ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోహాను వ్రాసిన 1వ లేఖ

 1. సృష్టి ఆరంభమునుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని, కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటయేగాదు, మా చేతులు దానిని స్పృశించినవి.

2. ఈ జీవము ప్రదర్శింపబడినపుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు, మనకు విదితము చేయబడినదియు, పితతో ఉండునదియు అగు నిత్యజీవమును గూర్చి మీకు విశదమొనర్చుచున్నాము.

3. పిత తోడను, కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై, మేము వినినవియు, కనినవియు అగువానిని మీకును ప్రకటించుచున్నాము.

4. మన సంతోషము పరిపూర్ణమగుటకుగాను మేము దీనిని వ్రాయుచున్నాము.

5. ఆయన కుమారునినుండి మేము వినినదియు, మీకు ప్రకటించునదియు అగు సందేశము ఇదియే: దేవుడు వెలుగు. ఆయనయందు ఎంత మాత్రమును చీకటిలేదు.

6. కాని, ఆయనతో మనకు సాహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు, మనము చీకటి యందు నడిచిన యెడల మనము అబద్దమాడుచు, సత్యమును అవలంబింపకున్నాము.

7. కాని ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో, మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదుము. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములన్నిటినుండి శుద్ధిచేయును.

8. మనయందు ఎట్టిపాపమును లేదని మనము చెప్పుకొనినచో, మనయందు ఏ మాత్రము సత్యము లేకుండుటయేకాక, ఆత్మవంచన చేసికొనినవారము అగుదుము.

9. కాని, దేవునియెదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించి, మన అవినీతినుండి మనలను శుద్ధిచేసి, నీతిని చేకూర్చును; ఏలయన ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు.

10. మనము ఎట్టి పాపములను ఒనర్పలేదని చెప్పుకొనినచో, మనము దేవుని అసత్య వాదిని చేసినట్లగును, ఆయన వాక్కు మనయందులేదు. 

 1. మీరు పాపము చేయకుండుటకై, నా చిన్ని బిడ్డలారా! మీకు ఇట్లు వ్రాయుచున్నాను. కాని ఎవరైన పాపము చేసినచో మనకొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు.

2. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు,

3. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమనుట నిశ్చయము.

4. కాని ఎవరైనను “నేను ఆయనను ఎరుగుదును” అనుచు, ఆయన ఆజ్ఞలను మీరినచో, అట్టివాడు అసత్యవాది. వానిలో నిజము లేదు.

5. కాన, ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో, అట్టి వానియందు దేవునియెడల అతని ప్రేమ నిజముగ పరిపూర్ణమైనది. దీనివలన మనము ఆయనయందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము.

6. నేను ఆయనయందు ఉన్నానని చెప్పుకొనెడివాడు, ఆయన ఎటుల నడుచుకొనెనో అటులనే తానును నడుచుకొన బద్దుడైయున్నాడు.

7. ప్రియ స్నేహితులారా! నేను వ్రాయబోవు ఈ ఆజ్ఞక్రొత్తది కాదు. మీకు అనాది కాలమునుండియు వచ్చుచున్న పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇది వరకు వినియున్న సందేశమే.

8. కాని, నేను వ్రాయ బోవు ఆజ్ఞ క్రొత్తది. చీకటి గతించి నిజమగు వెలుగు ప్రకాశించుచుండుటచే దాని సత్యము క్రీస్తునందును, మీయందును కూడ గోచరించుచున్నది.

9. తాను వెలుగునందున్నానని చెప్పుకొనుచు, తన సోదరుని ద్వేషించువాడు, ఇంకను చీకటియందే ఉన్నాడు.

10. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు. వానియందు ఇతరులకు ఆటంక కారణమైనది ఏమియులేదు.

11. కాని తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమునందు ఉన్నాడు. దానియందే సంచరించును. ఆ అంధకారము వానిని గ్రుడ్డి వానినిగా ఒనర్చుటచే తాను ఎచటికి పోవుచున్నదియు అతడు గుర్తింపజాలడు.

12. నా చిన్నిబిడ్డలారా! క్రీస్తు నామమువలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను.

13. తండ్రులారా! ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు వ్రాయుచున్నాను. యువకులారా! దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయుచున్నాను. బిడ్డలారా! తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను.

