1. సెరూయా కుమారుడైన యోవాబు దావీదు హృదయము అబ్షాలోముపై నెలకొనియున్నదని గ్రహించెను.
2. అతడు తెకోవా నగరమునుండి తెలివితేటలు గల స్త్రీ నొకతెను పిలిపించి “నీవు దుఃఖించు చున్నదానివలె నటింపుము. శోకవస్త్రములు ధరింపుము. తలకు చమురు రాచుకొనకుము. చాలకాలము నుండి చనిపోయిన వారికొరకు విలపించుచున్న దానివలె కనుపింపుము.
3. రాజు సమ్ముఖమునకు పోయి నేను చెప్పిన రీతిగా మాట్లాడుము” అని పలికెను. రాజు ఎదుట ఆమె యేమి చెప్పవలయునో తెలిపెను.
4. తెకోవా స్త్రీ రాజు వద్దకు పోయి సాగిలపడి దండము పెట్టి “ప్రభూ! రక్షింపుము, రక్షింపుము” అని అరచెను.
5. రాజు “అమ్మా! ఏమి జరిగినదో చెప్పుము”అనెను. ఆమె “రాజా! ఏమి చెప్పుకొందును. నా భర్త చనిపోయెను.
6. నీ దాసురాలికి ఇరువురు కొడుకులు కలరు. వారొకనాడు పొలమున పోట్లాడు కొనిరి. అచట వారి తగవు తీర్చువారు ఎవరును లేరైరి. ఒకడు రెండవవానిని కొట్టిచంపెను.
7.. ఇప్పుడు మా కుటుంబమంతయు నా మీదికి వచ్చి 'నీ కొడుకును మా కప్పగింపుము. తోబుట్టువును చంపి నందులకు ప్రతీకారముగా వానిని కూడ చంపివేయుదుము. నీకెవ్వరిని మిగులనీయకుండ చేసెదము' అనుచున్నారు. నాకు మిగిలియున్నది వాడొక్కడే. ఈ నిప్పురవ్వను కూడ ఆర్పివేసినచో ఇక ఈ నేలమీద నా పెనిమిటి పేరు నిలువదు. అతని వారసుడు మిగులడు” అని పలికెను.
8. రాజు “నీవిక ఇంటికి వెళ్ళవచ్చును. నీ తగాదాను పరిష్కారము చేసెదను” అనెను.
9. కాని ఆ మహిళ రాజుతో "ప్రభూ! ఈ పాపము నన్ను, నా కుటుంబమును బాధించుగాక! ఏలికను అతని రాజ్యమును సోకకుండుగాక!” అనెను.
10. రాజు ఆమెతో “నిన్ను బెదిరించువానిని నా యొద్దకు కొనిరమ్ము. అతడిక నీకు కీడు తలపెట్ట కుండునట్లు చూచెదను” అని చెప్పెను.
11. ఆమె రాజుతో “నెత్తురు చిందించినందులకు బంధువులు నా కుమారునిపై పగతీర్చుకోగోరుచున్నారు. వారిని నా కొడుకును ముట్టుకోనీయనని నీవు కొలుచు దేవుని పేర సెలవిమ్ము" అని వేడుకొనగా, రాజు “సజీవుడైన యావే తోడు! నీ కొడుకుపై ఈగవాలదు పొమ్ము ” అనెను.
12. తెకోవా స్త్రీ “ఈ దాసురాలిని ఇంకొకమారు మాటాడనిండు” అనెను. అతడు “చెప్పుము” అనెను.
13. ఆమె "ప్రభూ! నీవును దైవప్రజకిట్టి కీడునే తలపెట్టుచున్నావుకదా! నీవు దేశమునుండి వెడల గొట్టిన అతనిని తిరిగి యేలరప్పింపవు?
14. మన మందరము చనిపోవలసినదే గదా! ఒలికిపోయిన నీటిని మరల ప్రోగుచేయజాలము. మన బ్రతుకుకూడ అంతే. దేవుడు చనిపోయినవారిని మరల జీవముతో లేపడుకదా! కనుక ఈ దేశమునుండి బహిష్కృతుడై దూరముగా పోయిన వానిని మరల నీ సన్నిధికి రప్పింపుము" అని పలికెను.
15. ఆమె మరల "ప్రజలు నన్ను బెదిరించిరి. కనుక నేను ఏలిక చెంతకు వచ్చి ఈ సంగతులన్నియు విన్నవించుకొంటిని. 'నేను రాజుచెంతకు పోయి నా గోడు తెల్పుకొందును. ఆయన నా మనవిని ఆలింపక పోడనుకుంటిని!'
16. నన్నును, నా కుమారుని, యిస్రాయేలీయుల నేలమీదనుండి తుడిచివేయనెంచిన పగవారి బారినుండి యేలిక నన్ను కాపాడకపోడు.
