ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పేతురు వ్రాసిన 1వ లేఖ

 1. యేసుక్రీస్తు అపోస్తలుడగు పేతురు, పొంతు, గలతీయ, కప్పదోసియ, ఆసియా, బితూనియాల యందు చెదరిపోయి, వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది:

2. పితయగు దేవుని సంకల్ప ఫలముగనే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసు క్రీస్తునకు విధేయులగుటకును,ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మవలన పవిత్రులనుచేసెను. మీకు కృపయు, సమాధానము లభించునుగాక!

3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలోనుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థాన మొనరించి, దాని మూలమున మనకు నూత్న జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును.

4. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీకొరకై పరలోకమున భద్ర పరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు.

5. మీరు యుగాంతమున ప్రకటింపబడెడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడు చున్నారు. కనుక అవి మీ కొరకే.

6. మీరు ఎదుర్కొనవలసిన పలువిధములగు పరీక్షలవలన తాత్కాలికముగ మీకు బాధ కలిగినను, దీనిని గూర్చి సంతోషింపుడు.

7. అవి మీ విశ్వా సము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడ అగ్నిచే పరీక్షింపబడును కదా! అట్లే బంగారముకంటె ఎంతో విలువైన మీ విశ్వాసము కూడ పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్ఠలును, మహిమయు కలుగును.

8. మీరు ఆయనను చూడకలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు.

9. ఏలయన, మీ విశ్వాసమునకు ఫలితముగ మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు.

10. ఈ రక్షణనుగూర్చియే ప్రవక్తలు శ్రద్దగ అన్వే షించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చెడి ఈ అను గ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగ చెప్పిరి.

11. క్రీస్తు అనుభవింపవలసిన కష్టములను, తదుపరి మహిమనుగూర్చి వారు ప్రవచించినపుడు వారియందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించెనో వారు తెలిసికొన ప్రయ త్నించిరి.

12. మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే గదా! అట్లు ప్రబోధించునపుడే దేవుడు వారికి ఒక విషయము స్పష్టపరచెను. ప్రవక్తల కృషి మీకొరకేగాని వారి స్వార్ధమునకు కాదని దేవుడు వారికి విదిత మొనర్చెను. సువార్తను గొనివచ్చిన దూత లుమీకీ సత్యములను బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లోనర్చిరి. ఈ సత్యములనే దేవదూతలు సహితము చూడ గోరిరి.

13. కనుక కృషియొనర్ప సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు. క్రీస్తు యేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు.

14. దేవునకు విధేయులై ఉండుడు. మీరు అజ్ఞానదశలో ఉన్నపుడు మీకు కొన్ని కోరికలు ఉండెడివి గదా! ఆ కోరికలకు బానిసలు కాకుండుడు.

15. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు. కనుక మీ ప్రవర్తనయందు మీరును పవిత్రులై ఉండుడు.

16. “నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులై ఉండుడు”.

17. దేవుని ప్రార్థించునపుడు మీరు ఆయనను 'తండ్రీ' అని పిలిచెదరు. వారివారి ప్రవర్తనలను బట్టి దేవుడు అందరికి పక్షపాతములేక తీర్పుచెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయనయందు భయభక్తులతో గడుపుడు.

18. ఏలయన, మీ పూర్వులనుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితమునుండి మీకు విముక్తి లభింప చేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియును. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారములవంటిది కాదు.

19. నిష్కళంకమైన గొఱ్ఱెపిల్లవంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి.

20. లోకము సృజింపబడకముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుదికాలమున విదితమొనర్చబడెను.

21. దేవుడు ఆయనను మృతులలోనుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు. కనుకనే మీ విశ్వాసమును, నమ్మకమును, దేవునియందు స్థిరపడినవి.

22. ఇప్పుడు సత్యమునకు విధేయులై మిమ్ము మీరు శుద్ది ఒనర్చుకొనినారు. తోడి విశ్వాసులపై నిజమైన ప్రేమను కలిగియున్నారు. కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగ గాఢముగ ప్రేమింపుడు.

