Telugu Catholic Bible Matthew chapter 18 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 18వ అధ్యాయము
1. ఆ సమయమున శిష్యులు యేసువద్దకు వచ్చి, “పరలోకరాజ్యమున అందరికంటె గొప్పవాడు ఎవ్వడు?” అని అడిగిరి.
2. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారిమధ్యన నిలిపి,
3. “మీరు పరివర్తనచెంది చిన్నబిడ్డలవలె రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించు చున్నాను.
4. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలునివలె రూపొందువాడే పరలోకరాజ్యమున గొప్పవాడు.
5. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించు వాడు నన్ను స్వీకరించుచున్నాడు.
6. “నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవ్వనినైన పాపమునకు ప్రేరేపించుటకంటె అట్టివాని మెడకు తిరుగటిరాయి కట్టి అగాధ సముద్రములో పడద్రోయుట వానికి మేలు.
7. ఆటంకములతో కూడిన ప్రపంచమా! అనర్థము! ఆటంకములు తప్పవు. కాని అందుకు కారకుడైన వానికి అనర్థము!
8. నీ చేయికాని, నీ కాలుకాని నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. కాళ్ళు, చేతులతో ఆరని ఆగ్నిలో దహింపబడుటకంటె, అంగహీనుడవై అమరజీవము పొందుట మేలు.
9. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కనులతో నీవు నరకాగ్నిలో దహింపబడుటకంటె ఒంటికంటితో నిత్య జీవము పొందుట మేలు.
10. ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
11. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చియున్నాడు.
12. ఒకడు తనకున్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా?
13. అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటె దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను.
14. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు.
15,“నీ సోదరుడు నీకు విరుద్ధముగ తప్పిదము చేసినయెడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధిచెప్పుము. నీ మాటలు అతడు ఆలకించినయెడల వానిని నీవు సంపాదించు కొనిన వాడవగుదువు.
16. నీ మాటలను అతడు ఆలకింపనియెడల ఒకరిద్దరను నీ వెంట తీసికొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతిమాట స్థిరపడును.
17. అతడు వారి మాట కూడ విననియెడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘ మును కూడ అతడు లెక్కింపనియెడల, వానిని అవిశ్వా సునిగను, సుంకరిగను పరిగణింపుము.
18. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.
19. భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను, పరలోకమందుండు నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
20. ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారిమధ్య ఉన్నాను” అనెను.
21. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, "ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? ఏడు పర్యాయములా?” అని అడిగెను.
22. అందుకు యేసు “ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు” అని సమాధానమిచ్చెను.
23. ఏలయన పరలోకరాజ్యము ఇట్లున్నది: ఒక రాజు - తన సేవకులనుండి లెక్కలు సరిచూచుకొనగోరెను.
24. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగనే కోటివరహాల' ఋణస్థుడొకడు అతని సముఖమునకు తీసికొని రాబడెను.
25. వానికి ఋణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయును విక్రయించి, ఆ ఋణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను.
26. అపుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి 'కొంత ఓపిక పట్టుము. నీ ఋణమునంతయు చెల్లింతును' అని వేడుకొనెను.
27. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచి పెట్టెను. వాని అప్పును కూడ క్షమించెను. "
28. కాని, అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనకు కొంత ధనము' ఋణపడియున్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, 'నీ అప్పు చెల్లింపుము' అని గొంతు పట్టుకొనెను.
29. ఆ తోడి సేవకుడు అపుడు సాగిలపడి 'కొంచెము ఓపిక పట్టిన నీ ఋణ మంతయు చెల్లింతును' అని ప్రాధేయపడెను.
30. అందులకు వాడు అంగీకరింపక ఋణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను.
31. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి, జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి.
32. అపుడు ఆ యజమానుడు వానిని పిలిపించి 'నీచుడా! నీవు నన్ను ప్రార్ధించుటచే నీ ఋణమంతయు క్షమించితిని.
33. నేను నీపట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా?' అని
34. మండిపడి బాకీనంతయు చెల్లించువరకు వానిని తలారులకు అప్పగించెను.
35. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల పరలోకమందలి నా తండ్రియు మీ యెడల అటులనే ప్రవర్తించును.”