Telugu Catholic Bible Matthew chapter 17 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 17వ అధ్యాయము
1. ఆరుదినములు గడచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసికొని, ఒక ఉన్నతపర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను.
2. అచట వారియెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యెను.
3. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి.
4. అప్పుడు పేతురు "ప్రభూ! మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి మూడు శిబిరములను నిర్మింతును” అని పలికెను.
5. అంతలో ఒక కాంతి వంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి “ఈయన నా కుమారుడు. నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు,” అను వాణి వినిపించెను.
6. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి.
7. అప్పుడు యేసు వారి కడకు వచ్చి, వారిని తట్టి, “లెండు, భయపడకుడు” అని పలికెను.
8. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు.
9. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో “మనుష్యకుమారుడు మృతులనుండి లేపబడువరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు” అని ఆజ్ఞాపించెను.
10. అపుడు శిష్యులు “అట్లయిన ఏలియా ముందుగా రావలెనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు?” అని ప్రశ్నించిరి.
11. అందుకు ఆయన “తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును.
12. అయితే మీ చెప్పున దేమనగా ఏలియా వచ్చియేయున్నాడు. కాని ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారివలన శ్రమలు పొందబోవుచున్నాడు” అనెను.
13. శిష్యులు అపుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహానును గూర్చి అని గ్రహించిరి.
14. వారు అపుడు జనసమూహమును చేరగా, అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి,
15. “ప్రభూ! నా పుత్రుని కరుణింపుము. మూర్చరోగమువలన తీవ్రముగ బాధపడుచు అనేక పర్యాయములు నిప్పు లోను, నీళ్ళలోను పడుచున్నాడు.
16. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసికొనివచ్చితిని; కాని వారు ఇతనిని స్వస్థపరుపలేకపోయిరి” అనెను.
17. అందుకు యేసు వారితో “మీరెంత అవిశ్వాసులు! ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్ము సహింతును? వానిని నా యొద్దకు తీసికొని రండు” అని చెప్పెను.
18. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదలిపోయెను. ఆ గడియనుండి ఆ బాలుడు స్వస్థత పొందెను.
19. శిష్యులు యేసుతో ఏకాంతముగా, “ఆ పిశాచమును మేమేల పారద్రోల లేకపోతిమి?” అని అడిగిరి.
20. యేసు వారితో “మీ అల్పవిశ్వాసమే అందుకు కారణము, ఆవగింజంత విశ్వాసము మీకుండినయెడల ఈ పర్వతముతో 'నీవిక్కడ నుండి తొలగుము' అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని మీతో వక్కాణించుచున్నాను.
21. అయినను ఇట్టి దానిని ప్రార్ధనతోను, ఉపవాసముతో తప్ప మరి ఏ విధమునను వెడలగొట్ట శక్యముకాదు” అనెను.
22. పిమ్మట వారు గలిలీయలో తిరుగుచుండగా యేసు “మనుష్యకుమారుడు శత్రువులకు అప్పగింప బడబోవుచున్నాడు.
23. వారు ఆయనను చంపుదురు. కాని, మూడవదినమున లేపబడును” అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి.
24. అంతట వారు కఫర్నాము చేరినపుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, “మీ గురువు పన్ను చెల్లింపడా?” అని ప్రశ్నింపగా,
25. “చెల్లించును” అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు “సీమోను! నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరినుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రులనుండియా? ఇతరులనుండియా?” అని ప్రశ్నించెను.
26. పేతురు అందుకు “ఇతరుల నుండియే” అని ప్రత్యుత్తర మిచ్చెను. “అయితే పుత్రులు దీనికి బద్దులుకారుగదా!
27. వారు మనలను అన్యధా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచి నపుడు అందొక నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము” అని యేసు సీమోనును ఆదేశించెను.