ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2nd Thessalonians Chapter 1 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము

 1. తండ్రియగు దేవునకును, ప్రభువగు యేసుక్రీస్తునకును సంబంధించిన తెస్సలోనిక సంఘ మునకు పౌలు,సిలాసు, తిమోతిలు వ్రాయునది:

2. తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతి.

3. సోదరులారా! మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింప ఋణపడి వున్నాము. ఇది మాకు సముచితమే. ఏలయన, మీ విశ్వాసము అత్యధికమగు చున్నది. అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది.

4. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోను, కష్టములలోను కూడ మీరుచూపు ఓర్పును, విశ్వాసమును మేము ప్రశంసింతుము. అందువలన దేవుని సంఘములలో మిమ్ము గూర్చి మేమే గొప్పగ చెప్పుచుందుము.

5. దేవుని నీతి బద్దమగు తీర్పునకు ఇది నిదర్శనము. ఏలయన, దీని ఫలితముగ మీరు దేనికొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు.

6. ఏలయన, దేవుడు ఏది న్యాయమో దానినే చేయును. మిమ్ము కష్టపెట్టు వారికి కష్టములు కలిగించును

7. శక్తిమంతులగు దేవదూతలతో యేసుప్రభువు దివి నుండి ప్రత్యక్షమైనపుడు ఆయన, శ్రమనొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతిని కలిగించును.

8. దేవుని ఎరుగనివారిని శిక్షించుటకును, మన యేసు ప్రభువును గూర్చిన సువార్తకు విధేయులు కానివారిని దండించుటకును, అగ్నిజ్వాలలతో ఆయన దివినుండి దిగి వచ్చును.

9. దేవుని సన్నిధికిని, ఆయన మహత్తర మహిమకును దూరమై శాశ్వత వినాశమనెడి దండ నమునకు వారు గురియగుదురు.

10. తన పరిశుద్దులనుండి మహిమను పొందుటకును, విశ్వాసుల నుండి గౌరవమునందుటకును ఆ దినమున ఆయన వచ్చును. మేము చెప్పిన సందేశమును విశ్వసించితిరి కనుక వారిలో మీరును ఉందురు.

11. ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్ధింతుము. దేవుడు పిలిచిన జీవితమునకు ఆయన మిమ్ముయోగ్యులను చేయవలెనని ఆయనను అర్థింతుము. తన శక్తివలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమొనర్చుగాక!

12. మన ప్రభువైన యేసునామము మీయందును, మీరు ఆయనయందును మహిమ పరుపబడుదురుగాక! ఇది మన దేవుని యొక్కయు, యేసుక్రీస్తు ప్రభువు యొక్కయు అనుగ్రహమువలన నెరవేరునుగాక!