ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తిమోతికి వ్రాసిన 1వ లేఖ

 1. మన రక్షకుడగు దేవునియొక్కయు, మన నమ్మికయగు క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు,

2. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, పితయగు దేవునినుండియు, మన ప్రభువగు క్రీస్తు యేసునుండియు, నీకు కృప, కనికరము, సమాధానము.

3. మాసిడోనియాకు వెళ్ళబోవుచు నేను నిన్ను కోరిన విధముగ, నీవు ఎఫెసునందే నిలిచియుండుము. అచట కొంతమంది అసత్య బోధనలను చేయుచున్నారు. వారు మానివేయునట్లు నీవు ఆజ్ఞాపింపవలెను.

4. ఆ కట్టుకథలను, అంతులేని వంశావళులను వదలి వేయవలెనని వారికి బోధింపుము. అవి వాగ్వివాదములను మాత్రమే కలిగించును గాని, దేవుని ప్రణాళికను తెలియజేయవు. ఆ ప్రణాళిక విశ్వాసము వలన తెలియదగును.

5. ప్రజలయందు ప్రేమను రూపొందించు టకే నేను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. ఆ ప్రేమ నిర్మలమగు హృదయము నుండియు, స్వచ్చమగు మనస్సాక్షి నుండియు, యథార్థమగు విశ్వాసమునుండియు ఉద్భవింపవలెను.

6. కొందరు వీనినుండి విముఖులై వితండవాదములలో పడి తమ త్రోవను కోల్పోయిరి.

7. తాము దేవుని చట్టమును బోధించువారలమని వారు చెప్పుకొందురేగాని, వారు మాట్లాడునది, రూఢిగా పలుకునది వారికే బోధపడదు.

8. ధర్మశాస్త్రము తగిన పద్ధతిలో వినియోగింప బడినచో అది ఉత్తమమైనదే.

9. కాని, ధర్మశాస్త్రము సత్పురుషులకొరకు కాక చట్టము నతిక్రమించువారి కొరకును, అవిధేయులకొరకును, భక్తిహీనులకొరకును, పాపాత్ముల కొరకును, అపవిత్రుల కొరకును, మత దూషకుల కొరకును, పితృహంతల కొరకును, మాతృ హంతల కొరకును, నరహంతల కొరకును

10. వివాహేతర లైంగిక సంబంధాలు గలవారలకును, పురుష సంపర్కులకును, మనుష్యభోరులకును, అబద్దీకులకును, అప్రమాణికులకును, సత్యబోధ వ్యతిరేకులకును, అవినీతిపరుల కొరకును రూపొందింపబడినది.

11. ఈ సత్యబోధ, పావనుడు మహిమగల దేవుడు నాకు అప్ప జెప్పిన దివ్యమైన సువార్తకు అనుగుణముగా ఉన్నది.

12. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనవానిని కావించినందుకు, నాకు కృషి చేయుటకు శక్తినొసగిన మన ప్రభువగు క్రీస్తుయేసుకు నేను కృతజ్ఞతలను అర్పించుకొనుచున్నాను.

13. పూర్వము నేను ఆయనను దూషించియున్నను, ఆయనను హింసించి అవమానించినను, అది తెలియక అవిశ్వాసమువలన చేసితిని కనుక దేవుని దయ నాకు లభించెను.

14. క్రీస్తు యేసుతో ఐక్యము అగుటవలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగ కురియజేసెను.

15. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు, సంపూర్ణ అంగీకార యోగ్యమైనదియునైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను.

16. అందువలననే, క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును, కనికరమును చూపెను. ఇకముందు నిత్యజీవము పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారందరికిని నేను ఆదర్శప్రాయుడనుగా ఉండుటకే ప్రధాన పాపినైన నాయందు ఆయన ఇట్లు చేసెను.

17. అమరుడును, అగోచరుడును, నిత్యుడును, రాజునగు ఏకైక దేవునకు కలకాలము గౌరవము, మహిమకలుగును గాక! ఆమెన్.

