ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 21 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 21వ అధ్యాయము

 1. వారు యెరూషలేము సమీపించుచు, ఓలివు కొండ దగ్గరనున్న 'బెత్ఫగే' అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో,

2. “మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచట కట్టివేయబడియున్న ఒక గాడిదను, దాని పిల్లను చూచెదరు. వానిని విప్పి నాయొద్దకు తోలుకొని రండు.

3. ఎవడైనను మిమ్ము ఆక్షేపించిన యెడల, ప్రభువునకు వాటితో పనియున్నదని తెల్పుడు. వెంటనే అతడు వాటిని తోలుకొనిపోనిచ్చును” అని చెప్పెను.

4. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను.

5. “ఇదిగో! నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు. గాడిదపై భారవాహకమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు.”

6. కాబటి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి.

7. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను.

8. జన సమూహములో అనేకులు దారిపొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి.

9. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము "దావీదు కుమారా హోసన్న! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక! సర్వోన్నతమున హోసన్న!” అని విజయధ్వానములు చేయుచుండెను.

10. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించి నపుడు “ఈయన ఎవరో!” అని ప్రజలలో కలకలము కలిగెను.

11. “ఈయన గలిలీయలోని నజరేతునుండి వచ్చిన ప్రవక్తయగు యేసు” అని ఆ జనసమూహము పలికెను.

12. అంతట యేసు దేవాలయములో ప్రవే శించి, క్రయవిక్రయములను చేయువారిని బయటికి వెడలగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, పావురములను అమ్మువారి పీటలను పడద్రోసి,

13. “ 'నా ఆలయము ప్రార్ధనాలయము అన బడును' అని వ్రాయబడియున్నది. కాని, మీరు దానిని దొంగల గుహగా చేయుచున్నారు” అనెను.

14. గ్రుడ్డివారు, కుంటివారును దేవాలయ ములో ఆయనవద్దకు రాగా ఆయనవారిని స్వస్థపర చెను.

15.ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను, "దావీదు కుమారునకు హోసన్న!” అని దేవాలయములో నినాదముచేయుచున్న పిల్లలను చూచి, ప్రధానార్చ కులు, ధర్మశాస్త్ర బోధకులు కోపముతో మండిపడి,

16. “వీరి మాటలు వినుచున్నావా?" అనియేసును అడుగగా, "అవును, వినుచున్నాను. . 'నీవు పిల్లలనోట, పసిపిల్లలనోట స్తుతులు వెలువరింపజేసితివి' అనునది మీరు ఎన్నడును చదువలేదా?” అని యేసు వారికి సమాధానమిచ్చెను.

17. అంతట యేసు వారిని వీడి, ఆ పట్టణమునుండి బెతానియాకు వెళ్ళి అచట ఆ రాత్రి గడిపెను.

18. మరునాటి ఉదయమున ఆయన పట్టణమునకు తిరిగి వచ్చుచుండగా ఆకలిగొనెను.

19. ఆ త్రోవప్రక్క నున్న అంజూరపు చెట్టును చూచి, దానిని సమీపించి, దానికి ఆకులు తప్ప మరేమియు లేకుండుట చూచి, “నీవు ఎన్నటికి ఫలింపకుందువు గాక!” అని శపించెను. తక్షణమే అది ఎండిపోయెను.

20. శిష్యులు అదిచూచి, “ఈ అంజూరపు చెట్టు ఇంతలో ఎంత త్వరగా ఎండిపోయెను!” అని ఆశ్చర్య పడిరి.

21. అందుకు యేసు వారితో, “అనుమానింపక విశ్వసించినయెడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ పర్వతమును సహితము 'నీవు లేచి సముద్రమున పడుము' అని పలికినయెడల అది అటులనే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

22. మీకు విశ్వాసమున్నయెడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందుదురు” అనెను.

23. ఇట్లు చెప్పి, యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా, ప్రధానార్చకులు పెద్దలు వచ్చి "ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయు చుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు?” అని ఆయనను ప్రశ్నించిరి.

24. అందుకు యేసు “నేను కూడ మిమ్ము ఒకమాట అడిగెదను. దానికి మీరు సమాధానమిచ్చినయెడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పెదను.