17. నీవు నాకు అభయమిచ్చితివి. నీ మాటయే నాకు పెట్టనికోట. ప్రభువు దేవదూతవలె మంచిచెడులను ఇట్టే పసికట్టగలవాడు. ప్రభువైన యావే నీకు చేదోడు వాదోడుగానుండుగాక!" అనెను.
18. రాజు ఆమెతో “నేనడుగు ప్రశ్నకు తప్పుకొనక జవాబు చెప్పెదవా?” అనెను. ఆ మహిళ “దేవర అడుగవచ్చును" అనెను.
19. రాజు “నిన్నీ పనికి ప్రేరేపించినది యోవాబు కదా?" అని అడిగెను. ఆమె “ఏలికతోడు! దేవర ప్రశ్నింపగా ఎవ్వరు తప్పించు కోగలరు? అవును, యోవాబు ప్రేరణము వలననే నేనీ పనికి పూనుకొంటిని. అతడే నాకీమాటలన్ని నూరి పోసెను.
20. అసలు సంగతి కప్పిపెట్టుటకే అతడు ఈ పన్నాగము పన్నెను. కాని ప్రభువునకు దేవదూతకు సాటియైన తెలివితేటలు కలవు. కనుకనే ఈ భూమి మీద జరుగు సమస్తవిషయములు దేవరకు తెలియును" అని పలికెను.
21. అంతట రాజు యోవాబుతో “నీ కోరిక తీర్చితిని. పోయి ఆ పడుచువాడు అబ్షాలోమును కొనిరమ్ము" అని చెప్పెను.
22. యోవాబు సాష్టాంగముగా పడి వందనముచేసి రాజును దీవించి “నీవు నా విన్నపమును ఆలించితివి. కనుక నేను నీ మన్ననకు పాత్రుడనైతినని రుజువైనది” అనెను.
23. అతడు వెంటనే గెషూరునకు పయనమైపోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడ్కొని వచ్చెను.
24. కాని రాజు “అబ్షాలోమును తన ఇంటికి వెళ్ళుమనుము. వాడు నా మొగము చూడకూడదు” అనెను. కనుక అబ్షాలోము తన ఇంటికి వెడలిపోయెను. అతడు రాజును దర్శింప లేదు.
25. యిస్రాయేలీయులలో అబ్షాలోము వలె మెచ్చుకోదగ్గ అందగాడెవడునులేడు. అరికాలి నుండి నడినెత్తివరకును అతనిని వేలెత్తి చూపుటకు వీలులేదు.
26. అతని తల వెంట్రుకలు దట్టముగా పెరిగెడివి. వానిని ఏడాదికి ఒకమారు కత్తిరింపు వేయించెడివాడు. ఆ జుట్టు రాజతులామానము ప్రకారము రెండువందల తులముల బరువుండెడిది.
27. అబ్షాలోమునకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు పుట్టిరి. ఆ చిన్నదాని పేరు తామారు. ఆమె చాల సొగసైనది.
28. అబ్షాలోము యెరూషలేమున రెండేండ్లు ఉండెను. కాని తండ్రి అతనికి మొగము చూపలేదు.
29. కనుక అబ్షాలోము యోవాబును రాజునొద్దకు పంపనెంచెను. అతనిని పిలిపించెను. కాని రెండు సారులు కబురు పెట్టినను యోవాబు అతని ఇంటికి రాలేదు.
30. అబ్షాలోము సేవకులను పిలిచి “మన పొలముప్రక్కనే యోవాబు పొలమున్నది గదా! దానిలో యవధాన్యము పండియున్నది. మీరు దానికి నిప్పు పెట్టుడు” అని చెప్పెను. వారు యోవాబు చేను తగుల బెట్టిరి.
31. అంతట యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి 'నీ సేవకులు నా పొలమునకు ఏల నిప్పంటించిరి?" అని అడిగెను.
32. అతడు యోవాబుతో “నీవు నన్ను గూర్చి రాజునకు ఈ వార్త వినిపింపవలయునని నిన్ను పిలిపించితిని. నేను గెషూరు నుండి ఇచ్చటికి వచ్చుట వలన ఏమి ఫలము? అచటనే ఉండిపోయిన బాగుగా నుండెడిదిగదా! నేను రాజదర్శనము చేసికో గోరెదను. నాయందు ఏదేని నేరము కనిపించినచో రాజు నన్ను చంపివేయవచ్చును” అనెను.
33. యోవాబు వెళ్ళి రాజునకు ఆ వార్త చెప్పెను. దావీదు కుమారుని పిలిపించెను. అబ్షాలోము రాజు ఎదుటికి వచ్చి సాష్టాంగ నమస్కారము చేసెను. రాజతనిని ముద్దు పెట్టుకొనెను.