18. తిమోతీ! నా కుమారా! పూర్వము నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనములవలన ఉత్తేజితుడవై నడచుకొనుచు నీవు మంచి పోరాటమును పోరాడగలవన్న ఉద్దేశముతో నేను నీకు ఈ హితవులను అందించుచున్నాను.

19. నీ విశ్వాసమును, నిర్మలమగు అంతఃకరణమును, కాపాడుకొనుము. కొందరు తమ అంతఃకరణమును లక్ష్యపెట్టక ఓడబద్దలైపోయిన వారివలె తమ విశ్వాసమును నాశనము చేసికొనిరి.

20. హుమెనేయు, అలెగ్జాండరులు వారిలోని వారే. దేవుని దూషింపకుండుట వారు నేర్చుకొనుటకై వారిని సైతానునకు అప్పగించితిని. 

 1. కనుక అన్నిటికంటె ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములును, ప్రార్థనలును, మనవులును, కృతజ్ఞతలును అర్పింపవలెనని విన్నవించుచున్నాను.

2. మనము సత్ప్రవర్తనతోను, సంపూర్ణమగు దైవభక్తితోను, ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్ధనలు సలుపవలెను.

3. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది.

4. మానవులు అందరు రక్షింపబడవలయుననియు, సత్యమును తెలిసికొనవలయుననియు దేవుని అభిలాష

5. దేవుడు ఒక్కడే, దేవుని, మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు.

6. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరు రక్షింపబడవలెననెడి దేవుని కోరిక తగినసమయమున నిదర్శనమాయెను.

7. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తలునిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు. యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను.

8. ఎల్లెడల పురుషులు క్రోథముగాని, తర్కము గాని లేకుండ చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలెనని నేను కోరుచున్నాను.

9. స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముతో మర్యాదస్థులుగా మెలగవలెనని, సక్రమముగా దుస్తులు ధరింపవలెనని నా వాంఛ. వారు చిత్ర విచిత్రములగు జడలను, బంగారు ఆభరణములను, ముత్యములను, మిగుల విలువైన వస్త్రములను ధరింపక

10. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లు సత్కార్య ముల చేత తమను తాము అలంకరించుకొనవలెను.

11. స్త్రీలు మౌనమును పాటించుచు సంపూర్ణ విధేయతతో బోధననను ఆలింపవలెను.

12. స్త్రీలు బోధనచేయుటగాని, పురుషులపై అధికారము కలిగియుండుట కాని నేను అనుమతింపను. వారు మౌనముగ ఉండవలెను,

13. ఏవ కంటె ముందుగ ఆదాము సృష్టింపబడెను గదా!

14. అంతేకాక మోసగింప బడినది ఆదాము కాదు. ఆ స్త్రీ యే మోసగింపబడి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినది.

15. కాని అణకువతో విశ్వాసము, ప్రేమ, పవిత్రతయను వానియందు సుస్థిర బుద్ధితో ఉన్నచో స్త్రీలు బిడ్డలను కనెడి ధర్మము వలన రక్షింపబడుదురు. 

 1. ఎవడైనను సంఘాధిపత్యమును ఆశించిన యెడల అతడు ఉత్తమకార్యమును కోరుచున్నాడనుట యథార్థము.

2. దైవసంఘపు అధిపతి దోషరహితుడును, ఒకే భార్య కలవాడును, విజ్ఞత కలవాడును, ఇంద్రియ నిగ్రహము, క్రమశిక్షణను కలవాడునై ఉండవలెను, అతిథులను ఆదరింపవలెను, ఉత్తమబోధకుడై ఉండవలెను.

3. అతడు త్రాగుబోతు కాని, దుర్జనుడు కాని కాక, సాత్త్వికుడును, జగడమాడనివాడునై ఉండవలెను. అతడు ధనాపేక్ష కలిగి ఉండరాదు.

