ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మక్కబీయులు మొదటి గ్రంధము

 1. ఆ కాలములో మాసెడోనీయుడు ఫిలిప్పు కుమారుడైన అలెగ్జాండరు కిత్తీము ప్రదేశమునుండి దండెత్తివచ్చి పారశీకులకు మాదీయులకు రాజయిన దర్యవేషును జయించి అతని రాజ్యమును స్వాధీనము చేసికొనెను. అలెగ్జాండరు అంతకుముందే గ్రీసుదేశమునకు రాజు.

2. అతడు చాల దండయాత్రలు చేసి చాల బలీయ కోటలను ముట్టడించెను. స్థానిక రాజులనోడించి మట్టుబెట్టెను.

3. నేల నాలుగు చెరగుల వరకు దాడిచేసి, ఎన్నో జాతులను కొల్లగొట్టెను. ఆ రీతిగా ప్రపంచమును జయించినందున అతనికి పొగరెక్కి తనను తాను హెచ్చించుకొనెను.

4. అతడు మహా సైన్యము ప్రోగుజేసికొని దేశములను, రాష్ట్రములను, రాజులను లొంగదీసికొనెను. ఎల్లరును అతనికి కప్పము కట్టిరి.

5. కొద్ది కాలము పిమ్మట అలెగ్జాండరు చక్రవర్తి జబ్బుపడి మంచముపట్టెను. అతడు తాను చనిపోవుట తథ్యమని గ్రహించెను.

6. కనుక తన సైన్యాధిపతులను, చిన్ననాటి నుండి తనతో పెరిగి పెద్దవార యిన రాజవంశజులను పిలిపించెను. తన సామ్రా జ్యమునంతటిని విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగము నిచ్చెను.

7. అతడు పండ్రెండేండ్లు పరిపాలించిన పిమ్మట మరణించెను.

8. అలెగ్జాండరు మరణానంత రము అతని సైన్యాధిపతులు అధికారము చేపట్టిరి.

9. వారిలో ఒక్కొక్కడు తన రాజ్యమునకు రాజయ్యెను. ఈ రాజుల సంతానము కూడ చాల ఏండ్లు పరిపా లించి లోకమును పెక్కు కడగండ్లపాలు చేసెను.

10. పై సైన్యాధిపతుల తరపున నుండియే పాపపు మొలకలవలె ఆంటియోకసు ఎపిఫానెసు జన్మించెను. అతని తండ్రి సిరియా రాజగు ఆంటియోకసు. అతడు అంతకు ముందు ఎపిఫానెసు గ్రీకుశకము 137లో సిరియాకు రాజయ్యెను. ఒక పర్యాయము రోములో బందీగా ఉండెను.

11. ఆ సమయమున యిస్రాయేలీయులలో కొందరు భ్రష్టులు పెడదారి పట్టించిరి. వారు 'మన మును అన్యజాతి ప్రజలతో ఒప్పందము చేసికొందము, వారితో కలియకపోవుటవలననే మనకు పెక్కు అనర్ధములు వాటిల్లుచున్నవి' అని వాదించిరి.

12. ఆ వాదము చాలమందికి నచ్చెను.

13. వారిలో కొందరు మితిమీరిన ఉత్సాహముతో పోయి, రాజును సందర్శింపగా అతడు అన్యజాతుల సంప్రదాయములను పాటించుటకు వారికి అనుమతినిచ్చెను.

14. కనుక వారు గ్రీకు పట్టణములలోవలె యెరూషలేమున కూడ ఒక వ్యాయామశాలను నిర్మించిరి.

15. వారు తమ సున్నతి గుర్తును మరుగుచేసికొనిరి. పవిత్ర నిబంధనను విడనాడిరి. అన్యజాతుల పిల్లలను పెండ్లి యాడిరి. అపవిత్ర కార్యములెల్ల చేసిరి.

16. ఆంటియోకసు తన పరిపాలనను సుస్థిరము చేసికొనిన పిదప ఐగుప్తును జయింపగోరెను. తాను సిరియా, ఐగుప్తులను రెండిటిని ఏలవలెనని నిశ్చయించుకొనెను.

17. కనుక అతడు ఓడలు, రథములు, గుఱ్ఱములు, ఏనుగులు గల మహాసైన్యముతో పోయి ఐగుప్తును ముట్టడించెను.

18. అతడు ఐగుప్తు రాజైన ప్టోలమీ మీద యుద్ధము ప్రకటించగా ప్టోలమీ గుండె చెదరిపారిపోయెను. అతని సైనికులు చాలమంది ప్రాణములు కోల్పోయిరి.

19. ఆంటియోకసు ఐగుప్తు నందలి కోటలుగల సురక్షిత పట్టణములను ఆక్రమించుకొని ఆ దేశమును కొల్లగొట్టెను.

20. ఆ రాజు ఐగుప్తును ఓడించిన తరువాత, 143వ యేట, మహాసైన్యముతో వచ్చి యిస్రాయేలు దేశముమీద, యెరూషలేము మీదపడెను.

21. అతడు పొగరుబోతుతనముతో యెరూషలేము దేవాలయమున ప్రవేశించి అందలి బంగారు పీఠమును, దీప స్తంభమును, దాని పరికరములను స్వాధీనము చేసి కొనెను.

22. సాన్నిధ్యపు రొట్టెలనుంచు బల్లను, దేవాలయమున వాడు పాత్రములను, ధూపకలశములను, తెరలను, కిరీటములను అపహరించెను. దేవాలయ ప్రాంగణమునందలి బంగారు అలంకరణములను ఒలుచుకొనెను.

23. ఆ రీతిగా అతడు గుడిలోని వెండి బంగారములను, విలువైన పాత్రలను, కోశాగారమున భద్రపరచిన నిధులను దోచుకొని,

24. తన దేశమునకు తరలించుకొనిపోయెను. పైపెచ్చు అతడు చాలమంది యిస్రాయేలీయులను వధించి ఆ కార్యము గూర్చి గర్వముగా చెప్పుకొనెను.

25. అపుడు దేశములోని యిస్రాయేలీయులందరు శోకముతో విలపించిరి.

26. రాజులు, నాయకులు బాధతో మూల్గిరి. యువతీయువకులు కృశించిపోయిరి. స్త్రీలు తమ సౌందర్యము కోల్పోయిరి.

27. ప్రతి వరుడును విలాపగీతము పాడెను. ప్రతి వధువును శోకించుచు తన గదిలో కూర్చుండెను.

28. ప్రజల బాధను గాంచి దేశము గడగడవణకెను. యాకోబు సంతతివారు అవమానమున మునిగి ముసుగులు వేసికొనిరి.

29. రెండేండ్లు గడచిన తరువాత రాజు ఒక అధికారిని యూదయాదేశమునకు పంపెను. అతడు గొప్ప సైన్యముతో యెరూషలేమునకు వచ్చెను.

30. ఆ అధికారి మొదట శాంతిని నెలకొల్పువానివలె మాటలాడెను. కాని అతని హృదయము కపటముతో నిండియుండెను. అతడు పౌరుల విశ్వాసము చూర గొనిన పిదప అకస్మాత్తుగా నగరము మీదబడి దానిని ధ్వంసము చేసెను. పురప్రజలను చాలమందిని వధించెను.

31. నగరమును కొల్లగొట్టి కాల్చివేసెను. పట్టణములోని భవనములను, ప్రాకారములను పడగొట్టించెను.

32. ఆ అధికారియు, అతని సైన్యములును స్త్రీలను, పిల్లలను బందీలను చేసిరి. " పశువుల మందలను తోలుకొనిపోయిరి.

33. అటు తరువాత శత్రువులు పట్టణములోని దావీదు నగరము చుట్టు గొప్ప ప్రాకారమును, బురుజులను నిర్మించిరి. ఆ తావును తమ దుర్గముగా చేసికొనిరి.

34. అటుపిమ్మట వారు భ్రష్టులు, దుర్మార్గులైన యూదులను కొందరిని తీసికొనివచ్చి వారికి ఆ దుర్గమున ఆశ్రయము కల్పించిరి.

35. ఆయుధములను, భోజనపదార్థములను కొనివచ్చి అచట భద్రపరచిరి. యెరూషలేమున కొల్ల గొట్టిన సొత్తునుకూడ అందే పదిలపరచిరి. ఈ దుర్గమువలన తరువాత నగరమునకు కలిగిన శ్రమలు అన్ని ఇన్ని కావు.

36. దానివలన పవిత్ర స్థలమునకు ముప్పువచ్చేను. అది యిస్రాయేలు ప్రజలకు నిరంతర శత్రువయ్యెను.

37. నిరపరాధులను దేవాలయము చెంతనే వధించి, దేవాలయమును అమంగళపరచిరి.

38. యెరూషలేము పౌరులు శత్రువులకు వెరచి పారిపోయిరి. నగరమున అన్యజాతివారు నివాసమేర్పరచుకొనిరి. నగరము తన సొంత జనముపట్ల మమకారము చూపజాలదయ్యెను. పౌరులు ఆ నగరమును విడచి వెళ్ళిపోయిరి.

39. దేవాలయము ఎడారివలె నిర్మానుష్యమయ్యెను. ఉత్సవములు శోకదినములు అయ్యెను. విశ్రాంతి దినములు అపహాస్యమునకు గురియయ్యెను. నగర గౌరవము మంటగలసిపోయెను.

40. దానికి పూర్వమెంత కీర్తి ఉండెడిదో ను ఇప్పుడంత అపకీర్తి వాటిల్లెను.  పూర్వపు గౌరవ ప్రతిష్ఠలు అంతరింపగా ఇపుడా నగరమునకు దీనదశ ప్రాప్తించెను.

41. ఆ పిమ్మట ఆంటియోకసు రాజు తన రాజ్యములోని జాతులెల్లను వారివారి సొంత ఆచారములను విడనాడవలెననియు, అందరును కలిసి ఏక జాతిగా జీవింపవలెననియు ఉత్తరువు జారీచేసెను.

42. అన్యజాతుల వారెల్లరును రాజు ఆజ్ఞను శిరసావహించిరి.

43. చాలమంది యిస్రాయేలీయులు కూడ రాజు మతము స్వీకరించి, విగ్రహములకు బలులను అర్పించిరి. విశ్రాంతిదినమును పాటించుట మానుకొనిరి.

44. రాజు యెరూషలేమునకును యూదయా : పట్టణములకును అధికారులను పంపి అన్యజాతుల వారి ఆచారములను పాటింపవలెనని అచటి ప్రజలకు ఆజ్ఞలు జారీ చేయించెను.

45. అతడు దేవాలయమున దహనబలులను, ధాన్య బలులను, ద్రాక్షారస అర్పణమును అర్పింపరాదని కట్టడచేసెను. ఉత్సవములను, విశ్రాంతి దినమును పాటింపరాదని శాసించెను.

46. దేవాలయమును అమంగళము చేయవలెననియు, అందు అర్చనచేయు యాజకులను అగౌరవము చేయవలెననియు చెప్పెను.

47. యూదులు అన్యజాతి దైవములకు దేవాలయములను, పీఠములను నిర్మించి పందులు మొదలైన అపవిత్ర జంతువులను బలిగా అర్పింపవలెనని కోరెను.

48. వారు తమ పిల్లలకు సున్నతి చేయింపరాదనియు, శుద్ధి నియమములను పూర్తిగా విడనాడవలెననియు శాసించెను.

49. ధర్మశాస్త్రమును పాటించుట , మానుకోవలెనని ఆజ్ఞాపించెను.

50. ఈ ఆజ్ఞలను మీరిన వారికి మరణమే శిక్షయని శాసించెను.

51. రాజు తన సామ్రాజ్యమంతటను ఈ శాసనమును ప్రకటన చేయించెను. “ఎవరైన రాజాజ్ఞను మీరినచో వారు మరణశిక్షకు గురియగుదురని” శాసించెను. దానిని అమలు పెట్టించుటకుగాను పర్యవేక్షకులను నియమించెను. అన్యజాతుల దైవములకు బలులర్పింపవలెనని యూదయాలోని పట్టణముల నెల్ల నిర్బంధము చేసెను.

52. చాలమంది యూదులు ధర్మశాస్త్రమును విడనాడిరి. రాజాధికారులకు లొంగి దుష్కార్యములు చేసిరి.

53. కాని భక్తిపరులైన యిస్రాయేలీయులు మాత్రము ఆ అధికారుల కంటబడకుండ ఎక్కడివారక్కడనే దాగుకొనిరి.

54. 145వ సంవత్సరమున, కీస్లేవు నెల పదునైదవ దినమున, ఆంటియోకసు రాజు దేవాలయములోని పీఠముమీద జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొ ల్పెను. యూదయాలోని పట్టణములలో విగ్రహములకు పీఠములు నిర్మింపజేసెను.

55. అధికారులు నడివీధులలోను, ఇండ్ల ముందటను విగ్రహములకు సాంబ్రాణి పొగవేయించిరి.

56. ధర్మశాస్త్ర గ్రంథములేవైన కనిపించినచో ముక్కలుగా చీల్చి, కాల్చివేసిరి.

57. ఎవని వద్దనైన ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నను, ఎవడైన ధర్మశాస్త్ర నియమములను పాటించినను అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి.

58. ఈ రీతిగా ఆ దుర్మార్గపు అధికారులు అధికార గర్వముతో యిస్రాయేలు నగరములలో తమకు చిక్కిన ప్రజలనెల్ల నెలల తరబడి బాధింప జొచ్చిరి. ,

59. ఆ నెల 25వ తారీఖున దేవాలయములోని దహన బలిపీఠము మీద నిర్మించిన కొత్త పీఠముపైని, పై అధికారులు బలులర్పించిరి.

60. తమ బిడ్డలకు సున్నతి చేయించిన తల్లులను రాజాజ్ఞ ప్రకారము వధించిరి.

61. ఆ బిడ్డలనుకూడ చంపి తల్లుల మెడలకు వ్రేలాడగట్టిరి. ఆ తల్లుల కుటుంబములకు చెందినవారిని, ఆ బిడ్డలకు సున్నతిచేసినవారిని మట్టు బెట్టిరి.

62. అయినను యిస్రాయేలీయులలో చాల మంది ధైర్యముతో రాజాజ్ఞను ధిక్కరించి అపవిత్ర భోజనమును ముట్టరైరి.

63. వారట్టి భోజనమునకు ఆశపడి పవిత్రమైన నిబంధనను మీరుటకంటె చచ్చుటయే మేలని భావించిరి. చాలమంది తమ ప్రాణములను కూడ అర్పించిరి.

64. ఆ కాలమున ప్రభువు కోపము యిస్రాయేలీయుల మీద దారుణముగా ప్రజ్వరిల్లెను.

 1. ఆ రోజులలో యోరీబు తెగకు చెందిన యాజకుడు మత్తతీయ యెరూషలేమును విడనాడి మోదెయీను అను నగరమున నివాసము ఏర్పరచు కొనెను. అతని తండ్రి తాతలు యోహాను, సిమియోను.

2-5. అతనికి ఐదుగురుకుమారులు కలరు. వారు గద్ది అను మారుపేరు కల యోహాను, తస్సి అను మారుపేరు కల సీమోను, మక్కబీయు అను మారుపేరుకల యూదా, అవరాను అను మారుపేరు కల ఎలియాసరు, అప్పూసు అను మారుపేరు కల యోనాతాను.

6-7. మత్తతీయ యూదయాలో, యెరూషలేమున జరుగు అపచారములను చూచి పరితాపము చెంది యిట్లనెను: “అయ్యో! నేనిట్టి ఘోరకార్యములను గాంచుటకే పుట్టితినాయేమి? మన పరిశుద్ధ నగరమును, ప్రజలును నాశనమైరి. ఈ నగరము శత్రువుల పాలై, ఈ దేవళము అన్యజాతుల వశముకాగా, నేనిచట చేతులు ముడుచుకొని కూర్చుండవలసినదేనా?

8. ఈ దేవాలయము కీర్తిని కోల్పోయిన నరునివలె నున్నది.

9. శత్రువులు దాని ఉపకరణములనెల్ల దోచుకొనిరి. మన పిల్లలను వీధులలో చంపివేసిరి. మన యువకులు విరోధుల కత్తివాతబడిరి.

10. ప్రతి జాతియు మన నగరమును ఆక్రమించుకొని, దాని సొత్తు దోచుకొనెను.

11. నగర అలంకారములన్నియు నిర్మూలమయ్యెను. స్వాతంత్య్రము పోయి బానిసత్వము వచ్చినది.

12. సుందరము, వైభవోపేతమైన దేవాలయము పాడుబడెను. అన్య జాతులవారు దానిని అమంగళము చేసిరి.

13. ఇక మనము దేని కొరకు జీవింపవలయును?”

14. మత్తతీయ అతని కుమారులు విచారముతో బట్టలు చించుకొని గోనె కట్టుకొనిరి.

15. యిస్రాయేలీయులను యూదమతము నుండి తిప్పనెంచిన రాజకీయాధికారులు మోదెయీను నగరముకు వచ్చి అచటి ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలెనని నిర్బంధము చేసిరి.

16. చాల మంది యిస్రాయేలీయ ప్రజలు వారి పక్షమును అవలంభించిరి. మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలియక ఒక బృందముగా ఏర్ప డిరి.

17. రాజోద్యోగులు మత్తతీయతో “నీవిచట పేరు ప్రతిష్ఠలు గల నాయకుడవు. నీ కుమారులును, బంధువులును నీకు అండగానున్నారు.

18. ఈ నగరమున రాజాజ్ఞను పాటించు వారిలో నీవే మొదటి వాడవు కావచ్చునుగదా? అన్యజాతులు, యూదయా నివాసులు, యెరూషలేమున మిగిలియున్న పౌరులు రాజునకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవును నీ కుమారులును 'రాజమిత్రులు' అను బిరుదమును పొందవచ్చును. మీకు వెండి, బంగారములు ఇతర బహుమతులు లభించును” అనిరి.

19. కాని మత్తతీయ గొంతెత్తి వారితో “ఈ దేశములోని అన్య జాతి వారెల్లరును రాజాజ్ఞకు లొంగి, వారి పితరుల మతము విడనాడినప్పటికి,

20. నేనును నా కుమారులు మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధననే పాటింతుము.

21. దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును, దాని విధులను ఏ మాత్రము మీరకుందుముగాక.

22. మేము రాజాజ్ఞలు పాటింపదలచుకోలేదు, మా మతనియమములను ఏ మాత్రము మీరదలచుకోలేదు” అని స్పష్టము చేసెను.

23. అతడు తన మాటలను ముగింపగనే అచటి యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకా రము మోదెయీను పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను.

24. ఆ సంఘటన చూడగనే మత్తతీయకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహమును పట్టజాలక సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీదబడి వానిని ఆ పీఠము మీదనే మట్టు బెట్టెను.

25. ఇంకను అతడు బలినర్పించుటకు ప్రజలను నిర్బంధముచేసిన రాజకీయాధికారిని గూడ సంహరించి పీఠమును కూలద్రోసెను.

26. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రముపట్ల చూపిన అభిమానము పూర్వము సాలు కుమారుడైన సిమ్రీని చంపినపుడు ఫీనెహాసు చూపిన అభిమానము వంటిది. .

27. అటు తరువాత మత్తతీయ “మీలో ధర్మము పట్ల అభిమానముగలవారు, నిబంధనను పాటింప గోరు వారు నా వెంట రండు” అని బిగ్గరగా అరచుచు , నగర వీధులగుండ తిరిగెను.

28. ఆ పిమ్మట అతడును, అతని కుమారులును తమ ఆస్తిపాస్తులను నగరముననే వదలిపెట్టి పర్వతములకు పారిపోయిరి.

29-30. ఆ రోజులలోనే యూదమతమునకు, ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోరబాధలను భరింపజాలక తమ పశువులను, పిల్లలను, భార్యలను తీసి కొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచట వసింప మొదలిడిరి.

31. రాజు ఆజ్ఞను ధిక్కరించిన యూదులు కొందరు అరణ్యమునకు పారిపోయి అచట తలదాచు కొనుచున్నారని రాజు ఉద్యోగులకును, యెరూషలేము దగ్గరనున్న సైనికులకును వార్త చేరెను.

32. కనుక వారిని పట్టుకొనుటకు ఒక పెద్ద సైనిక బృందము పోయెను. ఆ సైనికులు యూదులు దాగుకొనియున్న చోటికి వచ్చి వారి చెంత విడిది చేసిరి. విశ్రాంతి దినమున వారి మీదపడ నిశ్చయించుకొనిరి.

33. ఆ సైనికులు యూదులను చూచి “తరుణమింకను మించి పోలేదు, మీరు దాగియున్న తావు నుండి వెలుపలికి వచ్చి రాజాజ్ఞకు తలయెగ్గుడు. మేము మీ ప్రాణము కాపాడుదుము” అని కేకలు పెట్టిరి.

34. కాని ఆ యూదులు “మేము ఇచటినుండి వెలుపలికి రాము. మేము రాజు ఆజ్ఞను పాటింపము. విశ్రాంతి దినమును అమంగళము చేయము” అని బదులపలికిరి.

35. శత్రు సైనికులు వెంటనే వారి మీదపడిరి.

36. కాని యూదులు విరోధులనెంత మాత్రము ఎదిరింపక మెదలకుండ ఉండిపోయిరి. వారు శత్రువుల మీద రాళ్ళు విసరనులేదు. తాము దాగియున్న కొండ బిలములను మూసివేయను లేదు.

37. “మేము నిర్ధోషులుగా ప్రాణములు విడుతుము. మీరు మమ్ము అన్యాయముగా సంహరించుచున్నారని భూమ్యాకాశములు సాక్ష్యము పలుకును” అని మాత్రము నుడివిరి.

38. అంతట శత్రు సైనికులు విశ్రాంతి దినమున ఆ యూదులను, వారి భార్యలను, పిల్లలను, పశువులను సంహరించిరి. అచట చనిపోయిన వారు మొత్తము వేయిమంది.

39. మత్తతీయ, అతని అనుచరులు ఆ వార్త విని మిగుల సంతాపము చెందిరి.

40. వారు తమలో తాము 'శత్రువులు వచ్చినపుడు మనమును ఈ యూదుల వలె మెదలకుండ ఉండి పోవుదమేని, మన ప్రాణములను, మతమును కాపాడుకొనుటకుగాను ఈ అన్యజాతులతో పోరాడకుందుమేని, వీరు మనలను అనతికాలముననే నేల మీది నుండి తుడిచి పెట్టుదురు” అని అనుకొనిరి.

41. కనుక వారు అక్కడికక్కడే ఈ క్రింది నిర్ణయము చేసికొనిరి. 'శత్రువులెవరైన విశ్రాంతిదినమున తమ మీదికి దాడి చేసినచో తాము ఆ శత్రువులను ఎదిరింప వలయును. తమ తోటి యిస్రాయేలీయులవలె తాము దాగుకొన్న తావులలోనే నాశనమై పోగూడదు.' .

42. అటు తరువాత యిస్రాయేలీయులలోని హాసిదీయులను భక్తులు మత్తతీయ పక్షమున చేరిరి. వారు మహావీరులు, ధర్మ శాస్త్రమును నిలబెట్ట వలెనను పట్టుదల కలవారు.

43. ఇంకను మతహింసలకు గురియైనవారు కూడ వచ్చి మత్తతీయ బృందముతో చేరిపోగా వారి బలము హెచ్చెను.

44. వీరందరు కలిసి ఒక సైనిక బృందముగా ఏర్పడిరి. ఆ బృందము వారు మహా కోపముతో యూద మతమును విడనాడిన వారిని శిక్షింపగా వారు పారిపోయి అన్యజాతి ప్రజల మరుగుజొచ్చిరి.

45. మత్తతీయ అతని స్నేహితులు దేశమంతట సంచారములు చేసి అన్యదైవముల పీఠములను కూలద్రోసిరి.

46. యిస్రాయేలు దేశమున సున్నతి పొందని పిల్లలందరికి బలవంతముగా సున్నతి చేయించిరి.

47. వారు పొగరుబోతుతనముతో మిడిసిపడు శత్రునాయకులను కూడ హతమార్చి విజయము బడసిరి.

48. ఆ రీతిగా ఆ బృందమువారు అన్యజాతి ప్రజలయు, వారి రాజులయు బెడదనుండి ధర్మశాస్త్రమును కాపాడిరి. దుష్టుడైన ఆంటియోకసు రాజు కోరలను ఊడబెరికిరి.

49. అంతట మతతీయకు కాలముచెల్లి మరణము ఆసన్నముకాగా అతడు కుమారులతో ఇట్లనెను: “నాయనలారా! గర్వాత్ములు అధికారములోనికి వచ్చి మనలను హేళనచేయుచున్నారు. ఇది ద్వేషమునకును, సంతాపమునకును నిలయమైన దుష్టకాలము.

50. కుమారులారా! మీరిపుడు ధర్మశాస్త్రముపట్ల ఎనలేని భక్తి చూపవలయును. ప్రభువు మన పితరులతో చేసి కొనిన నిబంధనమును నిలబెట్టుటకు మీ ప్రాణములను అర్పించుటకైనను వెనుకాడకుడు.

51. మన పితరులు వారి తరములలో సాధించిన కుమారులారా! మీరు ప్రభువు మన ఏమీ ప్రాణము కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. వాటి మూలమున మీకును శాశ్వతమైన గౌరవము, కీర్తి అబ్బును.

52. ప్రభువు అబ్రహాముని పరీక్షకు గురిచేయగా అతడు తన విశ్వసనీయతను ప్రదర్శించుకొని న్యాయవంతునిగా గణింపబడలేదా?

53. యోసేపు ఆపత్కాలమునకూడ ధర్మశాస్త్ర మును పాటించినందున ఐగుప్తునకు ప్రభువయ్యెను.

54. మన పితరుడైన ఫీనెహాసు మహాభక్తిని ప్రదర్శించుటచే తరతరములదాక యాజకత్వమను ఒడంబడికను బహుమతిగా పొందెను.

55. యెహోషువ ధర్మశాస్త్రమునకు విధేయుడైనందున యిస్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యెను.

56. కాలేబు యిస్రాయేలు సమాజమునకు మంచి వార్తలు కొనివచ్చి, దానిని బలపరచినందున వాగ్దాత్త భూమిలో పాలుపొందెను.

57. దావీదు దయార్ద్రహృదయుడు కనుక అతడు, అతని తనయులు, శాశ్వతముగా రాజ్యము ఏలిరి.

58. ఏలీయా ధర్మశాస్త్రముపట్ల అపారభక్తి ప్రదర్శించినందున పరమునకు కొనిపోబడెను.

59. హననీయ, అజర్యా, మిషాయేలు విశ్వాసము వలన నిప్పుమంటలను తప్పించుకొనిరి.

