1. అంతట సమూవేలు తైలపుబుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో “యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభువు ప్రజను పరిపాలించి చుట్టుపట్లనున్న శత్రువుల నుండి వారిని కాపాడవలెను. ప్రభువు తన జనమునకు నిన్ను నాయకునిగా నియమించెననుటకు గుర్తులివియే:
2. నీవు నన్ను వీడిపోవగనే బెన్యామీను పొలిమేరలలోని సెల్సా వద్దగల రాహేలు సమాధిచెంత ఇద్దరు జనులు నిన్ను కలిసికొని “మీరు వెదకబోయిన గాడిదలు దొరకినవి. మీ నాయన వానినిగూర్చి చింతించుట లేదు. కుమారుడు తిరిగివచ్చుటకు ఏమిచేయుదు నాయని రేయింబవళ్ళు నిన్ను గూర్చియే పలవరించు చున్నాడు' అని చెప్పుదురు.
3. అక్కడినుండి నీవు కొంచెము దూరముపోయి తాబోరు సింధూరము చేరగనే దేవుని దర్శించుటకు బేతేలు పోవుచున్న జనులు ముగ్గురు కన్పింతురు. వారిలో ఒకడు మూడు మేకకూనలను, రెండవవాడు మూడు రొట్టెలను, మూడవవాడు తిత్తెడు ద్రాక్షసారాయమును మోసికొని పోవుచుందురు.
4. వారు నీకు దండము పెట్టి రెండు రొట్టెలు కానుక ఇత్తురు. నీవు వానిని గైకొనుము.
5. పిమ్మట నీవు గిబియా, తెలోహీము వెళ్ళెదవు. అచ్చటనే ఫిలిస్తీయుల సైనిక శిబిరము ఉన్నది. నీవు ఆ నగరము చేరునప్పటికి ప్రవక్తలసమాజము ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును. వారు సితారా, బాకా, ఫిడేలు, మృదంగము మొదలగు వాద్యములు మ్రోగించు వారి వెంట నడచుచు ఆవేశమునొంది ప్రవచనములు పలుకుచుందురు.
6. అప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశింపగా వారితోపాటు నీవును ప్రవచనములు పలికెదవు. దానితో నీవు పూర్తిగా మారిపోయి కొత్త వ్యక్తివి అయ్యెదవు.
7. ఈ గురుతులన్ని నెరవేరిన పిదప ఆయా పరిస్థితులకు తగినరీతిగా కార్యములు నడుపుము. యావే నీకు బాసటగా నుండును.
8. ఇక నీవు నాకంటె ముందుగా పోయి గిల్గాలు చేరుము. దహనబలులు, సమాధానబలులు సమర్పించుటకు నేను అచ్చటికి వచ్చెదను. నిన్నట కలిసికొందును. నీవు మాత్రము నాకొరకై ఏడురోజులు వేచి యుండుము. నేను వచ్చి నీవు చేయవలసిన కార్యము నెరిగింతును” అని చెప్పెను.
9. సౌలు సమూవేలును వీడి వెళ్ళిపోగానే దేవుడు అతని హృదయమును మార్చి కొత్త మనస్సును అనుగ్రహించెను. సమూవేలు చెప్పిన గురుతులన్ని ఆ దినమే కనబడెను.
10. అతడు గిబియా చేరగనే ప్రవక్తలు ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యనుండి ప్రకటన చేయుచుండెను.
11. సౌలును ఎరిగిన వారు అతడు కూడ ప్రవక్తలలో చేరి ప్రవచనములు పలుకుచుండుట గాంచి విస్తుపోయి “కీషు కుమారునకు ఏమి గతి పట్టినదో చూచితిరా? సౌలుకూడ ప్రవక్తలలో కలిసి పోయెనా?” అని అనుకొనిరి.
12. కాని ఆ పలుకులు ఆలించిన ప్రవక్తల సమాజము నుండి ఒకడు “మరి ఈ ప్రవక్తల తండ్రి ఎవరో?” అని ఒక పోటుమాట విసరెను. నాటినుండి "సౌలుకూడ ప్రవక్త అయ్యెనా?” అను లోకోక్తి ఏర్పడెను.
13. ప్రవచించుట చాలించిన పిదప సౌలు ఇల్లు చేరుకొనెను.
14. అప్పుడు సౌలు పినతండ్రి సౌలును, అతని సేవకుని చూచి మీరెక్కడికి వెళ్ళితిరని అడిగెను. సౌలు “మేము గాడిదలను వెదకబోయితిమి, అవి కన్పింపకుండుటచే సమూవేలు చెంతకు వెళ్ళితిమి” అని చెప్పెను.
15. “సమూవేలు మీతో ఏమిచెప్పెను?” అని పినతండ్రి మరల ప్రశ్నించెను.
16. “అతడు గాడిదలు దొరకినవని నొక్కిచెప్పెను” అని సౌలు జవాబిచ్చెను. కాని సమూవేలు తనతో పలికిన రాచరికమును గూర్చి మాత్రము సౌలు ఒక్కమాట గూడ పొక్కనీయలేదు.
17. సమూవేలు యిస్రాయేలు ప్రజలను మిస్పా వద్దకు పిలిపించి యావే ఎదుటకు రప్పించెను.
18. అతడు వారితో “యిస్రాయేలు దేవుడైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నేను మిమ్ము ఐగుప్తునుండి, ఐగుప్తుపాలకుల బెడదనుండి విడిపించుకొని వచ్చితిని. మిమ్ము బాధించు శత్రురాజ్యముల నుండి కాపాడితిని.
19. అయితే మీ కష్టములనుండి, యాతనలనుండి మిమ్ము కాపాడుచు వచ్చిన దేవుని నేడు తేలికగా నిరాకరించి, మాకు రాజును నియమించి తీరవలెనని మీరు పట్టుపట్టితిరి. అది సరి, మీ తెగల ప్రకారముగా కుటుంబముల ప్రకారముగా యావే ముందట నిలవుడు” అనెను.
20. సమూవేలు యిస్రాయేలు తెగలన్నిటికిని చీట్లు వేయగా బెన్యామీను తెగవంతు వచ్చెను.
21. బెన్యామీను తెగలోని కుటుంబములన్నిటిని పిలిచినపుడు మత్రీ కుటుంబము వంతు వచ్చెను. మత్రీ కుటుంబములోని జనులనందరను పిలిచినపుడు కీషు కుమారుడైన సౌలు వంతు వచ్చెను. వెంటనే వారు సౌలు కోసము వెదకిరి గాని అతడు కనబడలేదు.
22. కనుక వారు మరల ప్రభువు సమ్మతి నడిగిరి. సౌలు ఇచ్చటికి వచ్చెనా అని ప్రశ్నించిరి. ప్రభువు “అతడు సామానుల మధ్య దాగుకొనియున్నాడు” అని చెప్పెను.
23. వెంటనే కొంతమంది అచటికి వెళ్ళి సౌలును కొనివచ్చిరి. అతడు వచ్చి ప్రజలముందు నిలబడెను. జనులు అతని భుజముల వరకైనను రాలేదు.
24. సమూవేలు ప్రజలతో “యావే ఎవ్వరిని ఎన్నుకొనెనో చూచితిరిగదా? ఇతనివంటి వాడు ప్రజలలో ఎవ్వడునులేడు” అనెను. జనులు "మా రాజు కలకాలము జీవించుగాక!” అని పెద్ద పెట్టున కేకలు వేసిరి.
25. అప్పుడు సమూవేలు, రాజు ఏ తీరున పరిపాలించునో ప్రజలకు వివరించి చెప్పెను. ఆ వైనమును ఒక గ్రంథమున వ్రాసి యావే ముందట నుంచెను. ఆ పిమ్మట ప్రజలనందరను వారివారి ఇండ్లకు సాగనంపెను.
26. సౌలు కూడ గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుడు హృదయములు మార్పగా వీరావేశమునొందిన శూరులు కొందరు అతని వెంటపోయిరి.
27. కాని సౌలనిన గిటని దుర్మార్గులు కొందరు “వీడు మనలనెట్లు రక్షింపగలడు” అని తేలికగా మాటలాడిరి. వారతనిని చిన్నచూపు చూచుటచే బహుమానములు కూడ సమర్పింపలేదు. అయినను అతడు చెవిటివాడైనట్టు మిన్నకుండెను.