4. తన కుటుంబమును చక్కగా నిర్వహించుకొనుచు తన సంతానము తనకు విధేయులై, అన్నింట గౌరవ మర్యాదలు పాటించునట్లు చూచుకొనవలెను.

5. తన కుటుంబమునే సరిదిద్దలేని వ్యక్తి, దైవసంఘమును ఎట్లు సరిదిద్దగలడు?

6. అతడు క్రొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు. లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి సైతానువలె శిక్షింపబడును.

7. అతడు నిందలపాలై సైతాను వలయందు చిక్కుకొనకుండునట్లు క్రీస్తు సంఘమునకు చెందనివారి మధ్యలోకూడ మంచి పేరు కలవాడై ఉండవలెను.

8. అట్లే సంఘపరిచారకులును మంచి నడవడిక గలవారై, రెండు నాలుకలు గలవారు కాక కపటము లేనివారు కావలెను. త్రాగుబోతులు కాని అత్యాశ కలవారు. కాని కారాదు.

9. నిర్మలమైన అంతఃకరణముతో విశ్వాస పరమరహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను.

10. మొదట వారు పరీక్షింపబడవలెను. దోషరహితులైనయెడల వారు పరిచారకులుగా నియ మింపబడవచ్చును.

11. అటులనే పరిచర్యచేయు స్త్రీలును సత్ప్రవర్తన కలవారై, కొండెములను చెప్పనివారై ఉండ వలెను. వారు ప్రతివిషయమునను అణకువ కలవారై నమ్మకమైనవారుగ ఉండవలెను.

12. పరిచారకుడు ఒకే భార్యను కలిగి ఉండి, తన సంతానమును, కుటుంబమును చక్కదిద్దుకొనగలిగి ఉండవలెను.

13. అటుల తమ విధులను సక్రమముగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని, క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము కలవారగుదురు.

14. నేను ఈ ఉత్తరమును వ్రాయుచు, నిన్ను త్వరలో వచ్చి చేరగలనని ఆశించుచున్నాను.

15. కాని ఒక వేళ నేను ఆలస్యము చేసినచో దేవుని గృహ మున మనము ఎట్లు ప్రవర్తింపవలెనో నీకు ఈ ఉత్త రము తెలియజేయును. సత్యమునకు మూలస్తంభమును, పునాదియునగు సజీవదేవుని శ్రీసభయే ఈ గృహము.

16. మన మతముయొక్క ఈ పరమ రహ స్యము ఎంతయో గొప్పదనుటకు సందేహములేదు: ఆయన మానవరూపమున ప్రత్యక్షమై, ఆత్మచే నిర్దోషిగా ప్రదర్శింపబడి, దేవదూతలచే చూడబడెను. ఆయన అన్యజాతులలో ప్రకటింపబడి, ప్రపంచములో విశ్వసింపబడి, మహిమతో పైకి కొనిపోబడెను. 

 1. రాబోవు కాలములలో కొందరు అసత్యములాడు ఆత్మలకు విధేయులై సైతాను బోధనలను అనుసరించి, విశ్వాసభ్రష్టులగుదురని పవిత్రాత్మ స్పష్ట పరచినది.

2. అసత్యవాదుల మోసపు మాటలనుండి ఇట్టి బోధనలు పుట్టును. కాల్చినకడ్డీతో వాతవేయ బడినట్లు వారి అంతఃకరణములు నిర్జీవములైనవి గదా!

3. వివాహమాడుటయు, కొన్ని పదార్థములను తినుటయు దోషమని అట్టివారు బోధింతురు. కాని సత్యమును గ్రహించిన విశ్వాసులు కృతజ్ఞతా పూర్వకముగ తినుటకుగాను ఈ పదార్దములను దేవుడు సృజించెను.

4. దేవుడు సృజించినది ఏదియైనను మంచిదే. మీరు దేనిని నిరాకరింపక కృతజ్ఞతా పూర్వక ముగా స్వీకరింపవలెను.

5. దేవుని వాక్కు వలనను, ప్రార్ధనవలనను అది పవిత్రపరుపబడినది.

