ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 3 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 3వ అధ్యాయము

 1. ఆ రోజులలో స్నాపకుడగు యోహాను యూదయా దేశపు ఎడారిలో బోధించుచు,

2. “పరలోకరాజ్యము సమీపించినది, మీరు హృదయపరివర్తనము చెందుడు" అని పలికెను.

3. " 'ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు' అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను” అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను.

4. అతడు ఒంటె రోమముల కంబళి ధరించి, నడుమునకు తోలుపట్టెను కట్టి, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను.

5. యెరూషలేము నుండియు, యూదయా అంతట నుండియు, యోర్దాను నదీ పరిసర ప్రదేశముల నుండియు ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి.

6. వారు తమతమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి.

7. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు,సదూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో “ఓ సర్పసంతానమా! రానున్న కోపాగ్నినుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు?

8. మీరిక హృదయపరివర్తనమునకు తగిన పనులుచేయుడు.

9. 'అబ్రహాము మా తండ్రి' అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళనుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగజేయగలడు.

10. వృక్షములను వేళ్ళతోసహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా నున్నది. కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును.

11. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను. కాని, నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోను, అగ్నితోను స్నానము చేయించును. ఆయన నా కంటె శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను.

12. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును” అనెను.

13. అపుడు యేసు గలిలీయసీమనుండి యోర్దాను తీరముననున్న యోహాను వద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను.

14. యోహాను యేసును వారించుచు, "నేనే నీచేత బప్తిస్మము పొందవలసినవాడను. అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా?” అనెను.

15. అందుకు యేసు “ఇపుడిట్లే జరుగనిమ్ము. దేవుని సంకల్పమును అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజ సము” అని సమాధానమీయగా యోహాను అంగీకరించెను.

16. యేసు బప్తిస్మముపొంది నీటినుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో! ఆకాశము తెరువ బడగా దేవుని ఆత్మపావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను.

17. అప్పుడు ఆకాశమునుండి ఒక దివ్యవాణి “ఈయన నాప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను” అని వినిపించెను.