నుండి కూలికి వచ్చిన సైనికులకు నాయకుడైన క్రీటెసును తనకు బదులుగా దుర్గాధిపతిని చేసెను.

30. ఈ గొడవలు ఇట్లుండగా సిలిషియా దేశములోని తర్సూసు, మల్లూసు పట్టణములలో తిరుగుబాటు ప్రారంభమయ్యెను. ఎందుకనగా రాజు ఈ నగరములను తన ఉంపుడుకత్తెయైన అంతియోకిసునకు బహుమతిగానిచ్చెను.

31. కనుక రాజు తన ప్రధానోద్యోగులలో ఒకడైన అండ్రోనికసును దేశమునకు అధికారిగా నియమించి తాను త్వరత్వరగా ఆ నగరములను చూడబోయెను.

32. మెనెలాసు మంచి అదను లభించినదని ఎంచి తాను దేవాలయమునుండి అపహరించిన బంగారు పరికరములలో కొన్నిటిని అండ్రోనికసునకు బహుమతిగానిచ్చెను. మిగిలిన వానిని అతడు అంతకు పూర్వమే చేరువలోని పట్టణముల పౌరులకును తూర్పు నగర వాసులకును అమ్మివేసెను.

33. ఓనియాసు ఈ సంగతులెల్ల తెలిసికొనెను. అతడు స్వీయ రక్షణార్థము అంటియోకియా సమీపమున నున్న డాఫ్నే నగరములోని ఒక దేవళమున తలదాచు కొని, అచటినుండి మెనెలాసుపై నేరము తెచ్చెను.

34. అందుచేత మెనెలాసు ఓనియాసును హత్యచేయుమని అండ్రోనికసును రహస్యముగా పురికొల్పెను. అండ్రోనికసు ఓనియాసును కలిసికొనెను. తన కుడిచేతిని ఓనియాసు చేతులలో పెట్టి అతనికి ఎట్టి ఆపద కలుగదని బాస చేసెను. ఓనియాసు దేవాలయమును వీడుటకు వెనుకాడుచున్నా అండ్రోనికసు అతనికి నచ్చజెప్పి అతనిని మోసముతో దేవాలయము నుండి వెలుపలికి తోడ్కొని వచ్చెను. అట్లు ఆశ్రయ స్థానమునుండి వెలుపలికి రాగానే అండ్రోనికసు ఓనియాసును అధర్మముగా హత్య చేసెను.

35. యూదులును అన్యజాతి వారు గూడ అండ్రోనికసు చర్యను మిగుల గర్హించిరి.

36. రాజు సిలిషియా దేశమునుండి తిరిగి రాగానే అంటియోకియాలోని యూదులును, ఆ హత్యను అంగీకరింపని గ్రీకులును అతనివద్దకు పోయి ఓనియాసును అన్యాయముగా వధించుట గూర్చి పిర్యాదు చేసిరి.

37. అంతియోకసు ఓనియాసు హత్యను గూర్చి విని చాల విచారించెను. ఓనియాసు వివేకమును సంయమమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ రాజు దుఃఖముతో కన్నీరు కార్చెను.

38. అతడు అండ్రోనికసు మీద మహాకోపము తెచ్చుకొని అతని రాజవస్త్రములను చించివేసెను. అండ్రోనికసు బట్టలు ఊడదీయించి అతనిని నగరము నడివీధులలో గుండ నడిపించెను, రాజాజ్ఞపై భటులు అతనిని పూర్వము తాను అపవిత్రమైన హస్తములతో ఓనియాసును హత్య చేసిన స్థలమునకే తీసికొని వచ్చిరి. ఆ తావుననే వారు ఆ హంతకుని గూడ మట్టుబెట్టిరి. ఆ రీతిగా ప్రభువు ఆ పాపికి తగినశిక్ష విధించెను.

39. లూసిమాకసు కూడ తన అన్న మెనెలాసు అనుమతితో దేవాలయమున అనేక మారులు దొంగతనముచేసి బంగారు పరికరములను అపహరించెను. ఈ సంగతి తెలిసికొని ప్రజలతని మీదికి గుంపులు గుంపులుగా వచ్చిరి.

40. రెచ్చిపోయిన ప్రజలు తనకెట్టి విపత్తు తెచ్చిపెట్టుదురోయని భయపడి లూసిమాకసు సాయుధులైన సైనికులను మూడువేల మందిని జనుల మీదికి పంపెను. ఆ సైన్యమునకు ఔరానసు నాయకుడు. అతడు ప్రాయము చెల్లినవాడు, మిగుల బుద్దిహీనుడు.

41. అప్పటికే దేవాలయ ప్రాంగ ణమున గుమిగూడియున్న యూదులు లూసిమాకసు తమ మీదికి దండును పంపెనని గ్రహించిరి. వారిలో కొందరు రాళ్ళను కొయ్య ముక్కలను ఏరుకొనిరి. మరికొందరు పీఠము ప్రక్కనున్న బూడిదను గుప్పిళ్ళతో తీసికొనిరి. కలవరపాటుతో ఆ వస్తువులన్నిటిని లూసిమాకసు మీదికిని, అతని సైనికుల మీదికిని విసరిరి.

42. ఆ గందరగోళమువలన లూసిమాకసు దండులో కొందరు చచ్చిరి కొందరు గాయపడిరి. కొందరు పారిపోయిరి. దేవాలయమున దొంగతనము చేసిన లూసిమాకసును గూడ ప్రజలు కోశాగారము చేరువలోనే వధించిరి.

43. పై సంఘటనకుగాను యూదులు మెనెలాసు మీద నేరము తెచ్చిరి.

44. అంతలో రాజు తూరు పట్టణమును దర్శింపరాగా యెరూషలేములోని పెద్దలు ముగ్గురు దూతలనచటికి పంపి మెనెలాసు నేరమును రుజువు చేయించిరి.

45. మెనెలాసు తనకు ఓటమి తప్పదని గ్రహించి గోరుమేనసు కుమారుడైన ప్టోలమీని ఆశ్రయించెను. అతనికి పెద్దమొత్తము లంచము చెల్లించి రాజుచే తనకనుకూలముగా తీర్పు చెప్పింపుమని ప్రార్థించెను.

46. ప్టోలమీ మనము వెలుపలికి వెళ్ళి కొంచెము స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వత్తుమని నెపము పెట్టి రాజును కార్యాలయమునుండి బయటి వసారాలోనికి తీసికొనివచ్చెను. అచట అతడు మెనెలాసును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయింపుమని రాజును వేడుకొనెను.

47. కనుక రాజు పై తప్పుడు పనులకు కారకుడు మెనెలాసును విడుదల చేయించెను. అతడి మీద అభియోగము తెచ్చిన దురదృష్టవంతులు ముగ్గురికిని మరణశిక్ష విధించెను. మహాక్రూరులైన సిథియనులు సయితము వారిని నిర్దోషులుగా గణించియుండె డివారే!

48. ఆ మువ్వురు యెరూషలేము పక్షమునను, ఆ నగర పౌరుల పక్షమున, దొంగిలింపబడిన ఉపకరణముల పక్షమునను వాదించిరి. కాని వారు అన్యాయముగ, శీఘ్రముగ శిక్షను అనుభవించిరి.

49. తూరు పౌరులు ఈ తీర్పును అసహ్యించుకొనిరి. వారు చనిపోయిన దూతలను ఆదరపూర్వకముగా పాతిపెట్టి, వారియెడల తమకుగల గౌరవమును వ్యక్తము చేసిరి.

50. అధికారములో నున్నవారి ధనదాహము వలన మెనెలాసు ప్రధానయాజకుడుగా కొనసాగెను. అతని దుష్కార్యము రోజు రోజునకు పెరిగిపోగా తన వారికే తాను ప్రబల శత్రువుగా పరిణమించెను.

 1. ఈ కాలముననే అంటియోకసు ఐగుప్తు మీదికి రెండవసారి దాడిచేసెను.

2. అప్పుడు నలువది రోజుల పాటు యెరూషలేము నగరమంతటను ప్రజలు దర్శనములను చూచిరి. ఆ దర్శనములలో రౌతులు బంగారు ఆయుధములను ధరించి ఆకసమున స్వారిచేయుచున్నట్లు కనిపించిరి. ఈటెలను పట్టుకొని, కత్తులు ఝళిపించుచున్నట్లు చూపట్టిరి.

3. బారులు తీరి ఒకరితో ఒకరు పోరాడుచున్నట్లు అగుపించిరి. వారి డాళ్ళు ఒకదానితో ఒకటి ఒరసికొనుచుండెను. ఎల్లెడల ఈటెలు కనిపించెను. ఆకసమంతట బాణములు ఎగురుచుండెను. పలు విధములైన ఆయుధములును, గుఱ్ఱములకు పెట్టిన బంగారు కళ్ళెములును తళతళమెరయుచుండెను.

4. ఈ దర్శనములు శుభములనే కొనిరావలెనని పురజనులెల్లరును ప్రార్థించిరి.

5. అంతలో అంటియోకసు చనిపోయెనని వదంతులు పుట్టగా, యాసోను వేయిమంది సైనికులతో వచ్చి హఠాత్తుగా యెరూషలేమును ముట్టడించెను. ఆ సైనికులు నగర ప్రాకారములకు కావలి కాయు వారిని ఓడించి వెనుకకు తరిమి పట్టణమును స్వాదీనము చేసికొనిరి. మెనెలాసు పారిపోయి కొండ చెంతనున్న దుర్గమున దాగుకొనెను.

6. యాసోను అతని సైనికులు నిర్దయతో తోడి యూదులను ఊచకోత కోసిరి. తన జాతిని జయించుట మహాపరాజయమని యాసోను తలపడయ్యెను. అతడు తన ప్రజను తానే ఓడించుచున్నానని గుర్తింపక ఎవరినో శత్రువులను జయించుచున్నాననుకొని పొంగిపోయెను.

7. కాని యాసోను నగరముమీద అధికారమును మాత్రము కైవసము చేసికోజాలడయ్యెను. కనుక అతడు రెండవ సారి కూడ అమ్మోనీయుల దేశమునకు పారిపోవలసి వచ్చెను. అతని కుట్ర అతడికి అవమానమునే తెచ్చి పెట్టెను.

8. చివరన అతడు నీచమైన చావు చచ్చెను. అరబ్బుల రాజైన అరేటసు యాసోనుని చెరలో నుంచెను. తరువాత అతడు నగరమునుండి నగరమునకు పారిపోయెను. ఎల్లరును అతడిని వెన్నాడిరి. నీతినియమములు మీరినవాడనియు, తన జాతిని దేశమును నాశనము చేసినవాడనియు ఎల్లరతడిని అసహ్యించు కొనిరి. పిమ్మట యాసోను ఐగుప్తునకు పారిపోయెను. అచటినుండి మరల గ్రీసు దేశమునకు పలాయితు డయ్యెను. యూదులకు బంధువులైన స్పార్టా పౌరులు తనకు ఆశ్రయమిత్తురనుకొనెను గాని వారును అతనిని ఆదరింపరైరి.

9. తన మాతృదేశమునుండి చాలమంది పారిపోవుటకు కారకుడైన యాసోను కాందిశీకుడై పరదేశమున చచ్చెను.

10. అతడు చాలమందిని చంపివారి శవములను ఖననము చేయకుండనే వదలివేసెను. అతనికిని ఆ రీతినే జరిగెను. యాసోను చచ్చినప్పుడు కంటతడిబెట్టువారు లేరైరి. అతని పీనుగును ఖననము చేయువారుకాని, దానిని అతని పితరుల సమాధిలో పాతి పెట్టువారుగాని లేరైరి.

11. యెరూషలేమున జరిగిన పోరాటము గూర్చి విని అంటియోకసు యూదయా అంతయు తనపై తిరుగుబాటు చేయుచుచున్నదని ఎంచెను. అతడు వన్యమృగమువలె కోపము తెచ్చుకొని ఐగుప్తునుండి సరాసరి వచ్చి యెరూషలేమును ముట్టడించెను.

12. ఆ రాజు తన సైనికులతో తమ కంటబడినవారిని, ఇండ్లలో దాగుకొనియున్నవారిని చిత్రవధ చేయుడని చెప్పెను.

13. అట్లే వారు పెద్దలనక, పిన్నలనక, స్త్రీలనక, పిల్లలనక, కన్యలనక, చంటి బిడ్డలనక ఎల్లరిని ఊచ కోతకోసిరి.

14. మూడు రోజులలో యెరూషలేమునుండి ఎనుబది వేలమంది అదృశ్యులైరి. నలుబది వేలమంది ముట్టడిలో హతులైరి. మరియొక నలువదివేల మందిని శత్రువులు బానిసలుగా అమ్మివేసిరి.

15. ఇట్టి పాడుపని చేసినది చాలక అంటియోకసు గర్వముతో ప్రపంచమంతటిలోను మహాపవిత్రమైన యెరూషలేము దేవాలయమునకూడ ప్రవేశించెను. దేశమునకును, మతమునకును ద్రోహముచేసిన మెనెలాసే రాజును దేవాలయములోనికి తీసికొనివచ్చెను.

16. ఆ రాజు తన అపవిత్రములైన హస్తములతో మందిరములోని ఆరాధన పరికరములను తీసికొని పోయెను. దేవాలయ కీర్తిప్రతిష్ఠలను పెంపొందించుటకుగాను రాజులు దానము చేసిన వస్తువులను అతని పాపిష్టి హస్తములు కొల్లగొనిపోయెను.

17. ఆ రాజు తన విజయమును తలంచుకొని పొంగిపోయెనే కాని, ప్రజల పాపమునకుగాను తాత్కాలికముగా కోపము తెచ్చుకొనిన ప్రభువే దేవాలయమును అమంగళము కానిచ్చెనని గుర్తింపడయ్యెను.

18. ప్రజలు బహుపాపములు చేయబట్టి సరిపోయినదికాని, లేకపోయినచో అంటియోకసునకు గూడ వెంటనే శిక్షపడియుండెడిదే. అతని దుడుకుపని వమ్ము అయ్యెడిదే. సెల్యూకసు రాజు పంపగా వచ్చి, దేవాలయ కోశాగారమును పరీక్షించబోయిన హెలియొడోరసువలె అతడు కూడా కొరడా దెబ్బలు తినియుండెడివాడే.

19. ప్రభువు దేవాలయము కొరకు ప్రజలనెన్నుకోలేదు. తన ప్రజల కొరకే దేవాలయమును నిర్మింపచేసెను.

20. కనుక ఆ దేవాలయము గూడ ప్రజలవలె వినాశనమునకు గురియయ్యెను. కాని తరువాత ఆ ప్రజలవలె అదియు అభ్యుదయమును పొందెను. ప్రభువు కోపోద్రిక్తుడై దేవాలయమును విడనాడెను. కాని ఆయన కోపము శాంతించిన తరువాత దానికి మరల కీర్తియబ్బెను.

21. అంతియోకసు దేవాలయమునుండి పదునెనిమిది వందల వీసెల వెండిని దోచుకొని గబగబ అంతియోకియానకు తిరిగిపోయెను. అతనికి మిగుల పొగరెక్కగా మెట్టనేలమీద ఓడలను, సముద్రము మీద సైన్యములను నడిపింతుననుకొనెను.

22. ఆ రాజు యూదులను ముప్పుతిప్పలు పెట్టుటకు వారిమీద అధికారులను నియమించిపోయెను. యెరూషలేము మీద ఫిలిప్పును అధికారిగా నియమించెను. అతడు ప్రుగియా జాతివాడు, అంటియోకసుకంటే దుష్టుడు.

23. ఆ రీతినే గెరిజీము కొండకు అండ్రోనికసును అధికారిగా చేసెను. వీరుకాక మెనెలాసుకూడ అధికారము చెలాయించెను. అసలు అన్యజాతి అధికారుల కంటెగూడ ఇతడు తన జాతివారైన యూదులనధికముగా పీడించెను.

24. పైపెచ్చు అంతియోకసు యూదులను మిగుల ద్వేషించెను. మిసియానుండి కూలికి వచ్చిన సైనికులు ఇరువది రెండువేలమందితో అపోల్లోనియసు అను సైన్యాధిపతిని యూదయా మీదికి పంపెను. యెరూషలేమునందలి మగవారందరిని చంపవలెననియు, స్త్రీలను బాలకులను బానిసలుగా అమ్మి వేయవలెననియు రాజతడిని ఆజ్ఞాపించెను.

