1. ఆ మాటలువిని రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మము మీదిగదిలోనికి వెళ్ళి శోకము పట్టజాలక “హా! కుమారా అబ్షాలోమూ! నా కుమారా అబ్షాలోమూ! నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయిన ఎంత బాగుగానుండెడిది! హా! కుమారా అబ్షాలోమూ!” అని విలపించెను.
2. దావీదు అబ్షాలోము కొరకు విలపించుచున్నాడని యోవాబు వినెను.
3. రాజు ఆ రీతిగా శోకించుచుండుటచే సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను.
4. సైనికులు యుద్ధమున ఓడిపోయిన వారి వలె చిన్నబోయిన మొగములతో చాటు చాటుగా వచ్చి పురమున జొరబడిరి.
5. రాజు మొగముపై ముసుగు వేసికొని “హా! కుమారా అబ్షాలోమూ! కుమారా అబ్షాలోమూ!” అని ఏడ్చుచుండెను.
6. యోవాబు రాజు విలపించుచున్న గదిచొచ్చి "సైనికులు నేడు నిన్ను, నీ పుత్రీపుత్రులను, నీ భార్యలను, ఉంపుడుకత్తెలను ప్రాణములతో కాపాడిరిగదా! కాని నీవు వారికి తలవంపులు తెచ్చిపెట్టుచున్నావు.
7. నిన్ను ద్వేషించిన వారి పట్ల గాఢప్రేమను, ప్రేమించినవారిపట్ల గాఢద్వేషమును కనబరచుచున్నావు. ఈ సేనాధిపతులన్నను, సైనికులన్నను నీకసలు అభిమానమే లేదు. అబ్షాలోము బ్రతికియుండి మేమందరము చచ్చినయెడల నీవు మిగుల సంతసించెడివాడవని ఇపుడు తేటతెల్లమైనది.
8. ప్రభూ! ఇక లేచిరమ్ము. ఈ సైన్యములకు ఉత్సా హము కలుగునట్లు నాలుగు మాటలు చెప్పుము. యావే తోడు! నీవిపుడు వీరిని మెచ్చుకోవైతివేని ఈ రేయి నీ పక్షమున ఒక్కడును మిగులడు. బాల్యము నుండి నేటివరకును నీకు సంభవించిన విపత్తులు అన్నిటికంటెను ఇదియే పెద్ద విపత్తు కాగలదని భావింపుము” అని హెచ్చరించెను.
9. కనుక రాజు లేచి నగరద్వారము నొద్దకు వచ్చి నిలుచుండెను. రాజు ద్వారముచెంత ఆసీనుడయ్యెనని సైనికులు గుసగుసలు వోయిరి. వెంటనే వారందరు సమావేశమై రాజునకు కనిపించుకొనిరి.
10. అప్పటికి యిస్రాయేలీయులు తమ గుడారములకు పారిపోయిరిగదా! వారిలో వారికి భేదాభిప్రాయములు పుట్టెను. వారు “రాజు మనలను శత్రువుల బారినుండి, ఫిలిస్తీయుల బెడదనుండి కాపాడెను గదా! ఇపుడతడే అబ్షాలోమునకు వెరచి దేశమునుండి పారిపోవలసివచ్చెను.
11. మనము అభిషేకించిన అబ్షాలోము రణమున మడిసెను. కనుక రాజును మరల కొనివచ్చుట శ్రేయముగదా!” అనుకొన జొచ్చిరి. యిస్రాయేలీయులు ఈ రీతిగా మథనపడు చున్నారని రాజు వినెను.
12. వెంటనే దావీదు యాజకులు సాదోకు, అబ్యాతారులకు కబురుపంపి “యూదా పెద్దలతో ఇట్లు నుడువుడు. 'రాజును కొనివచ్చిన వారిలో మీరు చివరి వారు అనిపించుకోనేల?
13. మీరు నాకు ఎముక నంటినట్టియు, మాంసమునట్టినయు సహోదరులు రాజును కొనివచ్చుటకు మీరెందులకు ఆలస్యము చేయుచున్నారు?'
14. మరియు అమాసాతో ఇట్లు చెప్పుడు. నీవు నాకు ఎముకనంటిన బంధుడవు, మాంసమునంటిన బంధుడవు కాదా? యోవాబునకు బదులుగా నిన్నే సైన్యాధిపతిగా నియమింపనేని యావే నాకు కీడు తలపెట్టునుగాక!” అని చెప్పించెను.
