ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 20 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 20వ అధ్యాయము

 1. “పరలోకరాజ్యము ఈ ఉపమానమును పోలి యున్నది: ఒక యజమానుడు తన ద్రాక్షతోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతఃకాలమున బయలు దేరెను.

2. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసికొని, వారిని తన తోటకు పంపెను.

3. తిరిగి ఆ యజమానుడు తొమ్మిదిగంటల' సమయమున బయటకు వెళ్ళి, అంగడి వీధిలో పనికొరకు వేచియున్న కొందరిని చూచి,

4. 'మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్ళిరి.

5. తిరిగి పండ్రెండు గంటలకు, మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను.

6. రమారమి సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్ళి, సంతవీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి, 'మీరు ఏల రోజంతయు పనిపాటులు లేక ఇచట నిలిచియున్నారు?' అని ప్రశ్నించెను.

7. 'మమ్మేవ్వరు కూలికి పిలువలేదు' అని వారు ప్రత్యుత్త రమిచ్చిరి. అంతట ఆ యజమానుడు 'అటులైన మీరు కూడ నా ద్రాక్షతోటలో పనిచేయుటకు వెళ్ళుడు' అనెను.

8. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో 'ద్రాక్షతోటలో పని చేసినవారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము' అనెను.

9. అటులనే సాయంత్రము అయిదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికిని తలకొక దీనారము లభించెను.

10. తొలుత పనిలో ప్రవేశించినవారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కాని, వారుకూడ తలకొక దీనారమునే పొందిరి.

11. వారు దానిని తీసికొని, యజమానునితో

12. 'పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్టచివర ఒక గంట మాత్రమే పనిలో వంగినవారికిని, సమానముగా కూలి నిచ్చితివేమి'? అని గొణగుచు పలికిరి.

13. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, 'మిత్రమా! నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా?

14. నీ కూలి నీవు తీసికొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికిని ఇచ్చుట నా యిష్టము.

15. నా ధనమును నా యిచ్చవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా?' అని పలికెను.

16. ఇట్లే మొదటివారు కడపటి వారగు దురు. కడపటివారు మొదటివారగుదురు” అని యేసు పలికెను.

17. యేసు యెరూషలేమునకు పోవుచు మార్గ మధ్యమున పన్నిద్దరు శిష్యులతో ఇట్లనెను:

18. “ఇదిగో! మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అచట మనుష్యకుమారుడు ప్రధానార్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును వారు ఆయనకు మరణదండన విధించి,

19. జనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళలు మొనర్చి, కొరడాలతో కొట్టి, సిలువ వేయుదురు. కాని ఆయన మూడవదినమున లేపబడును.”

20. అంతట జెబదాయి కుమారుల తల్లి, తన కుమారులతో యేసు వద్దకు వచ్చి, మోకరించి, ఒక మనవి చేయబోగా,

21. “నీ కోరిక యేమి?” అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, “నీ రాజ్య ములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను, ఒకడు నీ ఎడమ వైవునను కూర్చుండ సెలవిమ్ము" అని మనవిచేసెను.

22. అందులకు యేసు, “మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?” అని పలుకగా, “చేయగలము” అని వారి రువురును సమాధానమిచ్చిరి.

23. అందుకు యేసు, “మీరు నా పాత్రమునుండి పానము చేసెదరు. కాని, నా కుడిఎడమల గూర్చుండ జేయునది నేను కాదు; నా తండ్రి యేర్పరచిన వారికే అది లభించును” అనెను.

24. తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినపుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి.

25. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను: “ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియునుగదా!

26. కాని మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన, అతడు మీకు సేవకుడుగా ఉండవలయును.

27. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలచిన, అతడు మీకు దాసుడై ఉండ వలయును.

28. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము తన ప్రాణమును ధార పోయుటకు వచ్చెను.”

29. యేసు యెరికోనుండి పయనమై పోవు చుండగా, మహాజనసమూహము ఆయనను వెంబడించెను.

30. యేసు ఆ మార్గమున పోవుచున్నాడని విని త్రోవ ప్రక్కన కూర్చుండిన ఇద్దరు గ్రుడ్డివారు, “ప్రభూ! దావీదు కుమారా! మాపై దయజూపుము” అని కేకలు వేసిరి.

31. జనసమూహము గ్రుడ్డివారిని “ఊరకుండుడు” అని కసరుకొనెను. కాని, వారు “దావీదు కుమారా! ప్రభూ! మమ్ము కరుణింపుము" అని మరింత బిగ్గరగా అరచిరి.

32. అపుడు యేసు నిలిచి, వారిని పిలిచి, “నేను మీకేమి చేయగోరు చున్నారు?” అని అడిగెను.

33. అంతట వారు "ప్రభూ! మాకు దృష్టిని దయచేయుడు” అని మనవి చేసికొనిరి.

34. యేసు కనికరించి వారి నేత్రములను తాకెను. వెంటనే వారు దృష్టిని పొంది, ప్రభువును వెంబడించిరి.