ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 26 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 26వ అధ్యాయము

 1. యేసు ఈ విషయములనన్నిటిని బోధించిన పిదప శిష్యులతో,

2. “రెండు రోజులైన పిదప పాస్క పండుగ వచ్చునని మీరు ఎరుగుదురు. అప్పుడు మనుష్య కుమారుడు సిలువవేయబడుటకు అప్పగింపబడును" అని పలికెను.

3. అప్పుడు ప్రధానార్చకులును, ప్రజల పెద్దలును కైఫా అను ప్రధానార్చకుని సభామందిరమున సమావేశమై,

4. దొంగచాటుగా యేసును బంధించి, చంపవలెనని కుట్రచేసిరి.

5. కాని, “పండుగ దినములలో వలదు. అది ప్రజలలో అలజడి లేపవచ్చును” అని తలంచిరి.

6. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగి యగు సీమోను ఇంటనుండెను.

7. ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యముగల చలువరాతి పాత్రతో వచ్చి భోజనపంక్తియందున్న యేసు శిరమును అభిషేకించెను.

8. అది చూచిన శిష్యులు కోపపడి “ఈ వృథా వ్యయమెందుకు?

9. దీనిని అధిక వెలకు అమ్మి పేదలకు దానము చేయవచ్చును గదా!" అనిరి.

10. యేసు అది గ్రహించి, “మీరు ఏల ఈమె మనస్సు నొప్పించే దరు? ఈమె నాపట్ల ఒక సత్కార్యము చేసినది.

11. బీదలు ఎల్లప్పుడును మీతో ఉన్నారు. నేను ఎల్లప్పుడు మీతో ఉండను.

12. నా భూస్థాపనము నిమిత్తము ఈమె ఈ పరిమళద్రవ్యమును నా శరీరముపై క్రుమ్మరించినది.

13. సమస్త ప్రపంచము నందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో, అచ్చట ఈమె చేసిన కార్యము ఈమె జ్ఞాపకార్థము ప్రశంసింప బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.

14. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి,

15. వారితో, “నేను ఆయనను మీకు అప్పగించినయెడల మీరు నాకు ఏమిత్తురు?” అని అడిగెను. వారు అతనికి ముప్పది వెండినాణెములను ఇచ్చిరి.

16. అప్పటినుండి వాడు, ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను.

17. పులియని రొట్టెలపండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, “మేము ఎచట నీకు పాస్క భోజనము సిద్ధపరుపగోరెదవు?” అని ప్రశ్నించిరి.

18.“మీరు పట్టణమున ఒకానొక మనుష్యునియొద్దకు వెళ్ళి, 'నా సమయము ఆసన్నమైనది. నా శిష్యులతో నీ గృహమున పాస్క భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు' అని అతనితో చెప్పుడు” అని యేసు పలికెను.

19. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్క భోజనమును సిద్ధపరచిరి.

20. సాయంకాలము కాగా, ఆయన పన్నిదరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను.

21. వారు భుజించుచుండ యేసు “మీలో ఒకడు నన్ను శత్రువు లకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగ చెప్పు చున్నాను” అనెను.

22. అప్పుడు వారందరు మిగుల చింతించి “ప్రభూ! నేనా?” అని ఒక్కొక్కరు అడుగ సాగిరి.

23. అందులకు ఆయన 'నాతోపాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును.

24. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్యకుమారుడు చంపబడును. కాని మనుష్యకుమారుని అప్పగించువానికి అయ్యో అనర్ధము! అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యెడిది” అనెను.

25. అప్పుడు ఆయనను అప్పు గింపనున్న యూదా, “బోధకుడా! నేనా”? అని అడుగగా “నీవే చెప్పుచున్నావు” అని యేసు సమాధానము ఇచ్చెను.

26. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి, త్రుంచి, తన శిష్యులకు ఇచ్చుచు, “దీనిని మీరు తీసికొని భుజింపుడు. ఇది నా శరీరము” అనెను.

27. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరు అందరు త్రాగుడు.

28. ఇది అనేకుల పాపపరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము.

29. ఇది మొదలుకొని మీతో గూడ నాతండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చేయువరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను” అనెను.

30. వారొక కీర్తన పాడి ఓలీవు కొండకు వెళ్ళిరి.

