1. హోలోఫెర్నెసు యూదితుతో “ఓ స్త్రీ ధైర్యము వహింపుము. నన్ను చూచి భయపడవలదు. లోకాధిపతియైన నెబుకద్నెసరునకు సేవలు చేయువారినెవరిని నేను ఏనాడును శిక్షించి ఎరుగను.
2. ఇప్పుడైనను కొండలలో వసించు మీ ఈ జాతివారు నన్ను చులకన చేసియుండరేని నేను వారిమీద పోరుతలపెట్టియుండను. వారు తమను కట్టు త్రాళ్ళు తామే తెచ్చుకొనిరి.
3. కాని నీవిప్పుడు వారిని విడనాడి మా యొద్దకేల వచ్చితివి? ఇచటికి వచ్చుట వలన నీ ప్రాణములు దక్కించుకొంటివి. ఇక భయపడకుము. ఈ రాత్రికి మేము నిన్ను కాపాడుదుము. ఇకమీదటను నీకెట్టి హాని కలుగదు.
4. ఇచట నీకెవరును కీడుచేయరు. మా ప్రభువైన నెబుకద్నెసరు దాసులు అందరికి వలె నీకును గౌరవాదరములు లభించును” అనెను.
5. యూదితు అతనితో “ఏలినవారు నేను మాట్లాడుటకు సెలవు దయచేయుడు. తమరీ దాసురాలి పలుకులాలింపుడు. నేనెట్టి అబద్దములను చెప్పను.
6. తమరు ఈ దాసురాలి సలహాను పాటింతురేని దేవుడు మీ ద్వారా ఒక మహత్తర కార్యమును సాధించును. అప్పుడు ప్రభువు తలపెట్టిన పని నెరవేరును.
7. నేను లోకాధిపతియైన నెబుకద్నెసరు రాజు ప్రాణము మీద, బలముమీద ప్రమాణము చేసి చెప్పుచున్నాను. సమస్త ప్రజలను అదుపులోనికి తెచ్చుటకు ఆ ప్రభువు మిమ్ము పంపెను. మీ పరాక్రమమువలన ఒక్క నరులే కాదు, వన్యమృగములును, పెంపుడు జంతువులును, పక్షులును గూడ ఆ రాజుకు విధేయములు అగుచున్నవి. మీ సామర్థ్యము వలన ఆ రాజునకును, అతని సామ్రాజ్యమునకును అభ్యుదయము చేకూరుచున్నది.
8. మేమెల్లరము ఏలినవారి తెలివితేటలగూర్చివింటిమి. అస్సిరియా సైన్యమంతటిలో సామర్ధ్యమునను, అనుభవమునను, చాకచక్యమునను తమరిని మించిన సైన్యాధిపతిలేడని, లోకమంతయు ఎరుగును.
9. బెతూలియా ప్రజలు అకియోరు ప్రాణములు కాపాడిరి. అతడు తాను మీ మంత్రాలోచన సభలో ఏమి చెప్పినది మాకు ఎరిగించెను.
10. అయ్యా! అకియోరు చెప్పినది నిజమే. కనుక తమరతని మాటలను చులకన చేయరాదు. అతని సందేశము నమ్మదగినదే. మా ప్రజలు దేవుని ధిక్కరించి పాపము చేసిననే తప్ప ఎవరు వారిని శిక్షింపజాలరు, జయింపజాలరు.
11. అయినను ఇప్పుడు ఏలినవారికి ఎట్టి ఆటంకము గాని, అపజయముగాని కలుగబోదు. మా ప్రజలకిప్పుడు చావుమూడినది. వారు పాపమునకు లొంగిరి. పాపము చేసినపుడెల్ల వారు ప్రభువు కోపమును రెచ్చగొట్టుదురు.
12. బెతూలియా ప్రజలు సేకరించి ఉంచుకొనిన ఆహారమంతయు అయిపోయినది. వారి నగరమున నీరు కూడ లేదు. ఇపుడా జనులు తమ పశువులమందలను చంపి తిననున్నారు. ఇంకను వారు ధర్మశాస్త్రము నిషేధించిన ఆహారమునుగూడ భుజింపనున్నారు.