6. నీవు ఈ ఉత్తరువులను సోదరులకు అందించిన యెడల, క్రీస్తుయేసుయొక్క ఉత్తమ సేవకుడవు కాగలవు. అంతేకాక, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమగు బోధనచేతను, మంచి సిద్ధాంతము చేతను నిన్ను నీవు పోషించుకొనుచున్నావని నీవు చూపగలవు.

7. ముసలమ్మలు చెప్పు అయోగ్యమైన గాథలకు దూరముగ ఉండుము. పవిత్ర జీవితమును అభ్యసింపుము.

8. శారీరక వ్యాయామము కొంత విలువైనదే. కాని, ఆధ్యాత్మిక వ్యాయామము ఇహపర జీవిత సాధనము కనుక అన్ని విధములుగ విలువకలది.

9. ఈ మాట నమ్మదగినది. సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది.

10. కనుకనే, సర్వమానవులకు, అందును విశేషించి, విశ్వాసము కలవారికిని, రక్షకు డగు సజీవదేవునియందు మన నమ్మికను నిలిపి వుంచుకొని ప్రయాసపడుచు గట్టి కృషి చేయుచు న్నాము.

11. ఈ విషయములను శాసించి బోధింపుము.

12. నీవు వయసున చిన్నవాడవని ఎవరును నిన్ను అవమానింపకుండునట్లు చూచుకొనుము. నీ మాట లలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగ ఉండుము.

13. నేను వచ్చువరకును నీవు పరిశుద్ధ గ్రంథ పఠనము నందును, ప్రసంగములయందును, బోధనయందును శ్రద్ధ కలిగిఉండుము.

14. ప్రవచనమువలన పెద్దల హస్తనిక్షేపణల ద్వారా నీకు అనుగ్రహింపబడియున్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకుము.

15. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణము కావించుకొనుము.

16. నిన్ను గూర్చియు, నీ ఉపదేశ మును గూర్చియు జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నిన్ను, నీబోధనలను వినువారిని కూడ నీవు రక్షింప గలవు. ఇట్లే చేయుచుండుము. 

 1. వృద్దుడగు వ్యక్తిని కఠినముగ గద్దింపక, అతనిని నీ తండ్రిగ భావించి హెచ్చరింపుము. పిన్నలను నీ సోదరులుగను,

2. వృద్దస్త్రీలను తల్లులుగను భావించి సరిదిద్దుము. యువతులను, అక్కచెల్లెండ్రుగా పరిగణించి పూర్ణపవిత్రతతో తీర్చిదిద్దుము.

3. నిజమైన అనాథలైన విధవరాండ్రను ఆదరింపుము.

4. కాని ఏ విధవరాలికైననూ బిడ్డలుగాని లేక మనుమలుగాని ఉండినయెడల, ఆ సంతానము ముందుగా తమకుటుంబము విషయమున తమకు గల బాధ్యతలను నిర్వర్తించుట ఎరుగవలెను. ఇది దేవుని సంతోషపరచును కనుక ఈ విధముగ వారు తమ పితృరుణమును తీర్చవలయును.

5. దిక్కులేక నిజముగ అనాథయైన స్త్రీ దేవునియందే తన నమ్మికను నిలుపుకొని, ఆయన సాయము కొరకై రేయింబవళ్ళు విన్నపములతో ప్రార్ధించుచుండును.

6. భోగలాలసు రాలైన వితంతువు బ్రతుకుచున్నను చచ్చినదై ఉండును.

7. వారు నిందారహితులై ఉండుటకుగాను వారిని ఇట్లు ఆజ్ఞాపింపుము.

8. కాని ఎవరైనను తన బంధు వులను గూర్చి, అందును విశేషించి తన కుటుంబ మును గూర్చి శ్రద్ధవహింపనిచో అతడు ఈ విశ్వాస మును విడనాడినట్లే. అట్టివాడు అవిశ్వాసికంటెను చెడ్డవాడు.