25. అపోల్లోనియసు యెరూషలేము ప్రవేశించి మొదట యూదులతో సంధిచేసికొనుటకు వచ్చినవానివలె నటించెను. తరువాత విశ్రాంతిదినము రాగా యూదులు పని విరమించుకొనిరి. ఆ రోజున అతని సైనికులు సాయుధులై నగరము వెలుపలికివచ్చి కవాతు చేయుచుండిరి.

26. అపోల్లోనియసు ఆ సైనిక విన్యాసమును చూడవచ్చిన వారందరిని చంపించెను. మరియు అతని సైనికులు నగరములోనికి ఉరికి పౌరులను చాల మందిని వధించిరి.

27. కాని యూదా మక్కబీయుడు దాదాపు తొమ్మిదిమంది ఇతరులు కొండలలోనికి పారిపోయి అచట వన్యమృగములవలె జీవించిరి. అశుద్ది దోషమునకు గురికాకుండుటకై వారు పర్వతములలో ఎదుగు మొక్కలను మాత్రము భుజించుచు కాలము వెళ్ళబుచ్చిరి.

 1. తరువాత రాజు అథేనియను శాసనసభ పౌరుడు ఒకనిని యూదయాకు అధికారిగా పంపెను. యూదులు తమ ఆచారములను మతమును విడనాడునట్లు అతని ద్వారా నిర్బంధము చేయించెను.

2. ఆ అధికారి యెరూషలేము దేవళమును ఒలింపియా పర్వతాధిపతియైన సేయసు దేవునకు అంకితము చేసి దానిని అపవిత్రము చేయవలెనని ఆజ్ఞాపించెను. ఆ రీతినే గిరిజీము కొండమీదనున్న దేవళమును అతిథ్యమునకు అధిపతియైన సేయసు దేవునకు అంకితము చేయవలెనని కట్టడచేసెను. ఆ కొండచెంత వసించు ప్రజలే రాజునట్లు చేయింపుమని కోరిరి.

3. ఈ చర్యను యూదులు భరింపజాలరైరి.

4. అన్యజాతివారు దేవళమును మద్యపానముతోను, వ్యభిచారముతోను నింపిరి. వారు దేవాలయ పరిసరములలోనే వేశ్యలను కూడిరి. నిషిద్ధములైన వస్తువులను మందిరములోనికి కొనివచ్చిరి.

5. ధర్మశాస్త్రము నిషేధించిన బలిపశువులను బలిపీఠముపై సమర్పించిరి.

6. యూదుడు ఎవడును విశ్రాంతి దినమును గాని, సాంప్రదాయికమైన ఉత్సవములను గాని పాటింపకూడదు. కడకు తాను యూదుడనని చెప్పుకొనుటగూడ నేరమయ్యెను.

7. ప్రతినెల రాజు పుట్టినరోజు పండుగ చేసికొనునపుడు యూదులను బలిపశువుల ప్రేవులను తినుడని ఒత్తిడి చేసిరి. డయొనీససు పండుగ వచ్చినపుడు యూదులు కూడ రెమ్మల కిరీటములు తాల్చి ఊరేగింపులో పాల్గొనవలసివచ్చెను.

8. ప్టోలమీ ప్రోత్సాహముపై చేరువలోని గ్రీకు పట్టణములలోనున్న యూదులును అచటి గ్రీకు ప్రజలవలె బలి నైవేద్యములను భుజింపవలెనని ఆజ్ఞాపించిరి.

9. గ్రీకు సంప్రదాయములను పాటింపనొల్లని యూదులను వధింపవలెనని కట్టడచేసిరి. కనుక శత్రువులు యూదులను నాశనము చేయనున్నారని ఎల్లరికిని విదితమయ్యెను.

10. ఉదాహరణనకు తమ శిశువులకు సున్నతి చేసిరన్న నెపముతో ఇరువురు తల్లులను బంధించిరి. శిశువులను ఆ తల్లుల రొమ్ములపై వ్రేలాడగట్టి వారిని నగరము చుట్టు త్రిప్పిరి. అటుపిమ్మట వారిని నగర ప్రాకారము మీదినుండి క్రిందికి పడద్రోసిరి.

11. మరియొక మారు కొందరు యూదులు ఒక కొండగుహలో ప్రోగై రహస్యముగా విశ్రాంతిదినమును జరుపుకొనిరని అధికారి ఫిలిప్పునకు తెలియవచ్చెను. అతడు వారిని సజీవముగా దహనము చేయించెను. వారు విశ్రాంతిదినముపట్ల గల గౌరవముచే ఆత్మరక్షణ కొరకు పోరాడరైరి.

12. ఈ గ్రంథమును చదువు వారిట్టి ఉపద్రవములను గూర్చి విని నిరుత్సాహపడనక్కరలేదు. మన ప్రజలను నాశనము చేయుటకు కాదుగాని, వారికి క్రమశిక్షణ నేర్పుటకొరకు ప్రభువు ఈ హింసలను కల్పించెను.

13. పాపిని చాలకాలమువరకు శిక్షింపకుండ వదలివేయుటకంటె వెంటనే శిక్షించుట భగవంతుని కరుణకు నిదర్శనము.

14. ప్రభువు అన్య జాతుల వారిని వెంటనే శిక్షింపడు. వారి పాపము పండువరకును సహనముతో వేచియుండును. కాని మన విషయమున అటులకాదు.

15. అతడు మన పాపము పండకమునుపే మనలను శిక్షించును.

16. ప్రభువు తన ప్రజలమైన మనపట్ల నిరంతరము కరుణ చూపును. అతడేదో విపత్తు పంపి మనల శిక్షించినను అంతటితో మనల చేయివిడువడు.

17. పాఠకులను హెచ్చరించుటకుగాను ఇచట నేనీ సూచన చేసితిని. ఇంతటితో ఈ విషయమును ముగించి మరల మన కథకు వత్తము.

18. వయోవృద్ధుడును, ఎల్లరి మన్ననకు పాత్రుడైనవాడునగు ఎలియాసరను ధర్మశాస్త్ర బోధకుడొకడు కలడు. పందిమాంసమును తినిపించుటకుగాను నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి.

19-20. కాని అతడు అవమానకరముగా జీవించుటకంటె గౌరవప్రదముగా చనిపోవుట మేలనియెంచెను. కనుక ఎలియాసరు తన నోటిలోని మాంసమును ఉమిసివేసి తానే స్వయముగా హింసాస్థానమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకుగూడ తెగించి ధైర్యముతో నిషిధ భోజనము విడనాడవలయునుకదా!

21. అన్యజాతుల బలులను అర్పించువారు చాలకాలము నుండి ఎలియాసరు స్నేహితులు. కనుక వారు అతనిని ప్రక్కకు తీసికొని పోయి "అయ్యా! నీవు స్వయముగా తయారు చేసికొనిన మాంసమునే తెప్పించుకొని భుజింపుము. కాని రాజాజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యము భుజించుచున్నట్లు మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును.

22. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుము" అని బ్రతిమాలిరి.

23. కాని ఎలియాసరు తన పెద్ద ప్రాయమునకును, నరసిన వెండ్రుకలకును కళంకము రాకుండునట్లుగా నిర్ణయము చేసికొనెను. బాల్యమునుండి అతడు ప్రభువు పవిత్రాజ్ఞలకు బద్దుడై జీవించెను. కనుక అతడు “మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు,

24. నా ప్రాయమువాడు ఇట్లు నటన చేయుట తగదు. నేనిట్లు చేయుదునేని మన యువకులు చాల మంది తొంబదియేండ్ల ఈడున ఎలియాసరు తన మతధర్మములను విడనాడెనని తలంపరా?

25. కొద్ది యేండ్లపాటు జీవించుటకుగాను ఇప్పుడు ఈ మాంసము భుజించినట్లు నటన చేయుదునేని నేను అపవిత్రుడనై పోయి, నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలమంది యువకులు పెడ దారిపట్టరాదు.

26. తాత్కాలికముగా నరులనుండి చావు తప్పించుకొనినంత మాత్రమున ఏమి లాభము? బ్రతికియున్నను, చనిపోయినను దేవుని తప్పించుకోజాలము గదా?

27. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డెదనేని ఇన్ని యేండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును.

28. అప్పుడు నేను యువకులకును చక్కని ఆదర్శము చూపినవాడనగుదును. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధులకొరకు ఉదారబుద్దితోను, సంతోషముతోను ప్రాణములర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారును నేర్చుకొందురు” అనెను. ఈ మాటలు పలికి ఎలియాసరు హింసాస్థానమును సమీపించెను.

29. హింసకులు అంతవరకు అతనిని ఆదరముతో చూచిరి. కాని ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసరునకు పిచ్చి పట్టినదనుకొని అతని మీద రుసరుసలాడిరి.

30. అతడు వారి కొరడాదెబ్బలకు ప్రాణములు విడచుచు చివరి గడియలలో పెద్దగా మూలిగి “ప్రభువు సంపూర్ణము, పవిత్రమునైన జ్ఞానము కలవాడు. నేనీ ఘోర యాతనలను, మరణమును తప్పించుకొని ఉండగలిగెడి వాడనని ఆయన ఎరుగును. ప్రభువు పట్లగల భయ భక్తుల చేతనే నేనీ శ్రమలను సంతోషముగా సహించుచున్నాననియు ఆయనకు తెలియును" అని పలికెను.

31. ఈ రీతిగా ఎలియాసరు మరణించెను. ఒక్క యువకులకేగాక యూదజాతికి అంతటికిని అతడి మరణము ఆదర్శప్రాయమును, చిరస్మరణీయమును అయ్యెను.

 1. మరియొకమారు శత్రువులు ఏడుగురు సోదరులను, వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పందిమాంసమును తినవలెనని వారిని నిర్బంధము చేసెను.

2. అపుడు ఆ ఏడుగురిలో ఒకడు తన సోదరుల తరపున మాటలాడుచు “రాజా! నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలిసికోగోరెదవు? మేము ప్రాణములను విడనాడుటకైన అంగీకరింతుముగాని, మా పూర్వుల చట్టములను మీరము” అనెను.

3. ఆ మాటలకు రాజు ఆగ్రహము తెచ్చుకొని గంగాళమును పెనములను నిప్పులమీద కాల్చి వేడిచేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. వారట్లే చేయగా ఆ పరికరములు ఎఱ్ఱగా కాలి గనగన మండెను.

4. తల్లి, సోదరులు చూచుచుండగనే ఆ మాటలాడిన యువకుని నాలుక కోసి అతని తలమీది చర్మము ఒలిచి, కాలుసేతులు నరికివేయుడని రాజు సైనికులను ఆజ్ఞాపించెను.

5. వారు రాజు చెప్పినట్లే ఆ యువకుని అవయవములను నరికి అతనిని మొండెముగా చేసిరి. అతడింకను ఊపిరి మాత్రము పీల్చుకొనుచుండెను. రాజు అతడిని కొనిపోయి గనగన మండుచున్న పెనముమీద పడవేయుడని ఆజ్ఞయిచ్చెను. ఆ యువకుడు పెనముమీద మాడిపోగా పొగలు పైకి లేచెను. అప్పుడు ఆ ఆరుగురు సోదరులు వారి తల్లియు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మనము ధైర్యముగా చనిపోవుదమని ఒకరితోనొకరు చెప్పుకొనిరి.

6. ఇంకను వారు “ప్రభువు మనలను గమనించుచునే ఉన్నాడు. అతడు మనలను ఆదరముతో చూచును. పూర్వము మోషే ప్రభువును విడనాడినవారిని గూర్చి పాట కట్టినపుడు ఈ సంగతియే చెప్పెను. ప్రభువు తనను సేవించువారిని తప్పక కరుణించునని అతడు పేర్కొనెను” అని అనుకొనుచు ఒకరినొకరు ప్రోత్సహించుకొనిరి.

7. ఈ రీతిగా మొదటి సోదరుడు చనిపోయిన పిమ్మట సైనికులు రెండవవాని ప్రాణములతో చెలగాటమాడ నారంభించిరి. వారు అతని తలమీది వెండ్రుకలను చర్మమును పెరికివేసిరి. “నీవు పంది మాంసము భుజింతువా లేక మమ్ము నీ శరీరమును ఖండలుగ నరికి వేయమందువా” అని అడిగిరి.

8. అతడు తన మాతృభాషలో “నేను ఆ మాంసమును ముట్టుకోను” అని చెప్పెను. కనుక సైనికులు మొదటి వానినివలె అతనినికూడ హింసించిరి.

9. అతడు చివరి సారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో “రాక్షసుడా! నీవు మమ్ము చంపిన చంపవచ్చుగాక, కాని విశ్వాధిపతియైన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించునట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్దులమై మేము ప్రాణములు కోల్పోవుచున్నాము” అని అనెను.

10. అటు తరువాత సైనికులు మూడవ సోదరుని బాధింపసాగిరి. అతడు సైనికులు ఆజ్ఞాపింపగనే నాలుకను తెరచి, చేతులు చాచెను.

11. మరియు అతడు ధైర్యముతో “దేవుడే నాకు ఈ అవయవములను దయచేసెను. కాని వీనికంటె ప్రభువు ఆజ్ఞలు విలువైనవి. ప్రభువు వీనిని నాకు మరల దయచేయును” అనెను.

12. అతని సాహసమును, అతడు హింసలను లెక్క చేయకపోవుట చూచి రాజు, అతని పరివారము విస్తు పోయెను.

13. మూడవవాడు గతించిన పిమ్మట సైనికులు నాలుగవవానినిగూడ క్రూరహింసలకు గురిచేసిరి.

14. అతడు ప్రాణములు విడచుచు “మీ చేతులలో చచ్చుట మాకు మేలే. ప్రభువు మమ్ము మరల జీవముతో లేపును. కాని మీకు పునరుత్థానము గాని నూత్నజీవము గాని లభింపవు” అనెను.

15. అటుపిమ్మట సైనికులు ఐదవవానిని హింసింప దొడగిరి.

16. అతడు రాజును తేరిపార చూచి "ఓయి! నీవు మావంటి నరుడవే. కాని మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు చేయుటకును, మా ప్రాణములు తీయుటకును నీకధికారము కలదు. అయినను నీవు ప్రభువు మా ప్రజను చేయి విడచెననుకోవలదు.

17. కొంచెము వేచియుండుము. ఆయన తన మహాశక్తితో నిన్ను నీ అనుయాయులను ఎట్లు శిక్షించునో నీవే చూతువు” అనెను.

18. అటు తరువాత సైనికులు ఆరవ వానిమీద చేతులు వేసిరి. అతడు చనిపోవుచు శత్రువులను చూచి “మీరు భ్రాంతిపడవలదు. మేము దేవునికి విరోధముగా పాపముచేసి ఇట్టితిప్పలు తెచ్చుకొంటిమి. ఈ ఘోర యాతనలన్నిటికి కారణము మా తప్పిదములే.

19. కాని మీరు దేవునితో పోరాడుచున్నారు. కనుక మీకు శిక్ష ఎంతమాత్రము తప్పదు” అని పలికెను.

20. కాని ఆ యువకులందరికంటె వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది. ఎల్లరును జ్ఞప్తిలో ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్కరోజునే ఆమె తన ఏడుగురి కుమారుల మరణము కన్నులార చూచెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదననంతటిని ధైర్యముతో భరింపగల్లెను.

21. ఆమె స్త్రీ ప్రేమను, పురుష ధైర్యమును గూడ వ్యక్తము చేయుచు తన కుమారులలో ఒక్కొక్కనిని మాతృ భాషలో ఇట్లు ప్రోత్సహించెను.

22. “నాయనలారా! మీరు నా కడుపునెట్లు ఊపిరిపోసికొంటిరో నేనెరుగను. మీకు జీవమును, ఊపిరిని ఇచ్చినది నేనుకాదు. మీ అవయవములను ఒక్కటిగా అమర్చినది నేను కాదు.

23. ప్రపంచమును సృజించినవాడును, నరులను పుట్టించినవాడును, అన్ని ప్రాణులను చేసినవాడునైన దేవుడే మిమ్ము కలిగించెను. మీరు మీ ప్రాణముల కంటెగూడ ఆ ప్రభువు ఆజ్ఞలను అధికముగా గౌరవించుచున్నారు కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరల జీవమును, ఊపిరిని దయచేయును.”

24. ఆ తల్లి మాటలు విని అంటియోకసు ఆమె తనను ఎగతాళి చేయుచున్నదనుకొనెను. కనుక అతడు ఆమె కడగొట్టు కుమారునికి తన పూర్వుల సంప్రదాయములను విడునాడుమని శక్తికొలది చెప్పిచూచెను. ఆ బాలుడు తన మాటవినినచో తాను అతనిని ధనవంతుని, సుప్రసిద్ధుని చేయుదునని బాసచేసెను. ఇంకను అతనిని గొప్ప అధికారిని చేసి రాజమిత్రుల జాబితాలో చేరునని కూడ చెప్పెను.

25. కాని ఆ బాలుడు రాజు మాటలను లక్ష్యము చేయలేదు. కనుక రాజు ఆ బాలుని ఒప్పించి అతడి ప్రాణములను కాపాడుమని తల్లిని హెచ్చరించెను.

26. అతడు చాలసేపు నచ్చచెప్పిన తరువాత ఆ తల్లి కుమారుని హెచ్చరించుటకు అంగీకరించెను.

27. ఆమె పుత్రుని మీదికి వంగి క్రూరుడైన ఆ రాజునకు తలవంపులు కలుగునట్లుగా మాతృభాషలో ఇట్లు చెప్పెను: “నాయనా! నా పైని జాలి చూపుము. నిన్ను తొమ్మిదినెలలు నా కడుపున మోసితిని. మూడేండ్లు పాలిచ్చి పెంచితిని. నిన్ను అన్నపానీయములతో పోషించి ఈ ఈడువానినిగా చేసితిని.

28. బిడ్డా! నీవు భూమ్యాకాశములను, వానిలో కనిపించు సమస్త వస్తువులను పరిశీలించి చూడుము. దేవుడే శూన్యమునుండి వాని నన్నిటిని కలిగించెనని తెలిసికొనుము. ఆయన నరులనుకూడ అట్లే కలిగించెను,

29. నీవు ఈ నరహంతను చూచి భయపడవలదు. ఇపుడు నీ ప్రాణములర్పించి నీవును నీ సోదరులకు తగినవాడివి అనిపించుకొనుము. ఇట్లు చేయుదువేని నేను ప్రభువు అనుగ్రహము వలన, నీ సోదరులతోపాటు నిన్నును మరల స్వీకరింపగలుగుదును.”

30. ఆమె ఈ మాటలను ముగింపక మునుపే బాలుడు “రాజా! నీవింకను దేనికొరకు వేచియున్నావు? నేను నీ ఆజ్ఞను పాటింపను. మోషే మా పితరుల కిచ్చిన ధర్మశాస్త్ర విధులను మాత్రమే అనుసరింతును.

31. నీ మట్టుకు నీవు మా ప్రజలను సకల విధములైన క్రూరహింసలకు గురిచేయ చూచితివి. నీవు ప్రభువు శక్తిని తప్పించుకోజాలవు.

32-33. సజీవుడైన ప్రభువు మా మీద ఆగ్రహముచెందిన మాట నిజమే. ఆయన మా పాపములకుగాను మమ్ము దండించుచున్నాడు. మమ్ము శిక్షించి మాకు బుద్ధిచెప్పవలెనని ఆయన తలంపు. కాని మేమతని దాసులము కనుక అనతి కాలములోనే ఆయన మమ్ము క్షమించును.

34. నీవు మాత్రము నరులందరిలోను మహాక్రూరుడవు. మహా పాపివి. నీవేమో గొప్పవాడవనుకొని భ్రాంతిపడి కన్ను మిన్నుగానక దేవుని ప్రజలను హింసించుచున్నావు.

35. నీవు సర్వశక్తిమంతుడును, సర్వమును పరిశీలించువాడైన దేవుని తప్పించుకోజాలవు.

36. నా సోదరులు ప్రభువు నిబంధనలకు బద్దులై క్షణకాలము శ్రమలనుభవించిరి. కాని ఇప్పుడు వారు నిత్యజీవ మును చూరగొనిరి. నీవు మాత్రము దేవుని తీర్పునకు గురియై, నీ మిడిసిపాటునకు తగిన దండనము అనుభవించి తీరెదవు.

37. నా సోదరులవలె నేనును మా పూర్వుల చట్టముల కొరకు నా శరీరమును, ప్రాణములను బలిగా అర్పించుచున్నాను. కాని దేవుడు మా జాతిమీద శీఘ్రమే దయచూపవలెననియు ప్రభువే దేవుడని అంగీకరించువరకు ఆయన నిన్ను హింసింపవలెననియు నేను ప్రార్థించుచున్నాను.

38. ప్రభువు కోపము మా జాతియంతటి మీదను రగుల్కొనెను. కాని ఆయన ఆగ్రహమునకు గురియైన వారిలో నా సోదరులును నేను కడపటి వారలమగుదుముగాక!" అని పల్కెను.

39. అవమానకరములైన ఆ మాటలు విని రాజు మితిమీరిన ఆగ్రహము తెచ్చుకొని ఆ బాలకుని సోదరులందరికంటె గూడ క్రూరముగా హింసించెను.

40. ఆ రీతిగా కడగొట్టువాడుకూడ గతించెను. అతడు ప్రభువునెంత మాత్రమును శంకింపక పూర్ణ విశ్వాసము కనబరచెను.

41. శత్రువులు కుమారులందరి తరువాత తల్లినిగూడ సంహరించిరి.

42. శత్రువులు యూదులను బలినైవేద్యములు భుజింపవలెనని నిర్బంధ పెట్టుట గూర్చియు, వారిని క్రూరముగా హింసించుటను గూర్చియు ఈ సంగతులు చాలును.

1. యూదా మక్కబీయుడు, అతని అనుచరులు రహస్యముగా గ్రామగ్రామము తిరిగి యూదమతమును నిష్ఠతో పాటించువారిని ఆరువేల మందిని ప్రోగుజేసి కొనిరి.

2. వారు వివిధ జాతులచే పీడింపబడు యూద జాతిని, అన్యజాతులు అమంగళము చేసిన దేవాలయమును, పాడుపడి నేలమట్టమైయున్న యెరూషలేము నగరమును కరుణతో చూడుమని దేవునికి మనవి చేసిరి.

3. మరియు ప్రభువు హత్యకు గురియైన వారి మొరను ఆలింపవలెననియు,

4. అన్నెముపున్నెము ఎరుగని పసిబిడ్డలను చంపినవారిని, తనను దూషించిన వారిని దండింపవలెననియు వేడుకొనిరి.

5. యూదా మక్కబీయుడు తన జనమును ప్రోగుజేసికొనిరాగా, అన్యజాతివారు అతనిని ఎదిరింపజాలరైరి. ప్రభువు పూర్వము యూదులమీద కోపము చూపెను. కాని ఇప్పుడు ఆ కోపము కరుణగా మారెను.

6. యూదా తలవని తలంపుగా నగరముల మీదను, పల్లెలమీదను, దాడిచేసి వానిని కాల్చివేయ మొదలిడెను. కీలకమైన దుర్గములను పట్టుకొని శత్రువులను తరిమికొట్టెను.

7. అతడు మామూలుగా రాత్రులలో ఈ దాడులు చేసెడివాడు. ప్రజలెల్లరు అతడి పరాక్రమమును గూర్చి చెప్పుకొనసాగిరి.

8. యెరూషలేమునకు పాలకుడుగానున్న ఫిలిప్పు మక్కబీయుడు నానాటికి బలము పుంజుకొని విజయములు సాధించుచున్నాడని గ్రహించెను. కనుక అతడు పెద్దసిరియాకు అధిపతిగానున్నప్టోలమీకి కమ్మ వ్రాసెను. అతడు సేనలను పంపి రాజునకు సహాయము చేయకోరెను.

9. ప్టోలమీ, నికానోరును సైన్యాధిపతిగా ఎన్నుకొనెను. అతని తండ్రియగు పట్రోక్లసు రాజమిత్రులలో అగ్రగణ్యుడు, షోల యూద జాతినంతటిని తుడిచిపెట్టుటకుగాను నానాజాతులనుండి ఇరువది వేలమంది సైనికులనెన్నుకొని, వారిని నికానోరు వెంట పంపెను, నికానోరునకు తోడుగా రణరంగమున కాకలు తీరిన గోరియాసును కూడ పంపెను.

10. అంతియోకసు రాజు రోమీయులకు రెండువేల వీసెల వెండి అప్పు బడియుండెను. పోరున బందీలైన యూదులను బానిసలుగా అమ్మి ఆ అప్పులను తీర్పవచ్చునని నికానోరు ఆశించెను.

11. కనుక అతడు వెంటనే సముద్రతీర నగరములకు మనుష్యులను పంపి తాము వీసె వెండికి తొంబదిమంది యూద బందీలను బానిసలుగా అమ్ము చున్నామని ప్రకటనము చేయించెను. కాని సర్వోన్నతుడైన ప్రభువు నికానోరునకు ఎట్టి తీర్పు విధింపనున్నాడో అతడికి తెలియదయ్యెను.

12. నికానోరు సైన్యముతో తన మీదికి దండెత్తి వచ్చుచున్నాడని యూదా వినెను. అతడు తన అనుచరులకు ఆ సంగతి తెలియజేసెను.

13. వారిలో పిరికివారు, ప్రభువు సహాయమును నమ్మనివారు వెంటనే కాలికి బుద్ధి చెప్పిరి.

14. మిగిలినవారు తమ ఆస్తి పాస్తులను అమ్ముకొనిరి. దుర్మార్గుడు నికానోరు తమను కలువకముందే, అతనిచే బానిసలుగ అమ్మబడినవారిని కాపాడమని వారు ప్రభువును వేడుకొనిరి.

15. వారు ప్రభువు తమకొరకు తమను కాపాడకున్నను, పూర్వము తాను పితరులతో చేసికొనిన నిబంధనను బట్టియు, ఇప్పుడు తమను తన ప్రజగా ఎన్నుకొనుట బట్టియు, తమను కాపాడవలెనని మనవి చేసికొనిరి.

16. యూదా తన ఆరువేల మంది బంటులను ప్రోగుజేసికొనెను. శత్రువులను చూచి భయపడవలదని వారిని హెచ్చరించెను. అకారణముగా తమమీదికి దాడిచేసిన అన్యజాతి వారి బలమును చూచి వెనకంజ వేయవలదని చెప్పెను. ధైర్యముతో పోరాడుడని వారిని ప్రోత్సహించెను.

17. అన్యజాతి వారు దేవాలయమును నాశనము చేసి, యెరూషలేమును పాడుచేసి, యూదుల ఆచారములను మంటగలిపిరని చెప్పెను.

18. “శత్రువులు వారి ఆయుధముల మీదను, సాహసము మీదను ఆధారపడవచ్చుగాక. మనము మాత్రము సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడు వారలము, ఆయన తల ఊపినంతనే ఈ శత్రుసైన్యములేకాక సర్వప్రపంచము బుగ్గి అగును" అని పలికెను.

19. ఇంకను యూదా పూర్వము ప్రభువు యూదులకు తోడ్పడిన సందర్భములనుగూడ వారికి జ్ఞప్తికి తెచ్చెను. సన్హారీబు కాలమున శత్రువులు లక్ష ఏనుబది ఐదువేల మంది మడిసిరి.

20. బబులోనియా దేశమున జరిగిన గలాతియా యుద్ధమున ఎనిమిది వేలమంది యూదులు ఆపదలోనున్న నాలుగువేలమంది మాసిడోనియనులకు సాయముచేసిరి. ఆ ఎనిమిదివేలమంది దైవబలముతో నూట ఇరువదివేలమంది గలతీయులను ఓడించి కొల్లసొమ్మును దోచుకొనిరి.

21. సైనికులు యూదా మాటలు విని ధైర్యము తెచ్చుకొని తమ దేశము కొరకును, ధర్మశాస్త్రము కొరకును ప్రాణములు అర్పించుటకుకూడ సంసిద్ధులైరి. అతడు తన సైన్యమును నాలుగు భాగములుగా విభజించెను.

22. ఒక్కొక్కదానిలో పదిహేను వందల మంది సైనికులుండిరి. ఆ నాలుగు భాగములకు తాను, తన ముగ్గురు సోదరులగు సీమోను, యోసేపు, యోనాతాను నాయకులైరి.

23. అంతట అతడు ఎలియాసరును పవిత్ర గ్రంథము చదివి వినిపింపుమని ఆజ్ఞాపించెను. “ప్రభువు నుండి మనకు సహాయము లభించును" అను వాక్యమును యుద్ధనాదముగా వాడుకోవలెనని చెప్పెను. తదనంతరము తన దళముతోపోయి నికానోరు సైన్యము మీద పడెను.

24. ప్రభువు వారి తరపున పోరాడగా వారు శత్రు సైన్యమున తొమ్మిదివేలమందిని చంపిరి. చాల మందిని గాయపరచిరి. విరోధి బలగమునంతటిని తరిమికొట్టిరి.

25. తమను బానిసలుగా కొనవచ్చిన వారియొద్దనుండి సొమ్ములాగుకొనిరి. అటుపిమ్మట శత్రువులను చాల దూరమువరకు వెన్నాడి వెనుకకు మరలివచ్చిరి.

26. విశ్రాంతిదినము ప్రారంభము కానున్నది కనుక విరోధులను ఇంకను దూరమువరకు తరుమజాలరైరి.

27. తదనంతరము శత్రువుల ఆయుధములను, కొల్లసొమ్మును ప్రోగుజేసికొని విశ్రాంతి దినమును పాటించిరి. ఆ దినమున ప్రభువు వారిపట్ల తనకుగల కరుణకు మొదటి ఆనవాలు చూపెను గనుక వారతనిని కొనియాడిరి.

28. విశ్రాంతిదినము ముగిసిన పిదప కొల్లసొమ్ములో కొంతభాగమును హింసలకు గురియైనవారికి, వితంతువులకు, అనాథ బాలలకు పంచియిచ్చిరి. మిగిలిన సొమ్మును తామును, తమ పిల్లలును కలిసి పంచుకొనిరి.

29. అటుపిమ్మట బహిరంగ ప్రార్ధనము జరిపి కరుణాళువైన ప్రభువును తమపై దయచూపుమని వేడుకొనిరి.

30. యూదులు తిమోతి, బఖిడసులమీద కూడ యుద్ధముచేసి వారి సైనికులను ఇరువదివేలమందిని హతముచేసిరి. ఎత్తయిన దుర్గములు పట్టుకొని చాల కొల్లసొమ్మును దోచుకొనిరి. ఆ సొమ్మును తామును, వితంతువులును, అనాథ శిశువులును, వృద్ధులును, హింసలకు గురియైనవారు సమానముగా పంచుకొనిరి.

31. వారు శత్రువుల ఆయుధములను ప్రోగుజేసి ఆయా ముఖ్యమైన తావులలో భద్రపరచిరి. కొల్ల సొమ్మును మాత్రము యెరూషలేమునకు కొనిపోయిరి.

32. యూదులు తిమొతి సైన్యముల అధిపతిని మట్టుపెట్టిరి. అతడు పరమ దుర్మార్గుడు. యూదులను చాల తిప్పలు పెట్టినవాడు.

33. ఇంకను వారు యెరూషలేమున విజయోత్సవమును జరుపుకొనుచు దేవాలయ ద్వారములను తగులబెట్టిన వారిని బంధించి సజీవముగా దహించిరి. వారిలో కలిస్తెనీసుకూడ ఉండెను. అతడొక చిన్న ఇంటిలో దాగుకొనియుండి పట్టుబడెను. ఆ రీతిగా వారు తమ దుర్మార్గమునకు తగిన ప్రతిఫలమును అనుభవించిరి.

34. పరమ దుర్మార్గుడైన నికానోరు యూదులను కొనుటకుగాను వేయిమంది బేరగాండ్రను తీసికొని వచ్చెనుగదా!

35. అతడు ఎవరిని చిన్నచూపు చూచెనో వారిచేతనే, దైవబలమువలన ఓడింపబడెను. అతడు తాను తాల్చియున్న వైభవోపేతములైన ఉద్యోగ వస్త్రములను తొలగించి పలాయనము చిత్తగించు బానిసవలె ఒంటరిగా పొలముగుండ పారిపోయెను. తన సైన్యమునంతటిని కోల్పోయెనుగాని అదృష్ట వశమున తాను మాత్రము ప్రాణములతో అంటియోకియా చేరుకొనెను.

