1. ఐగుప్తు రాజగు ఆరవ ప్టోలమీ సముద్రపు ఒడ్డునగల ఇసుక రేణువులవలె అసంఖ్యాకులైన సైనికులతో మహాసైన్యమును ప్రోగుచేసికొనెను. చాల ఓడలను కూడ సేకరించుకొనెను. ఆ రాజు అలెగ్జాండరును మోసగించి అతని రాజ్యమును దోచుకొని తన రాజ్యమున కలుపుకోగోరెను.
2. అతడు సిరియా దేశమునకు వచ్చి బయటకు శాంతిని కాంక్షించు వానివలె చూపట్టెను. కనుక ఆయా పురముల పౌరులు నగర ద్వారములు తెరచి అతనిని ఆహ్వానించిరి. అలెగ్జాండరు రాజు కూడ, ప్టోలమీ తనకు మామ గనుక, అతనికి స్వాగతము చెప్పుడని ప్రజలను ఆజ్ఞాపించియుండెను.
3. కాని ప్టోలమీ ముందునకు కదలిన కొలది ఒక్కొక్క నగరమున తన సైనిక బృందములను విడిదిచేయించెను.
4. అతడు అసోటసుకు రాగా పౌరులుకాలిపోయిన దాగోను దేవళమును, భస్మమైపోయిన నగరమును దాని ప్రాంతములను చూపించిరి. శవములు ఎల్ల ఎడల పడియుండెను. యోనాతాను యుద్ధమున కాల్చివేసిన వారి పీనుగులు దారివెంట ప్రోగులుపడియుండెను,
5. పౌరులు యోనాతాను పనులను గూర్చి ప్టోలమీకి వివరించి చెప్పిరి. వారు ఆ రాజు యోనాతానును గరించుననుకొనిరి. కాని అతడేమియు మాటలాడ లేదు.
6. యోనాతాను వైభవోపేతముగా వెళ్లి యొప్పా వద్ద రాజును కలిసికొనెను. వారిరువురు కుశల ప్రశ్నల డిగికొని ఆ రాత్రి అచటనే గడిపిరి.
7. యోనాతాను ఎలెయుతేరెసు నదివరకును రాజును సాగనంపి అచటి నుండి యెరూషలేమునకు తిరిగివచ్చెను.
8. ప్టోలమీ రాజు అలెగ్జాండరునకు ద్రోహము తలపెట్టి సిలీసియ నగరము వరకును గల సముద్రతీర నగరములనన్నింటిని ఆక్రమించుకొనెను.
9. అతడు దెమేత్రియసు వద్దకు దూతలనంపి “మనమిరువురము సంధిచేసి కొందము. పూర్వము అలెగ్జాండరునకు ఇచ్చిన నా కుమార్తెను రప్పించి నీకు భార్యను చేయుదును. నీవు నీ తండ్రి రాజ్యమును పరిపాలింపవచ్చును.
10. అలెగ్జాండరు నన్ను చంపయత్నించెను. అతడికి నా పుత్రికను ఇచ్చినందులకు చింతించుచున్నాను” అని చెప్పించెను.
11. ప్టోలమీ అలెగ్జాండరు రాజ్యమును అపహరింపగోరి అతడిమీద ఈ నిందమోపెను.
12. అతడు తన కూతురును రప్పించి ఆమెను దెమేత్రియసునకు ఇచ్చి పెండ్లి చేసెను. ప్టోలమీకి అలెగ్జాండరునకు మధ్య సఖ్యత నశింపగా వారిరువురు బద్దశత్రువులైరి.
13. తరువాత ప్టోలమీ అంతియోకియ నగరము ప్రవేశించి సిరియా కిరీటము గూడధరించెను. కనుక అతడు ఐగుప్తు, సిరియా కిరీటములను రెండింటిని తాల్చెను.
14. అపుడు సిలిసీయ ప్రజలు తిరుగుబాటు చేయుటచే అలెగ్జాండరు ఆ రాష్ట్రమునకు వెళ్ళవలసి వచ్చెను.
