ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 14వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. తూరు రాజగు హీరాము దావీదు చెంతకు దూతలను పంపి, అతనికి రాజగృహము కట్టిపెట్టుటకు దేవదారు కొయ్యలను, వడ్రంగులను, తాపీ పని వారిని సరఫరా చేసెను.

2. ప్రభువు తన ప్రజలైన యిస్రాయేలీయులమీద తనను రాజుగా నెలకొల్పేనని, ఆ ప్రజల క్షేమముకొరకై తమ రాజ్యమును వృద్దిలోనికి తెచ్చుచుండెనని దావీదు అప్పుడు గ్రహించెను.

3. యెరూషలేమున దావీదు చాలమంది స్త్రీలను పెండ్లియాడెను. అతనికి పెక్కుమంది కుమారులు, కుమార్తెలు కలిగిరి.

4-7. ఆ నగరమున అతనికి పుట్టినబిడ్డలు వీరు: షమ్మూవ, షోబాబు, నాతాను, సొలోమోను, ఇభారు, ఎలీషూవ, ఎల్పేలెతు, నోగహు, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, బేల్యెదా, ఎలీఫేలెటు.

8. దావీదు యిస్రాయేలు దేశమంతటికిని రాజయ్యెనని విని ఫిలిస్తీయులు అతనిని పట్టుకొనుటకు వచ్చిరి. కనుక దావీదు వారి నెదుర్కొనబోయెను.

9. ఫిలిస్తీయులు రేఫాయీము లోయలో దాడిచేసి దోపిడి ప్రారంభించిరి.

10. దావీదు దేవుని సంప్రదించి “నన్ను వారి మీద పడుమందువా? నీవు నాకు విజయమును ప్రసాదింతువా?” అని యడిగెను. ప్రభువు “పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగింతును” అని చెప్పెను.

11. కనుక దావీదు బాల్పెరాసీము నొద్ద ఫిలిస్తీయుల నెదరించి ఓడించెను. అతడు "ప్రవాహము వలన కట్టకు గండిపడినట్లు ప్రభువు నా వలన శత్రు సైన్యమున గండిపడునట్లు చేసెను” అనెను. కనుకనే ఆ తావుకు “బాలు పెరాజీము' అని పేరు వచ్చెను.

12. అప్పుడు ఫిలిస్తీయులు తమ విగ్రహములను లోయలోనే వదలి పెట్టి పారిపోయిరి. దావీదు వానిని తగుల బెట్టించెను.

13. ఫిలిస్తీయులు మరల లోయలో ప్రవేశించి దోపిడి మొదలు పెట్టిరి.

14. దావీదు మరల ప్రభువును సంప్రదించెను. యావే “నీవు వారినిచట ఎదిరింపవలదు. చుట్టును తిరిగిపోయి కంబళిచెట్ల వద్ద వారిని ఎదుర్కొనుము.

15. ఆ చెట్లకొనల మీద అడుగుల చప్పుడు వినిపించినప్పుడు నీవు వారిమీద పడుము. నేను నీకు ముందుగా పోయి ఫిలిస్త్రీయ సైన్యమును కలవరపెట్టెదను” అని చెప్పెను.

16. అతడు ప్రభువు చెప్పినట్లే చేసి ఫిలిస్తీయ సైన్యమును గిబ్యోను నుండి గేజేరు వరకు తరిమి చంపివేసిరి.

17. దావీదు పేరు యెల్లెడల మారుమ్రోగెను. ప్రభువు ప్రతిజాతి అతనికి భయపడునట్లు చేసెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services