1. వారు మందసమును కొనివచ్చి దావీదు సిద్ధముచేయించిన గుడారమున ఉంచిరి. దేవునికి దహనబలులు, సమాధానబలులు అర్పించిరి.
2. దావీదు బలులర్పించి ముగించిన తరువాత దేవుని పేరిట ప్రజలను దీవించెను.
3. అటుపిమ్మట యిస్రాయేలు స్త్రీ పురుషులలో ఒక్కొక్కరికి ఒక రొట్టె, కొంతమాంసము, ఎండిన ద్రాక్షపండ్లు పంచి ఇచ్చెను.
4. దావీదు మందసమునొద్ద ప్రభువును సేవించుటకు కొందరు లేవీయులను నియమించెను. యిస్రాయేలు దేవుడైన ప్రభువును స్తుతించి గానముచేయుట వారిపని.
5. ఆసాపు వారికి నాయకుడు. జెకర్యా ఉప నాయకుడు యెమీయేలు, షామీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఎలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను, సితారాలను వాయించుటకు నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు.
6. యాజకులైన బెనాయా, యహసీయేలు మందసమునొద్ద నిరంతరము బూరలను ఊదవలయును.
7. అప్పుడు దావీదు ఈ క్రింది పాటతో దేవుని స్తుతింపవలెనని ఆసాపును, అతని అనుచరులను ఆజ్ఞాపించెను.
8. “ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుడు. ఆయన నామమును ప్రకటింపుడు. ఆయన మహాకార్యములను ప్రచారము చేయుడు.
9. ప్రభువును స్తుతించి గానముచేయుడు. ఆయన అద్భుతకార్యములను వెల్లడిచేయుడు.
10. ఆయన పవిత్రనామములో మహిమ కలదు. ఆయనను అన్వేషించు వారెల్లరును ఆనందింతురుగాక!
11. ప్రభువును సాయమునకై ఆశ్రయింపుడు. ఆయన బలమును ఆశ్రయింపుడు.
12-13. ప్రభువు దాసుడైన యాకోబు వంశజులారా! ప్రభువు ఎన్నుకొనిన యాకోబుని తనయులారా! ప్రభుని అద్భుతకార్యములను స్మరింపుడు. ఆయన న్యాయము చెప్పిన తీరు గుర్తింపుడు.
14. ఆయన మన దేవుడైన ప్రభువు. అతని ఆజ్ఞలు భూతలమంతటికిని చెల్లును.
15. మీరు అల్పసంఖ్యాకులుగాను, మీరు స్వల్పజనముగాను, కనానుదేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దానినీ కెచ్చెదనని
16. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను,
17. ఈసాకుతో ఆయనచేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడు.
18-19. వేయితరముల వరకు తన మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకును కట్టడగాను, యిస్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
20. వారు దేశమునుండి దేశమునకు తిరిగిరి . రాజ్యము నుండి రాజ్యమునకు తరలిరి.
21. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు ప్రభువు వారినెవరును పీడింపకుండునట్లు చేసెను. వారి క్షేమమునెంచి రాజులను మందలించెను.
22. 'నా ప్రవక్తలను బాధింపవలదు' అని పలికి, ఆయన వారికెవరికిని హింసచేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను సైతము గద్దించెను.
23. సకల భూనివాసులారా! ప్రభుని స్తుతింపుడు, ఆయన రక్షణమును దినదినము ప్రకటింపుడు.
24. ఆయన కీర్తిని సకల జాతులకు వెల్లడిచేయుడు. ఆయన మహాకార్యములను సకల ప్రజలకు ఎరిగింపుడు.
25. ప్రభువు గొప్పవాడు, కీర్తింపదగినవాడు సమస్తదైవములకంటె అధికముగా సేవింపవలసినవాడు.
26. అన్యజాతులు కొలుచు దైవములు వట్టి విగ్రహములు, కాని ప్రభువు ఆకాశమండలమును చేసెను.
27. కీర్తి ప్రాభవములు ఆయనను అంటియుండును. శక్తిసంతోషములు ఆయన దేవళమున నిండియుండును.
28. సకల జాతులారా! ప్రభువును కీర్తింపుడు. ఆయన మహాత్మ్యమును శక్తిని సన్నుతింపుడు.
29. ప్రభుని ఘనమగు నామమును కొనియాడుడు మీ అర్పణములతో దేవాలయమునకు రండు పవిత్రుడై చూపట్టు ప్రభువునకు నమస్కరింపుడు
30. సకల భూనివాసులారా! ఆయన ముందు గడగడలాడుడు. ఆయన భూలోకమును కదలకుండునట్లు స్థిరపరచెను.
31. యావే ఏలికయని జనములలో చాటుడి, భూమ్యాకాశములు ప్రమోదము చెందునుగాక!
32. సముద్రమును దానిలోని సమస్తమును ఘోషించునుగాక! పొలములును వానిలోని పైరులును ఆనందమునొందుగాక!
33. ప్రభువు భూజనులకు తీర్పుతీర్చుటకై వేంచేయుచున్నాడు! అడవులలోని చెట్లన్నియు ఆయన ఎదుట ఆనందముతో కేకలిడునుగాక!
34. ప్రభువు మంచివాడు కనుక ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక ఆయనకు వందనములర్పింపుడు.
35. ఆయనతో “రక్షకుడైన ప్రభూ! మమ్ము కావుము. అన్యజాతుల నడుమనుండి మమ్ము ప్రోగుచేసి కాచికాపాడుము. అప్పుడు మేము నీ దివ్యనామమును కీర్తించుచు, నీకు వందనములు అర్పింతుము” అని చెప్పుడు.
36. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇప్పుడును ఎప్పుడును సదా స్తుతింపబడునుగాక” అని పలికెను. అప్పుడు ప్రజలెల్లరు “ఆమెన్" అని పలికి ప్రభుని కీర్తించిరి.
37. మందసము ఎదుట నిరంతరము ప్రభువును సేవింప ఆసాపును, అతని సహోదరులను దావీదు నియమించెను. దినదినము వారు ప్రభువును అర్చింపవలయును.
38. యెదూతూను కుమారుడు ఓబేదేదోమును, అతని వంశమునకు చెందిన అరువదెనిమిది మంది వారికి సాయము చేయవలయును. యెదూతూను కుమారుడైన ఓబేదెదోము, హోసా అనువారిని ద్వారపాలకులనుగా నియమించెను.
39. గిబ్యోను ఉన్నత స్థలముననున్న యావే గుడారము మీదను, అచటి బలిపీఠము మీదను ప్రభువు యిస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము
40. ప్రతిదినము ఉదయ సాయంకాలములందు బలిపీఠముపైన దహనబలులు అర్పించుటకై అచట యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.
41. ప్రభువు శాశ్వతకృపకుగాను, అతనిని స్తుతించి కొనియాడుటకై హేమానును, యెదూతూనును మరియు ఇతరులను కొందరిని నియమించిరి.
42. స్తుతిగీతము పాడునపుడు బూరలు, చిటితాళములు మరియు ఇతర వాద్యములు ఉపయోగించుట హేమాను, యెదూతూనుల బాధ్యత. యెదూతూను వంశమునకు చెందిన వారు ద్వారపాలకులుగానుండిరి.
43. పనులన్నియు ముగిసిన తరువాత ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపో యిరి. దావీదు కూడ తనవారిని దీవించుటకుగాను ఇంటికి వెళ్ళిపోయెను.