60. దానియేలు వినమ్రుడు కనుక ప్రభువతనిని సింహము కోరలనుండి విడిపించెను.

61. ఈ రీతిగా ఆయా తరములందు ప్రభువును నమ్మిన భక్తులు తమ శక్తినే ఏమాత్రము కోల్పోరైరి.

62. మీరు దుష్టుల బెదిరింపులకు భయపడవలదు. వారెల్లరును చత్తురు, వారి శవములను పురుగులు తినివేయును.

63. నేడు వైభవోపేతులుగా ఉన్నను రేపటికి వారు మిగులరు. వారెల్లరును మట్టి పాలగుదురు. వారి కుతంత్రములన్ని వమ్మగును.

64. కుమారులారా! మీరు ధైర్యముతో నిలిచి ధర్మశాస్త్రమును కాపాడుడు. దాని మూలమున మీరు కీర్తిబడయుదురు.

65. ఇదిగో మీ సహోదరుడైన సీమోను. ఇతడు తెలివైనవాడు. కనుక మీరు నా మాటవలె ఇతడి మాటను పాటింపుడు. అతడు మీకు తండ్రిలాంటి వాడు.

66.యూదా మక్కబీయుడు బాల్యము నుండియు బలశాలి. ఇతడు మీకు నాయకుడై శత్రువులతో యుద్ధము చేయును.

67. మీరు ధర్మశాస్త్రమును పాటించువారినందరిని మీ పక్షమున చేర్చుకొనుడు. మన ప్రజలకు అపకారము చేసినందులకుగాను శత్రువులను శిక్షింపుడు.

68. అన్యజాతులకు తగిన శాస్తిచేయుడు. ఎల్లపుడు ధర్మశాస్త్రమును జాగ్రత్తగా పాటింపుడు.”

69. ఈ మాటలను చెప్పిన పిదప మత్తతీయ కుమారులను దీవించి ప్రాణములు విడచెను.

70. అతనిని మోయిదెనులోని తమ కుటుంబ సమాధిలో పాతిపెట్టిరి. యిస్రాయేలీయులు అతని మృతికి మిగుల శోకించిరి. ఈ సంఘటనము గ్రీకు శకము 146వ యేట (క్రీ.పూ 166) జరిగెను.

 1. మత్తతీయ తరువాత అతని కుమారుడు యూదా మక్కబీయుడు నాయకుడయ్యెను.

2. మక్కబీయుని సోదరులును, మత్తతీయ అనుచరులును అతనికి మద్దతునిచ్చిరి. వారందరును కలిసి యిస్రాయేలీయుల తరపున యుద్ధము కొనసాగించిరి.

3. యూదా తన ప్రజల కీర్తిని నలుదిశల వ్యాపింప జేసెను. అతడు యుద్ధవీరునివలె కవచము దాల్చెను. తన ఆయుధములు ధరించి, రణమునకు వెడలెను, అనేక యుద్ధములను నడిపి, స్వీయఖడ్గముతోనే తన సైన్యమును కాపాడెను.

4. అతడు సింహమువలె పోరాడెను. సింగపు కొదమవలె శత్రువుల మీదికి దుమికెను.

5. ధర్మశాస్త్రమును పాటింపనివారిని వెన్నాడి మట్టుపెట్టెను. తన ప్రజలను హింసించువారిని అగ్నికాహుతి చేసెను.

6. దుర్మార్గులు అతనిని చూచి గడగడ వణకిరి. పాపాత్ములతనిని గాంచి కలవరము చెందిరి. అతడు దేశ స్వాతంత్య్రమును నిలబెట్టెను.

7. చాలమంది రాజులను ముప్పుతిప్పలు పెట్టెను. యిస్రాయేలీయులకు మాత్రము ప్రమోదము చేకూర్చెను. అతని కీర్తి కలకాలము నిలిచెను.

8. అతడు యూదయా పట్టణములలో తిరుగాడి పాపాత్ములనెల్ల హతము చేసెను. యిస్రాయేలీయులను దైవాగ్రహమునుండి తప్పించెను.

9. మృత్యువు వాత పడనున్నవారిని సుసంఘటితులను చేసెను. అతని కీర్తి దిగంతములవరకు వ్యాపించెను.

10. అప్పుడు అపోల్లోనియసు అనునతడు యిస్రాయేలీయులతో యుద్ధము చేయుటకు అన్యజాతివారిని, సమరీయులను చాలమందిని ప్రోగుజేసి కొనెను.

11. యూదా ఆ సంగతిని తెలిసికొని శత్రువు మీదికి దాడి చేసెను. అతడు అపోల్లోనియసును చంపి అతని సైన్యమును ఓడించెను. అన్యజాతి సైనికులు చాలమంది మడసిరి. మిగిలినవారు పారిపోయిరి.

12. యూదులు కొల్లసొమ్మును దోచుకొనిరి. యూదా అపోల్లోనియసు ఖడ్గమును గ్రహించి దానిని తన జీవితాంతమువరకును యుద్ధములందు వాడుకొనెను.

13. యూదా నమ్మదగిన బంటులతో గొప్ప సైన్యమును సిద్ధము చేసికొనెనని సిరియా సైన్యాధిపతియైన సెరోను వినెను.

14. అతడు రాజు ఆజ్ఞను లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగు యూదాను, అతని సైనికులను ఓడించి సామ్రాజ్యమంతట కీర్తి తెచ్చు కొందునని అనుకొనెను.

15. కనుక అతడు మరియొక సారి అన్యులందరిని ప్రోగు చేసికొని, యూదా మీద దాడిచేసెను. యిస్రాయేలీయుల మీద పగ తీర్చుకోవలెనని అతని కోరిక.

16. సెరోను బేత్-హోరోను కనుమ దగ్గరికి రాగానే యూదా కొద్దిమందితో పోయి అతనిని ఎదిరించెను.

17. యూదా సైనికులు శత్రు సైన్యమును చూచి “కొద్దిమందిమైన మనమంత పెద్ద సైన్యముతో ఎట్లు పోరాడగలము? పైపెచ్చు మేము ఈ దినమేమిదీరి తిండితిననందున అలసియున్నాము” అనిరి.

18. కాని యూదా “వినుడు. చిన్న సైన్యము పెద్ద సైన్యమును ఓడించుట అంతకష్టము కాదు. ప్రభువు మనలను పెద్ద సైన్యముతోను రక్షింపవచ్చును. చిన్న సైన్యముతోను రక్షింపవచ్చును.

19. యుద్ధమున అధిక సంఖ్యాకుల పక్షముననే విజయము కలుగనక్కరలేదు. పోరున బలమును దయ చేయువాడు ప్రభువు.

20. శత్రువులు మితిమీరిన అహంకారముతోను, దౌర్జన్యముతోను, మనమీదికి దండెత్తి వచ్చుచున్నారు. మనలను, మన భార్యలను, పిల్లలను సంహరించి మన సొత్తు నెత్తుకొని పోవలెనని వారి తలపు.

21. కాన మనము మన ప్రాణములను, మన మతమును కాపాడుకొనుటకు పోరాడుచున్నాము.

22. దేవుడు వారిని సర్వనాశనము చేయును. మీరు వారిని చూచి ఏ మాత్రము భయపడకుడు” అని చెప్పెను.

23. యూదా జవాబు చెప్పుటను ముగించిన వెంటనే అకస్మాత్తుగా శత్రుసైన్యము మీదికి దూకి దానిని తరిమికొట్టెను.

24. విరోధులను బేత్-హోరోను కనుమనుండి మైదానమువరకు వెన్నాడి 800 మందిని మట్టుపెట్టెను. మిగిలినవారు ఫిలిస్తీయా దేశమునకు పారిపోయిరి.

25. అటు తరువాత అన్యజాతి వారెల్లరును యూదాను, అతని సోదరులను చూచి భయపడ జొ చ్చిరి.

26. ఆంటియోకసు రాజు కూడ అతని పరాక్రమము గూర్చి వినెను. ప్రతి జాతియు యూదా యుద్ధములను గూర్చి గొప్పగా చెప్పుకొనెను.

27. జరిగిన సంగతులెల్ల తెలిసికొని ఆంటియోకసు మండిపడెను. అతడు తన రాజ్యములోని సేనలనెల్ల ఒక మహాసైన్యముగా సమకూర్చెను.

28. తన కోశాగారము నుండి సైనికులెల్లరికిని ఒక యేటి జీతము చెల్లించి మీరు హఠాత్తుగా జరుగు యుద్ధములకు సిద్ధమైయుండుడని వారితో చెప్పెను.

29. కాని ఆ రాజు ఊహింపని విధముగా అతని కోశాగారములోని నిధులన్నియు ఖర్చయిపోయెను. పన్నులనుండి ముట్టవలసిన ఆదాయము ముట్టదయ్యెను. అతడు ప్రాచీనకాలమునుండి వచ్చు నియమములను రద్దు చేయించిన కారణమున రాజ్యమంతట కలహములు నెలకొని అశాంతి పెరిగిపోయెను.

30. ఆంటియోకసు పూర్వరాజులకంటె అధికముగా అనుచరులకు బహుమతులు పంచియిచ్చెడివాడు. కాని యిప్పుడు నిధులు తరిగిపోవుటవలన పూర్వపు రీతిన బహుమతులు పంచి ఈయజాలనేమో అనియు, అసలు మామూలు ఖర్చులకు వినియోగించుటకు కూడ ధనము చాలదేమో అనియు ఆ రాజు భయపడెను. ఇట్టి చిక్కులు అతనికి అంతకుముందే ఒకటి రెండుసార్లు కలిగియుండెను.

31. కనుక ప్రస్తుత పరిస్థితిని చూచి అతడు చాల ఆందోళనము చెందెను. చివరికి ఆ రాజు పర్షియామీదికి దండెత్తి అచటి సంస్థానముల నుండి పన్నులు వసూలుచేసి పెద్ద మొత్తము సొమ్మును ప్రోగుజేసికొని రావలెనని సంకల్పించుకొనెను.

32. ఆంటియోకసు ప్రసిద్ధ రాజవంశమునకు చెందిన లీసియాసును యూఫ్రటీసు నదినుండి ఐగుప్తు వరకును వ్యాపించి ఉన్న తన సామ్రాజ్యమంతటికిని అధికారిగా నియమించెను.

33. రాజు తిరిగివచ్చు వరకును అతని కుమారుడగు ఆంటియోకసుకు కూడా అతడు సంరక్షకుడు అయ్యెను.

34. ఇంకను రాజు తన ఏనుగులను, తన సైన్యమున అర్థభాగమును అతని వశము చేసెను. పరిపాలనా విధానమును అతడు అనుసరింపవలసిన సూత్రములను వివరించెను. విశేషముగా యూదయా యెరూషలేము పౌరులను ఏమి చేయవలయునో గూడ వివరించి చెప్పెను.

35. యూదుల మీదికి సైన్యమును పంపి సర్వనాశనము చేయవలెననియు, నేలమీద వారి పేరును మిగులనీయరాదనియు ఆదేశించెను. యెరూషలేమున ఇంకను మిగిలియున్నవారిని అడపొడ కనిపింపకుండునట్లు తుడిచివేయవలెననియు నుడివెను.

36. యూదయాలో అన్యజాతులకు నివాసము కలిపించి వారికి ఆ నేలను పంచియీయవలెనని పలికెను.

37. అట్లు ఉత్తరువులు జారీ చేసి ఆ రాజు సైన్యమున మిగిలిన అర్థ భాగమును వెంటబెట్టుకొని తన రాజధాని అయిన అంటియోకియా నుండి ప్రయాణమై పోయెను. అది గ్రీకుశకము 147వ యేడు (క్రీ.పూ 165). అతడు యూఫ్రటీసు నదిని దాటి ఎగువ ప్రాంతములగుండ పయనముచేసెను.

38. తదనంతరము లీసియాసు నికానోరును, గోర్గియాసును, దోరుమేనసు కుమారుడగు ప్టోలమీని సైన్యాధిపతులుగా నియమించెను. వారు మువ్వురును సమర్థులు, రాజమిత్రులను బిరుదము కలవారు కూడ.

39. లీసియాసు వారిని నలువదివేల పదాతులతోను, ఏడువేల ఆశ్వికులతోను యూదయా మీదికి పంపెను. రాజు ఆజ్ఞాపించినట్లే ఆదేశమును జయించి నాశనము చేయుడని చెప్పెను.

40. కనుక ఆ సైన్యాధిపతులు తమ సైన్యముతో పోయి సమతల ప్రాంతమున ఎమ్మావు చెంతగల మైదానమున శిబిరము పన్నిరి.

41. సిరియా నుండి, పాలస్తీనానుండి వచ్చిన పటాలములు కొన్ని అచటవారితో చేరిపోయెను. ఆ ప్రాంతపు వ్యాపారులు అది సుప్రసిద్ధమైన సైన్యమనివినిరి. వారు యూదులను బానిసలుగా కొని, తీసికొనిపోవచ్చునన్న ఆశతో పెద్దమొత్తము రొక్కమును, వెండి బంగారములను చెల్లించి సేవకులను తీసికొని శిబిరమువద్దకు వచ్చిరి.

42. యూదా, అతని సోదరులు శత్రువుల పీడ అధికమగుచున్నదనియు, వారు తమ సరిహద్దులలోనే మకాము చేయుచున్నారనియు తెలిసికొనిరి. రాజు యూదులను సర్వనాశనము చేయనెంచెననియు వారు గ్రహించిరి.

43. కనుక వారు క్షీణించుచున్న తమ జాతిని కాపాడవలెననియు, తమ దేశము కొరకును దేవాలయము కొరకును యుద్ధము చేయవలయుననియు సంకల్పించుకొనిరి.

44. అపుడు ప్రజలెల్లరును పోరాటముకు సంసిద్ధమగుటకును, ప్రభువు అనుగ్రహము కొరకు ప్రార్థన చేయుటకును సమావేశమైరి.

45. యెరూషలేము ఎడారివలె నిర్మానుష్యమయ్యెను. ఆమె బిడ్డలు ఆ నగరమునకు రాకపోకలు మానివేసిరి. అన్యజాతులవారు దేవళమును అమంగళము చేసిరి. అన్యులు నగరపుకోటలో మకాము పెట్టిరి. యిస్రాయేలీయులకు ఇక సంతోష దినములు లేవు. వారికిక సంగీత నాదములు విని ఆనందించు భాగ్యము లేదయ్యెను.

46. యూదా, అతని అనుచరులెల్లరు ప్రోగై యెరూషలేమునకు ఎదురుగా నున్న మిస్పాకు వచ్చిరి. ఆ తావున గుమిగూడి ప్రార్థన చేయుట పూర్వము నుండియు యిస్రాయేలీయులకు అలవాటు.

47. ఆ దినమంతయు వారు ఉపవాసముండి గోనె తాల్చిరి. తలపై బూడిద చల్లుకొనిరి. సంతాప సూచకముగా బట్టలు చించుకొనిరి.

48. అన్యజాతుల వారు దేవుని చిత్తము నెరుగుటకు విగ్రహములను సంప్రతించెడి వారు. కాని యిస్రాయేలీయులు మాత్రము ధర్మశాస్త్రమును తెరచిరి.

49. వారు యాజకులు ధరించు వస్త్రములను పొలమున పండిన మొదటి వెన్నులను, పదియవవంతు అర్పణములను కొనివచ్చిరి. నజరీయ వ్రతమును ముగించుకొనిన వారుకూడ కొందరు వచ్చిరి.

50. అంతటవారు గొంతెత్తి “ప్రభూ! మేము ఈ వస్తువులను, వ్రతమును ముగించుకొనిన ఈ ప్రజలను ఏమి చేయవలయును? ఎచటికి కొనిపోవలయును?

51. ఇపుడు నీ దేవళము పాడుపడి అమంగళమైయున్నది కదా! నీ యాజకులు అవమానమునకు గురియై విచారించుచున్నారు కదా!

52. అన్యజాతివారు మా మీదపడి మమ్ము నాశనము చేయనున్నారు. వారు మమ్మేమి చేయనున్నారో నీకు తెలియును.

53. నీవు మాకు తోడ్పడవేని మేము వారిని ఎట్లు ఎదిరింపగలము?” అని ప్రార్థించిరి.

54. అటు పిమ్మట వారు బాకాలనూది పెద్దగా అరచిరి.

55. అటు తరువాత యూదా తన జనమును పదిమందిగను, ఏబదిమందిగను, వందమందిగను, వేయిమందిగను విభజించి వారికి నాయకులను నియమించెను.

56. అతడు క్రొత్తగా పెండ్లియాడిన వారిని, ఇండ్లు కట్టుకొనిన వారిని, ద్రాక్షతోటలను నాటిన వారిని, పోరాటమునకు దడిసిన వారిని తమ యిండ్లకు వెళ్ళిపొమ్మనెను. ధర్మశాస్త్రమిందులకు అంగీకరించును.

57. అంతట అతడి సైన్యమంతయు కదలిపోయి ఎమ్మావునకు దక్షిణమున శిబిరము పన్నెను.

58. యూదా తన సైన్యముతో “మీరు యుద్ధమునకు సన్నద్దులు కండు. ధైర్యముతో నిలువుడు. ఈ అన్యజాతి వారు మన మీదపడి మనలను, మన దేవళమును నాశనము చేయనెంచుచున్నారు. మీరు రేపు ప్రొద్దున వారితో పోరాడవలయును.

59. మన జాతి, మన  దేవళము నాశనమగుచుండగా చూచుచు ఊరకుండుటకంటె యుద్ధమున పోరాడుచు ప్రాణములు విడచుట మేలుకదా!

60. ఆ పిమ్మట దేవుని చిత్తమెట్లున్నదో అట్లు జరుగును” అని చెప్పెను.

 1. గోరియాసు ఐదువేలమంది కాలి బంటులను, వేయిమంది నిపుణులైన రౌతులను తీసికొని రాత్రివేళ శిబిరము నుండి బయలుదేరెను.

2. తలవని తలంపుగా పోయి యూదా మీద పడవలెనని అతని పన్నాగము. యెరూషలేము దుర్గమున వసించువారు అతనికి మార్గదర్శకులుగానుండిరి.

3-4. కాని యూదా విరోధుల రాకను ముందుగనే పసికట్టెను. కనుక అతడు శత్రువులు తనను సమీపింపక మునుపే ఎమ్మావు చేరువలో వారిని ఎదిరించుటకుగాను కదలి పోయెను.

5. గోర్గియాసు తన సైన్యముతో వచ్చి చూడగా యూదా శిబిరమున ఒక్క పురుగుకూడ కనిపింపలేదు. వారు యూదా తన సైన్యముతో పారిపోయెనేమో అనుకొని శత్రువుల కొరకు పర్వతములలో గాలింప మొదలిడిరి.

6. తెల్లవారునప్పటికి యూదా మూడువేలమందితో మైదానమున కనిపించెను. కాని అతని సైనికులకు చాలినన్ని కవచములుగాని, కత్తులుగాని లేవు.

7. వారు కన్నెతిచూడగా శత్రుసేనలు కనిపించెను, విరోధి సైనికులు పోరున కాకలుతీరినవారు, కవచములు తాల్చిన వారు, అశ్వబలము కలవారు.

8. అప్పుడు యూదా తన అనుచరులతో “మీరు వారి సంఖ్యను చూచి భయపడకుడు. వారు వచ్చి మీ మీద పడినపుడు మీరు దడియకుడు.

9. ఫరో సైన్యముతో వచ్చి రెల్లు సముద్రము వద్ద మన పితరులమీద పడగా వారతని బారి నుండి తప్పించుకోలేదా?

10. ఇపుడు ప్రభువు మన మీద కరుణ జూపవలెనని మాత్రము వేడుకొందము. ఆయన మన పూర్వులతో చేసికొనిన నిబంధన జ్ఞప్తికి తెచ్చుకొని మన మీదికెత్తివచ్చిన ఈ సైన్యమును చిత్తు చేయవలెనని మనవిచేయుదము.

11. అపుడు యిస్రాయేలును కాపాడు దేవుడొకడు ఉన్నాడని ఎల్లజాతులును రూఢిగా ఎరుగును” అని చెప్పెను.

12-13. యూదా బృందము యుద్ధమునకు సన్నద్దులగుట చూచి అన్యజాతులవారును బారులు తీరిపోరుకు ఆయత్తమైరి.

14. అప్పుడు యూదా బృందము బాకాలనూది పోరు మొదలుపెట్టెను.

15. శత్రువులు చెల్లాచెదరై మైదానము మీదుగా పారిపోయిరి. వారిలో వెనకపట్టుననున్న వారందరిని మడసిరి. యిస్రాయేలీయులు గాసరావరకు, ఇదూమియా మైదానము వరకు, అష్ణోదు, యామ్నియా నగరముల వరకును విరోధులను తరిమికొట్టిరి. వారు శత్రుసైన్యమున మూడువేలమందిని మట్టుపెట్టిరి.

16. యూదా అతని యనుచరులు శత్రువులను తరుముట మాని తిరిగివచ్చిరి.

17-18. అతడు వారితో “ మీరు కొల్లసొమ్ము కొరకు పేరాశ పడవద్దు. గోర్గియాసు అతని అనుచరులు చేరువ కొండలలో ఉన్నారు. కనుక మనము మరల యుద్ధము చేయవలయును. మొదట ధైర్యముగా నిలిచి శత్రువులతో పోరాడుడు. తరువాత మీకు కావలసినంత సొమ్మును ప్రోగుచేసికోవచ్చును” అని చెప్పెను.

19. అతడిట్లు మాటలాడుచుండగనే గస్తీ తిరుగు శత్రుబృందమొకటి కొండల మీదినుండి వారివైపు వచ్చుచుండెను.

20. ఆ బృందము వారు తమ సైనికులు పారిపోయిరనియు, తమ శిబిరము తగులబడినదనియు గుర్తించిరి. ఆ శిబిరమునుండి లేచు పొగను చూడగనే వారు ఈ సంగతులను గ్రహించిరి.

21-22. కనుకవారు భయముతో కంపించిపోయిరి. మరియు వారు యూదా సైన్యము యుద్ధమునకు సన్నద్ధమై ఉండుటను చూచి బ్రతుకు జీవుడాయని ఫిలిస్తీయా మండలమునకు పారిపోయిరి.

23. అపుడు యూదా కొల్లసొమ్మును దోచుకొనుటకుగాను శత్రుశిబిరమునకు తిరిగివచ్చెను. అతడు పెద్ద మొత్తము వెండి, బంగారములను, ఊదా ఎరుపురంగుల పట్టుబట్టలను, ఇంకను విలువగల యితర వస్తువులను తీసికొనెను.

24. యూదులు తమ శిబిరమునకు తిరిగివచ్చి "ప్రభువు మంచివాడు, అతని దయ కలకాలము నిలుచును" అని గీతముపాడిరి.

25. ఆ దినము యిస్రాయేలీయులు గొప్ప విజయము సాధించిరి.

26. యుద్ధమున చావక తప్పించుకొని పోయిన అన్యజాతి సైనికులు లీసియాసు వద్దకు పోయి జరిగిన సంగతులెల్ల తెలియజేసిరి.

27. ఆ వార్తలు విని అతడు ఆశ్చర్యమును, నిరుత్సాహమును చెందెను. అతడు ఆశించినట్లు యిస్రాయేలీయులు నాశనము కాలేదు. రాజు ఆదేశించినట్లును జరుగలేదు.

28. ఆ మరుసటి యేడు లీసియాసు శూరులైన అరువది వేలమంది కాలిబంటులను, ఐదువేల మంది రౌతులను ప్రోగుజేసికొనెను. యూదుల పీచమణచవలయునని అతని కోరిక.

29. వారు ఇదుమియా గుండ ప్రయాణము చేసి బేత్సూరు వద్ద శిబిరము వేసిరి. యూదా పదివేలమందితో వారిని ఎదిరింప వచ్చెను.

30. అతడు శత్రుబలమును చూచి ఈ రీతిగా ప్రార్థించెను: “యిస్రాయేలు రక్షకుడవైన ప్రభూ! మేము నిన్ను స్తుతించుచున్నాము. నీవు నీ సేవకుడైన దావీదు ద్వారా ఫిలిస్తీయా వీరుని బలమును వమ్ముచేసితివి. సౌలు కుమారుడైన యోనాతాను అతని అంగరక్షకుడు ఫిలిస్తీయా సైన్యమును ఓడించునట్లు చేసితివి.

31. ఆ రీతినే నేడును నీ ప్రజయైన యిస్రాయేలీయుల ద్వారా ఈ నీ శత్రువులను ఓడింపుము. శత్రువులకు అందరు రౌతులు, కాలిబంటులున్నను వారిని అవమానముపాలు చేయుము.

32. పగవారిని పిరికివారిగా చేసి వారు ఆత్మవిశ్వాసమును కోల్పోవునట్లు చేయుము. వారు 'మేము ఓడిపోవుదుమేమో' అని భయపడునట్లు చేయుము.

33. వారెల్లరును నీ భక్తులమైన మా కత్తి వాతపడగా మేము నిన్ను స్తుతించి గానము చేయుదు ముగాక!”

34. అంతట ఇరువర్గముల మధ్య పోరు ప్రారంభము కాగా లీసియాసు సైనికులు ఐదువేల మంది ముష్టి యుద్ధమున మడిసిరి.

35. లీసియాసు తన సైనికులు వెన్నిచ్చి పారిపోవుటను చూచెను. యూదా సైనికులు బ్రతుకుటయైనను, గౌరవప్రదముగా చచ్చుటయైనను సమమేనన్న తలపుతో ప్రాణములకు తెగించి పోరాడుటను కూడ చూచెను. అంతట అతడు అంటియోకియాకు మరలివచ్చెను. అచట కూలికి వచ్చు బంటులను కొందరిని సైన్యమున చేర్చుకొనెను. పూర్వముకంటె గొప్ప సైన్యము ప్రోగుజేసికొని మరల యూదయా మీదికి దండెత్తవలెనని అతని కోరిక.

36. యూదా, అతని సోదరులు “శత్రువులు ఓడిపోయిరి. కనుక మనము యెరూషలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసి దానికి పునఃప్రతిష్ఠ చేయుదము' అని అనుకొనిరి.

37. కనుక వారు సైన్యము నంతటిని తరలించుకొని సియోను కొండకు వెళ్ళిరి.

38. వారచటికి చేరుకొనునప్పటికి దేవళము పాడువడి యుండెను. పీఠము అమంగళమైయుండెను. దేవాలయ ద్వారములు తగులబడియుండెను. అడవి యందును, కొండలమీదనువలె దేవాలయపు ఆవరణములలో గడ్డి ఎదిగియుండెను. యాజకుల నివాసములు కూలిపోయియుండెను.

39. ఆ దృశ్యము చూచి వారు పరితాపముతో బట్టలుచించుకొనిరి. తల మీద దుమ్ము చల్లుకొనిరి.

