1. మా దేవుడవైన ప్రభూ! నీవు దయగలవాడవు, విశ్వసనీయుడవు, సహన శీలుడవు, ఈ విశ్వమునంతటిని కరుణతో పరిపాలించువాడవు.
2. మేము పాపము చేసినను, నీ శక్తిని అంగీకరింతుము కనుక మేము నీవారలమే. కాని, మేము నీవారలమని గ్రహించి పాపము చేయకుందుము.
3. నిన్ను తెలిసికొనుటయే సంపూర్ణనీతి. నీ శక్తిని గుర్తించుటయే అమరత్వము.
4. నరులు మాయతో చేసిన దుష్టవస్తువుల వలనగాని, ఏ కళాకారుడో చిత్రించిన , నిరర్ధక చిత్రముల వలనగాని, పలురంగులు పూసిన విగ్రహముల వలనగాని మేము తప్పుదారి పట్టలేదు.
5. అట్టి వస్తువులను చూచి మూర్ఖులు ఆశపడుదురు. వారు చచ్చి నిర్జీవముగానున్న ప్రతిమలను సేవింతురు
6. అట్టి వస్తువులను తయారుచేయువారు, వానిని పూజించువారు దుష్టత్వమును అభిలషించుచున్నారు. వారు తమ నమ్మకమునకు తగిన ఫలితమునే బడయుదురు.
7. కుమ్మరి మెత్తనిమట్టిని మలచి మనకు ఉపయోగపడు పరికరములను జాగ్రత్తగా తయారుచేయును. అతడు ఒక్కటే రకపు మట్టితో ఒకటే రకపు పాత్రలు చేయును. అయినను నరులు వానిలో కొన్నిటిని గౌరవప్రదమైన కార్యములకును, కొన్నింటిని నీచమైన కార్యములకును వినియోగింతురు. ఏ పాత్రమును ఏ కార్యములకు వాడవలెనో కుమ్మరియే నిర్ణయించును.
8. ఆ కుమ్మరి కొలదికాలము క్రితమే మట్టినుండి చేయబడినవాడు. కొలదికాలమైన పిదప, తనకీయబడిన ఆత్మను తిరిగి దేవునికి అప్పగింపవలసిన సమయము వచ్చినపుడు అతడు ఆ మట్టిలోనే కలిసిపోవును. అట్టివాడు అట్టిమట్టినే తీసికొని వ్యర్థప్రయాసతో నిరర్ధకమైన దైవమును మలచును.
9. ఆ కుమ్మరి కొలది కాలము మాత్రమే జీవించి, త్వరలోనే చనిపోవువాడు. కాని అతడు ఆ విషయమును ఏమాత్రము వివేచింపడు. అతడు బంగారము, వెండి, ఇత్తడి పనివారలతో పోటీపడి వారివలె తానును బొమ్మలు చేయగోరును తాను చేసినవి నకిలీ వస్తువులైనను వానిని చూచి గర్వించును. అతని హృదయము బూడిదప్రోవువంటిది.
10. అతని ఆశ మురికికంటెను హేయమైనది. అతని జీవితము మట్టికంటెను నీచమైనది.
11. అతడు క్రియాశీలకమును, ప్రాణమయమునైన ఆత్మను తనలోనికి ఊది, తనను మలచిన దేవుని అర్థము చేసికోడయ్యెను
12. అతడు నరజీవితము ఒక ఆట అనుకొనెను. డబ్బు సంపాదించు అంగడి అనుకొనెను. దుష్టమార్గముననైన సరే నరుడు సొమ్ము చేసికోవలెనని యెంచెను.
13. ఒకే మట్టి నుండి విగ్రహములను, పగిలిపోవు పాత్రలను గూడ చేయువాడు, తాను చేయునది పాపకార్యమని తప్పక గ్రహించునుకదా!
14. కాని ప్రభూ! పూర్వము నీ ప్రజలను పీడించిన శత్రుజాతి, నరులలోకెల్ల మూర్ఖులు, శిశువులకంటేకూడ అజ్ఞానులు.
15. వారు తాము కొలుచు అన్యజాతుల విగ్రహములెల్ల దైవములని నమ్మిరి. అవి తమ కంటితో చూడజాలవు. ఆ నాసికతో గాలి పీల్చుకోజాలవు. చెవులతో వినజాలవు. వేళ్ళతో తాకి చూడజాలవు. కాళ్ళతో నడువజాలవు.
16. మానవమాత్రుడొకడు వానిని చేసెను. తనలోని శ్వాసను ఎరవు తెచ్చుకొనిన వాడొకడు వానిని మలచెను. ఏ నరుడును తనకు సరిసమానమైన వేల్పును చేయజాలడు.
17. మర్త్యుడు తన పాపపు చేతులతో చేయు బొమ్మలు కూడ చచ్చినవే. నరుడు పూజించు ప్రతిమల కంటెను నరుడే ఘనుడు. అతనికి జీవము కలదు. కాని అతడు కొలుచు బొమ్మలు ఏనాడును జీవింపవు.
18. నరులు హేయములైన మృగములనుకూడ, ఆ మృగములలోను జ్ఞానమే మాత్రములేని వానినికూడ పూజింతురు.
19. అవి కేవలము మృగములు కనుక వానినెవరును గణనచేయరు. పూర్వము ప్రభువు తాను చేసిన సృష్టిని మెచ్చుకొని దీవించినపుడు ఆ మృగములను పట్టించుకోడయ్యెను