15. కాని అతడు ప్టోలమీ క్రియలను సహింప జాలక అతని మీదికి యుద్దముకు పోయెను. ఐగుప్తు రాజు పెద్ద సైన్యముతో అలెగ్జాండరును ఎదిరించి అతడిని పూర్తిగా ఓడించెను.
16. అలెగ్జాండరు ప్రాణములు దక్కించుకొనుటకు అరేబియాకు పారిపోయెను. ప్టోలమీ విజయోత్సవము జరుపుకొనెను.
17. సబ్దియేలు అను అరాబియా జాతివాడొకడు అలెగ్జాండరు తల నరికి ప్టోలమీ చెంతకుపంపెను.
18. మూడు నాళ్ళ యిన పిదప ప్టోలమీ కూడ కన్నుమూసెను. స్థానిక ప్రజలు ప్టోలమీ రాజు ఆయా కోటలలో విడిది చేయించిన సైనికులను సంహరించిరి.
19. కనుక గ్రీకుశకము నూట అరువది ఏడవ యేట (అనగా క్రీ. పూ. 145లో) రెండవ దెమేత్రియసు రాజయ్యెను.
20. యోనాతాను యెరూషలేములోని దుర్గమును ముట్టడించుటకు యూదయా ప్రజలను ప్రోగుజేసెను. వారు దుర్గ ప్రాకారములను కూల ద్రోయుటకు చాల మంచెలను కట్టిరి.
21. యూద జాతిపై ద్వేష భావముకల తిరుగుబాటు దారులైన యూదులు కొందరు దెమేత్రియసు వద్దకు పోయి యోనాతాను యెరూషలేము దుర్గమును ముట్టడింప నున్నాడని చెప్పిరి.
22. ఆ వార్త విని రాజు మండిపడి శీఘ్రమే ప్టోలమాయిసు పట్టణమును చేరుకొనెను. అతడు ముట్టడినాపి వెంటనే వచ్చి తన్ను కలిసికో వలసినదని యోనాతానునకు జాబు వ్రాసెను.
23-24. యోనాతాను రాజాజ్ఞను స్వీకరించిన పిదప గూడ తన వారితో ముట్టడిని కొనసాగింపుడని చెప్పెను. అతడు యూదుల నుండి కొందరు పెద్దలను, యాజకులను ఎన్నుకొనెను. వారిని వెంట బెట్టుకొని ప్రాణములకు కూడ తెగించి రాజును చూడబోయెను. అటుల వెళ్ళినపుడు పట్టుబట్టలను వెండి బంగారములను చాల కానుకలను కొనిపోయెను. అతడు రాజు మన్ననకు పాత్రుడయ్యెను.
25. యూద జాతికి చెందిన తిరుగుబాటుదారులు కొద్దిమంది అతడిమీద నేరముమోపిరి,
26. అయినను రాజు మాత్రము తన పూర్వులవలెనే యోనాతానును గౌర వించెను. తన సలహాదారుల యెదుట అతడిని సత్క రించెను.
27. ఇంకను అతడిని ప్రధాన యాజకునిగా కొనసాగనిచ్చెను. అతడి పూర్వపదవుల నన్నిటిని ధ్రువపరచెను. అతడిని రాజమిత్రులలో ప్రథమ వర్గమున చేర్చెను.
28. యోనాతాను యూదయాను, సమరియా నుండి వేరుచేయబడిన మూడు మండలములను పన్నులు చెల్లించు భారము నుండి తప్పింపుమని రాజును వేడుకొనెను. తాను పన్నులకు బదులుగా మూడు వందల ఎత్తుల వెండిని చెల్లింతునని చెప్పెను.
29. రాజు అందులకు అంగీకరించి యోనాతాను పేర ఈ క్రింది జాబు వ్రాయించెను:
30. “దెమేత్రియసు రాజు తన సాటివాడు అయిన యోనాతానునకును యూదులకును శుభము పలికి వ్రాయునది.
31. నేను మిమ్ముగూర్చి మా అధికారి లాస్తెనీసునకు లేఖ వ్రాసితిని. మీఉపయోగార్ధము దాని నకలును మీకు పంపుచున్నాను:
32. 'అధికారియైన లాస్తెనీసునకు దెమేత్రియసు శుభములు పలికివ్రాయునది.