36. యెరూషలేము పౌరులను బానిసలుగా అమ్మి రోమునకు బాకీపడియున్న సొమ్మును తీర్పగోరిన ఇతడు కడన యూదులు అజేయులని తెలిసికొనెను. వారు ప్రభువు దయచేసిన ఆజ్ఞలు పాటించిరి కనుక ప్రభువే వారికి రక్షకుడయ్యెను. 

 1. ఇదే కాలమున అంటియోకసు రాజు యుద్ధమున ఓడిపోయి పారశీకమునుండి తిరిగి రావలసి వచ్చెను.

2. అతడు ఆ దేశమున పెర్సెపోలిసు నగరమును ముట్టడించి దానిని స్వాధీనము చేసికొని అందలి దేవళమును దోచుకోగోరెను. కాని ఆ నగర పౌరులు ఆయుధములు చేపట్టి రాజును ఎదిరించిరి. కనుక అతని సైన్యము అవమానముతో వెనుకకు మరలవలసి వచ్చెను.

3. అతడు ఎక్బటానాను చేరు కొనగానే నికానోరు, తిమొతి సైన్యములు ఓడిపోయెనని వినెను.

4. దానితో ఆ రాజు మహోగ్రుడయ్యెను. తనను ఓడించినందుకుగాను యూదులకు బుద్ది చెప్ప వలెనని తలంచెను. కనుక అతడు రథమును ఎచ్చటను ఆపక ఎకాయెకి యెరూషలేమునకు తోలుమని తన సారథిని ఆఙ్ఞాపించెను. “నేను యెరూషలేము చేరగనే ఆ నగరమును శ్మశానముగా మార్చెదను" అని మహా గర్వముతో శపథము చేసెను. కాని ప్రభువు శిక్షకూడ తన వెనువెంటనే వచ్చుచున్నదని అతడు ఎరుగడయ్యెను.

5. అంటియోకసు పై మాటలు పలుకగనే అన్నిటిని గమనించు యిప్రాయేలు దేవుడు అతడిని ఏదో గుర్తుతెలియని మహారోగముతో పీడింపమొదలిడెను. అతని పేగులలో ఘోరమైన బాధపుట్టెను. ఆ బాధకు ఉపశాంతిలేదయ్యెను.

6. అనేకుల కడుపునకు చిచ్చు పెట్టిన వానికి ఈ కడుపునొప్పి సముచితమైన శిక్షయే కదా!

7. ఈ వేదన వలన గూడ ఆ రాజు గర్వము అణగదయ్యెను. అతని పొగరు ఇంకను పెరిగిపోయెను. అతడు మహాగర్వముతో యూదులమీద నిప్పులు క్రక్కుచు రథమును మరింత వేగముగా తోలుమని సారథిని ఆజ్ఞాపించెను. కాని అతడు వేగముగా పరుగెత్తు రథమునుండి క్రిందపడెను. ఆ దెబ్బతో అతని ఎముకలన్నియు గుల్ల అయ్యెను.

8. ఆ రాజు మహా దర్పముతో తాను మానవమాత్రుడను కాననియు సముద్ర తరంగములను ఆజ్ఞాపింపగలను అనియు, మహా పర్వతములను తక్కెడలో తూచగలననియు విఱ్ఱవీగుచుండెను. అట్టివాడు ఇప్పుడు దిఢీలున నేల మీద వెల్లకిలబడగా భటులు పాడెమీద మోసికొని పోవలసివచ్చెను. ఈ ఘటన ద్వారా ఎల్లరును ప్రభువు శక్తిని గుర్తించిరి.

9. ఆ నాస్తికుని శరీరము పురుగులతో లుకలుకలాడెను. అతడు మహావేదనతో రోజులు గడిపెను. సజీవుడై యుండగనే అతని శరీరముకుళ్ళి కంపుకొట్టెను. ఆ కంపును అతని సైన్యమంతయు చీదరించుకొనెను.

10. దుర్వాసనకు వెరచి సైనికులెవరును అతనిని మోయుటకు దగ్గరికి రారైరి. అయినను ఆ రాజు కొద్దికాలమునకు పూర్వము తాను ఆకసమునందలి చుక్కలను తాకుదుననుకొనెను.

11. అంటియోకసు దైవశిక్షకు లోనై యెడతెగని ఘోరబాధలు అనుభవించెను. ఆ దురవస్థవలన కనువిప్పు కలిగి తన మిడిసిపాటును కొంచెము తగ్గించు కొనెను.

12. ఆ రాజు తన దుర్వాసనను తానే భరింపజాలడయ్యెను. అప్పుడతడు “నరమాత్రులు దేవునికి లొంగియుండవలయునుగాని తాము దేవునితో సమానులమనుకొనరాదు" అని పలికెను.

13. ప్రభువు మాత్రము అతడిమీద కరుణజూపుట మానివేసెను. కాని ఆ నీచుడు ప్రభువును ప్రార్థించి ఇటుల బాసచేసెను:

14. “నేను యెరూషలేమును నేలమట్టము చేసి, దానిని యూదుల శ్మశానస్థలముగా మార్చివేయవలెనని అనుకొంటిని. కాని ఇప్పుడు ఆ నగరమును స్వతంత్ర పట్టణముగా గణించెదను.

15. నేను యూదుల శవములను, వారి బిడ్డల శవములను పక్షులకును, వన్యమృగములకును ఆహారముగా పడవేయవలెననుకొంటిని. వారి పీనుగులను పాతిపెట్టనవసరము లేదని ఇంచితిని. కాని యిప్పుడు వారికి ఆతెన్సు పౌరులతో సమానమైన హక్కులను ప్రసాదింతును.

16. పూర్వము నేను దేవాలయమును కొల్ల గొట్టి అందలి పాత్రములను కొనిపోయితిని. కాని యిప్పుడు ఆ దేవాలయమునకు మేలైన కానుకలను అర్పింతును. పూర్వము నేను కొనిపోయిన వానికంటె మెరుగైన పాత్రలను సమర్పింతును. అందలి బలులకు అగు ఖర్చులకు నా సొంత సొమ్ము వెచ్చింతును.

17. పై పెచ్చు నేను స్వయముగా యూదమతమును స్వీకరింతును. ప్రజలు వసించు ప్రదేశములకెల్ల వెళ్ళి ప్రభువు మహిమను ప్రకటింతును.”

18. అంతియోకసు బాధలకు ఉపశమనము లేదయ్యెను. ప్రభువు అతనిని ఉచితరీతిని శిక్షించెను. ఆ రాజు నిరాశకు లొంగిపోయి యూదులకు ఇట్లు కమ్మ ప్రాసెను:

19. 'రాజును సైన్యాధిపతియునగు అంటియోకసు తన పౌరులలో మిక్కిలి యోగ్యులగు యూదులకు శుభములు పలికి వ్రాయునది. మీకు ఆయురారోగ్య భాగ్యములు చేకూరునుగాక!

20. మీరును, మీ బిడ్డలును సుఖముగా ఉండవలెననియు, మీరు తలపెట్టిన కార్యములెల్ల విజయవంతము కావలెననియు నా కోరిక. దేవుడే నాకు దిక్కు

21. మీరు పూర్వము నా పట్ల చూపిన ఆదరాభిమానములను నేను సంతసముతో జ్ఞప్తికి తెచ్చుకొను చున్నాను. నేను పారశీకమునుండి తిరిగివచ్చుచు మార్గములో తీవ్రవ్యాధికి గురియైతిని. ఇప్పుడు నా దేశప్రజల క్షేమమెంచి కార్యములను చక్కబెట్టవలయునని నిశ్చ యించితిని.

22. నాకు ఆరోగ్యము చేకూరదన్న భయమేమిలేదు. నా వ్యాధి తప్పక కుదురును.

23. మా తండ్రి యూఫ్రటీసునకు తూర్పుననున్న దేశముల మీదికి దండయాత్ర చేయునపుడెల్ల తనకు వారసుని నియమించి పోయెడివాడు.

24. తలవని తలంపుగా ఏ విపత్తయిన వాటిల్లినను, ఎట్టి విషాదకరమైన వార్తలు అందినా, పౌరులు కలతచెందక తమ దేశము ఎవరి అధీనముననున్నదో గ్రహింతురని అతడు అటుల చేసెడివాడు.

25. పైగా మా దేశపు సరిహద్దులలో ఏలుబడిచేయుచున్న అన్యరాజులు అవకాశము కొరకు పొంచియున్నారు. కనుక నేనిపుడు నా కుమారుడగు అంతియోకసును నాకు బదులుగా రాజుగా నియమించుచున్నాను. నేను ఇదివరకే చాలమారులు అతనిని మీకొప్పజెప్పితిని. నేను యూఫ్రటీసు నదికి తూర్పున ఉన్న మండలములను సందర్శింపపోయినపు డెల్ల అతని క్షేమమును విచారింపుడని మిమ్మెల్లరిని కోరితిని. నేనతనికి వ్రాసిన జాబు నకలును మీకు కూడ పంపుచున్నాను.

26. మీరెల్లరును నేను పూర్వము మీకు వ్యక్తిగతముగను, సమష్టిగను చేసిన ఉపకారములను జ్ఞప్తియందుంచుకొని నాపట్లను, నా కుమారుని పట్లను సద్భావము చూపవలెనని కోరుకొను చున్నాను.

27. నావలెనే నా కుమారుడు మీయెడల న్యాయముతో కరుణతో ప్రవర్తించి మీకు మేలు చేకూర్చి పెట్టునని నమ్ముచున్నాను.”

28. ఆ రీతిగా ఆ నరహంత, ఆ దేవదూషకుడు, పూర్వము తాను ఇతరులకెట్టి ఘోరశ్రమలు తెచ్చి పెట్టెనో తానునట్టి యాతనలనే అనుభవించి అన్యదేశపు పర్వతములలో నికృష్టమైన చావు చచ్చెను.

29. ఆ రాజు ఆప్తమిత్రులలో ఒకడైన ఫిలిప్పు అతని పీనుగును స్వదేశమునకు కొనివచ్చెను. కాని అతడు అంతియోకసు కుమారునికి జడిసి ఐగుప్తురాజగు ప్టోలమీ, ఫిలోమేటరు మరుగుజొచ్చెను.

 1. యూదా మక్కబీయుడును, అతని అనుచరులును ప్రభువు నాయకత్వమున దేవాలయమును, యెరూషలేము నగరమును స్వాధీనము చేసికొనిరి.

2. వారు అన్యజాతివారు సంతపట్టున నిర్మించిన పీఠములను కూలద్రోసిరి. ఇతర స్థలములలో కట్టబడిన దేవాలయములను గూడ పడగొట్టిరి.

3. దేవాలయమును శుద్ధి చేసి దానిలో క్రొత్తపీఠమును నిర్మించిరి. చెకుముకి రాళ్ళతో క్రొత్తగా నిప్పు వెలిగించి, రెండేండ్ల తరువాత మరల బలినర్పించిరి. సాంబ్రాణిపొగ వేసి దీపములు వెలిగించి సాన్నిధ్యపు రొట్టెలను సమర్పించిరి.

4. ఈ ఆరాధన ముగిసిన తరువాత ఎల్లరును బోరగిలబడి దేవునికి మ్రొక్కి తమను మరల ఇట్టి కడగండ్లపాలు చేయవలదని వేడుకొనిరి. ఒకవేళ తాము పాపముచేసినచో ప్రభువు తమను కరుణతో శిక్షింపవలలయునేగాని క్రూరులైన అన్యజాతివారికి అప్పగింపరాదని మనవిచేసికొనిరి.

5. కీస్లేవు నెల ఇరువదియైదవదినమున వారు దేవాలయమును శుద్ధిచేసిరి. పూర్వము అదియే దినమున అన్యజాతివారు దానిని అమంగళము చేసియుండిరి.

6. గుడారముల పండుగ వలె ఈ శుద్ధీకరణోత్సవము కూడ ఎనిమిది నాళ్ళు జరిగెను. వారు తాము కొలదినాళ్ళు క్రితమే గుడారముల పండుగ చేసికొంటిమనియు అప్పుడు వన్య మృగములవలె కొండలలో తిరిగి గుహలలో వసించితి మని జ్ఞప్తికి తెచ్చుకొనిరి.

7. కాని ఇప్పుడు పచ్చని ఖర్జూర పత్రములను, ఆకులు చుట్టిన కఱ్ఱలను చేపట్టి ఠీవిగా నడచుచు, తన మందిరమును విజయవంతముగా శుద్ధిచేయించిన ప్రభువును కీర్తించిరి.

8. ఆ ఉత్సవమును ప్రతియేడు చేసికోవలయునని ఎల్లరును కూడిన సభలో శాసనము చేయించిరి.

9. పైన చెప్పిన రీతిగ అంతియోకసు ఎపిఫానెసు కాలధర్మము చెందెను.

10. ఇక మీదట ఈ నాస్తికుని పుత్రుడు అంతియోకసు యూపతోరు గూర్చి చెప్పవలసియున్నది. అతని యుద్ధమువలన కలిగిన కీడును గూర్చియు సంగ్రహముగా వివరింపవలసియున్నది.

11. యూపతోరు రాజు కాగానే లీసియాసును తన రాజ్యమునకు మంత్రిని చేసెను.

12. అతనిని ప్టోలమీ మాక్రోనునకు బదులుగా పెద్దసిరియాకు పాలకునిగా గూడ నియమించెను. యూదులను న్యాయబుద్దితో పరిపాలించిన వారిలో ఈ మాక్రోను మొదటివాడు. అతడు యూదులకు కలిగిన అపకారములను తీర్చుటకు వారితో శాంతియుతమైన సఖ్యసంబంధములు పెంపొందించుకొనెను.

13. అందువలన రాజమిత్రులు యూపతోరు వద్దకు వెళ్ళి మాక్రోను రాజద్రోహి అని అతడిమీద నిందమోపిరి. మాక్రోను ఫిలోమేటరు రాజు తన ఆధీనమున ఉంచిన సైప్రసు ద్వీపమును వదలివేసెను. అంతియోకసు ఎపిఫానెసు మరుగు జొచ్చెను కనుక అందరు అతనిని ద్రోహియని నిందింపజొచ్చిరి. అతడు తాను చేపట్టిన పదవికి గౌరవము చేకూర్పజాలడయ్యెను. కడన విషము త్రాగి  చచ్చెను.

14. గోర్గియాసు ఇదూమియాకు రాష్ట్ర పాలకుడయ్యెను. అతడు కూలిబంటులను ప్రోగుజేసికొని మాటిమాటికి యూదులమీదికి దాడిచేసెడివాడు.

15. ఇదూమీయులు కూడ ముఖ్యమైన కోటలను తమ వశములో నుంచుకొని యూదయాను తిప్పలు పెట్టజూచిరి. వారు యెరూషలేమునుండి పారిపోయి వచ్చిన తిరుగుబాటుదారులగు యూదులకు ఆశ్రయమిచ్చిరి. ఎల్లయెడల యుద్ధములను రెచ్చగొట్టిరి.

16. కనుక యూదా మక్కబీయుడు అతని అనుచరులు ప్రార్ధనాపూర్వకముగా ప్రభువు సహాయము అర్ధించి బలముతో పోయి ఇదూమీయుల కోటల మీదపడి పోరాడిరి.

17. వారు ఆ కోటల ప్రాకారమును రక్షించు వారిని చిత్తుచేసిరి. తమకు చిక్కిన వారినెల్ల రెండువేల మంది వరకు వధించిరి.

18. శత్రువులలో తొమ్మిది వేలమంది రెండు బలమైన దుర్గములలో దాగుకొనిరి. వారు ముట్టడి కాలమునకు వలసిన వస్తుసంభారములను కూడ చేకూర్చుకొనియుండిరి.

19. అప్పుడు యూదా అత్యవసరముగా మరియొకచోటికి వెళ్ళవలసి వచ్చెను. కనుక అతడు సీమోనుని, యోసేపుని, జక్కయను, అతని అనుచరులను శత్రువులతో పోరాడుటకు నియమించెను. ముట్టడిని కొనసాగించుటకు ఈ నాయకుల సైన్యములు చాలును.

20. కాని సీమోను సైనికులు ధనాశతో డెబ్బదివేల వెండినాణెములు లంచముపుచ్చుకొని శత్రువులలో కొందరిని పారిపోనిచ్చిరి.

