1. అంతట యావే నాతానును పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను: “ఒక నగరమున ఇరువురు మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు.
2. సంపన్నునకు గొఱ్ఱెలమందలును, గొడ్లమందలును సమృద్ధిగాగలవు.
3. పేద వానికి ఒక చిన్న గొఱ్ఱె కొదమ మాత్రము కలదు. అతడే దానిని కొనితెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచు వచ్చెను. ఆ గొఱ్ఱె పిల్ల యజమానుని కంచమున తినుచు పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కూతురువలె ఉండెడిది.
4. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కాని అతడు తన మందలనుండి చుట్టము కొరకు వేటను కోయించుటకు అంగీకరింపక, పేద వాని గొఱ్ఱెపిల్లను గైకొని భోజనము తయారు చేయించెను.”
5. ఆ మాటలు విని దావీదు కోపమువలన ఒడలుమండగా “యావేతోడు. ఇట్టి పాడుపనికి పాల్పడినవాడు నిక్కముగా వధింపతగినవాడు.
6. అతడు జాలిలేక ఇట్టి చెడుకు పూనుకొనుటచే ఆ గొఱ్ఱెపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లలను నష్టపరిహారముగా చెల్లించి తీరవలయును” అనెను.
7. అంతట నాతాను దావీదును చూసి “నీవే ఆ మనుష్యుడవు. యిస్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. 'నేను నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా నియమించితిని. సౌలు బారినుండి నిన్ను కాపాడితిని.
8. నీ యజమానుని భార్యలను, నీ కౌగిట చేర్చి యిస్రాయేలువారిని, యూదావారిని నీకు అప్పగించితిని. ఇది చాలదందువేని, ఇంకను నీవు కోరిన కోర్కెలన్నిటిని తీర్చెడివాడనుగదా!
9. ఇట్టి దుష్కార్యము చేసి యావే ఆజ్ఞను తిరస్కరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? నీవు ఊరియాను కత్తితో చంపించితివి. అతని ఇల్లాలిని నీ ఆలిని చేసికొంటివి. అతనిని అమ్మోనీయుల కత్తితో పొడిపించితివి.
10. నీవు నన్ను అలక్ష్యముచేసి హిత్తీయుడైన ఊరియా భార్యను చేపట్టితివి. కావున వినుము. కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికిని విడువదు.
11. నీ కుటుంబము వారినుండియే నీకు కీడు మూడునట్లు చేసెదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే ఇంకొకని వశము చేసెదను. అందరు చూచుచుండగనే అతడు నీ భార్యలతో శయనించును.
12. నీవు ఈ పనిని రహస్యమున చేసితివి. కాని నేను ఈ కార్యమును యిస్రాయేలీయుల అందరి యెదుట బట్టబయలుగనే చేసెదను' అని పలుకుచున్నాడు” అనెను.
13. దావీదు నాతానుతో “నేను యావేకు ద్రోహముగా పాపము చేసితిని” అనెను. నాతాను “ప్రభువు నీ పాపము క్షమించెను. నీవు చావుకు తప్పి బ్రతుకుదువు.
14. కాని ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక, నీకు పుట్టిన బిడ్డడు మరణించును” అనెను.
15. నాతాను దావీదు కడనుండి వెడలిపోయెను. ఊరియాభార్య దావీదునకు కనిన శిశువు ప్రభు శిక్ష వలన జబ్బుపడెను.
16. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను.
17. గృహనిర్వాహకులు దావీదు చుట్టుమూగి అతనిని నేలమీది నుండి లేపజూచిరి గాని రాజు లేవనులేదు, పస్తు విడువనులేదు.
18. ఏడవనాడు బిడ్డడు చనిపోయెను. కాని సేవకులు శిశుమరణమును దావీదున కెరిగింపవెరచిరి. వారు “పసికందు బ్రతికియుండగా రాజును బ్రతిమాలితిమి. కాని అతడు వినిపించుకోలేదు. ఇపుడు పాపడు చని పోయెనని ఎట్లు చెప్పగలము? అతడేమి అకార్యమునకు పాల్పడునో” అని మథనపడజొచ్చిరి.