40. ఎల్లరును నేలమీద సాగిలపడిరి. కొంత సేపటికి బూరనూది సంజ్ఞను తెలియజేయగానే ఎల్లరును దేవునికి మొరపెట్టుచు బిగ్గరగా ఏడ్చిరి.

41. అంతట యూదా 'నేను దేవాలయమును శుద్ధి చేయించుచుండగా మీలో కొందరు పోయి యెరూషలేము దుర్గమున వసించు వారితో పోరాడుడు' అని చెప్పెను.

42. తరువాత అతడు పేరుప్రతిష్ఠలు కలిగి, ధర్మశాస్త్రమును నిష్ఠతో పాటించు యాజకులను కొందరిని ఎన్నుకొనెను.

43. వారు దేవాలయమును శుద్ధిచేసిరి. మైలపడిన రాళ్ళను తొలగించి ఒక తావున కుప్పగా పేర్చిరి.

44. దహనబలులర్పించు పీఠమప్పటికే అమంగళమై పోయినది. దానినేమి చేయవలయునా అని వారు తమలోతాము వితర్కించుకొనిరి.

45. ఆ పీఠమచట నుండనిచ్చినచో అన్యులవలన అమంగళమైన అది వారి అపకీర్తికి చిహ్నముగా నుండును. కనుక పీఠ మును అచటినుండి తొలగింపవలెనని నిశ్చయించుకొని దానిని కూలద్రోసిరి.

46. దాని రాళ్ళను కొని పోయి దేవాలయమును కట్టిన కొండమీద ఒక తావునపేర్చిరి. ఎవరైన ప్రవక్త వచ్చి ఆ రాళ్ళనేమి చేయవలయునో తెలియజేయు వరకు వానిని అచటనే ఉంచుదమనుకొనిరి.

47. ధర్మశాస్త్రము అదేశించినట్లుగా చెక్కని రాళ్ళతో పూర్వపు పీఠమును పోలిన మరియొక దానిని నిర్మించిరి.

48. దేవాలయము వెలుపలను, లోపలను కూడ మరమ్మతు చేయించి దాని ఆవరణములను శుద్ధిచేసిరి.

49. అరాధనలో వాడుటకుగాను క్రొత్త పాత్రములను చేయించిరి. దీపస్తంభమును, సాంబ్రాణి పొగవేయు పీఠమును, సాన్నిధ్యపు రొట్టెలు పెట్టు బల్లను దేవాలయములోనికి కొనివచ్చిరి.

50. పీఠము మీద సాంబ్రాణి వేసి దీప స్తంభమును వెలిగింపగా దేవాలయమున వెలుగు కలిగెను.

51. సాన్నిధ్యపు రొట్టెలు బల్లమీద పెట్టిరి. తెరలను దింపిరి. అలా మిగిలిన కార్యములు గూడ ముగించిరి.

52-54. గ్రీకు శకము 148 యేడు కీస్లేవు అను తొమ్మిదవ నెల 25వ తేదీ నాటికి అన్యజాతి వారు పీఠమును అమంగళము చేసి ఒక ఏడాది అయ్యెను. ఆ దినమున ప్రజలు వేకువనే లేచి తాము క్రొత్తగా నిర్మించిన బలిపీఠముపైని ధర్మశాస్త్ర నియమము ప్రకా రము దహనబలి అర్పించిరి. అమంగళము గావింప బడిన రోజులలోనే, అదే రోజున, అదే సమయములో వీణలు, పిల్లనగ్రోవులు చిటితాళములు మొదలైన వాద్యములతో గీతములు పాడుచు బలిపీఠమునకు ప్రతిష్ఠచేసిరి.

55. ప్రజలెల్లరును నేలపై సాగిలపడి తమకు విజయము ప్రసాదించిన ప్రభువు నారాధించి స్తుతించిరి.

56. ఆ ప్రజలు బలిపీఠమునకు ప్రతిష్ఠచేసి ఎనిమిది రోజులపాటు పండుగ చేసికొనిరి. మిన్నులు ముట్టిన ఉత్సాహముతో దహనబలులు, సమాధాన బలులు, కృతజ్ఞతాబలులర్పించిరి.

57. దేవాలయము ముఖద్వారమును బంగారు కిరీటములతోను, కవచములతోను అలంకరించిరి. ద్వారములను, యాజకుల గృహములను పునర్నిర్మాణము చేసి వానికి తలుపులు బిగించిరి.

58. అన్యజాతివారివలన కలిగిన అవమానము తీరిపోయినది. కనుక పెద్ద ఉత్స వము చేసికొనిరి.

59. అపుడు యూదా అతని సోదరులు ప్రజలెల్లరును కలిసి ఈ నియమముచేసిరి. ప్రతియేడు బలిపీఠము ప్రతిష్ఠను పురస్కరించుకొని సంతసముతో ఉత్సవము చేసికోవలెను. ఆ పండుగను కీస్లేవు నెల ఇరువది ఐదవ రోజున ప్రారంభించి ఎనిమిది నాళ్ళు జరుపవలయును.

60. అటు తరువాత వారు సియోను కొండ చుట్టును బురుజులతో ఎత్తయిన ప్రాకారములు కట్టిరి. అన్యజాతి వారు ఆ ప్రదేశమున ప్రవేశించి దానిని అమంగళము చేయకుండుటకుగాను ఆ గోడలను నిర్మించిరి.

61. యూదా అచట ఒక సైనిక దళమును ఉంచగా వారు దేవాలయమునకు కావలికాచిరి. ఇంకను అతడు ఇదూమియానుండి ఎట్టి అపాయము కలుగకుండ యిస్రాయేలీయులను కాపాడుటకుగాను బేత్సూరున ఒక దుర్గము నిర్మించెను.

 1. యూదులు దేవాలయమును ప్రతిష్ఠించి, బలిపీఠమును పునర్నిర్మాణము చేసిరని విని, చుట్టు పట్లనున్న అన్యజాతివారు ఆగ్రహము చెందిరి.

2. కనుక వారు తమచెంత వసించు యూదులను నాశనము చేయనెంచి వారిని హత్యచేయసాగిరి.

3. ఇదూమీయులు తమ దేశమందలి ఆక్రబాట్టేనే అను తావునుండి యూదులపై దాడి చేయుచుండిరి. కనుక యూదా ఇదూమీయుల మీదికి యుద్ధమునకు పోయెను. వారిని ఓడించి కొల్లగొట్టెను.

4. అతడు క్రూరులైన బెయానీయులతో కూడ పోరాడెను. వారు పొదలలో దాగుకొనియుండి యిస్రాయేలు ప్రయాణీకులను నిరంతరము దోచెడివారు.

5. యూదా వారిని వారి దుర్గములలోనే ఉంచి వాని తలుపులు మూయించెను. వారిని సర్వనాశనము చేయుదునని ఒట్టుపెట్టుకొనెను. ఆ కోటలను, వానిలోని ప్రజలతో పాటు నిలువున తగుల బెట్టించెను.

6. తరువాత అతడు అమ్మోనీయుల మీదికి పోయెను. వారు తిమొత్తి అనువాని నాయకత్వము క్రింద బలమైన మహాసైన్య మును ప్రోగుజేసికొనియుండిరి.

7. అతడు వారితో అనేకమారులు పోరాడి వారిని నాశనము చేసెను.

8. యాసేరును, దాని ప్రాంతములోని పల్లెలను స్వాధీనము చేసికొని యూదయాకు తిరిగివచ్చెను.

9. గిలాదులోని అన్యజాతివారందరును ఏకమై తమ మండలమున నివసించు యూదులను ఓడించి సంహరింపబూనిరి. యూదులు దిట్టమైన లాసెదాతేమా దుర్గమున దాగుకొని,

10. యూదాకు, అతని సోదరులకు ఈ క్రింది రీతిగా వర్తమానము పంపిరి. తన "మా చుట్టుపట్లనున్న అన్యజాతుల వారు తిమొతి నాయకత్వము క్రింద ఒక్క బృందముగా ఏకమైరి.

11. మేమీ దాతేమా దుర్గమున దాగుకొంటిమి. శత్రువులు ఈ కోటను ముట్టడించి మమ్ము నాశనము చేయనున్నారు.

12. మా వారు చాల మంది ఇది వరకే ప్రాణములు కోల్పోయిరి. మీరు మమ్ము రక్షించుటకు వెంటనే రావలయును.

13. తోబుమండలమున నివసించు యూదులను ఇంతకు ముందే చంపివేసిరి. వారి భార్యలను, పిల్లలను చెరగొనిరి. వారి ఆస్తి పాస్తులను అపహరించిరి. అచట వేయి మంది సైనికులు చనిపోయిరి.”

14. యిస్రాయేలీయులు ఆ జాబును ఇంకను చదువుచుండగనే గలిలీయనుండి కూడ దూతలు వార్తలతో వచ్చిరి. వారు విచారముతో బట్టలు చించుకొనియుండిరి.

15. ప్టోలమాయిసు, తూరు, సీదోను, గలిలీయ సైన్యములన్ని ఏకమై మమ్ము నాశనము చేయుచున్నవని ఆ దూతలు చెప్పిరి.

16. యూదులు ఈ వార్తలువిని తమ జనులనెల్ల ప్రోగుచేసిరి. శత్రువుల దాడికి గురియైన సోదర ప్రజనెట్లు ఆదుకోవలయునో నిర్ణయించుటకుగాను ఈ సమావేశము ఏర్పాటు చేసిరి.

17. యూదా తన సోదరుడైన సీమోనుతో “నీవు కొందరు సైనికులతో గలిలీయకు వెళ్ళి అచటి యూదులను కాపాడుము. నేను మన సోదరుడు యోనాతాను గిలాదునకు వెళ్ళెదము” అని చెప్పెను.

18. అతడు తన సైన్యమున మిగిలిన వారిని యూదయాను కాపాడుటకు నియమించెను. అజరియాను, జకరియా కుమారుడగు యోసేపును ఆ దండుకు నాయకులను గావించెను.

19. వారితో “నేను మిమ్మిచట నాయకులుగా నియమించి పోవుచున్నాను. కాని మేము తిరిగివచ్చువరకు మీరు అన్యజాతుల మీదికి యుద్ధమునకు పోవలదు” అని చెప్పెను.

20. సీమోనుతో గలిలీయకు వెళ్ళుటకు మూడువేలమంది సైనికులను,యూదాతో గిలాదునకు గాను వెళ్ళుటకు ఎనిమిది వేల మందిని నియమించెను.

21. సీమోను గలిలీయ మండలము ప్రవేశించి అన్యజాతివారితో పెక్కు యుద్ధములు చేసి వారిని చిందరవందర చేసెను.

22. అతడు శత్రువులను ప్టోలమాయిసు నగరమువరకును తరిమికొట్టి మూడు వేలమందిని వధించెను. కొల్లసొమ్ము దోచుకొనెను.

23. గలిలీయయందును, అర్బట్ట యందును వసించు యూదులను వారి భార్యలు, పిల్లలు, ఆస్తిపాస్తులతో పాటు యూదయాకు తీసికొనివచ్చెను. అందుల కెల్లరును సంతసించిరి.

24. ఆ కాలముననే యూదా మక్కబీయుడు, అతని సోదరుడు యోనాతాను యోర్ధానునది దాటి ఎడారిలో మూడునాళ్ళపాటు పయనము చేసిరి.

25. అచట వారు కొందరు నటాతీయులను కలిసికొని వారితో స్నేహము చేసిరి. వారు గిలాదునందలి యూదులకేమి జరిగినదో వివరించి చెప్పిరి.

26. “చాలమంది యూదులను బోస్రా, బోసోరు, అలేమా, ఖాస్పో, మాకెదు, కర్నాయీము అను సురక్షిత నగరములలో బంధించి ఉంచిరి అని తెలియజేసిరి.

27. మిగిలిన యూదులను గిలాదునందలి ఇతర నగరములలో బంధించిరి. శత్రువులు ఆ మరుసటి దినమున ఈ నగర దుర్గములన్నింటిని ముట్టడించి వానిలోని యూదులందరిని మట్టుపెట్టనున్నారు” అనియు తెలియజేసిరి.

28. కనుక యూదా, అతని సైన్యము వెంటనే పోయి ఎడారి త్రోవప్రక్కనగల బోస్రా నగరముమీద పడిరి. ఆ పట్టణమును పట్టుకొని అందలి పురుషులందరిని చంపిరి. దానిని దోచుకొని కాల్చివేసిరి.

29. వారచటినుండి సాగిపోయి రాత్రంతయు ప్రయాణము చేసి దాతేమా దుర్గమును చేరుకొనిరి.

30. అచట వేకువ వెలుగులో ఒక పెద్ద సైన్యము ఆ దుర్గమును ఆక్రమించుకొనబోవుటను చూచిరి. ఆ సైన్యము నిచ్చెనలతో, గోడలను కూల్చు మంచెలతో వచ్చికోటను స్వాధీనము చేసికొన బోవుచుండెను.

31. యూదా యుద్ధనాదమును, బూరల మ్రోతను, గడబిడ ధ్వనిని వినిపోరు అప్పుడే ప్రారంభమైనదని గ్రహించెను.

32. కనుక అతడు తన సైనికులతో “నేడు మీరు మన సోదరులైన తోడి యూదులకొరకు యుద్ధము చేయవలయును” అని చెప్పెను.

33. అతడు తన సైనికులను మూడు బృందములుగా విభజించెను. వారు బాకాలనూదుచు పెద్ద స్వరముతో ప్రార్ధనము చేయుచు వెనుక ప్రక్కనుండి పోయి శత్రువుల మీద పడిరి.

34. తిమొతి నాయకత్వము క్రిందనున్న శత్రుసేనలు యూదా మక్కబీయుడు వచ్చెనని గ్రహించి పారిపోయెను. యూదా వానినోడించి ఆరోజే ఎని మిదివేల మందిని సంహరించెను.

35. తరువాత అతడు పోయి అలేమా నగరమును ముట్టడించెను. అచటి పురుషులనందరిని చంపి, పట్టణమును కొల్లగొట్టి కాల్చివేసెను.

36. పిమ్మట ఖాస్పో, మాకెదు, బోసోరు నగరములను, మరియు గిలాదునందలి ఇతర పట్టణములనుగూడ ముట్టడించి జయించెను.

37. ఈ యుద్ధము తరువాత తిమొతి మరియొక సైన్యము సమకూర్చుకొని వచ్చి రాఫోనునకు ఎదురుగా నదికి ఆవలి ప్రక్కన శిబిరము పన్నెను.

38. యూదా వేగులవారిని పంపగా వారు తిరిగివచ్చి ఆ మండలములోని అన్యజాతి వారెల్లరను తిమొతితో కలిసి పెద్ద సైన్యముగా ఏర్పడిరని తెలిపిరి,

39. అరబ్బు కూలి బంటులు కూడ ఆ సైన్యమున చేరిరనియు, వారెల్లరు నది కావలి ప్రక్కన దండు విడిసి యూదాతో పోరాడుటకు సంసిద్దులుగా ఉన్నారనియు వినిపించిరి. కనుక యూదా వారితో పోరాడబోయెను.

40. అతడు నదిని సమీపించుచుండగా తిమొతి తన సైన్యాధిపతులతో “యూదా నదినిదాటి వచ్చెనేని మనము అతనిని ఎదిరింపలేము. అతడు మనలనోడించి తీరును.

41. కాని అతడు మనకు జడిసి ఏటికి ఆవలి ప్రక్కనే శిబిరము పన్నెనేని, మనము నదినిదాటి అతనిని జయింపవచ్చును” అని చెప్పెను.

42. యూదా నదియొడ్డుకు రాగానే “మనవారి నెవరిని ఇచట విడిదిచేయనీయవలదు. ఎల్లరును వెంటనే యుద్ధము ప్రారంభింపవలయును” అని తన సైన్యాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.

43. అందరి కంటె ముందుగా అతడే యేరుదాటి శత్రువుల మీదికి పోయెను. యూదా సైనికులెల్లరును అతనిని అనుసరించిరి. వారిని చూచి అన్యజాతి వారెల్లరు బారుల నుండి వైదొలగి తమ ఆయుధములను విసరి పారవేసి కర్నాయీము దేవళమునకు పారిపోయిరి.

44. యూదా అతని అనుచరులు మొదట నగరమును ఆక్రమించుకొనిరి. తరువాత దేవళమును, దానిలో దాగుకొనియున్న వారితోపాటు తగులబెట్టిరి. ఆ రీతిగా కర్నాయీము లొంగిపోయిన పిదప అన్యజాతి వారు యూదాను ఎదిరింపజాలరైరి.

45. తదనంతరము యూదా గిలాదులోని యూదులనెల్ల తనతో యూదయాకు తీసికొనిపోవుటకు సన్నాహములు చేసెను. వారు తమ భార్యలతో, పిల్లలతో, ఆస్తిపాస్తులతో బ్రహ్మాండమైన బృందముగా ప్రోగైరి.

46. ఆ ప్రజలు ఏఫ్రోను అను సురక్షితమైన పెద్ద నగరము వరకు ప్రయాణము చేసిరి. నగరమునకు కుడివైపునుండిగాని ఎడమవైపునుండిగాని పోవుటకు వీలులేదు. మార్గము పట్టణము మధ్య గుండ పోవు చుండెను.

47. ఆ పట్టణ పౌరులు వారిని తమ నగరముగుండ వెళ్ళనీయరైరి. రాళ్లు పేర్చి పురద్వారములను మూసివేసిరి.

48. యూదా “మమ్ము మీ నగరముగుండ మాదేశమునకు వెళ్ళిపోనిండు. మేము మీకెట్టి కీడుచేయము. అవతలికి వెళ్ళిపోవుటయే మా ఉద్దేశము” అని వారికి స్నేహసందేశము పంపెను. అయినను వారు నగర ద్వారములు తెరువలేదు.

49. కనుక యూదా తన జనులలో యుద్ధము చేయువారు తప్ప మిగిలిన వారెల్లరు అచటనే విడిదిచేయవలెనని ఆజ్ఞ యిచ్చెను.

50. యుద్ధవీరులు పోరుకు ఆయత్తపడి పగలు రేయికూడ ముట్టడి కొనసాగించిరి. కడకు ఏఫ్రోను లొంగిపోయెను.

51. యూదా ఆ నగరము నందలి పురుషులనెల్ల మట్టుపెట్టించెను. యూదులు ఆ నగరమును దోచుకొని దానిని నేలమట్టము చేసిరి. నగరముగుండ, చచ్చినవారి శవముల మీదుగా నడచిపోయిరి.

52. వారు యోర్దానునదిని దాటి బేత్షాను ఎదుటగల పెద్ద మైదానము చేరిరి.

53. దారి పొడుగున యూదా వెనుకబడినవారిని నడిపించుచు వచ్చెను. యూదయా మండలము ప్రవేశించినదాక ప్రజలను ప్రోత్సహించుచు వచ్చెను.

54. ఎల్లరును సంతసముతో స్తుతిగీతములు పాడుచు సియోను కొండకు వెళ్లిరి. తమ పక్షము వారిలో ఒక్కరు కూడ చావక తిరిగి వచ్చినందుకుగాను దేవునికి దహనబలులు అర్పించిరి.

55-56. యూదా, యోనాతాను గిలాదునందును వారి సోదరుడైన సీమోను గలిలీయలోని ప్టోలమాయిసు యందును ఉండగనే యూదయాలోని సైన్యములకు అధిపతిగానున్న ఆసరియా మరియు జెకరియా కుమారుడు యోసేపు ఆ వీరుల వీరకృత్యములను, విజయములను గూర్చి వినిరి.

57. వారు 'మనమును అన్యజాతులతో పోరాడి పేరు తెచ్చుకొందము' అని అనుకొనిరి.

 1. అచట అంటియోకసు రాజు ఎగువ ప్రాంతములగుండ ప్రయాణము చేయుచు పర్షియాలో ఎలిమాయిసు నగరము కలదనియు, అది వెండి బంగారములకు ప్రసిద్ధిగన్న పట్టణమనియు వినెను.

2. ఆ నగరపు దేవాలయమున బంగారు డాళ్ళు, కవచములు, ఆయుధములు కలవు. మాసిడోనియా రాజు ఫిలిప్పు కుమారుడును తొలిసారిగా గ్రీకు సామ్రా జ్యము నేలిన చక్రవర్తియునగు అలెగ్జాండరు వానిని ఆ దేవళమున భద్రపరచెను.

3. కనుక అంటియోకసు ఆ పట్టణమును ఆక్రమించుకొని, వానిని దోచుకోవలెనని యత్నించెను. కాని నగర పౌరులు ఆ రాజు పన్నాగమును ముందుగనే ఎరిగిరి కనుక అతని యత్నము సిద్ధింపలేదు.

4. వారతనిని ఎదిరించి తీవ్రముగా పోరాడిరి. కనుక అతడు మిగుల నిరాశచెంది వెనుదిరిగి బబులోనియాకు వెడలిపోయెను.

5. అంటియోకసు పారశీకమున నుండగనే తాను యూదయా మీదికి పంపిన సైన్యములు ఓడిపోయిన వని వార్తలు వచ్చెను.

6. లీసియాసు పెద్దదండుతో పోయి పరాజయము చెంది తిరిగివచ్చెను. యూదులు తాము ఓడించిన శత్రుసేనల నుండి ఆయుధములు, భోజన పదార్థములు, కొల్లసొమ్ము దోచుకొని పూర్వము కంటె బలవంతులైరి.

7. వారు పూర్వము అంటియోకసు యెరూషలేము దేవాలయములోని బలిపీఠముమీద నెలకొల్పిన జుగుప్సాకరమైన విగ్రహమును పడగొట్టిరి. దేవళము చుట్టును పూర్వపురీతినే పెద్ద ప్రాకారము నిర్మించిరి. రాజుకు చెందిన బేత్సూరు నగరమును ఆక్రమించుకొని దానిని ప్రాకారములతో బలపరచిరి.

8. అంటియోకసు ఈ వార్తలెల్లవిని దిగ్బ్రాంతి చెంది ధైర్యము కోల్పోయెను. తాను కోరుకొన్నట్లుగా పనులు జరుగలేదు కనుక అతడు గాఢమైన విషాదమునకు గురియై మంచముపట్టెను.

9. తెరలు తెరలుగా పొంగివచ్చు తీవ్రమైన నిరాశవలన చాలకాలము జబ్బుపడియుండెను. కడన తనకు మరణమాసన్నమైన దని గుర్తించెను.

10. కనుక అతడు తాను 'రాజమిత్రుడు” అన్న బిరుదము ఇచ్చిన వారినందరిని చేరబిలిచి “నాకు నిద్దురపట్టుట లేదు. నా హృదయము విచారముతో కుంగిపోవుచున్నది.

11. నేను ఉదార హృదయుడను. ప్రజల అభిమానము చూరగొన్నవాడను. అయినను నావంటివాడు ఈ విషాదసముద్రములో ఇంత లోతుగా మునిగిపోవుటకు కారణమేమని ఆలోచించితిని.

12. ఇపుడు నేను యెరూషలేమున చేసిన దుష్కార్యములు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నేనచటి దేవాలయము నుండి వెండిబంగారు వస్తువులు దోచుకొంటిని. నిష్కారణముగా యూదయా నివాసులను నాశనము చేయించితిని.

13. కనుకనే ఇప్పుడీ దురదృష్టములెల్ల నన్ను చుట్టుకొనినవి. నేను విచారమనస్కుడనై ఈ పరదేశమున కన్నుమూయనున్నాను” అని చెప్పెను.

14. అంతట ఆ రాజు తనకు నమ్మిన మిత్రుడైన ఫిలిప్పును తన రాజ్యముకు సర్వాధికారిని చేసెను.

15. తన కిరీటమును, రాజవస్త్రమును, ముద్రాంగుళీయకమును ఫిలిప్పునకిచ్చెను. తన కుమారుడు ఐదవ అంటియోకసునకు విద్యాబుద్ధులు నేర్పించి అతడిని రాజుగా తయారుచేయవలెనని చెప్పెను.

16. అతడు అచటనే నూటనలుబది తొమ్మిదవ యేట' ప్రాణములు విడిచెను.

17. రాజు చనిపోయెనని లీసియాసు విని రాజు కుమారుడగు ఐదవ అంటియోకసును తండ్రికి బదులుగా రాజును చేసెను. అతడు అంటియోకసును చిన్న నాటినుండియు పెంచి పెద్దచేసినవాడు. ఇప్పుడతనికి యూపతోరు అని పేరు పెట్టెను.

18. యెరూషలేము దుర్గమున వసించు శత్రువులు దేవాలయ పరిసరములలో యిస్రాయేలీయులను ఇబ్బంది పెట్టసాగిరి. వారు అన్యజాతుల వారికి మద్దతునిచ్చుచు యిస్రాయేలీయులను బాధింపసాగిరి.

19. కనుక యూదా వారిని మట్టుపెట్టగోరి ఆ దుర్గమును ముట్టడించుటకుగాను తన ప్రజలందరిని తోడ్కొని వచ్చెను.

20. వారెల్లరు ప్రోగై నూట ఏబదియవ యేట కోటను ముట్టడించిరి. ప్రాకారము చుట్టును దిబ్బలుపోని గోడలనుకూల్చు యుద్ధమంచెలను అమర్చిరి.

21. కాని దుర్గములోని శత్రువులు కొందరు తప్పించుకొనిపోయిరి. యూదులలో తిరుగుబాటు దారులు కొందరును వారితో చేరిరి.

22. వారెల్లరును రాజువద్దకు పోయి అయ్యా! మా వారికి జరిగిన అపకారములకు ప్రతీకారముచేయక నీవింకను ఎంతకాలము వేచియుందువు?

23. మేము నీ తండ్రిని సేవించి అతని యాజ్ఞలు పాటించితిమి,

24.. కాని దాని వలన మాకేమి లాభము కలిగినది? మా దేశప్రజలే మాకు శత్రువులైరి. వారు మాలో చేజిక్కన వారినెల్ల సంహరించి మా ఆస్తిని దోచుకొనిరి.

25. వారు మాకే గాదు మా పొరుగు జాతులకు గూడ కీడు చేయుచున్నారు.

26. ఈ క్షణముననే వారు" యెరూషలేము దుర్గమును ముట్టడించి దానిని పట్టు కోబోవుచున్నారు. ఇంకనువారు దేవాలయముచుట్టును, బేత్సూరు చుట్టును ప్రాకారములు కూడ కట్టిరి.

27. నీవు వెంటనే చేయిజేసికొననిచో శత్రువులు ఇంకనూ విజృంభింతురు. అప్పుడు వారిని అణచుట సాధ్యము గాదు” అని మొర పెట్టుకొనిరి.

28. ఈ వార్త విని రాజు మండిపడెను. అతడు తన సైన్యాధిపతులను, అశ్వదళాధిపతులను, ఆంతరంగిక మిత్రులను ప్రోగుజేసెను.

