ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సోలోమోను జ్ఞానగ్రంధము 18వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. కాని ప్రభూ! నీ పవిత్ర ప్రజలకు మాత్రము గొప్ప వెలుగు ప్రకాశించెను. శత్రుజనులు నీ ప్రజల స్వరములు వినిరిగాని వారి ఆకారములను చూడజాలరైరి నీ ప్రజలు బాధలకు చిక్కలేదు కనుక విరోధులు వారు ధన్యులని భావించిరి.

2. తాము పూర్వము చేసిన అపరాధములకు యిస్రాయేలీయులు ప్రతీకారము చేయలేదు. కనుక వారిని అభినందించిరి. తాము పూర్వము ప్రదర్శించిన విరోధమును మన్నింపుడని వేడుకొనిరి.

3. శత్రువులకు కలిగిన చీకటికి బదులుగా నీ ప్రజలకు అగ్నిస్తంభమును ఒసగితివి. అది వారికి తెలియని క్రొత్తత్రోవగుండ నడిపించెను. ఆ స్తంభము లేత ఎండ కాయు ప్రొద్దువలెనుండి ఆ సుప్రసిద్ధ ప్రయాణమున నీ ప్రజలకు, ఎట్టి హానియు చేయదయ్యెను.

4. కాని శత్రు ప్రజలు మాత్రము వెలుగును కోల్పోయి చీకటిలో బందీలగుట తగియేయున్నది ఎందుకన, నీవు ఏ ప్రజలద్వారా నశింపని ధర్మశాస్త్రజ్యోతిని ప్రపంచమునకు అనుగ్రహింపబూనితివో ఆ ప్రజలనే వారు బందీలను చేసిరి.

5. శత్రువులు నీ పవిత్ర ప్రజల శిశువులను చంపబూనికొనినపుడు ఏటిలో విడనాడబడిన బిడ్డ యొక్కడు చావును తప్పించుకొనెను. అపుడు నీవు శత్రువుల బిడ్డలను చాలమందిని చంపి వారిని శిక్షించితివి. వారి ప్రజలను పొంగిపొరలు సముద్రములో ముంచి నాశము చేసితివి.

6. కాని నీవు ఆ రాత్రి జరుపనున్న సంగతిని మా పితరులకు ముందుగనే తెలిపితివి కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగానుండిరి.

7. నీవు సజ్జనులను కాపాడుదువనియు, శత్రువులను సంహరింతువనియు నీ ప్రజలెరుగుదురు.

8. ఏకకార్యము ద్వారానే  నీవు మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి.

9. అప్పుడు ఈ పుణ్యప్రజలలోని భక్తులు , రహస్యముగా బలులర్పించిరి. వారు, మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతము. మన పాలబడు దీవెనలు, కష్టములనుగూడ అందరమును సరిసమానముగా పంచుకొందమని ఒకరికొకరు పవిత్రమైన ఒప్పందము చేసికొనిరి. అపుడే వారు తమ పూర్వులు స్తుతికీర్తనలను గూడ పాడిరి.

10. అదే సమయమున నీ శత్రువుల ఆర్తనాదము విన్పించెను. వారు హతులైన తమబిడ్డలకొరకు చేయు శోకాలాపములు మిన్నులు ముట్టెను.

11. యజమానులకును, బానిసలకును అదే శిక్ష ప్రాప్తించెను. రాజునకును, సామాన్యునకును అదే నష్టము వాటిల్లెను.

12. అందరి ఇండ్లలో చచ్చినవారు కన్పించిరి. మృతులసంఖ్య లెక్కలకు అందదయ్యెను. అదే మృత్యువు అందరిని మట్టుపెట్టెను. చచ్చినవారిని పాతిపెట్టుటకు బ్రతికినవారు చాలరైరి శత్రువుల బిడ్డలలో శ్రేష్ఠులైన వారు ఒక్క క్షణములోనే చచ్చిరి.

13. మాంత్రిక విద్యలను నమ్మి నీ హెచ్చరికలను లెక్కచేయని అన్యప్రజలు తమ జ్యేష్ఠసంతానము నశింపగా జూచి యిస్రాయేలీయులు దేవుని సంతానమని విశ్వసించిరి.

14. రాత్రిలో సగభాగము శీఘ్రముగా గడచిపోయెను. అంతా సద్దుమణిగి ప్రశాంతముగా నుండెను.

15. అపుడు సర్వశక్తిగల నీ వాక్కు ఆకాశములోని నీ సింహాసనము మీది నుండి క్రిందికి దుమికి వినాశనమునకు గురికానున్న దేశముమీద పడెను.

16. అది ఎదిరింపనలవి కాని యోధునివలె వచ్చెను. భయంకరమైన ఖడ్గమును చేతబట్టి దృఢమైన నీ ఆజ్ఞను అమలుపరచుచు, దేశమునంతటిని మృతమయము గావించుచు, కాళ్ళు నేలమీద మోపి, శిరస్సు ఆకాశమునంటునట్లుగా నిలుచుండెను.

17. అపుడు భయమునకు గురికానున్న వారికి పీడకలలు వచ్చెను. వారిని తలవని తలంపుగా భయము ఆవహించెను

18. వారు ఎల్లయెడల సగము చచ్చికూలిపడిరి. తామెందుకు చనిపోవుచున్నారో గూడ ఎల్లరికి విశదము చేసిరి.

19. వారు తమకు కలిగిన స్వప్నముల ద్వారా తమ చావులకు కారణము తెలిసికొనిరి. కనుక కారణము తెలియకుండచావరైరి.

20. ధర్మాత్ములైన ప్రజలకు మృత్యువు సిద్దించెను. ఎడారిలో పయనించినపుడు వారిలో చాలమంది చచ్చిరి. ప్రభూ! నీ కోపము దీర్ఘకాలము నిలువలేదు.

21. పుణ్యపురుషుడొకడు శీఘ్రమే వారి కోపు తీసికొనెను అతడు వారి పక్షమున యాజకత్వమును నెరపెను ప్రార్థనలర్పించుట, పాపపరిహారార్థము సాంబ్రాణి పొగవేయుట అను సాధనముల ద్వారా అతడు నీ కోపమునాపి, విపత్తును తొలగించెను.

22. స్వీయబలము వలనగాని, సైన్యబలము వలనగాని అతడు ఆ ఘోరమైన విపత్తును తొలగింపలేదు. ప్రార్థనము ద్వారా అతడు శిక్షకుని శాంతింపచేసెను. నీవు మా పితరులతో ప్రమాణముచేసి వారితో నిబంధన చేసికొంటివని విన్నవించి శిక్షను తప్పించెను.

23. మృతదేహములప్పటికే కుప్పలుగా పడియుండెను. కాని అతడు ముందునకు వచ్చి నీ కోపమును శాంతింపజేసి బ్రతికియున్న వారి ప్రాణములు కాపాడెను.

24. పొడవుగా నున్న అతని అంగీమీద ఈ విశ్వమంతయు చిత్రీకరింపబడియుండెను. మా పితరుల గౌరవార్థము వారి నామములు చెక్కిన మణుల వరుసలు నాలుగు అతని వక్షఃస్థలమున అమరియుండెను. అతని తలపాగా మీది ఫలకము నీ మహిమను ప్రదర్శించుచుండెను.

25. ఈ గురుతులను చూచి వినాశకుడు భయమునొంది, వెనుకకు తగెను. ఆ ప్రజలు నీ కోపమును కొలదిగా మాత్రమే చవిజూచిరి కాని అది చాలును.