14. తండ్రులారా! ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. యువకులారా! మీరు బలవంతులగుట చేతను, దేవుని వాక్కు మీ యందు నిలిచియుండుట చేతను, దుష్టుని మీరు జయించియుండుట చేతను మీకు వ్రాయుచున్నాను.

15. ఈ లోకమును గాని, ఐహికమగు దేనినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన యెడల, తండ్రి ప్రేమ వానిలోలేదు.

16. ఈ లౌకికమైన సమస్తమును, శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి డాంబికమును తండ్రి నుండి వచ్చునవి కావు. ఇవి అన్నియు ప్రాపంచికములే.

17. ఈ ప్రపంచమును, దాని వ్యామోహమును గతించును. కాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వతజీవి అగును.

18. నా బిడ్డలారా! ఇది తుదిఘడియ. క్రీస్తు విరోధి ఆగమనము మీకుముందే తెలుపబడినది. ఇప్పటికే చాలమంది క్రీస్తు విరోధులుగ గోచరించుచున్నారు. కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియుచున్నది.

19. ఇట్టివారు ఎన్నడును యథార్థముగా మన గుంపులోనివారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోనివారే అయినచో, మనతోనే నిలిచి ఉండెడి వారు. వారు ఎవ్వరును నిజముగ మనలోనివారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి.

20. అయితే మీరు పవిత్రునివలన అభిషేకింపబడితిరి. కనుక మీరందరును సమస్తమును తెలిసికొంటిరి.

21. కనుక నేను మీకు వ్రాయునది: సత్య మును మీరు ఎరుగరని కాదు. అంతేకాక, సత్యము మీకు తెలియును కనుకను, సత్యమునుండి అబద్దము పుట్టనేరదని మీకు తెలియజేయుట చేతను, నేను వ్రాయుచున్నాను.

22. అయినచో అసత్యవాది ఎవరు? యేసును, క్రీస్తు కాదనువాడే. తండ్రి కుమారులు ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి.

23. ఎట్లన, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడ తిరస్కరించును. కుమారుని అంగీక రించువాడు తండ్రినికూడ అంగీకరించినట్లే.

24. మొదటినుండియు మీరు వినిన సందేశమును మీ హృదయములయందు పదిలపరచు కొనుట మరువకుడు. మొదటి నుండియు మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యమునొంది జీవింతురు

25. ఇదియే క్రీస్తు మనకు వాగ్దానము చేసిన నిత్యజీవము.

26. మిమ్ము మోసగింపనెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను.

27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయ ములను గూర్చి మీకు బోధించుచున్నది. కనుక ఆ బోధసత్యమే కాని అబద్దము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయనయందు మీరు నిలిచి ఉండుడు.

28. ఆయన దర్శనము ఇచ్చునాడు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండ, ధైర్యముతో ఉండుటకై నా చిన్నిబిడ్డలారా! ఆయనయందే నిలిచి ఉండుడు.

29. క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియును. అయినచో సత్ప్రవర్తన గల ప్రతిఒక్కడు దేవుని మూలముననే జన్మించియున్నాడని తెలుసు కొందురు. 

 1. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు! ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమవలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగ మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు. అందువలననే అది మనలను కూడ ఎరుగదు.

2. ప్రియులారా! మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని, ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చునపుడు ఆయన యథార్గ రూపమును మనము చూతుము. కనుక, ఆయనవలె అగుదుము అని మాత్రము మనకు తెలియును.

3. క్రీస్తుయందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు, క్రీస్తు పవిత్రుడైనట్లే, తనను పవిత్రునిగ చేసికొనును.

4. పాపము చేయు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలయన, చట్ట ఉల్లంఘ నమే పాపము.

5. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించెననియు, ఆయనయందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు.

6. క్రీస్తుయందు జీవించు ఎట్టి వ్యక్తియు పాపజీవితమును కొనసా గింపడు. పాపము చేయువాడెవడును ఆయనను ఎన్నడును చూడలేదు, ఎరుగలేదు.

7. చిన్నిబిడ్డలారా! ఎవరును మిమ్ము మోసగింపకుండ చూచుకొనుడు. క్రీస్తు నీతిమంతుడైనట్లే, సత్ర వర్తనగల ప్రతివ్యక్తియు నీతిమంతుడే.

8. సైతాను ఆదినుండియు పాపము చేయుచుండెను. కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింప చేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను.

9. దైవ ప్రకృతి అతనియందు ఇమిడి ఉండుట వలన, దేవుని బిడ్డయగు ఏ వ్యక్తియు పాప కృత్య ములను కొనసాగింపడు. దేవుని బిడ్డ అగుట వలన అతడు పాపమును చేయజాలడు.

10. దేవుని బిడ్డలకును, సైతాను బిడ్డలకును గల తారతమ్యము ఇట సుస్పష్టము. సత్కార్యములు చేయనివాడును, తన సోదరుని ప్రేమింపనివాడును దేవుని బిడ్డడు కాడు.

11. మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని అనునదియే అనాదినుండియు మనము వినుచున్న సందేశము.

12. దుష్టునితో ఏకమై తన సహోదరునే చంపిన కయీనువంటి వారము కారాదు. కయీను తన సహోదరుని ఏల చంపెను? కయీను కార్యములు చెడ్డవనియు, అతని సహోదరుని కార్యములు మంచివియును అగుటచేతనే కదా?

13. కనుక సోదరులారా! లోకము మిమ్ము ద్వేషించినచో ఆశ్చర్యపడకుడు.

14. మృత్యువును వదలి జీవమున ఉంటిమని మనకు తెలిసినదే. సోదరులను మనము ప్రేమింతుము కనుక మనకు అది తెలియును. ప్రేమింపనివాడు ఎవ్వడైనను ఇంకను మృత్యువునందే ఉన్నాడు.

15. తన సోదరుని ద్వేషించు వాడు హంతయే. హంతకుడు నిత్యజీవమును కలిగి ఉండడని మీరు ఎరుగుదురు.

16. క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమస్వరూపము మనకు బోధపడినది. కనుక మనముకూడ మన సోదరుల కొరకై ప్రాణమును అర్పింపవలెను.

17. ఏ వ్యక్తియైనను ధనికుడై ఉండి కూడ అవసరములో ఉన్న తన సోదరుని చూచియు, తన హృదయ ద్వారమును మూసివేసికొనినచో తన హృదయమున దైవ ప్రేమ కలదని ఎట్లు చెప్పుకొనగలడు?

18. బిడ్డలారా! మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణములు మాత్రమే కాదు. అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును.

19. మనము సత్యమునకు చెందినవారమని ఇట్లు తెలిసికొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు.

20. మన హృదయములే మనలను అధిక్షేపించినచో, దేవుడు మన హృదయములకంటె అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడ మనకు తెలియును.

21. కనుక ప్రియ స్నేహితులారా! మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును.

22. ఆయన ఆజ్ఞలకు విధేయులమై, ఆయనకు సంతోషము కలిగించు పనులు ఒనర్తుము; కావున, మనము కోరు సమస్తమును ఆయననుండి పొందెదము.

23. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి, క్రీస్తు ఆజ్ఞాపించునట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలెనని దేవుని శాసనము.

24. దైవశాసనమునకు విధేయులగువారు దేవునియందును, దేవుడు వారియందును ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మవలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియును. 

 1. ప్రియులారా! కపట ప్రవక్తలు చాలమంది లోకమంతట వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతిఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు.

2. అది దేవుని ఆత్మ అగునో కాదో మీరు ఇట్లు తెలిసికొనగలరు: యేసు క్రీస్తు మానవశరీరము ధరించివచ్చెనని ఒప్పుకొను ప్రతిఆత్మ దేవుని సంబంధమైనది.

3. కాని క్రీస్తును గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. అట్టిఆత్మ క్రీస్తు విరోధినుండి ఉద్భవించినది. అది వచ్చుచున్నదని దీనిని గూర్చియే మీరు వినియున్నారు. ఇప్పటికే అది లోకములోకి వచ్చియున్నది. ఈ

4. కాని చిన్నబిడ్డలారా! మీరు దేవునకు చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులగు వారిలోనుండు ఆత్మకంటె, మీలో ఉండు ఆత్మ శక్తిమంతమైనది.

5. వారు లౌకిక వ్యవహారములను గూర్చియే ముచ్చటింతురు. అయినను, వారు లౌకికులగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును.

6. కాని మనము దేవునకు సంబంధించినవారము. దేవుని ఎరిగిన ప్రతివ్యక్తియు మనలను వినును. దేవునితో సంబంధము లేనివాడు మనలను ఆలకింపడు. కనుక సత్యాత్మ, అసత్యాత్మల తారతమ్యమును మనము ఇట్లు గుర్తింపవచ్చును.

