ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 3 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 3వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. మత్తతీయ తరువాత అతని కుమారుడు యూదా మక్కబీయుడు నాయకుడయ్యెను.

2. మక్కబీయుని సోదరులును, మత్తతీయ అనుచరులును అతనికి మద్దతునిచ్చిరి. వారందరును కలిసి యిస్రాయేలీయుల తరపున యుద్ధము కొనసాగించిరి.

3. యూదా తన ప్రజల కీర్తిని నలుదిశల వ్యాపింప జేసెను. అతడు యుద్ధవీరునివలె కవచము దాల్చెను. తన ఆయుధములు ధరించి, రణమునకు వెడలెను, అనేక యుద్ధములను నడిపి, స్వీయఖడ్గముతోనే తన సైన్యమును కాపాడెను.

4. అతడు సింహమువలె పోరాడెను. సింగపు కొదమవలె శత్రువుల మీదికి దుమికెను.

5. ధర్మశాస్త్రమును పాటింపనివారిని వెన్నాడి మట్టుపెట్టెను. తన ప్రజలను హింసించువారిని అగ్నికాహుతి చేసెను.

6. దుర్మార్గులు అతనిని చూచి గడగడ వణకిరి. పాపాత్ములతనిని గాంచి కలవరము చెందిరి. అతడు దేశ స్వాతంత్య్రమును నిలబెట్టెను.

7. చాలమంది రాజులను ముప్పుతిప్పలు పెట్టెను. యిస్రాయేలీయులకు మాత్రము ప్రమోదము చేకూర్చెను. అతని కీర్తి కలకాలము నిలిచెను.

8. అతడు యూదయా పట్టణములలో తిరుగాడి పాపాత్ములనెల్ల హతము చేసెను. యిస్రాయేలీయులను దైవాగ్రహమునుండి తప్పించెను.

9. మృత్యువు వాత పడనున్నవారిని సుసంఘటితులను చేసెను. అతని కీర్తి దిగంతములవరకు వ్యాపించెను.

10. అప్పుడు అపోల్లోనియసు అనునతడు యిస్రాయేలీయులతో యుద్ధము చేయుటకు అన్యజాతివారిని, సమరీయులను చాలమందిని ప్రోగుజేసి కొనెను.

11. యూదా ఆ సంగతిని తెలిసికొని శత్రువు మీదికి దాడి చేసెను. అతడు అపోల్లోనియసును చంపి అతని సైన్యమును ఓడించెను. అన్యజాతి సైనికులు చాలమంది మడసిరి. మిగిలినవారు పారిపోయిరి.

12. యూదులు కొల్లసొమ్మును దోచుకొనిరి. యూదా అపోల్లోనియసు ఖడ్గమును గ్రహించి దానిని తన జీవితాంతమువరకును యుద్ధములందు వాడుకొనెను.

13. యూదా నమ్మదగిన బంటులతో గొప్ప సైన్యమును సిద్ధము చేసికొనెనని సిరియా సైన్యాధిపతియైన సెరోను వినెను.

14. అతడు రాజు ఆజ్ఞను లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగు యూదాను, అతని సైనికులను ఓడించి సామ్రాజ్యమంతట కీర్తి తెచ్చు కొందునని అనుకొనెను.

15. కనుక అతడు మరియొక సారి అన్యులందరిని ప్రోగు చేసికొని, యూదా మీద దాడిచేసెను. యిస్రాయేలీయుల మీద పగ తీర్చుకోవలెనని అతని కోరిక.

16. సెరోను బేత్-హోరోను కనుమ దగ్గరికి రాగానే యూదా కొద్దిమందితో పోయి అతనిని ఎదిరించెను.

17. యూదా సైనికులు శత్రు సైన్యమును చూచి “కొద్దిమందిమైన మనమంత పెద్ద సైన్యముతో ఎట్లు పోరాడగలము? పైపెచ్చు మేము ఈ దినమేమిదీరి తిండితిననందున అలసియున్నాము” అనిరి.

18. కాని యూదా “వినుడు. చిన్న సైన్యము పెద్ద సైన్యమును ఓడించుట అంతకష్టము కాదు. ప్రభువు మనలను పెద్ద సైన్యముతోను రక్షింపవచ్చును. చిన్న సైన్యముతోను రక్షింపవచ్చును.

19. యుద్ధమున అధిక సంఖ్యాకుల పక్షముననే విజయము కలుగనక్కరలేదు. పోరున బలమును దయ చేయువాడు ప్రభువు.

20. శత్రువులు మితిమీరిన అహంకారముతోను, దౌర్జన్యముతోను, మనమీదికి దండెత్తి వచ్చుచున్నారు. మనలను, మన భార్యలను, పిల్లలను సంహరించి మన సొత్తు నెత్తుకొని పోవలెనని వారి తలపు.

21. కాన మనము మన ప్రాణములను, మన మతమును కాపాడుకొనుటకు పోరాడుచున్నాము.

22. దేవుడు వారిని సర్వనాశనము చేయును. మీరు వారిని చూచి ఏ మాత్రము భయపడకుడు” అని చెప్పెను.

23. యూదా జవాబు చెప్పుటను ముగించిన వెంటనే అకస్మాత్తుగా శత్రుసైన్యము మీదికి దూకి దానిని తరిమికొట్టెను.

24. విరోధులను బేత్-హోరోను కనుమనుండి మైదానమువరకు వెన్నాడి 800 మందిని మట్టుపెట్టెను. మిగిలినవారు ఫిలిస్తీయా దేశమునకు పారిపోయిరి.

25. అటు తరువాత అన్యజాతి వారెల్లరును యూదాను, అతని సోదరులను చూచి భయపడ జొ చ్చిరి.

26. ఆంటియోకసు రాజు కూడ అతని పరాక్రమము గూర్చి వినెను. ప్రతి జాతియు యూదా యుద్ధములను గూర్చి గొప్పగా చెప్పుకొనెను.

27. జరిగిన సంగతులెల్ల తెలిసికొని ఆంటియోకసు మండిపడెను. అతడు తన రాజ్యములోని సేనలనెల్ల ఒక మహాసైన్యముగా సమకూర్చెను.

28. తన కోశాగారము నుండి సైనికులెల్లరికిని ఒక యేటి జీతము చెల్లించి మీరు హఠాత్తుగా జరుగు యుద్ధములకు సిద్ధమైయుండుడని వారితో చెప్పెను.

29. కాని ఆ రాజు ఊహింపని విధముగా అతని కోశాగారములోని నిధులన్నియు ఖర్చయిపోయెను. పన్నులనుండి ముట్టవలసిన ఆదాయము ముట్టదయ్యెను. అతడు ప్రాచీనకాలమునుండి వచ్చు నియమములను రద్దు చేయించిన కారణమున రాజ్యమంతట కలహములు నెలకొని అశాంతి పెరిగిపోయెను.

30. ఆంటియోకసు పూర్వరాజులకంటె అధికముగా అనుచరులకు బహుమతులు పంచియిచ్చెడివాడు. కాని యిప్పుడు నిధులు తరిగిపోవుటవలన పూర్వపు రీతిన బహుమతులు పంచి ఈయజాలనేమో అనియు, అసలు మామూలు ఖర్చులకు వినియోగించుటకు కూడ ధనము చాలదేమో అనియు ఆ రాజు భయపడెను. ఇట్టి చిక్కులు అతనికి అంతకుముందే ఒకటి రెండుసార్లు కలిగియుండెను.

31. కనుక ప్రస్తుత పరిస్థితిని చూచి అతడు చాల ఆందోళనము చెందెను. చివరికి ఆ రాజు పర్షియామీదికి దండెత్తి అచటి సంస్థానముల నుండి పన్నులు వసూలుచేసి పెద్ద మొత్తము సొమ్మును ప్రోగుజేసికొని రావలెనని సంకల్పించుకొనెను.

