ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 10 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 10వ అధ్యాయము

 1. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను.

2. ఆ పన్నిద్దరు అపోస్తలుల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రెయ, జెబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను,

3. ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి,

4. కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు.

5. యేసు ఈ పన్నిద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “అన్య జనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు.

6. కాని, చెదరిపోయిన గొఱ్ఱెలవలెనున్న యిస్రాయేలు ప్రజలయొద్దకు వెళ్ళి,

7. వరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు,

8. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను ఎల్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు.

9. మీతో బంగారమును గాని, వెండిని గాని, రాగిని గాని కొనిపోవలదు.

10. ప్రయాణమునకై జోలెనుగాని, రెండు అంగీలనుగాని, పాదరక్షములనుగాని, చేతికర్రను గాని తీసికొని పోవలదు. ఏలయన, పనివాడు తన బత్తెమునకు అర్హుడు.

11. ఏ పట్టణమునుగాని, ఏ పల్లెనుగాని మీరు ప్రవేశించినపుడు అందు యోగ్యుడగు వానిని వెదకి కొనుడు. అచటినుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు.

12. మీరొక యింటిలోనికి ప్రవేశించి నపుడు, ఆ యింటిని దీవింపుడు,

13. ఆ ఇల్లు యోగ్య మైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగిచేరును.

14. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక, మీ ఉపదేశములను ఆలకింపక పోయినచో, ఆ ఇంటినిగాని, పట్టణమునుగాని విడిచి పొండు. మీ పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు.

15. తీర్పు దినమున ఆ పురవాసుల గతికన్న సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

16. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పముల వలె యుక్తులై, పావురములవలె నిష్కపటులై మెలగుడు.

17. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి, ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు.

18. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును, రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను, అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు.

19. మీరు న్యాయ స్థానములకు అప్పగింపబడినపుడు ఎట్లు మాట్లాడ వలయునో, ఏమి చెప్పవలయునో, అని కలతచెంద కుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్ల మీకు అపుడు అనుగ్రహింపబడును.

20. మీరు మాట్లాడు మాటలు మీవి కావు; మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును.

21. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు.

22. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరు ద్వేషింతురు; కాని, చివరివరకు సహించి నిలిచినవాడే రక్షింపబడును.

23. మిమ్ము ఒక పట్టణమున హింసించినపుడెల్ల వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్యకుమారుడు వచ్చునప్పటికి యిస్రాయేలు పట్టణములన్నిటిని మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను.

24. శిష్యుడు గురువు కంటెను అధికుడు కాడు. సేవకుడు యజమానుని కంటెను అధికుడు కాడు.

25. గురువువలె శిష్యుడు, యజమానునివలె సేవకుడు అయిన చాలును, ఇంటి యజమానుడు 'బెల్జబూలు' అని పిలువబడిన యెడల, అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురోకదా!”

26. “కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు. రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు.

27. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీదినుండి ప్రకటింపుడు.

28. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయ గలవానికి ఎక్కువగా భయపడుడు.

29. ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు; కాని, మీ తండ్రి సంకల్పములేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు.

30. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నియు లెక్కింపబడియేయున్నవి.

31. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకలకంటె అతి విలువైనవారు.

32. "కనుక ప్రజలయెదుట నన్ను అంగీకరించు ప్రతివానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును.

33. అటులగాక, ప్రజల యెదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోక మందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును.

34. “ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని, శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు.

35. నా రాక, తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించునట్లు చేయును.

36. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు.

37. తన తండ్రిని గాని, తల్లిని గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు. తన కుమారునిగాని, కుమార్తెను గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు.

38. తన, సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడుకాడు.

39. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును; నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును.

40. “మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు.

41. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు, ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించు వాడు, నీతిమంతుని బహుమానమును పొందును.

42. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”