7. ప్రియులారా! ప్రేమ దేవునినుండి పుట్టినది. కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించు వాడు దేవుని మూలముగ జన్మించినవాడు. అతడు దేవుని ఎరిగినవాడగును.

8. దేవుడు ప్రేమ స్వరూపుడు. కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే.

9. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగు టకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను.

10. మనము దేవుని ప్రేమించితిమని కాదు. ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగ తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది.

11. ప్రియులారా! దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరియెడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను.

12. దేవుని ఎవరును, ఎన్నడును చూడలేదు. మనము ఒకరియెడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును.

13. ఆయన తనఆత్మను మనకు ఒసగుట వలన, మనము దేవునియందును, దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది.

14. లోక రక్షకునిగ దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి. సాక్ష్యమిచ్చితిమి.

15. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తియైన ఒప్పుకొనినచో వానియందు దేవుడు, దేవునియందు అతడును ఉందురు.

16. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియును. దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతనియందును ఉందురు.

17. తీర్పుదినమున మనము ధైర్యముతో ఉండునట్లు దైవప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలన, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై ఉన్నాము.

18. ప్రేమయందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమను దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక, భయపడువాడు ఇంకను ప్రేమయందు పరిపూర్ణుడు కాలేదు.

19. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము.

20. కాని ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ఎటుల ప్రేమింపగలడు?

21. కనుక దేవుని ప్రేమించువాడు, తన సోదరుని కూడ ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు ఒసగిన ఆజ్ఞ. 

 1. యేసు, మెస్సయా అని విశ్వసించు ప్రతివ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతివ్యక్తియు ఆయన పుత్రుని కూడ ప్రేమించును.

2. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటి మని మనకు తెలియును.

3. దేవుని ప్రేమయన, ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు.

4. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము.

5. యేసు, దేవుని పుత్రుడు అని నమ్మువాడు తప్ప, లోకమును ఎవడు ఓడింపగలుగును?

6. ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తే. ఆయన జలముతోను, రక్తముతోను వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే కాక, జలముతోను, రక్తముతోను వచ్చెను.

7. ఆత్మ సత్యము. కనుక, సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.

8. సాక్ష్యాధారములు మూడు. అవి ఆత్మ, జలము, రక్తము. ఆ మూడును ఏకీభవించుచున్నవి.

9. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము. మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి ఒసగిన సాక్ష్యము.

10. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతివ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి, తన కుమారునిగూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించినవాడై, దేవుని అసత్యవాదిగ చేయుచున్నాడు.

11. దేవుడు మనకు నిత్యజీవము నొసగి యున్నాడు. అది ఆయన కుమారునిద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము.

12. కుమారుని పొందిన ప్రతి వ్యక్తియందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తియందు జీవము లేదు.

13. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు, నిత్యజీవము కలవారని తెలిసికొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను.

14. ఆయన చిత్తానుసారముగ, ఆయనను మనము ఏదేని కోరినచో, ఆయన తప్పక వినునని మనము ఆయనయందు ధైర్యము గలవారమైయున్నాము.

15. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలి యును. కనుక మనము కోరినది ఆయన ఒసగునని మనకు తెలియును.

16. తన సహోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనను చూచినయెడల అతడు దేవుని ప్రార్థింపవలెను.ఆ మరణకారకము కాని పాపము చేసినవానికి దేవుడు జీవము నొసగును. మరణ కారకమైన పాపముకూడ కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలయునని నేను చెప్పుట లేదు.

17. సమస్త అక్రమము పాపమేకాని అందు మరణకారకము కాని పాపము ఉన్నది.

18. దేవుని బిడ్డ ఎవడును పాపములను కొనసాగింపడని మనకు తెలియును. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హానిచేయలేడు.

19. మనము దేవునకు సంబంధించిన వారమనియు, లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియును.

20. దేవుని కుమారుడు దర్శనము ఇచ్చెననియు, యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు ఒసగెననియు మనకు తెలియును. మనము దేవునియందు, ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నందు ఉన్నాము. ఈయనయే యథార్థమగు దేవుడు. నిత్యజీవము.

21. చిన్న బిడ్డలారా! విగ్రహములకు దూరముగ ఉండుడు.