13. వారు తమకు పండిన పంట నుండి పదియవ పాలుగా దేవునికర్పించిన గోధుమలను, ద్రాక్ష సారాయమును, ఓలివుతైలమును ఆరగింప నిశ్చయించుకొనిరి. కాని ఇవి పవిత్రమైన భోజన పదార్థములు. యెరూషలేమున దేవునికి అర్చించు యాజకులు మాత్రమే వానిని భుజింపవచ్చును. సామాన్యజనులు వానిని ముట్టనైన ముట్టరాదు.
14. యెరూషలేము పౌరులిట్టి నిషిద్ధవస్తువులను భుజింప మొదలిడిరి. కనుక మా పట్టణము వారును యెరూషలేమునకు దూతలనంపిరి. ఆ దూతలు అచటి మహాసభ సభ్యులనుండి ఈ నిషిద్ధవస్తువులను భుజించుటకు అనుమతిని పొంది వత్తురు.
15. వారు తిరిగిరాగానే మా ప్రజలు ఈ వస్తువులను సేవింతురు. అట్లు సేవింపగానే వారెల్లరు మీ చేతికి చిక్కుదురు.
16. ఈ సంగతి తెలియగానే నేను మా జనుల నుండి పారిపోయివచ్చితిని. ఏలినవారి కొక ముఖ్యమైన పనిని చేసి పెట్టుటకు ప్రభువు నన్నిచటకు పంపెను. అది యేమియో తెలిసి కొనినపుడు లోకము లోని జనులెల్లరును విస్తుపోవుదురు.
17. తమ దాసినైన నేను భక్తురాలను, ఆకాశాధిపతియైన దేవుని రేయింబవళ్ళు సేవించుదానను. నేనిచటనే యేలినవారి శిబిర మున వసింపగోరెదను. నేను ప్రతిదినము రాత్రి వెలుపలిలోయలోనికి పోయి దేవుని ప్రార్ధించివత్తును. మా ప్రజలు పాపము కట్టుకొనగనే దేవుడు నాకు తెలియజేయును.
18. వారు పాపము చేయగనే నేను వచ్చి తమరికి విన్నవింతును. వెంటనే ప్రభువులవారు సర్వసైన్యముతో పోయి వారిమీద పడవచ్చును. అపుడు యిస్రాయేలీయులు మిమ్ము ఎదిరింపజాలరు.
19. నేను ఏలినవారిని యూదయా మండలముగుండ నడిపించుకొనిపోవుదును. మిమ్ము యెరూషలేమునకు కొనిపోయి ఆ నగర మధ్యమున రాజుగా అభిషేకింతును. అప్పుడు ప్రభువులవారు సొంత కాపరిని కోల్పోయిన గొఱ్ఱెలమందనువలె ఆ జనులనెల్లరిని చెల్లాచెదరు చేయవచ్చును. ఇక ఒక్క కుక్క కూడ తమరిని చూచి మొరుగుటకు వీలుండదు. దేవుడు నాకీ సంగతిని ముందుగనే తెలియజేసెను. ఇప్పుడు ప్రభువుల వారికి ఈ సమాచారమును అందించుటకుగాను ఆయన నన్నిటకు పంపెను” అని చెప్పెను.
20-21. హోలోఫెర్నెసు అతని సేవకులు యూదితు పలుకులను మెచ్చుకొనిరి. వారు అమె తెలివితేటలను మెచ్చుకొనుచు ఇంత అందగత్తె, ఇంత మాటకారితనము కల మహిళ ప్రపంచమున ఎందైన గలదా అని ఒకరితో నొకరు చెప్పుకొనిరి.
22. హోలోఫెర్నెసు ఆమెతో “మాకు విజయము చేకూర్చి పెట్టుటకును, మా ప్రభువైన నెబుకద్నెసరును ధిక్కరించినవారిని సర్వనాశనము చేయుటకును దేవుడు నిన్ను ముందుగా మా చెంతకు పంపెను.
23. నీవు అందగత్తెవు, నేర్పుతో మాటలాడగల దానవు కూడ. నీవు చెప్పినట్లే చేయుదువేని నేనును మీ దేవుని పూజింతును. నీ మట్టుకు నీవు నెబుకద్నెసరు రాణి వాసమున వసించుచు జగత్ప్రసిద్ధిని పొందవచ్చును” అనెను.