ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Corinthians chapter 8 in Telugu || Telugu catholic Bible || కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము

 1. సోదరులారా! మాసిడోనియాలోని దైవ సంఘములలో దేవునికృప ఏమియొనర్చినది. మీకు తెలియవలెనని మా అభిలాష,

2. అచ్చట అవి పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురిచేయబడినవి. కాని వారు మహానందమును పొందినవారై, నిరుపేదలైనను గొప్పగ దానములొనర్చిరి.

3. వారు ఈయగలిగినదంతయు, ఈయగలిగిన దానికంటే అధిక ముగను ఇచ్చిరని నేను దృఢముగ చెప్పగలను.

4. (యూదాలోని) పవిత్ర ప్రజలకు సాయమొనర్చు అవకాశము కొరకై వారు మమ్ము బ్రతిమాలుకొనిరి, పట్టుబట్టిరి.

5. మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము కావించుకొనిరి. తదనంతరము దైవసంకల్పముచే మాకుగూడ తమను అర్పించుకొనిరి. వారిని గూర్చి ఇంతగా మేము ఊహింపలేదు.

6. కనుక ఈ పనిని ప్రారంభించిన తీతునే ఈ పని కొనసాగింపుమనియు, ఈ ప్రేమపూర్వకమగు ఈ ప్రత్యేక సేవను మీయందు పూర్తిచేయుమనియు అర్థించితిని.

7.విశ్వాసములోను, వాక్కు లోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే! కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో గూడ మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష.

8. నేను మిమ్ములను ఆజ్ఞాపించుటలేదు. కాని, సాయమొనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి, మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలిసికొనుటకు నేను ప్రయత్నించుచున్నాను.

9. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా! తాను భాగ్యవంతుడై ఉండి కూడ, తన పేదరికమువలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను.

10. మీ కార్యాచరణమునందే కాక మీ సంసిద్ధత చూపుట యందు మొదటి వారైయుండిన మీకు మేలు. క్రిందటి సంవత్సరము మీరు ప్రారంభించిన పని, ఇప్పుడు పూర్తిచేయుట మీకు మంచిది అని నా అభిప్రాయము.

11. ఎంత ఆసక్తితో మీరు పనిని ప్రారంభించితిరో అంత ఆసక్తితో పనిని ముగింపుడు. మీ శక్తి కొలదియే చేయుడు.

12. ఏలయన ఇచ్చుటకు మీకు ఆసక్తి ఉన్నచో, మీకు లేనిదానిని బట్టిగాక, మీకు ఉన్నదానినిబట్టియే దేవుడు మీ కానుకను అంగీకరించును.

13. మీ పైననే భారముంచి, ఇతరులను తేలికగా వదలుటకు నేను ప్రయత్నించుట లేదు.

14. కాని ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే, అవసరములో ఉన్న వారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు, వారి సమృద్ధినిబట్టి వారును మీకు సాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమానముగ న్యాయము జరుగును.

15. లేఖము చెప్పుచున్నట్లుగ: “ఎక్కువ ప్రోగుజేసినవానికి ఎక్కువగ ఏమియును మిగులకుండెను. తక్కువ ప్రోగుజేసినవానికి ఏమియును తక్కువగాకుండెను.”

16. మా వలెనే తీతు కూడ మీకు సాయపడ వలెననెడు ఆసక్తి కలవాడు అయినందులకు దేవునికి ఎంతయో కృతజ్ఞులము.

17. మా మనవిని అతడు అంగీకరించుటయే కాక, మీకు సాయపడవలెనని తనకుగల ఆసక్తిచే తనకు తానుగ మిమ్ము చేర రాదలచెను.

18. ఆయనతోపాటు సువార్త బోధయందు అన్ని దైవసంఘములలోను మంచి గౌరవము గడించిన సోదరుని కూడ పంపుచున్నాను.

19. అంతే కాక, మా ప్రయాణములలో తోడగుటకు దైవసంఘములచే అతడు ఎన్నుకొనబడి నియమింపబడిన వాడు. ప్రభువు మహిమకై ఈ ప్రేమపూర్వక కార్యమును కొనసాగించుటలో అతడు తోడ్పడును. ఈ విధముగ సాయపడవలెననెడు మా భావము విదితమగును.

20. మేము ఉదారమగు ఈ దానమును వినియోగించుటలో ఎట్టి వివాదములకును తావు లేకుండునట్లు జాగ్రత్త పడుచున్నాము.

21. కేవలము ప్రభువు దృష్టిలో మాత్రమేకాక మనుష్యుల దృష్టికి కూడ మంచి అనిపించినదే చేయవలెనని మా ఉద్దే శము.

22. కనుకనే మా సోదరుని వారితో కూడ పంపుచున్నాము. అతనిని పెక్కుమారులు పరీక్షించి, సాయమొనర్చుటయందు ఎల్లప్పుడును అతడు ఆసక్తి కలవాడే అని గ్రహించితిమి. ఇప్పుడు మీయందు అతనికి దృఢవిశ్వాసము కలుగుటవలన మరింత ఆసక్తితో సాయపడనెంచుచున్నాడు.

23. ఇక తీతును గూర్చి చెప్పవలసినచో మీకు సాయమొనర్చుటలో అతడు నా భాగస్వామి. అతని వెంటపోవు ఇతర సోదరులు దైవసంఘములకు ప్రతినిధులు. వారు క్రీస్తునకు మహిమ తెత్తురు.

24. కనుక మీ ప్రేమను వారికి చక్కగా ప్రదర్శింపుడు. అప్పుడు మిమ్ము గూర్చి మేము గర్వించుట యుక్తమేనని దైవసంఘములన్నియు గ్రహించును. మీ ప్రేమను ధ్రువపరచు కొనుడు.