ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 9 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 9వ అధ్యాయము

 1. అంతట యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను.

2. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని, కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో “కుమారా! ధైర్యము వహింపుము. నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను.

3. అపుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, “ఇతడు దైవదూషణము చేయుచున్నాడు” అని తమలో తాము అనుకొనిరి.

4. వారి తలంపులను గ్రహించిన యేసు, “మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను?

5. నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవులేచి నడువుమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము?

6. ఈ భూమి మీద మనుష్యకుమారునకు పాపములనుక్షమించు అధికారము కలదని మీకిపుడే తెలియును” అని పలికి, ఆ రోగితో “నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి పొమ్ము” అనెను.

7. అతడు వెంటనే లేచి తన యింటికి పోయెను.

8. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి.

9. తరువాత యేసు అటనుండి వెళ్ళుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న 'మత్తయి' అనువానితో “నన్ను అనుసరింపుము” అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను.

10. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినపుడు సుంకరులును, పాపులును అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి.

11. అది చూచిన పరిసయ్యులు “మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.

12. ఆ మాటలను ఆలకించిన యేసు, “వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!

13. 'నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు' అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు” అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను.

14. యోహాను శిష్యులు యేసును సమీపించి, “మేము, పరిసయ్యులు కూడ తరచుగా ఉపవాసము ఉందుము గాని, మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేల?” అని ప్రశ్నింపగా,

15. "పెండ్లికుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చినవారు ఏల శోకింతురు? పెండ్లికుమారుడు వారి వద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు.

16. పాత గుడ్డకు మాసికవేయుటకు క్రొత్తగుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయో గించిన క్రొత్తగుడ్డ క్రుంగుటవలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును.

17. క్రొత్త ద్రాక్షరసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును; తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్తతిత్తులలో పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును” అని యేసు సమాధాన మొసగెను.

18. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోక రించి, “నా కుమార్తె ఇపుడే మరణించినది. కాని, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపైనుంచిన ఆమె బ్రతుకును” అని ప్రార్థించెను.

19. అపుడు యేసు లేచి, శిష్య సమేతముగా అతనిని వెంబడించెను.

20. అప్పుడు పండ్రెండేండ్లనుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుకనుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను.

21. ఏలయన, “ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును” అని ఆమె తనలో తాను అనుకొనెను.

22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, “కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరచెను” అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను.

23. పిమ్మట యేసు, ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచట పిల్లనగ్రోవిని ఊదెడివారిని, అలజడిగ నున్న జనసమూహమును చూచి,

24. “మీరందరు ఆవలికిపొండు. ఈ బాలిక మరణించలేదు, నిదురించుచున్నది” అని పలికెను. అందులకు వారందరు ఆయనను హేళనచేసిరి.

25. మూగియున్న జన సమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను.

26. ఆ వార్త ఆ ప్రాంతము అంతట వ్యాపించెను.

27. అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవు చుండగా, ఇద్దరు గ్రుడ్డివారు. ఆయన వెంటబడి “దావీదు కుమారా! మమ్ము కరుణింపుము" అని మొర పెట్టుకొనిరి.

28. యేసు ఇంట ప్రవేశించినపుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అపుడు యేసు వారిని “నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించు చున్నారా? అని ప్రశ్నింపగా, వారు "అవును ప్రభూ!” అని పలికిరి.

29. అంతట ఆయన వారి నేత్రములను తాకి “మీరు విశ్వసించినట్లు జరుగునుగాక!” అని పలికెను.

30. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికిని తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను.

31. కాని, వారు పోయి యేసు కీర్తిని దేశమంతట ప్రచారము గావించిరి.

32. వారు పోవుచుండగా, పిశాచము పట్టి నోటిమాట పడిపోయిన మూగవానిని ఒకనిని, కొందరు యేసువద్దకు కొనివచ్చిరి.

33. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అపుడు అచటి ప్రజలు ఎల్లరు ఆశ్చర్యపడుచు, “యిస్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము” అనిరి.

34. కాని పరిసయ్యులు, “పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు” అని ఈసడించిరి.

35. యేసు అన్ని పట్టణములను, గ్రామ ములను తిరిగి, ప్రార్థనామందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధిబాధలనెల్ల పోగొట్టు చుండెను.

36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె చెదరియున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను.

37. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ.

38. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు” అని పలికెను.