ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 16వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. దావీదు కొండకొనమీదుగా కొంచెము దూరము నడచిపోవగానే మెఫీబోషెతు దాసుడగు సీబా వచ్చెను. అతడు రెండుగాడిదలకు జీనులు కట్టి వానిపై రెండువందల రొట్టెలు, నూరు ఎండిన ద్రాక్షపండ్ల గుత్తులు, నూరు అంజూరపుపండ్లు, ఒక తిత్తెడు ద్రాక్షసారాయము కొనితెచ్చెను.

2. రాజు “ఇవి యన్నియుదేనికి” అని అడుగగా, సీబా “ఈ గాడిదలు రాజకుటుంబము వారు ఎక్కిపోవుటకు. రొట్టెలు, పండ్లు సైనికులకొరకు. ద్రాక్షసారాయము ఎడారిలో అలసిపోయినవారికి” అనెను.

3. దావీదు “నీ యజమానుని కుమారుడేడి?” అని అడిగెను. సీబా “అతడు యెరూషలేముననేయున్నాడు. నేడు యిస్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తిరిగి తనకు ఇప్పింతురని అనుకొనుచున్నాడు” అని చెప్పెను.

4. దావీదు “ఇంతవరకు మెఫీబోషెతు అధీనమున నున్న ఆస్తిపాస్తులన్నింటిని ఇకమీదట నీవు అనుభవింపుము” అనెను. సీబా “ప్రభూ! నేను నీ మన్ననకు పాత్రుడనైన చాలును, అదియే పదివేలు” అని బదులు చెప్పెను.

5. దావీదు బహూరీము చేరెను. సౌలు కుటుంబమునకు చెందిన గేరా కుమారుడైన షిమీ పట్టణము వెడలివచ్చి దావీదును శపింపమొదలిడెను.

6. అతడు దావీదుమీద, అతని పరిజనముమీద రాళ్ళురువ్వెను. సైనికులు, యోధులు దావీదునకిరువైపుల ఉండిరి. అతని పొగరు తగ్గలేదు.

7. షిమీ “నీవు నెత్తురు ఒలికించిన దుర్మార్గుడవు. శీఘ్రమే ఇటనుండి వెడలి పొమ్ము!

8. నీవు సౌలురాజ్యమును అపహరించితివి. అతని కుమారులను రూపుమాపితివి. కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్యమును నీ కుమారుడు అబ్షాలోము వశముచేసెను. నీవు రక్తపాతమునకు ఒడిగట్టితివి కనుక, నీ అపరాధమే నిన్నిపుడు నాశనము చేసినది” అని దావీదును చెడ దిట్టెను.

9. ఆ తిట్టులాలించిన సెరూయా పుత్రుడగు అబీషయి రాజుతో “ఈ చచ్చినకుక్క యేలికను శపించుటయా! ప్రభువు సెలవిచ్చిన నేను వీని తలనెగుర గొట్టెదను” అనెను.

10. కాని రాజు “మనము ఇతని మాటలు పట్టించుకోనేల? వానిని శపింపనిమ్ము. ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదును శపింపుమని సెలవిచ్చెనేమో! వలదనుటకు మనమెవ్వరము?” అని బదులు పలికెను.

11. మరియు దావీదు అబీషయితో, పరిజనులతో “నా కడుపున పుట్టిన బిడ్డడే నా ప్రాణములు తీయగోరుచున్నాడు. ఇక ఈ బెన్యామీనీయుడు ఊరకుండునా? ప్రభువే షిమీనిట్లు పురికొల్సెనేమో! ఇతనిని శపింపనిండు.

12. ఒకవేళ యావే నా దైన్యమును గుర్తించి ఇతని తిట్టులకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో!” అని పలికెను.

13. దావీదు, అతని అనుచరులు సాగిపోయిరి. కాని షిమీ దావీదుపై రాళ్ళురువ్వుచు, శపించుచు, దుమ్మెత్తి పోయుచు కొండప్రక్కగా కదలిపోయెను.

14. రాజు, అతని అనుచరులు పయనము సాగించి అలసి పోవువరకు నడిచి, యోర్దానున విశ్రమించి బడలిక తీర్చుకొనిరి.

15. అబ్షాలోము యిస్రాయేలీయులతో యెరూషలేమున ప్రవేశించెను. అహీతోఫెలు కూడ అతనితో వచ్చెను.

16. దావీదు మిత్రుడును అర్కీయుడైన హూషయి అబ్షాలోమును కలిసికొని “రాజునకు దీర్ఘాయువు!” అని దీవించెను.

17. కాని అబ్షాలోము “ఓయి! స్నేహితునిపట్ల నీ ప్రేమ ఈ పాటిదేనా? నీవు నీ మిత్రునితో ఏల వెళ్ళవైతివి?” అని అడిగెను.

18. హూషయి అతనితో “యావే, ఈ ప్రజలు, యిస్రాయేలీయులు ఎవరిని కోరుకొందురో నేనును అతని బంటునే. నేను అతనికడనే పడియుందును.

19. పైపెచ్చు, దావీదు కుమారునికి గాక ఇంకెవరికి ఊడిగము చేయుదును? నేను నీ తండ్రిని కొలిచినట్లే నిన్నును కొలిచెదను” అనెను.

20. అబ్షాలోము అహీతోఫెలుతో “మాకు మంచి ఆలోచన చెప్పుము. ఇప్పుడేమి చేయుదము?” అనెను.

21. అతడు “నీ తండ్రి నగరమున మంచిచెడ్డలు అరయుటకు తన ఉంపుడుగత్తెలను విడిచిపోయెను గదా! నీవు వారినికూడుము. దానితో యిస్రాయేలీయులందరు నీవు తండ్రిని అవమానపరచితివని గ్రహించి ధైర్యముగా నీ పక్షమును బలపరుతురు” అని చెప్పెను.

22. కనుక మిద్దెపై అబ్షాలోమునకు డేరా వేసిరి. యిస్రాయేలీయులందరు చూచుచుండగనే అతడు ఆ గుడారమున తండ్రి ఉంపుడుగత్తెలతో శయనించెను.

23. ఆ రోజులలో అహీతోఫెలు ఇచ్చిన ఉపదేశము యావే తనను సంప్రదించిన వారికిచ్చిన ఉపదేశము వలె నుండెడిది. దావీదుగాని, అబ్షాలోముగాని అతని ఉపదేశమును అంత ఆదరముతో స్వీకరించెడివారు.