21. ఈ సంగతి విని యూదా సైనికాధికారుల నెల్ల ప్రోగుజేసెను. యుద్ధమున శత్రువులను పారిపోనిచ్చి, వారు తమమీద పోరాడుటకు అవకాశము కలిగించుట అనగా తమ పక్షము వారిని శత్రువులకు అమ్మివేయుటతో సమానమేయని పలికెను.

22. అటుపిమ్మట అతడు లంచము పుచ్చుకొన్నవారిని మట్టుపెట్టించి, శత్రు దుర్గములను రెండిటిని వశము చేసికొనెను.

23. యూదా ప్రతి యుద్ధమునను గెలుపొందెడివాడు. అతడు ఈ రెండు కోటలలో ఇరువది వేలకంటె ఎక్కువమందినే వధించెను.

24. తిమొతి పూర్వమొకసారి యూదులకు ఓడిపోయెను. కాని అతడు మరల ఆసియానుండి పెద్ద అశ్వదళమును ప్రోగుజేసికొనెను. చాలమంది కూలి బంటులను గూడ సేకరించుకొనెను. అతడు ఆయుధ బలముతో యూదయాను జయింపనెంచి దండు కదలి వచ్చెను.

25. తిమొతి రాకడగూర్చి విని యూదా, అతని అనుచరులు దేవునికి మొరపెట్టిరి. వారు గోనెపట్ట కట్టుకొని, తలమీద దుమ్ము చల్లుకొనిరి.

26. పీఠము మెట్లమీద బోరగిలబడి ప్రభువును తమకు సహాయము చేయుమని మనవిచేసిరి. ప్రభువు ధర్మశాస్త్రమున ప్రమాణము చేసినట్లే తమ శత్రువులకు శత్రువు కావలెనని వేడుకొనిరి.

27. యూదులు ఇటుల ప్రార్థనచేసి, ఆయుధములు తాల్చి యెరూషలేమునుండి చాలదూరము వరకు పయనము చేసిరి. రాత్రి శత్రువుల చేరువలోనే బసచేసిరి.

28. తెలతెలవారుచుండగా ఇరువైపుల దండులు పోరునకు తలపడెను. యూద సైన్యము తమ పరాక్రమముమీదను, దైవబలముమీదను ఆధారపడెను. శత్రుసైన్యము తమ సాహసముమీద ఆధారపడెను.

29. పోరు ముమ్మరముగా సాగునప్పుడు ఐదుగురు దివ్యపురుషులు బంగారు కళ్ళెములు తాల్చిన గుఱ్ఱములనెక్కి యూదులకు ముందుగా నడచుటను శత్రువులు చూచిరి.

30. వారిలో ఇద్దరు యూదాకిరు ప్రక్కల నిలిచి గాయపడకుండ అతనిని తమ ఆయుధములతో సంరక్షించిరి. శత్రువులమీద మాత్రము బాణములను పిడుగులను కురిపించిరి. కనుక విరోధులు కలవరము చెంది చిందరవందరగా పారిపోయిరి. యూదులు వారిమీదబడి వారిని చిత్రవధ చేసిరి.

31. రెండువేల ఐదువందలమంది కాలిబంటులను, ఆరువందలమంది అశ్వికులను వధించిరి.

32. తిమొతి పారిపోయి గేసేరు దుర్గమున దాగుకొనెను. అది మిక్కిలి బలమైనకోట. అతని సోదరుడైన కాయిరెయసు దానికి అధిపతి.

33. యూదా అతని అనుచరులు నాలుగునాళ్ళ పాటు పట్టుదలతో ఆ కోటను ముట్టడించిరి.

34. ఆ దుర్గ నివాసులు తాము అభేద్యమైన స్థానమున ఉన్నామని తలంచి, యూదులను, వారి దేవుని దుర్భాషలతో నిందించిరి.

35. ఈ దుర్భాషలకు ఆగ్రహముచెంది యూదా సైనికులలో ఇరువదిమంది యువకులు ఐదవనాటి వేకువన ధైర్యముతో కోట గోడనెక్కిరి. వారు మహారోషముతో కోటమీద కనిపించిన వారినెల్ల చిత్ర వధచేసిరి.

36. ఆ సమయముననే మరియొక బృందము కూడ కోటకు అవతలి ప్రక్కనున్న గోడలనెక్కి బురుజులను తగులబెట్టిరి. దూషణములు పలికిన వారిని మంటలో కాల్చివేసిరి. ఇంకొక బృందమువారు ద్వారములను పడగొట్టి పట్టణమును పట్టుకొనుటకుగాను తమ వారిని లోనికి పంపిరి. వారు ఆ నగరమును ఆక్రమించిరి.

37. తిమొతి ఒక తొట్టిలో దాగుకొనెను. యూదా సైనికులు అతనిని, అతని సోదరుడు కాయిరేయసును, అపోల్లోఫానెసును పట్టుకొని వధించిరి.

38. ఈ పోరాటమెల్ల ముగిసిన తరువాత వారు గీతములతోను, కృతజ్ఞతాస్తుతులతోను ప్రభువును కొనియాడిరి. అతడు మహాకృపతో యిస్రాయేలీయులకు విజయము దయ చేసెనుగదా!

 1. రాజునకు బంధువును, సంరక్షకుడును, మంత్రి లీసియాసు జరిగిన సంగతులనెల్ల తెలిసికొని ఆగ్రహముచెందెను.

2. అతడు ఎనుబదివేల కాలిబంటులను తన రౌతులనందరిని ప్రోగుజేసికొని యూదుల మీదికి దండెత్తివచ్చెను. యెరూషలేమును గ్రీకుల నగరముగా మార్చివేయవలెనని అతని తలంపు.

3. మరియు ఇతర ఆరాధన మందిరముల మీదవలె యెరూషలేము దేవాలయము మీదగూడ పన్ను విధింపవలెనని, ప్రధానయాజకుని పదవిని ఏటేట వేలము పెట్టి అమ్మవలెనని అతడు సంకల్పించుకొనెను.

4. అతడు వేలాదిగానున్న తన కాలిబంటులను, రౌతులను, తన ఎనుబది ఏనుగులనుచూచి పొంగిపోయెనేగాని దైవ బలమును లెక్కలోకి తీసికోడయ్యెను.

5. లీసియాసు యూదయా మీదికి దాడిచేసి యెరూషలేమునకు ఇరువది క్రోసుల దూరముననున్న బేత్సూరు దుర్గమును ముట్టడించి పీడింపజొచ్చెను.

6. యూదయా మరియు ప్రజలు లీసియాసు తమ దుర్గమును ముట్టడించుచున్నాడని విని కన్నీరు గార్చుచు, శోకించుచు దేవునికి మొర పెట్టుకొనిరి. దేవదూతను పంపి యిస్రాయేలీయులను కాపాడుమని ప్రభువును వేడుకొనిరి.

7. యుద్ధమునకు తలపడి ఆయుధములను చేపట్టినవారిలో యూదా మొదటి వాడు. అతడు తనవలెనే తన అనుచరులుగూడ ప్రాణములకు తెగించి యూదుల రక్షణ కొరకు పోరాడ కోరెను. కనుక అతని అనుచరులు ఉత్సాహముతో కదలి వచ్చిరి.

8. వారు యెరూషలేము దాటి కొంచెము దూరము వెళ్ళిరో లేదో ధవళవస్త్రములు తాల్చి సువర్ణాయుధములు ఝళిపించు అశ్వికుడొకడు వారికి ముందుగా పోవుచున్నట్లు కనిపించెను.

9. యూదా సైనికులు ప్రభువు తమపై కరుణ జూపినందుకుగాను ఆయనను స్తుతించిరి. ప్రభువు వారికి ధైర్యమును ప్రసాదించెను. కనుక వారు ఒక్కనరులనేగాక భయంకర క్రూరమృగములను, ఇనుప గోడలను గూడ పడగొట్టుటకు సమర్థులైరి.

10. వారు బారులుతీరి ముందునకు నడచిరి. ప్రభువు కరుణతో పంపిన దివ్యపురుషుడు వారితో వెళ్ళెను.

11. ఆ సైనికులు సింహమువలె శత్రుసైన్యము మీదికి దూకి పదునొకండు వేలమంది కాలిబంటులను, పదునారువందలమంది రౌతులను మట్టుబెట్టిరీ. శత్రు సైన్యమున మిగిలినవారు కాలికి బుద్ధిచెప్పిరి.

12. పారిపోయిన వారెల్లరికి గాయములు తగిలెను. వారు ఆయుధములనుగూడ కోల్పోయిరి. లీసియాసుగూడ పిరికివానివలె పారిపోయి ప్రాణములు దక్కించుకొనెను.

13. లీసియాసు ఆలోచనలేనివాడు కాదు. అతడు తన ఓటమినిగూర్చి పరిశీలించి చూచుకొని మహా బలసంపన్నుడైన ప్రభువు యూదుల తరఫున పోరాడి వారిని అజేయులను చేసి, గెలిపించెనని గ్రహించెను. కనుక అతడు యూదుల యొద్దకు దూతలనంపి,

14. న్యాయసమ్మతముగా సంధి కుదుర్చుకొందమని చెప్పించెను. రాజునకు కూడ యూదులతో స్నేహము కుదుర్తునని చెప్పించెను.

15. యూదా తన ప్రజలకు ఏది మేలో ఆలోచించి, చూచి లీసియాసు సూచించిన సంధికి అంగీకరించెను. యూదా యిస్రాయేలీయుల తరఫున లిఖితపూర్వకముగా లీసియాసునకు సమర్పించిన విన్నపములనెల్ల రాజు అంగీకరించెను.

16. లీసియాసు యూదులకు వ్రాసిన జాబు ఇది: “లీసియాను యూదులకు శుభము పలికి వ్రాయునది.

17. మీ ప్రతినిధులైన యోహాను, అబ్సాలోము మీరు పంపిన కమ్మ నాకు అందించిరి. ఆ లేఖలోని విన్నపములను అంగీకరింపుమని వారు నన్ను కోరిరి.

18. మీ విన్నపములలో రాజు స్వయముగా చూడవలసిన అంశములను అతని పరిశీలనకు పంపితిని. నాకు అధికారమున్నంతవరకు నేను అనుమతింప గలిగినవానిని రాజు అంగీకరించెను.

19. మీరు మా ప్రభుత్వమునెడల విశ్వాసపాత్రులుగా మెలగుదురేని, మీ మేలునకుగాను భవిష్యత్తులో నేను చేయవలసినదెల్ల చేయుదును.

20. మీ ప్రతినిధులును, నా ప్రతినిధులును కూడ మిమ్ము కలిసికొని ఆయా విషయములను మీతో చర్చించునట్లు ఏర్పాటు చేసితిని.

21. మీకు మేలు కలుగునుగాక! నూట నలుబది ఎనిమిదవ యేడు (క్రీ.పూ. 164) డియోస్కోరింతియసు నెల ఇరువది నాలుగవ తేదీ.”

22. రాజు వ్రాసిన జాబు ఇది: “అంతియోకసు రాజు తన సోదరుడైన లీసియాసునకు శుభములు పలికి వ్రాయునది.

23. మా తండ్రి మరణించి దేవతలలో కలిసి పోయెను. ఇకమీదట నా రాజ్యములోని ప్రజలెల్లరు వారివారి ఆచారవ్యవహారముల ప్రకారము జీవింప వచ్చును.

24. యూదులు మా తండ్రి కోరినట్లుగా గ్రీకుల ఆచారములను పాటించుటకు ఇష్టపడుట లేదనియు, తమ సంప్రదాయముల ప్రకారము తాము జీవింపగోరుచున్నారనియు నేను తెలిసికొంటిని. ఇంకను వారు తమ చట్టముల ప్రకారము తాము జీవించుటకు అనుమతి నిమ్మని నన్ను వేడుకొనిరి.

25. నా రాజ్యములోని యితర జాతులవలెనే ఈ యూదులెట్టి పీడనకు గురికాక నిశ్చింతగా జీవింపవలెనని నా కోరిక. కనుక నాశాసనమిది. ఇకమీదట యూదుల దేవాలయమును వారికి అప్పగింపవలెను. వారు తమ పూర్వుల సంప్రదాయముల ప్రకారము జీవింపవచ్చును.

26. నీవు నా నిర్ణయమును వారికి తెలియజేయుము. అప్పుడు వారు నా పరిపాలనావిధానమును అర్ధము చేసికొందురు. శాంతి సమాధానములతో మెలగుచు తమ కార్యములను తాము చూచుకొందురు.”

27. రాజు యూదులకు వ్రాసిన జాబు ఇది: “అంతియోకసు రాజు యూదుల మహాసభకును, వారి పౌరులకును శుభములు పలికి వ్రాయునది.

28. మీ కార్యములన్నియు జయప్రదముగా జరిగి పోవుచున్నవని తలంతును. నా మట్టుకు నేను క్షేమముగనే ఉన్నాను.

29. ప్రస్తుతము మీరు మీ ఇండ్లకు వెడలిపోయి మీ పనులను చూచుకోగోరుచున్నారని మెనెలాసు నాకు ఎరిగించెను.

30. కనుక మీలో క్సాంతికను నెల ముప్పదియవ తేదీకి ముందుగా ఇల్లు చేరుకొను వారెల్లరును ఎట్టి భయముకు గురికానక్కరలేదు.

31. యూదులైన మీరు పూర్వమువలెనే మీ భోజన నియమములను, ఆచార నియమములను పాటింపవచ్చును. తెలియక చేసిన నేరమునకు ఏ యూదుడు శిక్షను అనుభవింపనక్కరలేదు.

32. మీ భయములనెల్ల తొలగించుటకుగాను నేను మెనెలాసును మీ చెంతకు పంపుచున్నాను.

33. మీకు శుభము కలుగునుగాక! నూటనలుబది ఎనిమిదవయేడు' క్సాంతికసు మాసము పదిహేనవ తేది.”

34. రోము, పౌరులు కూడ యూదులకు జాబు పంపిరి: “రోము ప్రజల ప్రతినిధులైన క్వింటసు, మెమ్మియసు, టైటసు, మానియసు యూదులకు శుభములు పలికి వ్రాయునది.

35. రాజు సోదరుడు లీసియాసు మీకు ప్రసాదించిన ప్రత్యేక సదుపాయములకు మేము కూడ ఆమోదము తెలుపుచున్నాము.

36. మేము ఇప్పుడు అంతియోకియాకు వెళ్ళబోవుచున్నాము. లీసియాసు మిమ్ము గూర్చి రాజు పరిశీలనకు పంపిన అంశములు జాగ్రత్తగా పరిశీలించి చూడుడు. వానిలో మీకు ముఖ్యమని తోచిన సంగతులను మాకు వెంటనే తెలియజేయుడు. ఆ అంశములనుగూర్చి మేము రాజుకు మనవి చేయుదుము.

37. మీ అభీష్టమును తెలియజేయుచు వెంటనే యిచటికి దూతలనంపుడు. మీకు శుభము కలుగునుగాక!

38. నూటనలుదిది ఎనిమిదియవ సంవత్సరము క్సాంతికసు మాసము పదిహేనవ తేది.”

 1. ఈ ఒడంబడికలన్నియు ముగిసిన తరువాత లీసియాసు రాజునొద్దకు వెళ్ళిపోయెను. యూదులు తమ దేశమునకు వెడలిపోయి సేద్యము చేసికొననారంభించిరి.

2. కాని స్థానికాధికారులైన తిమొతి, గెన్నెయసు కుమారుడు అపోల్లోనియసు, హిరోనిమసు, డెమొఫోను, సైప్రసు కూలిబంటులకు నాయకుడైన నికానోరు అనువారు మాత్రము యూదులను ప్రశాంతముగా జీవింపనీయరైరి.

3. యొప్పా పౌరులు ఆ నగరమున వసించు యూదులకు ఈ క్రింది అపకారము చేసిరి. ఆ ప్రజలు యూదులకు స్నేహితులైనట్లుగా నటించుచు వారిని కుటుంబ సమేతముగా తమతోపాటు తమపడవల మీద కొంతదూరము సముద్రయానము చేయుడని అడిగిరి.

