ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1st Thessalonians Chapter 3 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. తుదకు మేము దానిని ఎంత మాత్రము సహింపలేక ఒంటరిగా ఏతెన్సులో ఉండిపోవుటకు నిశ్చయించుకొని

2. క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటలో మాతో పాటు దేవుని కొరకు పనిచేయు మా సోదరుడగు తిమోతిని మీయొద్దకు పంపితిమి.

3. ఈ హింసల వలన మీలో ఏ ఒక్కరును వెనుదిరుగ రాదని మిమ్ము బలపరచుటకును, మీ విశ్వాసమునకు తోడ్పడుటకును అతనిని పంపితిమి. ఇట్టి శ్రమలు అనుభవించుట కొరకే మనము దేవునిచే ఎన్నిక చేయబడితిమని మీకు తెలియును.

4. ఏలయన, మనము హింసింపబడగలమని ముందుగనే, మీతో ఉన్నప్పుడే మీకు చెప్పితిమి. వాస్తవముగా అది అట్లే జరిగినది. అది మీకు బాగుగా తెలిసినదే కదా!

5. అందువలననే నేను ఇక సహింపలేక తిమోతిని పంపితిని. మీ విశ్వాసమును గూర్చి తెలిసికొనుటకు అతనిని పంపితిని. ఒకవేళ సైతాను మిమ్ము శోధించెనేమో అనియు మా కృషి అంతయు వ్యర్థమగునేమో అనియు భయముతో అటుల చేసితిని.

6. తిమోతి, ఇప్పుడు మీ నుండి మా వద్దకు తిరిగి వచ్చియున్నాడు. మీ విశ్వాసమును, ప్రేమను గూర్చిన శుభవార్తను మాకు అందించినాడు. మమ్మును గూర్చి మీరు ఎప్పుడునుమంచి గానే తలంతురనియు, మిమ్ము చూడవలెనని మేము ఎంత అపేక్షించుచున్నామో మమ్ము చూడవలెనని మీరును అంతగనే కోరుచున్నారనియు అతడు మాకు చెప్పియున్నాడు.

7. కనుక సోదరులారా! మేము పడుచున్న ఇన్ని కష్టములలో, బాధలలో కూడా మాకు ఎంతయో ప్రోత్సాహము కలుగుచున్నది. మీ విశ్వాసమే మాకు ఓదార్పు.

8. ఏలయన, ప్రభువునందలి మీ జీవితమున మీరు దృఢముగ నిలిచినచో మేము యథార్థముగ బ్రతికినట్లే.

9. ఏలయన, మీ వలన మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకు, మీ కొరకై, ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము?

10. మిమ్ము స్వయముగా చూచి, మీ విశ్వాసమునకు అవసరమైన వానిని అందించు అవకాశము కల్పింపుమని, రేయింబవళ్లు హృదయపూర్వకముగా ఆయనను అర్థించుచున్నాము.

11. స్వయముగ మన తండ్రియగు దేవుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు, మేము మిమ్ము చేరుటకు త్రోవను సిద్ధము చేయుదుముగాక!

12. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరిపట్ల ప్రేమయందును వర్ధిల్లజేయునుగాక!

13. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలసి వచ్చినపుడు, మన దేవుడును తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు.