1. యూదా రోమీయులను గూర్చియు, వారి సైన్యములను గూర్చియు, వారు తమ పక్షమున చేరిన వారిని ఆదరముతో అంగీకరించి స్నేహము నెరపిన విధానమును,
2. వారి యుద్ధములను గూర్చి వినెను. వారు గాలు దేశీయులను జయించి వారిచేత కప్పములు కట్టించుకొనిరనియు తెలిసికొనెను.
3. ఇంకను స్పానియా దేశమునగల వెండి బంగారు గనులను స్వాధీనము చేసికొనుటకుగాను రోమీయులు అచటే మేమి చేసినది వినెను.
4. స్పానియా రోముకు చాల దూరముననున్నను వారు జాగ్రత్తతో పట్టుదలతో కృషి చేసి ఆ దేశమునంతటిని వశముచేసికొనిరి. దూర ప్రాంతములనుండి వచ్చిన రాజులు వారితో పోరాడి పూర్తిగా ఓడిపోయిరి. కొందరు ఏటేట కప్పములు కూడ కట్టవలసివచ్చెను.
5. వారు ఫిలిప్పును, మాసిడోనియా రాజు పెర్సెయసును, ఆ రాజు పక్షమును అవలంబించిన ఇతర రాజులను ఓడించిరి.
6. ఆసియా రాజు ఘనుడునగు అంటియోకసు నూటయిరువది ఏనుగులతోను, రౌతులతోను, రథములతోను, పెద్ద పదాతి దళములతోను దండెత్తి రాగా రోమీయులు అతనిని గూడ జయించిరి.
7. వారు అతనిని సజీవునిగా పట్టుకొనిరి. అతను, అతని అనుయాయులు పెద్ద కప్పములు కట్టవలెనని, బందీలను అప్పగించవలెనని శాసనము చేసిరి.
8. అతని సామ్రాజ్యమునుండి హిందూదేశము, మేదియా, లిదియా దేశములను మరియు కొన్ని సారవంతమైన భూములను తీసికొని యుమేనిసు రాజునకు బహుమతిగా ఇచ్చిరి.
9. గ్రీకులు రోమీయుల మీదికి దండెత్తి వారిని నాశనము చేయవలెనని సంకల్పించుకొనిరి.
10. కాని రోమీయులు ఆ సంగతి విని తమ సైన్యాధిపతిని గ్రీకుల మీదికి పంపిరి. వారు గ్రీకులను జయించి చాలమందిని వధించిరి. వారి భార్యలను, పిల్లలను చెరకొనిరి. వారి సొత్తును దోచుకొని భూములను ఆక్రమించుకొని కోటలను పడగొట్టిరి. నేటివరకును వారిని బానిసత్వమున నుంచిరి.
11. వారు తమను ఎదిరించిన రాజ్యములను, ద్వీపములను జయించి అచటి ప్రజలను కొందరిని నాశనము చేసిరి, మరికొందరిని బానిసలను చేసిరి.
12. కాని రోమీయులు తమ పక్షమును అవలంబించిన వారితోను, తమ సహాయమును అర్థించిన వారితోను ఎప్పుడును స్నేహ పూర్వకముగనే ప్రవర్తించిరి. వారు దగ్గరగాను, దూరముగాను ఉన్న రాజులను జయించిరి. ఆ ప్రజల కీర్తిని వినినవారెల్ల వారిని చూచి భయపడిరి,
13. వారు, సాయము చేసినవారు సింహాసనములు ఆక్రమించు కొనిరి. వారు ఎదిరించినవారు సింహాసనములు కోల్పోయిరి. వారి ప్రభావమంత గొప్పది.
14. అయినను ఇంతవరకు ఏ రోమీయుడుకాని రాజ వస్త్రములను తాల్చి, కిరీటమును ధరించి అహంభావమును ప్రకటింపవలెను అనుకోలేదు.
15. వారికొక రాజ్యసభ కలదు. దాని సభ్యులు 320 మంది. దినదినము సమావేశమై రాజ్య శ్రేయస్సును గూర్చి చర్చింతురు.
16. వారు ఏటేట ఒక్కవ్యక్తిని నియమింపగా అతడు సర్వాధికారములతో వారి రాజ్యమునంతటిని పర్యవేక్షించును. అసూయకు గురికాకుండ ఎల్లరును అతనికి పూర్ణముగా విధేయులగుదురు. ఇవి యూదా వినిన సంగతులు.
17. యూదా అక్కోసు మనుమడును, యోహాను కుమారుడునగు యూపోలెమసును, ఎలియాసరు కుమారుడగు యాసోనును దూతలుగా ఎన్నుకొని రోమీయులతో స్నేహపూర్వకముగా సంధి చేసి కొనుటకు గాను వారిని రోమునకు పంపెను.
18. గ్రీకులు యూదులను బానిసలను చేయగోరిరి. ఇప్పుడు రోమీయుల వలన యూదులకు విముక్తి కలుగునని యూదా తలచెను.
19. ఆ దూతలు దీర్ఘకాలము ప్రయాణము చేసి రోము చేరుకొని వారి రాజ్యసభ ప్రవేశించి ఇట్లు పలికిరి:
20. “యూదా మక్కబీయుడు, అతని సోదరులు, యూదులు మీతో స్నేహపూర్వకమైన సంధి చేసికొనుటకుగాను మమ్మిచటికి పంపిరి. ఇకమీదట మీరు మమ్ము మీ పక్షమువారిగా, స్నేహితులుగా పరిగణింపగోరెదము.”
21. రాజ్యసభసభ్యులు వారి వేడుకోలును అంగీకరించిరి.
22. రోమీయులు ఈ క్రింది లేఖను ఇత్తడి రేకులమీద వ్రాయించి యెరూషలేమునకు పంపిరి. రోమీయులు యూదులతో చేసికొనిన సంధికి తార్కాణముగా ఆ లేఖను యెరూషలేమున పదిలపరుపవలెనని చెప్పిరి.
23. “రోమీయులకును, యూదులకును భూమి మీదను, సముద్రము మీదను కూడ ఎల్లకాలమును కార్యములు శుభప్రదముగా జరుగునుగాక! వారికి శత్రుభయము పొసగకుండునుగాక!
24-25. అయినను రోమీయుల మీదగాని, వారి పక్షమును అవలంబించిన వారి మీదగాని ఎచటైన యుద్ధము ఆసన్నమయ్యెనేని, అవసరమును బట్టి యూదులు పూర్ణ హృదయముతో వారిని ఆదుకొనుటకు రావలయును.
26. రోమీయుల మీదికి యుద్ధమునకు వచ్చువారికి యూదులు ఆహారపదార్థములు, ఆయుధములు, ధనము, ఓడలు, సరఫరా చేయరాదు. ఇది రోము చేసిన నిర్ణయము. రోమీయులకు. మద్దతు ఇచ్చినందుకుగాను యూదులు ఏమి ప్రతిఫలము ఆశింప రాదు.
27. ఈ రీతిగనే యూదుల మీదికి ఎవరైన దండెత్తి వచ్చినచో అవసరమును బట్టి రోమీయులు పూర్ణహృదయముతో వారిని ఆదుకొనుటకు రావలయును.
28. యూదుల శత్రువులకు రోమీయులు ఆహార పదార్థములు, ఆయుధములు, ధనము, ఓడలు సరఫరా చేయరాదు. ఇది రోము చేసిన నిర్ణయము. రోమీయులు వంచనలేకుండ ఈ షరతులన్ని పాటింపవలయును.
29. రోమీయులు యూదులతో చేసికొనిన సంధి షరతులివి:
30. భవిష్యత్తులో ఈ ఉభయ వర్గముల వారు పై నియమములలో కొన్నిటిని తొలగింపవలెననిగాని లేదా మరికొన్నిటిని చేర్చవలెననిగాని కోరుకొనినచో అట్లే చేయవచ్చును. వారు చేసిన చేర్పులు మార్పులు కూడ పాటింపవలసినవి అగును.
31. దెమేత్రియసు యూదులకు చేసిన అపకారములను పురస్కరించుకొని మేమతనికి ఇట్లు వ్రాసితిమి: 'నీవు, మా పక్షమువారైన మా స్నేహితులైన యూదులతో అంత క్రూరముగా ఏల ప్రవర్తించుచున్నావు?
32. వారు మా సమక్షమున నీ మీద మరల నేరము తెత్తురేని మేము వారి పక్షమును అవలంబింతుము. భూమి మీదను, సముద్రము మీదను నీతో యుద్ధము చేయుదుము.”