29. ఇంకను ఇతర దేశములనుండియు, దీవులనుండియు కూలికి వచ్చు బంటులను గూడ ప్రోగు జేసికొనెను.

30. అతని సైన్యము లక్షమంది పదాతులతోను, ఇరువది వేల మంది రౌతులతోను, యుద్దానుభవముగల ముప్పది రెండు ఏనుగులతోను కూడుకొనియుండెను.

31. రాజు ఆ సైన్యముతో ఇదూమియాగుండ పయనమై వచ్చి బేత్సూరును ముట్టడించెను. చాల రోజులపాటు ముట్టడి కొనసాగెను. వారు గోడలచుట్టు దిబ్బలు పోసిరి. ప్రాకారముల కూల్చు మంచెలను అమర్చిరి. కాని కోటలోని యిస్రాయేలీయులు వెలుపలికి వచ్చి ధైర్యముతో పోరాడిరి. శత్రువులమర్చిన మంచెలను కాల్చివేసిరి.

32. అప్పుడు యూదా యెరూషలేము దుర్గము నుండి తన సైన్యమును తరలించుకొని వచ్చి రాజు సేనలను ఎదిరించుటకు బేత్సెకరియా తావున శిబిరము పన్నెను.

33. మరునాడు ఉదయముననే రాజు తన సేనలను బేత్సెకరియాకు నడిపించుకొనివచ్చెను. వారు ఆ నగరముచెంత బారులుతీరి పోరునకు బాకాలనూదిరి.

34. ఏనుగుల చేత ద్రాక్షపండ్ల రసమును, మల్బరీపండ్ల రసమును త్రాగించి వాటికి మత్తెక్కించిరి.

35. వారు ఏనుగులను పదాతుల దళ ములకు పంచియిచ్చిరి. ఒక్కొక్క ఏనుగువెంట వేయి మంది పదాతులుండిరి. వారికి గొలుసులతో అల్లిన కవచములు, ఇత్తడి శిరస్త్రాణములు ఉండెను. ఒక్కొక్క ఏనుగువెంట ఐదువందలమంది రౌతులుగూడ ఉండిరి.

36. ఈ రౌతులు ఏనుగులు ఎటుబోయిన అటు పోయెడివారు. ఏనుగులను ఎపుడూ వీడెడివారు కాదు.

37. ఏనుగుల పై దృడమైన చెక్క అంబారీలు గట్టిగా కట్టిపెట్టి కప్పబడెను. ఒక్కొక్క ఏనుగుమీద నలుగురు సైనికులు, ఒక మావటిడు ఉండిరి.

38. రౌతులలో మిగిలినవారిని సైన్యమునకు ఇరువైపుల నిలిపిరి. శత్రువులతో పోరాడునపుడు పదాతుల బారులు వారిని సంరక్షించును.

39. అపుడు ఇత్తడితోను, బంగారముతోను చేయబడిన డాళ్ళమీద పడిన సూర్య కాంతి ప్రక్కనున్న కొండల మీద ప్రతిబింబింపగా అచట మంటలు మెరిసినట్లుండెను.

40. రాజు సైన్యములో కొంత భాగము కొండ మీదను, కొంత భాగము క్రిందనుండెను. కాని ఆ సైనికులెల్లరును ధైర్యముగ, క్రమబద్దముగ ముందుకు నడచివచ్చిరి.

41. ఆ మహాసైన్యపు నడక చప్పుడును వారి ఆయుధముల ఒరపిడివలన పుట్టిన మ్రోతను విని ఎల్లరు భయకంపితులైరి.

42. యూదా అతని వీరులు పోరు ప్రారంభించి శత్రుసైనికులను ఆరువందల మందిని చంపిరి.

43. ఏనుగులలో ఒకటి మిగుల పెద్దదిగను, రాజు ఆయుధములను మోయునదిగ కాన్పింపగా 'అవారన్' అను మారు పేరుగల ఎలియాసరు, రాజు దాని మీద కూర్చుండి యున్నాడనుకొనెను.

44. అతడు తన ప్రజలను రక్షించి శాశ్వతమైన కీర్తిని పొందగోరెను. కనుక తన ప్రాణములనే బలిపెట్టెను.

45. ఆ ఏనుగు పదాతుల మధ్య నుండెను. కనుకతడు ధైర్యముతో కాలిబంటుల వరుసలను చీల్చుకొనుచు తన కుడియెడమల నున్న శత్రు సైనికులందరను వధించుచు ముందుకు పోయెను. ఆ వీరుని చూచి శత్రువులు ప్రక్కకు తొలగిరి.

46. అతడు ఒక్కపెట్టున పోయి ఏనుగు క్రింద దూరి దాని పొట్టను కత్తితో పొడిచెను. ఏనుగు ఎలియాసరు మీద కూలిపడగా దానితో పాటు అతడును చనిపోయెను.

47. కాని రాజు సైన్యము మహాబలమైనదనియు, మహాభీకరముగా పోరాడునదనియు గ్రహించి యూదులు వెనుకకు తగ్గిరి.

48. రాజు యెరూషలేము చెంత యుద్ధము నడుపుటకు సైన్యముతో ముందునకు కదలెను. శత్రువులు యెరూషలేమును యూదియాదేశమంతటిని ముట్టడించిరి.

49. రాజు బేత్సూరులోని యూదులతో సంధి చేసికొనగా వారు పట్టణమును విడిచి వెళ్ళిపోయిరి. శత్రువుల నెదిరించి పోరాడుటకు వలసినంత తిండి వారికి ఆ నగరమున దొరకదయ్యెను. అది విశ్రాంతి సంవత్సరము కనుక పంటలు లేవు.

50. రాజు బేత్సూరును ఆక్రమించుకొని దానిని కాపాడుటకుగాను అచట ఒక సైనికదళమును ఉంచెను.

51. అటు తరువాత అతడు యెరూషలేము దేవాలయమును ముట్టడించి చాలకాలము పోరు కొనసాగించెను. ప్రాకారము చుట్టు బల్లకట్టులను కట్టి, గోడలను కూల్చు మరలను, రాళ్ళను, నిప్పులను రువ్వు యంత్రములను, ఈటెలను, బండలను విసరు పరికరములను అమర్చెను.

52. కాని యూదులు తమ పరికరములను తయారుచేసికొనివచ్చి శత్రు పరికరములను వమ్ము జేసిరి. కనుక యుద్ధము చాలకాలము కొనసాగెను.

53. అది విశ్రాంతి వత్సరము కనుక దేవాలయపు కొట్లలో భోజన పదార్థములు లభింపవయ్యెను. అన్యదేశముల నుండి వచ్చి యూదయాలో తలదాచు కొనిన యూదులు నిల్వయున్న భోజన పదార్ధముల నెల్ల అప్పటికే వినియోగించుకొనిరి.

54. కరువు దారుణముగా ఉండుటచే యిస్రాయేలీయులు చాలమంది తమ యిండ్లకు వెళ్ళిపోయిరి. కొద్దిమంది మాత్రము దేవళమున మిగిలియుండిరి.

55. అంటియోకసు తాను చనిపోకముందు తన కుమారుని రాజును చేయుటకు ఫిలిప్పును నియమించెనుగదా!

56. అతడు పారశీక మాదియా దేశములనుండి రాజు సైన్యములతో తిరిగివచ్చి రాజ్యమును హస్తగతము చేసికోబోయెను.

57. ఆ సంగతి విని లీసియాసు వెంటనే వెనుకకు తిరిగిపోవలెనని నిశ్చయించుకొనెను. కనుక అతడు తన రాజుతోను, సైన్యాధిపతులతోను, సైనికులతోను “మనము నానాటికి బలహీనులమై పోవుచున్నాము. ఇచట తినుటకు వలసినంత తిండి దొరకుటలేదు. ఈ ప్రదేశమందునూ అభేద్యముగానున్నది. మన దేశమునందలి రాజకీయ పరిస్థితులన్ననో అదుపు తప్పుచున్నవి.

58. కావున మనము ఈ ప్రజలతోను, వీరి జాతియంతటితోను సంధి చేసికొందము.

59. వీరు పూర్వమునుండి పాటించుచువచ్చిన ఆచారములను పాటించుటకు సమ్మతింతము. మనము వారి యూద ఆచారములకు అడ్డువచ్చుట వలననే ఈ కలహములన్నియు ప్రారంభమైనవి” అనెను.

60. రాజు, అతని సైన్యాధిపతులు లీసియాసు సూచన నంగీకరించిరి. కనుక లీసియాసు సంధి సూత్రములను వివరింపగా యూదులు వెంటనే ఒప్పుకొనిరి.

61. రాజును, అతని సైన్యాధిపతులును సంధి సూత్రములను పాటింతుమని ప్రమాణపూర్వ కముగా ఒప్పుకొనినందున యూదులుతమ దుర్గమును వీడి వెలుపలికి వచ్చిరి.

62. కాని తరువాత రాజు సియోను దుర్గమును ప్రవేశించి అది అభేద్యముగా నుండుట గమనించి దాని ప్రాకారములను పడగొట్టించెను. ఆ రీతిగా అతడు తన ప్రమాణమును భంగము చేసికొనెను.

63. తరువాత అతడు త్వరత్వరగా అంతియోకియాకు మరలిపోయెను. అప్పటికే ఫిలిప్పు ఆ నగరమును స్వాధీనము చేసికొనియుండెను. కాని రాజు పట్టణమును ముట్టడించి బలవంతముగా తిరిగి స్వాధీనపరచుకొనెను.

 1. నూట ఏబది ఒకటవ యేట సెల్యూకసు కుమారుడగు దెమేత్రియసు రోము నుండి తప్పించు కొనెను. అతడు కొద్దిమంది అనుచరులతో మధ్యధరా సముద్రతీరము నందలి ఒకపట్టణము చేరుకొని అచట తనను తాను రాజుగా ప్రకటించుకొనెను,

2. ఒకమారు అతడు తన పూర్వుల రాజభవనమునకు వెళ్ళుచుండగా అతని సైనికులు లీసియాసును, అంతియోకసును బంధించి వారిని అతని ఎదుటికి తీసికొనిరాగోరిరి.

3. కాని దెమేత్రియసు “నేను వారి మొగము చూడ దలుచుకోలేదు” అనెను.

4. కనుక సైనికులే వారిని వధింపగా దెమేత్రియసు సింహాసనమును ఆక్రమించు కొనెను.

5. అప్పుడు యిస్రాయేలీయులలోని దుర్మా ర్డులును, భక్తిహీనులునైన ప్రజలు కొందరు అల్కిమోసు నాయకత్వము క్రింద ప్రోగై దెమేత్రియసును చూడవచ్చిరి. ఈ అల్కిమోసునకు ప్రధాన యాజకుడు కావలయునన్న కోర్కె మిక్కుటముగా నుండెను.

6. వారు మిగిలిన యూదులమీద నేరము మోపుచు "అయ్యా! యూదా అతని సోదరులు నీకు మద్దతు ఇచ్చిన వారినెల్ల సంహరించిరి. వారు మమ్ము మా దేశమునుండి వెడలగొట్టిరి.

7. ఇప్పుడు నీకిష్టమైన ఉద్యోగిని ఒకనిని మా దేశమునకు పంపుము. యూదా మా ఆస్తిపాస్తులను, నీ మండలముల నెట్లు నాశనము చేసెనో అతడే పరిశీలించి చూడగలడు. ఆ సోదరులను వారికి తోడ్పడినవారిని అతడే శిక్షించును” అని చెప్పిరి.

8. రాజు యూఫ్రటీసునదికి ఆవలి మండలములకు అధిపతియు, తనకు మిత్రుడగు బఖిడసు అనునతని పనికి ఎన్నుకొనెను. అతడు రాజుకు నమ్మిన బంటు, ఆ రాజ్యమున ముఖ్యుడు.

9. దెమేత్రియసు భక్తిహీనుడైన అల్కిమోసును ప్రధానయాజకునిగా నియమించి, బఖిడసుతో పాటు అతనిని కూడ యూదియాకు పంపెను. అల్కిమోసు యూదులమీద పగతీర్చుకొనుటకు అధికారము కూడ పొందెను.

10. ఆ ఇరువురు పెద్ద సైన్యముతో వచ్చి యూదయాను చేరుకొనిరి. బఖిడసు 'మనము సంధిచేసికొందము రండు' అని వంచనతో యూదాయొద్దకును, అతని సోదరుల వద్దకును దూతలను పంపెను.

11. కాని అతడు పెద్ద సైన్యముతో వచ్చినందున ఆ సోదరులతని మాటలు నమ్మరైరి.

12. అయినను కొందరు ధర్మ శాస్త్ర బోధకులు బఖిడసును, అల్కిమోసును కలిసికొని న్యాయసమ్మతమైన సంధి సూత్రములను గూర్చి చర్చ జరుపుటకు వచ్చిరి.

13. సంధి కొరకు వారిని మొదట సందర్శించిన వారు హాసిదీయులను భక్తబృందము.

14. వారు “అల్కిమోసు అహరోను తెగకు చెందిన యాజకుడు. కనుక అతడు సేనలతో వచ్చినను తమకెట్టి హానియు తలపెట్టడులే” అని అనుకొనిరి.

15. అల్కిమోసుగూడ తాను సంధి చేసికొనుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. “హాసిదీయులకుగాని, వారి మిత్రులకుగాని ఎట్టి కీడును తలపెట్టను”అని బాసచేసెను.

16. అందుచేత వారు అతనియందు నమ్మకముంచిరి. కాని అతడు వారిని నమ్మించి వారిలో అరువదిమందిని ఒక్కరోజుననే మట్టు పెట్టించెను.

17. ఆ రీతిగా “వారు నీ భక్తుల నెత్తురు చిందించిరి. వారి శవములు యెరూషలేము చుట్టు కుప్పలుపడి ఉన్నవి. వానిని ఖననము చేయు దిక్కు కూడ లేదయ్యెను” అను దైవవాక్యము నెరవేరెను.

18. ఈ సంఘటనను చూచి ప్రజలెల్లరును మిగుల వెరగొంది. “అల్కిమోసు, బఖిడసు సత్యమునుగాని, ధర్మమునుగాని పాటించువారుకాదు. వారు ప్రమాణము చేసియు మాట నిలబెట్టుకోరైరి” అని అనిరి.

19. అంతట బఖిడసు యెరూషలేమునుండి వెడలిపోయి బేత్సయితున విడిదిచేసెను. అతడు భక్తులగు యూదులను తన పక్షమును అవలంబించిన తిరుగుబాటు యూదులను గూడ బంధించి వధించెను. వారి శవములను పెద్దగుంతలో త్రోయించెను.

20. తరువాత అతడు అల్కిమోసును యూదయాకు అధిపతిని చేసి అతనికి సహాయము చేయుటకు సైన్యమును నియమించి తాను రాజునొద్దకు వెడలిపోయెను.

21. అల్కిమోసు ప్రధాన యాజకుడుగా తన పదవిని సుస్థిరము చేసికొనుటకుగాను నానా ప్రయత్నములు చేసెను.

22. దేశములో శాంతిని భంగపరచు తిరుగుబాటుదారులందరును అతనితో చేరిపోయిరి. వారు యూదయా అంతటిని ఆక్రమించుకొని, యూదులను ముప్పుతిప్పలు పెట్టిరి.

23. అల్కిమోసు అతని అనుచరులు అన్యజాతి వారికంటెగూడ అదనముగా దేశమునకు కీడు చేయుచున్నారని యూదా గ్రహించెను.

24. కనుక అతడు యూదయాయంతట సంచరించి అల్కిమోసు పక్షమును అవలంబించిన వారికి ప్రతీకారము చేసెను. వారిని పట్టణములలోనుండి పల్లెలకు పోనీయకుండ ఆటంకము కలిగించెను.

25. యూదా అతని అనుచరులు బలవంతులగు చున్నారనియు, వారినెదిరించు శక్తి తనకు లేదనియు అల్కిమోసు గ్రహించెను. కనుక అతడు రాజునొద్దకు పోయి వారిమీద పెద్ద నేరములు మోపెను.

26. రాజు తన సైన్యాధిపతులలో ప్రసిద్ధుడును, యూదులకు బద్ధవైరియునగు నికానోరును యూదయాకు పంపెను. యూదులను మొదలంట తుడిచివేయవలె ననియు ఆజ్ఞ ఇచ్చెను.

27. అతడు పెద్ద సైన్యముతో యెరూషలేము చేరుకొని కపటబుద్దితో 'మనము సంధి చేసికొందము రండు' అని యూదాకు అతని సోదరులకు కబురు పంపెను.

28. “మీకును నాకును జగడమేల? నేను చిన్న సైనికదళమును వెంట పెట్టుకొని మీవద్దకు వత్తును. మీతో స్నేహపూర్వ కముగా మాటలాడుదును” అని చెప్పెను.

29. అతడు తాను చెప్పినట్లే వచ్చి యూదాను కలిసికొనెను. వారిరువురు స్నేహపూర్వకముగా పలుకరించుకొనిరి. అయినను అతని పక్షమువారు యూదాను పట్టుకొని పోవుటకు సన్నద్ధులైరి.

30. నికానోరు ద్రోహబుద్దితో తన చెంతకు వచ్చెనని గ్రహించి యూదా భయపడెను. కనుక అతడు నికానోరును మరలకలిసికొనలేదు.

31. శత్రు సైన్యాధిపతి తనగుట్టు బయటపడినదని తెలిసికొని యెరూషలేము నుండి వెడలిపోయెను. అతడు కఫర్సలమవద్ద యుద్ధరంగమున యూదాను కలిసి కొనెను.

32. ఆ రణమున శత్రు సైనికులు ఐదు వందలమంది మడిసిరి. మిగిలినవారు యెరూషలేము దుర్గమునకు పారిపోయి దాగుకొనిరి.

33. తరువాత నికానోరు సియోనుకొండకు వెళ్ళెను. యాజకులు, పెద్దలు ఎదురు వచ్చి అతనికి స్వాగతము చెప్పిరి. తాము రాజు శ్రేయస్సుకొరకు అర్పించుచున్న దహనబలిని దర్శించుటకు అతనిని ఆహ్వానించిరి.

34. కాని అతడు వారిని ఎగతాళి చేసెను. వారి మీద ఉమ్మివేసి వారిని మైలపరచెను. గర్వముగా మాటలాడెను.

35. “మీరు యూదాను అతని సైన్యమును వెంటనే నా చేతికి అప్పగింపలేని నేను యుద్ధమున విజయమును చేపట్టి తిరిగివచ్చిన తరువాత ఈ దేవళమును నిలువున కాల్చివేసెదను” అని రౌద్రముగా ప్రతిజ్ఞ చేసి నిప్పులు క్రక్కుచు వెళ్ళిపోయెను.

36. అంతట యాజకులు తిరిగిపోయి పీఠమునకును, దేవాలయమునకును అభిముఖముగా నిలచి కన్నీరు కార్చుచు,

37. "ప్రభూ! నీవు ఈ దేవాలయము నీ నామమున వెలయునట్లు చేసితివి. ఇచట నీ ప్రజలు ప్రార్థనలు అర్పింపవలెనని నిర్ణయించితివి.

38.నీవు ఈ దుండగుని,ఇతని సైన్యమును శిక్షింపుము. వీరు కత్తి వాతబడునట్లు చేయుము. వీరు నిన్నెట్లు దూషించిరో జ్ఞప్తికి తెచ్చుకొనుము. వీరిలో ఒక్కని గూడ మిగులనీయకుము” అని మనవి చేసిరి.

39. నికానోరు యెరూషలేమునుండి వెడలిపోయి బేత్హోరోనున దండు విడిసెను. అచట సిరియా నుండి వచ్చిన క్రొత్త దండుకూడ అతని సైన్యమున చేరెను.

40. యూదా మూడు వేలమందితో అడాస వద్ద శిబిరము పన్నెను.

41. అతడు "ప్రభూ! పూర్వము అస్సిరియా రాజుదూతలు నిన్నుదూషింపగా నీ దేవదూత వెళ్ళి వారి సైనికులనునూట ఏనుబది ఐదువేలమందిని సంహరించెను.

42. ఆ రీతినే నీవు నేడు ఈ సైన్యమునుకూడ మట్టు పెట్టుము. అప్పుడు నీ దేవాలయమును అవమానించినందుకుగాను నికానోరు శిక్షను అనుభవించెనని ఎల్లరును గ్రహింతురు. అతని దుష్టత్వమునకు తగినట్లుగా అతనిని శిక్షింపుము” అని ప్రార్థించెను.

43. అదారు నెల పదమూడవ దినమున ఉభయ సైన్యములు తారసిల్లి పోరు జరుపగా శత్రుసైన్యములు పరాజయమునొందెను. అందరి కంటె ముందుగా నికానోరే ప్రాణములు కోల్పోయెను.

44. అతని సైనికులు తమ నాయకుడు కూలుటను చూచి ఆయుధములు విసరివేసి పారిపోయిరి.

45.యూదులు వారిని అడాసనుండి గేసేరు వరకును దినము పొడుగున తరిమికొట్టిరి. వారు బాకాలనూదుచు శత్రువులను వెన్నాడిరి.

46. ఆ మ్రోత విని చుట్టుపట్లగల యూదయా గ్రామముల నుండి ప్రజలు ప్రోగై వచ్చి పారిపోవు శత్రువులను అడ్డగించిరి. కనుక వారు వెనుకకు మరలి తమను వెన్నాడు యూదులవైపు పరుగెత్తిరి. యూద సైనికులు శత్రువులనొక్కరిని కూడ తప్పించుకోనీకుండ ఎల్లరిని కత్తివాతకు ఎరజేసిరి.

47. యిస్రాయేలీయులు శత్రువులనుండి కొల్లసొమ్ము ప్రోగుజేసికొనిరి. నికానోరు తలను అతడంత దర్పముతో ఎత్తి చూపిన కుడిచేతిని తెగనరికిరి. ఎల్లరును చూచుటకు గాను వానిని యెరూషలేమునకు కొనిపోయిరి.

48. ప్రజలు అమితానందము చెంది ఆ దినము గొప్ప ఉత్సవము చేసికొనిరి.

49. ఏటేటా అదారు నెల పదమూడవ దినము ఉత్సవము చేసికోవలెనని శాసనము చేసిరి,

50. అటుతరువాత కొంతకాలముపాటు యూదయా దేశమున శాంతి నెలకొనెను.

 1. యూదా రోమీయులను గూర్చియు, వారి సైన్యములను గూర్చియు, వారు తమ పక్షమున చేరిన వారిని ఆదరముతో అంగీకరించి స్నేహము నెరపిన విధానమును,

2. వారి యుద్ధములను గూర్చి వినెను. వారు గాలు దేశీయులను జయించి వారిచేత కప్పములు కట్టించుకొనిరనియు తెలిసికొనెను.

3. ఇంకను స్పానియా దేశమునగల వెండి బంగారు గనులను స్వాధీనము చేసికొనుటకుగాను రోమీయులు అచటే మేమి చేసినది వినెను.

4. స్పానియా రోముకు చాల దూరముననున్నను వారు జాగ్రత్తతో పట్టుదలతో కృషి చేసి ఆ దేశమునంతటిని వశముచేసికొనిరి. దూర ప్రాంతములనుండి వచ్చిన రాజులు వారితో పోరాడి పూర్తిగా ఓడిపోయిరి. కొందరు ఏటేట కప్పములు కూడ కట్టవలసివచ్చెను.

5. వారు ఫిలిప్పును, మాసిడోనియా రాజు పెర్సెయసును, ఆ రాజు పక్షమును అవలంబించిన ఇతర రాజులను ఓడించిరి.

6. ఆసియా రాజు ఘనుడునగు అంటియోకసు నూటయిరువది ఏనుగులతోను, రౌతులతోను, రథములతోను, పెద్ద పదాతి దళములతోను దండెత్తి రాగా రోమీయులు అతనిని గూడ జయించిరి.

7. వారు అతనిని సజీవునిగా పట్టుకొనిరి. అతను, అతని అనుయాయులు పెద్ద కప్పములు కట్టవలెనని, బందీలను అప్పగించవలెనని శాసనము చేసిరి.

8. అతని సామ్రాజ్యమునుండి హిందూదేశము, మేదియా, లిదియా దేశములను మరియు కొన్ని సారవంతమైన భూములను తీసికొని యుమేనిసు రాజునకు బహుమతిగా ఇచ్చిరి.

9. గ్రీకులు రోమీయుల మీదికి దండెత్తి వారిని నాశనము చేయవలెనని సంకల్పించుకొనిరి.

10. కాని రోమీయులు ఆ సంగతి విని తమ సైన్యాధిపతిని గ్రీకుల మీదికి పంపిరి. వారు గ్రీకులను జయించి చాలమందిని వధించిరి. వారి భార్యలను, పిల్లలను చెరకొనిరి. వారి సొత్తును దోచుకొని భూములను ఆక్రమించుకొని కోటలను పడగొట్టిరి. నేటివరకును వారిని బానిసత్వమున నుంచిరి.

11. వారు తమను ఎదిరించిన రాజ్యములను, ద్వీపములను జయించి అచటి ప్రజలను కొందరిని నాశనము చేసిరి, మరికొందరిని బానిసలను చేసిరి.

12. కాని రోమీయులు తమ పక్షమును అవలంబించిన వారితోను, తమ సహాయమును అర్థించిన వారితోను ఎప్పుడును స్నేహ పూర్వకముగనే ప్రవర్తించిరి. వారు దగ్గరగాను, దూరముగాను ఉన్న రాజులను జయించిరి. ఆ ప్రజల కీర్తిని వినినవారెల్ల వారిని చూచి భయపడిరి,

13. వారు, సాయము చేసినవారు సింహాసనములు ఆక్రమించు కొనిరి. వారు ఎదిరించినవారు సింహాసనములు కోల్పోయిరి. వారి ప్రభావమంత గొప్పది.

14. అయినను ఇంతవరకు ఏ రోమీయుడుకాని రాజ వస్త్రములను తాల్చి, కిరీటమును ధరించి అహంభావమును ప్రకటింపవలెను అనుకోలేదు.

15. వారికొక రాజ్యసభ కలదు. దాని సభ్యులు 320 మంది. దినదినము సమావేశమై రాజ్య శ్రేయస్సును గూర్చి చర్చింతురు.

16. వారు ఏటేట ఒక్కవ్యక్తిని నియమింపగా అతడు సర్వాధికారములతో వారి రాజ్యమునంతటిని పర్యవేక్షించును. అసూయకు గురికాకుండ ఎల్లరును అతనికి పూర్ణముగా విధేయులగుదురు. ఇవి యూదా వినిన సంగతులు.

17. యూదా అక్కోసు మనుమడును, యోహాను కుమారుడునగు యూపోలెమసును, ఎలియాసరు కుమారుడగు యాసోనును దూతలుగా ఎన్నుకొని రోమీయులతో స్నేహపూర్వకముగా సంధి చేసి కొనుటకు గాను వారిని రోమునకు పంపెను.

18. గ్రీకులు యూదులను బానిసలను చేయగోరిరి. ఇప్పుడు రోమీయుల వలన యూదులకు విముక్తి కలుగునని యూదా తలచెను.

19. ఆ దూతలు దీర్ఘకాలము ప్రయాణము చేసి రోము చేరుకొని వారి రాజ్యసభ ప్రవేశించి ఇట్లు పలికిరి:

20. “యూదా మక్కబీయుడు, అతని సోదరులు, యూదులు మీతో స్నేహపూర్వకమైన సంధి చేసికొనుటకుగాను మమ్మిచటికి పంపిరి. ఇకమీదట మీరు మమ్ము మీ పక్షమువారిగా, స్నేహితులుగా పరిగణింపగోరెదము.”

21. రాజ్యసభసభ్యులు వారి వేడుకోలును అంగీకరించిరి.

22. రోమీయులు ఈ క్రింది లేఖను ఇత్తడి రేకులమీద వ్రాయించి యెరూషలేమునకు పంపిరి. రోమీయులు యూదులతో చేసికొనిన సంధికి తార్కాణముగా ఆ లేఖను యెరూషలేమున పదిలపరుపవలెనని చెప్పిరి.

23. “రోమీయులకును, యూదులకును భూమి మీదను, సముద్రము మీదను కూడ ఎల్లకాలమును కార్యములు శుభప్రదముగా జరుగునుగాక! వారికి శత్రుభయము పొసగకుండునుగాక!

24-25. అయినను రోమీయుల మీదగాని, వారి పక్షమును అవలంబించిన వారి మీదగాని ఎచటైన యుద్ధము ఆసన్నమయ్యెనేని, అవసరమును బట్టి యూదులు పూర్ణ హృదయముతో వారిని ఆదుకొనుటకు రావలయును.

26. రోమీయుల మీదికి యుద్ధమునకు వచ్చువారికి యూదులు ఆహారపదార్థములు, ఆయుధములు, ధనము, ఓడలు, సరఫరా చేయరాదు. ఇది రోము చేసిన నిర్ణయము. రోమీయులకు. మద్దతు ఇచ్చినందుకుగాను యూదులు ఏమి ప్రతిఫలము ఆశింప రాదు.

27. ఈ రీతిగనే యూదుల మీదికి ఎవరైన దండెత్తి వచ్చినచో అవసరమును బట్టి రోమీయులు పూర్ణహృదయముతో వారిని ఆదుకొనుటకు రావలయును.

28. యూదుల శత్రువులకు రోమీయులు ఆహార పదార్థములు, ఆయుధములు, ధనము, ఓడలు సరఫరా చేయరాదు. ఇది రోము చేసిన నిర్ణయము. రోమీయులు వంచనలేకుండ ఈ షరతులన్ని పాటింపవలయును.

29. రోమీయులు యూదులతో చేసికొనిన సంధి షరతులివి:

30. భవిష్యత్తులో ఈ ఉభయ వర్గముల వారు పై నియమములలో కొన్నిటిని తొలగింపవలెననిగాని లేదా మరికొన్నిటిని చేర్చవలెననిగాని కోరుకొనినచో అట్లే చేయవచ్చును. వారు చేసిన చేర్పులు మార్పులు కూడ పాటింపవలసినవి అగును.

31. దెమేత్రియసు యూదులకు చేసిన అపకారములను పురస్కరించుకొని మేమతనికి ఇట్లు వ్రాసితిమి: 'నీవు, మా పక్షమువారైన మా స్నేహితులైన యూదులతో అంత క్రూరముగా ఏల ప్రవర్తించుచున్నావు?

32. వారు మా సమక్షమున నీ మీద మరల నేరము తెత్తురేని మేము వారి పక్షమును అవలంబింతుము. భూమి మీదను, సముద్రము మీదను నీతో యుద్ధము చేయుదుము.”

 1. నికానోరు, అతని సైన్యము సర్వనాశనమయ్యెనని దెమేత్రియసు వినెను. అతడు బఖిడసును ఆల్కిమోసును రెండవసారి యూదయాకు పంపెను. వారివెంట సిరియా సైన్యమును గూడపంపెను.

2. వారు గిల్గాలు మార్గముగుండ ప్రయాణము చేసి అర్బేలా మండలములోని మెసాలోతును ముట్టడించిరి. ఆ నగరమును జయించి చాలమంది ప్రజలను వధించిరి.

3. వారు నూట ఏబది రెండవయేటి మొదటి నెలలో యెరూషలేమునెదుట దండు విడిసిరి.

4. అచటినుండి రెండు వేల మంది పదాతులతోను, రెండువేల మంది ఆశ్వికులతోను బెరెయాకు వెళ్ళిరి.

5. అపుడు యూదా మూడువేల మంది వీరులతో ఎలాస శిబిరమున నుండెను.

6. కాని అతడి సైనికులు బ్రహ్మాండమైన శత్రుసైన్యమును చూచి భయపడి శిబిరము నుండి పారిపోయిరి. కడకు ఎనిమిది వందల మంది మాత్రము మిగిలియుండిరి.

7. ఆ రీతిగా తన సైన్యము తగ్గిపోవుటయు, యుద్ధమాసన్న మగుటయు చూచి యూదా విచార మనస్కుడయ్యెను. తన సైన్యమునంతటిని ప్రోగుజేయుటకు అతనికి కాలవ్యవధి లేదు.

8. అట్లు నిరుత్సాహముచెంది కూడ అతడు తన అనుచరులతో “మనము యుద్ధము చేయుదము. బహుశ మనమే విజయము పొందవచ్చును” అనెను.

9. కాని యూదా అనుచరులు అతనిని వారించుచు “ఇప్పుడు మనకు బలము చాలదు. కనుక ప్రస్తుతము రణము నుండి వైదొలగి ప్రాణములు కాపాడుకొందము. తరువాత మనవారిని ప్రోగుచేసికొనివచ్చి శత్రువులను ఎదిరింపవచ్చును. ఇప్పుడు మన పక్షమున ఎక్కువ మందిలేరు” అని చెప్పిరి.

10. యూదా "నేను యుద్ధము నుండి పారిపోవుట మాత్రము ఎన్నడును జరుగదు. మనకాలము వచ్చెనేని మన ప్రజల కొరకు ధైర్యముతో ప్రాణములు అర్పింతము. మన కీర్తికి మాత్రము కళంకము కలుగకూడదు” అని అనెను.

11. అంతట బఖిడసు సేనలు శిబిరమునుండి వెలుపలికి వచ్చి యూదులతో పోరునకు తలపడిరి. వారి అశ్వబలము రెండు దళములుగా విభాగింపబడెను. విల్లమ్ములను, ఒడిసెలను వాడువారు సైన్యమునకు ముందుండిరి. ప్రత్యేకముగా ఎన్నుకొనబడిన వీరులు వారికి ముందట మొదటి వరుసలలో ఉండిరి.

12. బఖిడసు కుడివైపుననుండెను. అంతట ఇరువైపుల నుండి అశ్వికులు కదలిరాగా పదాతిదళము ముందుకు వచ్చి బాకాలనూదెను. యూదా సైనికులును కూడ బాకాలనూదిరి.

13. ఉభయ సైన్యములు తారసిల్లి పోరు ప్రారంభింపగా రణధ్వనివలన భూమి దద్దరిల్లెను. ఉదయమునుండి సాయంకాలము వరకును పోరు జరిగెను.

14. సిరియా సైన్యమున బలాడ్యులైనవారును బఖిడసును కుడిప్రక్కన ఉన్నారని యూదా గుర్తించెను. బఖిడసు వీరులందరును అతని దాపుననే నిలిచియుండిరి.

15. కనుక యూదాబృందము కుడి ప్రక్కన నున్న సిరియనుల బృందము మీద పడెను. దానిని చిందరవందర చేసి కొండల అంచులవరకు తరిమికొట్టెను.

16. కాని ఎడమప్రక్కననున్న సిరియనులు కుడిప్రక్కన నున్న తమనైనికులు ఓడిపోవుచున్నారని గ్రహించిరి. వారు వెనుక తట్టునుండి వచ్చి యూదాబృందము మీదపడిరి.

17. పోరు ఘోరముగా జరిగెను. ఇరుప్రక్కల చాల మంది కూలిరి.

18. కడన యూదాకూడ ప్రాణములు కోల్పోయెను. అతని అనుచరులు పారిపోయిరి.

19. యోనాతాను, సీమోను వారి సోదరుడు యూదా శవమును కొనిపోయి మోదెయీనునందలి తమ పితరుల సమాధిలోనే పాతిపెట్టిరి.

20. యిస్రాయేలీయులందరు అతని మృతికి చాలనాళ్ల పాటు సంతాపముచెందిరి.

21. వారు “యిస్రాయేలీయులను రక్షించిన ఈ వీరుడు ఎట్లు కూలెనోగదా!" అని విలపించిరి.

22. యూదా చేసిన యితర కార్యములు, అతని యుద్ధములు, వీరకృత్యములు, విజయములు చాలకలవు. వానినన్నిటిని ఇచట లిఖింపలేదు.

23. యూదా చనిపోయిన తరువాత యూదయాలోని తిరుగుబాటుదారులు మరల తలఎత్తుకొని తిరుగ మొదలిడిరి. దుర్మార్గులెల్లరును వారితో చేతులు కలిపిరి.

24. అప్పుడు దేశమున దారుణమైన కరువు తాండవించెను. ప్రజలెల్లరును తిరుగుబాటుదారుల పక్షమును అవలంభించిరి.

25. బఖిడసు బుద్ది పూర్వకముగనే తిరుగుబాటుదారులను కొందరిని దేశ మునకు అధికారులనుగా నియమించెను.

26. వారు యూదా మిత్రులనెల్ల గాలించి బఖిడసు నొద్దకు తీసికొనివచ్చిరి. అతడు వారిని బాధించి అవమానపరచెను.

27. యిస్రాయేలీయులెల్లరును హింసల పాలైరి. ప్రవక్తలు కనుమరుగైపోయిన తరువాత దేశమున కిట్టి తిప్పలు ఎన్నడును రాలేదు.

28-29. అపుడు యూదా మిత్రులెల్లరు ప్రోగై యోనాతాను వద్దకు వచ్చి "అయ్యా! నీ సోదరుడు యూదా గతించినప్పటి నుండియు శత్రువులను ఎదిరించుటకు మాకు నాయకుడు దొరకలేదు. బఖిడసుతోను, మనజాతినుండే మనలను ఎదిరించు వారితోను పోరాడుటకు నాయకుడెవడును లేడు.

30. కనుక మేము నేడు యూదాకు బదులుగా నిన్ను నాయకునిగా ఎన్నుకొంటిమి. నీవు మాకు పాలకుడవుగా, సైన్యాధిపతిగాయుండి మా పోరాటములను నడిపింపుము” అని అనిరి.

31. ఆనాటినుండి యూదాకు బదులుగా యోనాతాను ప్రజలకు నాయకుడయ్యెను.

32. బఖిడసు యోనాతాను నాయకుడయ్యెనని విని అతడిని చంపుటకు ఉద్యమించెను.

33. కాని ఆ సంగతిని తెలిసికొని యోనాతాను తన సోదరుడగు సీమోనుతోను, అనుచరులతోను తెకోవా ఎడారికి పారిపోయి అస్పారు కోనేటివద్ద విడిది చేసెను.

34. బఖిడసు విశ్రాంతిదినమున ఈ ఉదంతము తెలిసి కొనెను. అతడు సర్వసైన్యముతో పోయి యోర్డాను నదిని దాటెను.

35. యోనాతాను సోదరుడగు యోహాను సైనికుల కుటుంబములకు పెద్దగా నుండెను. నబతీయులు యోనాతానునకు మిత్రులు. కనుక అతడు తన పక్షము వారి సామానులను నబతీయులయొద్ద దాచిపెట్ట గోరి యోహానును వారి చెంతకు పంపెను.

36. కాని యాంబ్రి వంశస్తులైన మేడెబా నగరవాసులు యోహాను మీద దాడిచేసి అతడిని వధించి సామానులన్నిటిని దోచుకొనిపోయిరి.

37. అటుతరువాత కొన్నాళ్ళకు యాంబ్రి వంశస్థుల తెగలో పెద్ద పెండ్లి ఒకటి జరుగనున్నదని యోనాతాను సీమోను వినిరి. పెండ్లి కుమార్తె కనాను దొరలలో ఒకని కూతురు. ఆమెను నదబతు నగరమునుండి మేళతాళములతో ఊరేగించుచు కొనిరానుండిరి.

38. యోనాతాను సీమోను తమ సోదరుని హత్యకు ప్రతీకారము చేయగోరిరి. కనుక వారు తమ అనుచరులతో పోయి ఒక కొండమీద దాగుకొని యుండిరి.

39. వారు అట్లు పొంచియుండగా జనసమూహము కోలాహలము చేయుచు వస్తు సామగ్రిని మోసికొనుచువచ్చుచుండెను. పెండ్లి కుమారుడు అతని స్నేహితులు బంధువులు వధువునకు ఎదురేగుచుండిరి. వారు ఆయుధములు తాల్చి సితారలు, డప్పులు వాయించుచు పోవుచుండిరి.

40. అప్పుడు పొదలలో దాగియున్న యూదులు హఠాత్తుగా శత్రువుల మీద పడి చాలమందిని మట్టు పెట్టిరి. మిగిలిన వారు కొండలకు పారిపోయిరి. యూదులు వారి సామగ్రినంతటిని దోచుకొనిరి.

41. ఆ రీతిగా వారి పెండ్లి పండుగ ఏడ్పులతో నిండిపోయెను. వారి సంగీతము శోకగీతమయ్యెను.

42. అట్లు యోనాతాను, సీమోను తమ సోదరుని హత్యకు ప్రతీకారము చేసిన పిదప యోర్దాను తీరమునందలి బురదనేలలకు తిరిగి వచ్చిరి.

43. ఈ సంగతిని విని బఖిడసు పెద్ద సైన్యమును వెంటబెట్టుకొని విశ్రాంతిదినమున యోర్దాను నదీ తీరముకు వచ్చెను.

44. యోనాతాను తన బృందముతో “మనము ప్రాణములకు తెగించి పోరాడ వలయును. ఇప్పుడు మనమేనాడును లేని అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాము.

45. మనకు ముందు శత్రువులున్నారు. వెనుక నది ఉన్నది. ఇరుప్రక్కల బురద గుంటలు, అడవులున్నవి. ఇక మనము ఏ ప్రక్కనుండియు తప్పించుకొనుటకు వీలులేదు.

46. కనుక శత్రువులనుండి మనలను కాపాడుమని దేవునికి మనవిచేయుడు” అనెను.

47. అంతట పోరు మొదలయ్యెను. యోనాతాను బఖిడసును పడగొట్టెడివాడేగాని అతడు తప్పించుకొని దండు వెనుకకు పోయెను.

48. యోనాతాను అతడి సైనికులు నదిలోనికి దూకి అవతలి గట్టుకు ఈదిరి. విరోధులు వారి వెంటబడను లేదు. నదిని దాటను లేదు.

49. ఆ దినము బఖిడసు సైనికులలో వేయిమంది కూలిరి.

50. బఖిడసు యెరూషలేమునకు వెళ్ళిన తరువాత యూదయాలోని చాల పట్టణములలో కోటలు కట్టించెను. ఎత్తయిన ప్రాకారములు, గడెలతో బిగించు ద్వారములను, యెరికో, ఎమ్మావు, బేతోరోను, బేతేలు, తిమ్నాతు, ఫరతోను, తేఫోను పట్టణములలో నిర్మించెను.

51. అతడు యూదులను అణచియుంచుటకుగాను ఈ పట్టణములలో సైన్యములను గూడ ఉంచెను.

52. ఇంకను బెత్సురు, గాసేరు నగరములలోని కోటలను, యెరూషలేము కోటను గూడ బలపరచెను. వానిలో సైన్యములనుంచి ఆహారపదార్థములను నిల్వ జేయించెను.

53. దేశములోని ప్రముఖుల కుమారులను, బందీలనుజేసి వారిని యెరూషలేము దుర్గమున బంధించెను.

54. నూటయేబది మూడవయేడు రెండవ నెలలో అల్కిమోసు దేవాలయము అంతర్భాగములోని గోడను పడగొట్టవలెనని ఆజ్ఞయిచ్చెను. దానిని పడగొట్టినచో ప్రవక్తల కృషియంతయు వ్యర్థమయ్యె డిదే. కాని ఆ గోడను కూల్చివేయుటకు ఉపక్రమింప గానే,

55. అల్కిమోసు పక్షవాతమునకు గురియయ్యెను. పని ఆగిపోయెను. అతని నోరు పడిపోయెను. కనుక అతడు తన ఆస్తిపాస్తులను గూర్చిన వివరములు గూడ తన కుటుంబమునకు తెలుపలేకపోయెను.

56. తరువాత అతడు ఘోరమైన బాధతో చచ్చెను.

57. అల్కిమోసు చచ్చెనని విని బఖిడసు దెమేత్రియసు రాజునొద్దకు వెడలిపోయెను. యూదయా దేశమున రెండేండ్ల పాటు శాంతి నెలకొనెను.

58. అంతట తిరుగుబాటు దారులందరు ఏకమై "చూచితిరా! ఇపుడు యోనాతాను, అతని అనుచరులు ఏ చీకుచింతలేకుండ జీవించుచున్నారు. మనము బఖిడసును పిలిపింతుమేని అతడు వీరందరిని ఒక్క రాత్రిలోనే బంధించును” అనుకొనిరి.

59. వారతనియొద్దకు వెళ్ళి ఒప్పందము కుదుర్చుకొనిరి.

60. వెంటనే బఖిడసు పెద్ద సైన్యముతో కదలెను. అతడు యోనాతాను అతని అనుయాయులను పట్టుకొనవలసినదని యూదయాలోని తన పక్షము వారికందరకి రహస్యముగా లేఖలు వ్రాసెను. కాని ఈ పన్నాగము బయటపడినందున బఖిడసు అనుయాయులు అతడు చెప్పినట్లు చేయలేకపోయిరి.

61. యోనాతాను అతని అనుయాయులు పన్నాగమునకు కారకులైన తిరుగుబాటు దారులను ఏబది మందిని పట్టుకొని వధించిరి.

62. అటుపిమ్మట యోనాతాను, సీమోను, వారి సైనికులు ఎడారిలోని బేత్బాసికి వెడలిపోయిరి. అచట శిథిలములైయున్న ప్రాకారములను పునర్నిర్మించి నగరమును సురక్షితము చేసిరి.

63. ఈ సంగతి విని బఖిడసు తన సైన్యమునంతటిని ప్రోగుజేసికొనెను. యూదయాలోని తన పక్షమువారికి తన దాడిని గూర్చి తెలియజేసెను.

64. అతడు బేత్బాసిని చేరుకొని ఆ నగరమును అన్నివైపుల నుండి ముట్టడించెను. ప్రాకారములను కూలద్రోయుటకు మంచెలు కట్టించెను.

65. చాలకాలము పోరు నడచిన పిదప యోనా తాను నగరమును వీడి కొద్దిమంది సైనికులతో వెలుపలి గ్రామములలోనికి వెళ్ళెను. అతని సోదరుడు సీమోను నగరముననేయుండి దానిని రక్షించుచుండెను.

66. యోనాతాను ఓడోమెరా అనువానిని అతని అనుచరులను ఎదిరించి ఓడించెను. అటుతరువాత ఫాసిరోను తెగవారిని ఓడించెను.

67. అతడు దండెత్తి, తన సైన్యముతో యుద్ధమునకు వెళ్ళెను. అంతలోనే సీమోను అతడి సైనికులు నగరమునుండి వెలుపలికి వచ్చి శత్రువులు ప్రాకారములను కూల్చుటకుగాను కట్టిన మంచెలను తగులబెట్టిరి.

68. బఖిడసు పన్నాగములన్ని వమ్మయిపోయెను. అతడు యూదులను ఎదిరింపజాలక వారికి లొంగిపోయెను.

69. తనను పిలిపించిన తిరుగు బాటుదారుల నాయకులపై మండిపడి వారిలో చాలమందిని చంపించెను. అటుపిమ్మట అతడు తన దేశమునకు తిరిగిపోవలెనని నిశ్చయించుకొనెను.

70. ఈ సంగతిని గ్రహించి బఖిడసుతో సంధి చేసికొని తమ వారిని చెరనుండి విడిపించుటకుగాను యోనాతాను అతడియొద్దకు దూతలను పంపెను.

71. బఖిడసు యోనాతాను వేడికోలును అంగీకరించెను. తాను బ్రతికియున్నంతవరకు యోనాతానును మరల బాధింపనని మాటిచ్చెను.

72. అతడు తాను బంధీలను గావించిన యూదయా సైనికులను యోనాతానునకు అప్పగించి తన దేశమునకు వెడలిపోయెను. బఖిడసు మరల యూదుల పొలిమేరలను తొక్కలేదు.

73. యిస్రాయేలు దేశమున యుద్ధము ముగిసెను. యోనాతాను మిక్మాసున స్థిరపడి ప్రజలను పరిపాలించుచు తిరుగు బాటు దారులందరిని అణచివేసెను.

 1. గ్రీకుశకము నూట అరువదియవ యేట నాలుగవ అంతియోకసు కుమారుడైన అలెగ్జాండరు ఎపిఫానె ప్టోలమాయిసును చేరుకొని ఆ నగరమును పట్టుకొనెను. ఆ పట్టణ పౌరులు అతనిని ఆహ్వానింపగా అతడచట రాజయ్యెను.

2. ఆ సంగతిని విని దెమేత్రియసు పెద్ద సైన్యముతో పోయి అలెగ్జాండరును ఎదిరించెను.

3. ఆ సమయముననే దేమెత్రియసు యోనాతానుకు స్నేహపూర్వకముగా జాబు వ్రాసెను. అది పొగడ్తలతో నిండియుండెను.

4. అలెగ్జాండరు యోనాతానుతో సఖ్య సంబంధములు కుదుర్చుకొనకముందే దెమేత్రియసు తాను యోనాతానుతో సంధిచేసికొనుట మేలని తలంచెను.

5. ఆ రాజు తాను యోనాతానునకు, అతడి సోదరులకును, అతడి జాతికి చేసిన అపకారములను ఆ వీరుడు మరచిపోడని తలంచెను.

6. కనుక దెమేత్రియసు యోనాతానుని తన పక్షమున కలుపుకొనెను. సైన్యమును ప్రోగుజేసికొనుటకును, ఆ సేనకు ఆయుధములను సరఫరా చేయుటకును అతనికి అధికారములను ఇచ్చెను. యెరూషలేము దుర్గమున బంధింప బడియున్న బంధీలను విడుదల చేయించి యోనాతాను వశము గావించెను.

7. యోనాతాను రాజు లేఖను యెరూషలేమునకు కొనిపోయి ప్రజలకును, దుర్గముననున్న వారికిని చదివి వినిపించెను.

8. సైన్యమును ప్రోగుజేసికొను టకు రాజు యోనాతానునకు అధికారమిచ్చెనని విని దుర్గములోని వారెల్లరును భయభ్రాంతులైరి.

9. వారు కోటలో బంధింవబడియున్న బందీలను యోనాతానుకు అప్పగింపగా అతడు వారిని తమ తల్లిదండ్రులకు ఒప్పజెప్పెను.

10. యోనాతాను యెరూషలేముననే మకాము పెట్టి నగరమును పునర్నిర్మాణము చేసి సురక్షితము చేయమొదలిడెను.

11. అతడు నగరప్రాకారమునకును, సియోనుకొండ చుట్టును కట్టు గోడకు చతుర్భుజములుగల రాళ్ళు వినియోగింపుడనిపనివారిని ఆజ్ఞాపించగా వారు అటులనే చేసిరి.

12. బఖిడసు నిర్మించిన దుర్గమునుండి అన్యజాతివారు వెడలిపోయిరి.

13. వారు ఒకరి తరువాత ఒకరు దుర్గము వీడి స్వీయదేశమునకు వెళ్ళి పోయిరి.

14. మోషే ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను విడనాడిన యూదులు కొందరు మాత్రము బేత్సూరు దుర్గమునుండి కదలరైరి. ఆ తావు వారికి చిట్టచివరి ఆశ్రయమయ్యెను.

15.అలెగ్జాండరు రాజు దెమేత్రియసు యోనాతాను నకు చేసిన ప్రమాణముల గూర్చి వినెను. యోనాతాను అతడి సోదరులు సాధించిన విజయములను గూర్చియు, వారి వీర కృత్యములను గూర్చియు, వారు పడిన శ్రమలను గూర్చి తెలిసికొనెను.

16. ఆ రాజు యోనాతాను వంటివాడు ఇంకొకడు దొరకడని నిశ్చయించుకొని అతడిని తన పక్షమున చేర్చుకొని తనకు మిత్రుని చేసికోగోరెను.

17. కనుక యోనాతానుకు ఈ క్రింది రీతిగా కమ్మవ్రాసెను:

18. “అలెగ్జాండరు రాజు తన సోదరుడు యోనాతానునకు వ్రాయునది. నీకు శుభములు కలుగుగాక!

19. నీవు పరాక్రమవంతుడవనియు రాజునకు మిత్రుడవు కాదగినవాడవనియు వింటిని.

20. నేను నేటినుండి నిన్ను మీ ప్రజలకు ప్రధాన యాజకునిగా నియమించుచున్నాను. మరియు రాజమిత్రుడన్న బిరుదముతో నిన్ను సత్కరించుచున్నాను. నీవు నా పక్షమున చేరి నాకు సహాయము చేయుచుండుము.” ఆ రాజతడికి రాజవస్త్రమును, బంగారు కిరీటమును గూడ పంపెను.

21. యోనాతాను నూట అరువదియవ యేట ఏడవనెలలో గుడారముల పండుగనాడు ప్రధాన యాజకుని ఉడుపులు తాల్చెను. అతడు సైన్యమును ప్రోగుజేసికొని పెక్కు ఆయుధములు చేకూర్చుకొనెను.

22. ఈ సంగతులెల్ల తెలిసికొని దెమేత్రియసు రాజు బాధపడెను.

23. అతడు "నా చేతగానితనము వలన అలెగ్జాండరును యూదులతో సఖ్యము చేసి కోనిచ్చితినిగదా! ఇప్పుడు అతడి బలము పెరిగి పోయినది.

