1-2. తోబీతు ఈ రీతిగా స్తుతిగీతమును ముగించెను. గ్రుడ్డివాడగునప్పటికి తోబీతునకు అరువది రెండేండ్లు. దృష్టిని పొందినపిదప అతడు మరల సంపన్నుడయ్యెను. మరల దానధర్మములు చేసెను. దేవుని స్తుతించి అతని మాహాత్మ్యమును ఎల్లరికిని వెల్లడి చేసెను. అటు తరువాత అతడు తన నూటపండ్రెండవ యేట మరణించెను. అతనిని నీనెవె నగరముననే గౌరవప్రదముగా పాతిపెట్టిరి.
3. తోబీతు చనిపోకముందు కుమారుని పిలిచి ఇట్లు ఉపదేశము చేసెను:
4. “నాయనా! నీవు నీ పిల్లలను తీసికొని సత్వరమే మాదియాకు వెళ్ళిపొమ్ము. నీనెవె పట్టణమునకు శిక్షపడునని ప్రభువు నహూము ప్రవక్తచేత పలికించిన ప్రవచనము అనతికాలముననే నెరవేరితీరునని నా నమ్మకము. నీనెవె నగరమును గూర్చియు, అస్సిరియా రాజ్యమును గూర్చియు ప్రభువు దూతలైన యిస్రాయేలు ప్రవక్తలు పలికిన ప్రవచనము లన్నియు నెరవేరి తీరును. తగుకాలము వచ్చినపుడు వారు చెప్పిన సంగతులన్నియు నెరవేరును. ప్రభువు పలికినపలుకులు తప్పక నెరవేరునని నేను గాఢముగా విశ్వసించుచున్నాను. ప్రవక్తల ప్రవచనములలో ఒక్కటియు తప్పిపోదు. నీ మట్టుకు నీవు అస్సిరియా బబులోనియా దేశములలోకంటె మాదియాలోనే భద్రముగా ఉందువు. శత్రువులు యిస్రాయేలు దేశమున వసించు మనతోడి యూదులను ఆ నేలమీదినుండి చెదరగొట్టి ప్రవాసమునకు కొనిపోదురు. యిస్రాయేలు దేశమంత బీడువడును. సమరియా యెరూషలేము నగరములు పాడువడును. శత్రువులు దేవుని మందిరమును కూలద్రోసి కాల్చివేయగా అది కొంతకాలముపాటు శిథిలమై ఉండును.
5. కాని ప్రభువు మరల తన ప్రజలను కరుణించి వారిని యిస్రాయేలు దేశమునకు కొనివచ్చును. వారు దేవుని మందిరమును మరల కట్టుదురు. కాని అది మొదటి మందిరమంత సుందరముగా ఉండదు. తగుకాలము వచ్చువరకు ఆ మందిరము ఆ రీతిగనే ఉండును. కాని ఉచితకాలము రాగానే యిస్రాయేలీయులెల్లరును ప్రవాసమునుండి తిరిగివచ్చి యెరూషలేము నగరమును పూర్వపు రీతినే సుందరముగా నిర్మింతురు. వారు యిస్రాయేలు ప్రవక్తలు నుడివినట్లే యెరూషలేమున దేవునిమందిరమును గూడ నిర్మింతురు.
6. అప్పుడు సకలజాతి ప్రజలు ప్రభువునొద్దకు తిరిగివత్తురు. వారు ఆయన ఒక్కనినే నిజమైన దేవునిగ భావించి పూజింతురు. తమను అపమార్గము పట్టించిన విగ్రహములను విడనాడుదురు.
7. ఆ జనులెల్లరు శాశ్వతుడైన ప్రభువుచిత్తము ప్రకారము జీవించుచు, అన్నివేళల ఆయనను కొనియాడుదురు. ఆ కాలమున ప్రభువు తనకు విధేయులైన యిస్రాయేలీయులు అందరిని రక్షించును. ప్రభువు వారినెల్లరిని యెరూషలేమునకు కొనిరాగా వారు అబ్రహాము భుక్తము చేసికొనిన భూమిని స్వాధీనము కావించుకొని ఆ నేలమీద కలకాలము సురక్షితముగా వసింతురు. ప్రభువును చిత్తశుద్ధితో సేవించువారందరు ప్రమోదము చెందుదురు. కాని పాపకార్యములు చేయు దుర్మార్గులను మాత్రము ఆయన నేలమీదినుండి తుడిచివేయును.
8. నాయనలారా! మీరు నా ఉపదేశములను పాటింపుడు. దేవుని చిత్తశుద్ధితో సేవింపుడు. ఆయనకు ప్రియమైన కార్యములను చేయుడు.
9. దేవుని ఆజ్ఞల ప్రకారము జీవింపవలెననియు, పేదలకు దానధర్మ ములు చేయవలెననియు, ఎల్లవేళలందు ప్రభువును జ్ఞప్తియందుంచుకొని ఆయనను పూర్ణహృదయముతో కీర్తింపవలెననియు మీ బిడ్డలకు నేర్పుడు.
10. కుమారా! నీవు నీనెవెను విడనాడి వెళ్ళి పొమ్ము. ఇచట వసింపకుము. నీ తల్లి చనిపోయినపుడు ఆమెను నా ప్రక్కనే పాతి పెట్టుము. అటుపిమ్మట ఒకనాడు కూడ జాగుచేయక ఈ నగరమును విడిచి వెళ్ళిపొమ్ము. ఇచటి ప్రజలు దుష్టులు. సిగ్గు సెరము లేక పాపకార్యములు చేయువారు. నాదాబు తన పెంపుడు తండ్రియైన అహీకారునకు ఎట్టి కీడుతల పెట్టెనో చూడుము. నాదాబు అహీకారును భయ పెట్టగా అతడు సమాధిలో దాగుకొనెను. అయినను అహీకారు సమాధినుండి వెలుపలికి వచ్చి మరల వెలుగునుచూచెను. కాని అహీకారును చంపయత్నించి నందులకుగాను దేవుడు నాదాబును నిత్యాంధకారములోనికి త్రోసివేసెను. అహీకారు దానధర్మములు చేసెను గనుకనే అతడు నాదాబుపన్నిన మృత్యుపాశములలో తగులుకొనలేదు. కాని నాదాబు తానుపన్నిన ఉచ్చులలో తానే తగుల్కొని నాశనమయ్యెను.
11. దీనిని బట్టే దానము చేయుటవలన కలుగు మేలెట్టిదో, కీడు తల పెట్టుటవలన కలుగు వినాశనమెట్టిదో గుర్తింపుడు. ఇతరులకు కీడు చేయుటవలన చావుమూడును. నాయనా! ఇక నా బలము సన్నగిల్లిపోవుచున్నది.” అంతట వారు తోబీతును పడకమీద పరుండబెట్టగా అతడు కన్నుమూసెను. వారు అతనిని గౌరవ మర్యాదలతో పాతిపెట్టిరి.
12. తరువాత తల్లి చనిపోగా తోబియా ఆమెను తండ్రి ప్రక్కనే పాతి పెట్టెను. తదనంతరము అతడు భార్యతోను, పిల్లలతోను మాదియా దేశములోని ఎక్బటానాకు వెళ్ళి అచట తన మామ రగూవేలునింట వసించెను.
13. అతడు వృద్ధులైన అత్తమామలను మిగుల గౌరవముతో చూచుకొనెను. ఆ వృద్దులు చనిపోయినపుడు వారిని ఎక్బటానాలోనే పాతి పెట్టెను. తోబియా తండ్రి ఆస్తికివలె, మామ ఆస్తికిని వారసు డయ్యెను.
14. అతడు ఎల్లరి మన్ననలకును పాత్రుడై నూటపదునేడేండ్లు జీవించి తనువు చాలించెను.
15. తాను చనిపోకముందు నీనెవె నాశనమగుట గూర్చి మాదియారాజు సియాఖరు నీనెవె పౌరులను బందీలుగా కొనిపోవుట గూర్చియు వినెను. ప్రభువు అస్సిరియా రాజు నెబుకద్నెసరును, అతని ప్రజలను, నీనెవె పౌరులను శిక్షించినందుకుగాను ఆయనను స్తుతించెను. తోబియా చనిపోకముందు నీనెవె నగరము నకు పట్టిన దుర్గతిని చూచి సంతసించి నిత్యుడైన దేవునికి వందనములు అర్పించెను.