ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 6 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 6వ అధ్యాయము

 1. "మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు.

2. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను, వీధులలోను డాంబికులు చేయు నట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను.

3. నీవు దానము చేయునపుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమచేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము.

4. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును.

5. "కపట భక్తులవలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో, వీధుల మలుపులలో నిలువబడి, జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించెనని మీతో వక్కా ణించుచున్నాను.

6. ప్రార్ధన చేయునపుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును. .

7. అన్యులవలె అనేక వ్యర్ధ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు.

8. కాబట్టి వారివలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరడుగక మునుపే మీ తండ్రి ఎరిగియున్నాడు.

9. మీరిట్లు ప్రార్ధింపుడు: 'పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పవిత్రపరుపబడునుగాక!

10. నీ రాజ్యము వచ్చునుగాక! నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక!

11. నేటికి కావలసిన మా అనుదిన ఆహార మును మాకు దయచేయుము.

12. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పు లను క్షమింపుము.

13. మమ్ము శోధనలో చిక్కు కొననీయక, దుష్టునినుండి రక్షింపుము'.

14. పరులు చేసిన దోషములను మీరు క్షమించినయెడల, పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును.

15. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనియెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు.

16. “మీరు ఉపవాసము చేయునపుడు, కపట వేషధారులవలె విచారవదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరులకంట పడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను.

17. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము.

18. అందు వలన అదృశ్యుడైయున్న నీ తండ్రియేకాని, మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగ ఒసగును.

19. “ఈ లోకములో సంపదలు కూడబెట్టు కొనవలదు. చెద పురుగులు, త్రుప్పు వానిని తిని వేయును. దొంగలు కన్నమువేసి దోచుకొందురు.

20. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టు కొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు; దొంగలు కన్నమువేసి దోచుకొనరు.

21. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును.

22. “నీ కన్ను నీ దేహమునకు దీపము. నీ కన్ను తేటగానున్నచో, నీ దేహమంతయు కాంతి మంతమైయుండును.

23. నీ కన్ను దుష్టమైనచో, నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో, ఆ చీకటి మహాఘోరమైనది!”

24. “ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును. మరియొకనిని ప్రేమించును, ఒకనిని నమ్ముకొని, మరియొకనిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడును దైవమును, ధనమును సేవింపజాలవు.

25. “కావున వినుడు. ఏమి తినెదమా? ఏమి త్రాగెదమా? ఏమి ధరించెదమా? అని మీ ప్రాణమును గూర్చి వెతచెందకుడు. మీ ప్రాణము ఆహారముకంటె, మీ దేహము వస్త్రములకంటె విలువయైనవికావా?

26. ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు. నూర్పిడులు చేయుటలేదు. గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచున్నాడు. పక్షులకంటె మీరు విలువైన వారు కారా?

27. మీలో ఎవరైన ఆందోళనతో ఆయువును మూరెడైనను పెంపొందింపజేసికొన గలరా?

28. మీరు వస్త్రములకై తహతహపడనేల? లిల్లీ పుష్పములు పెరుగురీతిని పరిక్షింపుడు. అవి తమకై శ్రమపడుట లేదు. వస్త్రములను వాడుకుకొనుటలేదు గదా!

29. సకల వైభవసమేతుడగు సొలోమోను సైతము వీనిలో ఒక్కదానివలెనైనను అలంకరింపబడ లేదు.

30. అల్పవిశ్వాసులారా! నేడు పుట్టి, రేపు పొయ్యిమంటలో గిట్టు గడ్డిపోచను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా, అంతకంటే ఎక్కువగా మిమ్మును గూర్చి యోచింపడా?

31. కావున, ఏమి తినెదమా? ఏమి త్రాగెదమా? ఏమి ధరించెదమా? అని మీరు కలత చెందకుడు.

32. వీనినన్నింటిని అన్యులు కాంక్షింతురు. ఏలయన, పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్ల గుర్తించును.

33. మొదట ఆయన రాజ్య మును, నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింప బడును.

34. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు. ఎందుకన రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆ నాటికి చాలును. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services