ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు 14వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. వివేకవతులైన స్త్రీలు గృహములను నిర్మింతురు. కాని అవివేకవతులు వానిని కూల్చివేయుదురు.

2. సత్యవర్తనుడు దేవునికి భయపడును. దుష్టవర్తనుడు దేవుని లక్ష్యము చేయడు.

3. మూర్ఖుడినోట పొగరు అనెడి బెత్తము కలదు. కాని బుద్ధిమంతుని పెదవులు అతడికి కాపుదల అగును.

4. ఎడ్లు దున్ననిచో గాదెలు నిండవు. బలముగల ఎడ్లు దున్నినచో పంటలు సమృద్ధిగా పండును.

5. సత్యవాదియైన సాక్షి బొంకులాడడు, అబద్ధపు సాక్షి నిరతము కల్లలే పలుకును.

6. భక్తిహీనునకు జ్ఞానము అబ్బదు. వివేకికి సులువుగా విజ్ఞానము అలవడును.

7. మూర్ఖునకు దూరముగా నుండుము. అతని నుండి నీవు విజ్ఞానమును ఆర్జింపజాలవు.

8. తానేమి చేయవలయునో తనకు తెలియుటలోనే విజ్ఞుని విజ్ఞత ఉన్నది. కాని మూర్ఖుని అజ్ఞానము వానిని పెడత్రోవ పట్టించును.

9. మూర్ఖుడు తప్పుచేసియు పశ్చాత్తాపపడడు. కాని సత్పురుషుడు మన్నింపును పొందగోరును.

10. ఎవరి వ్యధ వారికే తెలియును. ఒకరి సంతోషమును అన్యులు పంచుకోజాలరు.

11. దుష్టుని ఇల్లు కూల్చివేయబడును. సజ్జనుని ఇల్లు దృఢముగా నిలుచును.

12. మంచి మార్గమువలె కన్పించునదికూడ కడకు మృత్యులోకమునకు కొనిపోవచ్చును.

13. మన సంతోషములోగూడ విషాదము మిళితమైయుండును. ఆనందము తరువాత దుఃఖము వచ్చును.

14. దుష్టుడు తన కార్యములకు తగిన ఫలమునే బడయును. సజ్జనుడు తన పనులకు బహుమతిని పొందును.

15. అమాయకుడు ఇతరులు చెప్పినదెల్లనమ్మును. తెలివిగలవాడు మంచిచెడ్డలు అరసిగాని అడుగువేయడు.

16. జ్ఞాని ముందుగనే జాగ్రత్తపడి అపాయమునుండి తప్పుకొనును. కాని మూర్ఖుడు నిర్లక్ష్యమువలన ప్రమాదమున చిక్కుకొనును.

17. కోపస్వభావుడు వెట్టిపనులు చేయును. కాని జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండును.

18. మూర్ఖునకు మూర్ఖత్వమే దక్కును. కాని బుద్ధిమంతునికి విజ్ఞానకిరీటము అబ్బును.

19. దుష్టుడు శిష్టునికి దండము పెట్టవలయును. దుర్మార్గుడు సజ్జనుని ద్వారమువద్ద వేచియుండవలయును.

20. పేదవానిని ఇరుగుపొరుగువారు చీదరించుకొందురు. కలిమి కలవానికి చాలమంది మిత్రులు ఉందురు

21. పొరుగువానిని చిన్నచూపు చూచువాడు పాపము కట్టుకొనును. పేదసాదలను కరుణించువాడు సంతోషము అనుభవించును.

22. కీడు తలపెట్టువారు తప్పున కూరుదురు. మేలు తల పెట్టువారికి ఆదరాభిమానములు ప్రాప్తించును.

23. కష్టించి పనిచేసినచో సత్పలితము కలుగును. కబుర్లతో కాలము వెళ్ళబుచ్చిన లేమి అబ్బును.

24. జ్ఞానికి విజ్ఞానమే కిరీటము. మూర్ఖునికి మూర్ఖత్వమే శిరోభూషణము.

25. సత్యవాదియగు సాక్షి ప్రాణములు రక్షించును. అసత్యసాక్షి ప్రజలను మోసగించును.

26. దేవునిపట్ల భయభక్తులు కలవానికి చీకుచింత లేదు. అతని సంతతిని కూడ ప్రభువే రక్షించును.

27. దైవభయము జీవజలధారవంటిది. దానివలన మృత్యుపాశమునుండి తప్పించుకోవచ్చును.

28. ఎక్కువమందిని ఏలువాడు గొప్పరాజు. ప్రజలు లేనిచో రాజు చెడును.

29. శాంతమనస్కుడు జ్ఞాని. తొందరపాటు మనిషి వట్టిమూర్ఖుడు.

30. శాంతగుణమువలన ఆయురారోగ్యములు కలుగును. అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళువంటిది.

31. పేదవానిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును. దరిద్రుని కరుణించువాడు దేవుని గౌరవించును.

32. దుష్టుడు తనదుష్కార్యములవలననే పతనమగును సజ్జనుని అతని ఋజువర్తనమే రక్షించును.

33. వివేకి హృదయములో విజ్ఞానము నెలకొనియుండును. కాని మూఢుని యెదలో జ్ఞానము నిలువదు.

34. ధర్మమువలన ప్రజలు వృద్ధిచెందుదురు. అధర్మమువలన అపకీర్తి తెచ్చుకొందురు.

35. సమర్థుడైన సేవకుడు రాజు మన్నన పొందును. కాని అసమర్థుడు ప్రభువు శిక్షకు గురియగును.