33. యూదులు మనకు నమ్మదగిన మిత్రులు. వారు మనతో చేసికొనిన సంధి నియమములను పాటించుచున్నారు. కనుక నేను వారికి కొన్ని ఉపకారములు చేయనెంచితిని.
34. పూర్వమువలెనే ఇప్పుడును యూదయా మండలమంతయు వారి అధీనముననే ఉండును. సమరియా నుండి యూదయా రాజ్యములో కలుపబడిన మూడు మండలములు ఎఫ్రాయీము, లిద్దా, అరిమత్తయా - వాని పరిసర భూములతో పాటు యూదయాకే చెందును. ఈ ప్రాంతములలో పండిన పంటమీదగాని, పండ్లమీదగాని చెల్లించు పన్నులు ఇకమీదట రాజునకుగాక యెరూషలేము దేవాలయమునకు ముట్టును. కనుక యెరూషలేమున బలులర్పించుటకు వెళ్ళు వారికి లాభము కలుగును.
35. ఇకమీదట ఈ ప్రజలు నాకు పదియవవంతు పన్నులు, ఉప్పు పన్నులు, ప్రత్యేకమైన పన్నులు మొదలగునవి చెల్లింపనక్కరలేదు.
36. భవిష్యత్తులో వచ్చువారు నేను వీరికి కలిగించిన ఈ సదుపాయములలో దేనిని గూడ భంగపరుపరాదు.
37. నీవు ఈ శాసనమునకు నకలు వ్రాయించి దానిని యోనాతానునకు ఇమ్ము. యూదులు దానిని తమ పవిత్ర పర్వతము మీద పది మందికి కనిపించు తావున ప్రదర్శించుకొందురు.
38. దెమేత్రియసు తన రాజ్యమున శాంతి నెల కొనుటను, తన్నెవరును ఎదిరింపకుండుటను చూచి తన సైనికులందరిని ఉద్యోగము నుండి తొలగించి ఇండ్లకు పంపివేసెను. గ్రీకు ద్వీపముల నుండి తాను బాడుగకు కుదుర్చుకొనిన వారిని మాత్రము సైన్యమున కొనసాగనిచ్చెను. పూర్వకాలము నుండి సైనికులుగా బ్రతుకుచున్నవారికి ఇపుడు ఉద్యోగము పోయినది. కనుక వారందరును అతనికి శత్రువులైరి.
39. పూర్వము అలెగ్జాండరునకు చేదోడు వాదోడుగా నుండిన త్రూఫోను అనునాతడు, సైనికులందరు దెమేత్రియసు మీద గొణగుచున్నారని గ్రహించెను. కనుక అతడు అరబ్బు నాయకుడైన ఇమాల్కువె అనునాతడి వద్దకు వెళ్ళెను. ఇతడు అలెగ్జాండరు చిన్న కొడుకు అంటియోకసును పెంచు చుండెను.
40. త్రూఫోను చాలకాలము పాటు ఇమాల్కువే వద్దనే యుండి అంతియోకసుకను తనకు ఒప్పజెప్పుమని బతిమాల సాగెను. అలెగ్జాండరునకు బదులుగా అతని కుమారుడు అంతియోకసును రాజును చేయుదునని అతనికి నచ్చచెప్పెను. దెమేత్రియసు సైనికులను పంపివేసెను గనుక వారందరు ఆ రాజుమీద ద్వేషము పెంచుకొనియున్నారని వివరించి చెప్పెను.
41. ఇంతలో యెరూషలేము దుర్గమునను యూదయాలోని కోటలోను వసించు అన్యజాతి సైనికులు యూదులను బాధించుచున్నారు గనుక వారి నెల్లరిని వెళ్ళగొట్టింపవలెనని వేడుకొనుచు యోనాతాను దెమేత్రియసునొద్దకు దూతలనంపెను.
42. ఆ రాజు యోనాతానునకు ఇట్లు వార్త పంపెను: “నేను నీవు చెప్పినట్లే చేయుదును. తగిన సమయము వచ్చినపుడు నిన్నును మీ జాతివారిని ఘనముగా సన్మానింతును.
43. కాని ప్రస్తుతము నా పక్షమున పోరాడుటకుగాను నీ సైన్యమును పంపుము. నా సైనికులందరును నా మీద తిరుగబడుచున్నారు.”
44. ఆ వార్త విని యోనాతాను శూరులైన సైనికులను మూడు వేలమందిని అంటియోకియాకు పంపెను. రాజు వారి రాకగూర్చి విని సంతసించెను.
45. ఆ సమయముననే లక్ష యిరువదివేలమంది జనులు నగరమున గుమిగూడి రాజును చంపుటకు ఉద్యమించుచుండిరి.
46. రాజు వారికి భయపడి ప్రాసాదమున దాగుకొనెను. జనసమూహము వీథులను ఆక్రమించుకొని అలజడి ప్రారంభించిరి.
47. అపుడు రాజు యూద సైనికులకు కబురు పెట్టగా వారతనికి సహాయము చేయవచ్చిరి. వారు నగరము నలుమూలలకు పోయి ప్రజలను లక్షమందిని మట్టుపెట్టిరి.
48. నగరమును తగులబెట్టి కొల్లసొమ్ము దోచుకొనిరి. రాజును ఆపద నుండి కాపాడిరి.
49. ప్రజలు నగరము యూదుల వశమయ్యెనని గుర్తించి ధైర్యము కోల్పోయి రాజు కాళ్ళమీదపడిరి.
50. నగరము మీద యూద సైనికుల పోరాటమును మాన్పించి శాంతిని నెలకొల్పుమని వేడుకొనిరి.
51. ఎల్లరును ఆయుధములు వదలి వేసి రాజునకు లొంగిపోయిరి. ఆ సంఘటన వలన రాజునకు అతడి ప్రజలకు యూదుల పట్ల గౌరవభావము కలిగెను. యూద సైనికులు విస్తారమైన కొల్లసొమ్ముతో యెరూషలేమునకు మరలి వచ్చిరి.
52. దెమేత్రియసు తన పరిపాలనను సుస్థిరము చేసి కొనెను. అతడి దేశమున శాంతి నెలకొనెను.
53. కాని ఆ ప్రభువు తన ప్రమాణములు నిలబెట్టుకోలేదు. యోనాతానుతో వైరము గూడ పెట్టుకొనెను. యోనాతాను చేసిన సేవలకు అతనిని బహూకరించుటకు మారుగా అతనిని పెక్కురీతుల బాధింపదొడగెను.
54. అటు తరువాత త్రూఫోను, బాలుడు అంటియోకసుతో సిరియాకు తిరిగివచ్చి అతడిని రాజుగా అభిషేకించెను.
55. దెమేత్రియసు వెళ్ళగొట్టిన సైనికులందరును అంటియోకసు పక్షమున చేరిపోరు ప్రారంభించిరి. దెమేత్రియసు ఓడిపోయి పారిపోయెను.
56. త్రూఫోను రాజు ఏనుగులను బంధించి నగర మును స్వాధీనము చేసికొనెను.
57. యువకుడైన అంటియోకసు యోనాతానునకు లేఖ ఈ విధముగా వ్రాసెను. “నేను నిన్ను ప్రధాన యాజకునిగా కొనసాగనిచ్చెదను. మూడు దేశముల మీద నీకు అధికారమును స్థిరపరచి, నీకు రాజమిత్రుడను బిరుదు నిచ్చెదను.”
58. అతడికి బంగారు పతకములను బహూకరించెను. సువర్ణ కలశముల నుండి పానీయములు సేవించు అధికారమిచ్చెను. రాజవస్త్రములను, రాజబంధువులు ధరించు భుజకీర్తిని తాల్చుటకు అనుమతి కూడ ఇచ్చెను.
59. యోనాతాను తమ్ముడగు సీమోనును తూరులోని లడ్డేరు నుండి ఐగుప్తు వరకుగల దేశమునకు రాష్ట్రపాలకునిగా నియమించెను.