23. ఏలయన, క్షయమగు బీజము ద్వారాగాక, సజీవమును, శాశ్వతమును అగు దేవుని వాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మము నొందితిరి. అమరుడగు పితకు సంతానమైతిరి.

24. “మానవులందరు గడ్డిమొక్కలవంటివారు; వారి వైభవము గడ్డిపూలవంటిది; గడ్డి నశించును, పూలు రాలిపోవును.

25. కాని దేవుని వాక్కు ఎల్లప్పుడును నిలుచును” సువార్త మీకు అందించిన సందేశము ఇదియే. 

 1. సమస్త దుష్టత్వమునకు దూరముగ ఉండుడు. ఏ మాత్రము అబద్ధము ఆడకుడు. కపటముము గాని అసూయగాగాని ఉండరాదు. పరదూషణ మానివేయుడు.

2. నూతనముగా జన్మించిన శిశువుల వలె కల్మషములేని వాక్కు అను పాలకొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుటవలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు.

3. ఆ విధముగనే ప్రభువుయొక్క కృపను రుచి చూచినవారగుదురు.

4. నిరుపయోగము అయినదిగ మనుజులచే తిరస్కరింపబడి, అమూల్యమైనదిగ దేవునిచే ఎన్నుకొన బడిన సజీవశిలయగు ప్రభువును సమీపింపుడు.

5. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగ మిమ్ము ఉపయోగింపనిండు. యేసు క్రీసు ద్వారా, ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవు నకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగ చేయనిండు.

6. "నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని; దానిని సియోనులో మూలరాయిగ స్థాపించుచున్నాను; ఆయనను విశ్వసించువాడు ఎన్నిటికిని సిగ్గుపడడు” అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది.

7. విశ్వాసులగు మీకు ఈ రాయి అమూల్యమైనది. కాని అవిశ్వాసులకు “ఇల్లు కట్టు వారిచే నిరాకరింప బడిన రాయియే మూలరాయి ఆయెను.”

8. “మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడచేయునది ఈ రాయియే; వారిని పడద్రోయునదియు ఈ రాయియే” ఆ వాక్కును విశ్వసింపకుండుటచేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవసంకల్పము అట్టిది.

9. కాని మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజకబృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరుపబడినవారు. ఆయనయే మిమ్ము చీకటినుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను.

10. ఒకప్పుడు మీరు ప్రజ కారు. కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు మీరు కనికరమును ఎరు గరు. కాని ఇప్పుడు మీరు ఆ కనికరమును కనుగొంటిరి.

11. మిత్రులారా! ఇహలోకమున పరదేశులుగ, వలసదారులుగ ఉన్న మీకు నేను మనవి చేసికొను చున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడును ఆత్మతో పోరాడుచుండును. కనుక వ్యామోహితులు కాకుండుడు.

12. మీరు సత్పవర్తన గలవారై ఉండ వలెను. అన్యులు మిమ్ము దుష్పవర్తకులని దూషించు నెడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించునట్లు ప్రవర్తింపుడు. అప్పుడు వారు దర్శనము ఇచ్చు దినమున దేవుని మహిమపరుపగలరు.

13. ప్రభువు నిమిత్తమై మానవులగు అధికారులకు అందరకు లోబడియేఉండుడు. సర్వాధిపతి చక్రవర్తికి వినమ్రులై ఉండుడు.

14. దుష్టులను శిక్షించుటకును, శిష్టులను మెచ్చుకొనుటకును పంపబడిన పాలకులకు విధేయులై ఉండుడు.

15. మీరు మీ సత్కార్యములవలన మూర్ఖప్రజల జ్ఞానహీన మాటలను అణచివేయవలెను. ఇది దేవుని చిత్తము.

16. స్వేచ్ఛా జీవులుగ బ్రతుకుడు. కాని మీ స్వేచ్చ ద్వారా దౌష్ట్యమునుకప్పిపుచ్చకుడు. దేవుని దాసులుగనే జీవింపుడు.

17. అందరిని గౌరవింపుడు. తోడి విశ్వా సులను ప్రేమింపుడు, దేవునియందు భయభక్తులు కలిగి ఉండుడు. చక్రవర్తికి మర్యాదచూపుడు.

18. సేవకులారా! మీ యజమానులకు మీరు విధేయులు కావలెను. వారికి సమస్త మర్యాదలను చూపుడు. దయాపరులును, సౌమ్యులును అగువారికి మాత్రమే కాదు, కుటిలమనస్కులగువారికి కూడ మర్యాద చూపుడు.

19. ఎవడైనను అన్యాయముగ శ్రమపొందుచు, దేవుని ఎడల నిష్కపట మనస్సాక్షి కలిగి, దానిని ఓర్పుతో సహించినయెడల దేవుని అంగీకారమును పొందును.

20. ఏలయన, తప్పొనర్చి దానికి ప్రతిఫలముగ శిక్షను ఓర్పుతో భరించినచో దానియందు ఏమి గొప్పతనము ఉన్నది? కాని మంచినే చేసియు, దానికై బాధను అనుభవింపవలసి వచ్చినపుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును.

21. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏలయన, క్రీస్తే మీ కొరకు బాధపడి, ఆయన అడుగుజాడలలో మీరును అనుస రించుటకు గాను, ఒక ఆదర్శమును ఏర్పరచెను.

22. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడును ఎట్టి అసత్యమును వెలువడలేదు.

23. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగ తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మ కము ఉంచెను.

24. మనము పాపమునకు మర ణించి నీతికి జీవించునట్లుగ, ఆయన మన పాపము లను తనపై ఉంచుకొని సిలువమ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి.

25. మీరు త్రోవతప్పిన గొఱ్ఱెలవలె ఉంటిరి. కాని ఇప్పుడు, మీ ఆత్మలకు రక్షకుడును, కాపరియు అగువానియొద్దకు మీరు మరలి ఉన్నారు. 

 1. భార్యలారా! మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలెను. అపుడు వారిలో ఎవరైన దేవుని వాక్కును విశ్వసింపనివారు ఉన్నచో మీరు ఒక్క మాటయైన పలుకవలసిన అవసరము లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు.

2. ఏలయన, భయభక్తులతోను, పరిశుద్ధతతోను కూడిన మీ ప్రవర్తనను వారు గమనింపగలరు.

3. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసికొనుట అను బాహ్య సౌందర్యము కాక,

4. మీ సౌందర్యము ఆంతరంగికమైనదై ఉండవలెను. అది సౌమ్యమును, సాధువును అగుఅక్షయ ఆత్మ సౌందర్యము. అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది.

5. ఏలయన, భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్య మును పోషించుకొనుచు, తమ భర్తలకు విధేయురాండ్రై ఉండిరి.

6. సారా అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగ సంబోధించినది. మీరును సత్కార్యములొనర్చు వారై దేనికిని బెదరనివారైనచో ఆమెకు బిడ్డలగుదురు.

7. భర్తలారా! అట్లే మీరును మీ భార్యలు జీవము అను కృపావరములో మీతో పాలివారై ఉన్నవారని ఎరిగి సగౌరవముగను, ఉదారముగను వారితో జీవింపుడు. స్త్రీలు అబలలని మీరు ఎరుగుదురు గదా! మీ ప్రార్థనలకు ఏదియు అడ్డురాకుండ ఇట్లు చేయుడు.

8. కడన, మీరు అందరును ఏకమనస్కులును, ఏకాభిప్రాయము కలవారునై ఉండుడు. పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండుడు. కరుణ, వినయము కలవారై అన్యోన్యతను ప్రదర్శింపుడు.

9. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు, అందుకు మారుగ ఆశీర్వదింపుడు. ఏలయన, దేవుడు మిమ్ము పిలిచి నపుడు మీకు ఒసగిన వాగ్దానము ఆశీర్వచనమే గదా!

10. “ఆనందమయమైన జీవితమును, సుఖప్రదమైన దినములను ఆశించు వాడెవడును దుర్భాషలాడరాదు, అసత్యము పలుకరాదు.

11. అట్టివాడు కీడునుండి మరలి మేలొనర్పవలెను. అతడు శాంతి నన్వేషించుచు దానినే అనుసరింపవలెను.

12. ఏలయన, మంచివారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును. వారి ప్రార్థనలను ఎల్లవేళల ఆలకించును. కాని దుష్టులకు దేవుడు విరోధి అగును"

13. మంచిచేయవలెనని మీకు ఆసక్తియే ఉన్నచో మీకు హానిచేయునది ఎవ్వడు?

14. ఒకవేళ మంచి చేయుటలో మీకు కష్టములే సంభవించినను మీరు ఎంత ధన్యులు! వారి బెదరింపులకు భయపడకుడు, కలవరపడకుడు.

15. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగ ప్రతిష్ఠించు కొనుడు. మీ యందున్న నమ్మ కమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానమునొసగ సర్వదా సంసిద్ధముగ ఉండుడు.

16. దానిని మర్యాదగ, సగౌరవముగ చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగ ఉంచుకొనుడు. ఏలయన, మిమ్ము ఎవరైన దూషింతురనుకొనుడు. అప్పుడు క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగ మాటలాడు ఆ వ్యక్తులు, తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు గదా!

17. అదియే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దాని కంటె మంచి చేసినందులకు బాధలనొందుటయే మేలు.

18. ఏలయన, క్రీస్తు కూడ మృత్యువు పాలయ్యెను గదా! ఆయన ఒకేసారి పాపములకై మర ణించెను. దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అటుల చేసెను. శారీరకముగ ఆయన మరణించెను. కాని ఆధ్యాత్మికముగ సజీవుడే.

19. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను.

20. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునకు విధేయులుకాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచియుండెను గదా? ఓడయందలి కొద్దిమందియే, కేవలము ఎనిమిది మంది మాత్రమే, జలముచే రక్షింపబడిరి.

21. ఈ జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. కాని కేవలము శారీరక శుద్దిచే కాదు. పవిత్రమగు అంతఃకరణముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞాన స్నానము మిమ్ము రక్షించును.

22. ఆయన పరలోక మున చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలును, అధికారులును, శక్తులును ఆయనకు లోబడియున్నారు. 

 1. శారీరకముగ క్రీస్తు కష్టముల పాలయ్యెను. కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడ ఆత్మ స్థిరత్వమును పొందవలెను. ఏలయన, శారీరకముగ కష్టపడు వాడు పాప జీవితమును విడనాడిన వాడగును.

2. కనుక ఇప్పటినుండి మీ ఐహిక జీవితములను దేవుని సంకల్పమునకు అనుగుణముగ గడపుడు. లౌకిక వ్యామోహములకు లోనుగాకుండుడు.

3. ఏలయన, గతమున అన్యులవలెనే మీరును ఎంతయో కాలము గడపితిరి. లజ్జా విహీనముగ జీవించితిరి. మోహపరవశులైతిరి. త్రాగుబోతులైతిరి. త్రుళ్ళుచు విందులు చేసితిరి. అసహ్యకరమగు విగ్రహారాధనలు కావించితిరి.

4. మీరు వారితో కలసి విచ్చలవిడిగ నిర్లక్ష్యమైన జీవితమును దైవదూషణమును చేయకుండుటచే వారు ఆశ్చ ర్యచకితులైరి.

5. కాని, దేవునియెదుట సమాధానము చెప్పుకోవలసి ఉన్నది. ఆయన సజీవులకును, మృతులకును న్యాయనిర్ణయ మొనర్ప సిద్ధముగా ఉన్నాడు.

6. ఇందువలననే మృతులకు కూడ సువార్త బోధింపబడినది. అందరివలెనే వారి ఐహిక జీవితమున వారును తీర్పునకు గురియైరి. కాని వారి ఆత్మ సంబంధమైన జీవనమునందైనను వారు దేవునివలె జీవింపగలుగుదురని అది వారికి బోధింపబడినది.

7. అన్నిటికిని తుది సమయము ఆసన్నమైనది. మీరు స్వస్థబుద్ధి గలిగి, మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను.

8. అన్నిటికంటే ముఖ్యముగ ఒకరి యెడల ఒకరు ఎక్కువగ ప్రేమకలవారై ఉండుడు. ఏలయన, ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును.

9. సణుగుకొనక, ఒకరికి ఒకరు ఆతిథ్య మొసగుడు.

10. పలురకములైన దేవునివరములకు ఉత్తమ నిర్వాహకులవలె, ప్రతివ్యక్తియు, దేవునినుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను.

11. ఉపదేశించు వాడెవ్వడని, దేవుని వాక్కునే ఉపదేశింపవలెను. సేవ యొనర్చు వాడె వ్వడని, దేవుడాతనికొసగిన శక్తితోనే సేవింపవలెను. అట్లయినచో మనము సర్వ విషయములందును యేసుక్రీస్తు ద్వారా దేవుని స్తుతింపగలుగుదుము. ఆయనకు సర్వదా మహిమయు, ప్రభావము కలుగు నుగాక! ఆమెన్.

12. ప్రియ మిత్రులారా! మీరు ఒక బాధాకరమైన పరీక్షకు గురియై కష్టపడుచున్నారు. కాని అది ఏదో అసాధారణమైనట్లు ఆశ్చర్యపడకుడు.

13. అంతేకాక, క్రీస్తు బాధలలో పాలుపంచుకొనుచుంటిమని ఆనందింపుడు. దానివలన ఆయన మహిమ ప్రదర్శింప బడిననాడు మీరు మహానందమును అనుభవింపగలరు.

14. క్రీస్తు అనుచరులని మీరు అవమానింప బడినచో మీరు ధన్యులు. ఏలయన, ఆ మహిమోపేతమగు దేవుని ఆత్మ మీయందు చేరియున్నదని దాని భావము.

15. హంతకుడిగ, దొంగగ, దోషిగ ఇతరుల వ్యవహారములలో జోక్యమొనర్చుకొనిన వాడుగ, మీలో ఎవ్వడును, బాధపడతగదు.

16. అయినను, క్రైస్తవుడైనంత మాత్రమునకే మీరు కష్టపడవలసి వచ్చినచో దానికి సిగ్గుపడకుడు. అంతేకాదు. మీరు క్రీస్తు నామమును ధరించినందుకు దేవునకు కృతజ్ఞతలను అర్పింపుడు.

17. తీర్పు ప్రారంభమగు సమయము ఆసన్నమైనది. దైవప్రజలే ముందుగ తీర్పునకు గురియగుదురు. అది మనతోడనే మొదలైనచో దేవుని సువార్తను విధేయింపనివారి గతియేమి?

18. “నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైనచో;  భక్తిహీనులు, పాపాత్ములు అగువారి గతి ఏమి?"

19. కనుక, దేవుని చిత్తప్రకారము బాధల ననుభవించువారు సత్ప్రవర్తన కలవారై నమ్మదగిన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 

 1. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగమొనర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించున దేమన:

2. మీ అధీనమందున్న దేవుని మందకు కాపరులుకండు. అయిష్టముతోకాక, దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగ దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగ దానిని కాయుడు.

3. మీ అధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు.

4. ప్రధానకాపరి ప్రత్యక్షమైనపుడు, మీరు ఎన్నటికిని క్షిణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు.

5. యువకులారా! మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము  అను వస్త్రమును ధరింపవలెను. ఏలయన, “దేవుడు అహంకారులను ఎదిరించి, వినయశీలురను కటాక్షించును.”

6. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులుకండు. యుక్తసమయమున ఆయన మిమ్ము ఉద్దరించును.

7.ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నియు ఆయనపై మోపుడు.

8. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహమువలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు.

9. దృఢవిశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగ ఉన్న మీ తోటి విశ్వాసులును ఇట్టి బాధలనే అనుభవించు చున్నారని మీకు తెలియును గదా!

10. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగ క్రీస్తుతో ఐక్యమునొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలనొందిన తరువాత ఆయనయే స్వయముగ మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్ఠతను, బలమును అనుగ్రహించును.

11. ఆయనకు సర్వదా ప్రభావము కలుగును గాక! ఆమెన్.

12. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగ ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయు చున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలెననియు, ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్య మొసగ వలెననియు మాత్రమే నా అభిమతము. దానియందు మీరు దృఢముగ నిలిచి ఉండుడు.

13. మీవలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవసంఘము కూడ మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అటులనే నా కుమారుడు మార్కు కూడ.

14. క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగును గాక!