31. అపుడు యేసు వారితో, “మీరు ఈ రాత్రి నా విషయమై వెరగొంది, నన్ను వదలిపెట్టి వెడలి పోయెదరు 'నేను గొఱ్ఱెల కాపరిని కొట్టుదును. మందలోని గొఱ్ఱెలు చెల్లాచెదరగును' అని వ్రాయబడియున్నది.

32. అయినను నేను ఉత్తానమైన పిదప మీకంటే ముందు గలిలీయ సీమకు వెళ్ళెదను” అని పలికెను.

33. “అందరు మిమ్ము విడిచి పెట్టి పోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికిని విడనాడను" అని పేతురు పలికెను.

34. అందుకు యేసు “ఈ రాత్రి కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.

35. అపుడు పేతురు ఆయనతో, “నేను మీతో మరణింపవలసివచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను” అనెను. అట్లే శిష్యులందరును అనిరి.

36. అపుడు యేసు శిష్యులతో గెత్సెమని తోటకు వచ్చి “నేను అల్లంత దూరముపోయి ప్రార్థన చేసికొని వచ్చువరకు మీరిచట కూర్చుండుడు” అని వారితో చెప్పెను.

37. పేతురును, జెబదాయి కుమారుల నిద్దరను తనతో పాటు తీసికొనిపోయెను. అపుడాయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను.

38. “నా ఆత్మ మరణవేదనను అనుభవించుచున్నది. మీరిచటనే యుండి, నాతో జాగరణము చేయుడు” అని పలికెను.

39. ఆయన మరి కొంతదూరము వెళ్ళి నేలపై సాగిలపడి "ఓ నా తండ్రీ! సాధ్యమైనయెడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము” అని ప్రార్థించెను.

40. అంతట ఆయన శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట గమనించి పేతురుతో, “ఇదేమి! మీరు నాతో ఒక గంటయైనను మేలుకొని ఉండలేక పోయితిరా?

41. మీరు శోధనలకు గురికాకుండు టకు మేలుకొని ప్రార్ధింపుడు. ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది” అనెను.

42. మరల ఆయన రెండవమారు వెళ్ళి, “ ఓ తండ్రీ, నేను పానము చేసిననే తప్ప, ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యముకాని యెడల నీ చిత్తము నెరవేర నిమ్ము” అని ప్రార్థించి,

43. తిరిగివచ్చి వారు నిద్రించుచుండుట చూచెను. ఏలయన నిద్రా భారముచే వారి కన్నులు బరువెక్కెను.

44. ఆయన మరల వారలను వీడి, కొంత దూరము వెళ్ళి, మూడవ మారు కూడ అట్లే ప్రార్థించెను.

45. పిదప తన శిష్యులను సమీపించి, “మీరు ఇంకను నిద్రించుచు విశ్రాంతి తీసికొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది.

46. లెండు, పోదము రండు. చూడుడు, నన్ను పట్టిచ్చువాడు సమీపముననే ఉన్నాడు” అనెను.

47. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అదిగో! పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానా ర్చకులు, ప్రజల పెద్దలు పంపిన మహా జనసమూ హము కత్తులను, బడితలను చేతబూని అతనితో వచ్చెను.

48. “నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన. అతనిని పట్టి బంధింపుడు” అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పెను.

49. వెంటనే అతడు యేసును సమీపించి, “బోధకుడా! శుభమగును గాక!” అని ఆయనను ముద్దు పెట్టుకొనెను.

50. అపుడు యేసు వానితో, “స్నేహితుడా! నీవు వచ్చిన పని కానిమ్ము” అని అనగా, వారు ఆయనను పట్టుకొని బంధించిరి.

51. వెంటనే యేసు వద్దనున్నవారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి, వాని చెవి తెగనరికెను.

52. అతనితో యేసు “నీ కత్తిని ఒరలోవేయుము” కత్తిని ఎత్తువారు కత్తితోనే నశించెదరు.

53. నేను నా తండ్రిని ప్రార్థింపలేనను కొంటివా? ప్రార్ధించిన ఈ క్షణమున ఆయన పండ్రెండు దళముల కంటె ఎక్కువమంది దూతలను పంపడా?

54. ఇట్లు కాదేని, ఈ విధముగా జరుగవలెనను లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును?” అనెను. -

55. ఆ సమయమున యేసు ఆ సమూహముతో “దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతోను, గుదియలతోను 'నన్ను పట్టుకొనుటకు వచ్చితిరేల? ప్రతిదినము నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని కాని, మీరు అపుడు నన్ను పట్టు కొనలేదు” అనెను.

56. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణములగునట్లు ఇదియంతయు జరిగెను. అపుడు శిష్యులందరును ఆయనను విడిచి పెట్టి పారిపోయిరి.

57. యేసును బంధించినవారు ఆయనను ప్రధానా యజకుడైన కైఫా వద్దకు తీసికొనిపోయిరి. అచట ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు సమావేశమైరి.

58. పేతురు దూరదూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహప్రాంగణమువరకు అనుసరించి లోపల ప్రవేశించి, దాని పర్యవసానమును చూచుటకై కావలివారితో పాటు కూర్చుండెను.

59. యేసును చంపుటకై అచట ప్రధానార్చకులు, న్యాయసభ సభ్యులు అసత్యసాక్ష్యము వెదకిరి.

60. కూటసాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యమును దొరకలేదు. తుట్టతుదకు ఇద్దరు ముందుకు వచ్చి,

61. “నేను దేవళమును పడగొట్టి మూడు రోజులలో తిరిగి నిర్మించెదను అని ఇతడు చెప్పెను” అనిరి.

62. అపుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, “నీకు వ్యతిరేకముగా వీరు చెప్పునదేమి? దీనికి నీవు ప్రత్యుత్తర మీయవా?” అని యేసును ప్రశ్నించెను.

63. అందులకు యేసు మిన్నకుండెను. ప్రధాన యాజకుడు మరల “జీవము గల దేవునితో, ఆనబెట్టి అడుగుచున్నాను. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మాతో చెప్పుము” అని యేసును ప్రశ్నించెను.

64. అందుకు యేసు “నీవన్నట్లే. అయినను ఇక నుండి మనుష్యకుమారుడు సర్వశక్తి మంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయు, ఆకాశము నుండి మేఘారూఢుడై వచ్చుటయు, మీరు చూచెదరని చెప్పుచున్నాను” అనెను.

65. అపుడు ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని “ఇతడు దేవదూషణము గావించెను. మనకిక సాక్షులతో పనియేమి? ఇదిగో మీరు ఇతని దేవదూషణము విని యున్నారు గదా!

66. మీ అభిప్రాయమేమి?" అని అడుగగా "ఇతడు మరణమునకు పాత్రుడు” అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.

67. అపుడు వారు ఆయన ముఖముపై ఉమిసి, పిడికిళ్ళతో గ్రుద్దిరి. మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు,

68. “మెస్సయా! ప్రవచింపుము! నిన్ను కొట్టినదెవరో చెప్పుము” అనిరి.

69. పేతురు ఆ గృహప్రాంగణమున కూర్చుండి యుండెను. అపుడొక దాసి అతని వద్దకు వచ్చి “నీవును గలిలీయ నివాసియగు యేసుతో ఉన్నవాడవుగదా!” అనెను.

70. అతడు అందరి యెదుట బొంకుచు, “నీవు చెప్పునదేమో నాకు తెలియదు” అనెను.

71. అతడు ద్వారము వద్దకు వచ్చినపుడు మరియొక పనికత్తె అతనిని చూచి, “వీడు కూడ నజరేయుడగు యేసుతో ఉన్నవాడు” అని అచటివారికి చెప్పెను.

72. అతడు మరల బొంకుచు, “ఆ మనుష్యుని నేను ఎరుగను” అని ప్రమాణముచేసి చెప్పెను.

73. కొంత సమయము అయిన తరువాత అచ్చట నున్నవారు పేతురు చుట్టుచేరి, “నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడవు. నీ మాటల తీరుతెన్నులు దీనిని వ్యక్తపరచుచున్నవి” అనిరి.

74. అపుడతడు “నేను ఆ వ్యక్తిని ఎరుగనే ఎరుగను” అని ప్రమాణము చేయుచు తనను తాను శపించుకొనసాగెను. వెంటనే కోడి కూసెను.

75. “కోడి కూయకముందే నీవు మూడుసార్లు నన్ను ఎరుగనందువు” అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని, వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను.