ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 17వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. దావీదు ప్రాసాదమున వసింప మొదలిడెను. అతడు నాతాను ప్రవక్తతో “నేను దేవదారు ప్రాసాదమున నివసించుచున్నాను. కాని మందసము మాత్రము గుడారముననే పడియున్నది” అనెను.

2. ఆ మాటలకు నాతాను “నీవు సంకల్పించుకొన్న కార్యములెల్ల చేయుము. ప్రభువు నీకు బాసటగా నుండును” అని పలికెను.

3-4. కాని ఆ రాత్రియే ప్రభువువాణి నాతానుతో ఇట్లు చెప్పెను: “నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో నా పలుకులుగా ఇట్లు వినిపింపుము. నేను నివసించుటకు మందిరము నీ చేత కట్టబడదు.

5. యిస్రాయేలీయులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చినప్పటి నుండి నేటివరకును నేను మందిరములో నివసింప లేదు. గుడారములందే వసించుచు ఒకచోటు నుండి మరొక చోటుకు కదలుచుంటిని.

6. యిస్రాయేలీయులతో నేను చేసిన ప్రయాణములందు నేను ప్రజలకు నాయకులుగా నియమించిన వారితో మీరు నాకు దేవదారు మందిరమును కట్టి పెట్టరైతిరిగదా అని ఎప్పుడైన అంటినా?

7. నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకధిపతియు ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు పొలములో గొఱ్ఱెలు కాయుచుండగా నేను నిన్ను పిల్చి నా ప్రజలకు నాయకునిగా నియమించితిని.

8. నీ దండయాత్రలందెల్ల నీకు తోడై యుంటిని. నీ శత్రువులనెల్ల రూపుమాపితిని. ఇపుడు ప్రపంచములోని మహానాయకులకు అబ్బిన కీర్తి నీకును దక్కునట్లు చేయుదును.

9. నా ప్రజలైన యిస్రాయేలీయులకొరకు ఒక తావును ఎన్నుకొని వారికచట నివాసమేర్పరచితిని. ఎట్టి బాధలకు గురి కాకుండ వారచట సుఖముగా జీవింతురు.

10. వారు ఈ దేశమున కాలు మోపినప్పటినుండియు దుష్టులు వారిని పీడించుచుండిరి. కాని ఇక అటుల జరుగ బోదు. నేను నీ శత్రువులనెల్ల అణగదొక్కెదను. నేనే నీకొక మందిరమును' కట్టి పెట్టెదను.

11. నీవు చనిపోయి నీ పితరులను కలసికొనినపుడు నేను నీ సంతానములో ఒకనిని రాజును చేయుదును.

12. నాకు మందిరమును నిర్మించువాడు అతడే. నేనతని రాజవంశము కలకాలము నిల్చునట్లు చేయుదును.

13. నేనతనికి తండ్రినైయుందును. అతడు నాకు తనయుడై యుండును. నీకంటే ముందున్నవాడు నా అనుగ్రహమునకు నోచుకోలేదు కాని ఇతడు నా మన్ననకు పాత్రుడగును.

14. కలకాలము అతడు నా ప్రజలకు, రాజ్యమునకు అధిపతిగా నుండును. అతని రాజవంశమునకు అంతమేయుండదు”.

15. నాతాను ప్రభువు తనకు తెలిపిన సంగతులన్నింటిని దావీదునకు విన్నవించెను.

16. అంతట దావీదు ప్రభువు గుడారమున ప్రవేశించి ప్రభువు సాన్నిధ్యమున కూర్చుండి ఇట్లు  ప్రార్థించెను. “ప్రభూ! నీవు నాకిట్టి ఉపకారములు చేయుటకు నేను ఏపాటివాడను? మా కుటుంబము ఏపాటిది?

17. ఇంతవరకు నీవు చేసిన ఉపకారములు చాలవో అన్నట్లు భవిష్యత్తులో రానున్న నా వంశస్తులను కూడ నీవు దీవింతుననుచున్నావు. మనుష్యులు పరస్పరము మాట్లాడునట్లు దయతో మాతో మాట్లాడి, నా సంతతి ఘనతచెందునని మాట ఇచ్చితివి.

18. నీ సేవకుడనైన నన్ను ఇంతగా ఆదరించితివి. నీవు నన్ను బాగుగా ఎరుగుదువు. ఇక నేనేమి విన్నవించుకోగలను!

19. నాకు ఇట్టి మేలుచేయుటయు, భవిష్యత్తులో నాకు సిద్దింపనున్న ఖ్యాతిని ముందుగా ఎరిగించుటయు నీ అభీష్టము.

20. ప్రభూ! నీ వంటివాడెవడును లేడు. నీవుతప్ప మరియొక దైవములేడని మేము వినినది నిజము.

21. నీవు ఐగుప్తునుండి తరలించు కొనివచ్చి నీవారిగా చేసికొనిన యిస్రాయేలువంటి జాతి ఈ భూమిమీద మరియొకటి కలదా? నీవు వారికొరకు చేసిన మహా కార్యములు, భయంకర కృత్యములు నీకు ఖ్యాతి తెచ్చిపెట్టినవి. నీవు ఐగుప్తుదాస్యము నుండి నీ ప్రజలను విడిపించుకొని వచ్చితివి. ఇతర జాతులనెల్ల తరిమివేసి వారికి ఒకతావు కల్పించితివి.

22. ప్రభూ! నీవు యిస్రాయేలీయులను శాశ్వతముగా నీ ప్రజలను చేసికొంటివి. నీవు వారి దేవుడవైతివి.

23. ప్రభూ! నీవు ఇపుడు ఈ దాసునిగూర్చి ఇతని వంశజులనుగూర్చి చేసిన ప్రమాణములెల్ల నెరవేర్పుము. నీవు చేయుదునన్న కార్యమును చేయుము.

24. ఇట్లు చేసినచో నీ ఖ్యాతి మిన్నంటును. ప్రజ లెల్లరును ఎల్లకాలము సైన్యములకధిపతియైన ప్రభువు యిస్రాయేలునకు దైవమయ్యెనని చెప్పుకొందురు. నీవు నా రాజవంశమును కలకాలము కొనసాగింతువు.

25. నా రాజవంశమును నిలబెట్టుదునని నీవే ఈ దాసునికి ఎరిగించితివి కనుక నేనిపుడు నీ సమక్షమున ఇట్టి ప్రార్థనచేయ సాహసించితిని.

26. ప్రభూ! నీవు నిక్కముగా దేవుడవు. ఈ దాసుని పట్ల దయగలిగి ఇట్టి ప్రమాణము చేసితివి.

27. ప్రభూ! నన్ను కరుణించి నా వంశజులను దీవింపుము. అప్పుడు నా వంశము కలకాలము కొనసాగును. నీవు దీవించినవారు ఎల్లకాలము దీవెనలు పొందుదురు.”

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services