9. ఏ వితంతువునైనను అరువది యేండ్లు దాటనిదే విధవరాండ్ర పట్టికలో చేర్పకుము. అంతేకాక, ఆమె ఒక్క పురుషునకు మాత్రమే భార్యయై,

10. సత్కార్యములు చేయుటయందు ప్రఖ్యాతిగలదియై, బిడ్డలను సక్రమముగా పెంచి, తన గృహమున అతిథులను ఆదరించి, దైవప్రజల పాదములను కడిగి, కష్టములో ఉన్నవారికి తోడ్పడి, అన్ని విధముల మంచిని చేయుటకు పూనుకొనినదై ఉండవలెను.

11. కాని యువతులగు విధవరాండ్రను ఆ పట్టికలో చేర్పకుము.వారి వాంఛలు వారికి వివాహమాడు కోర్కె కలిగించినచో వారు క్రీస్తు నుండి మరలి పోయి,

12. ఆయనకు చేసిన తమ మొదటి వాగ్గానమును భంగమొనర్చిన దోషులగుదురు.

13. అంతే కాక, వారు సోమరులై ఇంటింట తిరుగుట నేర్చుకొందురు. వారు మాట్లాడరాని విషయములను గూర్చి మాట్లాడుచు, వారి కబురులతో అధిక ప్రసంగము చేయుట కూడ నేర్చుకొందురు.

14. కనుక మన విరోధులు మనలను నిందించుటకు అవకాశము ఈయకుండుటకై, యువతులగు వితంతువులు వివాహమాడి, సంతానవతులై గృహనిర్వహణమున శ్రద్ధ వహింపవలెనని కోరుచున్నాను.

15. ఇప్పటికే కొందరు విధవరాండ్రు త్రోవతప్పి సైతానును అనుసరించు చున్నారు.

16. విశ్వాసముగల ఏ స్త్రీ అయినను తన కుటుంబమున వితంతువులు గలదైనచో వారి భార మును దైవసంఘముపై మోపక వారికి సాయపడ వలెను. ఇట్లు దైవసంఘము ఏకాకులగు వితంతు వులను గూర్చి శ్రద్ధ వహించుటకు వారు అవకాశము కల్పింపవలెను.

17. బాగుగా పాలనచేయు పెద్దలను, అందును విశేషించి ప్రసంగములయందును, బోధనలయందును గట్టి కృషిచేయువారిని, రెట్టింపు గౌరవమునకు యోగ్యులుగ ఎంచవలెను.

18. “కళ్లము నూర్చెడి ఎద్దునోటికి చిక్కము వేయరాదు” అనియు, “పనివాడు తన జీతమునకు అర్హుడు” అనియు లేఖనము చెప్పుచున్నది.

19. ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉన్ననేగాని సంఘపు పెద్దపై నేరారోపణమును అంగీకరింపకుము.

20. ఇతరులు భయపడునట్లు పాపములో మునిగి ఉన్నవారిని బహిరంగముగ గద్దింపుము.

21. ఏ రాగద్వేషములు, పక్షపాతములేక నీవు ఈ ఉత్తరువులను పాటింపవలయునని నేను దేవుని సముఖమున, క్రీస్తుయేసు సన్నిధిన, ఎన్నుకొనబడిన దేవదూతల సమక్షమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను.

22. ఎవనికైనను హస్తనిక్షేపణ చేయవలెనని తొందరపడకుము. ఇతరుల పాపములో పాలుపంచు కొనకుము. నీవు పవిత్రుడవుగ ఉండుము.

23. నీవు ఎక్కువగా జబ్బుపడుచుందువు. కాన నీటిని మాత్రమే త్రాగక, నీ జీర్ణశక్తిని పెంపొందించు కొనుటకై కొంచెము ద్రాక్షరసమును సేవింపుము.

24. కొందరి పాపములు తీర్పునకు ముందే స్పష్టమగును. మరికొందరి పాపములు ఆ తరువాతనే బయటపడును.

