ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 18వ అధ్యాయము || Catholic Bible in Telugu

1. ఈ రీతిగా దావీదు సౌలుతో సంభాషించెను. అప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో పెనవేసుకొనెను. అతడు దావీదును ప్రాణమువలె ప్రేమింపజొచ్చెను.

2. సౌలు దావీదును ఇంటికి వెళ్ళనీయక తనయొద్దనే ఉంచుకొనెను.

3. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునివలె చూచుకొనుచుండెను. దావీదుతో నిబంధనముకూడ చేసి కొనెను.

4. అతడు తన ఉత్తరీయము, కత్తి, విల్లు, నడికట్టు దావీదునకు ఇచ్చివేసెను.

5. సౌలు ఏ పనిమీద పంపినను దావీదు విజయము సాధించుచుండెను. కనుక సౌలు అతనిని తన సైన్యములకు నాయకుని చేసెను. అతడు సేనాధిపతియగుట జూచి ఇరుగు పొరుగువారును, రాజోద్యోగులును సంతసించిరి.

6. ఒకమారు దావీదు ఫిలిస్తీయులను గెలిచి నగరమునకు తిరిగివచ్చుచుండెను. యిస్రాయేలు పట్టణములనుండి స్త్రీలు తంబురా మొదలైన వాద్యములతో వెడలివచ్చి ఉత్సాహముతో పాడుచు, నాట్యమాడుచు సౌలునకు స్వాగతము పలికిరి.

7. వారు “సౌలు వేయిమందిని చంపెను, కాని దావీదు పది వేలమందిని చంపెను” అని వాద్యములు మీటుచు వంతుపాట పాడిరి.

8. ఆ మాటలు సౌలునకు నచ్చ లేదు. అతనికి అసూయ పుట్టెను. తనలో తాను “వీరు దావీదు పదివేలమందిని చంపెనని పలికి, నేను వేయి మందిని మాత్రమే చంపితినని నుడివిరి. ఇక రాచరిక మొకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే గదా!” అనుకొనెను.

9. నాటినుండి సౌలునకు దావీదనిన కన్నుకుట్టెను.

10. ఆ మరుసటిరోజు దేవునియొద్దనుండి దుష్టాత్మ సౌలును ఆవేశించెను. అతడు ఇంటనుండగనే వెఱ్ఱి వికటతాండవమాడెను. అపుడు దావీదు ఎప్పటి వలెనే సితారా పుచ్చుకొని వాయించుచుండెను.

11. సౌలు చేతిలో ఈటెగలదు. దానితో అతడు దావీదును పొడిచి గోడకు గ్రుచ్చవలయుననుకొని అతనిపై ఈటె విసరెను. కాని దావీదు రెండుమారులు సౌలు ఎదుటినుండి తప్పుకొనెను.

12. యావే సౌలును విడనాడి దావీదునకు తోడయ్యెను. అందుచే అతడు దావీదును చూచి భయపడజొచ్చెను.

13. సౌలు అతనిని తన ఇంటి బలగము నుండి తొలగించి వేయిమంది సైనికులకు అధిపతిని చేసెను. దావీదు వారికి నాయకుడై కార్యములు నిర్వహించెను.

14. యావే తోడ్పాటువలన అతడు చేపట్టిన పనులన్నియు నెరవేరెను.

15. కాని దావీదు విజయవంతుడు అగుట చూచి సౌలు మరింత భయపడెను.

16. అయినను యూదీయులు, యిస్రాయేలీయులు దావీదును మెచ్చుకొనిరి. అతడు వారికి నాయకుడై కార్యములు నడిపెను.

17. సౌలు దావీదుతో “నా పెద్ద కూతురు మేరబును చూచితివిగదా! ఆ పిల్లను నీకిచ్చి పెండ్లి చేసెదను. నీవు మాత్రము పరాక్రమశాలివై యావే యుద్ధములు నడపవలయును సుమా!” అనెను. కాని అతడు హృదయమున "నేను వీనిపై చేయిచేసికోనేల? ఫిలిస్తీయులే ఇతనిని తుదముట్టింతురు” అనుకొనెను.