24. నేను కూడ యూదులకొక కమ్మవ్రాసి వారికి ఉన్నత పదవులను బహుమతులను ప్రసాదింతునని చెప్పుదును. అప్పుడు వారు నాకు సహాయము చేయుదురు” అనుకొనెను. కనుక అతడిట్లు వ్రాసెను:

25. “దెమేత్రియసు రాజు యూద జాతికి వ్రాయునది. మీకు శుభములు కలుగునుగాక!

26. మీరు నాతో చేసికొనిన సంధికి కట్టువడి నాకు స్నేహితులైయుంటిరనియు, మా శత్రువుల పక్షమును అవలంభింపకుంటిరనియు విని నేను మిగుల సంతసించితిని.

27. మీరు నా స్నేహితులుగా కొనసాగుదురేని మిమ్ము ఉచితరీతిని సత్కరింతును.

28. నేను మీరు కట్టవలసిన పన్నులను చాలవరకు తొలగించి మీకు పెక్కు సదుపాయములను కలిగింతును.

29. నేటినుండి యూదులెవరును మామూలు కప్పములు, ఉప్పు పన్నులు, ప్రత్యేకమైన పన్నులను చెల్లింపనక్కరలేదు.

30. నేటినుండి మీరు మీ పొలమున పండిన పంటలో మూడవవంతు, మీ తోటలలో పండిన ఫలములలో అర్ధభాగము నాకు ఇచ్చుకోనక్కరలేదు. నేటినుండి యూదయా, సమరియా, గలిలియా సీమలనుండి, యూదయాలో చేర్పబడిన మూడు మండలములు పై కప్పములు చెల్లింపనక్కరలేదు.

31. యెరూషలేము దాని పరిసర భూములు పరిశుద్ద నగరములుగా గుర్తింపబడును. ఆ నగరవాసులు ఎట్టి కప్పములు కట్టనక్కరలేదు.

32. నేను యెరూషలేము దుర్గముపై నా ఆధిపత్యమును వదలుకొందును. ఇక మీదట అది ప్రధాన యాజకుని అధీనములో ఉండును. అతడు తన ఇష్టము వచ్చిన సైనిక దళమును అచట కాపు పెట్టవచ్చును.

33. నా రాజ్యమున ఎచటైన యూదులు బంధీలుగానున్నచో వారిని వెంటనే ఉచితముగనే విడిపింతును. వారు తలపన్నులుగాని, పశువుల పన్నులుగాని చెల్లింపనక్కరలేదు.

34. నా రాజ్యముననున్న యూదులనుండి పండుగ దినములలోను, విశ్రాంతి దినములలోను, అమావాస్య దినములలోను కప్పములు వసూలు చేయరు. ఈ ఉత్సవదినములకు ముందు మూడు నాళ్లు, తరువాత మూడునాళ్ళు కూడ పన్నులు వసూలు చేయరు.

35. ఈ దినములలో యూదులను ఎట్టి పన్నులనైన చెల్లింపమనుటకుగాని, వారిని ఎట్టి బాధలకైన గురిచేయుటకుగాని ఎవరికి హక్కులేదు.

36. యూదులు ముప్పదివేలమందివరకు మా సైన్యమున చేరవచ్చును. వారికి యితర సైనికులవలెనే జీతము బత్తెము ముట్టును.

37. ఆ సైనికులలో కొందరు మా ప్రధానదుర్గములలో ఉండవచ్చును. కొందరికి మా రాజ్యమున పెద్ద పదవులు కూడ ఇత్తుము. పై యూద సైనికులకు వారి జాతివారే నాయకులు, అధికారులు కావచ్చును. యూదయా వాసుల వలెనే వారు తమ ప్రత్యేక ఆచారములు, నియమములు పాటింపవచ్చును.

38. సమరియా దేశము నుండి యూదియాలో చేర్చబడిన మూడు మండలములు పూర్తిగా ఆ దేశమునకే చెందియుండును. ప్రధాన యాజకుడే వానిమీద సర్వాధికారిగా నుండును.

39. ప్టోలమాయిసు నగరమునుండియు, దాని ప్రాంత భూములనుండియు వచ్చు ఆదాయమును మీ దేవాలయమునకు ధారాదత్తము చేయుచున్నాను. ఆ సొమ్ము మీరు దేవాలయము ఖర్చులకు వాడు కోవచ్చును.

40. ఇంకను మీ దేవాలయమునకు రాజు కోశాగారమునుండి ఏటేట పదిహేనువేల వెండినాణెములు కూడ చెల్లింపబడును.

41.మా ఖర్చులు పోగా మా దేశమున మిగిలియున్న సొమ్మునుండి మేము మీ దేశమునకు చెల్లింపవలసిన నిధులను కొంత కాలమునుండి చెల్లింపమైతిమి. ఆ నిధులను వెంటనే చెల్లింతుము. ఆ సొమ్మును మీరు దేవాలయమునకు వాడుకోవచ్చును.

42. ఇంతకు పూర్వమువలె ఇక మీదట మేము మీ దేవాలయ ఆదాయమునుండి ఏటేట ఐదువేల నాణెములు పుచ్చుకొనము. ఆ సొమ్మును మీరు దేవాలయమున అర్చనచేయు యాజకులకు చెల్లింపవచ్చును.

43. రాజునకుగాని, ఇతరులకుగాని అప్పుబడియున్నవారు యెరూషలేము దేవాలయమునగాని, దాని పరిసరములలోగాని తలదాచు కొందురేని వారినెవరు బంధీలు చేయరు. వారి ఆస్తిని కూడ స్వాధీనము చేసికొనరు.

44. దేవాలయమును కట్టుటకుగాని, మరమ్మతు చేయుటకుగాని అగు ఖర్చులు రాజు కోశాగారమునుండే చెల్లింపబడును.

45. యెరూషలేము ప్రాకారములను, ఆ నగర ప్రాంతములోని దుర్గములను, ఇంకను యూదయాలోని గోడలను కట్టుటకగు ఖర్చులు కూడ రాజుకోశాగారము నుండే చెల్లింపబడును.”

46. యోనాతాను, ప్రజలు దెమేత్రియసు రాజు ప్రమాణములను విశ్వసింపనులేదు, అంగీకరింపను లేదు. అతడు వారికెన్ని అపకారములు చేసెనో, వారినెంతగా పీడించెనో వారు మరచిపోలేదు.

47. ఆ ప్రజలు అలెగ్జాండరు పక్షముననే చేరవలెనని నిర్ణయించుకొనిరి. వారితో మొదట సంధి చేసికొనినది అతడే. కనుక ఆ రాజు బ్రతికియున్నంతకాలము వారతని కోపు తీసికొనిరి.

48. అలెగ్జాండరు పెద్ద సైన్యమును ప్రోగుజేసికొని దెమేత్రియసుతో పోరాడుటకు తలపడెను.

49. ఉభయ సైన్యములు పోరుజరుపగా దెమేత్రియసు సేనలు వెన్నిచ్చి పారిపోయెను. అలెగ్జాండరు వారిని తరిమికొట్టి ఓడించెను.

50. అలెగ్జాండరు వీరావేశముతో మునిమాపువరకు పోరాడెను. ఆ దినమున దెమేత్రియసు యుద్ధమున హతుడయ్యెను.

51. అలెగ్జాండరు ఐగుప్తు రాజగు ప్టోలమీ వద్దకు దూతల నంపి ఈ క్రింది సందేశము చెప్పించెను:

52. “నేను నా రాజ్యమునకు మరలివచ్చి మా పూర్వుల సింహాసనమును ఆక్రమించుకొంటిని. ఈ దేశ ప్రభుత్వము నా వశమైనది.

53. దెమేత్రియసును అతని సైన్యమును ఓడించి ఆ రాజు రాజ్యమును హస్తగతము చేసికొంటిని.

54. ఇపుడు నేను నీతో సంధి చేసుకోగోరెదను. నీ కుమార్తెను నాకిచ్చి పెండ్లి చేయుము. అప్పుడు నేను నీకు అల్లుడనగుదును. ఆమెకు నీకు తగిన బహుమతులు అర్పించుకొందును.”

55. ప్టోలమీ రాజు అతనికిట్లు ప్రతిసందేశము పంపెను: “నీవు నీ రాజ్యమునకు తిరిగివచ్చి మీ పూర్వుల సింహాసనమును ఆక్రమించుకొనిన రోజు నిక్కముగా శుభదినము.

56. నేను నీవు చెప్పినట్లే చేయుదును. కాని మొదట నీవు నన్ను ప్టోలమాయిసు వద్ద కలిసి కొమ్ము. అచట మనమిరువురమును సఖ్యము కుదుర్చు కొందము. తరువాత నీవు నా కుమార్తెను పెండ్లి యాడవచ్చును.”

57. నూట అరువది రెండవ యేట ప్టోలమీ అతని పుత్రిక క్లియోపాత్ర ఐగుప్తు నుండి బయలుదేరి ప్టోలమాయిసు నగరమునకు వచ్చిరి.

58. అలెగ్జాండరు ప్టోలమాయిసుకు వెళ్ళి వారిని కలిసికొనెను. ఆ రాజు తన పుత్రికను అలెగ్జాండరునకిచ్చి పెండ్లి చేసెను. ఆ పెండ్లి రాజవైభవములతో జరిగెను.

59. అటు తరువాత అలెగ్జాండరు యోనాతానునకు కమ్మవ్రాసి తనను కలిసికొమ్మని చెప్పెను.

60. యోనాతాను వైభవోపేతముగా ప్టోలమాయిసు నగరమునకు వెళ్ళి ఇరువురు రాజులను సందర్శించెను. వారికి వెండి బంగారు కానుకలర్పించెను. ఆ రాజులతో వచ్చిన అధికారులకును బహుమతులు ఇచ్చెను. అందరికి యోనాతాను పట్ల సదభిప్రాయము ఏర్పడెను.

61. యిస్రాయేలీయులు దేశమునుండి వెళ్ళిన భ్రష్టులు కొందరు అతని మీద నేరములు మోపజూచిరి కాని రాజు వారి మాటలను లెక్కచేయలేదు.

62. రాజు యోనాతానునకు రాజవస్త్రములు కట్టబెట్టెను.

63. అతడిని తన సరసన కూర్చుండబెట్టుకొనెను. అతడు తన అధికారులతో యోనాతానును నగర మధ్యమునకు కొనిపోయి ప్రజలకు చూపింపుడని చెప్పెను. అతడి మీద ఎవరు ఎట్టి నేరము మోపరాదనియు, ఎవరు అతడిని ఏ విధముగ బాధింపరాదనియు ప్రజలకు ప్రకటన చేయుడని పలికెను.

64. యోనాతాను శత్రువులు అతనికి లభించిన గౌరవాదరములు చూచిరి. అధికారులు చేసిన ప్రకటనను వినిరి. అతడు ధరించిన రాజవస్త్రములను పరికించిరి. కనుక వారు కాలికి బుద్ధి చెప్పిరి.

65. ఆ విధముగా అలెగ్జాండరు యోనాతానును రాజమిత్రులలో ప్రథమ వర్గమున చేర్చుకొని అతడిని యూదయాకు సైన్యాధిపతిగను, అధిపతిగను నియమించెను.

66. అటు పిమ్మట యోనాతాను సంతసముతోను, విజయసిద్దితోను యూదయాకు తిరిగి వచ్చెను.

67. నూట అరువది ఐదవయేట మొదటి దెమేత్రియసు కుమారుడు రెండవ దెమేత్రియసు క్రేతు ద్వీపము నుండి తన పితరుల దేశమైన సిరియాకు తిరిగివచ్చెను.

68. అలెగ్జాండరు అతని రాకను గూర్చి విని భయపడి రాజధాని నగరము అంతియోకియాకు తిరిగివచ్చెను.

69. దెమేత్రియసు అపోల్లోనియసును సిరియాకు రాష్ట్రపాలకునిగా నియమించెను. అపోల్లోనియసు పెద్దసైన్యము ప్రోగుజేసికొని యామ్నియా వద్ద శిబిరము పన్నెను. అతడు ప్రధానయాజకుడగు యోనాతానునకు ఈక్రింది సందేశము పంపెను:

70. "ఓయి! నీవలన నాకు తలవంపులు వచ్చినవి. ఇపుడు నిన్ను బలపరచు వారెవరునులేరు. అయినను నీవీ కొండలలోనుండి మాపై తిరుగుబాటు సాగింపనేల?

71. నీ సైన్యము మీద నీకు నిజముగా నమ్మకము కలదేని ఇచటి మైదానమునకు వచ్చి మాతో పోరాడుము. అప్పుడు మన బలాబలములను పరీక్షించుకోవచ్చును. పలు నగరములనుండి వచ్చిన సైన్యములు నా పక్షమున నున్నవని నీవు గ్రహింతువు.

72. నేనెట్టి వాడనో నా పక్షముననున్న వారెడ్డివారో ఇతరులనడిగి తెలిసికొనుము. నీవు మాకు ఉజ్జీవి కావని వారే నీకు తెల్పుదురు. అన్యులు మీ పూర్వులను మీ నేల మీదనే రెండు మారులు ఓడించిరి.

73. మరి నీవు నా అశ్వబలమునుగాని, ఈ మైదానమున గుమిగూడిన నా మహా సైన్యమునుగాని ఎట్లు జయింతువు? ఈ మైదానమున నీవు దాగుటకు రాళ్ళు, గుట్టలు లేవు. పారిపోవుటకు మార్గములేదు.”

74. అపోల్లోనియసు పంపిన వార్త విని యోనాతాను ఉగ్రుడయ్యెను. అతడు పదివేల మంది సైనికులను తీసికొని యెరూషలేమునుండి బయలుదేరెను. అతని సోదరుడు సీమోను సైన్యముతో వచ్చి అతడిని కలిసి కొనెను.

75. వారందరును కలిసి యొప్పావద్ద శిబిరము పన్నిరి. అంతకు ముందే ఆ నగరమున అపోల్లోనియసు సైన్యము విడిది చేయుచుండుటచే పురజనులు వీరిని లోనికి రానీయరైరి.

76. కాని యోనాతాను పోరు ప్రారంభింపగా పురజనులు భయపడి నగరద్వారములు తెరచిరి. యోనాతాను యొప్పాను ఆక్రమించుకొనెను.

77. ఈ సంగతి విని అపొల్లోనియసు మూడువేల మంది అశ్వికులను పెద్ద పదాతిదళమును వెంటబెట్టుకొని అసోటసు వైపు వెడలిపోవు వానివలె నటించెను. కాని అతడు తన అశ్వబలమును నమ్ముకొని తన సైన్యములతో మైదానము ప్రక్కకు తిరిగెను.

78. యోనాతాను అసోటసు వరకును శత్రువులను వెన్నాడెను. ఆ నగరము చెంత ఉభయ సైన్యములు తారసిల్లెను.

79. వెనుక తట్టునుండి వచ్చి యిస్రాయేలు సైన్యముమీద పడుటకుగాను అపోల్లోనియసు అంతకుముందే వేయిమంది అశ్వికులను త్రోవప్రక్కన మాటుగానుంచెను.

80. శత్రు సైనికులు తనకు వెనుక తట్టున గూడ ఉన్నారని యోనాతాను తరువాత గ్రహించెను. ఆ రౌతులు యూద సైనికులను చుట్టుముట్టి ఉదయమునుండి సాయంకాలము వరకును బాణములు రువ్విరి.

81. కాని యోనాతాను ఆదేశించినట్లే అతని సైనికులు ధైర్యముగా నిలిచిరి. శత్రుపక్షమువారు మాత్రము అమ్ములు విడువజాలక అలసిపోయిరి.

82. ఆ రీతిగా అశ్వికులు అలసిపోగానే సీమోను తన దళముతో వచ్చి పదాతులను ఎదిరించి పోరాడెను. వారు వెన్నిచ్చి పారిపోయిరి.

83. అశ్వికులు కూడ చెల్లాచెదరై కాలికి బుద్ది చెప్పి అసోటసులోని బేత్-దాగోను మందిరమున చొరబడిరి. ఈ దాగోను, వారు కొలుచు దేవుడు.

84. కాని యోనాతాను నగరమును, దేవాలయమును గూడ తగులబెట్టించెను. కనుక దేవళమున తలదాచుకొన్న వారందరును అగ్గిలో బుగ్గియైరి. అతడు చుట్టు పట్లనున్న నగరములనుగూడ కాల్చివేసి వానిలోని సొత్తును దోచుకొనెను.

85. యుద్ధమునగాని, దేవళమునగాని గతించిన శత్రు సైనికులు మొత్తము ఎనిమిది వేలమంది.

86. అటుతరువాత యోనాతాను అచటి నుండి వెడలిపోయి అష్కేలోను వద్ద శిబిరము పన్నెను. ఆ నగర పౌరులు అతడిని గౌరవ మర్యాదలతో ఆహ్వానించిరి.

87. అచటినుండి యోనాతాను అతని అనుచరులు పెద్దమొత్తము దోపిడి సొమ్ముతో యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

88. అలెగ్జాండరు రాజు యోనాతాను విజయమును గూర్చి విని అతనిని ఘనముగా సత్క రించెను.

89. అతడు యోనాతానునకు బంగారు భుజకీర్తిని పంపెను. “రాజ బంధువులు” అను బిరుదము పొందిన వారికేగాని అట్టి ఆభరణము లభింపదు. ఇంకను రాజు అతనికి ఏక్రోనును, దాని పరిసరప్రాంతములను ధారాదత్తము చేసెను.

 1. ఐగుప్తు రాజగు ఆరవ ప్టోలమీ సముద్రపు ఒడ్డునగల ఇసుక రేణువులవలె అసంఖ్యాకులైన సైనికులతో మహాసైన్యమును ప్రోగుచేసికొనెను. చాల ఓడలను కూడ సేకరించుకొనెను. ఆ రాజు అలెగ్జాండరును మోసగించి అతని రాజ్యమును దోచుకొని తన రాజ్యమున కలుపుకోగోరెను.

2. అతడు సిరియా దేశమునకు వచ్చి బయటకు శాంతిని కాంక్షించు వానివలె చూపట్టెను. కనుక ఆయా పురముల పౌరులు నగర ద్వారములు తెరచి అతనిని ఆహ్వానించిరి. అలెగ్జాండరు రాజు కూడ, ప్టోలమీ తనకు మామ గనుక, అతనికి స్వాగతము చెప్పుడని ప్రజలను ఆజ్ఞాపించియుండెను.

3. కాని ప్టోలమీ ముందునకు కదలిన కొలది ఒక్కొక్క నగరమున తన సైనిక బృందములను విడిదిచేయించెను.

4. అతడు అసోటసుకు రాగా పౌరులుకాలిపోయిన దాగోను దేవళమును, భస్మమైపోయిన నగరమును దాని ప్రాంతములను చూపించిరి. శవములు ఎల్ల ఎడల పడియుండెను. యోనాతాను యుద్ధమున కాల్చివేసిన వారి పీనుగులు దారివెంట ప్రోగులుపడియుండెను,

5. పౌరులు యోనాతాను పనులను గూర్చి ప్టోలమీకి వివరించి చెప్పిరి. వారు ఆ రాజు యోనాతానును గరించుననుకొనిరి. కాని అతడేమియు మాటలాడ లేదు.

6. యోనాతాను వైభవోపేతముగా వెళ్లి యొప్పా వద్ద రాజును కలిసికొనెను. వారిరువురు కుశల ప్రశ్నల డిగికొని ఆ రాత్రి అచటనే గడిపిరి.

7. యోనాతాను ఎలెయుతేరెసు నదివరకును రాజును సాగనంపి అచటి నుండి యెరూషలేమునకు తిరిగివచ్చెను.

8. ప్టోలమీ రాజు అలెగ్జాండరునకు ద్రోహము తలపెట్టి సిలీసియ నగరము వరకును గల సముద్రతీర నగరములనన్నింటిని ఆక్రమించుకొనెను.

9. అతడు దెమేత్రియసు వద్దకు దూతలనంపి “మనమిరువురము సంధిచేసి కొందము. పూర్వము అలెగ్జాండరునకు ఇచ్చిన నా కుమార్తెను రప్పించి నీకు భార్యను చేయుదును. నీవు నీ తండ్రి రాజ్యమును పరిపాలింపవచ్చును.

10. అలెగ్జాండరు నన్ను చంపయత్నించెను. అతడికి నా పుత్రికను ఇచ్చినందులకు చింతించుచున్నాను” అని చెప్పించెను.

11. ప్టోలమీ అలెగ్జాండరు రాజ్యమును అపహరింపగోరి అతడిమీద ఈ నిందమోపెను.

12. అతడు తన కూతురును రప్పించి ఆమెను దెమేత్రియసునకు ఇచ్చి పెండ్లి చేసెను. ప్టోలమీకి అలెగ్జాండరునకు మధ్య సఖ్యత నశింపగా వారిరువురు బద్దశత్రువులైరి.

13. తరువాత ప్టోలమీ అంతియోకియ నగరము ప్రవేశించి సిరియా కిరీటము గూడధరించెను. కనుక అతడు ఐగుప్తు, సిరియా కిరీటములను రెండింటిని తాల్చెను.

14. అపుడు సిలిసీయ ప్రజలు తిరుగుబాటు చేయుటచే అలెగ్జాండరు ఆ రాష్ట్రమునకు వెళ్ళవలసి వచ్చెను.

15. కాని అతడు ప్టోలమీ క్రియలను సహింప జాలక అతని మీదికి యుద్దముకు పోయెను. ఐగుప్తు రాజు పెద్ద సైన్యముతో అలెగ్జాండరును ఎదిరించి అతడిని పూర్తిగా ఓడించెను.

16. అలెగ్జాండరు ప్రాణములు దక్కించుకొనుటకు అరేబియాకు పారిపోయెను. ప్టోలమీ విజయోత్సవము జరుపుకొనెను.

17. సబ్దియేలు అను అరాబియా జాతివాడొకడు అలెగ్జాండరు తల నరికి ప్టోలమీ చెంతకుపంపెను.

18. మూడు నాళ్ళ యిన పిదప ప్టోలమీ కూడ కన్నుమూసెను. స్థానిక ప్రజలు ప్టోలమీ రాజు ఆయా కోటలలో విడిది చేయించిన సైనికులను సంహరించిరి.

19. కనుక గ్రీకుశకము నూట అరువది ఏడవ యేట (అనగా క్రీ. పూ. 145లో) రెండవ దెమేత్రియసు రాజయ్యెను.

20. యోనాతాను యెరూషలేములోని దుర్గమును ముట్టడించుటకు యూదయా ప్రజలను ప్రోగుజేసెను. వారు దుర్గ ప్రాకారములను కూల ద్రోయుటకు చాల మంచెలను కట్టిరి.

21. యూద జాతిపై ద్వేష భావముకల తిరుగుబాటు దారులైన యూదులు కొందరు దెమేత్రియసు వద్దకు పోయి యోనాతాను యెరూషలేము దుర్గమును ముట్టడింప నున్నాడని చెప్పిరి.

22. ఆ వార్త విని రాజు మండిపడి శీఘ్రమే ప్టోలమాయిసు పట్టణమును చేరుకొనెను. అతడు ముట్టడినాపి వెంటనే వచ్చి తన్ను కలిసికో వలసినదని యోనాతానునకు జాబు వ్రాసెను.

23-24. యోనాతాను రాజాజ్ఞను స్వీకరించిన పిదప గూడ తన వారితో ముట్టడిని కొనసాగింపుడని చెప్పెను. అతడు యూదుల నుండి కొందరు పెద్దలను, యాజకులను ఎన్నుకొనెను. వారిని వెంట బెట్టుకొని ప్రాణములకు కూడ తెగించి రాజును చూడబోయెను. అటుల వెళ్ళినపుడు పట్టుబట్టలను వెండి బంగారములను చాల కానుకలను కొనిపోయెను. అతడు రాజు మన్ననకు పాత్రుడయ్యెను.

25. యూద జాతికి చెందిన తిరుగుబాటుదారులు కొద్దిమంది అతడిమీద నేరముమోపిరి,

26. అయినను రాజు మాత్రము తన పూర్వులవలెనే యోనాతానును గౌర వించెను. తన సలహాదారుల యెదుట అతడిని సత్క రించెను.

27. ఇంకను అతడిని ప్రధాన యాజకునిగా కొనసాగనిచ్చెను. అతడి పూర్వపదవుల నన్నిటిని ధ్రువపరచెను. అతడిని రాజమిత్రులలో ప్రథమ వర్గమున చేర్చెను.

28. యోనాతాను యూదయాను, సమరియా నుండి వేరుచేయబడిన మూడు మండలములను పన్నులు చెల్లించు భారము నుండి తప్పింపుమని రాజును వేడుకొనెను. తాను పన్నులకు బదులుగా మూడు వందల ఎత్తుల వెండిని చెల్లింతునని చెప్పెను.

29. రాజు అందులకు అంగీకరించి యోనాతాను పేర ఈ క్రింది జాబు వ్రాయించెను:

30. “దెమేత్రియసు రాజు తన సాటివాడు అయిన యోనాతానునకును యూదులకును శుభము పలికి వ్రాయునది.

31. నేను మిమ్ముగూర్చి మా అధికారి లాస్తెనీసునకు లేఖ వ్రాసితిని. మీఉపయోగార్ధము దాని నకలును మీకు పంపుచున్నాను:

32. 'అధికారియైన లాస్తెనీసునకు దెమేత్రియసు శుభములు పలికివ్రాయునది.

33. యూదులు మనకు నమ్మదగిన మిత్రులు. వారు మనతో చేసికొనిన సంధి నియమములను పాటించుచున్నారు. కనుక నేను వారికి కొన్ని ఉపకారములు చేయనెంచితిని.

34. పూర్వమువలెనే ఇప్పుడును యూదయా మండలమంతయు వారి అధీనముననే ఉండును. సమరియా నుండి యూదయా రాజ్యములో కలుపబడిన మూడు మండలములు ఎఫ్రాయీము, లిద్దా, అరిమత్తయా - వాని పరిసర భూములతో పాటు యూదయాకే చెందును. ఈ ప్రాంతములలో పండిన పంటమీదగాని, పండ్లమీదగాని చెల్లించు పన్నులు ఇకమీదట రాజునకుగాక యెరూషలేము దేవాలయమునకు ముట్టును. కనుక యెరూషలేమున బలులర్పించుటకు వెళ్ళు వారికి లాభము కలుగును.

35. ఇకమీదట ఈ ప్రజలు నాకు పదియవవంతు పన్నులు, ఉప్పు పన్నులు, ప్రత్యేకమైన పన్నులు మొదలగునవి చెల్లింపనక్కరలేదు.

36. భవిష్యత్తులో వచ్చువారు నేను వీరికి కలిగించిన ఈ సదుపాయములలో దేనిని గూడ భంగపరుపరాదు.

37. నీవు ఈ శాసనమునకు నకలు వ్రాయించి దానిని యోనాతానునకు ఇమ్ము. యూదులు దానిని తమ పవిత్ర పర్వతము మీద పది మందికి కనిపించు తావున ప్రదర్శించుకొందురు.