4. నగర పౌరులెల్లరును కలిసి ఈ కార్యము తలపెట్టిరి కనుక శాంతిప్రియులైన యూదులెట్టి ద్రోహమును శంకింపరైరి. వారు స్నేహబుద్ధితో ఆ ఆహ్వానమును అంగీకరించిరి. కాని సముద్రములోనికి వెళ్ళిన తరువాత యొప్పా పౌరులు యూదులను నీటిలో ముంచివేసిరి. అటుల మునిగిపోయిన వారు రెండువందలమంది.

5. యూదా తన దేశీయులు ఇట్టి క్రూర కార్యమునకు బలియైరని విని తన అనుచరులను ప్రోగుజేసి కొనెను.

6. వారెల్లరును కలిసిన్యాయము జరిగించు న్యాయాధిపతియైన దేవునికి ప్రార్థనచేసిన పిదప హంతకుల మీదికి దాడిచేసిరి. రాత్రి యెప్పా రేవునకు నిప్పంటించి అచటి ఓడలను తగులబెట్టిరి. దాగుకొనుటకు అచటికి వచ్చిన వారినెల్ల వధించిరి.

7. అప్పుడు నగరద్వారములు మూయబడియున్నవి. కనుక యూదా అప్పటికి అచటినుండి వెడలిపోయెను. కాని అతడు మరల తిరిగివచ్చి యొప్పా పౌరులందరిని మట్టుపెట్ట సంకల్పించుకొనెను.

8. అంతలోనే యామ్నియా పౌరులు కూడ యూదులను వధింపనున్నారని వార్తలు వచ్చెను.

9. కనుక యూదా యామ్నియాను కూడ ముట్టడించెను. దాని రేవునకు నిప్పంటించి అచటి ఓడలను తగులబెట్టెను. ఆ మంటలచటికి ముప్పది క్రోసుల దూరముననున్న యెరూషలేము వరకును కనిపించెను.

10. యూదా అతని అనుచరులు యామ్నియాను వదలి తిమొతి మీదికి పోవు ఉద్దేశ్యముతో ఒక మైలు కెక్కువ దూరము నడచిరో లేదో అరబ్బులు వచ్చి వారిమీదపడిరి. శత్రువులు ఐదువేల మంది కాలిబంటులతోను, ఐదువందలమంది రౌతులతోను వచ్చిరి.

11. పోరు ముమ్మరముగా జరిగెను. కడన దైవబలము వలన యూదా నెగెను. ఓడిపోయిన ఆ ఎడారి జాతివారు యూదులకు స్నేహితులుగానుండగోరిరి. వారు యూదులకు సహాయము చేయుటకును, తమ మందలను వారికిచ్చుటకును అంగీకరించిరి.

12. యూదా అరబ్బులవలన చాల లాభములు కలుగునని యెంచి వారితో సంధిచేసికొనెను. అటుపిమ్మట వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి.

13. యూదా ప్రాకారములతో సురక్షితమైయున్న కాస్పిను పట్టణమునుగూడ ముట్టడించెను. ఆ నగర వాసులు పలుజాతులకు చెందినవారు.

14. వారు తమ ప్రాకారములను, తాము సేకరించి యుంచు కొనిన భోజన పదార్దములను చూచుకొని ధీమాతో యూదాను అతని అనుచరులను గేలిచేసిరి. పైగా వారిని, వారి దేవునికూడ నిందించి దుర్భాషలాడిరి.

15. కాని యూదులు లోకనాయకుడైన ప్రభువునకు వినతిచేసిరి. గోడలను పడగొట్టు మంచెలు, పట్టణములను ముట్టడించుటకు వాడు ఆయుధములు లేకయే పూర్వము యెహోషువ కాలమున ప్రభువు యెరికో గోడలను కూల్చివేసెనుగదా! అట్లు వినతిచేసి యూదులు వీరావేశముతో పోయి కాస్పిను ప్రాకారములమీద పడిరి.

16. దైవచిత్తము ప్రకారము ఆ నగరమును స్వాధీనము చేసికొని అందలి పౌరులు అనేకులను చంపిరి. ఆ పట్టణము ప్రక్కనున్న కొలను క్రోసులో నాలుగవ వంతు వెడల్పుకలది. ఆ కొలనంతయు చచ్చిన వారి నెత్తుటితో నిండెను.

17. యూదా అతని అనుచరులు కాస్పినునుండి తొంబది ఐదు క్రోసులు నడచి తూబియను పట్టణము సమీపముననున్న యూదుల నగరమగు కారాక్సును చేరిరి.

18. కాని అచట వారికి తిమొతి కనిపింపలేదు. అతడంతకు పూర్వమే ఆ మండలమునుండి వెడలిపోయెను. కాని అతడొక తావున బలమైన సైనిక బృందమును కాపు పెట్టి వెళ్ళెను. అంతకు మించి తిమొతి అచట సాధించినదేమియులేదు.

19. యూదా సైన్యాధిపతులు డొసితియసు, సోసిపాతెరులు అనువారు పోయి తిమొతి కాపు పెట్టిన దండుమీద పడిరి. అచట నున్న పదివేలమంది సైనికులు మడిసిరి.

20. యూదా తన సైన్యమును కొన్ని పటాలములుగా విభజించి డొసితియసును, సోసిపాతెరును రెండు పటాలములకు అధిపతులనుగా చేసెను. తాను తిమితిని ఎదుర్కొను టకు శీఘ్రముగా వెడలిపోయెను. తిమొతికి లక్ష ఇరువదివేలమంది. కాలిబంటులును, రెండువేల ఐదువందలమంది రౌతులును కలరు.

21. యూదా తన మీదికి దండెత్తి వచ్చుచున్నాడని విని తిమొతి ముందుగనే స్త్రీలను, పిల్లలను, సామానులతో కర్నాయీము నగరమునకు పంపివేసెను. ఆ నగరమునకు పోవుమార్గములు ఇరుకైనవి. కనుక దానిని ముట్టడించుట, అసలు చేరుకొనుటగూడ కష్టమైన కార్యము.

22. కాని శత్రువులు యూదా అధీనమున నున్న మొదటి పటాలమును చూడగనే కలవరపడిరి. సర్వసాక్షియైన దేవుడు విరోధులకొక దర్శనము చూపగా వారు భయభ్రాంతులై చిందరవందరగా పరుగెత్తిరి. ఆ కలవరపాటులో శత్రువులు చాలమంది స్వపక్షము వారి కత్తులవలననే గాయపడిరి.

23. యూదా, అతని అనుచరులు ఆ నీచులను బలము కొలది వెన్నాడి వారిలో ముప్పది వేలమందిని మట్టు పెట్టిరి.

24. తిమొతి, డోసీతియసు సోసిపాతెరు దండుల చేతికి చిక్కెను. కాని అతడు మోసగాడు. అతడు తనను పట్టుకొన్న వారితో “మీ బంధువులు చాలమంది బందీలైనా అధీనముననున్నారు. ఇప్పుడు మీరు నన్ను చంపుదురేని వారు ప్రాణములు కోల్పోవుట తథ్యము. కనుక మీరు నా ప్రాణములు కాపాడవలెను” అని చెప్పెను.

25. తిమోతి యూదా సైనికుల బంధువు లను సురక్షితముగా వారిండ్లకు పంపివేయుదునని మాటయీయగా ఎట్టకేలకు వారతనిని ప్రాణములతో పోనిచ్చిరి.

26. తరువాత యూదా కర్నాయీము నగరమును దానిలోని ఆటెర్గాటిసు అను దేవళమును ముట్టడించి, ఇరువది ఐదువేలమందిని చంపెను.

27. అటుతరువాత యూదా ఎఫ్రోను దుర్గము మీదికి పోయెను. అపుడు లీసియాసు అన్ని జాతుల ప్రజల సమూహంతో అచట వసించుచుండెను. శత్రు పక్షము నుండి శూరులైన యువకులు దుర్గప్రాకారముల ముందు నిలిచి వీరావేశముతో పోరాడిరి. వారు దుర్గములోపల యుద్ధయంత్రములు, ఆయుధములు చేకూర్చుకొని యుండిరి.

28. యూదులు శత్రువుల పీచమణచు మహాప్రభువునకు ప్రార్థనచేసి ఆ నగర మును స్వాధీనము చేసికొని ఇరువది ఐదు వేలమందిని సంహరించిరి.

29. అచటినుండి వారు యెరూషలేము నకు డెబ్బది ఐదు క్రోసులు దూరముననున్న సితోపోలిసు నకు వెళ్ళిరి.

30. కాని అచట వసించు యూదులు ఆ నగరవాసులు తమ్ము దయతో చూచుచున్నారనియు, విశేషముగా కష్టకాలమున తమ్ము ఆదుకొనుచున్నారనియు విన్నవించిరి.

31. కనుక యూదా, అతని అనుచరులు ఆ నగరవాసులకు ధన్యవాదములు అర్పించిరి. భవిష్యత్తులోకూడ యూదుల యెడల ఆదరము చూపుడని వారిని వేడుకొనిరి. వారు వారముల పండుగకు కొంచెము ముందుగ యెరూషలేము చేరుకొనిరి.

32. పెంతెకోస్తు పండుగ ముగియగానే యూదా అతని అనుచరులు ఇదూమియాకు అధిపతిగానున్న గోర్గీయాసు మీదికి త్వరితగతిని దాడిచేసిరి.

33. అతడు మూడువేలమంది పదాతులతోను నాలుగు వందలమంది రౌతులతో వచ్చి వారినెదుర్కొనెను.

34. యుద్ధమున కొందరు యూదులు ప్రాణములు కోల్పోయిరి.

35. టూబియను నగరవాసియు పరాక్రమముగల అశ్వికుడైన డొసితియను అనువాడు గోర్గియాసు అంగీని పట్టుకొని అతనిని బటబట ఈడ్వ జొచ్చెను. ఆ దుర్మార్గుని సజీవునిగా బంధింపవలెనని అతని తలంపు. కాని అంతలోనే త్రాసియా రౌతు ఒకడు డోసీతియసు మీదపడి అతని భుజమును నరికెను. గోర్గియాసు మరీసాకు పారిపోయెను.

36. ఎస్డ్రీయాసు నాయకత్వమున పోరాడువారు అప్పటికే చాల సేపటి నుండి యుద్ధము చేయుచుండిరి కనుక బాగుగా అలసియుండిరి. కనుక యూదా, ప్రభువు యుద్ధమున తమ పక్షమున పోరాడవలయుననియు అతడు తమ సైన్యమునకు నాయకుడు కావలెనని ప్రార్థించెను.

37. అంతటతడు మాతృభాషలో ఒక పాటను యుద్ధనాదముగా పాడెను. అతని అనుచరులు అకస్మాత్తుగ గోర్గియాసు దండు మీదపడి దానిని తరిమికొట్టిరి.

38. అటుపిమ్మట యూదా తన సైన్యముతో అదుల్లాము నగరమునకు పోయెను. అది విశ్రాంతి దినమునకు ముందటి రోజు. కనుక వారు ఆచారము ప్రకారము శుద్ధిచేసికొని విశ్రాంతిదినమును పాటించిరి.

39. ఆ మరుసటిరోజు చనిపోయిన వారి శవములను ప్రోగుజేసి పితరుల సమాధులలో పాతిపెట్టవలసి వచ్చెను.

40. కాని పోరున చచ్చిన యూదులందరును యామ్నియా ప్రజలు ఆరాధించు దేవతల బొమ్మలను తమ దేహముల మీద బట్టల మాటున కట్టుకొనియుండిరి. ధర్మశాస్త్రము ప్రకారము ఈ బొమ్మలను తాల్చుట తప్పు. వారు యుద్ధమున ఎందుకు ప్రాణములు కోల్పోయిరో ఎల్లరికిని అప్పుడు అర్ధమయ్యెను.

41. కనుక అందరును కలిసి మరుగున పడినవానిని విదితము చేయువాడును, న్యాయము తప్పని న్యాయమూర్తియునైన ప్రభువు కార్యములను కొనియాడిరి.

42. వారు ఈ పాపమును పూర్తిగా క్షమింపవలెనని ప్రార్థన చేసిరి. అపుడు శూరుడైన యూదా “మీరు ఈ పాప ఫలితమును కన్నులార చూచితిరి కనుక ఇక మీదట పాపము నుండి వైదొలగుడు” అని ఎల్లరిని హెచ్చరించెను.

43. అటు తరువాత అతడు తన సైనికులనుండి రెండువేల వెండినాణెములను ప్రోగుజేసి ఆ సొమ్మును పాపపరిహారబలిని అర్పించుటకు యెరూషలేమునకు పంపెను. అతడు మృతులు మరల ఉత్థానమగుదురని విశ్వసించెను. కనుక ఈ పుణ్య కార్యము చేయించెను.

44. చనిపోయినవారు మరల ఉత్థానమగుదురని అతడు విశ్వసించి ఉండడేని, వారి కొరకు ప్రార్థనచేయుట నిరుపయోగమును, మౌఢ్యమును అయ్యెడిది గదా!

45. కాని భక్తితో మరణించిన వారు యోగ్యమైన బహుమతిని పొందుదురని యూదా నమ్మియుండెనేని, అతడు చేసిన కార్యము భక్తి మంతమైనదియు, పవిత్రమైనదియు అగును. కనుకనే అతడు చనిపోయిన వారికి పాపవిముక్తి కలుగునని యెంచి వారికొరకు పాపపరిహారబలి అర్పింపజేసెను.

 1. నూటనలుబదితొమ్మిదవయేట యూదా మక్కబీయుడును, అతని అనుచరులును అంతియోకసు యూపతోరు పెద్ద సైన్యముతో యూదామీదికి దండెత్తి వచ్చుచున్నాడని గ్రహించిరి.

2. ఆ రాజు సంరక్షకుడు అతని మంత్రియు లీసియాసు కూడ అతనితో వచ్చుచున్నాడని వినిరి. మరియు ఆ రాజు గ్రీకు పదాతులు లక్షయిరువది వేల మందిని, రౌతులు ఐదువేల మూడువందల మందిని, ఏనుగులు ఇరువది రెండిటిని, చక్రములకు వాడియైన కత్తులను అమర్చిన రథములు మూడు వందలను ప్రోగుజేసికొని వచ్చుచున్నాడనియు వినిరి.

3. మెనెలాసు కపటముతో శత్రువుల కోపు తీసికొని వారిని ప్రోత్సహింప మొదలిడెను. అతనికి కావలసినది తాను ప్రధాన యాజకుడుగా కొనసాగుటయే గాని మాతృదేశపు మేలు కాదు.

4. కాని రాజాదిరాజైన ప్రభువు, అంతియోకసును మెనెలాసు మీద విరుచుకొని పడునట్లుచేసెను. విపత్తులన్నిటికి కారణము ఆ దుర్మార్గుడేయని లీసియాసు రాజునకు ఎరిగించెను. కనుక రాజు మెనెలాసును బెరియాకు కొనిపోయి. ఆ పట్టణ సంప్రదాయము ప్రకారము అతనిని వధింపుడని ఆజ్ఞయిచ్చెను.

5. ఆ నగరమున డెబ్బదియైదు అడుగుల ఎత్తు గోపురము కలదు. దాని లోపలి భాగమును బూడిదతో నింపిరి. దానిపై అంచు గుండ్రముగా నుండి క్రింది బూడిదవైపు వంగియుండెను.

6. దేవాలయము సొమ్మును అపహరించిన వారినిగాని, ఇతరములైన పెద్ద తప్పులు చేసిన వారినిగాని ఆ గోపురము మీదికి తీసికొని వెళ్ళి, క్రింది బూడిద మీదికి పడద్రోసి చంపెడివారు.

7. దుర్మార్గుడు మెనెలాసును అదే చావుచచ్చెను. అతని శవమునకు ఖనన సంస్కారము కూడ లభింపదయ్యెను.

8. అట్టి చావు న్యాయసమ్మతమైనదే. అతడు చాలసారులు దేవాలయములోని పవిత్రమైన పీఠాగ్నిభస్మమును అపవిత్రము చేసెను. కనుక కడన బూడిదలోనే పడిచచ్చెను.

9. అంతియోకసు తన దండయాత్రను కొనసాగించెను. అతడు యూదులను తన తండ్రికంటె గూడ ఘోరతమముగా శిక్షింపవలెనన్న క్రూరబుద్ధితో వచ్చెను.

10. ఈ వార్త విని యూదా తన ప్రజలను పిలిచి రేయింబవళ్ళు ప్రభువునకు మనవిచేయుడని చెప్పెను. పూర్వముకంటెగూడ అదనముగా ఆ ఆపత్కాలమున ప్రభువు తమ్ము ఆదుకోవలెనని విన్నపములు చేయుడని చెప్పెను.

11. వారి ధర్మశాస్త్రము, దేశము, పవిత్ర మందిరము నాశనము కానున్నవని నుడివెను. నూత్నముగా స్వాతంత్య్రము పొందిన తమ దేశము మరల భక్తిహీనులైన అన్యజాతివారి స్వాధీనము కారాదని పలికెను.

12. ఎల్లరును యూదా ఆ పాటించి మూడు నాళ్ళపాటు ఉపవాసముండిరి. వారు నేలమీద బోరగిలబడి కన్నీళ్ళు కార్చుచు కరుణాళువైన ప్రభువును ప్రార్థించిరి. అంతట యూదా వారికి ప్రోత్సాహము కలుగునట్లు మాటలాడి యుద్ధమునకు సన్నద్ధులుకండని చెప్పెను.

13. అతడు యూదనాయకులను వ్యక్తి గతముగా సంప్రతించెను. ఆంటియోకసు యూదయా మీదికెత్తివచ్చి యెరూషలేమును ముట్టడించువరకు తాము యుద్ధమునకు తలపడకుండ మెదలకుండ ఉండుట మంచిది కాదని నిర్ణయించుకొనెను. దైవబలముతో పోయి త్రోవలోనే రాజును ఎదుర్కొనుట శ్రేయస్కరమని తలంచెను.

14. అతడు జయాపజయములను సర్వసృష్టికర్తయైన ప్రభువునకే వదిలివేసెను. తన సైనికులు మాత్రము శౌర్యముతో పోరాడవలెనని చెప్పెను. వారు తమ ధర్మశాస్త్రము, దేవాలయము, నగరము, దేశము తమ ప్రత్యేక జీవితవిధానము మొదలైనవానికొరకు ప్రాణములర్పించుటకు కూడ సిద్ధముగానుండవలెనని హెచ్చరించెను. యూదులు మోదెయిను చేరువలో శిబిరము పన్నిరి.

15. యూదా తన అనుచరులు “దేవునినుండి విజయము" అను వాక్యమును యుద్ధనాదముగా వాడుకోవలెనని చెప్పెను. అతడు ఆ రాత్రి తన సైన్యమున మహాశూరులైన యువకులను వెంటబెట్టుకొనిపోయి శత్రుశిబిరము నందు రాజు గుడారమునకు చేరువలోనున్న దళము మీదపడి రెండువేలమందిని వధించెను. అతని అనుచరులు శత్రువుల ఏనుగులన్నిటిలో పెద్దదానిని, దాని మావటి వానితోపాటు చంపిరి.

16. యూదా అతని వీరులు శత్రు శిబిరమునందెల్ల భయము, కలవరము పుట్టించి విజయము చేపట్టి తిరిగివచ్చిరి.

17. అప్పుడే తెలతెలవారుచుండెను. ప్రభువు శత్రువు నుండి యూదాను రక్షించుటవలన ఈ విజయము సిద్ధించెను.

18. రాజు యూదుల పరాక్రమమును చవిచూచెను కనుక యుక్తితో వారి దుర్గములను పట్టుకో చూచెను.

19. అతడు యూదుల బలమైన దుర్గమగు బేత్సూరును ముట్టడించెను. కాని యూదులు అతనిని ఓడించి తరిమికొట్టిరి.

20. యూదా ఆ దుర్గమును రక్షించువారికి ఆహారపదార్థములను పంపెను.

21. కాని రోడోకసు యూదసైనికుడు శత్రువులకు రహస్య సమాచారము అందించెను. వారు అతనిని గుర్తుపట్టి బంధించిరి.

22. రాజు బేత్సూరు దుర్గరక్షకులతో సంధి చేసికొనుటకు రెండుసారులు యత్నము చేసెను. ఆ సంధి కుదిరిన తరువాత అతడు తన సైన్యమునచటి నుండి మరలించుకొనిపోయెను. అటు తరువాత అతడు యూదా మీదికి దాడిచేసెనుగాని మరల ఓడిపోయెను.

23. అంతలో అంటియోకియాలో రాజ్య వ్యవహారములను పర్యవేక్షించుచున్న ఫిలిప్పు రాజు మీద తిరుగుబాటు మొదలు పెట్టెనని వార్తలు వచ్చెను. ఈ సమాచారము విని అంతియోకను దిగ్బ్రాంతి చెందెను. అతడు యూదులతో సంధి చేసికొనగోరెను. వారు నిర్ణయించిన షరతులకు అంగీకరించెను. వారి హక్కులను న్యాయబుద్ధితో మన్నింతునని మాట ఇచ్చెను. యూదులతో సంధి కుదుర్చుకొని బలినర్పించెను. దేవాలయమునకు ఉదారముగా కానుకలు అర్పించి దానిపట్ల గౌరవము ప్రదర్శించెను.

24. తనను దర్శింపవచ్చిన మక్కబీయుని యెడల దాక్షిణ్యము చూపెను. ప్టోలమాయిసునుండి గెరారువరకుగల దేశమునకు హెగెమోనిషెసును రాష్ట్రపాలకునిగ నియమించెను.

25. తరువాత రాజు ప్టోలమాయిసునకు వెళ్ళిపోయెను. అచటి ప్రజలు రాజు యూదులతో చేసికొనిన సంధినిగూర్చి ఆగ్రహముచెందిరి. ఆ సంధిని రద్దు చేయవలెనని కోరిరి.

26. కాని లీసియాసు వేదికమీదికెక్కి సంధిని సమర్ధించుచు మాటలాడి ప్రజలను ఒప్పించెను. కడన వారు సంధిని అంగీకరించి అలజడిని మానుకొనిరి. అటుపిమ్మట అతడు అంతియోకియాకు వెడలిపోయెను. రాజు యూదా మీదికి దాడిచేసి వెనుదిరిగి పోయిన వృత్తాంతమిది. రాజు యూదా మీదికి దాడిచేసి వెనుదిరిగి పోయిన వృత్తాంతమిది.

 1. మూడేండ్లు కడచిన తరువాత సెల్యూకసు కుమారుడైన దెమేత్రియసు గొప్ప సైన్యముతోను, నౌకాబలముతోను వచ్చి త్రిపోలిసు రేవులో దిగెను. ఈ సంగతి యూదా అతని అనుచరులు వినిరి.

2. దెమేత్రియసు అంతియోకసును, అతడి సంరక్షకుడు లీసియాసును వధించి రాజ్యమును స్వాధీనము చేసి కొనెనని తెలియవచ్చెను.

3. అల్కిమోసు అనునాతడు పూర్వము ప్రధాన యాజకుడుగా పనిచేసియుండెను. అతడు యూదులు తిరుగుబాటుచేసిన కాలమున బుద్ధిపూర్వకముగనే గ్రీకుల ఆచార వ్యవహారములను అనుసరించెను. అతడు తనకు మరల ప్రధానయాజక పదవి లభింపదనియు యూదులు తన్ను శిక్షింతురనియు భయపడెను.

4. కనుక అల్కిమోసు నూట ఏబది ఒకటవ యేట' దెమేత్రియసు రాజును సందర్శింపబోయెను. ఆ సమయమున అతడు రాజునకు బంగారు కిరీటమును, ఖర్జూరపత్రమును, మామూలుగా దేవాలయమున అర్పించు ఓలివు కొమ్మలను బహూకరించెను. అతడు అప్పుడు తన కోరికలేమియు రాజునకు ఎరిగింపడయ్యెను.

5. కాని తరువాత రాజు అల్కిమోసుని తన మంత్రాలోచన సభలోనికి పిలిపించి యూదులు ఏమి చేయగోరుచున్నారని ప్రశ్నించెను. అప్పుడతడు తన వెఱ్ఱి కోర్కెలను తీర్చుకోగోరి రాజుతో ఇట్లు చెప్పెను:

6. "హాసిదీయులు అను తెగకు చెందిన యూదులకు యూదా నాయకుడు. వారు యుద్ధ ప్రియులు, తిరుగుబాటుదారులు, దేశమున శాంతిని భంగపరచువారు.

7. వారు నా జన్మహక్కు అయిన ప్రధానయాజక పదవిని నాకు దక్కనీయరైరి. కనుకనే నేడు నేనిచటికి రావలసివచ్చినది.

8. ప్రభులవారి శ్రేయస్సును కాంక్షించుట నా మొదటి బాధ్యత. మా ప్రజల శ్రేయస్సును గణించుట నా రెండవ బాధ్యత. యూదాబృందము వారి పిచ్చిపోకడలవలన ఇపుడు మా ప్రజలు పడరానిపాట్లు పడుచున్నారు.

9. ప్రభువుల వారు ఈ సంగతులెల్ల పరిశీలించి చూచిన పిదప తమరికి సహజమైన దయాదాక్షిణ్యముల చొప్పున కార్యాచరణనకు పూనుకొనుడు. తమరు మా ప్రజల బానిసత్వమును తొలగించి దేశమును కాపాడవలయును.

10. యూదా బ్రతికియున్నంతకాలము మా రాజ్యమున శాంతి నెలకొనదు.”

11. అల్కిమోసు తన ఉపన్యాసమును ముగింపగానే సభలోని రాజస్నేహితులు రాజును యూదామీదికి పురికొల్పిరి. వారికి యూదా అనిన గిట్టదు.

12. కనుక రాజు అంతకు ముందే తన రాజ్యమున గజాధ్యక్షుడుగానున్న నికా నోరును యూదియాకు అధిపతిగా నియమించి అతడిని అచటికి పంపెను.

13. యూదాను వధించి అతని అనుచరులను చిందరవందరచేసి మందిరములలోకెల్ల శ్రేష్ఠమైన యెరూషలేము మందిరమునకు అల్కిమోసును ప్రధానయాజకునిగా నియమింపుము అని రాజు అతనిని ఆజ్ఞాపించెను.

14. యూదా దాడులకు తట్టుకోలేక యూదయానుండి పారిపోయిన అన్యజాతివారెల్లరును తిరిగివచ్చి నికానోరుతో చేతులు కలిపిరి. యూదుల ఓటమివలన తాము లాభము పొందవచ్చునని వారి ఆలోచనము.

15. నికానోరు తమ మీదికి దండెత్తి వచ్చుచున్నాడనియు, తమ దేశమునందలి అన్యజాతివారు అతనితో చేతులు కలుపనున్నారనియు యూదులు వినిరి. కనుక వారు తలమీద దుమ్ము చల్లుకొని దేవుని ప్రార్థించిరి. ఆ ప్రభువు కలకాలమువరకు వారిని తన ప్రజగా ఎన్నుకొనినవాడు, ఆపదలలో వారిని తప్పక ఆదుకొను వాడునుగదా!

16. అటుపిమ్మట వారు యూదా ఆజ్ఞపై యుద్ధమునకు సన్నద్ధులై శత్రువులను ఎదుర్కొనుటకు గాను డెస్సావు నగరమువద్దకు వచ్చిరి.

17. యూదా సోదరుడైన సీమోను నికానోరుతో పోరు మొదలుపెట్టెను. కాని శత్రువులు తలవని తలంపుగా వచ్చి మీద పడుటచే అతడు ఓడిపోజొచ్చెను.

18. అయినను యూదా అతని అనుచరులు మహా పరాక్రమముతో తమ దేశముకొరకు పోరాడుదురని నికానోరు వినెను. కనుక అతడు యుద్దముద్వారా సమస్యను పరిష్కరింప బూనుట మంచిది కాదని యెంచి,

19. యూదులతో సంధి చేసికొనుటకు పోసిడోనియసు, తెయొడోటసు, మత్తతియాసులను అనువారలను పంపెను.

20. యూదా సంధి షరతులను జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని తన అనుచరులకు తెలియజేసెను. వారెల్లరును ఏకాభిప్రాయము కలవారు కనుక సంధికి అంగీకరించిరి.

21. ఇరుపక్షముల నాయకులు కలిసికొనుటకు ఒక రోజు నిర్ణయింపబడెను. ఉభయ పక్షములనుండి ఒక్కొక్క రథము వచ్చెను, మరియు గౌరవాసనములు తెచ్చి ఒక తావున అమర్చిరి.

22. శత్రువులు ద్రోహము తలపెట్టవచ్చునన్న భావముతో యూదా ముందుగనే కీలకమైన తావులలో యుద్ధము నకు సన్నుద్దులైన సైనికులను నిల్పెను. కాని ఇరువురు నాయకులును సుహృద్భావముతో మాటలాడుకొని సంధి కుదుర్చుకొనిరి.

23. అటు తరువాత కొంత కాలమువరకు నికానోరు యెరూషలేముననే వసించెను. అతడు యూదులకెట్టి హానియు తలపెట్టలేదు. పైపెచ్చు క్రొత్తగా తన పక్షమును చేరుటకు వచ్చిన వారిని కూడ వెనుకకు పంపివేసెను.

24. నికానోరు తరచుగా యూదాను తన దగ్గర ఉంచుకొనెడివాడు. వారిరువురును ఆప్తమిత్రుల వలె మెలిగెడివారు.

25. యూదాను పెండ్లి చేసికొని గృహస్థ జీవితము గడపుమని అతడు ప్రోత్సహించెను. ఆ రీతిగనే యూదా వివాహమాడి ప్రశాంతముగా జీవింపజొచ్చెను.

26. నికానోరు, యూదా కలిసిమెలిసి ఉండుట చూడగా అల్కిమోసునకు కన్నుకుట్టెను. అతడు వారి సంధి షత్రము నకలును ఒకదానిని తీసికొని దెమేత్రియసు రాజునొద్దకు వెళ్ళెను. నికానోరు రాజ్యమునకు ద్రోహము తలపెట్టుచున్నాడనియు, అతడు రాజద్రోహియైన యూదాను తనకు అనుయాయిని చేయబోవుచున్నాడనియు రాజుతో కొండెములు చెప్పెను.

27. ఆ దుర్మార్గుని మాటలువిని రాజు ఉగ్రుడయ్యెను. కోపముతో నికానోరునకు కమ్మ వ్రాసి అతడు యూదాతో చేసికొనిన సంధి తనకు ఏమాత్రము ఇష్టములేదని తెలియజేసెను. యూదాను వెంటనే బంధించి అంతియోకియాకు పంపుమని ఆజ్ఞాపించెను.

28. ఆ లేఖను చూడగనే నికానోరు వికల మనస్కుడయ్యెను. ఎట్టి అపరాధము చేయని యూదాతో మాటతప్పుటకు అతని మనసు అంగీకరింపదయ్యెను.

29. అయినను రాజాజ్ఞ మీరరాదుకదా! కనుక అతడు యుక్తితో యూదాను పట్టుకోగోరి అనువైన సమయము కొరకు వేచియుండెను.

30. నికానోరు తనతో పరుషముగాను, అనిష్టముగాను మాటలాడుచున్నాడనియు దానికి తగిన కారణముండుననియు యూదా గ్రహించెను. కనుక అతడు చాలమంది అనుచరులను ప్రోగుచేసికొని రహస్యస్థానమునకు వెడలిపోయెను.

31. యూదా తన యెత్తుకు ఎదురెత్తు పన్నెనని గ్రహించి నికానోరు పవిత్రమైన మహా దేవాలయమునకు వెళ్ళి, అచట బలిని అర్పించుచున్న యాజకులను “యూదాను తనకు పట్టి ఈయవలెను" అని ఆజ్ఞాపించెను.

32. కాని యాజకులు యూదా ఎచట దాగియున్నాడో తమకు తెలియదని ఒట్టువేసికొనిరి.

33. నికానోరు తన హస్తమును దేవాలయమువైపు చాచి ఇట్లు శపథము చేసెను: “మీరు నాకు యూదాను పట్టియీయలేని నేను ఈ మందిరమును నేలమట్టము చేసి ఇందలి పీఠమును కూల్చివేయుదును. ఈ తావున డయొనీష్యసు దేవతకు నూత్నముగా వైభవోపేతమైన మందిరము నిర్మింతును.”

