1. సమూవేలు సౌలుతో “నేను యావే పంపగా వచ్చి ప్రభు ప్రజయైన యిస్రాయేలీయులకు నిన్ను రాజుగ అభిషేకించితిని. కావున ఇప్పుడు ప్రభువు పలుకులు ఆలింపుము.
2. సైన్యములకు అధిపతియైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చునప్పుడు అమాలెకీయులు త్రోవలో వారినెదిరించి బాధించిరి. నేను వారిని శిక్షింపవలెను.
3. కావున నీవు శీఘ్రమే పోయి అమాలెకీయులను వధింపుము. వారి ఆస్తిపాస్తులను శాపముపాలు చేయుము. వారిలో ఒక్కనిగూడ బ్రతుకనీయవద్దు. స్త్రీలను, పురుషులను, నెత్తురు కందులను, చంటిబిడ్డలను, ఎడ్లను, గొఱ్ఱెలను, ఒంటెలను, గాడిదలను అన్నింటిని మట్టుపెట్టుము. ఇది యావే ఆజ్ఞ" అని చెప్పెను.
4. సౌలు జనులను సమకూర్చుకొని తెలాయీము నొద్ద లెక్కించి చూడగా రెండు లక్షలమంది కాలి బంటులు, పదివేలమంది యూదీయులు ఉండిరి.
5. అతడు అమాలేకీయుల నగరముపైకి దండెత్తిపోయి ప్రక్కలోయలో పొంచియుండెను.
6. అచట వసించుచున్న కేనీయులను చూచి “ఈ అమాలెకీయులలో నుండి బయటకి వెడలిపొండు. లేదేని వారితో పాటు మిమ్మునుకూడ నాశనము చేయవలసివచ్చును. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరి వచ్చినపుడు మీరు వారిని చాల ఆదరించిరి” అని చెప్పెను. వెంటనే కేనీయులు అమాలెకీయులను వీడి వెడలిపోయిరి.
7. సౌలు హవీలానుండి ఐగుప్తు పొలిమేరలలో నున్న షూరు వరకుగల అమాలేకీయులందరిని సంహరించెను.
8. వారి రాజైన అగాగు ప్రాణములతో చిక్కెను. మిగిలిన వారినందరను శాపముపాలుచేసి కత్తికి బలిచేసెను.
9. కాని సౌలు అతనివైపున పోరాడిన వీరులు అగాగు ప్రాణములు తీయలేదు. క్రొవ్విన ఎడ్లను, దూడలను, గొఱ్ఱెలను, గొఱ్ఱె పిల్లలను చంప లేదు. శ్రేష్ఠములైన పశువులనన్నిటిని మిగుల్చుకొని, పనికిరాని నీచపశువులను మాత్రము శాపముపాలు చేసి వధించిరి.
10-11. అంతట ప్రభువు దివ్యవాణి “సౌలును రాజును చేసినందులకు విచారించుచున్నాను. అతడు నన్ను లెక్కచేయక నా ఆజ్ఞను ధిక్కరించెను” అని సమూవేలుతో చెప్పెను. ఆ మాటలకు సమూవేలు చాల నొచ్చుకొనెను. అతడు రాత్రియంతయు ప్రభువునకు మొర పెట్టెను.
12. మరునాటి వేకువనే సమూవేలు సౌలును చూడబోయెను. కాని సౌలు కర్మేలు పట్టణమునకు పోయి తన గౌరవార్థము విజయస్తంభము నిలిపి, అటనుండి కదలి గిల్గాలునకు వెడలిపోయెనని తెలియవచ్చెను.
13. సమూవేలు సౌలును కలిసికొనరాగా, సౌలు సమూవేలును చూడగనే “ప్రభువు నిన్ను దీవించుగాక! నేను యావే ఆజ్ఞ పాటించితిని” అని పలికెను.
14. సమూవేలు “అటులయిన ఈ గొఱ్ఱెల అరపులు, ఈ ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకను రింగున మారుమ్రోగుచున్నవేల?" అనెను.
15. సౌలు “వీనిని అమాలెకీయుల నుండి కొనివచ్చితిమి. ప్రజలు శ్రేష్ఠమైన ఎడ్లను, గొఱ్ఱెలను చంపక నీ దేవుడైన యావేకు బలియర్పించుటకై అట్టిపెట్టుకొనిరి. మిగిలిన వానిని శాపముపాలుచేసి సంహరించితిమి" అని బదులుపలికెను.
16. సమూవేలు అతనితో “నీ మాటలు ఇక కట్టి పెట్టి రాత్రి ప్రభువు నాతో నుడివిన పలుకులు ఆలింపుము” అనెను. సౌలు “చిత్తము! సెలవిమ్ము” అనెను.