15. ఆ మాటలాలించి యూదీయులందరు ఒక్కుమ్మడిగా దావీదుతో కలిసిపోయిరి. వారు “రాజు బలగములతో వెంటనే తిరిగిరావలెను” అని దావీదునకు వార్తపంపిరి.
16. రాజు యెరూషలేమునకు పయనమై యోర్దాను చేరుకొనెను. అతనిని కలిసికొని నది దాటించుటకై వచ్చిన యూదీయులు కూడ గిల్గాలు చేరిరి.
17. గేరా కుమారుడు, బెన్యామీనీయుడు, బహూరీము పురవాసియునగు షిమీ కూడ యూదీయులతో వచ్చి రాజును కలిసికొనెను. అతనితో వేయి మంది బెన్యామీనీయులు కూడవచ్చిరి.
18. సౌలు కుటుంబమునకు ఊడిగముచేయు సీబా కూడ తన పదునైదుగురు కుమారులతో, ఇరువదిమంది దాసులతో వచ్చి రాజు యెదుట యోర్ధాను దాటిరి.
19. వారు రాజు దృష్టికి అనుకూలమైనదానిని చేయుటకు రాజ కుటుంబమును నది దాటించి మెప్పువడసిరి.
20. రాజు నది దాటగనే గేరా కుమారుడు షిమీ అతని కాళ్ళమీదపడి “ప్రభువులవారు నా తప్పు మన్నింపవలయును. ఏలిక యెరూషలేమును వీడిన నాడు ఈ దాసుడు చేసిన అవమానమును ప్రభువు విస్మరించుగాక! అసలా సంగతియే ప్రభువుల వారి స్మృతికి రాకుండుగాక! ఈ దాసుడు అపరాధము చేసిన మాటనిజమే.
21. కనుకనే నేడు నేను యోసేపు తెగలందరిలోను మొట్టమొదటవచ్చి రాజును కలిసి కొంటిని” అని విన్నవించుకొనెను.
22. అపుడు సెరూయా పుత్రుడు అబీషయి "నాడు జంకుబొంకు లేక యావే అభిషిక్తుని శపించిన ఈ షిమీ నిక్కముగా వధార్హుడు” అనెను.
23. కాని దావీదు “సెరూయా పుత్రులారా! మీరీ సంగతి పట్టించుకోవలదు. ఇపుడు నన్నెదిరింపవలదు. ఇంతటి శుభ దినమున యిస్రాయేలీయునొకనిని చంపుటయా? నిశ్చయముగా నేడు నేను యిస్రాయేలీయులకు రాజునుగదా!” అనెను.
24. అతడు షిమీతో “నిన్ను చంపను” అని ఒట్టు వేసికొనెను.
25. సౌలు మనుమడు మెఫీ బోషెతుకూడ రాజునకు ఎదురుకోలు చేయబోయెను. రాజు వెడలిపోయిన నాటినుండి తిరిగివచ్చువరకు మెఫీబోషెతు తన కాలుసేతుల సంగతి పట్టించుకోలేదు. గడ్డము చక్కదిద్దుకోలేదు. దుస్తులు శుభ్రము చేసికోలేదు.
26. అతడు యెరూషలేము నుండి బయలుదేరి వచ్చి రాజును కలిసికొనగనే రాజు “ఓయి! నీవు నాతో రావైతివేల?” అని అడిగెను.
27. మెఫీబోషెతు “ప్రభూ! నా దాసుడు నన్ను మోసగించెను. నేను కుంటివాడను గదా! 'నాకు గాడిదపై జీను వేయుము. నేనును రాజుతో పోయెదను' అని సేవకునికి చెప్పితిని.
28. అతడు నన్ను గూర్చి యేలికకు కల్లబొల్లికబురులు చెప్పెను. అయినను ప్రభూ! నీవు దేవదూతవంటి వాడవు. ఇక నీకు సబబనిపించినట్లే చేయుము.
29. మా కుటుంబమువారందరు నీ చేజిక్కి మడియుటకే నోచుకొనిరి. అయినను ఈ దాసుని నీ సరసన కూర్చుండి భోజనము చేయుమంటివి. నేనిక నీకు విన్నవించుకోనేల?” అనెను.
30. రాజు “ఓయి! నీవిక చెప్పనక్కరలేదు. సీబా, నీవు ఆ ఆస్తిని సమముగా అనుభవింపుడు. ఇది నా ఆజ్ఞ” అని వక్కాణించెను.
