ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 15వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

1. దావీదు స్వీయనగరమున భవనములు నిర్మించుకొనెను. ప్రభు మందసమునకుగూడ ఒక స్థలమును సిద్ధముచేసి గుడారమును నిర్మించెను.

2. అతడు “మందసమును లేవీయులు మాత్రమే మోసి కొనిరావలయును. మందసమును మోయుటకును, ఎల్లప్పుడు తనకు ఊడిగము చేయుటకును ప్రభువు వారినెన్నుకొనెను” అనెను.

3. తాను సిద్ధము చేసిన తావునకు మందసమును కొనివచ్చుటకై అతడు యిస్రాయేలీయులందరిని యెరూషలేమున ప్రోగు చేసెను.

4. అతడు అహరోను వంశజులను, లేవీయుల నుండి పిలిపించెను.

5. లేవీయులలో కోహాతు వంశమునుండి ఊరీయేలును, అతని బంధువులు 120 మంది వచ్చిరి.

6. మెరారి వంశమునుండి అసాయా అతని బంధువులు 220 మంది వచ్చిరి.

7. గెర్షోను వంశమునుండి యోవేలు అతని బంధువులు 130 మందివచ్చిరి.

8. ఎలీషాఫాను వంశమునుండి షేమాయా అతని బంధువులు 200 మంది వచ్చిరి.

9. హెబ్రోను వంశమునుండి ఎలీయేలు అతని బంధువులు 80 మందివచ్చిరి.

10. ఉస్సీయేలు వంశము నుండి అమ్మీనాదాబు అతని బంధువులు 112 మంది వచ్చిరి.

11. దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును మరియు లేవీయులైన ఊరీయేలు, అసాయా, యోవేలు, షెమాయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని పిలిపించెను.

12. అతడు వారితో “మీరు లేవీయులకు పెద్దలు కదా! మీరును, మీ తోడి లేవీయులును శుద్ధిచేసుకొని యిస్రాయేలు దేవుడైన ప్రభువు మందసమును నేను సిద్ధము చేసిన స్థలమునకు కొనిరండు.

13. మొదటిసారి మందసమును కొనివచ్చినపుడు మీరచటలేరు కనుకనే ప్రభువు మమ్ము శిక్షించెను. మేమతనిని ఉచితరీతిని కొనిరామై తిమి' అనెను.

14. అంతట యిస్రాయేలు దేవుడైన ప్రభువు మందసమును తీసికొని వచ్చుటకై యాజకులు, లేవీయులు తమనుతాము శుద్ధి చేసుకొనిరి.

15. ప్రభువు మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లే లేవీయులు దేవుని మందసమును దాని మోతకర్రలతో తమ భుజములపైన మోసికొని వచ్చిరి.

16. దావీదు లేవీయుల పెద్దలను పిలిచి 'స్వర మండలములతోను, చిటితాళములతోను, సితారాలతోను గంభీరధ్వని చేయుచూ సంతోషకరమైన సంగీతము పాడుటకు లేవీయులను నియమింపుడు' అని చెప్పెను.

17-21. వారు కంచుతాళములను వాయించుటకు గాను యోవేలు కుమారుడైన హేమానును, అతని బంధువు బెరక్యా పుత్రుడైన ఆసాపును, మెరారి వంశమునకు చెందిన కుషాయాకుమారుడు ఏతానును ఎన్నుకొనిరి. వీరితోపాటు రెండవ వరుసగానున్న తమ బంధువులు జెకర్యా, బేను, యాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, బెనాయా, మాసెయా, మత్తత్యా, ఎలీఫ్లెహు, మిక్నేయా అనువారిని, ద్వార పాలకులగు ఓబేదేదోమును, యెయీయేలును గాయకులుగా నియమించిరి. గాయకులయిన హేమాను, ఆసాపు, యేతానులు పంచలోహతాళములు వాయించుటకు నియమింపబడిరి. జెకర్యా, యేజీయేలు, సెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, మాసెయా, బెనాయా అనువారు తారాస్థాయి స్వరమండలములను వాయించుటకు నియమింపబడిరి. మరియు మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నెయాహు, ఓబేదెదోము, యెహీయాలు, అసద్యా అనువారు రాగమెత్తుటకును, సితారా వాయించుటకును నియమింపబడిరి.

22. లేవీయులకు అధిపతియైన కెనన్యా నేర్పుగల పాటగాడగుటచే ఈ సంగీతకారులకు పెద్దగా నియమించిరి.

23-24. ఓబేదెదోము యెహీయాలతో పాటు బెరక్యా, ఎల్కానాను మందసమునకు సంరక్షకులుగా నుండిరి. యాజకులైన షెబన్యా, యోషాషాత్తు, నెతనేలు, అమాసయి, జెకర్యా, బెనాయా, ఎలీయెసెరు మందసము ముందు బూరలను ఊదుటకు నియ మింపబడిరి. ఒబేదెదోము, యెహీయాయీములు అనువారు మందసమునకు వెనుక కనుపెట్టువారిగా నియమింపబడిరి.

25. దావీదు, యిస్రాయేలు నాయకులు, సహస్ర సైన్యాధిపతులు గొప్పసంబరముతో దైవమందసమును కొనివచ్చుటకై ఓబేదెదోము ఇంటికి వెళ్ళిరి.

26. మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు ఏడుకోడెలను, ఏడుపొట్టేళ్ళను బలియిచ్చిరి.

27. సంగీతకారులు, వారి నాయకుడైన కెనన్యా, మందసమును మోయు లేవీయులు మొదలైన వారు మేలిమి నారబట్టలను ధరించిరి. దావీదుకూడ మేలిమి నారతో నేయబడిన ఎఫోదును ధరించెను.

28. ఆ రీతిగా యిస్రాయేలీయులెల్లరు బూరలు, కొమ్ములు, చిటితాళములు, స్వరమండలములు, సితారా మొదలైన వాద్యములను వాయించుచు సంతోషనాదములతో మందసమును యెరూషలేమునకు కొనివచ్చిరి.

29. మందసము నగరమును చేరుచుండగా సౌలు కుమార్తె మీకాలు కిటికీనుండి పారజూచెను. దావీదు నాట్యము చేయుచు సంతోషముతో గంతులు వేయుట గమనించి ఆమె తన మనసులో అతనిని తృణీకారముతో చూచెను.