1. అటుపిమ్మట ఈ క్రింది సంఘటన జరిగెను. దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను చెల్లెలు కలదు. ఆ బాలిక మిక్కిలి అందగత్తె. దావీదు కుమారుడు అమ్నోను ఆమెపై వలపుగొనెను.
2. అతడు మారుచెల్లెలు తామారును పదేపదే తలంచు కొని మనోవ్యాధికి గురయ్యెను. తామారు మగవాని పొందెరుగని కన్య గనుక ఆమెను ఏ నెపమున పొందవలయునా అని అతడు మథనపడజొచ్చెను.
3. అమ్నోనునకు యోనాదాబు అను మిత్రుడు కలడు. అతడు దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు జిత్తులమారి.
4. యోనాదాబు అమ్నోనుతో “నీవు నానాటికి కృశించిపోవుచున్నావు. కారణమేమో నాతో చెప్పరాదా?” అనెను. అతడు “నా తమ్ముడు అబ్షాలోము చెల్లెలు తామారుపై నాకు కోరిక కలిగినది” అనెను.
5. యోనాదాబు అమ్నోనుతో “నీవు జబ్బుపడినట్లు నటన చేయుచు పాన్పుపై పరుండుము. రాజు నిన్ను చూడ వచ్చినపుడు 'చెల్లెలిని ఒకమారు ఇచ్చటికి పంపుడు. ఆమె నాకు భోజనము పెట్టవలయునని చెప్పుడు. నా కన్నుల ఎదుటనే తామారు భోజనము సిద్ధము చేయవలయును. తన చేతితోనే వడ్డింప వలయును' అని చెప్పుము” అని బోధించెను.
6. అమ్నోను జబ్బు పడినవానివలె మంచము పట్టెను. రాజు అతనిని చూడ వచ్చెను. అమ్నోను రాజుతో “చెల్లెలు తామారును ఒకసారి యిటకు రమ్మనుడు. నా కన్నులెదుటనే రెండు మూడు రొట్టెలు కాల్చి పెట్టుమని చెప్పుడు. చెల్లెలే నాకు వడ్డింపవలెను” అనెను.
7. దావీదు తామారు నకు కబురుపెట్టి “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్ళి భోజనము సిద్ధముచేయుము” అని చెప్పెను.
8. కనుక తామారు అన్న ఇంటికి వచ్చెను. అమ్నోను పడుకపై పరుండియుండెను. ఆమె అతని కనులెదుటనే పిండి తీసికొని పిసికి రొట్టెలు కాల్చెను.
9. కాలినరొట్టెలు పెనము మీదనుండి తీసి అమ్నోను ముందిడెను. కాని అతడు భుజింపనొల్లక “ఇచ్చటనున్న వారందరు బయటికి వెళ్ళిపొండు” అనెను. అందరు వెడలి పోయిరి.
10. అమ్నోను తామారుతో “రొట్టెలను లోపలి గదిలోనికి కొనిరమ్ము. నీవే నాకు వడ్డింప వలయును” అనెను. కనుక తామారు రొట్టెలు తీసికొని లోపలిగదిలోనున్న అన్నయొద్దకు పోయెను.
11. తామారు వడ్డింపబోవు చుండగా అమ్నోను ఆమెను పట్టుకొని “చెల్లీ! నాతో శయనింపుము” అనెను.
12. కాని ఆ బాలిక “అన్నా! నన్ను నిర్బంధింపకుము. యిస్రాయేలీయులలో ఈ ఆచారము లేదు. ఇట్టిపనికి పాల్పడకుము.
13. ఇక నేనెక్కడికి పోయినను ఈ సిగ్గుమాలిన పనివలన మ్రగ్గిపోయెదను. మరి నీ విషయములో యిస్రాయేలీయులు దుర్మార్గుని క్రింద జమకట్టెదరు. కనుక నీవు రాజుతో మాట్లాడుము. నాయన నన్ను నీకీయకపోడు” అనెను.
14. కాని అమ్నోను తామారు మాట విన్పించుకొనక బలాత్కారముగా మీదపడి చెరచెను.
15. అటుపిమ్మట అమ్నోనునకు తామారుపై కొండంత ద్వేషముపుట్టెను, అంతకు ముందటి వలపు కంటె అధికమైనద్వేషము పెచ్చు పెరిగెను. అతడు తామారుతో “ఇక లేచి పొమ్ము” అనెను.
16. కాని ఆమె “అన్నా! నన్ను వెళ్ళగొట్టెదవా? నీవిప్పుడు చేసిన ద్రోహముకంటె ఇది పెద్ద ద్రోహముకదా!" అని పలికెను. కాని అతడామె మొర చెవినిబెట్టక,
17. తన సేవకుని పిలిచి "దీనిని బయటకుగెంటి తలుపులు మూసి వేయుము” అనెను.
18. తామారు పొడుగు చేతుల నిలువుటంగీని తొడుగుకొనియుండెను. ఆ రోజులలో రాజకన్యలట్టి ఉడుపులనే తాల్చెడివారు. సేవకుడామెను బయటకు నెట్టి తలుపులు బిగించెను.
19. తామారు తలపై దుమ్ము పోసికొనెను. తాను తొడుగుకొనిన పొడుగుచేతుల నిలువుటంగీని చీలికలు పేలికలు చేసికొనెను. చేతులతో తలబాదు కొనుచు, పెద్దపెట్టునయేడ్చుచు వెడలిపోయెను.