34. ఇట్లు పలికి అతడు వెడలిపోయెను. వెంటనే యాజకులు ఆకాశమువైపు చేతులెత్తి యూదాజాతి పక్షమున ఎల్లవేళల పోరాడు దేవునికి ఇట్లు విన్నపము చేసిరి:

35. "ప్రభూ! నీకవసరమైనదేదియు లేదు. అయినను నీ నివాసమునకు గాను మా మధ్య ఒక దేవాలయముండుట నీకిష్టమయ్యెను.

36. కనుక మహాపవిత్రుడవైన ప్రభూ! ఇటీవలే శుద్ధిని పొందిన ఈ మందిరము ఏనాటికిని అపవిత్రము కాకుండునట్లు కాపాడుము."

37. యెరూషలేము నాయకులలో ఒకడైన రాగిసు అనువానిని గూర్చి నికానోరునకు పిర్యాదులు వచ్చెను. ఈ రాగిసు యూదులను గాఢముగా ప్రేమించెను. కనుక ప్రజలతడిని మిగుల గౌరవించి జాతిపితగా కొనియాడెడివారు.

38. యూదులు అన్యజాతి వారి మీద తిరుగుబాటు ప్రారంభించిన మొదటి రోజులలో స్వీయమత అవలంబనకుగాను రాగిసునకు శిక్షపడెను. అతడు ప్రాణములకుకూడ తెగించి యూదమత ఆచారములు పాటించెను.

39. యూదులనిన తనకే మాత్రము గిట్టదని తెలియజేయుటకుగాను నికానోరు ఐదువందలకు పైగా సైనికులను పంపి రాగసును బంధింపుడని చెప్పెను.

40. అతనిని బందీని చేసినచో యూదుల బలము సమసిపోవునని నికానోరు తలంచెను.

41. ఆ సైనికులు రాగిసు ఆశ్రయము పొందియున్న బురుజును ముట్టడించి దానిని వశము చేసికొనుటకు సిద్ధముగా నుండిరి. వారు వెలుపలి మండపములోనికి తెరచుకొను బురుజు ద్వారములను విప్పుటకు యత్నము చేసిరి. తలుపులను తగులబెట్టుటకుగాను అగ్నిని కొనితెండని ఆజ్ఞ ఇచ్చిరి. శత్రువులు తనను చుట్టుముట్టగా రాగిసు తన కత్తిమీదనే తానుపడి ప్రాణములు విడువగోరెను.

42. దుర్మార్గుల చేతికిచిక్కి అవమానములు భరించుటకంటె గౌరవప్రదముగా చనిపోవుటయే మేలనియెంచెను.

43. అతడు తన కత్తిమీదపడెను గాని ఆ గందరగోళములో గురితప్పి కొంచెము ప్రక్కకు పడినందున అది అతని ప్రాణములు తీయదయ్యెను. శత్రుసైనికులు అతడున్న గదిచెంతకు పరిగెత్తుకొని వచ్చుచుండిరి. వారిని చూచి అతడు గబాలున గోడ చెంతకు పరుగెత్తి అచటినుండి ధైర్యముతో క్రింద గుమి గూడియున్న జనసమూహములోనికి దూకెను.

44. కాని ఆ ప్రజలు దిఢీలున వెనుకకు జరుగగా అతడు వారు వదలి పెట్టిన ఖాళీస్థలములో పడెను.

45. అయినను అతడు చనిపోలేదు. సాహసముతో పైకి లేచి గాయములు నెత్తురులు చిమ్ముచుండగా జనసమూహము గుండ పరుగెత్తి ఒక ఎత్తయిన బండ మీదికి ఎక్కెను.

46. అప్పటికి రాగిసు దేహములోని నెత్తురంత కారిపోయెను. అతడు రెండుచేతులతో తన ప్రేగులను పెరికి జనము మీదికి విసరికొట్టెను. అట్లు విసరికొట్టుచు జీవమునకును, శ్వాసమునకును అధిపతియైన ప్రభువునకు ప్రార్థనచేసి ఆ ప్రేవులను ఒక దినమున మరల తనకు ప్రసాదింపుమని వేడుకొనెను. ఆ రీతిగా రాగిసు కన్నుమూసెను.

 1. యూదా అతని అనుచరులు సమరియా మండలమున ఉన్నారని నికానోరు వినెను. అతడు తనకెట్టి అపాయము కలుగకుండునట్లు విశ్రాంతి దినమున వారిమీదికి దాడిచేయవలెనని సంకల్పించు కొనెను.

2. కాని నిర్బంధముగా నికానోరు సైన్యము వెంటబోవు యూదులు "అయ్యా! నీవిట్టి క్రూరమైన ఘోరకార్యమును తలపెట్టరాదు. సర్వసాక్షియైన ప్రభువు మహాపవిత్రమైన దానినిగా నిర్ణయించిన విశ్రాంతి దినమును నీవును గౌరవింపవలెను” అని అతనిని వేడుకొనిరి.

3. ఆ తుచ్చుడు “విశ్రాంతిదినమును పాటింపుడని ఆజ్ఞాపించిన దేవుడొకడు స్వర్గమున ఉన్నాడా?” అని వారిని వేళాకోళము చేసెను.

4. యూదులు సజీవుడును పరలోకాధిపతియునైన ప్రభువే విశ్రాంతిదినమును పాటింపవలసినదిగా కట్టడ చేసెనని అతడితో చెప్పిరి.

5. కాని అతడు “ఈ భూమికి అధిపతిని నేనే. ఇప్పుడు మీరు మీ ఆయుధములను చేపట్టి రాజు కోరినట్లు చేయుడని నేను ఆజ్ఞాపించు చున్నాను” అని పలికెను. అయినను నికానోరు తాను తలపెట్టిన కార్యమును సాధింపజాలడయ్యెను.

6. నికానోరుతానొక విజయస్తంభమును నిర్మింతుననియు, తాను యూదా సైన్యమునుండి దోచుకొని వచ్చిన ఆయుధములను దానిమీద వ్రేలాడ దీయింతుననియు పొగరుబోతు తనముతో ప్రగల్భములు పలికెను.

7. యూదా మాత్రము ప్రభువు తనకు తోడ్పడునన్న నమ్మకముతో ధైర్యముగా ఉండెను.

8. అతడు శత్రువులను చూచి భయపడవలదని తన అనుచరులను హెచ్చరించెను. పూర్వము ప్రభువు తమనెట్లు ఆదుకొనెనో జ్ఞప్తికి తెచ్చుకొని, ఇప్పుడును ఆ ప్రభువు సహాయము లభించునని నమ్ముడని చెప్పెను.

9. ధర్మ శాస్త్రమునుండియు ప్రవక్తల గ్రంథముల నుండియు కొన్ని భాగములను చదివి వినిపించి వారికి ధైర్యము కలిగించెను. వారంతకు పూర్వమే విజయవంతముగా నిర్వహించిన యుద్ధములను జ్ఞప్తికి తెచ్చి వారికి ఉత్సాహము పుట్టించెను.

10. ఆ రీతిగా అతడు తన అనుచరులను యుద్ధమునకు సిద్ధముచేసి వారికి ఆయా ఆజ్ఞలను జారీచేసెను. శత్రువులు తాము చేసికొన్న ఒడంబడికను పాటింపరు కనుక వారిని ఎంత మాత్రము నమ్మరాదనికూడ హెచ్చరించెను.

11. డాళ్ళను, బల్లెములను నమ్ముకొనుడను మాటల ద్వారాకాక, ప్రభువును నమ్ముకొనుడని ధైర్యము చెప్పుట ద్వారా యూదా తన అనుచరులను ఉత్తేజపరచెను. అతడు వారికి ఉత్సాహము పుట్టించుటకు గాను తాను నిజముగా కనిన ఒక కలను, లేదా దర్శనమును ఇట్లు వర్ణించి చెప్పెను.

12. యూదా కలలో పూర్వము ప్రధానయాజకుడుగా పనిచేసిన ఓనియాసును చూచెను. ఆ మహానుభావుడు వినయవంతుడు, మృదుస్వభావము కలవాడు, మంచివక్త, చిన్ననాటి నుండి ధర్మబద్ధముగా జీవించుటకు తర్ఫీదు పొందినవాడు. ఈ ఓనియాసు చేతులు చాచి యూద జాతి అంతటికొరకు ప్రార్థన చేయుచుండెను.

13. అటు తరువాత యూదా వయోవృద్ధుడై ఠీవితోను, అధికారయుతమైన తేజస్సుతో వెలుగు మరియొక వ్యక్తిని చూచెను.

14. ఓనియాసు యూదాకు అతనిని చూపించి “ఇతడు ప్రవక్తయైన యిర్మీయా. ఇతడు తన సోదరులైన యూదులను గాఢముగా ప్రేమించువాడు. మన ప్రజల కొరకును, పరిశుద్ధనగరము కొరకును అధికముగా ప్రార్థనచేయువాడు” అని చెప్పెను.

15-16. అంతట యిర్మీయా తన కుడిచేయి చాచి యూదాకు సువర్ణ ఖడ్గమును బహూకరించి “నీవు దేవుడు కానుకగా పంపిన ఈ పవిత్ర ఖడ్గమును స్వీకరించి దీనితో శత్రువులను తుద ముట్టింపుము" అని చెప్పెను.

17. యూదా నోటినుండి ఉర్రుతలూగించు ఈ పలుకులు వెలువడగనే అతని సైనికులకు శౌర్యము పుట్టెను. యువకులు కూడ పెద్దవారివలె పోరాడుటకు సంసిద్ధులైరి. యూదుల నగరము, మతము, దేవాలయము ప్రమాదమునకు గురికానున్నవికదా! కనుక వారి శిబిరమున కాలము వ్యర్ధపుచ్చక వెంటనే పోయి ధైర్యముగా శత్రువుల మీద పడవలెననియు, విరోధులతో బాహాబాహి పోరాడి అటోఇటో తేల్చుకోవలెననియు నిర్ణయించుకొనిరి.

18. వారు తమ ఆలు బిడ్డలకొరకును బంధువులకొరకును అంతగా విచారింపరైరి. వారి చింత అంతయు పరిశుద్దమందిరము గూర్చియే.

19. మైదానమున జరుగనున్న యుద్ధము ఏ రీతిగా ముగియునో అని యెరూషలేమున మిగలియున్నవారు బెంగపడజొచ్చిరి.

20. యుద్ధమున ఎవరు గెల్తురో చూతమని ఎల్లరును ఆతురతతో ఎదురు చూచుచుండిరి. విరోధి సైన్యము బారులుతీర మొదలు పెట్టెను. వారు తమ అశ్వదళమును తమ సైన్యమునకు ఇరువైపుల ఉంచిరి. ఏనుగులను కీలకమైన తావులలో ఉంచిరి.

21. యూదా విస్తారముగా ఉన్న శత్రుసైన్యములను, బహువిధములుగా ఉన్న వారి ఆయుధములను, భయంకరముగా ఉన్న వారి ఏనుగులను పరికించి చూచెను. అతడు ఆకాశము వైపు చేతులు చాచి అద్భుతములు చేయు దేవునికి మనవి చేసెను. ఆ ప్రభువు కేవలము సైనికబలము కలవారికి కాక, అర్హులైనవారికి విజయము దయచేయునని అతనికి తెలియును.

22. అతడు ఇట్లు ప్రార్థించెను: “ప్రభూ! హిజ్కియా యూదాను పరిపాలించిన కాలమున నీవు దేవదూతను పంపితివి. అతడు సన్హరీబు దండున లక్షయెనుబదియైదువేల మందిని సంహరించెను.

23. పరలోకాధిపతివైన ప్రభూ! ఇప్పుడు కూడ నీ దూతను పంపి మా శత్రువులు భయముతో కలవరపడునట్లు చేయుము.

24. ఈ ప్రజలు నిన్ను దూషించుచు, నీ వెన్నుకొనిన జనులను నాశనము చేయుటకు వచ్చిరి. కనుక నీ మహా సైన్యముతో వీరిని మట్టుబెట్టుము.” ఇట్లు జపించి అతడు తన వేడుకోలును ముగించెను.

25. నికానోరు సైన్యము బాకాల మ్రోతతోను, యుద్ద గీతములతోను ముందుకు వచ్చెను.

26. కాని యూదా, అతని అనుచరులు దేవునికి ప్రార్ధన చేయుచు పోరు మొదలుపెట్టిరి.

27. వారు చేతులతో పోరాడుచు ఎదలో దేవునికి మనవి చేయుచు శత్రువులను ముప్పదియైదువేలమందికంటె ఎక్కువగా వధించిరి. ప్రభువు తమకు తోడ్పడినందుకుగాను ఎంతయో పొంగిపోయిరి.

28. యూదులు యుద్ధము ముగించి విజయము చేపట్టి తిరిగివచ్చునప్పుడు నికానోరు ఆయుధములను ధరించి యుద్ధరంగమున చచ్చిపడియుండుట చూచిరి.

29. వెంటనే వారు గొల్లున కేకలువేసి మాతృభాషలో ప్రభువును స్తుతించి కొనియాడిరి.

30. యూదా ఎల్లవేళల తన శక్తికొలది యూదుల కొరకు పోరాడినవాడు. చిన్ననాటినుండియు అతనికి ఉన్న దేశభక్తి ఇప్పటికి ఇసుమంతైనా తరుగలేదు. అట్టివాడు నికానోరు తలను, కుడిచేతిని నరికి యెరూషలేమునకు కొనిరండని తన అనుచరులను ఆజ్ఞాపించెను.

31. వారు యెరూషలేము చేరిన తరువాత యూదా పౌరులందరిని పిలిపించెను. యాజకులను ప్రోగుచేసి పీఠముముందట నిల్చెను. కోటలోని వారిని కూడ రప్పించెను.

32. అతడు దుర్మార్గుడైన నికానోరు. శిరస్సును వారికి చూపించెను. పూర్వము ఆ దేవదూషకుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రమందిరము వైపు దర్పముతో చాచిన చేతినిగూడ వారికి చూపించెను.

33. అటుపిమ్మట యూదా, ఆ నాస్తికుని నాలుకను కోసి, దానిని ముక్కలు ముక్కలుగా చేసి పక్షులకు ఆహారముగా కావింతునని చెప్పెను. నికానోరు తలను, చేతిని దేవాలయమునకు ఎదురుగా వ్రేలాడదీయించి అతడి తెలివితక్కువతనమును ఎల్లరికిని వెల్లడి చేయింతునని పలికెను.

34. అపుడచటి వారెల్లరు ఆకసమువైపు చూచి ప్రభువును స్తుతించిరి. ఆయన తన శక్తిని ప్రదర్శించి అపవిత్రత నుండి దేవాలయమును కాపాడెనుగదా!

35. యూదా నికానోరు తలను దుర్గ ప్రాకారముమీద వ్రేలాడదీయించెను. ప్రభువు యూదులకు చేసిన సహాయమునకు ఆ తల చక్కని నిదర్శనమయ్యెను.

36. ఆ దినము ఉపేక్షింపదగినదియు కాదని మొర్దెకయి పేర ఉత్సవము జరుగు రోజునకు ముందు నాడు ఈ సంఘటనమును గూర్చి ఉత్సవము చేసికోవలెననియు ఎల్లరును ఏకగ్రీవముగా అంగీకరించిరి. అరమాయికు భాషలో అదారు పేరు గల పండ్రెండవ నెలలో పదమూడవ దినమున ఈ పండుగ జరుగవలెననియు, నిర్ణయించిరి.

37. నికానోరు ఉదంతము ఈ రీతిగా ముగిసెను. ఈ సంఘటనము జరిగినప్పటినుండియు యెరూషలేము యూదుల అధీనముననే ఉన్నది. నేను ఈ చరిత్రను ఇంతటితో ముగింతును.

38. ఈ చరిత్ర బాగుగాను, సూటిగాను వ్రాయబడినదగునేని, నేను కోరిన కోరిక నెరవేరినట్లే. కాని ఇది నాసిగా వ్రాయబడినదగునేని, నా శక్తి ఇంతేయని ఒప్పుకొందును.

39. వట్టి ద్రాక్షసారాయమునుకాని, వట్టి నీటినికాని త్రాగుట ఆరోగ్యకరము కాదు. కాని నీటితో కలిసిన ద్రాక్షసారాయము త్రాగుటకు రుచిగానుండి ఆనందము చేకూర్చును. ఆ రీతిగనే ఆయా సంఘటనలను నేర్పుతో అమర్చి చెప్పిన కథ చదువరులకు ప్రీతిని కలిగించును. ఇంతటితో ఈ చరిత్రను ముగింతును.