1. తండ్రియగు దేవునియందును, ప్రభువగు యేసు క్రీస్తునందును, తెస్సలోనిక దైవసంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతిలు వ్రాయునది: మీకు కృపయు, శాంతియు కలుగునుగాక!
2. మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పు డును మిమ్ము పేర్కొందుము.
3. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి ఒనర్చునట్లు చేసినదియు, మన యేసుక్రీస్తు ప్రభువునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనదియు, మన దేవుడును, తండ్రియును అగు వానిఎదుట మేము స్మరింతుము.
4. సోదరులారా! దేవుడు మిమ్ము ప్రేమించి, మిమ్ము తన వారిగ ఎన్నుకొనియున్నాడని మాకు తెలియును.
5. ఏలయన, కేవలము మాటలచే మాత్రమేకాక, శక్తితోను, పవిత్రాత్మతోను, దాని సత్యము నందలి సంపూర్ణమగు నమ్మకముతోను మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే గదా!
6. మమ్మును, ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను, పవిత్రాత్మవలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి.
7. అందువలననే మాసిడోనియా, అకయాలలోని విశ్వాసులందరకును మీరు మార్గదర్శకులైతిరి.
8. ఏలయన, ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా, అకయాలలో ప్రతి ధ్వనించుట మాత్రమే కాక, దేవునియందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమియు లేదు.
9. మేము మిమ్ము చూడవచ్చినపుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినదియు, సత్య సజీవదేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినదియు వారు చెప్పుచున్నారు.
10. దేవునిచే మృత్యువునుండి లేవనెత్త బడినవాడును, రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహమునుండి మనలను రక్షించువాడును ఆయన కుమారుడును అగు యేసు క్రీస్తు పరలోకమునుండి వచ్చువరకు మీరు వేచియున్నారని వారు చెప్పుచున్నారు.
1. సోదరులారా! మేము మిమ్ము చూడవచ్చుట వ్యర్ధము కాలేదని మీకే తెలియునుగదా!
2. మీరు ఎరిగినట్లు మేము మీయొద్దకు రాకముందు ఫిలిప్పి నగరములో బాధలు అవమానములు పడినప్పటికిని మేము దేవునియందు ధైర్యము తెచ్చుకొని ఎన్నియో ఆటంకముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి.
3. ఏలయన, మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. కపటబుద్దితోనైనదియును కాదు.
4. అంతేకాక, దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరునో ఎల్లవేళలయందును అటులే పలికెదము. ఏలయన, ఆయన మమ్ము ఆమోదించి, సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడును ప్రయత్నింపక, మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము.
5. ఏలయన ముఖస్తుతితో మేము మీయొద్దకు రాలేదు. ధనాపేక్షను మరుగుచేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టముగా తెలియును. ఇందుకు దేవుడే సాక్షి!
6. మీ నుండి గాని, ఇతరుల నుండిగాని, ఎవరి నుండియైనను పొగడ్తలు పొందవలెనని మేము యత్నింపలేదు.
7. అంతేకాక, క్రీస్తు యొక్క అపోస్తలులుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండియు అటులచేయలేదు సుమా! పాలిచ్చుతల్లి తన పిల్లల విషయమై మృదువుగ శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగ ప్రవర్తించితిమి.
8. మీపై మాకున్న ప్రేమ వలననే, దేవుని సువార్తను మాత్రమే కాక, మా జీవిత మును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మీరు మాకు అంతటి ప్రేమపాత్రులైతిరి.
9. సోదరులారా! మేము ఎట్లు కృషిచేసితిమో, శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా! మీకు దేవుని సువార్తను ప్రకటించినపుడు, మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై, మేము రేయింబవళ్ళు పనిచేసితిమి.
10. విశ్వాసులైన మీపట్ల మేము ఎట్లు పరిశుద్ధముగను, నీతిగను, నిందారహితముగను ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు. అట్లే దేవుడును సాక్షి.