18. దావీదు సౌలుతో “రాజునకు అల్లుడనగుటకు నేను ఏపాటివాడను? మా పూర్వులు ఎంతటివారు? మా కుటుంబము ఏపాటి పేరుగాంచినది?” అనెను.

19. కాని సౌలు తన కూతురు మేరబుకు పెండ్లి చేయు సమయము వచ్చినపుడు ఆమెను దావీదునకు ఈయక మహోలతీయుడైన అద్రియేలునకిచ్చి వివాహము చేసెను.

20. అటుతర్వాత సౌలు చిన్నకూతురు మీకాలు దావీదును ప్రేమించెను. అది విని సౌలు సంతసించెను.

21. అతడు తన మనస్సులో “మీకాలును దావీదునకిచ్చి పెండ్లి చేసెదను. పిల్లను ఎర పెట్టి దావీదుని ఆకర్షించి ఫిలిస్తీయులమీదికి పంపెదను. వారతనిని తప్పక సంహరింతురు” అనుకొనెను. కనుక అతడు దావీదుతో రెండవమారు “నీవు నాకు అల్లుడవు అయ్యెదవు” అని చెప్పెను.

22. సౌలు తన సేవకులను చూచి "దావీదుతో రహస్యముగా సంభాషింపుడు. రాజు నిన్ను మెచ్చు కొనుచున్నాడు. సేవకులకందరకు నీవనిన మిక్కిలి అభిమానము. కనుక నీవు రాజునకు అల్లుడవగుము' అని చెప్పుడు” అని ఆజ్ఞాపించెను.

23. వారు ఈ మాటలు దావీదుతో చెప్పగా అతడు వారితో రాజకుమారిని పెండ్లియాడుట అంత తేలికయనుకొంటిరా? నేను ఊరు పేరులేని నిరుపేదను గదా!” అనెను.

24. దాసులు దావీదు పలుకులను మరల రాజునకు విన్నవించిరి.

25. అతడు వారిని జూచి “దావీదుతో 'నీవు రాజునకు పెండ్లికానుక చెల్లింప నక్కరలేదు. అతడు శత్రువులపై పగదీర్చుకోగోరుచున్నాడు. కనుక ఫిలిస్తీయుల చర్మాగ్రములు నూరుగొనివచ్చిన చాలును' అని చెప్పుడు” అనెను. దావీదు ఫిలిస్తీయులకు చిక్కి ప్రాణములు కోల్పోవలయుననియే సౌలు కోరిక.

26. సేవకులు సౌలు పలుకులను దావీదున కెరిగించిరి. అతడు రాజకుమారిని సులభముగనే పెండ్లియాడవచ్చునుగదాయని ఉబ్బి పోయెను. సౌలు పెట్టిన గడువు ఇంకను దాటిపోలేదు.

27. కనుక దావీదు అనుచరులతోపోయి ఫిలిస్తీయుల మీదబడి రెండువందలమందిని చంపెను. వారి చర్మాగ్రములు కొనితెచ్చి రాజు ముందటనే లెక్కించెను. సౌలు మీకాలును దావీదునకిచ్చి పెండ్లి చేసెను.

28. యావే దావీదునకు చేదోడు వాదోడుగా నుండెననియు, మీకాలు అతనిని ప్రేమించెననియు సౌలు గ్రహించెను.

29. కనుక అతడు దావీదును చూచి మునుపటికంటె అధికముగా భయపడజొచ్చెను. అతనిపై నిరంతర విరోధము పెంచుకొనెను.

30. అపుడు ఫిలిస్తీయ నాయకులు యిస్రాయేలీయులపై దండెత్తివచ్చిరి. కాని వారిని ఎదుర్కొని పోరాడిన సౌలు యోధులలో దావీదు అంతటివాడు కానరాడయ్యెను. కనుక అతని పేరు నలుమూలల మారు మ్రోగెను.