ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోవేలు 1వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. పెతూవేలు కుమారుడైన యోవేలునకు ప్రభువు దర్శనవాణి తెలియజేసిన సందేశమిది:

2. వృద్దులారా వినుడు!  మీ తరమునగాని, మీ తండ్రుల తరమున గాని ఇట్టి కార్యమెన్నడైనను జరిగినదా?

3. మీరు మీ బిడ్డలకు దీనిని తెలియజేయుడు. మీ బిడ్డలు వారి బిడ్డలకును, వారు తమ తరువాతి తరములవారికిని దీనిని వివరింతురు.

4. మిడుతలు పెద్దవి, చిన్నవి దండు మీద దండు వచ్చెను. ఒక దండు వదలి వేసినది మరియొక దండు మ్రింగివేసెను.

5. త్రాగుబోతులారా! మీరు నిద్రమేల్కొని శోకింపుడు. మధుపాన ప్రియులారా! విలపింపుడు. మీకిక క్రొత్త ద్రాక్షారసము లభింపదు.

6. మిడుతలదండు వచ్చి మన దేశముపై పడినది. ఆ ప్రాణులు బలమైనవి, లెక్కల కందనివి. వాని పండ్లు సింగము కోరలవలె కరకైనవి.

7. అవి మన ద్రాక్షలను నాశనము చేసెను. మన అంజూరములను కొరికివేసెను. ఆ చెట్ల కొమ్మల బెరడును తినివేయగా అవి తెల్లబడెను.

8. వధువు తాను పరిణయమాడనున్న యువకుడు మరణింపగా శోకించినట్లు మీరును శోకింపుడు.

9. దేవాలయమున అర్పించుటకు ధాన్యమును, ద్రాక్షరసమును లేవు. ప్రభువునకు అర్పించుటకేమియు లేవు గాన యాజకులు విలపించుచున్నారు.

10. పొలములు పాడైనవి. ధాన్యము నాశనమగుటచే భూమి దుఃఖించుచున్నది. ద్రాక్షలెండిపోయినవి, ఓలివుచెట్లు వాడిపోయినవి.

11. కర్షకులారా! రోదింపుడు. ద్రాక్షలు పెంచు రైతులారా! అక్రందన చేయుడు. యవ, గోధుమపంటలు అన్నియు పాడైనవి.

12. ద్రాక్షలు, అంజూరములు మాడిపోయినవి. దానిమ్మలు, ఖర్జూరములు, ఆపిలుచెట్లు మొదలుగాగల పొలములోని చెట్లన్నియు ఎండిపోయినవి. నరుల సంతోషము అంతరించినది.

13. యాజకులారా! గోనె తాల్చి విలపింపుడు. బలిపీఠములపై అర్చనచేయువారలారా! శోకింపుడు. దేవాలయములోనికి పోయి రేయెల్ల ఏడ్వుడు. దేవాలయమున మీ దేవునికి అర్పించుటకు ధాన్యము గాని, ద్రాక్షాసారాయముగాని లేదు.

14. జనులు ఉపవాసము ఉండవలెనని ప్రకటింపుడు. ప్రజలను సమావేశపరపుడు. యూదా నాయకులను, ప్రజలనెల్లరిని మీ దేవుడైన ప్రభువు మందిరమున ప్రోగుచేసి అతడికి మొరపెట్టుడు.

15. ప్రభుదినము సమీపించినది. అతడు నాశనమును కొనివచ్చు దినమాసన్నమైనది. అది భయంకరమైన దినము.

16. మనము చూచుచుండగనే మన పంటలు నాశనమైనవి. మన దేవుని మందిరమునుండి ఆనందోత్సాహములు మరుగైనవి.

17. ఎండిన నేలలో విత్తనములు కందిపోయినవి. గాదెలలో నిల్వచేయుటకు ధాన్యములేదు. కావున ఖాళీ గాదెలు పాడైపోయినవి.

18. బీళ్ళలో గడ్డిలేదు. కనుక పశువులు దీనముగా అరచుచున్నవి. గొఱ్ఱెలమందలు బాధపడుచున్నవి.

19. ప్రభూ! మంటలు కాల్చివేసినట్లుగా గడ్డిబీడులెండిపోయినవి. పొలములోని చెట్లు మాడిపోయినవి. కావున నేను నీకు మొర పెట్టెదను.

20. అగ్ని చేత గడ్డి బీడులు కాలిపోయినవి. ఏరులు ఎండిపోయినవి గాన వన్యమృగములు కూడ నీకు మొరపెట్టుచున్నవి.