ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 16 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 16వ అధ్యాయము

 1. శోధించు తలంపుతో పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరకువచ్చి "పరలోకమునుండి ఒక గురుతును చూపుము" అనిరి.

2. ఆయన వారికి ప్రత్యుత్తరముగా, “సంధ్యా సమయమున ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది. కనుక వాతావరణము బాగుండు ననియు,

3. ప్రాతఃకాల సమయమున ఆకాశము మబ్బుపట్టి ఎఱ్ఱగా ఉన్నది కనుక గాలివాన వచ్చు ననియు మీరు చెప్పుదురు. ఆకాశమును చూచి వాతావరణమును గుర్తింపగలిగిన మీరు ఈ కాలముల సూచనలను గుర్తింపలేకున్నారా?

4. వ్యభిచారులైన దుష్టతరమువారు ఒక గురుతును చూడగోరుచున్నారు. కాని యోనా గుర్తు తప్ప వేరొక గురుతు వారికి అనుగ్రహింప బడదు” అని వారిని వీడి వెళ్ళిపోయెను.

5. ఆయన శిష్యులు సరస్సుదాటి ఆవలి ఒడ్డునకు పోవునపుడు రొట్టెలు తీసికొనిపోవుట మరచిరి.

6. “పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి మీరు జాగరూకులైయుండుడు” అని యేసు వారితో చెప్పెను.

7. “మనము రొట్టెలు తీసికొని పోవుట మరచిపోయినందున ఆయన ఇట్లు పలికెను కాబోలు!" అని తమలో తాము మాటలాడుకొనిరి.

8. యేసు అది గ్రహించి, “అల్పవిశ్వాసులారా! రొట్టెలు లేవని మీరేల విచారించుచున్నారు?

9. మీరు ఇంతలోనే మరచితిరా? ఐదురొట్టెలను ఐదువేలమందికి పంచి పెట్టినపుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు!

10. ఏడు రొట్టెలను నాలుగువేల మందికి పంచిపెట్టినపుడు మిగిలిన వాటిని మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు!

11. నేనిపుడు రొట్టెలను గూర్చి ప్రస్తావించుటలేదని మీరు ఏలా గ్రహింపరు? కావున పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహింపుడు” అనెను.

12. అప్పుడు శిష్యులు పులిసిన పిండిని గాక పరిసయ్యుల, సదూకయ్యుల బోధను గూర్చి ఆయన ప్రస్తావించెనని గ్రహించిరి.

13. తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. “ప్రజలు మనుష్యకుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?” అని తన శిష్యులను ఆయన అడిగెను.

14. అందుకు వారు “కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు” అనిరి.

15. “మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు?” అని యేసు వారిని అడిగెను.

16. అందుకు సీమోను పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” అని సమాధానమిచ్చెను.

17. "యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు.

18. నీవు పేతురువు, ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు.

19. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోక మందును విప్పబడును.”

20. ఇట్లు చెప్పి, తాను క్రీస్తునని ఎవ్వరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను.

21. అప్పటినుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దలవలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకులవలన పెక్కు బాధలను అనుభవించి, మరణించి మూడవదినమున పునరుత్తానుడగుట అగత్యమని వచించెను.

22. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, “ప్రభూ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక!” అని వారింపసాగెను.

23. అందుకు ఆయన పేతురుతో “ఓ సైతానూ! నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా నున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు” అనెను.

24. “నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను.

25. తన ప్రాణమును కాపాడు కొనచూచువాడు, దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును.

26. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు?

27. మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును.

28. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింప బోరని నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు శిష్యులతో పలికెను.