20. అబ్షాలోము సోదరిని చూచి “నీ అన్న అమ్నోను నిన్ను కూడినాడుకదా? చెల్లీ! కొంచెము ఆలోచించుకొనుము. వాడు నీ అన్నగదా! దానికింతగా బాధపడకుము” అని ఓదార్చెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట వసించెను.
21. దావీదు ఈ సంగతి అంతయు విని బహుగ మండిపడెను. అయినను అతడు అమ్నోనును శిక్షింప లేదు. అతడు రాజునకిష్టుడు, జ్యేష్ఠపుత్రుడు.
22. అబ్షాలోము మాత్రము అమ్నోనుతో మంచిచెడ్డ మాట్లాడుటగూడ మానివేసెను. తన చెల్లెలు తామారును చెరచుటచే లోలోపల అమ్నోనుపై పండ్లు కొరుకు చుండెను.
23. రెండేండ్లు గడచెను. అబ్షాలోము ఎఫ్రాయీము చెంతనున్న బల్హచ్చోరున గొఱ్ఱెల ఉన్ని కత్తిరించుచు రాజు కుటుంబమును విందునకు ఆహ్వానించెను'.
24. అతడు రాజు వద్దకు వెళ్ళి “నేను గొఱ్ఱెల ఉన్ని కత్తిరింపబోవుచున్నాను. కనుక రాజు పరివారముతో విచ్చేయవలయును” అని బతిమాలెను.
25. కాని రాజు అతనితో “మేమందరము వత్తుమేని నీకు మిక్కిలి భారమగును” అని పలికెను. అబ్షాలోము “మీరు తప్పక రావలయును” అని పట్టుబట్టెను గాని రాజు అతని మాట వినిపించుకొనక దీవించి పంపి వేయబోయెను.
26. కాని అబ్షాలోముమరల “మీరు రానిచో అన్న అమ్నోనైనా వచ్చునా?” అని అడిగెను. దావీదు “వాడునురాడు పొమ్ము” అనెను.
27. కాని అబ్షాలోము మరిమరి బతిమాలుటచే రాజు అమ్నోనును మిగిలిన రాజతనయులను విందునకు పోనిచ్చెను.
28. అబ్షాలోము రాజవైభవముతో విందు సిద్ధముచేయించెను. అతడు సేవకులతో “నా మాటలు జాగ్రత్తగా వినుడు. అమ్నోను త్రాగి మైమరవగనే చంపుడని మీకు ఆజ్ఞ యిత్తును. మీరు వెంటనే వానిని వధింపుడు. భయపడకుడు. ఇది నా ఆజ్ఞ. ధైర్యముతో, పరాక్రమముతో కార్యము నిర్వహింపుడు” అని చెప్పెను.
29. అబ్షాలోము మాట చొప్పుననే సేవకులు అమ్నోనును వధించిరి. హత్యజరుగుట చూచి రాజ తనయులు అందరు వడివడిగా గాడిదలనెక్కి పలాయితులైరి.
30. వారు త్రోవలో ఉండగనే అబ్షాలోము రాజ తనయులనందరిని ఒక్కని గూడ మిగుల నీయకుండ మట్టుపెట్టెనను వదంతులు రాజు చెవినిబడెను.
31. అతడు శోకముతో బట్టలు చించుకొని నేలపై చతికిలబడెను. రాజు కొలువుకాండ్రును బట్టలు చించుకొనిరి.
32. కాని దావీదు సోదరుడగు షిమ్యా పుత్రుడైన యోనాదాబు రాజుతో “వారు రాజకుమారులను అందరిని వధించిరని తలపకుడు. అమ్నోనును ఒక్కనినే చంపిరి. అమ్నోను తన చెల్లెలిని చెరిచిననాటినుండి అబ్షాలోము మోము చిన్నవోయియున్నది.
33. రాజ కుమారులనందరిని మట్టు పెట్టిరన్నమాట నమ్మదగి నది కాదు. అమ్నోను మాత్రమే గతించెను” అని చెప్పెను.
34. అయితే అబ్షాలోము పారిపోయెను. అంతట నగరమునకు కాపరియగు పడుచువాడు బహూరీము, మార్గమున కొండమలుపు మీదుగా జనసమూహము వచ్చుటచూచి రాజునకు విన్నవించెను.
35. యోనాదాబు రాజుతో “నేను విన్నవించినట్లే రాజపుత్రులు విచ్చేయుచున్నారు” అనెను.
36. అతడిట్లు పలుకుచుండగనే రాజతనయులు వచ్చిరి. వారు రాజును చూచి బోరున ఏడ్చిరి. రాజు, అతని పరిచారకులుగూడ బిగ్గరగా విలపించిరి.
37. అబ్షాలోము గెషూరు రాజగు అమ్మీహూదు కుమారుడు తల్మయి చెంతకు పారిపోయెను. దావీదు తన కుమారుని కొరకు దినదినము విలపించెను. అబ్షాలోము గెష్షూరు నకు వెళ్ళి మూడునంవత్సరములు అచటనే యుండెను.
38-39. కాలక్రమమున రాజు అమ్నోను మరణమును తలంచుకొని చింతించుట మానుకొనెను. అతనికి అబ్షాలోము మీది కోపము కూడ చల్లారెను.