11. తండ్రి పిల్లలను ఎట్లు చూచునో, అట్లే మీలో ప్రతివ్యక్తిని మేము చూచితిమని మీకు తెలియును. మేము మీలో ప్రతివానిని హెచ్చరించితిమి. ప్రోత్సహించితిమి.
12. తన రాజ్యమునకును మహిమకును మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలెనని సాక్ష్యమిచ్చితిమి.
13. మరియొక కారణము వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలను అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తీసికొని వచ్చినపుడు, మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగ గ్రహించితిరి. నిజమే అది అట్టిదే. ఏలన, విశ్వాసులైన మీయందును ఆ వాక్కు సత్క్రియలను కలుగజేయుచున్నది.
14. సోదరీ సోదరులారా! మీరు యూదయాలోని దైవసంఘమును అనుకరించి, అచ్చటి యేసుక్రీస్తు ప్రజలు ఎట్టి శ్రమలు అనుభవించిరో మీ స్వదేశీయులద్వారా అవియే మీరును అనుభవించిరి.
15. ఆ యూదులు యేసుప్రభువును, ప్రవక్తలను చంపి మమ్ము హింసించిరి. వారు దేవునకు ఎంతయో అసంతృప్తిని కలిగించుచు మానవులకును అంతే విరోధులైరి.
16. అన్యజనులకు రక్షణను ప్రసాదించు సందేశమును మేము బోధింపకుండునట్లు కూడ మమ్ము వారు అడ్డగించిరి. వారు సర్వదా చేయు పాపములకిది పూరపరిణామము. కడన అంత మొందించుటకు దేవుని ఆగ్రహము వారిపై వచ్చినది.
17. సోదరులారా! శారీరకముగా మీ ఎడబాటు కొలది కాలమే అయినను మేము మనస్సున మిమ్ము తిరిగి చూడవలెనని ఎంతో ఆతృతతో అమితముగా ఆశించితిమి.
18. కావున తిరిగి మిమ్ము చేరవలెనని కోరితిమి. పౌలునైన నేను అనేక పర్యాయములు వెను దిరిగి మీ యొద్దకు పోవలెనని ప్రయత్నించితిని కాని, సైతాను మాకు అడ్డుపడెను.
19. మన యేసుప్రభువు వచ్చినపుడు ఆయన సన్నిధిని మా విజయమును గూర్చి పొగడుకొనుటకు మా నమ్మికయు, ఆనందమును, కీర్తి కిరీటమును మీరే, నిశ్చయముగా మీరే.
20. నిజముగా మీరే మా మహిమయు, ఆనందము!
1. తుదకు మేము దానిని ఎంత మాత్రము సహింపలేక ఒంటరిగా ఏతెన్సులో ఉండిపోవుటకు నిశ్చయించుకొని
2. క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటలో మాతో పాటు దేవుని కొరకు పనిచేయు మా సోదరుడగు తిమోతిని మీయొద్దకు పంపితిమి.
3. ఈ హింసల వలన మీలో ఏ ఒక్కరును వెనుదిరుగ రాదని మిమ్ము బలపరచుటకును, మీ విశ్వాసమునకు తోడ్పడుటకును అతనిని పంపితిమి. ఇట్టి శ్రమలు అనుభవించుట కొరకే మనము దేవునిచే ఎన్నిక చేయబడితిమని మీకు తెలియును.
4. ఏలయన, మనము హింసింపబడగలమని ముందుగనే, మీతో ఉన్నప్పుడే మీకు చెప్పితిమి. వాస్తవముగా అది అట్లే జరిగినది. అది మీకు బాగుగా తెలిసినదే కదా!
5. అందువలననే నేను ఇక సహింపలేక తిమోతిని పంపితిని. మీ విశ్వాసమును గూర్చి తెలిసికొనుటకు అతనిని పంపితిని. ఒకవేళ సైతాను మిమ్ము శోధించెనేమో అనియు మా కృషి అంతయు వ్యర్థమగునేమో అనియు భయముతో అటుల చేసితిని.
