1. దావీదు కీషు కుమారుడైన సౌలు బారి నుండి పారిపోయి సిక్లాగున వసించుచుండెను. అచట యుద్ధములో పరాక్రమశాలులు విశ్వసనీయులైన యోధులు చాలమంది దావీదు పక్షమున చేరిరి.
2. వారెల్లరు సౌలువలెనే బెన్యామీను తెగకు చెందిన వారు. అందరును కుడిచేతితో, ఎడమచేతితోగూడ బాణములు రువ్వగలరు, ఒడిసెల త్రిప్పగలరు.
3-7. గిబ్యోను నివాసి షెమయా కుమారులు అహీయెజెరు, ఇతడు అధిపతి. అతని తదుపరివాడైన యోవాసు. ఆ యోధుల పేరులివి: అస్మావేతు తనయులు యెజీయేలు, పెలెటు. అనాతోతు నివాసులగు బెరాకా, యెహూ. గిబ్యోను నివాసి సుప్రసిద్ధ యోధుడు ఇష్మాయా, ఇతడు ముప్పదిమంది వీరుల జట్టుకు నాయకుడు. గెదారా వాసులు యిర్మీయా, యహజీయేలు, యోహానాను, యోసాబాదు. హరీపు నివాసులు ఎలూసయి, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, షేపట్యా. కోరా తెగకు చెందిన ఎల్కానా, యిష్షీయా, అసరేలు, యోయెజెరు, యాషాబాము. గెదోరు నివాని యరోహాము కుమారులు యోహేలా, జెబద్యా.
8-13. దావీదు ఎడారిలోని కొండలో దాగి యుండగా గాదు తెగకు చెందినవారు కొందరు అతని పక్షమున చేరిరి. వారెల్లరును సుప్రసిద్ధులు, యుద్ధ కుశలురైన యోధులు. ఈటెలను, డాళ్ళను నేర్పుతో వాడగలవారు. సింహము ముఖమువంటి ముఖము గలవారు, కొండజింకలవలె శీఘ్రముగా పరుగెత్తగల వారు. పదవీక్రమమున వారి పేరులివి: ఏసేరు, ఓబద్యా, ఎలీయాబు, మిష్మన్నా, యిర్మీయా, అత్తయి, యెలీయేలు, యోహానాను, ఎల్జాబాదు, యిర్మీయా, మక్బన్నయి.
14. గాదీయులైన వీరు సైనిక బృందములకు నాయకులు. కొందరు వేయిమందికి కొందరు నూరుమందికి అధిపతులు.
15. యోర్దాను పొంగి పారు మొదటినెలలో వీరు ఆ నదిని దాటి దానికి తూర్పుపడమర లోయలందు వసించుచున్న జాతుల నెల్ల తరిమికొట్టిరి.
16. దావీదు ఒక దుర్గమున వసించుచుండగా కొందరు బెన్యామీనీయులు, కొందరు యూదీయులు అతని చెంతకువచ్చిరి.
17. దావీదు వారికెదురుబోయి “మీరు నాకు సహాయము చేయుటకు స్నేహితులవలె వచ్చితిరేని నాతో కలియవచ్చును. కాని నేను మీకే అపకారము చేయకున్నను, మీరు నన్ను శత్రువులకు పట్టించుటకు వచ్చితిరేని మన పితరుల దేవుడు మిమ్ము శిక్షించునుగాక!” అనెను.
18. అప్పుడు ముప్పదిమంది జట్టుకు నాయకుడైన అమాసయి అనువానిని ఆత్మ ప్రేరేపింపగా అతడు “యిషాయి కుమారుడవైన దావీదూ! మేము నీవారము. నీకు సమాధానము కలుగుగాక! నీకును, నీ సహాయులకును విజయము సిద్ధించుగాక! ప్రభువు నీకు బాసటయై యున్నాడుసుమా!" అని పలికెను. దావీదు వారినందరిని ఆహ్వానించి తన సైన్యములకు నాయకులను చేసెను.
19. దావీదు ఫిలిస్తీయులతో కలిసి సౌలుతో యుద్ధము చేయబోవుచుండగా కొందరు మనష్షేతెగ యోధులు దావీదు పక్షమున చేరిరి. యధార్థముగా దావీదు ఫిలిస్తీయ నాయకులకు సాయము చేయలేదు. దావీదు తన యజమానుడైన సౌలు పక్షమున చేరినచో తమకు చావుమూడునని భయపడి వారు అతనిని సిక్లాగునకు పంపివేసిరి.
20. దావీదు సిక్లాగు నుండి తిరిగివచ్చుచుండగా అతని పక్షమున చేరిన మనష్షీయ యోధులు వీరు: అద్నా, యోసాబాదు, యెదీయేలు, మికాయేలు, యోసాబాదు, ఎలీహు, జిల్లెతాయి. మనష్షే తెగకు చెందిన వీరెల్లరు తమ తెగలో వేయి మంది సైనికులకు అధిపతులు.
21. వారెల్లరు సుప్రసిద్దులైన వీరులు కనుక మొదట దావీదు సైన్య బృందములకు అధిపతులైరి. తరువాత యిస్రాయేలు సైన్యమునకు నాయకులైరి.
22. రోజు రోజుకి క్రొత్త యోధులు వచ్చి దావీదు సైన్యమున చేరుచునే యుండెడివారు. కనుక అతని సైన్యము విపరీతముగా పెరిగిపోయెను.
23-37. దావీదు హెబ్రోనున వసించుచుండగా యుద్దకుశలురైన యోధులు చాలమంది అతని పక్షమున చేరిరి. ప్రభువు ప్రమాణము చేసినట్లే సౌలుకు బదులుగా దావీదును రాజును చేయుటకు వారెల్ల రును కృషిచేసిరి. వారి సంఖ్యలివి: యూదా తెగనుండి 6,800 మంది యుద్ధమునకు సన్నద్ధులైన యోధులు. వారు డాళ్ళు, బల్లెములు కలవారు. షిమ్యోను తెగనుండి 7,100 మంది యుద్ధ కుశలురు. లేవి తెగనుండి 4,600 మంది యోధులు, అహరోను వంశజుల అధిపతి యోహోయాదా, అతని అనుచరులు 3,700 మంది. యువకుడును, వీరుడునైన సాదోకు బంధువులు, నాయకులైన వారు ఇరువది యిద్దరు. సౌలునకు చెందిన బెన్యామీను తెగనుండి 3,000 మంది. ఈ తెగకు చెందినవారు చాలమంది సౌలు పక్షమునే యుండిరి. ఎఫ్రాయీము తెగనుండి తమతమ వంశములలో సుప్రసిద్ధులైన వారు 20,800 మంది. మనష్షే అర్ధతెగనుండి 18,000 మంది. వీరి నెల్లరిని దావీదును రాజును చేయుటకే పంపిరి. యిస్సాఖారు తెగనుండి 200 మంది నాయకులు, వారి అనుచరులు. ఈ నాయకులెల్లరికి ఎప్పుడు ఎట్లు పోరాడవలయునో బాగుగా తెలియును. సెబూలూను తెగ నుండి 50,000 మంది. వారెల్లరు యుద్ధమునకు సన్నద్దులైనవారు, నమ్మదగిన వారు, పలువిధములైన ఆయుధములు కలవారు. నఫ్తాలి తెగ నుండి 1,000 మంది నాయకులు, డాళ్ళు ఈటెలు గలిగిన ముప్పది ఏడువేల మంది అనుచరులు. దాను తెగనుండి 28,600 మంది యుద్ధ కుశలులు. ఆషేరు తెగనుండి యుద్ధమునకు సన్నద్ధులైన వారు నలువదివేల మంది. యోర్దానునకు తూర్పున నున్న రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగనుండి పలువిధములైన ఆయుధములు గలవారు లక్షయిరువది వేలమంది.