17. సమూవేలు “నీవు అల్పుడవైనను యావే నిన్ను యిస్రాయేలు తెగలకు నాయకునిగా నియమింపలేదా? యిస్రాయేలీయులకు నిన్ను రాజుగా అభి షేకింపలేదా?
18. యావే నీకొక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమాలేకీయులను వధింపుమనెను. వారితో పోరాడి అడపొడ కానరాకుండ వారిని నిర్మూలింపుమనెను.
19. మరి యావే ఆజ్ఞను నీవేల ధిక్కరించితివి? దోపిడి సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపము చేసితివి?” అని అడిగెను.
20. సౌలు "నేను యావే మాటలను వింటినిగదా? ప్రభువు ఆజ్ఞ పాటించితిని. అమాలెకీయుల రాజు అగాగును పట్టి తెచ్చితిని. వారినందరను శాపముపాలు చేసి నిర్మూలించితిని.
21. ప్రజలు దోపిడిసొత్తు నుండి శాపముపాలు కావలసిన మేలిఎడ్లను, గొఱ్ఱెలను మిగుల్చుకొనిన మాట నిజమే. కాని గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలియర్పించుటకే జనులు శపిత ములగు వానిని అట్టిపెట్టుకొనిరి” అని చెప్పెను.
22. అందులకు సమూవేలు ఇట్లనెను: “బలులవలన, దహనబలులవలన యావే సంతృప్తి చెందునా? విధేయతవలనగాదా? బలి యర్పించుటకంటె విధేయత మేలు. పొట్టేళ్ళక్రొవ్వు వేల్చుటకంటె అణకువ లెస్స.
23. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను."
24. సౌలు సమూవేలును చూచి "ప్రజలకు భయపడి వారిమాట వినినందున నేను యావే ఆజ్ఞను, నీ పలుకులను ఉల్లంఘించి పాపము కట్టుకొంటిని.
25. నా తప్పు క్షమించి, నేను యావేను మ్రొక్కునట్లు నాతోకూడ నీవు వెంటరమ్ము.” అని అడిగెను.
26. కాని సమూవేలు “నేను నీ వెంటరాను. నీవు యావే పలుకు తిరస్కరించితివి. కనుక యావే నీ రాజపదవిని తిరస్కరించెను” అని చెప్పెను.
27. అంతట సమూవేలు ప్రక్కకు మరలి వెళ్ళిపోబోగా సౌలు గబాలున అతని అంగీచెంగు పట్టుకొనెను. అది చినిగెను.
28. సమూవేలు అతనితో “ఈ రోజు ప్రభువు యిస్రాయేలు రాజ్యమును నీ చేతినుండి లాగివేసి నీకంటె యోగ్యుడైన వానికి ఇచ్చివేసెను” అని చెప్పెను.
29. “అయినను యిస్రాయేలీయుల వెలుగైన ప్రభువు మాటతప్పనులేదు, విచారపడను లేదు. విచారపడుటకు అతడు నరుడా ఏమి?” అనెను.
30. అప్పుడు సౌలు “నేను పాపము చేసినమాట నిజమే. అయినను నా జనుల పెద్దల ఎదుటను, యిస్రాయేలు జనుల ముందును నన్ను హెచ్చించిన యావేకు మ్రొక్కుటకై నాతోకూడ తిరిగిరమ్మని అతనిని వేడుకొనెను.
31. సమూవేలు సౌలు వెంట పోయెను. అతడు యావేకు మ్రొక్కెను.
32. అంతట సమూవేలు అగాగును కొని రమ్మనెను. అగాగు సంకెళ్ళతో బంధింపబడినవాడై సమూవేలు కడకు వచ్చెను. అతడు విడుదల పొందవచ్చుననుకొని “నిక్కముగా మరణ భయతీవ్రత తగ్గినది” అనెను. కాని సమూవేలు అతనితో “మునుపు నీ కత్తి వలన తల్లులు తమ బిడ్డలను కోల్పోయినట్లే నేడు నీ తల్లియు తన బిడ్డను కోల్పోవునుగాక!” అనెను.
33. ఇట్లని గిల్గాలునందు యావే ఎదుట అతనిని ముక్కలు ముక్కలుగా నరికివేసెను.
34. సమూవేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబియాలోని తన ఇల్లు చేరుకొనెను.
35. సౌలు చనిపోవువరకు సమూవేలు అతనిని తిరిగి ఎన్నడును కలిసికొనలేదు. అయిన అతడు సౌలును గూర్చి చాల పరితపించెను. యావే మాత్రము సౌలును రాజుగా చేసినందులకు విచారించెను.