32. ఆంటియోకసు ప్రసిద్ధ రాజవంశమునకు చెందిన లీసియాసును యూఫ్రటీసు నదినుండి ఐగుప్తు వరకును వ్యాపించి ఉన్న తన సామ్రాజ్యమంతటికిని అధికారిగా నియమించెను.

33. రాజు తిరిగివచ్చు వరకును అతని కుమారుడగు ఆంటియోకసుకు కూడా అతడు సంరక్షకుడు అయ్యెను.

34. ఇంకను రాజు తన ఏనుగులను, తన సైన్యమున అర్థభాగమును అతని వశము చేసెను. పరిపాలనా విధానమును అతడు అనుసరింపవలసిన సూత్రములను వివరించెను. విశేషముగా యూదయా యెరూషలేము పౌరులను ఏమి చేయవలయునో గూడ వివరించి చెప్పెను.

35. యూదుల మీదికి సైన్యమును పంపి సర్వనాశనము చేయవలెననియు, నేలమీద వారి పేరును మిగులనీయరాదనియు ఆదేశించెను. యెరూషలేమున ఇంకను మిగిలియున్నవారిని అడపొడ కనిపింపకుండునట్లు తుడిచివేయవలెననియు నుడివెను.

36. యూదయాలో అన్యజాతులకు నివాసము కలిపించి వారికి ఆ నేలను పంచియీయవలెనని పలికెను.

37. అట్లు ఉత్తరువులు జారీ చేసి ఆ రాజు సైన్యమున మిగిలిన అర్థ భాగమును వెంటబెట్టుకొని తన రాజధాని అయిన అంటియోకియా నుండి ప్రయాణమై పోయెను. అది గ్రీకుశకము 147వ యేడు (క్రీ.పూ 165). అతడు యూఫ్రటీసు నదిని దాటి ఎగువ ప్రాంతములగుండ పయనముచేసెను.

38. తదనంతరము లీసియాసు నికానోరును, గోర్గియాసును, దోరుమేనసు కుమారుడగు ప్టోలమీని సైన్యాధిపతులుగా నియమించెను. వారు మువ్వురును సమర్థులు, రాజమిత్రులను బిరుదము కలవారు కూడ.

39. లీసియాసు వారిని నలువదివేల పదాతులతోను, ఏడువేల ఆశ్వికులతోను యూదయా మీదికి పంపెను. రాజు ఆజ్ఞాపించినట్లే ఆదేశమును జయించి నాశనము చేయుడని చెప్పెను.

40. కనుక ఆ సైన్యాధిపతులు తమ సైన్యముతో పోయి సమతల ప్రాంతమున ఎమ్మావు చెంతగల మైదానమున శిబిరము పన్నిరి.

41. సిరియా నుండి, పాలస్తీనానుండి వచ్చిన పటాలములు కొన్ని అచటవారితో చేరిపోయెను. ఆ ప్రాంతపు వ్యాపారులు అది సుప్రసిద్ధమైన సైన్యమనివినిరి. వారు యూదులను బానిసలుగా కొని, తీసికొనిపోవచ్చునన్న ఆశతో పెద్దమొత్తము రొక్కమును, వెండి బంగారములను చెల్లించి సేవకులను తీసికొని శిబిరమువద్దకు వచ్చిరి.

42. యూదా, అతని సోదరులు శత్రువుల పీడ అధికమగుచున్నదనియు, వారు తమ సరిహద్దులలోనే మకాము చేయుచున్నారనియు తెలిసికొనిరి. రాజు యూదులను సర్వనాశనము చేయనెంచెననియు వారు గ్రహించిరి.

43. కనుక వారు క్షీణించుచున్న తమ జాతిని కాపాడవలెననియు, తమ దేశము కొరకును దేవాలయము కొరకును యుద్ధము చేయవలయుననియు సంకల్పించుకొనిరి.

44. అపుడు ప్రజలెల్లరును పోరాటముకు సంసిద్ధమగుటకును, ప్రభువు అనుగ్రహము కొరకు ప్రార్థన చేయుటకును సమావేశమైరి.

