ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 15వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. అటుపిమ్మట అబ్షాలోము రథమును, గుఱ్ఱములను సమకూర్చుకొనెను. ఆ రథమునకు ముందుగా కేకలిడుచు పరుగిడుటకు ఏబదిమంది బంటులను ప్రోగుచేసికొనెను.

2. అతడు వేకువనే లేచి నగరద్వారమునకుపోవు త్రోవప్రక్కన నిలుచుండెడి వాడు. ఎవడైన తగాదాపడి తీర్పు కొరకు రాజు వద్దకు వచ్చినచో అబ్షాలోము అతనిని ప్రక్కకు పిలిచి “ఏ ఊరినుండి వచ్చితివి?” అని అడుగును. అతడు “ఈ దాసుడు యిస్రాయేలున ఫలానా మండలమువాడను” అని చెప్పును.

3. అబ్షాలోము “నీ వ్యాజ్యెము సబబైనది. న్యాయసమ్మతమైనది కూడ. అయినను నీ మాట పట్టించుకొనుటకు రాజు తగు వకల్తా నేర్పరచలేదు” అని చెప్పును.

4. అతడింకను “నన్నీ రాజ్యమున న్యాయమూర్తిగా నియమించిన ఎంత బాగుగా నుండును. ఫిర్యాదులతో, వ్యాజ్యెములతో వచ్చిన వారికి నేను తీర్పుచెప్పుదునుగదా!” అనును.

5. ఎవరైనను అబ్షాలోము దగ్గరకు వచ్చి అభివందనము చేయబోయినచో అతడు తన చేతులు చాచి, వానిని దగ్గరకు తీసుకుని స్నేహితునివలె ఆదరముతో ముద్దాడును.

6. తీర్పుకొరకు రాజు నొద్దకు వచ్చిపోవు యిస్రాయేలీయులందరియెడను అబ్షాలోము ఈ రీతిగనే ప్రవర్తించెడివాడు. ఇట్టి ప్రవర్తనము వలన అతడు యిస్రాయేలీయుల మనసులను దోచుకొనెను.

7-8. నాలుగేండ్లు గడచిన తరువాత అబ్షాలోము రాజుతో "నేను హెబ్రోనునకు వెళ్ళి యావేకు చేసిన మ్రొక్కుబడి చెల్లించుకొని వచ్చెదను. నేను అరాము నందలి గెషూరున ఉన్నపుడు, యావే నన్ను సురక్షిత ముగా యెరూషలేమునకు కొనివచ్చెనేని హెబ్రోనున ప్రభువును కొలిచెదనని మ్రొక్కుకొంటిని” అని చెప్పెను.

9. రాజు “సుఖముగా వెళ్ళిరమ్ము” అనెను. అతడు హెబ్రోనునకు వెడలిపోయెను.

10. అబ్షాలోము యిస్రాయేలు రాజ్యమందంతట సేవకులను పంపి “మీరు బాకానాదము వినబడగనే హెబ్రోనున అబ్షాలోము రాజయ్యెనని ప్రకటింపుడు” అని చెప్పెను.

11. అబ్షాలోముతోపాటు రెండువందల మంది జనులు యెరూషలేము నుండి హెబ్రోనునకు వెళ్ళిరి. వారు అబ్షాలోము పిలువగా వెళ్ళిరే గాని అతని కపటోపాయమును ఎరుగరు.

12. అబ్షాలోము దావీదునకు మంత్రాంగము నెరపువాడును, గిలోనీయుడగు అహీతోఫేలును గిలో నగరమునుండి పిలిపించు కొనెను. యావేకు అర్పణములు అర్పించునపుడు అతనిని తన చెంతనే ఉంచుకొనెను. నానాటికి అతనిని బలపరచువారు ఎక్కువగుటచే అబ్షాలోముపన్నాగము పండినది.

13. పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి యిస్రాయేలీయులు అబ్షాలోము పక్షమున చేరి పోయిరని చెప్పెను.

14. దావీదు యెరూషలేమున నున్న తన పరిజనులతో “మనము వెంటనే పారి పోవుదము. లేదేని అబ్షాలోము బారినుండి తప్పించుకోజాలము. మీరు వెంటనే సిద్ధము కావలయును. అతడు హఠాత్తుగా దాడిచేసి మనలను ఓడించి నగరమును కత్తివాదరకు ఎరజేయవచ్చును” అనెను.

15. అందుకు రాజు పరిజనులు “నీ దాసులమైన మేము మా ఏలికయు, రాజవునగు నీవు సెలవిచ్చినట్లే చేయుటకు సిద్ధముగా ఉన్నాము” అనిరి.

16. దావీదు పరివారముతో వెడలిపోయెను. ప్రాసాదమును చూచు కొనుటకు పదిమంది ఉంపుడుకత్తెలను మాత్రము నగరునవిడిచి రాజు కాలినడకన బయలుదేరెను.

17. రాజు తోటివారితో సాగిపోవుచు నగరమునందలి చివరి ఇంటికడ ఆగెను.

18. రాజోద్యోగులు అందరు అతనికిరుప్రక్కల నిలిచిరి. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి వచ్చిన ఆరువందలమంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.

19. దావీదురాజు గిత్తీయుడైన ఇత్తయితో “నీవు పరదేశివి. నీ దేశము వీడి వచ్చి ఇక్కడ ప్రవాసిగానున్న వాడవు. నీవు నాతో రానేల? వెనుదిరిగిపోయి రాజు నున్న తావుననే ఉండుము.

20. నీవు నిన్న వచ్చి నా కొలువున చేరితివి. నేడు నిన్ను నాతో తిరుగాడ తీసికొని పోవుటకు మనసు రాదు. నేనెక్కడికి పోవలయునో నాకే తెలియదు. కావున నీ అనుచరులతో తిరిగిపొమ్ము. ప్రభువు నిన్ను ఆదరముతో, దయతో కాపాడుగాక!” అనెను.

21. కాని ఇత్తయి “యావే జీవముతోడు! నా ఏలికవు ప్రభువునగు నీ తోడు! చావుగాని, బ్రతుకుగాని నా ఏలికయు, ప్రభువునగు రాజెచ్చట ఉండునో ఈ దాసుడును అచ్చటనేయుండును” అనెను.

22. దావీదు అతనితో “సరియే! ముందు నడువుము” అని పలికెను. గిత్తీయుడైన ఇత్తయి అనుచరులతో సేవకులతో ముందుగా కదలిపోయెను.

23. పురజనులందరు రాజును చూచి గోడుగోడునఏడ్చిరి. రాజు కీద్రోనులోయ ప్రక్కన నిలుచుండెను. అతని పరివారమంతయు ఎడారికెదురుగా పయనించెను.

24. అపుడు సాదోకు, లేవీయులు మందసమును దావీదుకడకు మోసికొని వచ్చిరి. దానిని అబ్యాతారు ప్రక్కన దింపి పరిజనులందరు పట్టణమునుండి సాగి పోవువరకును వేచియుండిరి.

25. దావీదు సాదోకుతో “మందసమును నగరమునకు కొనిపొండు. నేను యావే మన్ననకు పాత్రుడనయ్యెదనేని నగరమునకు తిరిగివచ్చి మందసమును, తన నివాసస్థానమును ఆయన నాకు చూపించును.

26. యావే మన్ననకు పాత్రుడనుగానేని, ఆయన నన్ను తన ఇష్టము వచ్చినట్లు చేయునుగాక! నేను ప్రభువు చేతిలోనివాడను” అని పలికెను.

27. మరియు అతడు యాజకుడగు సాదోకుతో “నీవును, అబ్యాతారును నిశ్చింతగా పట్టణమునకు వెడలిపొండు. నీ కుమారుడు అహీమాసును, అబ్యాతారు కుమారుడు యోనాతానును గూడ తీసికొని పొండు.

28. నీ యొద్దనుండి వార్తలు వచ్చువరకు నేను ఎడారి మైదానముననే మసలెదను” అని చెప్పెను.

29. కనుక సాదోకు, అబ్యాతారు మందసముతో యెరూషలేము నకు వెడలిపోయి అచ్చటనే ఉండిపోయిరి.

30. దావీదు ఓలివుకొండమీదుగా ఎక్కిపోయెను. అతడు తలమీద ముసుగువేసికొని ఏడ్చుచు వట్టికాళ్ళతో నడచిపోయెను. అతని అనుచరులును తలపై ముసుగు వేసికొని కన్నీరు కార్చుచు కొండమీదుగా వెడలి పోయిరి.

31. అపుడు అహీతోఫెలు కూడ అబ్షాలోము కుట్రలో చేరెనని దావీదు చెవినిపడగా, అతడు “ప్రభువు అహీతోఫెలు ఉపదేశములను వెట్టి తలపోతలనుగా చేయునుగాక!” అని ప్రార్ధించెను.

32. దావీదు కొండకొమ్ముననున్న దేవుని ఆరాధించు స్థలమునొద్దకు రాగానే అర్కీయుడైన హూషయి అతనిని కలిసికొనుటకు వచ్చెను. హూషయి దావీదు మిత్రుడు. అతడు బట్టలు చించుకొనెను. తలమీద దుమ్ము పోసికొనెను.

33. దావీదు అతనితో “నీవు నా వెంటవత్తువేని నాకు భారమగుదువు. కనుక నీవు పట్టణమునకు తిరిగిపొమ్ము.

34. అబ్షాలోముతో “రాజా! నేను నీ దాసుడను. ఇంతకు ముందు నీ తండ్రికి ఊడిగము చేసినట్లే ఇపుడు నీకు కొలువు చేసెదను' అని పలుకుము. అతని కొలువున చేరి అహీతోఫెలు ఉపదేశములను వమ్ముచేసి నాకు మేలు చేయుము.

35. యాజకులగు సాదోకు, అబ్యాతారు నీకు తోడుగా నుందురు. నీవు ప్రాసాదమున విన్న వార్తలు వారి కెరిగింపుము.

36. సాదోకు కుమారుడు అహీమాసు, అబ్యాతారు కుమారుడు యోనాతాను తమ తండ్రులచెంతనే ఉందురు. వారిరువురిద్వారా నీవు విన్న వార్తలన్నింటిని నాకు వినిపింపుము” అని చెప్పెను.

37. అబ్షాలోము యెరూషలేము ప్రవేశించుచుండగనే హూషయి కూడ సరిగా ఆ సమయములోనే పట్టణము చేరుకొనెను.