25. అట్లే సత్కార్యములును స్పష్టముగ గోచరించును. అట్లు గోచరింపనివి కూడ మరుగై ఉండజాలవు. 

 1. ఎవరుకాని దేవుని నామమును గూర్చియు, మన బోధనగూర్చియు దూషింపకుండునట్లు బానిసలు తమ యజమానుల పట్ల సకల గౌరవములను చూపవలెను.

2. యజమానులు విశ్వాసులైనచో, వారు తమ సోదరులేనని, బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగ లాభమును పొందు విశ్వాసులు కూడ తమ ప్రియసోదరులు కనుక వారిని మరింత అధికముగ సేవింపవలెను. ఈ విషయములను నీవు తప్పక బోధించుచు, హెచ్చరింపవలెను.

3. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, దైవభక్తికి అను కూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్దమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తియైనను,

4. జ్ఞానశూన్యుడు, పొగరుబోతు. అట్టివానికి వాగ్వివాదములయందును, వాగ్యుద్దములయందును అభి లాషమెండు. వీని మూలముగ అసూయలు, కలహములు, దూషణలు, దుష్ట సందేహములు,

5. సత్య దూరులు బుద్దిహీనులును అగువారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు.

6. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది.

7. మనము ఈ లోకములోనికి వచ్చునపుడు ఏమియు వెంట తీసుకొనిరాలేదు. మనము ఈ లోకమునుండి నిష్క్రమించునపుడు ఏమియును వెంట తీసికొనిపోజాలము.

8. కనుక, మనకు అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదుము.

9. కాని ధనకాంక్ష కలవారు శోధనకులోనై, మానవులను శిథిలముచేసి నశింపజేయు అపాయకరమును, మూర్బములును అగువాంఛల వలయందు చిక్కు కొందురు.

10. ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసమునుండి తొలగిపోయి అనేక బాధలతో తమనుతామే పొడుచుకొనిరి.

11. కాని దైవజనుడవగు నీవు వీనికి దూరముగ ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అనువాని కొరకు నీవు యత్నింపుము.

12. విశ్వాససంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్యజీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఒనర్చినపుడు, దేవుడునిన్ను ఈ జీవనమునకే పిలిచెను.

13. సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను, పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్య మిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను.

14. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చువరకు, ఈ కట్టడను నిష్కళంకముగను, నిందలేని వాడవుగను పాటింపుము.

15. శ్రీమంతుడును, ఏకైక పరిపాలకుడును, రాజాధిరాజును, ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్తకాలమున ఆయన దర్శ నము సంభవమగును.

16. ఆయన ఒక్కడే అమరుడు. ఎవరును చేరరాని దైవతేజమున ఆయన నివసించును. ఎవరును, ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు, శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక!

17. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠు లుగా ఉండక, అస్థిరములగు సంపదలయందు నమ్మక ముంచక, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందే నమ్మకముంచవలెనని బుద్ధిచెప్పుము.

18. మంచిని మాత్రమే చేయువారుగను, సత్కార్యములలో ధనవంతులుగను, ఉదారబుద్ధి కలవారుగను, ధర్మము చేయువారుగను ఉండవలెనని వారిని ఆజ్ఞాపింపుము.

19. నిజమైన జీవమును సంపాదించుకొనుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల ధన మును వారు ఈ విధముగా కూడబెట్టుకొనగలరు.

20. తిమోతీ! నీకు అప్పజెప్పబడిన దానిని భద్రముగ కాపాడుము. నాస్తిక సంభాషణలకును, కొందరు అవివేకముచే “ఙ్ఞానము”గ నెంచు మూర్ఖపు వివాదములకును దూరముగ ఉండుము.

21. కొందరు, అట్టి “జ్ఞానము”ను కలిగి ఉన్నామని చెప్పుకొని, తత్ఫలితముగ విశ్వాస మార్గమును కోల్పోయిరి. దేవుని కృప నీతో ఉండునుగాక!