45. యెరూషలేము ఎడారివలె నిర్మానుష్యమయ్యెను. ఆమె బిడ్డలు ఆ నగరమునకు రాకపోకలు మానివేసిరి. అన్యజాతులవారు దేవళమును అమంగళము చేసిరి. అన్యులు నగరపుకోటలో మకాము పెట్టిరి. యిస్రాయేలీయులకు ఇక సంతోష దినములు లేవు. వారికిక సంగీత నాదములు విని ఆనందించు భాగ్యము లేదయ్యెను.

46. యూదా, అతని అనుచరులెల్లరు ప్రోగై యెరూషలేమునకు ఎదురుగా నున్న మిస్పాకు వచ్చిరి. ఆ తావున గుమిగూడి ప్రార్థన చేయుట పూర్వము నుండియు యిస్రాయేలీయులకు అలవాటు.

47. ఆ దినమంతయు వారు ఉపవాసముండి గోనె తాల్చిరి. తలపై బూడిద చల్లుకొనిరి. సంతాప సూచకముగా బట్టలు చించుకొనిరి.

48. అన్యజాతుల వారు దేవుని చిత్తము నెరుగుటకు విగ్రహములను సంప్రతించెడి వారు. కాని యిస్రాయేలీయులు మాత్రము ధర్మశాస్త్రమును తెరచిరి.

49. వారు యాజకులు ధరించు వస్త్రములను పొలమున పండిన మొదటి వెన్నులను, పదియవవంతు అర్పణములను కొనివచ్చిరి. నజరీయ వ్రతమును ముగించుకొనిన వారుకూడ కొందరు వచ్చిరి.

50. అంతటవారు గొంతెత్తి “ప్రభూ! మేము ఈ వస్తువులను, వ్రతమును ముగించుకొనిన ఈ ప్రజలను ఏమి చేయవలయును? ఎచటికి కొనిపోవలయును?

51. ఇపుడు నీ దేవళము పాడుపడి అమంగళమైయున్నది కదా! నీ యాజకులు అవమానమునకు గురియై విచారించుచున్నారు కదా!

52. అన్యజాతివారు మా మీదపడి మమ్ము నాశనము చేయనున్నారు. వారు మమ్మేమి చేయనున్నారో నీకు తెలియును.

53. నీవు మాకు తోడ్పడవేని మేము వారిని ఎట్లు ఎదిరింపగలము?” అని ప్రార్థించిరి.

54. అటు పిమ్మట వారు బాకాలనూది పెద్దగా అరచిరి.

55. అటు తరువాత యూదా తన జనమును పదిమందిగను, ఏబదిమందిగను, వందమందిగను, వేయిమందిగను విభజించి వారికి నాయకులను నియమించెను.

56. అతడు క్రొత్తగా పెండ్లియాడిన వారిని, ఇండ్లు కట్టుకొనిన వారిని, ద్రాక్షతోటలను నాటిన వారిని, పోరాటమునకు దడిసిన వారిని తమ యిండ్లకు వెళ్ళిపొమ్మనెను. ధర్మశాస్త్రమిందులకు అంగీకరించును.

57. అంతట అతడి సైన్యమంతయు కదలిపోయి ఎమ్మావునకు దక్షిణమున శిబిరము పన్నెను.

58. యూదా తన సైన్యముతో “మీరు యుద్ధమునకు సన్నద్దులు కండు. ధైర్యముతో నిలువుడు. ఈ అన్యజాతి వారు మన మీదపడి మనలను, మన దేవళమును నాశనము చేయనెంచుచున్నారు. మీరు రేపు ప్రొద్దున వారితో పోరాడవలయును.

59. మన జాతి, మన  దేవళము నాశనమగుచుండగా చూచుచు ఊరకుండుటకంటె యుద్ధమున పోరాడుచు ప్రాణములు విడచుట మేలుకదా!

60. ఆ పిమ్మట దేవుని చిత్తమెట్లున్నదో అట్లు జరుగును” అని చెప్పెను.