31. మెఫీబోషెతు “ఆ పొలముపుట్ర వానినే అను భవింపనిమ్ము. ప్రభువు సురక్షితముగా నగరము చేరుకొనెను. నాకు అదియే పదివేలు" అని బదులు పలికెను.
32. గిలాదీయుడగు బర్సిల్లయి కూడ రోగెలీము నుండి పయనమైపోయి దావీదుతో కొన్నాళ్ళు గడపి అతనిని యోర్దాను వరకు సాగనంపుటకు వచ్చెను.
33. అతడు ఎనుబది యేండ్ల పండుముసలి. రాజు మహనాయీమున ఉన్నంత కాలము అతడే వెచ్చము లిచ్చి పోషించెను. బర్సిల్లయి సిరిసంపదలతో తుల తూగువాడు.
34. రాజు అతనితో “నీవును నా వెంట యెరుషలేమునకు రమ్ము. ఈ ముసలిప్రాయమున నిన్ను నా ఇంట ఉంచుకుని నా పెట్టుపోతలతో అలరింతును” అని అనెను.
35. కాని బర్సిల్లయి రాజును చూచి “నీతో యెరూషలేము వచ్చుటకు నేనింకను ఎన్నేండ్లు బ్రతుకుదును?
36. నాకిప్పటికి ఎనుబదియేండ్లు. మంచిచెడ్డలు గుర్తింపగల శక్తి సమసిపోయినది. అన్నపానీయముల రుచినశించినది. గాయనీగాయకులు పాడుపాటలు చెవులకు వినిపింపవు. ఇట్టి నేను నీ వెంట వచ్చిన, నీకు భారమగుట తప్ప ప్రయోజనమేమి లేదు.
37. ఈ దాసుడు నది దాటువరకు నీ వెంట వచ్చును. యెరూషలేమునకు తోడ్కొని పోవునంతటి సత్కారము నాకేల?
38. నేను మా ఇంటికి వెడలిపోయి నా తల్లిదండ్రుల సమాధి చెంతనే కన్నుమూసెదను. కాని, ఇడుగో! నీ దాసుడు కింహాము! వీనిని నీ వెంట గొనిపోయి నీకు తోచిన రీతి నాదరింపుము" అని పలికెను.
39. రాజు “కింహామును నా వెంట పంపుము. అతనికి మేలుచేసి నీకు ప్రియము కలిగింతును. నిన్ను చూచి అతనికి నీవు కోరిన ఉపకారమెల్ల చేయుదును” అనెను.
40. అంతట రాజు, పరిజనులందరు యోర్ధాను దాటిరి. దావీదు బర్సిల్లయిని ముద్దిడుకొని దీవించెను. ఆ వృద్ధుడు తన స్థలమునకు వెడలిపోయెను.
41. రాజు గిల్గాలు చేరుకొనెను. కింహాము కూడ రాజుతో పోయెను. యూదీయులందరు రాజును అనుసరించి వెళ్ళిరి. యిస్రాయేలీయులలో సగము మంది మాత్రము అతని వెంటపోయిరి.
42. యిస్రాయేలీయులు ఒక్కుమ్మడిగా రాజు నొద్దకువచ్చి “మా సోదరులైన ఈ యూదీయులు మాత్రమే ప్రభువును కుటుంబముతో, పరిజనులతో ఏరు దాటింపనేల?” అని అడిగిరి.
43. యూదీయులు 'రాజు మాకు దగ్గరి చుట్టము గదా! దీనికి మీరింతగా అసూయపడనేల? మేమేమి రాజు సొమ్ము తెగదింటిమా? అతడు మాకేమైన ఈడవలు బాడవలు పంచియిచ్చెనా?” అనిరి.
44. యిస్రాయేలీయులు యూదీయులతో "మేము మీకంటె పదిరెట్లు ఎక్కువగనే రాజు క్షేమము నభిలషింతుము. పైపెచ్చు మేము మీకు జ్యేష్ఠులము. మీరా మమ్ము చిన్నచూపు చూచువారు? అసలు మొదట రాజును మరల కొనివత్తమన్నదెవరు? మీరా? మేమా?” అని వాదించిరి. కాని యూదీయులు యిస్రాయేలీయులకంటె పెద్దగా గొంతెత్తి అరచుచు ప్రతివాదము చేసిరి.