1. ఈ సంగతులు జరిగిన ఒక నెలకు అమ్మోనీయుడగు నాహాషు, యాబేషు గిలాదుపై దండెత్తివచ్చెను. యాబేషు ప్రజలు నాహాషుతో “మాతో ఒడంబడిక చేసికొనుము. మేము మీకు లోబడి ఉండెదము” అనిరి.
2. కాని నాహాషు “నేను మీ కుడికన్నులు పెరికివేసెదను. ఇది మీ యిస్రాయేలీయులందరకు అవమానము కలిగించును. ఈ నియమమునకు మీరు ఒప్పుకొందురేని మీతో ఒడంబడిక చేసికొందును” అనెను.
3. అందుకు యిస్రాయేలు పెద్దలు నాహాషుతో “మాకు ఏడురోజులు గడువిమ్ము, మేము యిస్రాయేలు దేశము నాలుగు చెరగులకు దూతలనంపెదము. ఎవ్వరును మమ్ము ఆదుకొనుటకు రానిచో నీకు లొంగిపోయెదము” అని చెప్పిరి.
4. అంతట వారి దూతలు సౌలునగరమైన గిబియాకు వచ్చి జరిగినదానిని ఎరిగింపగనే పురజనులందరు బావురుమని ఏడ్చిరి.
5. అంతలోనే సౌలు పొలమునుండి ఎద్దులను తోలుకొనివచ్చుచుండెను. అతడు “ప్రజలు ఇట్లు దుఃఖించుచున్నారేల? ఏమి కీడు మూడినది?” అని అడిగెను. పురజనులు యాబేషు నుండి వచ్చిన వార్తలు విన్పించిరి.
6. ఆ మాటలు చెవినబడగనే యావే ఆత్మ సౌలును ఆవహించెను. అతడు కోపముతో మండి పోయెను.
7. వెంటనే సౌలు ఒక కాడిఎడ్లను కండ తుండెములుగా ఖండించెను. ఆ ముక్కలను వార్తాహరులతో యిస్రాయేలు దేశము నాలుగుమూలలకు పంపి సౌలు పక్షమున పోరాడుటకు రానివారి ఎద్దులకు ఇదేగతి పట్టునని వర్తమానము పంపెను. అప్పుడు యావే యిస్రాయేలీయులకు భయము కలిగించెను. కావున వారెల్లరు ఒక్కుమ్మడిగా వచ్చి సౌలుతో చేరిరి.
8. అతడు బేసెకు వద్ద అనుచరులను లెక్కించి చూడగా యిస్రాయేలీయులు మూడులక్షలమందియు, యూదీయులు ముప్పదివేలమందియు యుండిరి.
9. అంతట సౌలు యాబేషు నుండి వచ్చిన దూతలతో “రేపు ఎండ పొడ కాన్పించునప్పటికి సహాయము లభించును” అని మీ వారికి తెల్పుడనెను. దూతలు ఆ పలుకులను యాబేషువాసులకెరిగింపగా వారు మిక్కిలి సంతసించిరి.
10. కనుక వారు నాహాషుతో “రేపు నీ చెంతకు వచ్చెదము, మమ్ము మీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును" అనిరి.
11. ఆ రాత్రి సౌలు తన సైన్యములను మూడు భాగములుగా విభజించెను. వారు వేకువజాముననే అమ్మోనీయుల శిబిరములపై పడి ప్రొద్దెక్కి ఎండ ముదురు వరకు శత్రువులను తునుమాడిరి. చావక మిగిలినవారు చెట్టుకొకడుగా పారిపోయిరి.
12. అంతట ప్రజలు సమూవేలుతో “సౌలు మమ్మెట్లు పరిపాలించునో చూతమనిన వారిని ఇచ్చటికి కొనిరమ్ము. వారినందరిని వధించెదము” అనిరి.
13. కాని సౌలు “ఈ దినము యావే యిస్రాయేలీయులను సంరక్షించెను. కనుక నేడు మీరు ఎవ్వరిని చంపరాదు” అనెను.
14. సమూవేలు ప్రజలతో “మనమందరము గిల్గాలునకు పోవుదము రండు. రాజనియామకమునకు సమ్మతింతుమని అట మరల మాటిత్తము” అనెను.
15. కావున జనులందరు గిల్గాలునకు వెళ్ళిరి. అచ్చట యావేముందట సౌలును రాజుగా ప్రకటించిరి. ప్రజలు ప్రభువునకు సమాధాన బలులు సమర్పించిరి. సౌలును, యిస్రాయేలుజను లును మిక్కిలి సంతోషించిరి.