6. తిమోతి, ఇప్పుడు మీ నుండి మా వద్దకు తిరిగి వచ్చియున్నాడు. మీ విశ్వాసమును, ప్రేమను గూర్చిన శుభవార్తను మాకు అందించినాడు. మమ్మును గూర్చి మీరు ఎప్పుడునుమంచి గానే తలంతురనియు, మిమ్ము చూడవలెనని మేము ఎంత అపేక్షించుచున్నామో మమ్ము చూడవలెనని మీరును అంతగనే కోరుచున్నారనియు అతడు మాకు చెప్పియున్నాడు.
7. కనుక సోదరులారా! మేము పడుచున్న ఇన్ని కష్టములలో, బాధలలో కూడా మాకు ఎంతయో ప్రోత్సాహము కలుగుచున్నది. మీ విశ్వాసమే మాకు ఓదార్పు.
8. ఏలయన, ప్రభువునందలి మీ జీవితమున మీరు దృఢముగ నిలిచినచో మేము యథార్థముగ బ్రతికినట్లే.
9. ఏలయన, మీ వలన మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకు, మీ కొరకై, ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము?
10. మిమ్ము స్వయముగా చూచి, మీ విశ్వాసమునకు అవసరమైన వానిని అందించు అవకాశము కల్పింపుమని, రేయింబవళ్లు హృదయపూర్వకముగా ఆయనను అర్థించుచున్నాము.
11. స్వయముగ మన తండ్రియగు దేవుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు, మేము మిమ్ము చేరుటకు త్రోవను సిద్ధము చేయుదుముగాక!
12. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరిపట్ల ప్రేమయందును వర్ధిల్లజేయునుగాక!
13. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలసి వచ్చినపుడు, మన దేవుడును తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు.
1. చిట్టచివరిగా, సోదరులారా! దేవుని సంతోష పెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగ అటులనే జీవించుచు, అభివృద్ధి సాధింపవలెనని, మేము మిమ్ము ఇపుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించు చున్నాము.
2. ఏలయన, యేసుప్రభువు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తరువులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా!
3. మీరు పవిత్రులై ఉండవలెననియు భోగవాంఛలకు దూరముగ ఉండవలెననియు మీ విషయమున దేవుడు సంకల్పించియున్నాడు.
4. మీలో ప్రతివ్యక్తియు పవిత్రముగ, గౌరవనీయముగ తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలిసికొనవ లెను.
5. దేవుని ఎరుగని అన్యజనులవలె మీరు వ్యామోహపూరితమగు కాంక్షతో మెలగరాదు.
6. కనుక, ఈ విషయమున ఏ వ్యక్తియు తన సోదరునకు హాని చేయరాదు. అతని హక్కులకు భంగము చేయదగదు. ఏలయన అట్టి వారిని ప్రభువే శిక్షించునని మీకు పూర్వమే చెప్పి, హెచ్చరించి యుంటిమి.
7. అ పవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు. పవిత్ర జీవమును గడపుమనియే ఆయన పిలుపు.
8. కనుక ఇట్టి దేవుని పిలుపును తిరస్కరించువాడు మానవుని తిరస్కరించుట కాదు, తన పవిత్రాత్మను మీకొసగు దేవుని తిరస్కరించుచున్నాడు.
9. తోడి విశ్వాసులయెడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఏలయన, మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొన వలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను.
10. మాసిడోనియా అంతటను ఉన్న సోదరులందరిని మీరు నిజముగ ప్రేమించుచున్నారు. సోదరులారా, అయినను మీరు ఇంకను ఎక్కువగా ప్రేమను చూపవలెనని హెచ్చరించుచున్నాము.
11. మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగ జీవించుటకును పరుల జోలికి పోక, మీ స్వవిషయములను చూచుకొనుటకును, జీవనాధారమును కష్టించి సంపాదించుకొనుటకును ఆశింపవలెను.
12. ఈ విధముగ అవిశ్వాసుల వలన మీరు గౌరవమును పొందగలరు. మీ అవసరములకై ఇతరులపై ఆధారపడవలసిన పనిఉండదు. .
13. సోదరులారా! నమ్మకము లేని వ్యక్తులవలె | మీరు విచారపడకుండుటకు, చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలెనని మా కోరిక.
14. యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును.
15. ఏలయన, మేము మీకు చెప్పెడు ప్రభువు బోధన ఇది. ప్రభువు వచ్చెడి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారికంటే ముందు పోము.
16. ఆజ్ఞారావమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకా ధ్వనియును అచట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమును పొందుదురు.
17. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలిసికొనుటకు వారితోపాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందుము.
18. కావున ఈ మాట లతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు.
1. సోదరులారా! ఈ విషయములు సంభవించు కాలములను గూర్చిగాని నిర్ణీత సమయములను గూర్చిగాని మీకు వ్రాయనక్కర లేదు.
2. ఏలయన, ప్రభువు దినము రాత్రివేళ దొంగవలె వచ్చునని మీకు తెలియునుగదా!
3. "అంతయు ప్రశాంతముగ, సురక్షితముగ ఉన్నది” అని ప్రజలు అనుకొనునపుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవవేదనవలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు.
4. కాని సోదరులారా! మీరు చీకటియందులేరు. కనుక, దొంగవలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలుపగూడదు.
5. మీరు అందరు వెలుగు కుమారులును, పగటి కుమారులునై వున్నారు. మనము రాత్రికి గాని, చీకటికి గాని సంబంధించినవారము కాము.
6. కనుక ఇతరుల వలె, మనము నిద్రించు చుండరాదు. మేల్కొని జాగరూ కులమై ఉండవలెను.
7. నిద్రించువారు రాత్రివేళ నిద్రింతురు. మత్తుగా నుండువారు రాత్రివేళ మత్తుగా నుందురు.
8. కాని, మనము పగటివారము కనుక అప్రమత్తులమై ఉండ వలెను. విశ్వాసమును, ప్రేమను కవచముగను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగను మనము ధరింపవలెను.
9. దేవుని కోపమునకు గురికాక, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణను పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను.
10. యేసుక్రీస్తు వచ్చు దినమునకు మనము జీవించియున్నను, మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను.
11. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు. ఒకరి కొకరు తోడ్పడుడు.
12. మీకు మార్గదర్శకులుగను, బోధకులుగను ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడి మీతో పనిచేయు వారికి తగినంత గౌరవమును ఈయవలసినదిగ సోదరులారా! మిమ్ము మేము బ్రతిమాలుకొనుచున్నాము.
13. వారు చేయు పనికొరకై వారిని అధికముగ ప్రేమతో గౌరవింపుడు. మీలో మీరు సమాధానముగ ఉండుడు.
14. సోదరులారా! సోమరిపోతులను హెచ్చరింపుడు, పిరికివారిని ప్రోత్సహింపుడు, బలహీనులకు తోడ్పడుడు, అందరితోడను ఓర్పు వహింపుడు అని మిమ్ము అర్థించుచున్నాము.
15. ఎవ్వడును అపకారమునకు అపకారము చేయకుండ చూడుడు. అంతేకాక, ఎల్లవేళల ఒకరికొకరు ఉపకారము చేసికొనుటయు అందరికిని తోడ్పడుటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు.
16. సర్వదా సంతోషముగ ఉండుడు.
17. సదా ప్రార్ధింపుడు.
18. సర్వావస్థలయందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే.
19. ఆత్మను అడ్డగింపకుడు.
20. ప్రవచనమును తృణీకరింపకుడు.
21. సమస్తమును పరీక్షింపుడు. మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు.
22. అన్ని విధములైన చెడునకు దూరముగ ఉండుడు.
23. మనకు శాంతినొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక! మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహిత మొనర్చును గాక!
24. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలయన, ఆయన విశ్వసనీయుడు.
25. సోదరులారా! మా కొరకు కూడ ప్రార్ధింపుడు.
26. సోదరులకు అందరకు పవిత్రమైన ముద్దుతో శుభాకాంక్షలను అందింపుడు.
27. ప్రభువు యొక్క అధికారముతో, ఈ లేఖను సోదరులకు అందరకును చదివి వినిపింపవలసినదిగ మిమ్ము అర్థించుచున్నాను.
28. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీతో ఉండునుగాక!