1. గోరియాసు ఐదువేలమంది కాలి బంటులను, వేయిమంది నిపుణులైన రౌతులను తీసికొని రాత్రివేళ శిబిరము నుండి బయలుదేరెను.
2. తలవని తలంపుగా పోయి యూదా మీద పడవలెనని అతని పన్నాగము. యెరూషలేము దుర్గమున వసించువారు అతనికి మార్గదర్శకులుగానుండిరి.
3-4. కాని యూదా విరోధుల రాకను ముందుగనే పసికట్టెను. కనుక అతడు శత్రువులు తనను సమీపింపక మునుపే ఎమ్మావు చేరువలో వారిని ఎదిరించుటకుగాను కదలి పోయెను.
5. గోర్గియాసు తన సైన్యముతో వచ్చి చూడగా యూదా శిబిరమున ఒక్క పురుగుకూడ కనిపింపలేదు. వారు యూదా తన సైన్యముతో పారిపోయెనేమో అనుకొని శత్రువుల కొరకు పర్వతములలో గాలింప మొదలిడిరి.
6. తెల్లవారునప్పటికి యూదా మూడువేలమందితో మైదానమున కనిపించెను. కాని అతని సైనికులకు చాలినన్ని కవచములుగాని, కత్తులుగాని లేవు.
7. వారు కన్నెతిచూడగా శత్రుసేనలు కనిపించెను, విరోధి సైనికులు పోరున కాకలుతీరినవారు, కవచములు తాల్చిన వారు, అశ్వబలము కలవారు.
8. అప్పుడు యూదా తన అనుచరులతో “మీరు వారి సంఖ్యను చూచి భయపడకుడు. వారు వచ్చి మీ మీద పడినపుడు మీరు దడియకుడు.
9. ఫరో సైన్యముతో వచ్చి రెల్లు సముద్రము వద్ద మన పితరులమీద పడగా వారతని బారి నుండి తప్పించుకోలేదా?
10. ఇపుడు ప్రభువు మన మీద కరుణ జూపవలెనని మాత్రము వేడుకొందము. ఆయన మన పూర్వులతో చేసికొనిన నిబంధన జ్ఞప్తికి తెచ్చుకొని మన మీదికెత్తివచ్చిన ఈ సైన్యమును చిత్తు చేయవలెనని మనవిచేయుదము.
11. అపుడు యిస్రాయేలును కాపాడు దేవుడొకడు ఉన్నాడని ఎల్లజాతులును రూఢిగా ఎరుగును” అని చెప్పెను.
12-13. యూదా బృందము యుద్ధమునకు సన్నద్దులగుట చూచి అన్యజాతులవారును బారులు తీరిపోరుకు ఆయత్తమైరి.
14. అప్పుడు యూదా బృందము బాకాలనూది పోరు మొదలుపెట్టెను.
15. శత్రువులు చెల్లాచెదరై మైదానము మీదుగా పారిపోయిరి. వారిలో వెనకపట్టుననున్న వారందరిని మడసిరి. యిస్రాయేలీయులు గాసరావరకు, ఇదూమియా మైదానము వరకు, అష్ణోదు, యామ్నియా నగరముల వరకును విరోధులను తరిమికొట్టిరి. వారు శత్రుసైన్యమున మూడువేలమందిని మట్టుపెట్టిరి.
16. యూదా అతని యనుచరులు శత్రువులను తరుముట మాని తిరిగివచ్చిరి.
17-18. అతడు వారితో “ మీరు కొల్లసొమ్ము కొరకు పేరాశ పడవద్దు. గోర్గియాసు అతని అనుచరులు చేరువ కొండలలో ఉన్నారు. కనుక మనము మరల యుద్ధము చేయవలయును. మొదట ధైర్యముగా నిలిచి శత్రువులతో పోరాడుడు. తరువాత మీకు కావలసినంత సొమ్మును ప్రోగుచేసికోవచ్చును” అని చెప్పెను.
19. అతడిట్లు మాటలాడుచుండగనే గస్తీ తిరుగు శత్రుబృందమొకటి కొండల మీదినుండి వారివైపు వచ్చుచుండెను.
20. ఆ బృందము వారు తమ సైనికులు పారిపోయిరనియు, తమ శిబిరము తగులబడినదనియు గుర్తించిరి. ఆ శిబిరమునుండి లేచు పొగను చూడగనే వారు ఈ సంగతులను గ్రహించిరి.
21-22. కనుకవారు భయముతో కంపించిపోయిరి. మరియు వారు యూదా సైన్యము యుద్ధమునకు సన్నద్ధమై ఉండుటను చూచి బ్రతుకు జీవుడాయని ఫిలిస్తీయా మండలమునకు పారిపోయిరి.
23. అపుడు యూదా కొల్లసొమ్మును దోచుకొనుటకుగాను శత్రుశిబిరమునకు తిరిగివచ్చెను. అతడు పెద్ద మొత్తము వెండి, బంగారములను, ఊదా ఎరుపురంగుల పట్టుబట్టలను, ఇంకను విలువగల యితర వస్తువులను తీసికొనెను.
24. యూదులు తమ శిబిరమునకు తిరిగివచ్చి "ప్రభువు మంచివాడు, అతని దయ కలకాలము నిలుచును" అని గీతముపాడిరి.
25. ఆ దినము యిస్రాయేలీయులు గొప్ప విజయము సాధించిరి.
26. యుద్ధమున చావక తప్పించుకొని పోయిన అన్యజాతి సైనికులు లీసియాసు వద్దకు పోయి జరిగిన సంగతులెల్ల తెలియజేసిరి.
27. ఆ వార్తలు విని అతడు ఆశ్చర్యమును, నిరుత్సాహమును చెందెను. అతడు ఆశించినట్లు యిస్రాయేలీయులు నాశనము కాలేదు. రాజు ఆదేశించినట్లును జరుగలేదు.
28. ఆ మరుసటి యేడు లీసియాసు శూరులైన అరువది వేలమంది కాలిబంటులను, ఐదువేల మంది రౌతులను ప్రోగుజేసికొనెను. యూదుల పీచమణచవలయునని అతని కోరిక.
29. వారు ఇదుమియా గుండ ప్రయాణము చేసి బేత్సూరు వద్ద శిబిరము వేసిరి. యూదా పదివేలమందితో వారిని ఎదిరింప వచ్చెను.
30. అతడు శత్రుబలమును చూచి ఈ రీతిగా ప్రార్థించెను: “యిస్రాయేలు రక్షకుడవైన ప్రభూ! మేము నిన్ను స్తుతించుచున్నాము. నీవు నీ సేవకుడైన దావీదు ద్వారా ఫిలిస్తీయా వీరుని బలమును వమ్ముచేసితివి. సౌలు కుమారుడైన యోనాతాను అతని అంగరక్షకుడు ఫిలిస్తీయా సైన్యమును ఓడించునట్లు చేసితివి.
31. ఆ రీతినే నేడును నీ ప్రజయైన యిస్రాయేలీయుల ద్వారా ఈ నీ శత్రువులను ఓడింపుము. శత్రువులకు అందరు రౌతులు, కాలిబంటులున్నను వారిని అవమానముపాలు చేయుము.
32. పగవారిని పిరికివారిగా చేసి వారు ఆత్మవిశ్వాసమును కోల్పోవునట్లు చేయుము. వారు 'మేము ఓడిపోవుదుమేమో' అని భయపడునట్లు చేయుము.
33. వారెల్లరును నీ భక్తులమైన మా కత్తి వాతపడగా మేము నిన్ను స్తుతించి గానము చేయుదు ముగాక!”
34. అంతట ఇరువర్గముల మధ్య పోరు ప్రారంభము కాగా లీసియాసు సైనికులు ఐదువేల మంది ముష్టి యుద్ధమున మడిసిరి.
35. లీసియాసు తన సైనికులు వెన్నిచ్చి పారిపోవుటను చూచెను. యూదా సైనికులు బ్రతుకుటయైనను, గౌరవప్రదముగా చచ్చుటయైనను సమమేనన్న తలపుతో ప్రాణములకు తెగించి పోరాడుటను కూడ చూచెను. అంతట అతడు అంటియోకియాకు మరలివచ్చెను. అచట కూలికి వచ్చు బంటులను కొందరిని సైన్యమున చేర్చుకొనెను. పూర్వముకంటె గొప్ప సైన్యము ప్రోగుజేసికొని మరల యూదయా మీదికి దండెత్తవలెనని అతని కోరిక.
36. యూదా, అతని సోదరులు “శత్రువులు ఓడిపోయిరి. కనుక మనము యెరూషలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసి దానికి పునఃప్రతిష్ఠ చేయుదము' అని అనుకొనిరి.
37. కనుక వారు సైన్యము నంతటిని తరలించుకొని సియోను కొండకు వెళ్ళిరి.
38. వారచటికి చేరుకొనునప్పటికి దేవళము పాడువడి యుండెను. పీఠము అమంగళమైయుండెను. దేవాలయ ద్వారములు తగులబడియుండెను. అడవి యందును, కొండలమీదనువలె దేవాలయపు ఆవరణములలో గడ్డి ఎదిగియుండెను. యాజకుల నివాసములు కూలిపోయియుండెను.
39. ఆ దృశ్యము చూచి వారు పరితాపముతో బట్టలుచించుకొనిరి. తల మీద దుమ్ము చల్లుకొనిరి.
40. ఎల్లరును నేలమీద సాగిలపడిరి. కొంత సేపటికి బూరనూది సంజ్ఞను తెలియజేయగానే ఎల్లరును దేవునికి మొరపెట్టుచు బిగ్గరగా ఏడ్చిరి.
41. అంతట యూదా 'నేను దేవాలయమును శుద్ధి చేయించుచుండగా మీలో కొందరు పోయి యెరూషలేము దుర్గమున వసించు వారితో పోరాడుడు' అని చెప్పెను.
42. తరువాత అతడు పేరుప్రతిష్ఠలు కలిగి, ధర్మశాస్త్రమును నిష్ఠతో పాటించు యాజకులను కొందరిని ఎన్నుకొనెను.
43. వారు దేవాలయమును శుద్ధిచేసిరి. మైలపడిన రాళ్ళను తొలగించి ఒక తావున కుప్పగా పేర్చిరి.
44. దహనబలులర్పించు పీఠమప్పటికే అమంగళమై పోయినది. దానినేమి చేయవలయునా అని వారు తమలోతాము వితర్కించుకొనిరి.
45. ఆ పీఠమచట నుండనిచ్చినచో అన్యులవలన అమంగళమైన అది వారి అపకీర్తికి చిహ్నముగా నుండును. కనుక పీఠ మును అచటినుండి తొలగింపవలెనని నిశ్చయించుకొని దానిని కూలద్రోసిరి.
46. దాని రాళ్ళను కొని పోయి దేవాలయమును కట్టిన కొండమీద ఒక తావునపేర్చిరి. ఎవరైన ప్రవక్త వచ్చి ఆ రాళ్ళనేమి చేయవలయునో తెలియజేయు వరకు వానిని అచటనే ఉంచుదమనుకొనిరి.
47. ధర్మశాస్త్రము అదేశించినట్లుగా చెక్కని రాళ్ళతో పూర్వపు పీఠమును పోలిన మరియొక దానిని నిర్మించిరి.
48. దేవాలయము వెలుపలను, లోపలను కూడ మరమ్మతు చేయించి దాని ఆవరణములను శుద్ధిచేసిరి.
49. అరాధనలో వాడుటకుగాను క్రొత్త పాత్రములను చేయించిరి. దీపస్తంభమును, సాంబ్రాణి పొగవేయు పీఠమును, సాన్నిధ్యపు రొట్టెలు పెట్టు బల్లను దేవాలయములోనికి కొనివచ్చిరి.
50. పీఠము మీద సాంబ్రాణి వేసి దీప స్తంభమును వెలిగింపగా దేవాలయమున వెలుగు కలిగెను.
51. సాన్నిధ్యపు రొట్టెలు బల్లమీద పెట్టిరి. తెరలను దింపిరి. అలా మిగిలిన కార్యములు గూడ ముగించిరి.
52-54. గ్రీకు శకము 148 యేడు కీస్లేవు అను తొమ్మిదవ నెల 25వ తేదీ నాటికి అన్యజాతి వారు పీఠమును అమంగళము చేసి ఒక ఏడాది అయ్యెను. ఆ దినమున ప్రజలు వేకువనే లేచి తాము క్రొత్తగా నిర్మించిన బలిపీఠముపైని ధర్మశాస్త్ర నియమము ప్రకా రము దహనబలి అర్పించిరి. అమంగళము గావింప బడిన రోజులలోనే, అదే రోజున, అదే సమయములో వీణలు, పిల్లనగ్రోవులు చిటితాళములు మొదలైన వాద్యములతో గీతములు పాడుచు బలిపీఠమునకు ప్రతిష్ఠచేసిరి.
55. ప్రజలెల్లరును నేలపై సాగిలపడి తమకు విజయము ప్రసాదించిన ప్రభువు నారాధించి స్తుతించిరి.
56. ఆ ప్రజలు బలిపీఠమునకు ప్రతిష్ఠచేసి ఎనిమిది రోజులపాటు పండుగ చేసికొనిరి. మిన్నులు ముట్టిన ఉత్సాహముతో దహనబలులు, సమాధాన బలులు, కృతజ్ఞతాబలులర్పించిరి.
57. దేవాలయము ముఖద్వారమును బంగారు కిరీటములతోను, కవచములతోను అలంకరించిరి. ద్వారములను, యాజకుల గృహములను పునర్నిర్మాణము చేసి వానికి తలుపులు బిగించిరి.
58. అన్యజాతివారివలన కలిగిన అవమానము తీరిపోయినది. కనుక పెద్ద ఉత్స వము చేసికొనిరి.
59. అపుడు యూదా అతని సోదరులు ప్రజలెల్లరును కలిసి ఈ నియమముచేసిరి. ప్రతియేడు బలిపీఠము ప్రతిష్ఠను పురస్కరించుకొని సంతసముతో ఉత్సవము చేసికోవలెను. ఆ పండుగను కీస్లేవు నెల ఇరువది ఐదవ రోజున ప్రారంభించి ఎనిమిది నాళ్ళు జరుపవలయును.
60. అటు తరువాత వారు సియోను కొండ చుట్టును బురుజులతో ఎత్తయిన ప్రాకారములు కట్టిరి. అన్యజాతి వారు ఆ ప్రదేశమున ప్రవేశించి దానిని అమంగళము చేయకుండుటకుగాను ఆ గోడలను నిర్మించిరి.
61. యూదా అచట ఒక సైనిక దళమును ఉంచగా వారు దేవాలయమునకు కావలికాచిరి. ఇంకను అతడు ఇదూమియానుండి ఎట్టి అపాయము కలుగకుండ యిస్రాయేలీయులను కాపాడుటకుగాను బేత్సూరున ఒక దుర్గము నిర్మించెను.