60. అటుపిమ్మట యోనాతాను తన సైన్యములతో సిరియా దేశము గుండ ప్రయాణము చేసెను. సిరియా సైనికులు అతనికి మిత్రులుగా నుండుటకు అంగీకరించిరి. అతడు అస్కలోనునకు రాగా అచటి పౌరులు అతనిని గౌరవాదరములతో ఆహ్వానించిరి.
61. అచటినుండి యోనాతాను గాజాకు వెళ్ళెను. కాని ఆ నగరపౌరులు అతనిని అడ్డగించి పురద్వారములు మూసివేసిరి. కనుక యోనాతాను ఆ పట్టణమును ముట్టడించి కాల్చివేసెను. దాని పరిసర ప్రాంతములను కొల్లగొట్టెను.
62. అప్పుడు గాజా పౌరులు సంధికి వేడుకొనగా యోనాతాను వారితో రాజీ కుదు ర్చుకొనెను. కాని అతడు గాజా నాయకుల కుమారులను బందీలను చేసి యెరూషలేమునకు పంపెను. అటు పిమ్మట దమస్కు వరకును ప్రయాణము కొనసాగించెను.
63. దెమేత్రియసు సైనికాధికారులు పెద్ద సైన్యముతో గలిలీయలోని కాదేషునకు వచ్చిరనియు వారు తన ప్రయత్నములను విఫలము చేయనున్నారనియు యోనాతాను వినెను.
64. కనుక అతడు తన సోదరుడు సీమోనును యూదయాలోనే వదలి తాను ఆ సైనికాధికారులతో పోరాడబోయెను.
65. సీమోను బేత్సురును ముట్టడించి చాలకాలము వరకు పోరుజరిపెను.
66. ఆ నగర పౌరులు సంధికి సిద్ధముకాగా అతడు వారితో రాజీకుదుర్చుకొనెను. కాని అతడు ఆ పట్టణమును ఆక్రమించుకొని అందలి పౌరులను వెళ్ళగొట్టెను. తన సైనికులను పట్టణమునకు కాపు పెట్టెను.
67. యోనాతాను అతడి సైనికులు గెన్నెసరెతు సరస్సు వద్ద శిబిరము పన్నిరి. మరుసటి రోజు ఉదయమే వారు హజోరు మైదానము చేరుకొనిరి.
68. అచట అన్యజాతివారి సైన్యము యోనాతాను మీదికి యుద్ధమునకు వచ్చెను. ఆ సైన్యము యోనాతానునకు తెలియకుండ తమవారిని కొందరిని ప్రక్కకొండలలో మాటుగా నుంచెను.
69-70. శత్రుసైన్యమున ప్రధాన భాగము కదలి వచ్చుచుండగా ప్రక్కన మాటుగా నున్న వారుకూడ వచ్చి యోనాతాను సైన్యము మీదపడిరి. అతని సైన్యము వెన్నిచ్చి పారిపోయెను. అబ్షాలోము కుమారుడైన మత్తతీయా, కాల్ఫి కుమారుడైన యూదా అను సైనికాధికారులు ఇద్దరు మాత్రము పారిపోరైరి.
71. అటుల తన పక్షము వారందరు కాలికి బుద్ధి చెప్పుటను చూచి యోనాతాను విచారముతో బట్టలు చించుకొనెను. తలమీద దుమ్ము పోసికొని ప్రార్థన చేసెను.
72. అటుపిమ్మట అతడు శత్రువుల మీద పడగా వారు ఓడిపోయి పారిపోయిరి.
73. అది చూసి, అంతకు పూర్వమే పలాయితులైన యోనాతాను సైనికులు తిరిగి వచ్చి తమ నాయకునితో చేరిరి. అందరును కలిసి విరోధులను వారి శిబిరము కాదేషు వరకును తరిమి కొట్టిరి. ఆ శిబిరమును కూడ ఆక్రమించుకొనిరి.
74. ఆ దినము శత్రుసైన్యమున మూడువేల మంది హతులైరి. అటుపిమ్మట యోనాతాను యెరూషలేమునకు తిరిగివచ్చెను.