ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 22 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 22వ అధ్యాయము

 1. యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను.

2. "పరలోక రాజ్యము ఇట్లున్నది: ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి,

3. ఆహ్వానింపబడిన వారిని 'విందుకు బయలుదేరిరండు' అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి.

4. అందుచే అతడు, 'ఇదిగో! నా విందు సిద్ధపరుపబడినది. ఎద్దులును, క్రొవ్వినదూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రండు' అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను.

5. కాని పిలువబడినవారు దానిని లక్ష్యపెట్టక, తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరియొకడు తన వ్యాపారమునకు వెళ్ళెను.

6. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి.

7. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగుల బెట్టించెను.

8. అంతట, తన సేవకులను పిలిచి, 'నా విందు సిద్ధముగా ఉన్నది. కాని, నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు.

9. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు' అని పంపెను.

10. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్ళి, మంచి, చెడు తేడా లేక తమ కంటబడిన వారినందరను తీసుకొనివచ్చిరి. ఆ కల్యాణమండపము అతిథులతో నిండెను.

11. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి, వివాహవస్త్రములేని వానిని ఒకనిని చూచి,

12. 'మిత్రమా! వివాహవస్త్రము లేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి?” అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను.

13. అపుడు ఆ రాజు తన సేవకులతో, 'ఇతనిని కాలుసేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు కొరుకుకొందురు' అనెను.

14. పిలువబడిన వారు అనేకులు, కాని, ఎన్నుకొనబడిన వారు కొందరే."

15. పరిసయ్యులంతట వెలుపలికి వెళ్ళి, యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడపన్ని,

16. హేరోదీయులతో తమ శిష్యులను కొందరను ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి “బోధకుడా! నీవు సత్య వంతుడవు; దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు; ఎవరికిని భయపడవు; మోమో టము లేనివాడవు;

17. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా? కాదా? నీ అభిప్రాయమేమి?" అని అడిగిరి.

18. యేసు వారి దురాలోచనలను గుర్తించి, “వంచకులారా! నన్ను ఏల పరీక్షించుచున్నారు?

19. సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు” అని అడుగగా, వారొక దీనారమును ఆయనకు అందించిరి.

20. ఆయన వారిని “ఈ రూపనామధేయ ములు ఎవరివి?” అని ప్రశ్నింపగా,

21. “చక్రవర్తివి” అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. “మంచిది. చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు” అని ఆయన వారితో చెప్పెను.

22. ఇది విని, వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అటనుండి వెడలిపోయిరి.

23. ఆ రోజుననే మృతులకు పునరుత్థానము లేదను కొందరు సదూకయ్యులు యేసు వద్దకు వచ్చి,

24. “బోధకుడా! 'ఒకడు సంతానము లేక మర ణించిన, వాని సోదరుడు ఆ వితంతువును పెండ్లాడి అతనికి సంతానము కలుగజేయవలెను.' అని మోషే ఉపదేశించెను గదా!

25. మాలో ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లాడి చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసికొనెను.

26. ఇదే రీతి రెండవ వానికి, మూడవవానికి వరుసగా ఏడవవాని వరకు సంభవించెను.

27. తుట్టతుదకు ఆమెయు మరణించెను.

28. వారందరును ఆమెను వివాహమాడిరి. అట్లయిన పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరి భార్య అగును?” అని ప్రశ్నించిరి.

29. అందుకు యేసు, “లేఖనములనుగాని, దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.

30. ఏలయన, పునరుత్థాన మందు స్త్రీ పురుషుల మధ్య వివాహములు ఉండవు. వారు పరలోకమందలి దూతలవలె ఉందురు.

31. మృతుల పునరుత్థానమును గూర్చి దేవుడు ఏమి సెలవిచ్చెనో, మీరు ఎన్నడును చదువలేదా?

32. “ 'నేను అబ్రహాము దేవుడను, ఈసాకుదేవుడను, యాకోబుదేవుడను' అని ఆయన పలికెనుగదా! ఆయన సజీవులకే దేవుడుకాని, మృతులకు దేవుడు కాదు” అని సమాధానమిచ్చెను.

33. జనసమూహములు ఆ మాటలువిని ఆయన ఉపదేశమునకు ఆశ్చర్యపడిరి.

34. యేసు సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని, వారు అచటికి కూడి వచ్చిరి.

35. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయనను పరీక్షింపవలెనని,

36. “బోధకుడా! ధర్మశాస్త్రము నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?” అని అడిగెను.

37. అందుకు యేసు ప్రత్యుత్తరముగా "నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మ తోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను.”

38. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ.

39. 'నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను' అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే.

40. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడియున్నవి” అని సమాధానమిచ్చెను.

41. పరిసయ్యులందరు ఒక్కుమ్మడిగా వచ్చిన పుడు యేసు వారిని,

42. "క్రీస్తును గూర్చి మీరేమి తలంచుచున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించెను. “ఆయన దావీదు కుమారుడు” అని వారు సమాధానమిచ్చిరి.

43. “అట్లయిన దావీదు పవిత్రాత్మ ప్రేరణతో ఆయనను 'ప్రభువు' అని ఏల సంబోధించెను?

44. 'నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను.” ఇవి దావీదు పలుకులు గదా!

45. క్రీస్తును తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు అతడు కుమారుడు ఎట్లగును?” అని యేసు వారిని ప్రశ్నించెను.

46. అందుకు ప్రత్యుత్తరముగా ఎవడును ఒక్కమాటైనను పలుకలేదు. ఆ దినమునుండి ఆయనను ఎవరును, ఏమియును అడుగుటకు సాహసింపలేదు.