19. సేవకులు ఈ రీతిగా గుసగుసలాడుకొనుట చూచి రాజు బిడ్డ చనిపోయెనని గ్రహించెను. అతడు “శిశువు మరణించెనా?” అని అడుగగా వారు “అవును” అనిరి.
20. దావీదు నేలనుండి లేచి స్నానముచేసి, తైలము పూసికొని, క్రొత్త ఉడుపులు తాల్చి, యావే దేవాలయమునకు పోయి చేతులు జోడించి సాగిలపడెను. ఇంటికి వచ్చి సేవకులచే వడ్డెన చేయించుకొని ఆహారము తినెను.
21. రాజు అనుచరులు దావీదుతో “చంటివాడు బ్రతికుండగా వస్తుండి విలపించితివి. బిడ్డ చనిపోయినపిదప లేచి భుజించితివి. ఈ విపరీత కార్యమేమి?" అనిరి.
22. అతడు వారితో "యావే నాపై జాలిగొని బిడ్డను బ్రతికింపకపోడా అనుకొని శిశువు సజీవుడైయుండగా పస్తుండి శోకించితిని.
23. కాని ఇప్పుడు బిడ్డ కన్నుమూసెను. ఇక నేను పస్తుండి మాత్రము ఏమి లాభము? ఆ పసికందును మరల తీసికొని రాగలనా? నేను వాని యొద్దకు వెళ్ళవలసినదే కాని, వాడు నాయొద్దకు రాడుగదా!” అనెను.
24. దావీదు బత్షెబను ఊరడించి ఆమెతో శయనించెను. ఆమె మరల గర్భవతియై బిడ్డను కని సొలోమోను అని పేరు పెట్టెను. ఆ శిశువును యావే ప్రేమించెను.
25. ప్రభువు నాతాను ప్రవక్తను పంపి తన ఇష్టము చొప్పున బాలునికి “యెదీద్యా”' అని పేరు పెట్టించెను.
26. యోవాబు అమ్మోనీయుల నగరమైన రబ్బాను ముట్టడించి జలాశయమును స్వాధీనము చేసికొనెను.
27. అతడు దావీదు నొద్దకు దూతలనంపి “నేను రబ్బాను ముట్టడించి జలాశయమును ఆక్ర మించితిని.
28. కనుక మిగిలిన సైన్యములను ప్రోగు చేసికొని వచ్చి వ్యూహముపన్ని నగరమును పట్టుకొనుము. నేనే పట్టణమును స్వాధీనము చేసికొనినచో అది నా పేర పిలువబడును”అని కబురుపంపెను.
29. కనుక దావీదు సైన్యములన్నిటిని ప్రోగు చేసికొని వచ్చి రబ్బాను ముట్టడించి వశపరచుకొనెను.
30. అతడు వారి రాజు శిరస్సున నున్న కిరీటము గైకొనెను. అది మిక్కిలి బరువు కలది. దానిలో పొదుగబడియున్న అమూల్యరత్నము దావీదు శిరస్సును అలంకరించెను. అతడు నగరము నుండి విస్తారమైన కొల్లసొమ్మును గూడకొనివచ్చెను.
31. రాజు ఆ నగరవాసులను చెరపట్టి తీసికొనివచ్చి రంపములతో కొయ్యలు కోయుటకును, రకరకముల ఇనుప పనిముట్లతో పనులు చేయుటకును, ఇటుకలు కాల్చుపనులకును వినియోగించెను. అమ్మోనీయుల నగరములనుండి కొనివచ్చిన వారందరితోనిట్లే ఊడిగము చేయించెను. రబ్బా లోబడినపిదప దావీదు సైన్యముతో యెరూషలేమునకు తిరిగి వచ్చెను.