38. దెమేత్రియసు తన రాజ్యమున శాంతి నెల కొనుటను, తన్నెవరును ఎదిరింపకుండుటను చూచి తన సైనికులందరిని ఉద్యోగము నుండి తొలగించి ఇండ్లకు పంపివేసెను. గ్రీకు ద్వీపముల నుండి తాను బాడుగకు కుదుర్చుకొనిన వారిని మాత్రము సైన్యమున కొనసాగనిచ్చెను. పూర్వకాలము నుండి సైనికులుగా బ్రతుకుచున్నవారికి ఇపుడు ఉద్యోగము పోయినది. కనుక వారందరును అతనికి శత్రువులైరి.

39. పూర్వము అలెగ్జాండరునకు చేదోడు వాదోడుగా నుండిన త్రూఫోను అనునాతడు, సైనికులందరు దెమేత్రియసు మీద గొణగుచున్నారని గ్రహించెను. కనుక అతడు అరబ్బు నాయకుడైన ఇమాల్కువె అనునాతడి వద్దకు వెళ్ళెను. ఇతడు అలెగ్జాండరు చిన్న కొడుకు అంటియోకసును పెంచు చుండెను.

40. త్రూఫోను చాలకాలము పాటు ఇమాల్కువే వద్దనే యుండి అంతియోకసుకను తనకు ఒప్పజెప్పుమని బతిమాల సాగెను. అలెగ్జాండరునకు బదులుగా అతని కుమారుడు అంతియోకసును రాజును చేయుదునని అతనికి నచ్చచెప్పెను. దెమేత్రియసు సైనికులను పంపివేసెను గనుక వారందరు ఆ రాజుమీద ద్వేషము పెంచుకొనియున్నారని వివరించి చెప్పెను.

41. ఇంతలో యెరూషలేము దుర్గమునను యూదయాలోని కోటలోను వసించు అన్యజాతి సైనికులు యూదులను బాధించుచున్నారు గనుక వారి నెల్లరిని వెళ్ళగొట్టింపవలెనని వేడుకొనుచు యోనాతాను దెమేత్రియసునొద్దకు దూతలనంపెను.

42. ఆ రాజు యోనాతానునకు ఇట్లు వార్త పంపెను: “నేను నీవు చెప్పినట్లే చేయుదును. తగిన సమయము వచ్చినపుడు నిన్నును మీ జాతివారిని ఘనముగా సన్మానింతును.

43. కాని ప్రస్తుతము నా పక్షమున పోరాడుటకుగాను నీ సైన్యమును పంపుము. నా సైనికులందరును నా మీద తిరుగబడుచున్నారు.”

44. ఆ వార్త విని యోనాతాను శూరులైన సైనికులను మూడు వేలమందిని అంటియోకియాకు పంపెను. రాజు వారి రాకగూర్చి విని సంతసించెను.

45. ఆ సమయముననే లక్ష యిరువదివేలమంది జనులు నగరమున గుమిగూడి రాజును చంపుటకు ఉద్యమించుచుండిరి.

46. రాజు వారికి భయపడి ప్రాసాదమున దాగుకొనెను. జనసమూహము వీథులను ఆక్రమించుకొని అలజడి ప్రారంభించిరి.

47. అపుడు రాజు యూద సైనికులకు కబురు పెట్టగా వారతనికి సహాయము చేయవచ్చిరి. వారు నగరము నలుమూలలకు పోయి ప్రజలను లక్షమందిని మట్టుపెట్టిరి.

48. నగరమును తగులబెట్టి కొల్లసొమ్ము దోచుకొనిరి. రాజును ఆపద నుండి కాపాడిరి.

49. ప్రజలు నగరము యూదుల వశమయ్యెనని గుర్తించి ధైర్యము కోల్పోయి రాజు కాళ్ళమీదపడిరి.

50. నగరము మీద యూద సైనికుల పోరాటమును మాన్పించి శాంతిని నెలకొల్పుమని వేడుకొనిరి.

51. ఎల్లరును ఆయుధములు వదలి వేసి రాజునకు లొంగిపోయిరి. ఆ సంఘటన వలన రాజునకు అతడి ప్రజలకు యూదుల పట్ల గౌరవభావము కలిగెను. యూద సైనికులు విస్తారమైన కొల్లసొమ్ముతో యెరూషలేమునకు మరలి వచ్చిరి.

52. దెమేత్రియసు తన పరిపాలనను సుస్థిరము చేసి కొనెను. అతడి దేశమున శాంతి నెలకొనెను.

53. కాని ఆ ప్రభువు తన ప్రమాణములు నిలబెట్టుకోలేదు. యోనాతానుతో వైరము గూడ పెట్టుకొనెను. యోనాతాను చేసిన సేవలకు అతనిని బహూకరించుటకు మారుగా అతనిని పెక్కురీతుల బాధింపదొడగెను.

54. అటు తరువాత త్రూఫోను, బాలుడు అంటియోకసుతో సిరియాకు తిరిగివచ్చి అతడిని రాజుగా అభిషేకించెను.

55. దెమేత్రియసు వెళ్ళగొట్టిన సైనికులందరును అంటియోకసు పక్షమున చేరిపోరు ప్రారంభించిరి. దెమేత్రియసు ఓడిపోయి పారిపోయెను.

56. త్రూఫోను రాజు ఏనుగులను బంధించి నగర మును స్వాధీనము చేసికొనెను.

57. యువకుడైన అంటియోకసు యోనాతానునకు లేఖ ఈ విధముగా వ్రాసెను. “నేను నిన్ను ప్రధాన యాజకునిగా కొనసాగనిచ్చెదను. మూడు దేశముల మీద నీకు అధికారమును స్థిరపరచి, నీకు రాజమిత్రుడను బిరుదు నిచ్చెదను.”

58. అతడికి బంగారు పతకములను బహూకరించెను. సువర్ణ కలశముల నుండి పానీయములు సేవించు అధికారమిచ్చెను. రాజవస్త్రములను, రాజబంధువులు ధరించు భుజకీర్తిని తాల్చుటకు అనుమతి కూడ ఇచ్చెను.

59. యోనాతాను తమ్ముడగు సీమోనును తూరులోని లడ్డేరు నుండి ఐగుప్తు వరకుగల దేశమునకు రాష్ట్రపాలకునిగా నియమించెను.

60. అటుపిమ్మట యోనాతాను తన సైన్యములతో సిరియా దేశము గుండ ప్రయాణము చేసెను. సిరియా సైనికులు అతనికి మిత్రులుగా నుండుటకు అంగీకరించిరి. అతడు అస్కలోనునకు రాగా అచటి పౌరులు అతనిని గౌరవాదరములతో ఆహ్వానించిరి.

61. అచటినుండి యోనాతాను గాజాకు వెళ్ళెను. కాని ఆ నగరపౌరులు అతనిని అడ్డగించి పురద్వారములు మూసివేసిరి. కనుక యోనాతాను ఆ పట్టణమును ముట్టడించి కాల్చివేసెను. దాని పరిసర ప్రాంతములను కొల్లగొట్టెను.

62. అప్పుడు గాజా పౌరులు సంధికి వేడుకొనగా యోనాతాను వారితో రాజీ కుదు ర్చుకొనెను. కాని అతడు గాజా నాయకుల కుమారులను బందీలను చేసి యెరూషలేమునకు పంపెను. అటు పిమ్మట దమస్కు వరకును ప్రయాణము కొనసాగించెను.

63. దెమేత్రియసు సైనికాధికారులు పెద్ద సైన్యముతో గలిలీయలోని కాదేషునకు వచ్చిరనియు వారు తన ప్రయత్నములను విఫలము చేయనున్నారనియు యోనాతాను వినెను.

64. కనుక అతడు తన సోదరుడు సీమోనును యూదయాలోనే వదలి తాను ఆ సైనికాధికారులతో పోరాడబోయెను.

65. సీమోను బేత్సురును ముట్టడించి చాలకాలము వరకు పోరుజరిపెను.

66. ఆ నగర పౌరులు సంధికి సిద్ధముకాగా అతడు వారితో రాజీకుదుర్చుకొనెను. కాని అతడు ఆ పట్టణమును ఆక్రమించుకొని అందలి పౌరులను వెళ్ళగొట్టెను. తన సైనికులను పట్టణమునకు కాపు పెట్టెను.

67. యోనాతాను అతడి సైనికులు గెన్నెసరెతు సరస్సు వద్ద శిబిరము పన్నిరి. మరుసటి రోజు ఉదయమే వారు హజోరు మైదానము చేరుకొనిరి.

68. అచట అన్యజాతివారి సైన్యము యోనాతాను మీదికి యుద్ధమునకు వచ్చెను. ఆ సైన్యము యోనాతానునకు తెలియకుండ తమవారిని కొందరిని ప్రక్కకొండలలో మాటుగా నుంచెను.

69-70. శత్రుసైన్యమున ప్రధాన భాగము కదలి వచ్చుచుండగా ప్రక్కన మాటుగా నున్న వారుకూడ వచ్చి యోనాతాను సైన్యము మీదపడిరి. అతని సైన్యము వెన్నిచ్చి పారిపోయెను. అబ్షాలోము కుమారుడైన మత్తతీయా, కాల్ఫి కుమారుడైన యూదా అను సైనికాధికారులు ఇద్దరు మాత్రము పారిపోరైరి.

71. అటుల తన పక్షము వారందరు కాలికి బుద్ధి చెప్పుటను చూచి యోనాతాను విచారముతో బట్టలు చించుకొనెను. తలమీద దుమ్ము పోసికొని ప్రార్థన చేసెను.

72. అటుపిమ్మట అతడు శత్రువుల మీద  పడగా వారు ఓడిపోయి పారిపోయిరి.

73. అది చూసి, అంతకు పూర్వమే పలాయితులైన యోనాతాను సైనికులు తిరిగి వచ్చి తమ నాయకునితో చేరిరి. అందరును కలిసి విరోధులను వారి శిబిరము కాదేషు వరకును తరిమి కొట్టిరి. ఆ శిబిరమును కూడ ఆక్రమించుకొనిరి.

74. ఆ దినము శత్రుసైన్యమున మూడువేల మంది హతులైరి. అటుపిమ్మట యోనాతాను యెరూషలేమునకు తిరిగివచ్చెను.

 1. దావీదు కీషు కుమారుడైన సౌలు బారి నుండి పారిపోయి సిక్లాగున వసించుచుండెను. అచట యుద్ధములో పరాక్రమశాలులు విశ్వసనీయులైన యోధులు చాలమంది దావీదు పక్షమున చేరిరి.

2. వారెల్లరు సౌలువలెనే బెన్యామీను తెగకు చెందిన వారు. అందరును కుడిచేతితో, ఎడమచేతితోగూడ బాణములు రువ్వగలరు, ఒడిసెల త్రిప్పగలరు.

3-7. గిబ్యోను నివాసి షెమయా కుమారులు అహీయెజెరు, ఇతడు అధిపతి. అతని తదుపరివాడైన యోవాసు. ఆ యోధుల పేరులివి: అస్మావేతు తనయులు యెజీయేలు, పెలెటు. అనాతోతు నివాసులగు బెరాకా, యెహూ. గిబ్యోను నివాసి సుప్రసిద్ధ యోధుడు ఇష్మాయా, ఇతడు ముప్పదిమంది వీరుల జట్టుకు నాయకుడు. గెదారా వాసులు యిర్మీయా, యహజీయేలు, యోహానాను, యోసాబాదు. హరీపు నివాసులు ఎలూసయి, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, షేపట్యా. కోరా తెగకు చెందిన ఎల్కానా, యిష్షీయా, అసరేలు, యోయెజెరు, యాషాబాము. గెదోరు నివాని యరోహాము కుమారులు యోహేలా, జెబద్యా.

8-13. దావీదు ఎడారిలోని కొండలో దాగి యుండగా గాదు తెగకు చెందినవారు కొందరు అతని పక్షమున చేరిరి. వారెల్లరును సుప్రసిద్ధులు, యుద్ధ కుశలురైన యోధులు. ఈటెలను, డాళ్ళను నేర్పుతో వాడగలవారు. సింహము ముఖమువంటి ముఖము గలవారు, కొండజింకలవలె శీఘ్రముగా పరుగెత్తగల వారు. పదవీక్రమమున వారి పేరులివి: ఏసేరు, ఓబద్యా, ఎలీయాబు, మిష్మన్నా, యిర్మీయా, అత్తయి, యెలీయేలు, యోహానాను, ఎల్జాబాదు, యిర్మీయా, మక్బన్నయి.

14. గాదీయులైన వీరు సైనిక బృందములకు నాయకులు. కొందరు వేయిమందికి కొందరు నూరుమందికి అధిపతులు.

15. యోర్దాను పొంగి పారు మొదటినెలలో వీరు ఆ నదిని దాటి దానికి తూర్పుపడమర లోయలందు వసించుచున్న జాతుల నెల్ల తరిమికొట్టిరి.

16. దావీదు ఒక దుర్గమున వసించుచుండగా కొందరు బెన్యామీనీయులు, కొందరు యూదీయులు అతని చెంతకువచ్చిరి.

17. దావీదు వారికెదురుబోయి “మీరు నాకు సహాయము చేయుటకు స్నేహితులవలె వచ్చితిరేని నాతో కలియవచ్చును. కాని నేను మీకే అపకారము చేయకున్నను, మీరు నన్ను శత్రువులకు పట్టించుటకు వచ్చితిరేని మన పితరుల దేవుడు మిమ్ము శిక్షించునుగాక!” అనెను.

18. అప్పుడు ముప్పదిమంది జట్టుకు నాయకుడైన అమాసయి అనువానిని ఆత్మ ప్రేరేపింపగా అతడు “యిషాయి కుమారుడవైన దావీదూ! మేము నీవారము. నీకు సమాధానము కలుగుగాక! నీకును, నీ సహాయులకును విజయము సిద్ధించుగాక! ప్రభువు నీకు బాసటయై యున్నాడుసుమా!" అని పలికెను. దావీదు వారినందరిని ఆహ్వానించి తన సైన్యములకు నాయకులను చేసెను.

19. దావీదు ఫిలిస్తీయులతో కలిసి సౌలుతో యుద్ధము చేయబోవుచుండగా కొందరు మనష్షేతెగ యోధులు దావీదు పక్షమున చేరిరి. యధార్థముగా దావీదు ఫిలిస్తీయ నాయకులకు సాయము చేయలేదు. దావీదు తన యజమానుడైన సౌలు పక్షమున చేరినచో తమకు చావుమూడునని భయపడి వారు అతనిని సిక్లాగునకు పంపివేసిరి.

20. దావీదు సిక్లాగు నుండి తిరిగివచ్చుచుండగా అతని పక్షమున చేరిన మనష్షీయ యోధులు వీరు: అద్నా, యోసాబాదు, యెదీయేలు, మికాయేలు, యోసాబాదు, ఎలీహు, జిల్లెతాయి. మనష్షే తెగకు చెందిన వీరెల్లరు తమ తెగలో వేయి మంది సైనికులకు అధిపతులు.

21. వారెల్లరు సుప్రసిద్దులైన వీరులు కనుక మొదట దావీదు సైన్య బృందములకు అధిపతులైరి. తరువాత యిస్రాయేలు సైన్యమునకు నాయకులైరి.

22. రోజు రోజుకి క్రొత్త యోధులు వచ్చి దావీదు సైన్యమున చేరుచునే యుండెడివారు. కనుక అతని సైన్యము విపరీతముగా పెరిగిపోయెను.

23-37. దావీదు హెబ్రోనున వసించుచుండగా యుద్దకుశలురైన యోధులు చాలమంది అతని పక్షమున చేరిరి. ప్రభువు ప్రమాణము చేసినట్లే సౌలుకు బదులుగా దావీదును రాజును చేయుటకు వారెల్ల రును కృషిచేసిరి. వారి సంఖ్యలివి: యూదా తెగనుండి 6,800 మంది యుద్ధమునకు సన్నద్ధులైన యోధులు. వారు డాళ్ళు, బల్లెములు కలవారు. షిమ్యోను తెగనుండి 7,100 మంది యుద్ధ కుశలురు. లేవి తెగనుండి 4,600 మంది యోధులు, అహరోను వంశజుల అధిపతి యోహోయాదా, అతని అనుచరులు 3,700 మంది. యువకుడును, వీరుడునైన సాదోకు బంధువులు, నాయకులైన వారు ఇరువది యిద్దరు. సౌలునకు చెందిన బెన్యామీను తెగనుండి 3,000 మంది. ఈ తెగకు చెందినవారు చాలమంది సౌలు పక్షమునే యుండిరి. ఎఫ్రాయీము తెగనుండి తమతమ వంశములలో సుప్రసిద్ధులైన వారు 20,800 మంది. మనష్షే అర్ధతెగనుండి 18,000 మంది. వీరి నెల్లరిని దావీదును రాజును చేయుటకే పంపిరి. యిస్సాఖారు తెగనుండి 200 మంది నాయకులు, వారి అనుచరులు. ఈ నాయకులెల్లరికి ఎప్పుడు ఎట్లు పోరాడవలయునో బాగుగా తెలియును. సెబూలూను తెగ నుండి 50,000 మంది. వారెల్లరు యుద్ధమునకు సన్నద్దులైనవారు, నమ్మదగిన వారు, పలువిధములైన ఆయుధములు కలవారు. నఫ్తాలి తెగ నుండి 1,000 మంది నాయకులు, డాళ్ళు ఈటెలు గలిగిన ముప్పది ఏడువేల మంది అనుచరులు. దాను తెగనుండి 28,600 మంది యుద్ధ కుశలులు. ఆషేరు తెగనుండి యుద్ధమునకు సన్నద్ధులైన వారు నలువదివేల మంది. యోర్దానునకు తూర్పున నున్న రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగనుండి పలువిధములైన ఆయుధములు గలవారు లక్షయిరువది వేలమంది.

38. యుద్ధమునకు సిద్ధముగానున్న ఈ యోధులెల్లరును, దావీదును యిస్రాయేలీయులందరిని ఏలుటకు రాజును చేయవలయునన్న దృఢసంకల్పముతో హెబ్రోనునకు వచ్చిరి. మిగిలిన యిస్రాయేలీయులకు కూడా అదే ఉద్దేశము కలదు.

39. వారు హెబ్రోనున మూడుదినములపాటు దావీదుతో గడిపిరి. తోడి యిస్రాయేలీయులు సిద్ధముచేసిన అన్నపానీయములు సేవించిరి.

40. ఉత్తరమున బహుదూరమున వసించు యిస్సాఖారు, సెబూలూను, నఫ్తాలి తెగల నుండి జనులు వచ్చిరి. వారు గాడిదలు, ఒంటెలు, కంచర గాడిదలు, ఎడ్లు మొదలైన వానిమీద పిండి, అత్తిపండ్లు, ద్రాక్షపండ్లు, ఓలివునూనె, ద్రాక్షసారాయము మొదలైన భోజన పదార్థములు మోయించుకొని వచ్చిరి. భుజించుటకు ఎడ్లను గొఱ్ఱెలనుగూడ తోలుకొని వచ్చిరి. యిస్రాయేలు దేశమంతట సంతోషము పెల్లుబుకుచుండెను.

 1. దావీదు వందమందికి, వేయిమందికి అధికారులుగానున్న తన సైన్యాధిపతులను ఇతర నాయకులను సంప్రదించెను.

2. అంతట అతడు యిస్రాయేలీయులతో “ఈ ఆలోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యావేవలన కలిగినచో దూతలను పంపి మన దేశమున మిగిలియున్న మన సహోదరులను, తమతమ నగరములలోను, పల్లెల లోను వసించు యాజకులను, లేవీయులను ఇచ్చటకు పిలిపింతము.

3. మనమెల్లరము పోయి ప్రభుమందస మును కొనివత్తము. సౌలు పరిపాలనాకాలమున దానియొద్ద మనము సంప్రదించకపోతిమి” అనెను.

4. ప్రజలకు ఆ ఆలోచన నచ్చెను గనుక వారెల్లరును సమ్మతించిరి.

5. కనుక దావీదు మందసమును కొనివచ్చుటకై దక్షిణమున సీహోరు అను ఐగుప్తు పొలిమేరనున్న నదినుండి ఉత్తరమున హమాతు పొలిమేర వరకు గల యిస్రాయేలీయులను అందరిని ప్రోగుచేసెను.

6. దావీదు, యిస్రాయేలీయులు కలిసి దైవమందసమును కొనివచ్చుటకై యూదా మండలములోని బాలా అనబడు కిర్యత్యారీమునకు వెళ్ళిరి. కెరూబు దూతల నడుమ ఆసీనుడై ఉండు ప్రభువు పేరుతో ఆ మందసము విరాజిల్లుచుండెను.

7. వారు అబీనాదాబు గృహము నుండి మందసమును వెలుపలికి తీసికొనివచ్చి క్రొత్త బండిమీద పెట్టిరి. ఉస్సా, అహ్యోలు బండి తోలించు చుండిరి.

8. దావీదు, యిస్రాయేలీయులు మందసము ముందు ఉత్సాహముతో నాట్యముచేసిరి. స్వరమండలములు, మృదంగములు, బూరలు, తాళములు వాయించుచు గానముచేసిరి.

9. బండి కీదోను కళ్ళము చెంతకు రాగానే ఎద్దులకు కాలుజారగా మందసము ప్రక్కకు ఒరిగెను. కనుక ఉస్సా చేయిచాచి దానిని పట్టుకొనబోయెను.

10. ప్రభువు ఉస్సా మీద ఆగ్రహముచెంది మందసమును ముట్టుకొనినందులకుగాను అతనిని చంపివేసెను. అతడు అక్కడికక్కడే ప్రభువు సమక్షమున కన్నుమూసెను.

11. ఆ రీతిగా ప్రభువు ఆగ్రహముతో ఉస్సాను చంపివేసెను గనుక దావీదు దుఃఖాక్రాంతుడయ్యెను. ఆ ప్రదేశమునకు నేటి వరకు "పెరెస్ ఉస్సా”' అని పేరు.

12. ప్రభువునకు భయపడి మందసమును దావీదు తన ఇంటికి కొనిపోవుట మేలాయని సంశయించెను,

13. కనుక అతడు దానిని దావీదు దుర్గమునకు కొనిపోకుండ గాతు పౌరుడైన ఓబేదెదోము అనువాని నింట వదలిపెట్టెను.

14. అది మూడునెలలపాటు అతని ఇంటనుండెను. ప్రభువు ఓబేదెదోము కుటుంబమును అతని ఆస్తిపాస్తులను దీవించెను.

 1. దెమేత్రియసు రాజు గ్రీకుశకము నూటడెబ్బది రెండవ యేట (అనగా క్రీ.పూ. 140లో) సైన్యములను ప్రోగుజేసికొని మేదియాకు వెళ్ళెను. అక్కడ ఇంకా ఎక్కువ సైన్యమును చేకూర్చుకొని త్రూఫోనుతో పోరాడవలెనని అతడి సంకల్పము.

2. కాని మేదియా పారశీకముల ప్రభువు అర్సాకెను తన దేశమున దెమేత్రియసు కాలు పెట్టెనని విని అతడిని ప్రాణములతో పట్టుకొని రమ్మని తన సైన్యాధిపతిని పంపెను.

3. ఆ సేనాపతి దెమేత్రియసును ఓడించి బందీని చేసి అర్సాకెను వద్దకు కొనివచ్చెను. ఆ రాజు అతడిని చెరలో పెట్టించెను.

4. సీమోను బ్రతికియున్నంత కాలము యూదయా దేశమున శాంతి నెలకొనెను. సీమోను తన జీవితాంతము ప్రజల మేలెంచి పరిపాలించెను. అతని ఆధిపత్యమును జనులు మిగుల మెచ్చుకొనిరి.

5. అతడి అనేక వీరకృత్యములకు జీవిత కాలమంతయు అతడిని ఆదరించిరి. ప్రతీకగా యొప్పాను జయించి ఓడరేవుగా మార్చి, ఆవలి ద్వీపములకు రాకపోకలు ఏర్పరచెను.

6. అతడు తన రాజ్యమునంతటిని వశము చేసికొని, తన దేశపు పొలిమేరలను విస్తరింపజేసెను.

7. బందీలైన తన వారిని అనేకులను మాతృభూమికి కొనివచ్చెను. గేసేరు, బేత్పూరులను యెరూషలేము కోటను జయించెను. వాని నెల్లను శుద్ధిచేయింపగా అతనిని ఎదిరించు వారు లేరైరి.

8. యూదులు నిశ్చింతగా సేద్యము చేసికొనిరి. వారి పొలములలో పంటపండెను, చెట్లు కాయలు కాసెను.

9. పెద్దలు రచ్చబండ వద్ద కూర్చుండి, తమకు ప్రాప్తించిన లాభములను గూర్చి ముచ్చటించుకొనిరి. యువకులు సైనికుల దుస్తులు,  ఆయుధములు ధరించిరి.

10. సీమోను నగరములకు భోజనపదార్థములు, రక్షణాయుధములు సమృద్ధిగా సరఫరా చేసెను. అతని పేరు ఎల్లెడల మారుమ్రోగెను.

11. అతడు దేశమున శాంతి నెలకొల్పగా యిస్రాయేలీయుల ఆనందము మిన్నుముట్టెను.

12. ప్రతివాడును తన ద్రాక్షతోటలో,  అంజూరపు తోటలో భయమనునది లేకయే సంతోషముగా కాలము వెళ్ళబుచ్చెను.

13. ఆ రోజులలో శత్రురాజులెల్ల ఓడిపోయిరి. కనుక యూదులతో పోరాడువారే లేరైరి.

14. అతడు పేదసాదలనెల్ల ఆదుకొనెను. ధర్మశాస్త్రమును శ్రద్ధగా పాటించెను. దాని నియమములను అనుసరింపని వారినెల్ల మట్టుపెట్టెను.

15. దేవాలయమును వైభవోపేతముగా అలంకరించి, పూజాసమయమున వాడు పాత్రములు అనేకములు సరఫరా చేసెను.

16. రోము, స్పార్టా నగరముల పౌరులు యోనాతాను చనిపోయెనని విని మిగుల చింతించిరి.

17. వారు యోనాతానునకు బదులుగా సీమోను ప్రధానయాజకుడయ్యెనని వినిరి. యూదయా దేశ మును దాని నగరములు అతని అధీనములోనున్నవని తెలిసికొనిరి.

18. వారు సీమోను సోదరులైన యూదా యోనాతానులతో పూర్వము తాము చేసికొనిన సంధి షరతులను కొనసాగించుటకు అంగీకరించుచున్నామని ఇత్తడిపలక మీద వ్రాసి ఆ పలకను సీమోను వద్దకు పంపిరి.

19. ఆ లేఖను యెరూషలేము పౌరుల యెదుట చదివి వినిపించిరి.

