ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు 19వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. కల్లలాడు మూర్ఖునికన్న చిత్తశుద్ధితో జీవించు పేద మేలు.

2. ఆలోచనలేని ఉత్సాహము మంచిదికాదు. తొందరపడువాడు దారితప్పును.

3. కొందరు తెలివిలేమిచే తమకుతామే చెడిపోవుదురు అతని హృదయము ప్రభువునకు విరుద్ధముగా కోపగించుకొనును.

4. ధనవంతునికి ఎందరో మిత్రులు కలుగుదురు. పేదవానికున్న ఒక్క మిత్రుడు కూడ వీడిపోవును.

5. కూటసాక్షికి శిక్ష తప్పదు. అబద్దములాడువాడు తప్పించుకోలేడు.

6. అనేకులు ధర్మదాత కటాక్షముకొరకు వెదకుదురు. బహుమానములు ఇచ్చువానికి అందరును స్నేహితులే.

7. పేదవాని తోబుట్టువులే అతనిని చీదరించుకొందురనిన ఇక మిత్రులతనికి ఎంత దూరముగానుందురో వేరుగా చెప్పవలయునా?

8. విజ్ఞానము నార్జించువాడు తనకు తాను ఉపకారము చేసికొనును. వివేకమును బడయువాడు విజయము సాధించును.

9. కూటసాక్షికి శిక్ష తప్పదు, అబద్దములాడువానికి చావుమూడును.

10. మూర్ఖుడు సిరిసంపదలతో వైభవముగా జీవింపరాదు దాసుడు రాకుమారులను పాలించరాదు.

11. వివేకశాలి కోపము అణచుకొనును. ఇతరులు చేసిన అపకారమును విస్మరించుటయే అతడి గొప్ప.

12. రాజు కోపము, సింహగర్జనమువలె ఉండును. కాని అతని అనుగ్రహము గడ్డిమీద కురిసిన మంచువలెనుండును.

13. మూర్ఖుడైన పుత్రునివలన తండ్రి పేరు చెడును. భార్య సణుగుడు ఇంటికప్పులోనుండి కారు నీటిబొట్లవలెనుండును.

14. ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు తండ్రి తాతలనుండి వచ్చును. కాని వివేకవతియైన ఇల్లాలు ప్రభువు ప్రసాదించు వరము.

15. సోమరితనము నిద్రతెచ్చును. సోమరిపోతునకు ఆకలితప్పదు.

16. ప్రభువు ఉపదేశమును పాటించువాడు బ్రతుకును దానిని అనాదరము చేయువాడు మృత్యువు వాతబడును.

17. పేదలనాదుకొన్నచో ప్రభువుకే అప్పిచ్చినట్లు, ఆ అప్పును ఆయన తప్పక తీర్చును.

18. ప్రవర్తన మార్చుటకు కుమారుని శిక్షింపవలయును. కాని అతని నాశనమును కోరరాదు.

19. కోపస్వభావుడు తన శిక్షను తానే తెచ్చుకొనును. అతనిని ఆదుకొన్నచో నీకును తిప్పలువచ్చును.

20. పరుల హితోపదేశమును, దిద్దుబాటును అంగీకరించువాడు ఒకనాటికైనను జ్ఞానియై తీరును.

21. నరులు ప్రణాళికలు వేసికోవచ్చునుగాక, కాని దేవుని సంకల్పము నెరవేరితీరును.

22. మనిషిలో విశ్వసనీయత మెచ్చదగినది. అసత్యములు పలుకుటకంటె నిరుపేదగా ఉండుట మేలు.

23. దైవభీతిగల నరునికి జీవనమబ్బును. అతడు శాంతి సౌఖ్యములతో అలరారి కీడులనుండి వైదొలగును.

24. సోమరిపోతు భోజనపాత్రములో చేయిపెట్టునేగాని అందలి అన్నమును ఎత్తి నోట బెట్టుకొను యత్నమైనను చేయడు.

25. అహంకారిని శిక్షించినచో మూర్ఖులకు బుదివచ్చును. దిద్దుబాటువలన వివేకి జ్ఞానము తెచ్చుకొనును.

26. తండ్రిని బాధించువాడు, తల్లిని ఇంటినుండి గెంటివేయువాడు సిగ్గుమాలినవాడు, అపకీర్తి తెచ్చుకొనువాడుకూడ.

27. కుమారా! నీవు విజ్ఞానమును ఆర్జించుటను మానుకొందువేని పూర్వము నేర్చుకొన్నదికూడ అశ్రద్ధ చేయుదువు.

28. అన్యాయము తలపెట్టిన సాక్షి , న్యాయమును చెరచును. దుర్మార్గులకు దుష్టవర్తనమనిన పరమప్రీతి.

29. భక్తిహీనులకు తీర్పు తప్పదు. మూర్ఖుని వీపునకు దెబ్బలు తప్పవు.