1. నెబుకద్నెసరు రాజు నేనెవె పట్టణమును రాజధానిగా చేసికొని అస్సిరియా రాజ్యమును పరిపాలించుచున్న సమయములో అర్ఫక్షదు రాజు ఎక్బటానా నగరమును రాజధాని గావించుకొని మాదియా దేశమును ఏలుచుండెను.
2. ఇతడు ఎక్బటానా చుట్టును చెక్కిన రాళ్ళతో ప్రాకారమును కట్టించెను. ఒక్కొక్క రాయి నాలుగున్నర అడుగుల మందము, తొమ్మిది అడుగుల పొడవు కలిగియుండెను. ప్రాకా రము ఎత్తు 105 అడుగులు. వెడల్పు 75 అడుగులు.
3. అతడు ప్రాకారద్వారములవద్ద బురుజులు నిర్మించెను. ఒక్కొక్క బురుజు ఎత్తు 150 అడుగులు. ఒక్కొక్కదాని పునాది వెడల్పు 90 అడుగులు.
4. ఒక్కొక్క ద్వారము ఎత్తు 105 అడుగులు, వెడల్పు 60 అడుగులు. ఆ ద్వారములగుండ అతని సైన్యమంత ఒక్కసారిగా దాటి పోగలదు. అతని కాల్బలము కూడ బారులుతీరి సాగి పోగలదు.
5. నెబుకద్నెసరు రాజు తన పరిపాలనా కాలము పండ్రెండవయేట అర్ఫక్షదుతో యుద్ధము ప్రారంభించెను. రాగీసు నగరము ప్రక్కనున్న పెద్దమైదానమున పోరు జరిగెను.
6. ఆ యుద్ధమున చాలజాతులు అర్పక్షదును బలపరచిరి. కొండభూములలో వసించువారు, తిగ్రీసు, యూఫ్రటీసు, హిడాస్పిసు నదీతీరములందు వసించువారు, ఏలాము రాజగు అర్యోకు పరిపాలన క్రింద మైదానములలో వసించువారు అర్ఫక్షదుతో చేరిరి. ఆ రీతిగా ఆ యుద్ధమున చాలజాతులు కల్దీయుల రాజుతో చేతులు కలిపిరి.
7-8. అస్సిరియా రాజు నెబుకద్నెసరు పర్షియా దేశమునకు, పశ్చిమమున నున్న సిలీషియాకును, దమస్కుకును, లెబానోనుకును, ముందటి లెబానోను దేశములకును, సముద్రతీర దేశములకును, కర్మెలు పట్టణమునకును, గిలాదు, ఉత్తరపు గలిలీ దేశములకును, ఎస్ట్రలోను మైదానమునకును దూతలను పంపెను.
9-10. మరియు అతడు సమరియా దేశమునకును, దాని పరిసర నగరములకును, యోర్దాను నదికి పశ్చిమమున నున్న సుదూర నగరములగు యెరూషలేము, బెతని, కేలోసు, కాదేషులకును, ఐగుప్తు నదీ సరిహద్దులకును, ఐగుప్తు నగరములగు గోషేను ప్రాంతాలైన తహపనేసు, రామెసేసు, తనీసు, మెంఫీసులకును, ఇతియోపియా సరిహద్దుల వరకును వ్యాపించియున్న ఐగుప్తు మండలములకును దూతలను పంపెను.
11. కాని ఈ ప్రజలెల్లరు నెబుకద్నెసరు ఆజ్ఞను త్రోసిపుచ్చి అతని పక్షమున పోరాడుటకు నిరాకరించిరి. వారు ఆ రాజు ఒంటరివాడయ్యెనని తలంచి అతనిని లక్ష్య ముచేయరైరి. అతడు పంపిన దూతలు తమ పనిని సాధింపజాలక అవమానములకు గురియై తిరిగి వచ్చిరి.
12. కనుక నెబుకద్నెసరు ఈ రాజ్యముల మీద ఆగ్రహము చెందెను. అతడు ఈ దేశములమీద పగ తీర్చుకొందునని తన రాజ్యము పేరుమీద, తన సింహాసనము పేరుమీద శపథము చేసెను. సిలీషియా, దమస్కు సిరియా, మోవాబు, అమ్మోను, యూదా, ఐగుప్తు, రెండు సముద్రముల తీరము వరకు వ్యాపించియున్న దేశములన్నిటిని కత్తితో హతము చేయుదునని ప్రతిజ్ఞ చేసెను.
13. నెబుకద్నెసరు తన పరిపాలనాకాలము పదునేడవయేట సైన్యముతో పోయి అర్పక్షదును ఎదిరించెను. అతడు శత్రువు రథబలమును, అశ్వబలమును, సైన్యమునంతటిని చెల్లాచెదరుచేసెను.
14. అతని నగరములను ఆక్రమించుకొనెను. ఎక్బటానా నగరమునుకూడ ముట్టడించి దాని బురుజులను వశము చేసికొనెను. నగరములోని అంగళ్ళను కొల్లగొట్టెను. వైభవోపేతముగానున్న ఆ పట్టణమును పాడుచేసెను.
15. అటుతరువాత అర్పక్షదునుకూడ రాగీసు కొండలలో పట్టుకొని ఈటెలతో పొడిచి చంపెను.
16. తదనంతరము కొల్లసొమ్ము ప్రోగుజేసికొని స్వీయసైన్యముతోను, తనతో చేరిన ఇతర సైన్యములతోను నేనెవెకు తిరిగివచ్చెను. అచట నాలుగు నెలలపాటు రాజును, సైనికులును సంతసముతో, విశ్రాంతితో విందులు చేసికొనిరి.