25. యోహాను బప్తిస్మము ఎచట నుండి వచ్చినది? పరలోకము నుండియా? లేక మానవుని నుండియా?” అని తిరిగి ప్రశ్నించెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి: “పరలోకము నుండి వచ్చెను అని సమాధానమిచ్చితిమా! 'అటులయిన మీరేల ఆయనను విశ్వసింపలేదు?' అనును.

26. లేదా, 'మానవులనుండి' అని చెప్పితిమా! ప్రజలందరును యోహానును ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకేమి ముప్పుకలుగునో” అని భయపడి,

27. “అది మాకు తెలియదు” అని పలికిరి. అపుడు ఆయన వారితో “అట్లయిన, ఏ అధికారముతో ఈ పనులు చేయుచుంటినో నేనును చెప్పను” అనెను.

28. “ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, 'కుమారా! నేడు నీవు మన ద్రాక్షతోట లోనికి పోయి పనిచేయుము' అని చెప్పగా,

29. మొదట అతడు'వెళ్ళుట నాకిష్టము లేదు' అని చెప్పినను, పిమ్మట తన మనస్సు మార్చుకొని వెళ్ళెను.

30. తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెపెను అపుడు అతడు 'నేను వెళ్ళుచున్నాను' అని చెప్పియు వెళ్ళలేదు.

31. ఆ యిద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు?” అని ఆయన వారిని ప్రశ్నింపగా “మొదటివాడు” అని సమాధానము ఇచ్చిరి. అపుడు యేసు వారితో, “సుంకరులును, జారిణులును మీ కంటెను ముందు దేవునిరాజ్యములో ప్రవేశింపబోవు చున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

32. యోహాను మీకు నీతిమార్గము చూపుటకు వచ్చెను కాని, మీరతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు, జారిణులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయపరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి” అని పలికెను.

33. “మరియొక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్షతోటను నాటించి, చుట్టు కంచెవేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి, గోపురము కట్టించి, కాపులకు కౌలుకిచ్చి దూర దేశమునకు వెడలెను.

34. ద్రాక్షపండ్లు కోతకు వచ్చినపుడు, తన భాగమును తెచ్చుటకై కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపెను.

35. కాని, వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి; ఒకనిని చంపిరి; మరియొకనిని రాళ్ళదెబ్బలకు గురి చేసిరి.

36. అపుడు ఆ యజమానుడు ముందటి కంటె ఎక్కువమంది సేవకులను పంపెను. కౌలుదార్లు వారిని కూడ అటులనే చేసిరి.

37. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి, అతనిని వారి యొద్దకు పంపెను.

38. అపుడు ఆ కౌలుదార్లు ఆ కుమారుని చూచి 'ఇదిగో ఇతడే వారసుడు. ఇతనిని తుదముట్టింతము రండు. ఈ ఆస్తి మనకు దక్కును', అని తమలో తాము చెప్పుకొని,

39. వానిని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి.

40. “కాబట్టి, ద్రాక్షతోట యజమానుడు వచ్చినపుడు ఆ కౌలుదార్లను ఏమిచేయును?" అని యేసు ప్రశ్నించెను.

41. “ఆ దుషులను మట్టుపెట్టి, కోతకాలమున తన భాగమును చెల్లింపగల కౌలుదార్లకు ఆ భూమిని గుత్తకిచ్చును” అని వారు సమాధానమిచ్చిరి.

42. అపుడు యేసు వారితో, “మీరు లేఖనములందెన్నడు చదువలేదా? 'ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను. ఇది ప్రభువు ఏర్పాటు. - ఇది ఎంత ఆశ్చర్యకరము!'

43. అందువలన దేవుని రాజ్యము మీనుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చువారికి ఈయ బడునని నేను మీతో చెప్పుచున్నాను.

44. ఎవడు ఈ రాతిమీదపడునో, వాడు తునాతునకలగును. ఎవనిపై ఈ రాయిపడునో, వాడు నలిగి నుగ్గగును” అనెను.

45. ప్రధానార్చకులు, పరిసయ్యులు, యేసు ఉపమానములను విని, ఇవన్నియు తమను గూర్చియే అని గ్రహించిరి.

46. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కాని, యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి.