ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 5 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 5వ అధ్యాయము

 1. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టుచేరిరి.

2. ఆయన నోరువిప్పి ఉపదేశింప ఆరంభించెను:

3. "దీనాత్ములు ధన్యులు దైవరాజ్య ము వారిది.

4. శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు.

5. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు.

6. నీతి నిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు.

7. దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు.

8. నిర్మలహృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు.

9. శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు.

10. ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది.

11. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినపుడు, హింసించినపుడు, నిందారోపణ గావించినపుడు మీరు ధన్యులు.

12. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు.

13. "మీరు భూమికి ఉప్పువలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయినయెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకేగాని, మరెందుకును పనికిరాదు.

14. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండజాలదు.

15. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు గాని కుంచము క్రింద ఉంచరుగదా!

16. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారియెదుట ప్రకాశింపనిండు.”

17. "నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమొనర్చుటకే గాని, రద్దు చేయుటకుకాదు.

18. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను.

19. కాబట్టి ఎవరైన ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోకరాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు వరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణించబడును.

20. ధర్మశాస్త్ర బోధకులకంటె, పరిసయ్యులకంటె మీరు నీతిమంతమైన జీవితము జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను.

21. “నరహత్య చేయరాదు. నరహత్య కావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారుగదా!

22. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్ధుడా!' అని అవమానపరచినవాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని 'మూర్ఖుడా' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును.

23. కనుక, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినపుడు నీ సోదరునికి నీపై మనస్పర్థయున్నట్లు నీకు స్పురించినచో,

24. ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి, మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము.

25. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.

26. నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించు చున్నాను.

27. " 'వ్యభిచరింపరాదు' అను శాసనమును మీరు వినియున్నారుగదా!

28. నేను నొక్కి వక్కాణించు నదేమనగా, కామేచ్చతో స్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించి యున్నాడు.

29. కనుక, నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకములో త్రోయబడుటకంటె నీ అవయవములలో ఒకదానిని కోల్పోవుట మేలు.

30. నీ కుడిచేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుటకంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు.

31. " 'తన భార్యను విడువనెంచువాడు విడాకుల పత్రమును ఈయవలెను' అని మీరు వినియున్నారు గదా!

32. నేనిపుడు చెప్పునదేమనగా: వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతివ్యక్తియు ఆమెను వ్యభిచారిణిని చేసినవాడగును. అట్లు విడనాడ బడిన స్త్రీని వివాహమాడినవాడు అమెతో వ్యభిచరించిన వాడగును.

33. " 'నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగముచేయక నెరవేర్పవలయును' అని పూర్వీకులకు చెప్పబడినదని మీరు వినియున్నారు కదా!

34. కాని నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా: మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టుపెట్టుకొనరాదు. ఏలయన, అది దేవుని సింహాసనము.

35. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలయన. అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలయన, అది ఆ మహారాజు నగరము.

36. నీ తల వెంట్రుకను ఒకదానినైనను నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము.

37. మీరు చెప్పదలిచినది 'ఔను' లేదా 'కాదు' అనువానితో సరిపుచ్చవలెను. అంతకుమించిన పలుకులు దుష్టునినుండి వచ్చునవే.

38. " 'కంటికి కన్ను, పంటికి పన్ను' అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా!

39. నేనిపుడు మీతో చెప్పునదేమన: నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానికి, నీవు నీ ఎడమ చెంపను కూడ త్రిప్పుము.

40. నీతో తగవులాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు వ్యాజ్యెమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము.

41. ఒకడు నిన్ను తనతో ఒక మైలు రమ్మని బలవంతముచేసిన, వానితో రెండు మైళ్ళు వెళ్ళుము.

42. అడిగిన వానికి లేదనక యిమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిపుడు నొక్కి వక్కాణించుచున్నాను.

43. “ 'నీ పొరుగువానిని ప్రేమింపుము; నీ శత్రువును ద్వేషింపుము' అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా!

44. నేనిపుడు మీతో చెప్పునదేమన మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారికొరకు ప్రార్ధింపుడు.

45. అపుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన దుర్జనులపై, సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై, దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు.

46. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు' సైతము అటులచేయుట లేదా?

47. మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకతయేమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా?

48. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!