ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 1వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. ఎఫ్రాయీము పర్వతసీమలో రామతయిమ్ సోఫీము అను పట్టణము కలదు. ఆ పట్టణమున ఎల్కానా అనునతడుండెను. ఎల్కానా ఎఫ్రాయీము తెగకు చెందిన సూపు కుమారుడు. సూపు తోహూ కుమారుడు, తోహూ ఎలీహు కుమారుడు, ఎలీహు యెరోహాము కుమారుడు.

2. ఎల్కానాకు హన్నా, పెనిన్నా అను భార్యలిద్దరు కలరు. పెనిన్నాకు బిడ్డలు కలరు గాని హన్నాకు సంతానము లేదు.

3. ఎల్కానా ఏటేట షిలో నగరమునకు వెళ్ళి సైన్యములకధిపతియైన యావేను ఆరాధించి బలులు అర్పించుచుండెను. ఏలీ కుమారులైన హోప్నీ, ఫీనెహాసు అనువారు ఆ రోజు లలో యావే యాజకులుగా నుండిరి.

4. ఒకమారు ఎల్కానా యధాప్రకారముగా బలి అర్పించెను. అతడు బలి అర్పించునపుడు పెనిన్నాకును, ఆమె కుమారులకును, కుమార్తెలకును, నైవేద్యమున భాగములు ఇచ్చుచుండెను.

5. హన్నాకు మాత్రము ఒక్కభాగమే ఒసగెడివాడు. అతడు హన్నాను అధికముగా ప్రేమించినను, ఆమె గొడ్రాలు గావున అటుల చేసెడివాడు.

6. ప్రభువు హన్నాకు బిడ్డలను ప్రసాదింపక పోవుటచే సవతికూడ ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండెడిది.

7. ఏటేట ఇట్లే జరుగుచుండెడిది. వారు యావే మందిరమునకు పోయినపుడెల్ల సవతి హన్నాను దెప్పిపొడిచెడిది. అందుచే హన్నా చాల దుఃఖించి ఆహారము తినుట మానివేసెడిది.

8. అప్పుడు ఎల్కానా “హన్నా! ఈ ఏడుపు ఈ దిగులు ఎందులకు? భోజనము మానివేయనేల? నేను నీకు పదిమంది కుమారులకంటెను ఎక్కువ కానా?” అని ఆమెను ఓదార్చెడివాడు.

9. వారు షిలోవద్ద బలి అర్పించి భోజనము భుజించిన పిమ్మట మరియు పానీయము సేవించిన పిమ్మట హన్నా లేచి, యాజకుడైన ఏలీ ఆలయ స్తంభము చెంత ఆసీనుడైయుండగా,

10. హృదయవేదనతో ఆమె కన్నీరుమున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను.

11. “సైన్యములకధిపతివైన యావే ప్రభూ! ఈ దాసురాలి బాధను పరికింపుము. ఈ దీనురాలిని జ్ఞప్తియుంచుకొనుము. నీ దాసురాలనైన నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకొందును. క్షురకత్తి అతని తలవెంట్రుకలు తాకదు" అని మ్రొక్కుకొనెను.

12. హన్నా ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించు చుండగా యాజకుడైన ఏలీ ఆమె ముఖమును పరిశీలించుచుండెను.

13. హన్నా హృదయమునందే ప్రార్ధన చేసికొనుచుండెను. ఆమె పెదవులు కదలుచుండినవి గాని నోటినుండి మాటమాత్రము వెలువడుట లేదు. కావున యాజకుడైన ఏలీ ఆమె తప్పతాగి కైపెక్కియున్నదనుకొని

14. “ఎంతసేపు ఇట్లు మత్తుతో మసలెదవు? ఆ ద్రాక్షసారాయమిక వదిలించుకో” అనెను.

15. అందులకు హన్నా "అయ్యా! నేను తీరని వెతతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్షసారాయమునుగాని, కైపెక్కించు మద్యమునుగాని సేవింపలేదు. ఇంతవరకును ప్రభువు ముందు మనసు విప్పి మాటలాడుచున్నాను అంతే.

16. ఈ దాసురాలు పనికిమాలినదని భావింపవలదు. మిగుల కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంత సేపు ప్రభువుయెదుట మాటలాడుచుంటినే గాని వేరేమియుగాదు” అని ప్రత్యుత్తరమిచ్చెను.

17. అంతట యాజకుడైన ఏలీ “అట్లయిన ప్రశాంతముగా పోయిరమ్ము. యిస్రాయేలుదేవుడు నీ మనవి ఆలించుగాక!” అని చెప్పెను.

18. అంతట హన్నా "అయ్యా! ఈ దాసురాలిని అనుగ్రహింపుడు. అదియేచాలు” అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్నపిమ్మట దుఃఖముకూడ తీరిపోయెను.

19. అంతట వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య యైన హన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తి యందుంచుకొనెను.

20. ఆమె గర్భవతియై బిడ్డను కనెను. “ప్రభువును బిడ్డనడిగితిని” అనుకొని శిశువునకు సమూవేలు' అని పేరు పెట్టెను.

21. ఎల్కానా ప్రభువునకు బలి అర్పించి మ్రొక్కు తీర్చుకొనుటకు మరల కుటుంబముతో బయలు దేరెను.

22. కాని హన్నా వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో “నేనిప్పుడురాను. పాలుమానినపిదప బాలుని కొనివచ్చి యావేకు సమర్పింతును. ఆ పిమ్మటవాడు యావే సన్నిధిలోనే ఉండిపోవును” అనెను.

23. ఎల్కానా “నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. బిడ్డ పాలుమాను వరకు నీవు అక్కడికి రానక్కరలేదు. ప్రభువు కూడ నీ కోరిక తీర్చునుగాక!" అని చెప్పెను. హన్నా ఇంటిపట్టుననే యుండి బిడ్డను పెంచి పెద్దచేసి పాలుమాన్పించెను.

24. అంతట హన్నా బాలుని తీసికొని మూడేండ్ల కోడెదూడను తోలించుకొని, తూమెడు పిండితో, తిత్తెడు ద్రాక్షసారాయముతో షిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు.

25. అచ్చట దూడను వధించి బలిసమర్పించిన పిదప హన్నా బాలుని వెంటబెట్టుకొని యాజకుడైన ఏలీ వద్దకు వచ్చెను.

26. ఆమె అతనితో "అయ్యా! చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థనచేసికొనుచు నీ కంటబడినదానను నేనే.

27. నేను ఈ బిడ్డకొరకు ప్రార్థించి తిని. ప్రభువు నా మనవి ఆలించి నా కోరిక తీర్చెను.

28. కావున నేను ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంతకాలము ప్రభువునకే ఊడిగము చేయుచుండును” అనెను. అంతట వారు ప్రభువునకు మ్రొక్కిరి.