20. స్పార్టా ప్రజలు వ్రాసిన లేఖ యిది:  ఆ “యూదుల ప్రధానయాజకుడగు సీమోనుకును, వారి యాజకులకును, ప్రజలకును శుభములు పలికి స్పార్టా ప్రజలు, పాలకులు వ్రాయునది.

21. మీరు మా చెంతకు పంపిన దూతలు మీ కీర్తి ప్రతిష్ఠలగూర్చి చెప్పిరి. వారిని చూచి మేము ఆనందభరితులమైతిమి.

22. వారి రాకను గూర్చి మేము మా దస్తావేజులలో ఇట్లు వ్రాయించితిమి. అంటియోకసు కుమారుడు నుమేనియసు, యాసోను కుమారుడు ఆంటిపాతెరును యూదుల దూతలుగా వచ్చి పూర్వము వారు మనతో చేసికొనిన సంధి షరతులను నూత్నీకరించుకొనిరి.

23. మా శాసనసభ సభ్యులు ఈ దూతలను గౌరవాదరములతో ఆహ్వానించిరి. వారు కొనివచ్చిన సందేశమును మా దస్తావేజులలో లిఖించి భద్రపరచితిమి. ప్రధానయాజకుడైన సీమోనునకు ఒక ప్రతిని పంపుటకు ఈ లేఖ నకలు కూడ వ్రాయించితిమి.”

24. అటు తరువాత సీమోను నుమేనియసును రోమునకు కూడ పంపెను. అతడు వేయి తులముల బరువుగల బంగారు డాలును బహుమతిగా కొనిపోయి యూదులు రోమీయులతో చేసికొనిన సంధి షరతులను నూత్నీకరించుకొని వచ్చెను.

25. పై సంగతులెల్ల విని యిస్రాయేలు ప్రజలు “మనము సీమోనును, అతని కుమారులను ఉచిత రీతిని సత్కరించుటెట్లు?

26. అతడు అతని సోదరులు, అతని తండ్రి కుటుంబమంతయు మన ప్రజలను కాపాడుటకు ధైర్యముగా ముందునకు వచ్చిరి. వారు శత్రువులతో పోరాడి మనకు స్వాతంత్ర్యము సంపాదించి పెట్టిరి” అని అనుకొనిరి.

27-28. వారు ఈ క్రింది శాసనమును రాగిరేకుల మీద వ్రాయించి వానిని సియోను కొండపైనున్న స్తంభముల మీద పెట్టించిరి. ఆ శాసనమిది: గ్రీకుశకము నూటడెబ్బది రెండవ యేడు (అనగా క్రీ.పూ. 140లో) ఏలూలు అను పేరుగల నెల పదునెనిమిదవ దినమున సీమోను ప్రధానయాజకుడుగా పనిచేయుచున్న కాలమున మూడవ యేడు యాజకులు, ప్రజలు, అధికారులు, పెద్దలు సమావేశమైన అసారామెల్ అనబడు మహాసభలో ఈ క్రింది విషయములు తెలియజేయబడినవి:

29. “మన దేశమున యుద్ధములు పెచ్చు పెరిగి నప్పుడు యోవారీబు గోత్రమునకు చెందిన యాజకుడగు మత్తతీయ కుమారుడు సీమోను, అతని సోదరులు ప్రాణములకు కూడ తెగించి శత్రువులతో పోరాడి మన దేశమును, ధర్మశాస్త్రమును కాపాడిరి. వారు మన జాతికెనలేని గౌరవమును చేకూర్చి పెట్టిరి.

30. యోనాతాను మన ప్రజలను ఏకము చేసి మనకు ప్రధానయాజకుడైన తరువాత కన్నుమూసెను.

31. యూదుల శత్రువులు వారి దేశము మీద దండెత్తి వారి దేవాలయమును నాశనము చేయబూనిరి.

32. అపుడు సీమోను నాయకుడై తన దేశము కొరకు పోరాడెను. అతడు తన దేశమును రక్షించుటకు పోరాడు సైనికులకు ఆయుధములు సరఫరా చేసెను. జీతము చెల్లించెను. ఇందుకు తన సొంత సొమ్మునే వెచ్చించెను.

33. అతడు యూదయాలోని నగరములను సురక్షితము చేసెను. యూదయా సరిహద్దులో నున్న బేత్సూరు నగరమున పూర్వము శత్రువులు ఆయుధములను పదిలపరచెడివారు. సీమోను ఆ దుర్గమును కూడ సురక్షితముచేసి అచట సైనికదళములను కాపు పెట్టెను.

34. అతడు ఓడరేవగు యొప్పాను సురక్షితము చేసెను. అసోటసు చేరువలోనున్న గేసేరునకు కూడ ప్రాకారములు నిర్మించెను. అంతకు పూర్వము ఆ నగరమున శత్రు సైనికులు వసించెడివారు. మరియు అతడు ఆ తావున యూదులకు నివాసము కల్పించి వారికి కావలసినవన్నియు సరఫరా చేయించెను.

35. సీమోను దేశభక్తిని, తన జాతికి కీర్తి ప్రతిష్ఠలను తీసికొని వచ్చుటకుగాను అతడు చేసిన కృషిని చూచి ప్రజలు అతనిని నాయకునిగను, ప్రధానయాజకునిగను నియమించిరి. అతడు చేసిన కార్యములను, ధర్మమును నిలబెట్టిన తీరును, తన జాతికి గౌరవమును చేకూర్చుటలో అతడు చూపిన ఆసక్తిని చూచి ప్రజలతనికి పైపదవులు ఒప్పజెప్పిరి.

36. సీమోను నాయకత్వమున యూదులు అన్యజాతి వారిని తమ దేశమునుండి పారద్రోలిరి. దేవాలయమునకు ఉత్తరభాగమున ఉన్న దుర్గమునుండి శత్రుసైన్యమును వెళ్ళగొట్టిరి. వారు ఆ దుర్గమునుండి వెడలి వచ్చి పవిత్రమైన దేవాలయమును అమంగళము చేసెడివారు.

37. అతడు దుర్గమున యూదులకు నివాసము కల్పించి దానిని సురక్షితము చేయగా అది యెరూషలేము నగరమును, దేశమును గూడ కాపాడగలిగెను. అతడు యెరూషలేము ప్రాకారముల ఎత్తు కూడ పెంచెను.

38. ఈ సేవను మెచ్చుకొని దెమేత్రియసు రాజు సీమోను యాజకత్వమును సుస్థిరము చేసెను.

39. అతనికి రాజమిత్రుడన్న బిరుదమును గూడ ఇచ్చెను. ఇంకనతనిని మిగుల సత్కరించెను.

40. రోమీయులు యూదులను తమ మిత్రులనుగాను, తమ పక్షమువారిగాను, తమ సోదరులుగాను గణించిరి. వారు సీమోను పంపిన రాయబారులను గౌరవాదరములతో ఆహ్వానించిరి. కనుకనే దెమేత్రియసు కూడ సీమోనును సన్మానించెను.

41. నమ్మదగిన ప్రవక్త ఒకడు పొడచూపినవరకు సీమోను అతని కుమారులు తమకు ప్రధానయాజకులు గాను, నాయకులుగాను కొనసాగవలెనని యూద ప్రజలు, వారి యాజకులు నిర్ణయించిరి.

42. సీమోను దేశాధిపతిగను, సైన్యాధిపతిగను, దేవాలయాధిపతిగను పనిచేయును. అధికారులను నియమించును. అతడు సైన్యము వాడు ఆయుధములు సరఫరా చేయును. కోట సంరక్షకుడుగా నుండును. దేశములోని ప్రజోపయోగకరమైన పనులన్నిటిని పర్యవేక్షించును.

43. అందరు అతనిని విధేయించవలెను. ప్రభుత్వపు దస్తావేజులన్నియు అతని పేరు మీదుగా లిఖింపబడును. అతడు రాజవస్త్రములను, బంగారు భుజకీర్తిని ధరింపవచ్చును.

44. ప్రజలు, యాజకులు ఈ నియమములనెల్ల అంగీకరింపవలెను. ఎవరును సీమోను చేసిన నియమములు మీరరాదు. అతని అనుమతి లేనిదే ఎవరును ఎచటను ఎట్టిసభను జరుపరాదు. ఎవరును రాజవస్త్రములను, బంగారు భుజకీర్తిని ధరింపరాదు.

45. ఈ నియమములను పాటింపని వారు శిక్షార్హులగుదురు.”

46. సీమోను ఈ నియమములను అమలు జరిపింపవచ్చునని ప్రజలెల్ల అంగీకరించిరి.

47. సీమోను ప్రధాననాయకుడుగను, సైన్యాధిపతిగను, ప్రజలకును, యాజకులకును అధిపతిగను ఉండుటకు అంగీకరించెను.

48. ప్రజలు ఈ శాసనమును ఇత్తడి రేకులపై వ్రాయించి దానిని దేవాలయ పరిసరములలో ప్రముఖ స్థానమున పెట్టింపవలెనని నిశ్చయించిరి.

49. ఆ శాసనమునకు నకలు వ్రాయించి దేవాలయ కోశాగారమున ఉంచినచో సీమోను అతని కుమారులు అవసరము వచ్చినపుడు దానిని వాడుకోవచ్చునని భావించిరి.

 1. గ్రీకు ద్వీపములనుండి దెమేత్రియసు కుమారుడు ఏడవ అంటియోకసు ప్రధానయాజకుడును, నాయకుడునగు సీమోనునకును, యూదజాతి కంతటికిని ఈ క్రింది లేఖ పంపెను:

2. “ప్రధానయాజకుడును, నాయకుడునగు సీమోనునకును, యూదజాతికిని శుభము పలికి అంటియోకసు వ్రాయునది.

3. కొందరు దుర్మార్గులు మా పూర్వుల రాజ్య మును అపహరించిరని మీరెరుగుదురుగదా! నేను మా రాజ్యమును జయించి దానిని పూర్వపు ఔన్నత్య మునకు కొనిరాగోరెదను. నేను చాలమంది సైనికులకును ప్రోగుజేసికొంటిని, నావలను గూడ సిద్ధము చేయించుకొంటిని.

4. ఇక వెంటనే యుద్ధమును ప్రారంభించి మా దేశమును మా నగరములను పాడు చేసిన దుండగులతో పోరాడెదను.

5. మా పూర్వులు మీకు దయచేసిన పన్నుల రాయితీలను, ఇతర రాయితీలను నేనును ధ్రువపరతును.

6. మీకవసరమైన నాణెములను మీరే ముద్రించుకొని మీ దేశమున చెలామణి చేసికోవచ్చును.

7. మీరు యెరూషలేము నగరమునకును, దేవాలయమునకును పన్నులు కట్టనక్కరలేదు, మీరు తయారుచేసిన ఆయుధములు, మీరు స్వయముగా కట్టించి ఉపయోగించుకొనుచున్న కోటలును మీవేయగును.

8. మీరు రాజు కోశాగారమునకు ఇంతకు పూర్వము బాకీపడిన సొమ్మును, ఇక మీదట బాకీపడు సొమ్మునుగూడ ఎప్పటికిని చెల్లింపనక్కర లేదు.

9. నేను నా రాజ్యమును జయింపగనే నిన్నును, మీ జాతిని, మీ దేవాలయమును ఘనముగా సన్మానింతును. అప్పుడు లోకమంతయు మీ వైభవమును గుర్తించును."

10. గ్రీ. శ. నూటడెబ్బదినాలుగవ యేట (అనగా క్రీ. పూ. 138లో) అంతియోకసు తన పూర్వులేలిన రాజ్యము మీదికి దాడిచేసెను. సైనికులందరును అతని పక్షము అవలంబించిరి. కొద్దిమంది మాత్రమే త్రూఫోను పక్షమున ఉండిపోయిరి.

11. అంతియోకసు త్రూఫోనును వెన్నాడగా అతడు పారిపోయి సముద్రతీరమున నున్న డోరు పట్టణమున తలదాచుకొనెను.

12. సైనికులందరు తనను విడనాడిరి కనుక తనకు కీడు మూడినదని త్రూఫోను గుర్తించెను.

13. అంతియోకసు లక్షయిరువదివేల కాలిబంటులతోను, ఎనిమిది వేల రౌతులతోను డోరు నగరమును ముట్టడించెను.

14. ఒకవైపున అతని సైన్యము, మరియొకవైపున సముద్రముననున్న అతని ఓడలు, పట్టణమును చుట్టుముట్టెను. నగరములోనికిగాని నగరమునుండి వెలుపలికిగాని రాకపోకలు ఆగిపోయెను.

15. ఇంతలో నువేనియసు అతని బృందము వారు రోమునుండి తిరిగివచ్చిరి. వారు, రోమీయులు, ఆయా రాజులకు, రాజ్యములకు వ్రాసిన లేఖనుగూడ కొనివచ్చిరి. అందిట్లున్నది:

16. “రోము ప్రజల నాయకుడైన లూసియూసు ప్టోలమీ రాజునకు శుభములు పలికి వ్రాయునది.

17. మాకు యూదయా దేశముతోగల సఖ్య సంబంధములను నూత్నీకరించు కొనుటకుగాను, ఆ దేశపు రాయబారులు మాచెంతకు వచ్చిరి. ఆ దేశీయులు మాకు స్నేహితులు, మా పక్షమువారు. ప్రధాన యాజకుడగు సీమోను యూదప్రజలు ఆ దూతలను మాచెంతకు పంపిరి.

18. వారు వేయి తులముల బరువుగల బంగారు డాలును కొనివచ్చిరి.

19. కనుక యూదులకుగాని, వారి దేశమునకుగాని, నగరములకుగాని, కీడు చేయవలదని మేము వివిధ రాజులకును, రాజ్యములకును వ్రాయుచున్నాము. మీరు యూదులమీదికి దండెత్తరాదు. వారిమీదికి దండెత్తువారితో చేతులు కలుపరాదు.

20. మేము యూదులు పంపిన డాలును స్వీకరించి వారికి భద్రత కల్పించుట మా కోరిక.

21. కనుక యూదయా దేశము నుండి దుర్మార్గులెవరైన పారి వచ్చి మీ మరుగు చొచ్చినచో, మీరు వారిని ప్రధానయాజకుడగు సీమోనునకు ఒప్పగింపవలయును. అతడు వారిని వారి నియమముల ప్రకారము శిక్షించును."

22-23. లూసియూసు ఆ జాబు నకళ్ళను దెమేత్రియసు రాజునకు, అట్టలసునకును, అరియారతెసుకును, అర్సాకెనుకును పంపెను. మరియు సంప్సామెసు, స్పార్టా, డెలోసు, ముండోసు, సిక్యోను, కారియా, సామోసు, పంఫూలియా, లూసియా, హాలికార్నస్ససు, రోడ్సు, ఫసేలిసు, కోసు, సీదె, అరదుసు, గొర్టున, స్నీదు, సైప్రసు, సిరినె అను రాజ్యములకును నకళ్ళను పంపెను.

24. ప్రధానయాజకుడు సీమోనునకు ఆ లేఖ ప్రతి ఒకటి చేరెను.

25. అంతియోకసు రెండవసారి డోరు నగరమును ముట్టడించి దానిని అవిరామముగా పీడింప దొడగెను. అతడు ప్రాకారములను కూల్చు మంచెలను కట్టించెను. త్రూఫోను అతని సైనికులను బయటికి రానీయలేదు, లోపలవుండనీయలేదు.

26. అంతియోకసునకు సహాయము చేయుటకు సీమోను, శూరులైన సైనికులను రెండువేలమందిని పంపెను. ఇంకను వెండి బంగారములు ఆయుధములుకూడ పంపెను కాని,

27. అంటియోకసు ఆ సైన్యమునుగాని ఆ వస్తువులనుగాని, అంగీకరింపలేదు. తాను సీమోనుతో కుదుర్చుకొనిన సంధి షరతులన్నిటిని ఉపసంహరించుకొని అతనికి విరోధియయ్యెను.

28. అతడు తన స్నేహితుడైన అతెనోబియసును సీమోనువద్దకు పంపించి ఇట్లు చెప్పించెను: “నీవు నా రాజ్యమునకు చెందిన యొప్పా, గేసేరు, యెరూషలేము దుర్గములను ఆక్రమించుకొంటివి.

29. నీవు ఆ మండలములను పాడుచేసి నా దేశమునకు అపారమైన నష్టము తెచ్చి పెట్టితివి. పైగా నీవు నా రాజ్యమున చాల స్థలములు ఆక్రమించుకొంటివి.

30. ఇపుడు నీవు ఆక్రమించుకొనిన ఈ నగరములు నావశము చేయుము. యూదయా దేశమునకు వెలుపలనున్న స్థలముల నుండి నీవు వసూలు చేసిన కప్పములుగూడ నాకు చెల్లింపుము.

31. లేదేని ఈ నగరములకు బదులుగా నాకు ఐదువందల ఎత్తుల వెండిని చెల్లింపుము. ఇంకను నీవు నా రాజ్యమునకు కలిగించిన నష్టమును తీర్చుటకుగాను, నాకు ముట్టవలసిన కప్పములకుగాను అదనముగ ఐదువందల ఎత్తుల వెండినిగూడ చెల్లింపుము. లేని ఎడల మేము నీ మీదికి యుద్ధమునకు వత్తుము.”

32. అతెనోబియసు యెరూషలేమునకు వచ్చి సీమోను వైభవమును కన్నులార చూచెను. అతని భోజనశాలలోని వెండి బంగారు పాత్రలను పరికించెను. అతని సిరిసంపదలను చూచెను. దానితో అతనికి నోట మాట రాలేదు. అతడు రాజు చెప్పుమన్న మాటలను సీమోనుతో చెప్పెను.

33-34. కాని సీమోను అతనికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: “మేము ఇతర దేశములలోని ప్రదేశములనుగాని, ఇతర జాతులకు చెందిన స్థలములనుగాని ఆక్రమించుకోలేదు. మా పూర్వులకు చెందిన ప్రదేశములను, మా శత్రువులు కొంతకాలము పాటు అన్యాయముగా తమ స్వాధీనములో నుంచుకొనిరి. ఇపుడు అనుకూలమైన పరిస్థితి రాగా మేము ఆ ప్రదేశములను మరల స్వాధీనము చేసికొంటిమి.

35. యెప్పా, గెసేరు నగరముల ప్రజలు మాకు మిగుల కీడుచేసిరి. అయినను వానికి బదులుగా మేము మీకు వంద ఎత్తుల వెండిని చెల్లింతుము.” ఈ మాటలకు అతెనోబియసు ఏమియు జవాబు చెప్పలేదు.

36. అతడు కోపముతో రాజునొద్దకు వెళ్ళి సీమోను పలుకులను అతనికి విని పించెను. సీమోను వైభవమును తాను కన్నులార చూచిన ఇతరాంశములను రాజునకు తెలియపరచెను. ఆ సంగతి ఎల్ల విని రాజు ఉగ్రుడయ్యెను.

37. ఇంతలో త్రూఫోను ఓడనెక్కి ఒర్తోసియా నగరమునకు పారిపోయెను.

38. రాజుసెండెబేయసును సముద్రతీర ప్రాంతమునకు సేనాధిపతిగా నియమించెను. రౌతులను, పదాతులను అతని వెంటపంపెను.

39. రాజు అతనిని యూదయా మీద దాడిచేయుమని చెప్పెను. కేద్రోను నగరమును పునర్నిర్మాణము చేసి, ప్రాకారములను నిర్మించి అచటినుండి యూదయాను ముట్టడింపవలెనని ఆజ్ఞాపించెను. అంటియోకసు మాత్రము త్రూఫోను పట్టుకొనుటకు పోయెను.

40. సెండెబేయసు యామ్నియాకు వచ్చి యూదులను బాధింపదొడగెను. ప్రజలను బంధించి, వధింప మొదలుపెట్టెను.

41. అతడు రాజు చెప్పినట్లే కేద్రోను నగరమును పునర్నిర్మాణము చేయించి, అచట తన రౌతులను, పదాతులను విడిదిచేయించెను. వారు యూదుల మీదబడి వారిని బంధించి, వారి మార్గములను నిరోధింపమొదలిడిరి.

 1. సీమోను కుమారుడగు యోహాను గేసేరునుండి తండ్రియొద్దకు వచ్చి సెండెబేయసు ఆగడములను గూర్చి ముచ్చటించెను.

2. సీమోను తన పెద్ద కొడుకులగు యోహాను, యూదాలను పిలచి, ఇట్లు చెప్పెను: “నా తండ్రి కుటుంబమువారు, నా సోదరులు, నేను మా బాల్యమునుండియు మన శత్రువులతో పోరాడుచు వచ్చితిమి. మేము చాల పర్యాయములు యిస్రాయేలీయులను ఆపదల నుండి రక్షించితిమి.

3. కాని నేనిపుడు వృద్ధుడనైతిని. అయినను దేవుని అనుగ్రహమువలన మీరు మాత్రము మంచి వయసులో ఉన్నారు. కనుక మీరు నాకును నా సోదరులకు బదులుగా మన జాతికొరకు పోరాడుడు. దేవుడు మీకు బాసటగా నుండుగాక!"

4. అంతట యోహాను ఇరువదివేల మంది పదాతులను, ఆశ్వికులను, ప్రోగుజేసికొని సెండెబేయసు మీదికి వెళ్ళెను. వారు రాత్రి మోదేయీనున గడపి,

5. మరుసటి వేకువన మైదానమునకు వచ్చిరి. అచట కాలిబంటులతోను, రౌతులతోను గూడిన బ్రహ్మాండమైన శత్రుసైన్యము వానినెదిరింపగా, ఉభయ సైన్యముల మధ్య ఒక నది అడ్డముండెను.

6. యోహాను అతని సైన్యము శత్రువులకు ఎదురుగా బారులు తీరెను. కాని అతని సైనికులు నదిని దాటవెరచిరి. అపుడు యోహాను అందరికంటే ముందుగా తాను నదిని దాటి ఆవలి ప్రక్కకు వెళ్ళెను. అతనిని చూచి అతని సైనికులు నదిని దాటిరి.

7. శత్రు సైన్యమున రౌతులు మిక్కుటముగా నుండిరి. కనుక యోహాను తన సైన్యమును రెండుభాగములుగా విభజించి రౌతులను మధ్యలో నుంచెను.

8. సైనికులు పోరును ప్రారంభించుటకు బాకాలనూదిరి. సెండెబేయసు అతని సైనికులు ఓడిపోయిరి. వారిలో చాలమంది చచ్చిరి. మిగిలిన వారు తమ దుర్గమైన కేద్రోనునకు పారిపోయిరి.

9. యూదా యుద్ధమున గాయపడెను. కాని యోహాను సెండెబేయసు పునర్నిర్మించిన కేద్రోను దుర్గమువరకును శత్రువులను తరిమెను.

10. వారు పారిపోయి అసోటసు పొలములలోని కోట బురుజులలో దాగుకొనిరి. కాని యోహాను ఆ బురుజులను తగులబట్టెను. ఆ దినము శత్రు సైనికులు రెండువేల మంది మడిసిరి. యోహాను సురక్షితముగా యూదయాకు తిరిగివచ్చెను.

11. సీమోను అబూబుసు కుమారుడగు ప్టోలమీని యెరికో మండలమునకు సైన్యాధిపతిగా నియమించెను.

12. అతడు ప్రధానార్చకుడు సీమోనునకు అల్లుడు కనుక అతనికి చాల వెండి, బంగారము కలదు.

13. అతనికి దురాశపెరిగి దేశమునంతటిని కబళింప గోరెను. కనుక ప్టోలమీ సీమోనును, అతని కుమారులను వధించుటకు కుట్రపన్నెను.

14. అప్పుడు సీమోను తన కుమారులైన మత్తతీయ, యూదాలతో ఆ ప్రాంతములోని నగరములను సందర్శించి వాని అక్కరలు తీర్చుచుండెను. వారు గ్రీ. శ. నూటడెబ్బది ఏడవ యేడు (అనగా క్రీ.పూ. 134లో) షేబత అను పదునొకండవ నెలలో యెరికో నగరమునకు వచ్చిరి.

15. ప్టోలమీ వంచనతో వారిని తాను నిర్మించిన డోకు అను చిన్న దుర్గములోనికి కొనిపోయి అచట పెద్ద విందు ఏర్పాటు చేయించెను. కాని అతడు తన అనుచరులను అచట మాటుగానుంచెను.

16. సీమోను అతని కుమారులు ద్రాక్షసారాయమును సేవించిన వెంటనే ప్టోలమీ అతడి అనుచరులు తాము దాగియున్న తావునుండి వెలు పలికి వచ్చి కత్తులతో భోజనశాలలోనికి ఉరికిరి. సీమోనును, అతని యిద్దరు కుమారులను వారి సేవకులలో కొందరిని వధించిరి.

17. ప్టోలమీ యిట్టి మహా ద్రోహమునకు తలపడి ఉపకారమునకు బదులు అపకారము చేసెను.

18. అతడు రాజునకు లేఖ పంపి తాను చేసిన పనినంతటిని వివరించి చెప్పెను. రాజు సైన్యములను పంపి తనకు సహాయము చేయవలెననియు, దేశమును, నగరములను తన పరము చేయవలెననియు ఆ లేఖలో మనవిచేసెను.

19. ప్టోలమీ సైన్యాధిపతులకు గూడ జాబులు వ్రాసి వారు తనతో చేతులు కలుపవలెననియు, తాను వారికి వెండి బంగారములు పంచి యిత్తుననియు మాటయిచ్చెను. అటు పిమ్మట అతడు యోహానును వధించుటకు గేసేరునకు బంటులను పంపెను.

20. యెరూషలేమును దేవాల యపు కొండను ఆక్రమించుకొనుటకు గూడ సైనికులను పంపెను.

21. కాని ఒక బంటు శత్రువులకంటె ముందుగా గేసేరు చేరుకొనెను. యోహానుతో ప్టోలమీ అతడి తండ్రిని, సోదరులను వధించెననియు, అతడిని గూడ చంపుటకు బంటులను పంపుచున్నాడని చెప్పెను.

22. ఆ వార్త విని యోహాను నిశ్చేష్టుడయ్యెను. కాని తనకు ముందుగనే వార్త అందినది కనుక అతడు తనను చంపవచ్చిన బంటులను బంధించి మట్టు పెట్టించెను.

23-24. యోహాను తన తండ్రికి బదులుగా ప్రధాన యాజకుడైన నాటినుండి దేశమును పరిపాలించిన వైనమును వివరించు దినచర్యల గ్రంథములో అతడు చేసిన యుద్ధములు, అతని వీరకృత్యములు, అతడు నగరప్రాకారములను పునర్నిర్మించిన తీరు, అతడు చేసిన ఇతర కార్యములు మొదలగునవన్నియు లిఖింపబడియే ఉన్నవి.